గణపతి - గడియారపు స్తంభం
- Bhaskara Rao B. R. K. V.

- 5 hours ago
- 5 min read

Ganapati Gadiyarapu Sthambam - Telugu Comedy Story | Bhaskara Rao B. R. K. V.
గణపతి - గడియారపు స్తంభం - తెలుగు హాస్య కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 15 /08/2026
ప్రతి ఊరి మధ్యలో గడియారపు స్తంభం ఒక గుర్తుగా నిలిచిన రోజుల్లో, దాని పక్కనే మందుల షాపు నడుపుకునే గణపతి తన ప్రత్యేకమైన అలవాట్లతో ఊరిలోనే ఓ పాత్రగా మారిపోయాడు. ప్రతిరోజూ చల్లపునుకులు, మైసూరుపాకం తినే అతని అలవాటు చివరకు అతడినే బజ్జీల బండి పెట్టే స్థాయికి తీసుకెళ్లింది. అయితే తాను చేస్తున్న కొత్త వ్యాపారం ఊహించని విధంగా ఊరి పంటి డాక్టర్లకు, ఇనుప వర్తకులకు ఉపయోగపడటంతో కథ మరింత హాస్యాస్పదంగా మారుతుంది.
ప్రతి ఊరి మధ్యలోనూ పోతురాజులా ఓ గడియారపు స్తంభం ఉండటం జరిగేది. అది ఆ ఊరి గర్వానికి ప్రతిబింబంగా భావించేవారు ప్రజలు. దాన్ని ఆనుకుని చుట్టుప్రక్కల కొన్ని షాపులు, స్కూళ్ళు, ఇళ్ళ అడ్రస్ చెప్పడానికి ల్యాండ్‌మార్క్‌గా ఉండేది. దాని కింద భాగంలో చుట్టూ నాలుగు మెట్లు కూర్చోవడానికి వీలుగా కట్టి ఉంచారు.
గణపతి మందుల షాపు ఈ స్తంభానికి దగ్గర్లో ఉంది. తాత ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన మందుల షాపును జాగ్రత్తగా నడుపుతున్నాడు. ఎంచేతనో తెలియదు కానీ, గణపతికి అస్తమాను వీపు దురద పెడుతూ ఉంటుంది. మందుల షాపులో పనిచేసే నాలుగు కుర్రాళ్లలో ఒకడు ప్రత్యేకంగా గణపతి వీపు గోకడానికే…
గణపతి గోకుడు చూసి భరించలేక, మందులు కొనడానికి వచ్చిన ఒక ఆర్.ఎమ్.పి. డాక్టర్, వీపు గోక్కునే చివర గోళ్ళు మాదిరిగా ఉండే ప్లాస్టిక్ పుల్లల కట్టను ఆన్‌లైన్‌లో తెప్పించాడు. అవి కాస్తా నాలుగు నెలలు రాకుండానే అరిగిపోయాయి.
ప్రతిరోజూ గణపతి, గడియారపు స్తంభానికి ఆనుకుని ఉన్న ఓ చల్లపునుకుల బండి దగ్గరకు వెళ్ళి, ఓ ఇరవై రూపాయల పునుకులు, రెండు మైసూర్ పాకం ముక్కలు తినేవాడు.
సరిగ్గా రాత్రి ఎనిమిది అయ్యేసరికి షాపు మూసేసి ఎదురుగా ఉన్న తాళాల షాపు ఓనరు, తన స్నేహితులు ముగ్గురూ కలిసి వచ్చేవారు. ప్రొద్దస్తమానం కూర్చునే ఉండటం వల్ల కాళ్ళు పట్టేసి, కొంత నడక లేక పెరిగిన బొజ్జ లాగుతుందనే ఆశ కొంత గణపతిని బండి దగ్గరకు లాక్కుని వచ్చేలా చేస్తోంది.
ఆ బండివాడు కూడా కేవలం వేడి వేడి చల్ల పునుకులు, స్వచ్ఛమైన నెయ్యితో చేసిన మైసూర్ పాకం ముక్కలు మాత్రమే అమ్ముతాడు, అది కూడా సాయంత్రం సమయంలో మాత్రమే. గణపతి వరదలొచ్చినా ఈదుకుంటూ మరీ వచ్చి తింటాడు, మూడు వందల అరవై రోజులు.
బజ్జీల బండివాడు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి గణపతికి అలా ఇస్తున్నాడు.
బజ్జీల ప్లేటు తీసుకుని గడియారపు స్తంభానికి ఉన్న మెట్లలో పైది వదిలేసి, రెండో మెట్టు మీద కూర్చుని కాళ్ళు మిగిలిన మెట్ల మీద చాపుకుని తింటూ ఉంటాడు. మిగిలిన వారు నిలబడి తింటూ ఉంటే, తాను పై మెట్టుకు వీపు ఆనించి రాస్తూ దురద తీర్చుకుంటూ ఉంటాడు.
