top of page

శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 16


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Video link

'Srivari Kattu Kathalu Episode - 16' New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar


రచన : మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…


పర్వీన్, శిల్పలకు జయా ఆంటీ ద్వారా జరిగిన అన్యాయం గురించి విన్న సమీర ఆవేశపడుతుంది.

గౌతమ్ ఊహించినట్లుగానే హాస్పిటల్ లో డాక్టర్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి ద్వారా అందర్నీ డైవర్ట్ చేసి, మరో వ్యక్తి నర్స్ వేషంలో ప్రమోద్ ఉన్న గదిలోకి దూరుతాడు.

ఇక చదవండి…


డోర్ తెరవడానికి వెళ్ళబోతున్న షాలిని, వినీత్ పిలవడంతో తిరిగి బెడ్ రూమ్ లోకి వెడుతుంది.

ఎందుకు పిలిచారని అడగబోతున్న ఆమెను కాసేపు నిశ్శబ్దంగా ఉండమని సైగ చేస్తాడు వినీత్.

ఒక పోలీస్ ఆఫీసర్ చెవిలో రిసీవర్ పెట్టుకొని, ఎవరివో మాటలు శ్రద్ధగా వింటున్నాడు.

అటువైపు మాటలు వినడం పూర్తయ్యాక రిసీవర్ తీసేసి, ఇలా చెప్పాడు.


“గౌతమ్, సందీప్ కి ఒక మైక్రోఫోన్ ఇచ్చాడు. సందీప్ దాన్ని జయా ఆంటీ ఇంట్లో సోఫాలో కూర్చున్నప్పుడు సీట్ అంచుల్లోకి నెట్టి ఉంచాడు. రిసీవర్ మాకు ఇచ్చాడు గౌతమ్. దాంట్లో సందీప్ బయటకు వచ్చాక జయా ఆంటీ ప్రవీణ్ తో మాట్లాడిన మాటలు విన్నాను. వాళ్ళ మాటల ప్రకారం ఆంటీ సందీప్ ని పూర్తిగా నమ్మలేదు. విల్సన్, ఆంటీతో మాట్లాడేటప్పుడు సీక్రెట్ కోడ్ చెప్పలేదట. అందుకే సందీప్ షర్ట్ వెనుక ఒక మైక్రోఫోన్ పెట్టిందట. అంతే కాదు. ముందు సందీప్ మాత్రమే లోపలికి వస్తాడట. మైక్రోఫోన్ లో అతను మీతో మాట్లాడే మాటలు విన్నాకే వాళ్ళు ఏంచెయ్యాలో డిసైడ్ చేసుకుంటారట" చెప్పడం ముగించాడతను.


తరువాత ఏ సి పి ప్రతాప్ గారికి కాల్ చేసాడు.


"నమస్తే సర్! మీరు ఇచ్చిన మైక్రోఫోన్ గౌతమ్ సందీప్ కి ఇచ్చాడు. రిసీవర్ మాకు చేర్చాడు. సందీప్ దాన్ని ఆంటీ ఇంట్లో ఉంచాడు. ఆవిడ మాటల ప్రకారం మీరు విల్సన్ తో మాట్లాడించినప్పుడు అతనేదో కోడ్ చెప్పలేదట. దాంతో ఆమెకు అనుమానం వచ్చింది" అని చెప్పాడా ఆఫీసర్.


"అలాగా! నేను చూసుకుంటానులే.. మీరు మాత్రం చాలా అలర్ట్ గా ఉండండి. డిపార్ట్మెంట్ మీది నమ్మకంతో రిస్క్ లోకి దిగిన సందీప్, స్నేహలకు ఎలాంటి అపాయం కలక్కూడదు. వాళ్ళు ఎంటర్ అయ్యాక నాకు కాల్ చేసే సమయం మీకు ఉండదు. సమయానికి తగ్గ డిసిషన్ మీరే తీసుకోవాలి. ఈ పనికి మిమ్మల్ని పంపింది ఆ నమ్మకంతోనే.." అన్నాడు ఏ సి పి ప్రతాప్.


"సరే సర్" అని ఫోన్ పెట్టేసాడు ఆ ఆఫీసర్.


తరువాత స్నేహతో "సందీప్ లోపలికి ఎంటర్ కాగానే తొందరపడి ఏదైనా మాట్లాడబోతాడేమో.. అంతకంటే ముందే నువ్వు సైగల ద్వారా అతని షర్ట్ వెనుక మైక్రోఫోన్ ఉన్నట్లు అతనికి తెలపాలి. అతను ఏమాత్రం తొందర పడినా వాళ్ళు జాగ్రత్త పడతారు. అతనికి ఎలా కమ్యూనికేట్ చేస్తావో నువ్వే ఆలోచించుకో" అన్నాడు ఆ ఆఫీసర్.


క్షణం ఆలోచించింది స్నేహ.

డ్రెస్సింగ్ టేబుల్ అరలో దేనికోసమో వెతికింది. నైల్ పాలిష్ దొరికింది.

దాన్ని తీసుకొని "ఇప్పుడే వస్తాను.." అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళింది.

రెండు నిముషాల్లోనే తన కుడిచేతి చూపుడు వేలుని తన ఛాతీ వైపు అటుఇటు తిప్పుతూ బయటకు వచ్చింది. అప్రయత్నంగా అందరి చూపులు ఆమె ఛాతీ వైపు తిరిగాయి.

అక్కడ గ్లిట్టర్ నైల్ పాలిష్ తో 'shh.. silence' అనే అక్షరాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

తరువాత తన చూపుడు వేలిని పెదవులపై నిలువుగా ఉంచుకుంది, నిశ్శబ్దం...అన్నట్లుగా.


ఆమె చేసిన మోనో యాక్షన్ చూసిన పోలీస్ ఆఫీసర్లు అప్రయత్నంగా చిన్నగా చప్పట్లు కొట్టారు.ఆమె తన కజిన్ కావడంతో వినీత్ మొదట కాస్త ఇబ్బంది పడ్డా తరువాత అతను కూడా ఆమెను అభినందించాడు. తన మోనో యాక్షన్ కొనసాగిస్తూ స్నేహ హాల్లోకి వెళ్ళింది. కీ హోల్ నుండి బయటకు చూసింది. బయట నుంచి లోపలికి చూస్తున్న సందీప్ ను చూడగానే ఆమె గుండె ఝల్లుమంది. అదే సమయంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లూ ఒక సోఫా వెనుక, వినీత్ మరో సోఫా వెనుక దాక్కున్నారు.


బయటనుంచి స్నేహను చూసిన సందీప్ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇంత అందమైన, తెలివైన అమ్మయినా తను వదులుకోవాలనుకున్నది? అలాంటి పొరపాటు చేసి వుంటే తన జీవితానికే అర్థం ఉండేది కాదు.. ఆలోచనలను వదిలించుకొని కీ హోల్ నుండి వెనక్కి జరిగాడు.లోపల్నించి చూస్తున్న స్నేహకు, తన చూపుడు వేలిని ఆమె తిప్పినట్లుగానే తన ఛాతీ వైపు తిప్పి తనకు అర్థం అయినట్లు తెలిపాడు. తరువాత డోర్ తట్టి, "తలుపు తియ్యి స్నేహా! నేను.. నీ సందీప్ ను. నీ కోసం వచ్చాను" అన్నాడు.

తనకు దూరమయ్యాడనుకున్న సందీప్ తన ఎదురుగా నిలుచుంటే ఏమవుతానో.. అనుకుంటూ వణుకుతున్న చేతులతో డోర్ తీసింది స్నేహ.


లోపలికి వచ్చిన సందీప్ ముందుగా తలుపు గడియ పెట్టాడు. వెనక్కి తిరిగిన అతన్ని స్నేహ అమాంతం కౌగలించుకుంది. ఆమె కళ్ళ వెంట నీళ్లు ధారగా కారుతున్నాయి. సందీప్ ప్రేమగా ఆమె తల నిమిరాడు.


నెమ్మదిగా ఆమెను విడిపించుకొని, " ఐ యామ్ సారీ స్నేహా. అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను. అంతా ఆ గౌతమ్ వల్లే జరిగింది. జరిగినదంతా నీకు తరువాత వివరంగా చెబుతాను. ఇంతకీ నాకు కలిగిన అనుమానం పోవడానికి కారణం ఎవరో తెలుసా? పక్కింటి జయా ఆంటీ. సిటీలో ఇలా ఫోటోలు మార్ఫింగ్ చేసే ముఠా ఉందట. వాళ్లే ఈ పని చేసి ఉంటారని ఆంటీ చెప్పింది. ప్రవీణ్ కూడా నా అనుమానం తొలగడంలో చాలా సహాయం చేసాడు. మనల్ని కలిపిన వాళ్ళిద్దరికీ మనం థాంక్స్ చెబుదాం. వాళ్ళను ఇక్కడికి పిలవనా.." అని అడిగాడు.


"అలాగే సందీప్. వాళ్ళను రమ్మను. జీవితాంతం గుర్తుంచుకునే సహాయం చేశారు వాళ్ళు" అంది స్నేహ, తన వంతు నటనను కొనసాగిస్తూ…


పక్క పోర్షన్ లోంచి వీళ్ళ మాటలు వింటున్న ప్రవీణ్, "ఈ సందీప్ సారు మంచి యాక్టరే. మనం ఇక ప్రొసీడ్ అయిపోవచ్చు" అన్నాడు.


"విల్సన్ కోడ్ ఎందుకు చెప్పలేదన్నది నాకు ఇంకా డౌట్ గానే ఉంది. ఒక్కసారి అతనికి కాల్ చేస్తాను.." అంటూ సీక్రెట్ నంబర్ నుండి అతనికి కాల్ చేసింది.

అతను లిఫ్ట్ చెయ్యలేదు.


మరో రెండు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

"నా అనుమానం బలపడుతోంది" అంది జయా ఆంటీ.

"ఎందుకలా అనిపిస్తోంది?" అడిగాడు ప్రవీణ్.


"సీక్రెట్ ఫోన్ ఎప్పుడూ లిఫ్ట్ చెయ్యకుండా ఉండరు. ఇందాక నేను కనకరావుకు కాల్ చేశాను కదా! అతను ప్రెస్ వాళ్ళతో ఇంటర్ వ్యూ లో ఉండడంతో ఫోన్ పర్వీన్ దగ్గరకు పంపాడు. ఆమె మాట్లాడింది. కానీ ఇలా తియ్యకుండా ఉండడం జరగలేదు" అంది జయా ఆంటీ.


"పెద్దమ్మా! వీడేమిటి నాకు సలహాలు చెబుతున్నాడని అనుకోకుండా నా మాట విను. సందీప్ వాళ్ళ నాన్నకు ఎంత ఆస్తి ఉంటుందంటావ్?" అడిగాడు ప్రవీణ్.


"వంద కోట్లకు పై మాటే. అందుకే కదా పేదింటి అమ్మాయిని కొడుక్కి దూరం చెయ్యడానికి మనకు పెద్ద మొత్తం ఇచ్చింది.." అంది ఆంటీ.


"అందుకే.. అందుకే మనం ఈ మర్డర్ ప్లాన్ ఆపేసి ఆ సందీప్ నే కిడ్నాప్ చేసి ఓ పది కోట్లు డిమాండ్ చేయొచ్చుగా?" తన ఐడియా బయట పెట్టాడు ప్రవీణ్.


"పది కోట్లు ఇవ్వడానికి ఆయనేం పిచ్చివాడు కాదు. ఓ పాతిక లక్షలు ఖర్చు పెట్టి మనల్నిద్దర్నీ లేపేస్తాడు. ఈ టైం లో కిడ్నాప్ జరిగితే అది మన పనే అని తెలిసిపోదా! తలతిక్క ఆలోచనలు మాని ఏం చెయ్యాలో ఆలోచించు" అంది జయా ఆంటీ.


"ఎంతైనా నీ తెలివి నీదే పెద్దమ్మా! " ఆమెను మెచ్చుకున్నాడు ప్రవీణ్.

***

కనకారావు తన వద్దకు వచ్చిన వ్యక్తులతో మందు కొడుతూ ఖుషీగా ఉన్నాడు.

అంతలో అతని ఫోన్ మోగింది.


'ఇదేమిటి? ఫోన్ పర్వీన్ దగ్గరకు పంపించాను కదా.. ఓహ్ అది సీక్రెట్ ఫోన్. ఇది మామూలు ఫోన్. ఎవరు చేశారబ్బా..' అనుకుంటూ చూసాడు. ఫుడ్ కోసం బయటకు వెళ్లిన అతని అనుచరుడు చేస్తున్నాడు.


కోపంతో ఫోన్ లిఫ్ట్ చేసి "ఫుడ్ నిదానంగా తెమ్మంటే నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దని అర్థం. ఇంకా నయం. మంచి రసపట్టులో ఉన్నప్పుడు చెయ్యలేదు" అన్నాడు కోపంగా.


"ఫోన్ కట్టయినట్లుగా పెట్టేసి బాత్ రూమ్ కి వెళ్లి, లేదా వేరే రూమ్ కి వెళ్లి కాల్ చెయ్యండి" చెప్పాడు ఆ అనుచరుడు.


"ఏం మాట్లాడుతున్నావ్?.." కోపంతో అరిచాడు కనకారావు. కాస్త ఆలస్యంగా వెలిగింది అతని బుర్ర. "ఏం మాట్లాడుతున్నావ్? ఏమీ వినపడ్డం లేదు. హలో.. హలో.." అంటూ ఫోన్ పెట్టేసాడు.


తరువాత ఉదయ్, కిషోర్ ల వైపు తిరిగి, "మీరు కానిస్తూ ఉండండి. నేనిప్పుడే వస్తాను.." అంటూ బయటకు వచ్చి తన అనుచరుడికి కాల్ చేసి, "ఇప్పుడు చెప్పు. ఏమిటి విషయం?" అని ఆతృతగా అడిగాడు.


"మీ కోసం వచ్చిన వాళ్ళల్లో ఒకతన్ని ఎప్పుడో పోలీస్ దుస్తుల్లో చూసినట్లు అనుమానంగా ఉంది" అన్నాడతను.


"అయితే ఏమిటి? ఎంత మంది పోలీసులు మనతో చేతులు కలపలేదు. వీళ్ళు కూడా మన ప్రాపు కోసం వచ్చారేమో.." ఇంకా మత్తు వదలక అన్నాడు కనకారావు.


"అలా అయితే ప్రెస్ వాళ్ళం అంటూ ఎందుకు రావడం? ఎందుకైనా మంచిది. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వ్యక్తి ఎదురుగా వస్తున్నాడు. నాకు తెలిసిన మనిషే! అతన్ని ఇంటికి పిలుచుకొని వస్తాను. అతనైతే వెంటనే కనిపెట్టేస్తాడు" చెప్పాడు అనుచరుడు.


"అందుకే నేను నిన్ను వదులుకోనిది. అలాగే పిలుచుకురా. ఒకవేళ వాళ్ళు నిజంగా పోలీసులే అయితే, ఒక పదిమందిని కత్తులు, కొడవళ్ళతో దాడి చెయ్యమని చెప్పు. నా మీద దాడి జరిగినట్లు, ఆ ప్రయత్నంలో వీళ్ళు చనిపోయినట్లు ఉండాలి. నెక్స్ట్ ఎలక్షన్ లకు సానుభూతి కూడా ఉంటుంది. కావాలంటే నేను కూడా కాసిని గాయాలు చేయించుకుంటానులే.." అన్నాడు కనకారావు.

క్షణాల్లోనే అతనిలోని రాక్షసుడు ఆలోచించడం మొదలు పెట్టాడు.


ఇంకా వుంది…


శ్రీవారి కట్టు కథలు ఎపిసోడ్ 17 త్వరలో…

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).

78 views0 comments

Comments


bottom of page