కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Srivari Kattu Kathalu Episode - 11' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar
రచన : మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
కనకారావు ఇంటికి వెళ్లే దారిలో జయా ఆంటీ మాటలు సమీరకు చికాకు తెప్పిస్తాయి. కనకారావు ఇంటి వద్దకు వెళ్తూ ఉన్నప్పుడే, తను క్రమంగా సాలెగూటిలో ఇరుక్కుంటున్నట్లు అర్థం అవుతుందామెకు. వెనక్కు తిరిగి వెళ్లి పోదామనుకుంటుంది. అంతలో హెల్మెట్ పెట్టుకుని ఉన్న ఒక వ్యక్తి, బైక్ ని వాళ్ళ ముందు ఆపుతాడు.
ఇక చదవండి...
జయా ఆంటీ ఉన్న అపార్ట్మెంట్ కి వెళ్ళాడు ప్రవీణ్. బెడ్ రూమ్ లో ఒక టేబుల్ మీద సిసి కెమెరా మానిటర్ ఉంది. నేరుగా వెళ్లి దాన్ని ఆన్ చేసాడు. రికార్డ్ అయిన వాటిని చూడ్డం అతనికి తెలుసు. కానీ మానిటర్ లో 'అవుట్ అఫ్ రేంజ్' అంటూ ఏదో మెసేజ్ వస్తోంది. ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసాడు. కానీ మళ్ళీ అదే మెసేజ్ వస్తోంది. ఏంచెయ్యాలో అర్థం కాలేదతనికి.
వెంటనే జయా ఆంటీకి ఫోన్ చేసాడు. ఫోన్ తియ్యలేదామె. బహుశా పక్కన సమీరా వాళ్ళు ఉన్నందువల్ల ఫోన్ తియ్యలేదేమో.. అనుకున్నాడు. మానిటర్ ఆన్ కాలేదని ఆమెకు మెసేజ్ పెట్టాడు.
***
సమీరా వాళ్ళ దారికి అడ్డంగా బైక్ ఆపిన వ్యక్తి, బైక్ దిగి హెల్మెట్ తీశాడు. అతను దాదాపు ఆరడుగులున్నాడు. చూడ్డానికి చాలా చక్కగా ఉన్నాడు.
ముగ్గురిలో ఎవరికీ అతను తెలీదు. అతని వంక ఆశ్చర్యంగా, కాస్త అనుమానంగా చూశారు.
అతను జయా ఆంటీ వంక చూస్తూ " మీతో మాట్లాడాలి. కాస్త పక్కకు రండి" అన్నాడు.
అతనెవరో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు జయా ఆంటీకి.
'ఎవరైతేనేం? నన్నేం చెయ్యబోతాడు...' అని మనసులో అనుకొని, "పద" అంటూ అతనితో కాస్త పక్కకు వెళ్ళింది.
అదను కోసం ఎదురు చూస్తున్న దానిలా పర్వీన్ ఎవరికో ఫోన్ చేసింది. అవతలి వైపు లిఫ్ట్ చెయ్యగానే, "సమీరతో మాట్లాడండి" అంటూ ఫోన్ సమీర చెవిలో ఉంచింది, "జయా ఆంటీ గమనించేలోగా త్వరగా మాట్లాడు" అంటూ.
"ఎవరితో...ఎందుకు మాట్లాడాలి..?" అని ఇంకా ఏదో అడగబోతున్న సమీర, అవతలి వైపు గౌతమ్ గొంతు వినగానే దిగ్భ్రాంతి చెందింది.
"నీ ఫీలింగ్స్ బయట పడనివ్వకు. కనకారావు ఇంట్లోకి ధైర్యంగా వెళ్ళు. అంతా నేను చూసుకుంటాను. పర్వీన్ ఇప్పుడు మన మనిషి అని గుర్తు పెట్టుకో. బై " అంటూ ఫోన్ పెట్టేశాడు గౌతమ్.
ఆశ్చర్యంతో తన వంక చూసిన సమీరతో అవునన్నట్లుగా తలాడించింది పర్వీన్. ఇంతసేపు పడ్డ టెన్షన్ తీరిపోయి, ఒక్కసారిగా గాల్లో తేలిపోతున్నట్లు అనిపించింది సమీరకు. తన ఫీలింగ్స్ కవర్ చేసుకొని, దూరంగా ఉన్న జయా ఆంటీ వైపు చూసింది. ఆమె ఆ వ్యక్తితో ఏదో సీరియస్ గా మాట్లాడుతోంది. మధ్యలో మాట్లాడటం ఆపి, పర్వీన్ తో 'మీరు వెళ్ళండి. నేను కాస్సేపాగి వస్తాను' అన్నట్లుగా సైగ చేసింది.
అది గమనించిన పర్వీన్ సమీర చెయ్యి పట్టుకొని, "ఇక ఆలస్యం ఎందుకు.." అంటూ వెనుక వైపు గేట్ గుండా కనకారావు ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ కూడా ఒక వాచ్ మన్ ఉన్నాడు.
పర్వీన్ ను చూసి పలకరింపుగా నవ్వి, "అయ్యగారు మిమ్మల్ని మేడమీద గదిలో వెయిట్ చెయ్యమన్నారు" అని చెప్పాడు.
"నువ్వు జయా ఆంటీ మనిషివి కాదా?" మెట్లెక్కుతూ అడిగింది సమీర.
"తినబోతూ రుచులెందుకు? అన్ని వివరాలూ తెలుస్తాయిలే.." అంది పర్వీన్.
ఇద్దరూ మేడ పైకి చేరుకున్నారు.. పైన పెద్ద హాల్, నాలుగు బెడ్ రూమ్స్ ఉన్నాయి. తలుపులు తెరిచి ఉన్న ఒక రూమ్ లోకి తొంగి చూసింది పర్వీన్.
లోపల ఒక అందమైన అమ్మాయి కూర్చొని ఉంది.
"ఇదిగో.. ఈ అమ్మాయే సమీర" అంటూ పరిచయం చేసింది పర్వీన్.
"హాయ్! నా పేరు శిల్ప. బ్యూటీషియన్ ను" అంటూ తనను పరిచయం చేసుకుంది ఆమె.
"కనకరావుకు మసాజ్ చెయ్యడానికి ఎవరో కుర్రాణ్ణి తీసుకొని వస్తానన్నావుగా.. వచ్చాడా?" ఆతృతగా అడిగింది పర్వీన్.
"వచ్చాడు. ఎదురు రూమ్ లోనే ఉన్నాడు" చిన్నగా చెప్పింది శిల్ప.
"పద. ఒకసారి పలకరిద్దాం" అంటూ ఆ రూమ్ డోర్ మీద చిన్నగా తట్టింది పర్వీన్.
అంతలోనే వెనక్కి తిరిగి "ఇంతకీ ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు?" అని తమ వంకే చూస్తున్న శిల్పను అడిగింది.
"కత్తిలా ఉన్నాడు" అంది శిల్ప నవ్వుతూ.
ఇలాంటి మాటలు మాట్లాడడంలో పక్కన జయా ఆంటీ లేకపోయినా, పర్వీన్ ఆ లోటు తీరుస్తోందనిపించింది సమీరకు. అసలింతకీ ఈమె డబుల్ క్రాస్ చేస్తుందేమో... గౌతమ్ ఈమెను పొరపాటుగా నమ్మాడేమో…
ఆ ఆలోచన వచ్చిందే తడవుగా పర్వీన్ వైపు సూటిగా చూస్తూ "ఇతన్ని కలవాల్సిన అవసరం నాకేముంది? నేను బయటకు వెళ్ళిపోతాను" అంటూ పర్వీన్ ను పక్కకు నెట్టబోయింది సమీర.
ఇంతలో ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. లోపలున్న వ్యక్తి సమీర భుజాలు పట్టుకుని లోపలికి బలంగా లాగాడు. ఆ విసురుకు సమీర లోపలున్న బెడ్ మీద పడిపోయింది. కానీ వెంటనే తేరుకొని సివంగిలా పైకి లేచింది.
తన భుజానికున్న హ్యాండ్ బాగ్ లోంచి పెప్పర్ స్ప్రే బాటిల్ బయటకు తీసింది సమీర.
***
తనతో మాట్లాడాలంటూ పక్కకు తీసుకొని వెళ్లిన వ్యక్తి వంక ఆశ్చర్యంగా చూస్తూ.. "మీరెవరండీ? ఎప్పుడూ చూసినట్లు లేదే.." అంది జయా ఆంటీ.
"నా పేరు సందీప్. నన్నూ, స్నేహ అనే అమ్మాయినీ విడదియ్యమని మా నాన్న నీకు సుపారీ ఇచ్చాడు" చెప్పాడతను.
"మాకా.. ఎవరు చెప్పారు? నేనలాంటి పనులు చేయను" అంది జయా ఆంటీ, కంగారు పడుతూ.
ఇప్పుడు నేను నిన్ను నిలదీయడానికి రాలేదు. నన్ను మోసం చేసిన ఆ స్నేహను చంపెయ్యమని చెప్పడానికి వచ్చాను. దీనికి వేరే రేటులే! అక్షరాలా కోటి రూపాయలు ఇస్తాము. కాకపోతే దాని చావు నా కళ్లారా చూడాలి" అన్నాడు సందీప్.
