top of page

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 17

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Srivari Kattu Kathalu Episode - 17' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar


రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…


కనకారావుకు అతని అనుచరుడు ఫోన్ చేసి, ఇంటర్వ్యూ కోసం వచ్చిన వాళ్లలో ఒక వ్యక్తి పోలీస్ అని అనుమానంగా ఉందని చెబుతాడు. తనకు తెలిసిన పోలీస్ వ్యక్తిని తీసుకొని వచ్చి అతనికి వాళ్ళను చూపిద్దామని చెబుతాడు.


తన సీక్రెట్ ఫోన్ నుండి విల్సన్ కి కాల్ చేస్తుంది జయా ఆంటీ.

అతను లిఫ్ట్ చెయ్యక పోవడంతో ఆమె అనుమానం బలపడుతుంది.

ఇక చదవండి…



"విల్సన్ ను నా దగ్గరకు తీసుకొని రండి" చెప్పాడు ఏ సి పీ ప్రతాప్.

ఇద్దరు కానిస్టేబుల్స్ వెళ్లి విల్సన్ ను తీసుకొని వచ్చారు.

అతన్ని కొట్టడానికన్నట్లుగా లాఠీని పైకెత్తాడు ప్రతాప్.

"ఇప్పటికే మీవాళ్లు కుళ్లబొడిచారు. మళ్ళీ కొట్టకండి సార్" అన్నాడు విల్సన్ చేతులు జోడిస్తూ.


"సరేగానీ మీవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా కోడ్ చెబుతూ ఉంటావా?" అడిగాడు ప్రతాప్.

క్షణం ఆలోచించాడు విల్సన్.


తాము కోడ్ వాడుతున్నట్లు వీళ్లకు తెలిసి పోయిందా లేక చీకట్లో ఒక రాయి వేసారా అతనికి అంతు పట్టలేదు.

"నిన్నే అడిగేది" రెట్టించాడు ప్రతాప్.


"అలాంటిదేమీ లేదు సార్. మేమేమీ మాఫియా ముఠా వాళ్ళం కాదు సార్. ఏదో చిన్న చిన్న దందాలు చేసుకొని బతికేవాడిని. నన్ను వదిలేయండి. మీ ఋణం ఉంచుకోను.." బేరం మొదలు పెట్టాడు విల్సన్.


"ఋణం తీర్చుకోవడానికి కనీసం రేపటి వరకైనా నువ్వు వుంటే కదా. నీ వాలకం చూస్తుంటే ఈ రాత్రికే కడుపు ఉబ్బరం భరించలేక లాకప్ రూమ్ లోనే ఉరి వేసుకునేట్లు ఉన్నావు. ఆ కోడ్ ఏదో చెప్పేయ్. ఉబ్బరం తగ్గి బ్రతికిపోతావ్. గాడ్ ఈజ్ గ్రేట్. నిజం చెబితే నిన్ను తప్పకుండా కాపాడతాడు" అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు ఏ సి పీ ప్రతాప్.


ఉలిక్కి పడ్డాడు విల్సన్.

తన కోడ్ పోలీసులకు తెలిసిపోయిందన్న మాట.

ఇందాక కోడ్ చెప్పలేదన్నది కూడా గమనించారన్న మాట.

ఇక బుకాయించి లాభం లేదు.

నిజం ఒప్పుకుంటే దెబ్బలన్నా తప్పుతాయి.

"ఇందాక తొందర్లో కోడ్ చెప్పలేదు. ఇప్పుడు ఫోన్ ఇవ్వండి. చెబుతాను" అన్నాడు.


"చూడు విల్సన్! జయా ఆంటీ ఇంట్లో మైక్రోఫోన్ ఉంచాము. నువ్వు ఏదైనా హింట్ ఇచ్చినా ఆమె వెంటనే తనవాళ్లకు ఆ విషయం చెబుతుంది. అది మాకు తెలిసిపోతుంది.


ఆమెను కాపాడే ప్రయత్నాలు మాని, నీ సంగతి చూసుకో. చెప్పానుగా.. పొట్ట ఉబ్బరం తగ్గించుకొని ప్రాణాలతో ఉండే మార్గం చూడు" హెచ్చరించాడు ప్రతాప్.


జయా ఆంటీ పూర్తిగా ఇరుక్కు పోయిందని అర్థమైంది విల్సన్ కి.

మునిగిపోయే పడవను వదిలెయ్యాలి. అది అతను చిన్నప్పుడే నేర్చుకున్న సూత్రం.


ప్రతాప్ అందించిన ఫోన్ ను అందుకున్నాడు.

సీక్రెట్ నంబర్ నుండి జయా ఆంటీకి కాల్ చేసాడు.


"గాడ్ ఈజ్ గ్రేట్. సందీప్ ను పూర్తిగా నమ్మవచ్చు. అతను అడిగింది చెయ్యండి. ముందు చెప్పిన సుపారీ ముడుతుంది. ఆలస్యం చెయ్యకండి" అన్నాడు.


"అలాగే విల్సన్ గారూ! ఇందాక మీరు కోడ్ చెప్పక పోయేసరికి కాస్త కన్ఫ్యూజ్ అయ్యాను" అంది జయా ఆంటీ.


"అలా అనుకుంటే ఇప్పుడు నువ్వూ చెప్పలేదుగా. ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటుంది. అనుమానాలతో లేట్ చేస్తే వాళ్ళు వేరే పార్టీని చూసుకుంటారు" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు విల్సన్.


"పరవాలేదు. జైలు నుంచి వచ్చాక సినిమాల్లో ట్రై చేసుకో" అని చెప్పి, అతన్ని తిరిగి లాకప్ లోకి పంపాడు ప్రతాప్.

***

హాస్పిటల్ లో ప్రమోద్ మీద అటాక్ చెయ్యబోతాడు నర్స్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి.


షాలిని గట్టిగా అరుస్తూ అతని మీదకు దూకబోతుంది.


అంతలో అప్పటికే ఆ గదిలోకి ఎంటర్ అయిన పోలీస్ ఆఫీసర్ ఆ వ్యక్తి కాళ్ళ మీద కాలుస్తాడు.


కాలికి బులెట్ తగిలిన ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న పిడి బాకును కింద పడేసి, కాలిని పట్టుకుని కిందికి వాలిపోయాడు.


ఈ లోగా హాస్పిటల్ సిబ్బంది అతన్ని కదలకుండా పట్టుకున్నారు.


రిలాక్స్ అయిన షాలిని గౌతమ్ కి కాల్ చేసి, "నువ్వు కరెక్ట్ గా గెస్ చెయ్యడం వల్ల మేము రూమ్ లోకి ఎంటర్ అయ్యాం. పోలీస్ ఆఫీసర్ ఆ దుండగుడిని షూట్ చేసాడు. ప్రమోద్ ఈజ్ సేఫ్. థాంక్ యు ఫర్ యువర్ హెల్ప్" అని చెప్పింది.


"గౌతమ్! యూ ఆర్ రియల్లీ గ్రేట్. ఇక్కడ్నుంచే హాస్పిటల్ దగ్గర జరగబోయేది ఉహించావు" అని అభినందించింది సమీర.


ఇంతలో పర్వీన్ దగ్గరున్న కనకారావు సీక్రెట్ ఫోన్ మోగింది.


జయా ఆంటీ మాట్లాడుతూ "విల్సన్ ఇందాకటి ఫోన్ ను కన్ఫర్మ్ చేసాడు. ఇక మేము స్నేహాను లేపేస్తాము. కనకరావుకు వీలు చూసుకొని చెప్పు" అని చెప్పి ఫోన్ పెట్టేసింది.


క్రింద ఫోన్లు ముగించిన కనకారావు, తిరిగి డ్రాయింగ్ రూమ్ లోకి వెళ్ళాడు.

సరిగ్గా అప్పుడే కనకారావు అనుచరుడు ఒక వ్యక్తిని పిలుచుకొని వచ్చాడు.

అతను విలేఖరులుగా వచ్చిన వాళ్ళను పరిశీలనగా చూసి, తరువాత కనకారావు దగ్గరకు వెళ్లి చెవిలో "వీళ్ళు పోలీసులు కాదు. అనుమానించకుండా మీ పని కానివ్వండి" అన్నాడు.


ఇంతలో గౌతమ్ కి ఉదయ్ నుండి మెసేజ్ వచ్చింది.

"కనకారావు అనుచరుడికి అనుమానం రావడంతో కానిస్టేబుల్ గా పని చేస్తున్న పర్వీన్ భర్తను అతనికి ఎదురు రమ్మని చెప్పాము. అతను ఇక్కడికి వచ్చి మేము పోలీసులం కామని కనకరావుకు చెప్పారు. ఇంకాసేపట్లో కనకారావు పైకి వస్తాడు"


ఆ మెసేజ్ చదివిన గౌతమ్ "సమీరా! ఇక కథ క్లైమాక్స్ కి వచ్చింది. ఎన్నో విషయాల్లో తప్పించుకున్న కనకారావు ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతాడు" అంటూ బెడ్ లైట్ స్థానంలో హిడెన్ కెమెరా ఉన్న లైట్ ని అమర్చాడు.


తరువాత తలుపు గడియకున్న స్క్రూలను వదులు చేసి, సమీరతో "అలర్ట్ గా ఉండు. నేను బయట ఉంటాను. అవసరమైనప్పుడు తలుపు తోసుకొని లోపలకు వస్తాను" అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు.

పర్వీన్, శిల్పలు కూడా బయటకు వెళ్లారు.


కనకారావు, ఉదయ్, సి ఐ కిషోర్ లను తీసుకొని పైకి వస్తున్నాడు.


కనకారావు అనుచరుడి సంగతి మేము చూసుకుంటామని కిందే ఉన్న శివ, పర్వీన్ భర్త ఇద్దరూ ఉదయ్ కి సైగ చేసి చెప్పారు.


మేడ పైకి వచ్చిన కనకరావుకు పర్వీన్, శిల్పలు ఎదురు వచ్చారు. పర్వీన్ అతనికి సమీర ఉన్న గది చూపించి లోపలి వెళ్ళమంది.


"పరవాలేదంటావా? ఆ సమీర సీమ మిరపయికాయ లాగా ఉంది" పర్వీన్ తో అన్నాడు కనకారావు.


తరువాత శిల్ప వైపు తిరిగి ఆ మస్సాజ్ చేసే కుర్రాడితో సమీరను కట్టేయమని చెబితే సరి పోలా?" అన్నాడు.


"ఖచ్చితంగా పోతుంది.. మీ పరువు. మీరొక్కరే ప్రయత్నించండి. అయినా అతను రెడీగా ఉన్నాడులే. మరీ అవసరమైతే పంపుతాను. గడియ పెట్టుకోకండి. బయట మేముంటాముగా. ముందు మీరు వెళ్ళండి" అంది శిల్ప అతన్ని గదిలోకి నెడుతూ.


లోపలికి వెళ్లి, తలుపు దగ్గరికి వేసాడు కనకారావు.

గదిలో భయంగా తన వంక చూస్తున్న సమీరను చూడగానే అతనికి చెప్పలేని ఆనందం వేసింది. ముందు నయానా తరువాత భయానా తన పని సాధించు కోవాలనుకున్నాడు.


"చూడు సమీరా! ఆంటీ ఇంట్లో నిన్ను చూసినప్పటి నుండీ నా మనసు వశం తప్పింది. నువ్వు నాకు సహకరిస్తే నీ భర్తను ఆ యాక్సిడెంట్ కేసునుండి తప్పిస్తాను. అసలు ఆ యాక్సిడెంట్ నేను, జయా ఆంటీ కలిసి చేయించాము. ఒక్కసారి నా కోరిక తీరిస్తే నీకు ఏ సమస్యా లేకుండా చేస్తాను. నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. ఇంకా చెప్పాలంటే నువ్వు ఊహించనంత ఇస్తాను. ప్లీజ్.." అంటూ అభ్యర్థించాడు.


"ఇలా పరాయి స్త్రీలను లొంగదీసు కోవాలనుకోవడం తప్పు కదా" అంది సమీర అతనికి దూరంగా జరుగుతూ.


"మర్యాదగా అడుగుతుంటే టెక్కు చూపిస్తున్నావు" అంటూ సమీర చెయ్యి పట్టుకున్నాడు కనకారావు. అతని చేతిని విదిలించి కొట్టింది సమీర.


కోపంతో ఆమె చున్నీ లాగబోయాడు అతను.

కానీ సమీర విసురుగా నెట్టడంతో దూరంగా పడిపోయాడు. ఎముకలన్నీ విరిగినట్లైంది అతనికి.


"నీకు ఇలా కాదే.. చేతులు, కాళ్ళు కట్టేసి.." అంటూ గది డోర్ తెరిచాడు.

బయట పర్వీన్, శిల్పలు ప్లాస్టిక్ వైర్ పట్టుకొని రెడీగా ఉన్నారు. ఉదయ్, కిశోర్ లు పక్కనే ఉన్నారు.


"సిద్ధంగా ఉన్నారన్న మాట. వెరీ గుడ్. ముందు దీన్ని బట్టలూడదీసి కట్టి పడేయండి. తరువాత.." అంటుండగా ఓ అందమైన యువకుడు అక్కడికి వచ్చాడు.


"షర్ట్ వరకు తీసెయ్యండి చాలు. వీడి ఎక్స్పోజింగ్ చూడలేం" అన్నాడు.


"ఎవరితను?" అడిగాడు కనకారావు.


"ఇతను గౌతమ్ అని...నీకు మసాజ్ చెయ్యడానికి వచ్చాడు" చెప్పింది శిల్ప.

"గౌతమ్ ఇక్కడికెలా వచ్చాడు? ఏం జరుగుతోందిక్కడ?" ఆందోళనగా అన్నాడు కనకారావు.


