కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Ventade Nida Episode 11' Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో
మామిడి తోట దగ్గర ఉన్న శ్యామలరావు దంపతుల దగ్గరకు పోలీసులు వస్తారు. మాటల్లో హైదరాబాద్ లో ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ భార్య పైన మర్డర్ అటెంప్ట్ జరిగిందని చెబుతారు.
తమ అల్లుడు వికాస్ కూడా ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ కావడంతో వాళ్ళు ఆందోళన పడతారు.
శంకర శాస్త్రి కూతురు దీక్ష పైన కూడా మత్తు మందు ప్రయోగించాలని చూస్తాడు, తనను గోవర్ధన స్వామిగా చెప్పుకునే ఓ వ్యక్తి. ఆ మత్తు కలిపిన విభూతి వాసన చూసిన ఆమె స్నేహితురాలు నీలిమ స్పృహ తప్పుతుంది.
ఇక చదవండి...
తన మొబైల్ కనిపించకపోవడంతో, స్నేహితుడి మొబైల్ నుండి తన అన్న వికాస్ కు కాల్ చేస్తాడు విశాల్.
అటువైపు నుండి కాల్ లిఫ్ట్ చేయగానే "అన్నయ్యా! నేను విశాల్ ను. నా మొబైల్ పోవడంతో స్నేహితుడి మొబైల్ నుంచి కాల్ చేస్తున్నాను. వదినను హాస్పిటల్లో అడ్మిట్ చేశారా.. తనకు ఎలా ఉంది? రాత్రి కొన్ని కారణాలవల్ల నేను రాలేకపోయాను" అంటూ ఇంకా ఏదో మాట్లాడ బోతుండగా అవతలి వైపు నుండి వికృతమైన నవ్వు వినపడింది.
"ఎవరు.. ఎవరు మాట్లాడేది? మా అన్నయ్య ఫోన్ నీ దగ్గరకు ఎలా వచ్చింది.." ఆదుర్దాగా అడిగాడు విశాల్.
తన వికటాట్టహాసాన్ని కొనసాగిస్తూ, "నా పేరు డాక్టర్ గోవర్ధన్! మీ వదిన డెలివరీ నేనే చేయాలనుకున్నాను. జస్ట్ మిస్ అయింది. అయినా మించిపోయింది లేదు. ఒకవేళ డెలివరీ బాగా జరిగి, మీ వదిన ఐసీయూ నుండి బయట పడితే తొందర్లోనే మరో అటెంప్ట్ చేస్తాను" అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
మరో క్షణం లోనే అతనే కాల్ చేసి "వెంటనే టీవీ ఆన్ చేసి చూడు. మీ వదిన గురించి న్యూస్ స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది" అన్నాడు.
రూమ్ లో టీవీ లేకపోవడంతో తో స్నేహితుడి మొబైల్ లోనే ఆ న్యూస్ ఛానల్ ఆన్ చేశాడు విశాల్. ఆ అగంతకుడు చెప్పినట్లుగానే హాస్పిటల్లో తన వదిన మీద మర్డర్ అటెంప్ట్ జరిగిన విషయం స్క్రోలింగ్ లో వస్తూ ఉంది. ఆమెను ఐసీయూలో ఉంచినట్లు కూడా చెబుతున్నారు. బయట వెయిట్ చేస్తున్న తన అన్న వికాస్ ను కూడా చూపిస్తున్నారు.
దుఃఖం పొంగుకొచ్చింది విశాల్ కి.
అయితే ఆ స్క్రోలింగ్ లో హాస్పిటల్ పేరు కనిపించడంతో ఊపిరి వచ్చినట్లయింది. వెంటనే ఆ హాస్పిటల్ ఫోన్ నెంబర్ కోసం గూగుల్ లో సెర్చ్ చేసి, ఆ నెంబర్ కు కాల్ చేశాడు.
***
ఐసీయూ బయట తల పట్టుకొని విచారంగా కూర్చుని ఉన్న వికాస్ దగ్గరకు వచ్చింది డాక్టర్ ఆండాళ్.
అతని తల పైన చేయి వేసి, "ప్రమాదమేమీ లేదు మిస్టర్ వికాస్. కాకపోతే అర్జెంట్ గా సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీయాలి. మీరు రిసెప్షన్ వద్దకు వెళ్లి, కొన్ని పేపర్స్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఫర్ ఫార్మాలిటీ.. చెప్పానుగా.. నథింగ్ ఈజ్ సీరియస్" అని చెప్పింది.