"ఏం చెప్పాలో అర్థం కాక, నోట మాట రాలేదు జయా ఆంటీకి.
"నన్ను నమ్మాల్సిన అవసరం లేదు. నీకు డీల్ కుదిరించింది విల్సన్ గ్యాంగ్ వాళ్లే కదా. వాళ్లే ఇప్పుడు ఫోన్ చేస్తారు" అన్నాడతను.
మరి కొద్ది సేపటికే విల్సన్ ఫోన్ చేసాడు.
"జయా మేడం! ఆ అబ్బాయి చెప్పినట్లు చెయ్యండి. ఒకటిన్నర కోటికి డీల్ కుదిరింది. యాభై మాకు, కోటి మీకు. మంచి అఫర్ ఇది. ఆలస్యం చెయ్యకుండా ఓకే చెప్పండి." అని చెప్పాడు విల్సన్.
ఆనందంతో నోట మాట రాలేదు జయా ఆంటీకి.
బంపర్ అఫర్ అంటే ఇదేనేమో…
"కానీ ఆ స్నేహ ఎక్కడ ఉందొ కనుక్కోవాలి కదా. నాకు కాస్త టైం ఇవ్వండి. అన్నీ చక్క బెడతాను" అంది అభ్యర్థిస్తున్నట్లుగా.
"ఆ స్నేహ ఎక్కడో కాదు. మీ పక్కింట్లో.. అంటే గౌతమ్ వాళ్ళ ఇంట్లో ఉందట. అమెరికా నుంచి వచ్చిన నాకు తెలిసిన విషయాలు కూడా పక్కింట్లో ఉన్న మీకు తెలీటం లేదు. ప్రమోద్ కు చేసిన యాక్సిడెంట్ కూడా సక్రమంగా చెయ్యలేదు" అన్నాడు సందీప్, ఆంటీని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ.
"అది అప్పటికప్పుడు అనుకొని చేసిన యాక్సిడెంట్. అతను గౌతమ్ ను కలవనివ్వకుండా చెయ్యడానికీ, ఆ కేస్ లో గౌతమ్ ను ఇరికించడానికీ సడన్ గా ప్లాన్ చేసాము. సమయానికి మాకు పర్ఫెక్ట్ గా యాక్సిడెంట్ చేసే డ్రైవర్ దొరకలేదు. అయినా మించిపోయింది లేదులే. ఈ రోజు హాస్పిటల్ లో అటాక్ చేయిస్తాం". చెప్పింది జయా ఆంటీ. ఇంతలో తమ వైపు చూస్తున్న పర్వీన్ తో, సమీరను కనకారావు ఇంట్లోకి తీసుకొని వెళ్ళమని సైగ చేసింది.
“ముందు మనం మీ ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం. సిసి కెమెరాలు పని చెయ్యకుండా చేయించు" అన్నాడు సందీప్.
వెంటనే ప్రవీణ్ కు ఫోన్ తన రెగ్యులర్ ఫోన్ నుండి కాకుండా మరో ఫోన్ నుండి కాల్ చేసింది జయా ఆంటీ.
అక్కడ ప్రవీణ్ కూడా మరో ఫోన్ నుండి కాల్ అందుకున్నాడు. ముఖ్యమైన విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఇలా వేరే నంబర్లు, వేరే ఫోన్లు ఉపయోగిస్తారు వాళ్ళు.
"నీ మెసేజ్ చూశాను. ఇప్పుడు మానిటర్ సంగతి వదిలేయ్. ముందు మన అపార్ట్మెంట్ లో సిసి కెమెరాలు పనిచేయకుండా ఎక్కడైనా వైర్లు కట్ చెయ్యి. ఆ కట్ చెయ్యడం రికార్డ్ కాకుండా ఎలా మేనేజ్ చేస్తావో నీ ఇష్టం. మరో ముఖ్యమైన విషయం. జనాభా లెక్కలు సవరించే పని పడింది. చేయగలవా? మంచి ఆఫర్" అడిగింది.
"ఎక్కడ? ఎవర్నైనా హెల్ప్ అడిగేదా?.." ఆతృతగా అడిగాడు.
"మనుషులు ఎక్కువయ్యే కొద్దీ బయట పడే అవకాశాలు ఎక్కువ. నీ ఒక్కడి వల్ల కాదా? ఆడ మనిషేలే! నేనూ మరో మనిషీ సహాయంగా ఉంటాం. పైగా బాడీని మాయం చెయ్యాల్సిన అవసరం లేదు. వివరాలు నేనొచ్చాక చెబుతాను" అంది గొంతు తగ్గించి మాట్లాడుతూ.
ఇంకా ఉంది...
శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 12 త్వరలో…
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Komentarze