ప్రకృతి చల్లదనం
- Munipalle Vasundhara Rani

- 25 minutes ago
- 3 min read
#వసుంధరరాణిమునిపల్లె, #VasundharaRaniMunipalle, #JnanaDeepalu, #ప్రకృతిచల్లదనం, #బామ్మకథలు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు, #TeluguChildrenStories, #తెలుగుబాలలకథలు

బామ్మ కథలు - 18
Prakruthi Challadanam - New Telugu Story Written By Vasundhara Rani Munipalle Published in manatelugukathalu.com on 30/01/2026
ప్రకృతి చల్లదనం - తెలుగు కథ
రచన: వసుంధర రాణి మునిపల్లె
మే నెల మండుటెండలు. బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటిపోతోంది. చింటూ స్కూల్ సెలవులవడంతో రోజంతా ఏసీ గదిలోనే గడుపుతున్నాడు. ఒకరోజు మధ్యాహ్నం అకస్మాత్తుగా ఇంట్లో ఫ్రిజ్ రిపేర్ అయ్యింది. గంట సేపటికే ఐస్ క్యూబ్స్ కరిగిపోయాయి, నీళ్లు మామూలు ట్యాప్ నీళ్లలా అయిపోయాయి.
"అమ్మో! ఈ నీళ్లు తాగలేకపోతున్నాను. గొంతు ఎండిపోతోంది. ఇప్పుడే కొత్త ఫ్రిజ్ ఆర్డర్ ఇచ్చేయండి నాన్న. ఈ పాత డబ్బా ఇంకెందుకు?" అంటూ చింటూ చిందులు తొక్కడం మొదలుపెట్టాడు. అది విన్న చింటూ నాన్న, "అన్నీ ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారురా చింటూ, ఇలాంటివి లేనప్పుడు కూడా ఉండటం అలవాటు చేసుకోవాలి" అన్నారు.
దానికి చింటూ వెంటనే, "మరి పోయిన నెల అత్త కొడుకు విశ్వ అమెరికా నుంచి వచ్చినప్పుడు ఏసీ, ఫ్రిజ్ అన్నీ గంట కూడా ఆపకుండా వాడేవాళ్లం కదా నాన్న! మరి వాడు ఉండలేనప్పుడు నేను మాత్రం ఎందుకు ఉండాలి?" అని ఎదురు ప్రశ్న వేశాడు.
అప్పుడు బామ్మ చింటూ దగ్గరకు వచ్చి అనునయంగా ఇలా అంది.. "చింటూ, విశ్వ అమెరికా చల్లటి వాతావరణం నుంచి వచ్చాడు. వాడు ఇక్కడి ఎండలకు అలవాటు పడటానికి సమయం పడుతుంది కాబట్టి అప్పుడు అన్ని సౌకర్యాలు చూశాం. కానీ నువ్వు ఇక్కడే పుట్టి పెరిగావు కదా! మన వాతావరణాన్ని తట్టుకునే శక్తి నీ శరీరానికి ఉండాలి" అని వంటింట్లోకి వెళ్లి, మూలన పక్కన పడేసిన ఒక పాత మట్టి కుండను తీసింది. దాన్ని శుభ్రంగా కడిగి, అందులో నీళ్లు పోసి, పైన ఒక తడి గుడ్డను కట్టింది.
"రేపు పొద్దున వరకు ఆగు చింటూ, ఈ కుండ నీకు అమృతం ఇస్తుంది" అంది. చింటూ వెక్కిరిస్తూ, "ఈ మట్టి కుండలో నీళ్లు తర్వాత ఫ్రిజ్ వాటర్ లాగా చల్లగా అవుతాయా బామ్మ? నీవి అన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు" అని గొణుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఉదయం చింటూ దప్పికతో లేచాడు. ఫ్రిజ్ ఇంకా రిపేర్ కాలేదు. బామ్మ చింటూని పిలిచి, ఆ మట్టి కుండలో నీళ్లు ఒక గ్లాసులో పోసి ఇచ్చింది. చింటూ అయిష్టంగానే ఒక గుక్క తాగాడు. ఒక్కసారిగా వాడి కళ్లు మెరిశాయి. ఆ నీళ్లు ఫ్రిజ్ నీళ్లలా పళ్లని కొరికేంత చల్లగా లేవు కానీ, గొంతుకి ఎంతో హాయినిచ్చే చల్లదనంతో ఉన్నాయి. పైగా ఆ నీళ్లలో ఒక రకమైన మట్టి వాసన, తీయదనం ఉన్నాయి.
"అబ్బా! భలే ఉన్నాయి బామ్మ. ఫ్రిజ్ నీళ్లు తాగితే ఒక్కోసారి జలుబు చేస్తుంది, కానీ ఇవి చాలా హాయిగా ఉన్నాయి. అసలు కరెంటు లేకుండా ఈ కుండ నీళ్లను ఎలా చల్లబరుస్తుంది?" అని ఆశ్చర్యంగా అడిగాడు.
అప్పుడు బామ్మ ఇలా వివరించింది: "చూడు చింటూ, మట్టి కుండకి చిన్న చిన్న కంటికి కనపడని రంధ్రాలు ఉంటాయి. వాటి ద్వారా నీరు మెల్లగా బయటకు వచ్చి ఆవిరి అవుతుంది. ఆ ప్రక్రియలో కుండ లోపల ఉన్న వేడిని బయటకు పంపి, నీటిని సహజంగా చల్లబరుస్తుంది. మన పూర్వీకులు కనిపెట్టిన అద్భుతమైన సైన్స్ ఇది. అందుకే దీన్ని ప్రకృతి చల్లదనం అంటారు."
చింటూ ఆ నీటిని ఆస్వాదిస్తూ తాగుతుంటే, బామ్మ వాడి పక్కన కూర్చుని ప్రేమగా తల నిమురుతూ మెల్లగా చెప్పసాగింది. "మనం ఇప్పుడు ఏసీలు, ఫ్రిజ్ లు అంటూ గోడల మధ్య బంధీ అయిపోతున్నాం. అందుకే మన శరీరం చిన్న ఎండని కూడా తట్టుకోలేకపోతోంది. మన మూలాలు ఈ ప్రకృతిలోనే ఉన్నాయి చింటూ. మట్టి అంటేనే మనకు ఇప్పుడు చులకన అయిపోయింది. సౌకర్యాలు పెరిగే కొద్దీ మనం మన సహజత్వాన్ని మర్చిపోతున్నాం.
మా కాలంలో ఈ కరెంటు లేదు, ఫ్రిజ్ లు, ఏసీలు అవేమీ లేవు. సాయంత్రం మేడ మీద నీళ్లు చల్లి చల్లబరిచి, రాత్రి అయ్యిందంటే పెందరాళే అన్నం తినేసి చక్కగా మేడ మీద పక్కలేసుకుని, ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా పడుకునేవాళ్లం తెలుసా!" అని చెప్పింది బామ్మ. అప్పుడు చింటూ అమాయకంగా, "మరి మేడ మీద పడుకుంటే దోమలు కుట్టలేదా బామ్మ?" అని అడిగాడు. దానికి బామ్మ నవ్వుతూ, "ఏమిటోరా.. అప్పుడు ఇన్ని దోమలు ఉండేవి కావు" అని చెప్పింది.
"మా చిన్నప్పుడు వీధిలో అరుగు మీద ఒక కుండ నిండా మంచినీళ్లు పోసి రోజూ పెట్టేవాళ్లం" అని బామ్మ చెప్పింది. "ఎందుకు బామ్మ?" అని ఆశ్చర్యంగా అడిగాడు చింటూ. "ఎండలో వెళ్లే వాళ్లకు దాహం వేస్తే తాగుతారని" బామ్మ సమాధానమిచ్చింది.
వెంటనే చింటూ ఉత్సాహంగా, "బామ్మ మనం ఇప్పుడు కూడా అలాగే పెడదాం బామ్మ!" అని అన్నాడు. "తప్పకుండా మనవడా! అలా దాహంతో ఉన్నవాళ్లకు తాగునీరు ఇస్తే ఎంత పుణ్యమో తెలుసా" అంది బామ్మ.
చింటూకి అప్పుడు అర్థమైంది. వాడు వెంటనే తన ఫోన్ తీసి ఇంటర్నెట్ లో మట్టి కుండల ఉపయోగాలు అని వెతికాడు. ప్లాస్టిక్ బాటిల్స్ కన్నా ఇవి ఎంత మేలో తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. "నిజమే బామ్మ, టెక్నాలజీ అవసరమే కానీ, ఇలాంటి సహజమైన విషయాలను మర్చిపోతే మన ఆరోగ్యానికే నష్టం" అని ఒప్పుకున్నాడు.
***
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments