కుయిలి – కోకిల కూతలో వినిపించిన వీరగానం
- Jamunarani B
- 6 hours ago
- 5 min read

Kuyili - Kokila Kuthalo Vinipinchina Veeraganam - Telugu Emotional Historical Story | Sritha
కుయిలి – కోకిల కూతలో వినిపించిన వీరగానం - తెలుగు భావోద్వేగ చారిత్మాత్మక కథ | శ్రిత
Published in manatelugukathalu.com on 15/08/2026
భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో రాణి వేలునాచియార్ పేరు ఎంత ప్రత్యేకమో, ఆమెతో పాటు పోరాడిన వీరనారి కుయిలి పేరు కూడా అంతే స్ఫూర్తిదాయకం. 1780లో శివగంగ కోసం జరిగిన పోరాటంలో కుయిలి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆయుధాగారాన్ని ధ్వంసం చేయడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసినట్లు భారత ప్రభుత్వ Azadi Ka Amrit Mahotsav చరిత్ర వేదిక పేర్కొంటుంది.
అందరికీ జన్మదిన శుభాకాంక్షలు!
మనకు కాదండి… మన దేశానికి!
అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
ఈరోజు నేను మీ ముందు కుయిలి గురించి మాట్లాడటానికి వచ్చాను. అదే ఈరోజు మన కథ. కుయిలి గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం.
నేను శ్రిత. నా కలం పేరు శ్రిత. నా పేరు జమున.
మన స్వాతంత్ర్య సమరంలో ఎన్నో మధుర స్వరాలు “భారతమాతకు జై!” అంటూ ముందుకు సాగాయి. ఎన్నో స్వరాలు దేశం కోసం నేలకూలాయి. తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి, మాతృభూమి స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆ వీరులందరికీ ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మన నివాళులు అర్పిద్దాం.
జైహింద్!
ఈరోజు మనం అలాంటి వీరనారుల్లో ఒకరైన కుయిలి గురించి, ఆమె వీరత్వం, త్యాగం, స్వాతంత్ర్య సమరంలో ఆమె పోషించిన పాత్ర గురించి తెలుసుకుందాం.
కుయిలి అంటే కోకిల.
ఈ కోకిల గానం కేవలం మధురగానం కాదు… వీరగానం కూడా!
క్రీ.శ. 1780, అక్టోబర్ 7.
శివగంగ నేల యుద్ధభేరితో మార్మోగుతోంది.
ఒకవైపు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం. మరోవైపు తన రాజ్యాన్ని తిరిగి సాధించుకోవాలని సంకల్పించిన రాణి వేలునాచియార్ సైన్యం.
ఈ యుద్ధం ఎనిమిది ఏళ్ల క్రితమే ప్రారంభమైంది.
1772, జూన్ 25న కలయ్యార్ కోవిల్ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం శివగంగపై దాడి చేసింది. ఆ యుద్ధంలో రాజు ముత్తు వడుగనాథ దేవర్ వీరమరణం పొందారు.
రాణి వేలునాచియార్ తన చిన్న కుమార్తె వెల్లచ్చితో తప్పించుకుని అడవుల్లోకి వెళ్లింది.
“ఒక రోజు నా రాజ్యాన్ని తిరిగి సాధిస్తాను. నా ప్రజలను బానిసలుగా ఉండనివ్వను” అని ఆమె ప్రతిజ్ఞ చేసింది.
ఎనిమిది సంవత్సరాల పాటు ఆమె తన సైన్యాన్ని సిద్ధం చేసింది.
హైదర్ అలీ, మరుడు సోదరులు, ఇంకా తన ప్రాణ స్నేహితురాలు, మహిళా సేనాధిపతి కుయిలి ఆమెకు అండగా నిలిచారు.
ఆ కుయిలి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం.
కుయిలి… ఆ పేరు కోయిలది.
కోయిల కూత ఎంత మధురంగా ఉంటుందో, ఆమె హృదయం కూడా అంతే మధురం.
స్నేహానికి మారురూపం…
దేశప్రేమకు ప్రతిరూపం…
కానీ దేశానికి ఆపద వచ్చినప్పుడు ఆ కోయిల పాట పాడలేదు.
అగ్నిజ్వాలగా మారింది!
ఎలా మారిందో తెలుసుకుందాం.
యుద్ధం భీకరంగా సాగుతోంది.
కుయిలి ఒక్కసారి బ్రిటిష్ సేనను గమనించింది.
వారి అసలు బలం తుపాకులు కాదు… ఫిరంగులు కాదు…
వాటికి ప్రాణం పోసే ఆయుధాగారం!
ఆ ఆయుధాగారం ఉన్నంతవరకూ బ్రిటిష్ సైన్యాన్ని ఓడించడం కష్టం అని ఆమె గ్రహించింది.
కుయిలి పాడలేదు…
శంఖనాదం చేసింది!
అది మధురగానం కాదు…
అది వీర ప్రతినాదం!
ఆ స్వరం ప్రతి ఆంగ్లేయుడి గుండెల్లో భయాన్ని రేకెత్తించే శంఖనాదంగా మారింది.
ఆ శంఖనాదమే వారి గుండెల్లో గుబులు పుట్టించింది.
ఆమె ఆ రోజు,
“భారతమాతకు జై!
భారతమాతకు జై!
హర హర మహాదేవ్!”
అంటూ తన ప్రాణాన్ని అర్పించడానికి నిర్ణయించుకుంది.
“ఈ ఆయుధాగారం లేకపోతే రాణి తప్పకుండా గెలుస్తుంది” అని ఆమె ఆలోచించింది.
వెంటనే తన ప్రాణాన్ని అర్పించాలనే నిర్ణయం తీసుకుంది.
ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె ఒక్క క్షణం… ఒక్క నిమిషం… ఒక్క రెప్పపాటు కూడా ఆగలేదు.
తన శరీరమంతా నెయ్యి, నూనె రాసుకుంది.
ఆకాశం వైపు చూసింది…
కుయిలి – కోకిల కూతలో వినిపించిన వీరగానం
“భారతమాతా! నా ప్రాణo నీ దే!
కుయిలి – కోకిల కూతలో వినిపించిన వీరగానం
“భారతమాతా! నా ప్రాణాన్ని తీసుకో.
నా రాణికి విజయాన్ని ఇవ్వు” అని ప్రార్థించింది.
తన మీద తానే నిప్పు పెట్టుకుంది.
అగ్నిగోళంగా మారిపోయింది.
ఒక అగ్నిజ్వాల సైన్యంలా మారింది.
దూకింది…
పరుగెత్తుకుంటూ వచ్చింది…
చాలా వేగంగా, ఉగ్రంగా ముందుకు దూసుకెళ్లింది…
“మేము గెలవలేము… మేము ఓడిపోతాము…” అన్న భావన కాదు—
ఓటమినే కాల్చేసేంత పట్టుదలగా మారింది!
అలా ఉరుములా పరిగెత్తుకుంటూ వెళ్లి బ్రిటిష్ ఆయుధాగారంలోకి దూకింది.
ఆంగ్లేయులు ఆ అగ్నిగోళాన్ని చూస్తుండగానే—
ధమాల్!
అని భూమి కంపించేంత పెద్ద పేలుడు జరిగింది.
ఆయుధాగారం క్షణాల్లోనే నాశనం అయిపోయింది.
ఇక మేము గెలవలేము, మా ఓటమి ఖాయం అని ఆంగ్లేయులు భయంతో అనుకున్నారు. అగ్నిగోళం తన ఉగ్రతను ఇంకా పెంచింది. ఒక్క “ధళాల్” శబ్దంతోనే ఆయుధాగారం బూడిదైంది. ఇంత వేగంగా, ఇంత శక్తిగా ఆ అగ్నిజ్వాల తమ శక్తి కేంద్రాన్నే మింగేస్తుందని వాళ్లు ఊహించలేదు. అదే వాళ్ల ఓటమికి మొదటి అడుగు.