"అలాగే డాక్టర్! దేవుడి తర్వాత మనిషి ప్రాణాలు నిలబెట్టే శక్తి డాక్టర్లకే ఉంటుంది" అన్నాడు వికాస్.
"డాక్టర్ల మీది అభిమానంతో కొంత మంది పేషెంట్స్ అలా అంటారు కానీ వాస్తవానికి అంతా ఆ భగవంతుడి చేతిలోనే ఉంటుంది" అని చెప్పి తిరిగి ఐసీయూలో కి వెళ్ళింది డాక్టర్ ఆండాళ్.
కన్సెన్ట్ లెటర్ లో సైన్ చెయ్యడానికి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు వికాస్.
అక్కడ ఉన్న వ్యక్తి "వికాస్ మీరే కదూ! మీ కోసం మీ బ్రదర్ విశాల్ కాల్ చేశారు. తన ఫోన్ పోయిందట. వేరే నంబర్ నుండి చేసాడు. నా సెల్ నుండి రింగ్ చేసి ఇస్తాను. పక్కకు వెళ్లి ఫ్రీగా మాట్లాడుకోండి. ముందు ఈ పేపర్స్ మీద సైన్ చేయండి" అంటూ కొన్ని కాగితాల మీద సంతకం పెట్టించుకున్నాడు. తరువాత తన మొబైల్ నుండి ఇందాక హాస్పిటల్ కు విశాల్ చేసిన నెంబర్ కి డయల్ చేసి వికాస్ కి అందించాడు.
ఫోన్ తీసుకొని బయట హాస్పిటల్ లాన్ దగ్గరికి వచ్చాడు వికాస్.
విశాల్ లిఫ్ట్ చేసాక, " విశాల్! నేనురా.. అన్నయ్యను. ఏమైపోయావురా..? నీ కోసం ఎంత టెన్షన్ పడ్డాననుకున్నావ్?.."అంటూ ఉండగానే అటువైపునుండి విశాల్ బిగ్గరగా ఏడ్చేశాడు.
"విశాల్! నువ్వు ఏడవడమేమిటి? ఏమయిందిరా.." ఆందోళనగా అడిగాడు వికాస్.
"అన్నయ్యా! ముందు వదినకెలా వుందో చెప్పు. నీ కోసం కాల్ చేస్తే ఎవరో గోవర్ధన్ అనే వ్యక్తి లిఫ్ట్ చేసాడు. వదినను చంపాలని ప్రయత్నించినట్లు చెప్పుకున్నాడు. టివి ఆన్ చేసి స్క్రోలింగ్స్ చూడమన్నాడు. తొందర్లో మరో అటెంప్ట్ చేస్తానన్నాడు. నువ్వు ఇంత టెన్షన్ లో వుండి కూడా నాకోసం ఆలోచిస్తూ ఉండటంతో ఏడుపు ఆగలేదు" అన్నాడు విశాల్.
జరిగిన సంఘటనలు విశాల్ కు చెప్పడం ప్రారంభించాడు వికాస్.
"వదినకు హఠాత్తుగా నొప్పులు రావడంతో హాస్పిటల్ లో జాయిన్ చేసి, వెంటనే నీకు, మామయ్య వాళ్లకు కాల్ చేశాను. నువ్వు వెంటనే బయలుదేరుతున్నట్లు చెప్పావు. ఇక్కడ హాస్పిటల్ లో ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పడంతో అదే విషయం నీకు చెబుదామని, వెంటనే బయలుదేరాల్సిన అవసరం లేదని చెబుదామని కాల్ చేశాను. కానీ ఎన్ని సార్లు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చెయ్యలేదు. మీ ఫ్రెండ్ సుమంత్ కి కాల్ చేసాను. అతడు కూడా లిఫ్ట్ చెయ్యలేదు. మా మామయ్యగారు విజయవాడ నుండి బయలుదేరారు గదా! దార్లో ఆ తోట దగ్గర ఆగి మీకోసం చూడమన్నాను. కాస్సేపటికి మామయ్యగారు ఫోన్ చేసి, అక్కడ మీరెవ్వరూ లేరని, ఒక వ్యక్తి కనపడి తన పేరు గోవర్ధన్ అని చెప్పాడని చెప్పారాయన. .
