మురికి
- Karlapalem Hanumantha Rao

- 4 days ago
- 3 min read

Muriki - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao Published In manatelugukathalu.com On 18/03/2026
మురికి - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
“రైలులో ఒక పోలియో బాలుడిని ‘మురికి’ అని తిట్టిన వ్యక్తి… కొద్ది నిమిషాల తర్వాత చేసిన పని చూసి అక్కడ ఉన్నవాళ్లందరూ షాక్ అయ్యారు…” బయట కనిపించే మురికికంటే మనసులో ఉండే మురికి ఎంత ప్రమాదకరమో చెప్పే కర్లపాలెం హనుమంతరావు గారి అద్భుతమైన నీతి కథ. |
రైలు బోగీలో దుమ్ము రేగుతోంది. పాత చీపురు కట్టను చేతిలో పట్టుకుని, ఒక కాలు ఈడ్చుకుంటూ, పోలియో కుర్రాడు ఒకడు సీట్ల కింద ఉన్న చెత్తను శుభ్రం చేస్తున్నాడు. వాడు ప్రతి సీటు దగ్గరా ఆగి, ఆశగా ప్రయాణికుల వైపు చూస్తున్నాడు. జాలి పడ్డ దాతలు విసిరే చిల్లర బిళ్ళలే వాడి జీవనానికి ఆధారం.
కిటికీ పక్కన సూటు, బూటు ధరించి, దర్జాగా కూర్చున్న ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు ఆ కుర్రాడు. వాడు అడగకముందే, ఆ పెద్దమనిషి తన ఖరీదైన షూస్‌తో వాడి చేతిలోని చీపురును పక్కకు నెట్టేస్తూ... "ఛీ! వెధవ మురికి! ఎక్కడ చూసినా అడుక్కునేవాళ్ళే! ఒరేయ్... ఇలా అడుక్కు తిని చావకపోతే ఒళ్లు వంచి పని చేయొచ్చు కదా? నీలాంటి వాళ్ల వల్లే దేశం నాశనమైపోతోంది. ఛీ! పక్కకు పో!!" అని చీదరించాడు.
ఆ పిల్లాడు ఏమీ మాట్లాడలేదు, తన పని తాను చేసుకుంటూ పక్క బోగీ వైపు వెళ్ళిపోయాడు.
కాసేపటికి టికెట్ కలెక్టర్ (TC) బోగీలోకి వచ్చాడు. అందరి టికెట్లు చెక్ చేసుకుంటూ ఆ సూటు వేసుకున్న వ్యక్తి దగ్గరకు వచ్చాడు.
"సార్, మీ టికెట్?"
ఆ వ్యక్తి కోటు జేబులో చెయ్యి పెట్టాడు. పర్సు లేదు! టికెట్ కూడా చేతికి తగల్లేదు!
జరిగింది అర్థమైంది ఆ పెద్దమనిషికి. మాట తడబడింది. "అది... అది... పొరపాటున ఎక్కడో పడిపోయింది సార్" అని నసిగాడు కోటు శాల్తీ.
టీసీ గట్టిగా గదమాయించాడు, "డ్రామాలు వద్దు! టికెట్ లేకపోతే పెనాల్టీతో సహా రెండు వేల రూపాయలు కట్టాల్సిందే. లేదంటే వచ్చే స్టేషన్‌లో పోలీసులకు అప్పగిస్తాను" అని నిలదీశాడు.
నిజానికి వాడు పక్క బోగీలో ఒక ప్రయాణికుడి పర్సు కొట్టేసి, దొరలా ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ పర్సు సీటు కింద ఎక్కడో జారిపోయింది.
ఆ పోలియో కుర్రాడు అప్పటికి అక్కడే ఉన్నాడు. కోటు శాల్తీ వంక చూశాడు. టీసీ దగ్గరికొచ్చి "సార్, ఈయన నా చుట్టమే. పాపం టికెట్ పోయినట్లుంది. ఇదిగోండి పెనాల్టీ" అంటూ చిరిగిన చొక్కా జేబులో నుంచి ఓ పర్సు తీసి పెనాల్టీతో సహా టికెట్ డబ్బులు కట్టేశాడు. టీసీ పక్క బోగీలోకి వెళ్ళిపోయాడు.
కుర్రాడి జేబులోని పర్సు మీద సూటువాలా కన్నుపడింది.
ఏమాత్రం సిగ్గు లేకుండా, "అది నాదే కదరా! నాది నాకిచ్చేయ్!" అంటూ పర్సును లాక్కోబోయాడు కోటు మనిషి.
ఆ కుర్రాడు ఆ శాల్తీ వంక అదోలా చూసి అన్నాడు, "ఇంకా నాటకాలు మాన్లేదా, సామీ! ఇందులో ఐడి కార్డు ఉంది. ఆ కార్డు మీద ఫోటోలో ఉన్న ఆయన పక్క బోగీలో పర్సు పోయిందని ఏడుస్తూ వెతుక్కుంటున్నాడు. అయితే, ఇది తమరి పనేనన్నమాట! ఆయన సొమ్ము ఆయనకు ఇవ్వాలి... నేను పోతున్నా."
అప్పటి దాకా అంతా చూస్తున్న నాకు ఆశ్చర్యం అనిపించింది. "మరి ఈయన పర్సు కాదని తెలిసి కూడా, ఈయన పెనాల్టీ ఎందుకు కట్టావురా?" అని అడిగాను.
అప్పుడు ఆ కుర్రాడు ఇచ్చిన సమాధానం వెర్రి పోకడలు పోయే నేటి సమాజానికి నిజంగా చెంపపెట్టు!
"పెనాల్టీ కట్టింది ఈయన్ను కాపాడటానికి కాదు, సామీ! ఈయన వేసుకున్న ఈ 'సూటు-బూటు' గౌరవం కాపాడటానికి. 'దొరల్లా బయటికి కనపడే వాళ్ళంతా గుట్టుగా దొంగ పనులు చేసేవాళ్లే!' అని అందరూ నిందించకుండా ఉండటానికి. నాకు తెలుసు, నిజంగా కష్టపడి పైకొచ్చి సమాజానికి సేవ చేసేవాళ్ళు ఇంత మంది ఉన్నారు. అట్లాంటి మహానుభావుల మీద సమాజం నమ్మకం సడలకూడదనే ఈ పెద్ద మనిషి తప్పు నేను కాచింది."
వంటి మీద కనపించే మురికిని చూసి దూరం పెడతాం గానీ, నిజానికి మురికికీ మంచిబుద్ధికీ సంబంధమే లేదు!
-----
సమాప్తం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.




@karlapalem2010
•16 hours ago
మనసుకు హత్తుకునేలా చదివిన మేడమ్ గారికి ధన్యవాదాలు ❤