"నీ పాపం పండింది" అంటూ శిల్ప, పర్వీన్ లు అతన్ని కట్టి పడేసారు.


ఇంతలో బయట చాలా మంది గుమికూడినట్లు కేకలు వినబడ్డాయి.

వికృతంగా నవ్వాడు కనకారావు.


"నా మనుషులు దాడి చేస్తున్నారు. మీ అందరినీ చంపేస్తారు" అంటూ అరిచాడు.


"వచ్చింది నీ మనుషులు కాదు. జయా ఆంటీ వల్ల, నీ వల్ల నష్టపోయిన వాళ్ళందరూ ఇప్పుడు మీ పైకి దండెత్తారు. అక్కడ ఆంటీ పరిస్థితి కూడా ఇంతే. వీళ్ళ దగ్గర నుండి బతికి బట్ట కడితే తరువాత మీ సంగతి పోలీసులు చూసుకుంటారు" చెప్పాడు గౌతమ్.

***

జయా ఆంటీ అపార్ట్మెంట్ తలుపు తట్టాడు సందీప్.

"ఆంటీ! ఇక రండి. స్నేహతో మీరు నాకు హెల్ప్ చేశారని చెప్పాను" అన్నాడు.

విల్సన్ దగ్గర నుండి ఫోన్ వచ్చి ఉండడంతో ఆంటీ, ప్రవీణ్ లు సందీప్ తో పాటు గౌతమ్ ఇంట్లోకి వచ్చారు.

జయా ఆంటీ స్నేహతో "నిన్ను చంపెయ్యమని మాకు ఆర్డర్స్ వచ్చాయి." అంది.

స్నేహ రెండు చేతులూ జోడించి "నన్ను వదిలెయ్యండి ఆంటీ..ప్లీజ్" అంది.


జయా ఆంటీ స్నేహ నోటిని తన చేతులతో మూసి, "చంపెయ్యి ప్రవీణ్" అంది.

ప్రవీణ్ అటూ ఇటూ ఆయుధం కోసం చూసాడు.


వినీత్ ఒక ఇరాన్ రాడ్ ను కనిపించే విధంగా హాల్ లో ఉంచడంతో దాన్ని అందుకున్నాడు ప్రవీణ్.


ఆ రాడ్ ను పైకెత్తి స్నేహ తలపైన మోదబోయాడు.

అతని కాళ్ళ పైన షూట్ చేసాడు ఒక పోలీస్ ఆఫీసర్.

తన నోటిని మూసిన జయా ఆంటీ చేతిని మెలితిప్పి, వెనక్కి నెట్టింది స్నేహ. వెల్లకిలా పడిపోయింది జయా ఆంటీ.


జయా మహిళా మండలి సభ్యులు ఆ అపార్ట్మెంట్ లోకి ప్రవేశించారు.

ఆంటీని తన్నుకుంటూ బయటకు లాక్కుని వెళ్లారు.

పోలీసులు అతి ప్రయత్నం మీద ఆమెను విడిపించి తమ కస్టడీలోకి తీసుకున్నారు.

***

ఏ సి పీ ఆఫీస్ లో ప్రతాప్ ని తమ పేరెంట్స్ తో కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్నారు గౌతమ్ , సమీర.

స్నేహ, సందీప్ ల పెళ్లి ఘనంగా జరిగింది.

ప్రమోద్ హాస్పిటల్ నించి డిశ్చార్జ్ అయ్యాడు.

కొద్ది రోజులు పిల్లలతో గడిపి, బయలుదేరారు సమీర, గౌతమ్ ల పేరెంట్స్.

గౌతమ్ ఆఫీస్ నుండి సమీరకు ఫోన్ చేసి "సాయంత్రం రెడీగా ఉండు. మూవీ కి వెడదాం" అన్నాడు.


"నో గౌతమ్. చాలా రోజుల తరువాత ఏకాంతం దొరికింది. ఐ వాంట్ టు స్పెండ్ విత్ యు" అంది సమీర.

సాయంత్రం ఐదు గంటలకు కాల్ చేసాడు గౌతమ్.


"సారీ డియర్! ట్రాఫిక్ లో ఇరుక్కున్నాను. మరో రెండు గంటలు పట్టొచ్చు" అన్నాడు.


"యు మిస్డ్ ఏ లాట్. ఇప్పుడే కనక ఇంటికి వచ్చి వుంటే.."


"వచ్చి ఉంటే?" ఈ సారి మాటలు ఫోన్ నుండి కాక డోర్ బయట నుండి వినిపించాయి.


***సమాప్తం***

ఈ సీరియల్ ఇంతటితో ముగిసింది. ఇంతకాలం ఈ సీరియల్ ను ఆదరించిన పాఠకులకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).





86 views0 comments

Commentaires


bottom of page