top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 10

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Love Challenge Episode 10' Telugu Web Series Written By


Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్





గత ఎపిసోడ్ లో…


శాన్వీ దగ్గర, జీవన్ సీక్రెట్ నెంబర్ అడిగి తీసుకుంటాడు విక్కీ. అతను పక్కకు వెళ్ళి కాల్ చేయడంతో శాన్వీ కి అనుమానం వస్తుంది. దీప్య పబ్ కి రావడానికి ఒప్పుకుంటుంది. పబ్ లో ఆమెను డ్రింక్స్ తీసుకోమని ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు చందూ. ఒప్పుకోదు దీప్య. ఆమె అడిగిన గ్రేప్ జ్యూస్ ఒక గ్లాసులో తీసుకొని వస్తాడు విక్కీ. సరిగ్గా ఆ సమయానికి రిత్విక్ పబ్ లోకి ఎంటర్ అవుతాడు.


ఇక చదవండి…

తనను ఆ యువకుడు ఆ గ్లాస్ లో ఏముందని ప్రశ్నించడంతో తడబడ్డాడు విక్కీ.


"ఆదా.. అది గ్రేప్ జ్యూస్" అంటూ ఆ గ్లాస్ వంక చూసి, "సారీ.. గ్లాస్ శుభ్రంగా లేదని అడుగుతున్నారా! ఇప్పుడే వేరే గ్లాస్ లో జ్యూస్ తెస్తాను" అంటూ అక్కడి నుంచి నైస్ గా ఆ గ్లాస్ తీయబోయాడు.


ఆ యువకుడు విక్కీ చేతిని బలంగా పట్టుకున్నాడు. మరో యువకుడు తన జేబులో నుంచి ఐడి కార్డ్ తీసి "మిస్టర్ విక్కీ! మేము టాస్క్ ఫోర్స్ నుండి వచ్చాం. ఈ గ్లాస్ లో ఉండే జ్యూస్ ని సీజ్ చేస్తున్నాం" అన్నాడు.

వాళ్లతో వచ్చిన యువతులు ఇద్దరూ తమ మొబైల్స్ ఆన్ చేసి, జరిగేది వీడియో గా చిత్రీకరిస్తున్నారు. తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి చూస్తున్నారని అర్థమయింది విక్కీకి. సమయానికి జీవన్ ఇక్కడ లేడు. అతనికి కాల్ చేసే సమయం, అవకాశం లేవు.

"ఈ పబ్ కీ నాకూ ఎలాంటి సంబంధం లేదు” అంటూ బుకాయించడానికి ప్రయత్నించాడు విక్కీ. ఇంతలో బయటినుండి దాదాపు ఇరవై మంది పోలీసులు లోపలికి ఎంటర్ అయ్యారు. లోకల్ ఎస్ ఐ, విక్కీని అదుపులోకి తీసుకున్నాడు.

"ఈ పబ్ నాది కాదు. మా మామయ్య ది. అది కూడా వేరే వాళ్లకు లీజ్ కి ఇచ్చాము" అంటూ వాదిస్తున్నాడు విక్కీ.

"నిన్ను అడిగే కదా.. మా వాళ్లు లోపలికి ఎంటర్ అయింది? అంటే అజమాయిషీ నీదే కదా!" అన్నాడు ఎస్సై.

జరుగుతున్న తతంగాన్ని స్టూడెంట్స్ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కొంతమంది మెల్లిగా బయటకు జారుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.


అది గమనించిన ఎస్ఐ, "ఎవ్వరూ బయటకు వెళ్ళకండి. ఈ జ్యూస్ లో మత్తు కలిగించే పదార్థాలు కలిపినట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ గ్లాస్ లోని జ్యూస్ ను మీ అందరి ముందే సీజ్ చేస్తున్నాం. వీడియో కూడా చిత్రీకరిస్తున్నాం. అవసరమైనప్పుడు మీరందరూ కోర్టుకు వచ్చి ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంటుంది" అన్నాడు.

టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆ గ్లాసులో ఉన్న జ్యూస్ ను వాళ్ళు తెచ్చిన కంటైనర్ లో పోసి, అందరి ముందు సీల్ వేశారు.

అప్పుడు రిత్విక్ కల్పించుకుంటూ, "సార్! వీళ్ళంతా కాలేజ్ స్టూడెంట్స్. మీరు వీళ్ళ అడ్రస్ లు, ఫోన్ నెంబర్లు తీసుకొని వదిలేయండి. వీళ్ళు ఏ నేరమూ చేయలేదు. మీకు అవసరమైనప్పుడు కోర్టుకు తీసుకు వచ్చి సాక్ష్యం చెప్పించే బాధ్యత నాది. నా పేరు రిత్విక్. ఈ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ ని" అని చెప్పాడు.