ఇక్కడ హాస్పిటల్ లో డాక్టర్ ఆండాళ్ గారు కిందికి వెళ్లి ఒక ఇంజక్షన్ తీసుకొని రమ్మన్నారు. నేను వెళ్ళబోతూ ఉండగా అత్తయ్య కాల్ చేసారు. నా ఫోన్ శ్రేయకు ఇచ్చి, నేను కిందికి వెళ్ళాను. ఆ సమయంలో ఒక వ్యక్తి నాకు డాష్ ఇచ్చాడు. తన పేరు డాక్టర్ గోవర్ధన్ అని చెప్పాడు. కిందికి వెళ్లిన నాకు, టివిలో ఒక హాస్పిటల్ లో అజ్ఞాత వ్యక్తి ఒక యువతి పై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు న్యూస్ వస్తోంది. నాకు అనుమానం వచ్చి రిసెప్షన్ లో ఆ హాస్పిటల్ లో గోవర్ధన్ పేరుతో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమోనని విచారించాను. ఎవరూ లేరని వాళ్ళు చెప్పడంతో వెంటనే డేంజర్ అలారమ్ మోగించమని చెప్పి, నేను పైకి వెళ్ళాను.
అప్పటికే ఆ వ్యక్తి పారిపోయాడు. మీ వదిన బాత్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకోవడంతో అతని నుండి తప్పించుకుంది.
వెంటనే మీ వదినను ఐసీయూ లోకి మార్చారు. ఇప్పుడే డాక్టర్ ఆండాళ్ గారు మాట్లాడారు. ఇంకాసేపట్లో సిజేరియన్ చేస్తారట. రిపోర్ట్స్ ప్రకారం ప్రమాదమేమీ లేదని చెప్పారు. నా ఫోన్ ఆ దుర్మార్గుడి దగ్గర వుండి పోయినట్లుంది. నువ్వు కాల్ చేసినప్పుడు భయపెట్టి ఉంటాడు. ఇక మన అమ్మానాన్నలు ఇంటి దగ్గర మా బాబును చూసుకుంటూ ఉన్నారు. వాళ్లకు ఇక్కడ జరిగిన విషయాలేవీ తెలియవు."
తన విషయాలు చెప్పడం ముగించాడు వికాస్.
తరువాత "ఇక నీ విషయం చెప్పు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్? నీ ఫోన్ ఏమైంది?" అని అడిగాడు.
అటువైపు నుండి విశాల్ మాట్లాడుతూ "మేము మామిడితోటలో పార్టీ చేసుకుంటున్న విషయం నీకు ముందే చెప్పాను కదా. నేను లైట్ డ్రింకర్ ని. ఆ విషయమూ నీకు తెలిసిందే. ఇక నా ఫ్రెండ్ సుమంత్ అయితే జస్ట్ కంపెనీ కోసం టేస్ట్ చూస్తాడు.. అంతే! కానీ ఎందుకో అప్పుడు మాకు తెలీని మత్తు కమ్మేసింది. సుమంత్ అయితే లేచి నిలబడే పరిస్థితిలో లేడు. పార్టీ ముగిసి, అందరూ బయలు దేరుతున్నారు. ఆ సమయంలో బైక్ డ్రైవ్ చెయ్యడం మంచిది కాదని, సుమంత్ అక్కడే చెట్లకింద కాసేపు పడుకుని, బయలుదేరుతానన్నాడు. అతనికి తోడుగా నేను కూడా పక్కనే పడుకున్నాను.
కొంత సేపటికే సుమంత్ నా చేతులతో తన గొంతు నొక్కుకుంటున్నాడు. బలవంతంగా అతన్ని లేపాను. ఏదో వికృతాకారం తన మీద దాడి చేసిందని చెప్పాడు. నేను అతనికి ధైర్యం చెప్పి పడుకోబెట్టాను. ఇంతలో నీ దగ్గర్నుండి కాల్ వచ్చింది. వదినను హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన విషయం చెప్పావు. సుమంత్ ను బలవంతంగా నిద్ర లేపాను. అతన్ని నా రూమ్ లో దించుతానని చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. తనకేమీ పరవాలేదని, నన్ను వెళ్ళమని చెప్పాడు. హేమంత్ కి కాల్ చేసి ఎవర్నైనా సుమంత్ కి తోడుకోసం తోట దగ్గరకు పంపమని చెప్పాను.
తరువాత బైక్ లో బయలు దేరాను. కానీ మొబైల్ నా దగ్గర లేదని గ్రహించాను. తిరిగి వెనక్కి వెళ్ళాను. అక్కడ ఇందాక నేను, సుమంత్ పడున్న చోట చూసాను. సుమంత్ లేడక్కడ. నా మొబైల్ కూడా కనపడ లేదు. ఎక్కడో దూరంగా తనని కాపాడమన్నట్లు సుమంత్ అరిచినట్లు, దగ్గర్లోనే నా మొబైల్ రింగ్ టోన్ వినిపించినట్లు అనిపించింది. ఎందుకో విపరీతంగా మత్తు కమ్మేసింది. బహుశా హేమంత్ పంపిన మనుషులు అతన్ని తీసుకొని వెళ్లి ఉంటారని అనుకున్నాను.
