top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 11

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Love Challenge Episode 11' Telugu Web Series Written By


Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్




గత ఎపిసోడ్ లో…

విక్కీ తెచ్చిన జ్యూస్ దీప్య తాగబోతుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు అడ్డుపడి, ఆ జ్యూస్ లో మత్తు మందు ఉందని చెబుతారు.

విక్కీని అదుపులోకి తీసుకుంటారు.

జరిగిన సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకోవాలంటాడు గురుమూర్తి. తన బాకా ఛానల్ లో రిత్విక్ గురించి స్క్రోలింగ్ వేయిస్తాడు..

ఇక చదవండి…

పబ్ నుండి నేరుగా ఇంటికి వచ్చాడు రిత్విక్.

అతను వచ్చేటప్పటికి చక్రధరం హాల్లో కూర్చొని టివి చూస్తున్నాడు.

తండ్రి పక్కనే కూర్చున్నాడు రిత్విక్.

అతనేదో చెప్పాలని అనుకుంటున్నాడని గ్రహించి, టివి మ్యూట్ చేశాడు చక్రధరం.

"నాన్నగారూ! ఈ రోజు మా కాలేజీలో కొత్తగా చేరిన ఒక అమ్మాయిని పబ్ కి తీసుకొని వెళ్లి, మత్తుమందు ఇవ్వాలని చూశారు. ఇది చేయించింది జీవన్ అని నాకు తెలిసింది. ఆ పబ్ ఓనర్ విక్కీని పోలీసులు విచారిస్తున్నారు" బాధగా చెప్పాడు రిత్విక్.

"నాక్కూడా కొంత తెలిసింది.

నువ్వు ఎసిపి గారిని స్వయంగా కలిసి పబ్ కి పోలీసుల్ని పంపమని కోరావట కదా.

మంచిపని చేశావు.


రెడ్ హ్యాండెడ్ గా దొరక్కపోతే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు. ఇప్పటికే ఎంతమంది అమ్మాయిలు వాళ్ళవల్ల బ్లాక్ మెయిల్ చెయ్యబడ్డారో..


స్వంత నిర్ణయం.. సాహసవంతమైన నిర్ణయం.. సరైన సమయంలో తీసుకున్నావ్.


సరిగ్గా జరిగేలా దగ్గరుండి చూసుకున్నావు. నీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి"

కొడుకుని మనస్ఫూర్తిగా అభినందించాడు చక్రధరం.

"ఆ అమ్మాయి దీప్య మా చిన్నప్పటి మాస్టారు రామనాథం గారి అమ్మాయి. మాస్టారుగారి అబ్బాయి జనార్దన్ నాకు బాగా తెలుసు. దీప్య నన్ను ‘అన్నయ్యా’ అని పిలుస్తుంది.

అనవసరంగా ఆ అమ్మాయిని ట్రాప్ చెయ్యాలని చూశారు." అన్నాడు రిత్విక్.

"మీ కాలేజ్ ఎండి గారి అమ్మాయి మీ కాలేజిలోనే చేరిందటగా" హఠాత్తుగా అడిగాడు చక్రధరం.

"అవును నాన్నగారూ! ఆ అమ్మాయి పేరు ఆద్య.


చాలా మంచి అమ్మాయి. నిన్ననే కాలేజీలో చేరింది. చేరిన వెంటనే అందరు లెక్చరర్స్ నీ సమావేశ పరిచి, తనను మామూలు స్టూడెంట్ లాగే చూడమని కోరింది. కేవలం అందం మాత్రమే కాకుండా చక్కటి వ్యక్తిత్వం కూడా ఉన్న అమ్మాయి ఆద్య” అన్నాడు రిత్విక్.

ఇంతలో చక్రధరం గారి ఫోన్ మోగింది.

అయన పీ. ఏ. కాల్ చేస్తున్నాడు.


అయన మాట్లాడుకోవడానికి వీలుగా పక్కకు వెళ్ళబోతున్న రిత్విక్ ని అక్కడే ఉండమని సైగ చేసి, ఫోన్ లిఫ్ట్ చేశాడాయన.


"సర్! చిన్నబాబు గారి గురించి ఆ గురునాథం వాళ్ళ బాకా ఛానల్ లో బ్యాడ్ గా స్క్రోలింగ్ ఇస్తున్నారట" చెప్పాడు చక్రధరం గారి పీ. ఏ.

"సరే! ఫోన్ పెట్టెయ్. మళ్ళీ చేస్తాను" అన్నాడు చక్రధరం.


వెంటనే టివిలో సౌండ్ పెట్టి బాకా ఛానల్ కు మార్చాడు.

టివిలో రిత్విక్ గురించి బ్రేకింగ్ న్యూస్ స్క్రోలింగ్ వస్తోంది.

పబ్ లో కాలేజ్ అమ్మాయిని ట్రాప్ చెయ్యడానికి ప్లాన్..

ఆ స్పాట్ లో ఉన్న చక్రధరం గారి అబ్బాయి..

అతనే చేసి ఉంటాడని గుసగుసలు..

నిజాలు త్వరలో..

మద్యం తాగుతూ, ఒక యువతి పైట లాగుతున్న ఒక విలన్ ను పోలిన కార్టూన్ బొమ్మ.

ఆ బొమ్మ తల స్థానంలో క్వశ్చన్ మార్క్..

పదేపదే ఇవే చూపిస్తున్నారు.

టివి ఆఫ్ చేసి బాకా ఛానల్ ఎండికి కాల్ చేశాడు చక్రధరం.

ఆయన ఊహించినట్లుగానే అతను కాల్ లిఫ్ట్ చెయ్యలేదు.

మరికొన్ని నంబర్లు ట్రై చేశాడు.

రెస్పాన్స్ లేదు.

వేరే నంబర్ నుండి చేసినా ఎవరూ తియ్యలేదు.

ఆవేశంతో పైకి లేచాడాయన.

తండ్రి అంత కోపంగా ఉండటం ఎప్పుడూ చూడలేదు రిత్విక్.

తండ్రి భుజం మీద చేయి వేసి తిరిగి సోఫాలో కూర్చోబెట్టాడు.

"నాన్నగారూ! ఈ సమస్యను నేనే సాల్వ్ చేస్తాను. మీ దాకా వద్దు" అని చెప్పి వెంటనే ఏ సి పి ప్రతాప్ కి కాల్ చేశాడు రిత్విక్..


ఫోన్ అందుకున్న ప్రతాప్ "రిత్విక్ గారూ! నేను కూడా ఆ స్క్రోలింగ్ చూశాను. ఇప్పుడే వాళ్లకు కాల్ చేస్తాను." అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.


వెంటనే ఆయన గురుమూర్తి కి కాల్ చేశాడు.


"నమస్తే ఏసీపీ గారూ! ఆ పబ్ విషయంలో మీ వాళ్ళు విక్కీ అనే అతన్ని తీసుకొని వెళ్లారు. అతను మా మనిషే అయినా అతని తప్పు ఉండడంతో నేను జోక్యం చేసుకోలేదు. మా అబ్బాయి తో కూడా అదే విషయం చెప్పాను" అన్నాడు.

ఏసీపీ ప్రతాప్ మాట్లాడుతూ "రిత్విక్ స్వయంగా నన్ను కలిసి పబ్ లో ఏదో కుట్ర జరగబోతోందనీ, వెంటనే టాస్క్ ఫోర్స్ ని పంపమనీ కోరాడు. నేను వెంటనే ఎస్ పి కి కాల్ చేసి తగిన ఏర్పాట్లు చేయమని చెప్పాను. వీటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. వాటిని కొద్దిసేపట్లో ప్రెస్ కి విడుదల చేయబోతున్నాం. వాస్తవాలు, వాటికి సంబంధించిన ఆధారాలు ఇంత బలంగా ఉంటే మీరు చేసే దుష్ప్రచారం వల్ల మీరు, మీ ఛానల్ నష్టపోతారు. మరో గంటలో అన్ని చానల్స్ లో వాస్తవాలు వస్తాయి. మీరు వెంటనే స్క్రోలింగ్ ఆపి, తప్పు సవరించకపోతే మీకు, మీ ఛానల్ కు చెడ్డ పేరు వస్తుంది" అన్నాడు.

గురుమూర్తి మాట్లాడుతూ "మా చానల్ వాళ్లు తప్పుగా ఏమీ ప్రచారం చేయలేదు. కేవలం ప్రజలు ఏమనుకుంటున్నారో అదే విషయాన్ని తెలిపాము. కానీ నిజం ఇప్పుడే మీరు చెప్పారు కాబట్టి, ఆ స్క్రోలింగ్ మార్చి వేస్తాము. వీలైతే సవరించిన వార్తలు కూడా ప్రసారం చేస్తాము.


నాది ఒక చిన్న రిక్వెస్ట్. జరిగిన విషయం లో మా అబ్బాయి జీవన్ తప్పేమీ లేదు. విక్కీ మా అబ్బాయికి స్నేహితుడు కాబట్టి మా అబ్బాయిని ఈ వివాదంలోకి లాగుతారేమో అనే భయంతో మేము ఆ అబ్బాయి రిత్విక్ పేరును బయటకు వచ్చేలా చేశాము. మేము సవరణ వార్తను ప్రసారం చేస్తాము. మీరు దయచేసి మా అబ్బాయి జీవన్ ని ఈ కేసులోకి తీసుకొని రాకండి. ఇదే విషయం ఆ చక్రధరం గారికి కూడా చెప్పండి" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు గురుమూర్తి.

ఏసీపీ ప్రతాప్ వెంటనే రిత్విక్ కి కాల్ చేసి, "మరో నాలుగైదు నిమిషాల్లో ఆ స్క్రోలింగ్స్ ఆగిపోతాయి. సవరణ కూడా వేస్తారట. మీరు నిశ్చింతగా ఉండండి. నేను కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టి, పత్రికా విలేఖరులను, న్యూస్ ఛానల్స్ వాళ్లనూ సమావేశ పరుస్తున్నాను. జరిగిన విషయాలు, అందుకు సంబంధించిన రుజువులు అన్నీ వాళ్లకు అందజేస్తాను." అని చెప్పాడు.

ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, తరువాత తండ్రి వంక తిరిగి, "ప్రాబ్లం సాల్వ్ అయింది నాన్నగారూ! మరి కాసేపట్లోనే ఆ స్క్రోలింగ్స్ ఆగిపోతాయి" అని చెప్పాడు రిత్విక్.

"వెల్డన్" అని అభినందించాడు చక్రధరం.

కానీ ఆయన ముఖంలో కోపం తాలూకు ఛాయలు ఇంకా తొలగి పోకపోవడంతో "నాన్నగారూ! మీరు ఇంకా నార్మల్ కాలేదు. మరేదైనా సమస్య ఉందా? చెప్పండి ప్లీజ్.." అని అడిగాడు.

చక్రధరం మాట్లాడుతూ " మీ కాలేజీలో కొత్తగా చేరిన ఆద్య అనే ఆ అమ్మాయి విషయం గా నీకు జీవన్ కు ఏవైనా మనస్పర్థలు వచ్చాయా?" అని అడిగాడు.

"నాన్నగారూ! ఆ అమ్మాయి ఆద్య నిన్ననే కాలేజీలో చేరింది. అనుకోకుండా నాకు పరిచయం అయింది. దీప్య ఆ అమ్మాయికి కొద్దిసేపట్లోనే మంచి ఫ్రెండ్ అయిపోయింది. దీప్య మా ఇద్దరి మధ్య వారధిగా నిలుస్తుందని జీవన్ కు అనుమానం వచ్చింది. ఆమెను ట్రాప్ చేసి, ఆమె ద్వారా ఆద్యకు క్లోజ్ కావాలని ప్లాన్ వేశాడు.


ఈ విషయాలన్నీ అతని స్నేహితురాలు శాన్వీ ద్వారా నాకు తెలిశాయి. అందుకే జాగ్రత్త పడి దీప్య, వాళ్ళ ట్రాప్ లో పడకుండా కాపాడ గలిగాను" అని చెప్పాడు రిత్విక్.

చక్రధరం మాట్లాడుతూ "మారుతున్న రాజకీయ పరిస్థితులూ.. యువతను రాజకీయ రంగంలోకి దించడానికి జరుగుతున్న ప్రయత్నాలూ.. వీటి గురించి నీకు ఇదివరకే చెప్పాను. న్యూస్ ఛానల్ లో నీ గురించి స్క్రోలింగ్ వేయించడం అంటే ఆ గురుమూర్తి ఉద్దేశం అర్థమవుతోంది. తన కొడుకును పాలిటిక్స్ లోకి తీసుకురావాలని అతను నిశ్చయించుకున్నాడు.

సహజంగానే అతనికి నువ్వు పోటీ అవుతావని భావించాడు. నీకు బాడ్ ఇమేజ్ తెప్పించడానికి టీవీలో స్క్రోలింగ్ వేయించాడు. నిజానికి నీ రాజకీయ ప్రవేశం గురించి నేను ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ముందుగా నీ చదువు పూర్తి కావాలని, ఆ తర్వాతే ఏ విషయమైనా ఆలోచించాలని అనుకున్నాను.


కానీ శత్రువు మనల్ని బలవంతంగా బరిలోకి లాగుతున్నాడు. రెచ్చ గొడుతున్నాడు. కాబట్టి నేను కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరం వస్తోంది. ఈ చక్రధరం అంటే ఏమిటో ఆ గురుమూర్తి కి తెలియజేయాలి" అన్నాడు.

చక్రధరం గారి ఫోన్ మరోసారి మోగింది.

ఈసారి కూడా అయన పిఎ కాల్ చేస్తున్నాడు.

"చెప్పండి. మళ్ళీ ఏమిటి?" అన్నారాయన.


"సర్! బాకా ఛానల్ లో ఇప్పుడు స్క్రోలింగ్ మార్చేశారు. మనకు అనుకూలంగా వేస్తున్నారు" అన్నాడు పిఎ ఆనందంతో.

చిన్నగా నవ్వాడు చక్రధరం.

"అలాగా! ఇప్పుడే చూస్తాను. అన్నట్లు మరి కాస్సేపు వెయిట్ చెయ్యి. అన్ని ఛానల్స్ లోనూ వస్తుంది"అంటూ టీవీ ఆన్ చేసి బాకా ఛానల్ పెట్టాడాయన.

టివిలో న్యూస్ ఇలా వస్తోంది...

ఒక టీనేజ్ అమ్మాయిని ఒక పబ్ లో ట్రాప్ చెయ్యడానికి కుట్ర జరిగింది..

అంతే కాదు.. ఆ నేరం విద్యార్ధి నాయకుడు, చక్రధరం గారి అబ్బాయి రిత్విక్ మీద వెయ్యడానికి స్కెచ్ వేశారు…

అతనే ఇందులో పాత్రధారి అని మాకు అజ్ఞాత వ్యక్తులు ఫోన్ చేశారు..

కానీ నిజాలు నిర్ధారించుకొని గానీ ప్రసారం చెయ్యని మేము,

నిజాలు త్వరలో.. అని వేశాము గానీ నిరాధార ఆరోపణలు ప్రసారం చెయ్యలేదు.

మా పరిశోధనలో ఆ కుట్రను భగ్నం చేసింది ఇతనేనని తెలిసింది..

ఈ విషయం పై యువజన నాయకుడు, మన ప్రియతమ ఎంపీ గురుమూర్తిగారి కుమారుడు, సిటీ యూత్ ఐకాన్ జీవన్ గారు స్పందిస్తూ, తన స్నేహితుడిపై ఆరోపణలు చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అసలైన నేరస్థులను వీలయినంత త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరారు.

ఇదే వార్తను పదే పదే ప్రసారం చెయ్యడం మొదలు పెట్టారు.

న్యూస్ చూస్తున్న రిత్విక్, "కింద పడ్డా నాదే పైచేయి అనే వాళ్లంటే వీళ్ళేనేమో.. అన్నాడు.

"అందితే జుట్టు, అందక పోతే కాళ్ళు అనే రకం కూడా వీళ్ళే! ఏమైనా ఒకసారి నేను నేరుగా గురుమూర్తిని కలిసి, మన జోలికి రావద్దని గట్టిగా హెచ్చరించాలనుకుంటున్నాను. నా కెపాసిటీ తెలిసి కూడా నీ జోలికి వచ్చారు వాళ్ళు" అన్నాడు చక్రధరం.

శాన్వీ ఉంటున్న ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్ దగ్గరికి వచ్చాడు జీవన్.

అతనితో పాటు చందూ, విక్కీ తమ్ముడు నటరాజ్, మోటూ, ఇంకో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు.

ఆ వాచ్ మాన్ గతంలో ఒకసారి 'మగవాళ్ళను లోపలికి రానివ్వం' అని జీవన్ ని అడ్డగించి, చావు దెబ్బలు తిని ఉన్నాడు.

అప్పటినుండి, జీవన్ వస్తూ వుంటే, బీడీ కాల్చుకోవడానికి వెళ్లినట్లుగా పక్కకు వెళ్తాడు.

తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే.

ఆ హాస్టల్ లో ఉన్న ఇతర అమ్మాయిలు కూడా అతను తమ జోలికి రాకపోతే చాలనుకుంటూ ఉంటారు. ఎవ్వరూ ఇదేమని అడగరు.

కానీ ఇప్పుడు అతను నలుగురైదుగురితో వస్తూ ఉండటం చూసి, వాచ్ మాన్ కి ఏదో తెలియని భయం కలిగింది.

గతంలో కొన్ని హాస్టల్స్ లో జరిగిన దారుణాలు గుర్తుకు వచ్చాయి.

నిర్వాహకులకు చెబితే ఏమీ పట్టించుకోరు సరికదా తను చెప్పినట్లు బయట పెడతారు.

చేసేదేమీ లేక ఎప్పటిలా పక్కకు వెళ్లాడు.

హాస్టల్ లోపలికి వెళ్లిన జీవన్ అండ్ గ్యాంగ్, శాన్వీ ఉన్న రూమ్ దగ్గరకు వెళ్లారు.

జీవన్ ఆ గది తలుపు గట్టిగా తడుతూ "తలుపు తియ్యవే యూ డర్టీ.." అంటూ అరిచాడు.

కొంతసేపటికి శాన్వీ తలుపు తీసింది.

అనుచరులతో కలిసి ఆ గదిలోకి వెళ్ళాడు జీవన్.

గదిని పరిశీలించాడు.

శాన్వీ, సాగరికలతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు.

జీవన్, వాళ్ళ వంక చూసి చిటికె వేస్తూ "అవుట్" అన్నాడు.

వాళ్లిద్దరూ భయపడుతూ బయటకు నడుస్తున్నారు.

మోటూ వాళ్ళను ఆపి, "హాస్టల్ బయటకు వెళ్ళ వద్దు. మేము వెళ్లే వరకు పక్క రూమ్ లో ఉండండి. ఎవరికీ కాల్ చెయ్యొద్దు. మెసేజ్ లు పెట్టొద్దు" అన్నాడు.

వాళ్ళు మౌనంగా తలలూపి బయటకు వెళ్లారు.

వాళ్ళు వెళ్ళాక గది తలుపులు మూశాడు విక్కీ తమ్ముడు నటరాజ్.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


41 views0 comments
bottom of page