ఎస్సై రిత్విక్ వంక చూస్తూ "నాకు మీ గురించి, మీ నాన్నగారి గురించి కూడా తెలుసు. మీరు చెప్పినట్లే వివరాలు తీసుకొని, వీళ్ళందర్నీ పంపించేస్తాను" అన్నాడు.

రిత్విక్ తన ఫ్రెండ్స్ తో " కాసేపట్లో ప్రెస్ వాళ్ళు వస్తారేమో! ముందుగా అమ్మాయిలను పంపించేద్దాం" అన్నాడు. అబ్బాయిలు అందరూ పక్కకు జరిగారు.

దాంతో శాన్వీ, దీప్యలతో సహా అమ్మాయిలందరూ ఎస్సై దగ్గరకు వచ్చి, తమ అడ్రస్, ఫోన్ నంబర్, ఇతర వివరాలు ఇచ్చేసి వెళ్లారు. ఆ తర్వాత అబ్బాయిలు కూడా ఒక్కొక్కరుగా తమ వివరాలు ఇస్తున్నారు.

ఇంతలో ఆ పబ్ ఎదుట పెద్ద కోలాహలం..


వందలాది మంది ఆ పబ్ ని చుట్టు ముడుతున్నట్లు అర్థమైంది.


బయట కాపలాగా ఉన్న పోలీసుల్ని నెట్టుకుంటూ జీవన్ లోపలికి వచ్చాడు. అతనితో పాటు, అతని తండ్రి తాలూకు గూండాలు నలుగురైదుగురు లోపలికి వచ్చారు.

జీవన్ నేరుగా ఎస్ఐ దగ్గరకు వచ్చి, "ఏం చేస్తున్నారు మీరు? ఏ ఆధారంతో మా ఫ్రెండ్ విక్కీని అదుపులోకి తీసుకున్నారు? ఈ పబ్ ఎవరిదో మీకు తెలుసా..

తెలీకుండా, తన స్నేహితులని కలుసుకోవడానికి వచ్చిన విక్కీని షాపు ఓనర్ గా మీకు మీరే ఊహించేసుకొని తీసుకు వెళ్తారా? ఏమనుకుంటున్నారు మా గురించి" అంటూ దబాయించి అడిగాడు.

ఎస్సై మొదట కాస్త తగ్గినా, తరువాత తమాయించుకుని, "చూడండి సార్! మా పై ఆఫీసర్ల ఆదేశాలు మేము పాటిస్తున్నాము. మీకేమైనా వివరాలు కావలసి ఉంటే మా ఎస్పీ గారిని అడిగి తెలుసుకోండి. దయచేసి మా విధులకు ఆటంకం కలిగించవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను" అన్నాడు.

జీవన్ రిత్విక్ వంక చూస్తూ "ఏం జరుగుతోంది ఇక్కడ? అసలు నువ్వు ఎందుకు వచ్చావు.. ఒకవేళ నీకు చందూ మీద అనుమానం కలిగి పోలీసులకు కంప్లైంట్ చేశావా?" అని అడిగాడు.

“దీప్య కాసేపు పబ్ లో ఉంటానంటే సరేనని నేను ఇంటికి వెళ్ళిపోయాను. కానీ నన్ను 'అన్నయ్యా' అని పిలిచే దీప్యకి తోడు లేకుండా వెళ్లిపోవడం నా మనసుకు నచ్చలేదు. అందుకే వెంటనే తిరిగి వచ్చాను. నేను వచ్చేసరికి ఆ యువకుడు ఆ గ్లాసులో ఏముందని విక్కీని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అయినా ఇందులో టెన్షన్ పడాల్సిన విషయం ఏముంది? అది కేవలం గ్రేప్ జ్యూస్ అనీ, అందులో ఏమీ కలపలేదని కెమికల్ అనాలసిస్ లో తెలిసిపోతుంది కదా" అన్నాడు రిత్విక్.

"నీకు తెలీదు రిత్విక్. ఇదేదో పెద్ద కుట్ర లాగా ఉంది. వీళ్లు తలచుకుంటే ఆ జ్యూస్ లో సైనైడ్ ఉందని చెప్పగలరు" అన్నాడు జీవన్ ఆవేశంగా.

ఎస్సై జోక్యం చేసుకుంటూ "మన సిటీ పోలీసులు ఎంత సిన్సియర్ గా పని చేస్తారో మీకు తెలియనిది కాదు. ప్లీజ్.. విక్కీని విచారించనివ్వండి" అన్నాడు.

జీవన్ ఆవేశంగా ఏదో మాట్లాడబోతూ ఉండగా అతని ఫోన్ మోగింది.


అతని తండ్రి గురుమూర్తి కాల్ చేస్తున్నాడు.

"ఒక్క నిమిషం.." అంటూ ఆ ఫోన్ తీసుకొని పబ్ బయటికి వచ్చాడు జీవన్.

అటునుండి గురుమూర్తి మాట్లాడుతూ “వాళ్లు పక్కా ఆధారాలతో వచ్చారు. మత్తు మందును విక్కీకి అందజేసిన వ్యక్తిని ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు. అతనికి, విక్కీకి మధ్య నడిచిన ఫోన్ సంభాషణ ట్రేస్ చేశారు. ఇప్పటివరకూ జరుగుతున్న విషయాల్లో నీ ప్రమేయం లేదు. కానీ నువ్వు మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే నీ గురించి కూడా ఆరాలు తీస్తారు. వెంటనే అక్కడి నుంచి వచ్చెయ్యి. నేను ఎస్సై తో మాట్లాడతాను" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.

జీవన్ తిరిగి పబ్ లోకి ఎంటర్ అయ్యే సరికి ఎస్సై, గురుమూర్తి తో మాట్లాడడం పూర్తయింది. ఆయన జీవన్ వంక తిరిగి "నాన్న గారితో మాట్లాడాను సార్! మాకు కో ఆపరేట్ చేస్తామన్నారు. అవసరమైతే మీ హెల్ప్ కూడా తీసుకోమన్నారు" అని చెప్పాడు.

అప్పటికే ప్రెస్ వాళ్ళు అక్కడికి చేరుకోవడం గమనించాడు జీవన్.

" తప్పు చేసింది నా ప్రాణ స్నేహితుడైనా, దగ్గరి బంధువైనా అతనికి శిక్ష పడాల్సిందే. మీ విధులు మీరు నిర్వహించండి. అదే సమయంలో అన్యాయంగా అమాయకులను నిర్బంధిస్తే స్టూడెంట్స్ ఆగ్రహానికి గురికావలసి ఉంటుంది" అంటూ స్పీచ్ ఇచ్చాడు.

తరువాత విక్కీ, చందూలతో "ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అంతా నేను చూసుకుంటాను. భయంతో ఒకరి మీద ఒకరు చెప్పుకోకండి. అందరూ చిక్కుల్లో పడతారు" అని చెప్పాడు జీవన్.

తన పేరు బయట పెట్టొద్దంటూ అతను హెచ్చరించినట్లుగా అర్థమైంది వాళ్ళకి.

పోలీసులు విక్కీని ఆ కాంపౌండ్ వాల్ వెనకవైపు గోడ దగ్గరికి తీసుకుని వెళ్లారు.

అక్కడ గోడ ఎందుకు పడిపోయి ఉందని ప్రశ్నించారు.

"ఈ మధ్య వర్షాలకు గోడ లో కొంత భాగం కూలింది. మనుషులు దొరక్కపోవడంతో ఆ గోడను రిపేర్ చేయడం ఆలస్యమవుతోంది" ఆని పోలీసులకు చెప్పాడు విక్కీ.

అతను చెప్పిన మాటలను వాళ్లు రికార్డు చేసుకున్నారు. ఎస్సై మరి కొందరు పోలీసులతో ఆ గోడను దాటి పక్కనే ఉన్న అపార్ట్ మెంట్ లోకి ఎంటర్ అయ్యాడు.

అక్కడ ఉన్న వాచ్ మెన్ ని పిలిచి "ఎవరున్నారు ఇక్కడ?" అని అడిగాడు.

"ఓనర్స్ ఎవరూ ఇక్కడ ఉండడం లేదయ్యా" అని చెప్పాడు వాచ్ మెన్.

"సరే! కీస్ తీసుకొని రా. చూద్దాం" అన్నాడు ఎస్సై

"నా దగ్గర ఎందుకుంటాయి?" అన్నాడు వాచ్ మెన్.

"నువ్వెక్కడ ఉంటున్నావ్?" ప్రశ్నించాడు ఎస్సై.

“అవుట్ హౌస్ లో ఉంటున్నాను” అంటూ చూపించాడు వాచ్ మెన్.

నేరుగా అక్కడికి వెళ్ళాడు ఎస్సై. తలుపు పక్కనే ఉన్న హాంగర్ కి నాలుగు అపార్ట్మెంట్ ల కీస్ తగిలించి వున్నాయి. అప్పుడు ఎస్సై చూసిన చూపుకి అతను గడగడా వణికి పోయాడు.

"రెంట్ కు చేరడానికి ఎవరైనా వస్తే చూపించమని నిన్ననే కీస్ ఇచ్చి వెళ్లారు. ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను సార్" నీళ్లు నములుతూ అన్నాడు వాచ్ మెన్.

"సరే! ఆ కీస్ తీసుకుని పైకి రా" అన్నాడు ఎస్సై.

వాచ్మెన్ చేత ఆ అపార్ట్మెంట్ల తలుపులు తెరిపించాడు. ఒక అపార్ట్మెంట్ లో బెడ్ రూమ్ లో సీసీ కెమెరాలు అరేంజ్ చేసి ఉండటం ఎస్సై గమనించాడు.

పోలీసులు ఎంగేజ్ చేసుకున్న వీడియో గ్రాఫర్ ఈ తతంగమంతా చిత్రీకరించాడు.

విక్కీతో పాటు వాచ్ మెన్ ని కూడా స్టేషన్ కి తీసుకొని వెళ్ళమని కానిస్టేబుల్స్ తో చెప్పాడు ఎస్సై.

తరువాత పబ్ కి తిరిగి వచ్చాడు.

రిత్విక్, జీవన్ లు స్టూడెంట్స్ ని ఇళ్లకు పంపించడానికి అంగీకరించినందుకు ఎస్సై కి కృతజ్ఞతలు చెప్పుకున్నారు.


వాళ్ళు కూడా వెళ్ళాక, పబ్ ను సీజ్ చేశారు పోలీసులు.

***

ఇంటికి వెళ్లిన జీవన్ నేరుగా తండ్రి వద్దకు వెళ్ళాడు.


"నాన్నా! ఈ రోజేం బాగా లేదు. ఒకటి తలిస్తే మరొకటి జరిగింది" అన్నాడు ముఖం విషాదంగా పెట్టి.

"నువ్వు ప్లాన్ చేసిందేమిటని నిన్ను నేను అడగను. కానీ ఈ రోజు నీకు బాగా కలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను" అన్నాడు గురుమూర్తి .


విషయం చెప్పడం ప్రారంభించాడు జీవన్.

"నీ దగ్గర దాపరికం ఎందుకు నాన్నా! జరిగింది చెబుతాను. మా కాలేజీలో కొత్తగా ఆద్య ఆని ఒక అమ్మాయి చేరింది. తను చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు. మా ఎం డీ రాఘవేంద్ర గారి అమ్మాయి. అయన గురించి నీకు తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి చేరిన రోజే ఆ రిత్విక్ ని పలకరించడంతో నాకు కోపం వచ్చింది.

రిత్విక్ స్నేహితుడి చెల్లెలు దీప్య అనే అమ్మాయి కూడా కొత్తగా కాలేజీలో చేరింది.

ఆ దీప్య ద్వారా వీళ్ళిద్దరూ క్లోజ్ అవుతారనిపించింది.


దీప్యను పబ్ కి తీసుకొని వెళ్లి, చందూ గాడితో క్లోజ్ గా కొన్ని ఫోటోలు తీయిస్తే, ఇక ఆ అమ్మాయి నా గ్రిప్ లోకి వస్తుంది.

'ఆ అమ్మాయి ద్వారా ఆద్యకు దగ్గర కావచ్చు' ఆని ప్లాన్ చేశాను.

నేను కూడా నీ లాగే పక్కా కమర్షియల్. ప్రేమ దోమ లాంటి సెంటిమెంట్ లు ఉండవు. ఆ విషయం నీక్కూడా తెలుసు.

కానీ ఆద్య విషయంలో అలా కాదు. ఆమె కోసం ఏమైనా చేసేస్తాననిపిస్తోంది.

మొదటిసారి.. మొదటి చూపులోనే నన్ను ఆకర్షించింది.


ఆ రిత్విక్ గాడికి దగ్గర అవుతుందేమోనని భయంగా ఉంది.

అందుకే దీప్యను ట్రాప్ చెయ్యడానికి విక్కీ సహాయం అడిగాను.