అతను ప్రతి రోజూ అలా చెయ్యడం వల్ల, ఆ మెట్టు కాస్తా అరిగిపోయి నెలవంక చందమామలా అయ్యింది. సదరు గణపతి గారి వీపు చర్మం దళసరెక్కి తాబేలు మీద దొప్ప అంత గట్టిపడిపోయింది. పంచాయతీ అధికారులు ఎన్నో సార్లు ఆ మెట్టు రిపేర్ చేయించారు.
గణపతి మైసూర్ పాకానికి ఎంత ఫ్యాన్ అంటే, విజయనగరంలో పెళ్ళి అయిన అతను మొదటి రాత్రి గదిలో తాను నిత్యమూ తినే మైసూర్ పాకం ముక్కలు పెడితే గాని గదిలోకి వెళ్ళనన్నాడు. పాపం అతని అత్తవారు రెండు రోజుల పాటు సంతానం వాయిదా వేసి, ఇక్కడకు వచ్చి మైసూర్ పాకం తీసుకువెళ్లారు.
కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి అమ్మవారి జాతర పది సంవత్సరాల తర్వాత జరిగింది. దాంతో ఊరంతా ప్రతి ఇంట్లోనూ బంధువుల హడావిడి చేసేశారు. గణపతి ఇంటికి అత్తవారి వైపు బంధువులంతా వచ్చారు. ఇంత జరిగినా తన అలవాటు మానుకోలేదు గణపతి.
బజ్జీల బండి దగ్గర కూడా వ్యాపారం పెరిగి తనతోపాటు కొడుకుల్ని ఇద్దరిని జతచేసుకున్నాడు అతను. జాతర చివరి రోజు ఎక్కడవాళ్ళు అక్కడకు వెళ్లిపోతూ ఊరికే ఫేమస్ అయిన మైసూర్ పాకానికి రెండు మూడు కిలోలు తమ తమ ఇళ్లకు పార్సిల్ చేసుకుని మరీ తీసుకుపోతున్నారు.
గణపతి మరదళ్లు బావగారిని ఆట పట్టిస్తూ, "బావగారూ!! మీరు అంత ముచ్చటపడి శోభనం రోజు తెప్పించుకున్న మైసూర్ పాకం మాక్కూడా తెప్పించరూ.. ఇంటికి వెళ్ళాక టేస్ట్ చేస్తాం" అనేసరికి గణపతి బజ్జీల బండి దగ్గరకు వెళ్ళాడు.
అంతే! ఒక్కసారిగా గణపతి షాక్ తిన్నాడు. మొత్తం మైసూర్ పాకం ముక్కలు అన్నీ అమ్మేశారు బండి యజమాని కొడుకులు.
గణపతి కోపం నషాళానికి ఎక్కింది. ప్రళయ రుద్రుడిలా "మీ నాన్న ఎక్కడరా?" అని అడిగాడు.
"బేరం అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోయాడు."
"సంవత్సరాల నుంచి నాకోసం మీ నాన్న బజ్జీలు, పాకం ఉంచేవాడు. మీరు కుర్ర పెత్తనంతో వాటిని కూడా అమ్మేశారు, మీ అంతు చూస్తాను" అని కోపంతో గుడ్లు పెద్దవి చేసుకుని మీది మీదికి వస్తుంటే ఇద్దరన్నదమ్ములు కలిసి గణపతిని ఒక్క తోపు తోసేసరికి ఒళ్ళున్న గణపతి వెంటనే లేవలేకపోయాడు.
రెండు నిమిషాలకు లేచి "దొంగ వెధవల్లారా! నన్నే గెంటుతారా? చూడండి నేను ఈ ప్రక్కనే మీకు పోటీగా ఓ బండి పెట్టి మీ వ్యాపారాన్ని నేల రాస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు గణపతే కాదు. వెళ్ళి మీ నాన్నతో చెప్పండి" అని ఛాలెంజ్ చేసి ఇంటికి వచ్చేశాడు.
మరునాడే వడ్రంగిని పిలిచి బజ్జీల బండిని చేయించాడు.
భార్య, స్నేహితులు, తల్లి ఎంత చెప్పినా వినకుండా, పరువు పోతుందని గగ్గోలు పెట్టినా పట్టించుకోకుండా భార్యను మెడికల్ షాపులో పెట్టి తాను బజ్జీలు వేయడం, మైసూర్ పాకం చెయ్యడం మొదలు పెట్టాడు. కొత్తలో బాగానే జనం రావడంతో మొదటివాడి వ్యాపారం తగ్గింది. కానీ గణపతి దగ్గరకు వచ్చిన వాళ్ళే తిరిగి రావడం లేదు.
రోజులు గడుస్తున్నాయి. ఊళ్ళో కొత్తగా రెండు మూడు పంటి ఆసుపత్రులు వెలిశాయి.
తనదగ్గరకు తనతోపాటు బజ్జీలు తినే స్నేహితులు మొదట్లో వచ్చినా రాన్రాను తగ్గించారు. గణపతే వాళ్ళ ఇళ్ళకు పార్సిల్స్ పంపించసాగాడు. హోమ్ డెలివరీ సౌకర్యం పెట్టినా వ్యాపారం నెమ్మదిగా సన్నగిల్లింది. మొదటివాడి వ్యాపారం పుంజుకుంది.
తలవంపుగా అనిపించి ఓ రోజు రాత్రి తన ప్రాణ స్నేహితుణ్ణి పిలిచి తను ఎందుకు రావట్లేదో అడిగాడు.
"నువ్వు చేసిన చల్లపునుకులు బాగా గట్టిగా ఉండటంతో పిల్లలు వాటిని గోళీల్లా ఆడుకుంటున్నారు. పోనీ మైసూర్ తిందామనుకుంటే ముక్క కొరికినపుడల్లా ఒక్కో పన్ను ఊడుతోంది. నువ్వేమీ అనుకోకపోతే అవి గోడలకు మేకులు కొట్టుకోవడానికి, రుబ్బురోలు పొత్రం గురుజు కొట్టుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తెలుసా!?"
అని ఇంకేదో చెప్పేలోపు తెలుపు డ్రస్సులు వేసుకుని నలుగురు డాక్టర్లు వాళ్ళ స్టాఫ్‌తో వచ్చి "నమస్కారం గణపతి గారు!!! మేము కొత్తగా మీ ఊరికి వచ్చిన పంటి డాక్టర్లం. మీ దయ వల్ల వచ్చిన కొద్ది రోజుల్లోనే స్వంతంగా ఇళ్ళు కట్టుకుని ఆసుపత్రులు కూడా నిర్మించుకున్నాం.
మీరు పదికాలాలపాటు అలాగే బజ్జీలు వేస్తూ మైసూర్ పాకం ముక్కలు చేస్తూ ఉంటే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటాం..
అయ్యా తమరు మాకు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా రేపు మిమ్మల్ని ఘనంగా సత్కరించాలని అనుకుంటున్నాం. తమరు తప్పక అనుమతించాలి" అని వెలిగిపోతున్న వదనాలతో అనేసరికి అయోమయంలో ఉన్న గణపతికి ఏం చెప్పాలో తెలియక అలానే ఉండిపోయాడు.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఊళ్లోని ఇనుప వర్తకులు వచ్చారు. వాళ్ళు ఏమాత్రం మర్యాద లేకుండా "ఒరేయ్ గణపతి.. నువ్వు చేస్తున్న మైసూర్ పాకం ముక్కలు కొనుక్కోవడం వల్ల నా దగ్గర ఊళ్ళో వారెవరూ సుత్తులు కొనడం మానేశారు. దానివల్ల మా వ్యాపారానికి నష్టం వస్తోంది. నువ్వు వేస్తున్న చల్లపునుకులు కొనుక్కున్న వాళ్ళు వాటిని గోళీలుగా వాడుకుని మా దగ్గర గోళీలు కొనడం మానేశారు. వాటివల్ల పెద్ద నష్టం లేదు కాబట్టి వాళ్ళు రాకుండా మమ్మల్ని అడగమన్నారు. నీ ఉద్దేశ్యం ఏమిటి? నువ్వు ఆ బండి రేపట్నుంచి మానేస్తావా లేక పోలీసు కేసు పెట్టమంటావా??" అని వాళ్ళు భయపెట్టేసరికి గణపతి వణికిపోయాడు.
ఇదంతా గమనిస్తున్న స్నేహితుడు "ఇప్పుడు ఏం చేస్తావు?" అని అడిగాడు.
"ఒకవైపు పూల పానుపు, మరోవైపు కత్తుల మంచం... దేనిమీద పడుకోవాలో అర్థం కావడం లేదు."
"గణపతీ! నీకెందుకురా లేనిపోని వ్యాపారాలు.. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. రేపట్నుంచి నీ వ్యాపారం నువ్వు చేసుకో" అని స్నేహితుడు ఇచ్చిన సలహాతో మరునాడు ఉదయమే మందుల షాపు తెరవడానికి వెళ్ళాడు గణపతి......
***
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి






Comments