వాళ్ల గుండెలు ఆగిపోయినంత పని అయింది.
ఆమె చూపించిన ధైర్యానికి వాళ్లు…
స్తంభించిపోయారు!
ఒక వీరనారి ఇలా అగ్నిజ్వాలగా మారి తమ ఆయుధాగారాన్నే నాశనం చేస్తుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు.
అంతే!
బ్రిటిష్ వారి ఓటమికి అది మొదటి మెట్టు అయింది.
భూమి చీలిపోయినట్టుగా పెద్ద పేలుడు!
బ్రిటిష్ వారి ఆయుధాలు క్షణాల్లో బూడిదయ్యాయి.
కుయిలి చేసిన ఆ త్యాగం ఒక వీర ప్రతినాదంగా, తరతరాల హృదయాల్లో అగ్నిలా నిలిచిపోయింది.
ప్రాణం వెళ్లిపోయింది…
స్వరం ప్రతినాదంగా మారింది…
ఆ ప్రతినాదం అగ్నిలా మారుమ్రోగింది…
కుయిలి కోకిల స్వరం కాదు…
స్వాతంత్ర్య సమరానికి ఉగ్ర శంఖనాదం!
ఆ స్వరం రణభేరి గా మారింది.
ఆ అగ్నిజ్వాల ఆయుధాగారాన్ని ధ్వంసం చేసింది.
ఆమె త్యాగంతో శివగంగ సైన్యానికి విజయశంఖం గర్జించింది.
కుయిలి తన ప్రాణాన్ని అర్పించింది…
కానీ ఆమె వీరగాథను చరిత్రలో శాశ్వతంగా అగ్నిలా నిలిపింది.
కుయిలి…
కోకిల కూత కాదు…
స్వాతంత్ర్య సమరానికి ఉగ్ర శంఖనాదం!
రాణి కళ్లలో నీళ్లు తిరిగాయి. కానీ ఆ కన్నీళ్ల వెనుక ఒక అగ్నిజ్వాల ఉంది.
ఆమె గర్జించింది—
“కుయిలీ! నీ త్యాగం వృథా కాదు.
నీ త్యాగాన్ని వృథా పోనివ్వను.
నీ గానం, నీ మరణం…
నీ వీరత్వం…
నేను అమరగానంగా మారుస్తాను!”
ఆ గర్జనతో శివగంగ సైన్యంలో మరింత ఉత్సాహం నిండింది.
సైన్యం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదిలింది.
విజయం రాణి వేలునాచియార్‌దే!
కానీ ఆ విజయానికి వెలుగు చూపించింది మాత్రం—
కుయిలి చేసిన మహాత్యాగమే!
నేటికీ శివగంగ ప్రజలు కుయిలిని గర్వంగా స్మరించుకుంటారు.
ఆమె కోకిలలా పాడలేదు…
కానీ ఆమె త్యాగం భారతదేశం మొత్తం వినేలా ఒక శాశ్వత గీతంగా మారుమ్రోగింది.
ఆ యుద్ధంలో రాణి గెలిచింది.
ఆంగ్లేయులు ఓడిపోయారు.
కానీ కుయిలి అమరగానం మాత్రం ఈనాటికీ ప్రతి భారతీయుడి హృదయంలో గీతంగా మారుమ్రోగుతూనే ఉంది.
ఇలాంటి వీరనారులకు, స్వాతంత్ర్య సమరయోధులకు మనం మనస్ఫూర్తిగా నివాళులు అర్పిద్దాం.
మన వoతు సాయం
అయితే మనమైతే అలా చేయలేం కదండీ!
అగ్నిగోళంగా మారి మన ప్రాణాలను అర్పించలేం.
కానీ…
మన దేశాన్ని ప్రేమించలేమా?
మన వంతు దేశభక్తిని చూపించలేమా?
చూపించవచ్చు!
దేశభక్తి అంటే కేవలం స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండా ఎగురవేయడం, జైహింద్ అనడం మాత్రమే కాదు.
మన రోజువారీ జీవితంలో చేసే చిన్న మంచి పనులు కూడా దేశభక్తే!
కుయిలిలాగా ఆత్మసమర్పణ చేసేంత ధైర్యం మనకు లేకపోవచ్చు.
అంతటి త్యాగం చేయలేకపోవచ్చు.
కానీ…
మన దేశం కోసం ఒక చిన్న పని మాత్రం చేయగలం.
మన చేతిలో ఒక సంచి పట్టుకుని మార్కెట్‌కు వెళ్లడం కూడా దేశభక్తే!
ఒక వారం ప్లాస్టిక్ సంచులకు దూరంగా ఉండి చూద్దాం.
మనతో మొదలైన ఆ చిన్న మార్పు…
మరొకరిలో మార్పు తీసుకురావచ్చు.
ఒకరి నుంచి ఇద్దరికి…
ఇద్దరి నుంచి పదిమందికి…
అలా ఒక చిన్న నిర్ణయం ఒక పెద్ద ఉద్యమంగా మారవచ్చు.
మన జాతీయ గీతంలో కాదు, మనం ఎంతో గర్వంగా పాడుకునే “వందేమాతరం”లోని ఆ మాటలు—
“సుజలాం… సుఫలాం…
సస్య శ్యామలాం…”
అవి కేవలం పాటలోని పదాలుగా మిగిలిపోకూడదు.
అవి మన దేశంలో నిజంగా కనిపించాలి.
ప్లాస్టిక్ అడ్డుపడకపోతే వర్షపు నీరు సాఫీగా ప్రవహిస్తుంది.
నీరు కాలువల్లోకి చేరుతుంది.
కాలువల నుంచి చెరువులను నింపుతుంది.
చెరువుల నుంచి పంట పొలాలకు చేరుతుంది.
నీరు చేరితే పంట పండుతుంది.
పంట పండితే నేల పచ్చబడుతుంది.
నేల పచ్చబడితే…
అదే కదండీ మనకు కావాల్సింది!
మనమందరం కలలు కనే
సుజలాం… సుఫలాం… సస్య శ్యామల భారతం!
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ వీరులను స్మరించుకుంటూ…
మనకు చేతనైన ఈ చిన్న పనిని కూడా చేద్దాం.
**ఒక సంచి…*
ఒక వారం…
ఒక చిన్న నిర్ణయం!*
అంతే!
మన దేశభక్తి అక్కడి నుంచే మొదలవుతుంది.
కుయిలి తన ప్రాణాన్ని ఇచ్చి దేశానికి సేవ చేసింది.
మనమైతే…
మన అలవాటును మార్చి దేశానికి సేవ చేద్దాం.
జైహింద్!
దేశం మనదే…
జాతి మనదే…
మన దేశాన్ని మనమే బాగు చేసుకుందాం!
అప్పుడు ప్రపంచానికి గర్వంగా చాటి చెబుదాం—
“సారే జహాన్ సే అచ్ఛా…
హిందుస్తాన్ హమారా!
– Shrita
శుభం.
***
శ్రిత గారి కొన్ని ఇతర రచనలు:
శ్రిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: శ్రిత
శ్రిత అనే కలం పేరుతో రచనలు చేస్తున్న జమున, సాధారణ జీవితంలోని అనుభూతులు, కుటుంబ బంధాలు, మానవ సంబంధాలు, మహిళల మనోభావాలను కథల రూపంలో ఆవిష్కరించడాన్ని ఇష్టపడతారు.
ఆమె రచనల్లో ఆప్యాయత, మానవత్వం, కుటుంబ విలువలు సహజంగా ప్రతిబింబిస్తాయి. రోజువారీ జీవితంలో కనిపించే చిన్న చిన్న సంఘటనల్లోని గొప్ప భావాలను పాఠకుల హృదయాలకు చేరేలా చెప్పడం ఆమె రచనల ప్రత్యేకత.









Comments