అతను టెంపరరీ గా మత్తును కలిగించే ఒక పౌడర్ ని తెప్పించాడు.


దాన్ని జ్యూస్ లో కలిపి దీప్యకు ఇచ్చాడు.

సరిగ్గా ఆ సమయంలో రిత్విక్ రావడం, మఫ్టీ లో వచ్చిన టాస్క్ ఫోర్స్ వాళ్ళు విక్కీని అరెస్ట్ చెయ్యడం జరిగింది. ఈ పని చేసేముందు నీ సలహా తీసికొని వుంటే బాగుండేది"

జరిగినదంతా తండ్రికి వివరించాడు జీవన్.

అంతా విన్నాక "ప్రతి విషయాన్నీ మనకు అనుకూలంగా మలచుకోవడమే రాజకీయ నాయకుడికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. ఈ సిచుయేషన్ మనకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో అలోచించి చెప్పు" అన్నాడు గురుమూర్తి, కొడుకు ముఖంలోకి చూస్తూ.

కాస్త ఆలోచించాడు జీవన్.

"విక్కీని వదిలిపెట్టాలని స్టూడెంట్స్ చేత గొడవ చేయిస్తాను" అన్నాడు.

"ఆలా చేస్తే నువ్వు విలన్ అయిపోతావు. అమ్మాయిలకు మత్తు ఇచ్చి లొంగదీసుకొనే వాళ్లకు వత్తాసు పలికిన వాడివవుతావు. జనాల్లో నీ పట్ల వ్యతిరేకత వస్తుంది" అన్నాడు గురుమూర్తి.

"మరేం చెయ్యమంటారు?" అర్థం కాక తండ్రినే అడిగాడు జీవన్.

"ఆ రిత్విక్ నే విలన్ గా చూపించాలి" అన్నాడు గురుమూర్తి.

అర్థం కానట్లు చూసాడు జీవన్.

"ఈ రోజు మనకున్న ప్లస్ పాయింట్ నువ్వు పబ్ కి అటెండ్ కాలేదు.

ఆ రిత్విక్ అటెండ్ అయ్యాడు.

కాబట్టి ఇదంతా ఆ రిత్విక్ చేయించినట్లు ప్రచారం చేయాలి" చెప్పాడు గురుమూర్తి.

"ఎలా? కొంతే అర్థమైంది నాకు" అన్నాడు జీవన్.

"మిగతాది ఓ అరగంటాగి టివి లో చూడు" అన్నాడు గురుమూర్తి.

వెంటనే తాను బినామీ పేరుతో నడుపుతున్న బాకా టివి ఛానల్ ఎం. డీ. కి కాల్ చేసాడు.

"సంచలన వార్త చెబుతున్నాను.


ఈ రోజు విక్కీ వాళ్ళ పబ్ లో ఒక అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడానికి కుట్ర జరిగింది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త చక్రధరం గారి అబ్బాయి ఆ సమయంలో అక్కడే ఉన్నాడు.

ఈ ప్లాన్ లో అతని హస్తం ఉన్నట్లు కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

నిజానిజాలు త్వరలో బయటికి వస్తాయి'

ఈ న్యూస్ స్క్రోలింగ్ లో పదే పదే రావాలి.

జస్ట్ స్కెచ్ నేను ఇచ్చాను.

న్యూస్ ఎలా హై లైట్ చెయ్యాలో మీ టీం తో అలోచించి ప్లాన్ చెయ్యి. అరగంటలో స్క్రోలింగ్ రావాలి. మిస్ చెయ్యొద్దు.

రేపటికి మా అబ్బాయి మీద ఆరోపణలు రావచ్చు.

కాబట్టి మనం ఈ రోజే మొదలు పెడితే మనదే పై చేయి అవుతుంది.

వాళ్ళు ఏమీ సమాధానం చెప్పలేక మనమీద చెప్పారని జనాలు అనుకుంటారు.

రేపటివరకు ఆ చక్రధారానికి ఫోన్ లో దొరకవద్దు" చెప్పాడు గురుమూర్తి.

సోఫాలోంచి లేచి తండ్రి కాళ్లకు నమస్కరించాడు జీవన్.


"అప్పుడే ఇదైపోకు. టివిలో స్క్రోలింగ్స్ చూడు. మనవాళ్ళు ఎలా దుమ్ము రేపుతారో.." అన్నాడు గురుమూర్తి కొడుకుని దగ్గరకు తీసుకొంటూ.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


42 views0 comments
bottom of page