బైక్ రూమ్ దగ్గర ఉంచి, బస్సు లో నీ దగ్గరకు రావాలనుకున్నాను. ఎలా రూమ్ కి చేరుకున్నానో కూడా తెలీదు. ఇందాకే స్పృహ వచ్చింది. ఫ్రెండ్ మొబైల్ నుండి కాల్ చేసాను. సుమంత్ లిఫ్ట్ చెయ్యలేదు. నీకోసం చేస్తే ఆ ఆగంతకుడు లిఫ్ట్ చేసాడు"
జరిగినదంతా చెప్పాడు విశాల్.
"ఓకే విశాల్. జరిగినదానిని బట్టి నీకు, సుమంత్ కు ఎవరో డ్రింక్ లో మత్తు మందు కలిపినట్లు అనిపిస్తోంది. సుమంత్ కనపడితేగాని అసలు విషయాలు తెలియవు. అన్నట్లు హేమంత్ మనుషులు అతన్ని తీసుకొని వెళ్ళారా?" ప్రశ్నించాడు వికాస్.
"లేదు. వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరట" చెప్పాడు విశాల్.
"ఓకే విశాల్. నా ఊహ ప్రకారం సుమంత్ కాస్సేపటికి బైక్ లో బయలుదేరి ఉండవచ్చు. అతనికి ఆక్సిడెంట్ అయి ఉండవచ్చు అనిపిస్తోంది.పెద్ద ఆక్సిడెంట్ అయి ఉంటే విజయవాడలో చేర్చి ఉంటారు. అక్కడి హాస్పిటల్స్ లో ఎంక్వయిరీ చేయించు. నేను కూడా అత్తయ్యతో చెప్పి, వాళ్లకు తెలిసిన హాస్పిటల్స్ లో అడ్మిట్ అయ్యాడేమో కనుక్కోమని చెబుతాను. నువ్వు వెంటనే బయలుదేరాల్సిన అవసరం లేదు. సుమంత్ విషయం తెలిసాకే బయలుదేరవచ్చు. ఇక అమ్మావాళ్లకు కాల్ చేస్తాను. ప్రస్తుతానికి నాన్న ఫోన్ తెప్పించుకొని, నా దగ్గర ఉంచుకుంటాను. " అని ఫోన్ పెట్టేసాడు.
తరువాత తన తండ్రి విజయానందకి కాల్ చేసాడు.
అయన లిఫ్ట్ చెయ్యక పోవడంతో రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాడు.
"నాన్నగారికి కాల్ చేస్తే లిఫ్ట్ చెయ్యలేదు. మీ ఫోన్ మరి కాస్సేపు నా దగ్గర ఉంచుకోనా?" అభ్యర్థనగా అడిగాడు.
"అలాగేనండీ. అన్నట్లు ఆపరేషన్ మొదలయ్యింది. మరో పావుగంటలో డెలివరీ కావచ్చు" చెప్పాడతను. అతనికి థాంక్స్ చెప్పి తిరిగి లాన్ లోకి వచ్చాడు వికాస్.
అంతలో ఆ ఫోన్ మోగింది.
అది తండ్రి నంబర్...
కాల్ లిఫ్ట్ చేసి, "నాన్నా! నేను వికాస్ ని.." అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా అటువైపు నుండి విజయానంద, "ముందు నేను చెప్పేది విను. ఎవరో గోవర్ధన్ అట.. మీ ఆఫీస్ అటెండర్ అట. ఇందాకే మన ఇంటికి వచ్చాడు. మనవడిని.. అదే.. నీ కొడుకు విభవ్ ని నువ్వు హాస్పిటల్ కి తీసుకొని రమ్మన్నావని చెప్పాడు.
నేను బయలుదేరుతున్నాని, నేనే తీసుకొని వస్తానని చెప్పాను. అయినా అతను కదల్లేదు. అతడిని చూసి మన ఆల్సేషియన్ ఒకటే మొరుగుతోంది. దాంతో వెళ్ళిపోయాడు. వెంటనే నేను నీకు కాల్ చేశాను. వెళ్తున్న అతని ఫోన్ మోగింది. అతను లిఫ్ట్ చేసి వికృతంగా నవ్వి, కాల్ కట్ చేసాడు" ఆందోళనగా చెప్పాడాయన.
ఇంకా వుంది…
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments