కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Love Challenge Episode 6' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
మ్యాచ్ ఫిక్సింగ్ కోసం పూర్ణేష్ కి భారీ మొత్తం అఫర్ చేస్తాడు జీవన్.
ఆనందంతో పొంగిపోతాడు పూర్ణేష్.
చందూ బర్త్ డే అని చెప్పి, దీప్యను పబ్ కు తీసుకొని వెళ్ళడానికి ప్లాన్ వేస్తాడు జీవన్.
కానీ చందూ బర్త్ డే ఆ రోజు కాదని ఆద్యతో చెబుతాడు రిత్విక్.
ఇక చదవండి…
ఫ్లైట్ దిగిన చక్రధరం, తన కోసం ఎదురు చూస్తున్న కొడుకు రిత్విక్ ను చూసి చాలా సంతోష పడ్డాడు. తాను ఫ్లైట్ లో వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు తప్పకుండా వస్తాడు రిత్విక్.
అందుకే ఎక్జామ్స్ టైం లో తన ప్రయాణం గురించి కొడుక్కి ముందుగా చెప్పడు చక్రధరం.
చెబితే తనకోసం తిరగడంలో రిత్విక్ టైం వేస్ట్ చేసుకుంటాడని అతని భయం.
తండ్రి లగేజీ ని డ్రైవర్ చేత డిక్కీలో పెట్టించాడు రిత్విక్.
వెనక సీట్ లో తండ్రి పక్కన కూర్చున్నాడు.
మామూలుగా ఎయిర్పోర్ట్ కి తనే డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు రిత్విక్.
కానీ ఆ రోజు డ్రైవర్ తో వచ్చాడంటే దారిలోనే తాను చెప్పబోయే విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాడని గ్రహించాడు చక్రధరం.
అందుకే కార్ ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి బయలుదేరగానే చెప్పడం ప్రారంభించాడు.
"వ్యాపారంలో నాకు గురువు రత్నాదిత్య.
ఇండియాలో నెంబర్ వన్ వ్యాపారవేత్త, పారిశ్రామిక వేత్త ఆయనే..
నీతి, నిజాయితీలే ఆయన విజయ రహస్యం.
ప్రజలు ఆయన కంపెనీ ప్రోడక్ట్స్ ను విశేషంగా ఆదరిస్తారు.
ఏ ఒక్క పార్టీకో లొంగిపోవడం అతనికి గిట్టదు.
అన్ని పార్టీలకు విరాళాలు ఇస్తాడు.
అది భయం తోనో, మంచి చేసుకోవడానికో కాదు.
అది ఆయన దాతృత్వ గుణం.
రాజకీయ పార్టీలకే కాదు.. స్వచ్ఛంద సంస్థలకు, అనాధాశ్రమాలకు, పీ ఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు ఇస్తుంటాడు.
ధార్మిక సంస్థలకు కూడా చాలా సహాయం చేస్తూ ఉంటాడు.
కానీ మారుతున్న పరిస్థితులలో ఇప్పుడు చాలా రాష్ట్రాలలో వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నవాళ్లు వంద మందికి పైనే ఉన్నారు.
అధికారిక లెక్కల ప్రకారమే దేశ వ్యాప్తంగా మూడువేల మందికి పైగా వెయ్యి కోట్లని మించిన ఆస్తులను కలిగి ఉన్నారు.
లెక్కలో లేని వాళ్ళు ఎంతమందో..
వీళ్ళ అక్రమార్జన లక్షల కోట్లలో ఉంటుంది.
దీన్ని వ్యాపారంలో పెట్టి, లాభాలుగా చూపించి, వైట్ చేసుకునే పరిశ్రమలు, కంపెనీలు ఇప్పుడు కొల్లలుగా పుట్టుకొస్తున్నాయి.
తమకు అనుకూలమైన పార్టీ అధికారంలో వుంటే క్విడ్ ప్రో కో ఒప్పందాలు చేసుకొని వ్యాపార రంగం లోకి దిగుతున్నారు.
ప్రభుత్వాలు కూడా తమతో ఒప్పందం చేసుకున్న వారికి కావలిసినవి కొసరి కొసరి వడ్డిస్తున్నాయి.
రిత్విక్! కొన్ని విషయాలు నీకు తెలిసి ఉండవచ్చు. అయినా మళ్ళీ చెబుతున్నాను.
ప్రభుత్వం తీసుకునే కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు కూడా వ్యాపార రంగం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఒక పదార్థం మీద విధించే దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం మూడు శాతం పెంచిందనుకో. దానివల్ల ఆ పదార్థంతో వ్యాపారం చేసే ఒక కంపెనీకి దాదాపు మూడు వందల కోట్లు ఉత్పత్తి వ్యయం పెరిగింది అనుకుందాం. ఆ కంపెనీ వాళ్ళు సంబంధిత మంత్రిని లేదా నాయకుడిని కలిసి ఒక యాభై కోట్లు పార్టీ ఫండ్ కోసమో లేదా మరో కారణంతోనో ముట్టజెప్పారనుకుందాం.
ఫలితంగా మూడుశాతం బదులు ఒక శాతమే పెంచారనుకుందాం.
ఇప్పుడు ఆ నాయకుడి లెక్క ఇలా ఉంటుంది.
నిజానికి పెంచాలనుకున్నది ఒక శాతమే. అంటే వంద కోట్ల అదనపు లాభమే.
అంత లాభమూ ప్రభుత్వానికి వచ్చింది.
కాబట్టి, ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు లాభం చేకూర్చినట్లే.
ఆ వంద కోట్లను ప్రజాకర్షక పథకాలకు వాడితే, ఓట్ల రూపంలో పార్టీకి లాభం.
ఇక సుంకం లో పెరుగుదల మూడు శాతమని బెదిరించి, ఒక శాతానికి తగ్గించినందువల్ల పార్టీ ఫండ్ యాభై కోట్లు వచ్చింది.
ఇది కూడా పార్టీకి లాభం.
ఈ మూడు వందల కోట్లు అనేది కేవలం ఉదాహరణకు చెప్పాను. వాస్తవంగా ఆ మొత్తం వేల కోట్లలో ఉంటుంది"
ఆపాడు చక్రధరం, రిత్విక్ ఏదో చెప్పాలనుకోవడం గమనించి.
"నాన్నగారూ! ఈ రంగంలో తల పండిన వారు మీరు. మీకు తెలియదని కాకుండా నాకు కూడా కొంత అర్థమైందనేందుకు చెబుతున్నాను.
మీరు చెప్పిన ఉదాహరణనే తీసుకుంటున్నాను.
పెరిగిన సుంకం వంద కోట్లు, పార్టీ ఫండ్ కి ఇచ్చింది యాభై కోట్లు..
మొత్తంగా కంపెనీ కి అదనపు వ్యయం నూట యాభై కోట్లు. ఏ కంపెనీ అయినా ఈ మొత్తాన్ని ప్రజల మీదే మోపుతోంది. రేట్లు పెరిగితే ఆ ప్రభావం కొంతకాలం సేల్స్ మీద ఉంటుంది. కాబట్టి ఆ నష్టాన్ని కూడా కలుపుకొని రెండు వందల కోట్లకు సరిపడా తమ ప్రోడక్ట్ రేట్ పెంచుతుంది.
అంటే రెండు వందల కోట్ల మేర ప్రజలకు ధరలు పెరుగుతాయి..
సంక్షేమ పథకాల రూపంలో వారికి వచ్చేది వంద కోట్లు.
అంటే ఇక్కడే వాళ్ళు వంద కోట్లు నష్టపోతున్నారు.
అదికూడా ఆ సంక్షేమ పథకపు లబ్ది నూటికి నూరు పాళ్ళు ప్రజలకు చేరితే.
ఈ ఒక్క ఉదాహరణలోనే ప్రజలు నష్టపోయేది ఇంత వుంటే వాస్తవంలో ఎన్ని వేల కోట్లు నష్టపోతున్నారో..." బాధగా అన్నాడు రిత్విక్.
నిజమే! వ్యవస్థ అలా ఉంది. ఇప్పుడిప్పుడే శ్రీలంక లాంటి దేశాల్లో సంక్షేమ పథకాల పట్ల ప్రజల భ్రమ తొలిగింది. ఇన్నాళ్లూ తమకేదో లబ్ది చేకూరుతోందన్న భ్రమలో ఉన్న ప్రజలకు, ధరలు అందుకోలేనంత పెరగడం తప్ప తమకు ఒరిగిందేమీ లేదని అవగతమైంది.
ఇక మన వ్యాపార రంగం విషయానికి వస్తున్నాను.
ఇన్నాళ్లు నా గురువు రత్నాదిత్య గారి స్ట్రాటజీ గానీ, నా స్ట్రాటజీ గానీ ఏమిటంటే అన్ని పార్టీలతో సమ దూరం పాటించడం. అందరితో మంచిగా ఉండటం.
కానీ మారుతున్న పరిస్థితులలో ఓ మోస్తరు నాయకులు కూడా వేల కోట్లు సంపాదించి, పారిశ్రామిక రంగం లోకి దిగుతున్నారు.
వాళ్లకు కావలసిన వసతులు, రాయితీలు, క్షణాల్లో సమకూరుతున్నాయి.
ఇటీవల ఒక వెనకబడ్డ రాష్ట్రంలో ఒక పవర్ ప్లాంట్ కి అనుమతులు సంపాదించడానికి ఆయన స్వయంగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చివరికి ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడిని పార్ట్నర్ గా చేర్చుకోవాల్సి వచ్చింది.
రత్నాదిత్య గారి పరిస్థితే అలా వుంటే మనలాంటి వారి సంగతేమిటి?
ప్రస్తుతం ప్రతిపక్షం నామమాత్రంగా ఉంది.
నాయకత్వ లేమితో అవస్థ పడుతోంది.
ప్రతిపక్షానికి చెందిన నాయకులు రత్నాదిత్య గారిని తమ పార్టీ నాయకత్వం చేపట్టాలని కోరారు. ఆ పార్టీ ప్రస్తుత నాయకత్వం కూడా తమ ఆస్తుల రక్షణకు హామీ ఇస్తే నాయకత్వాన్నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉందట. రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ఆఖరికి రత్నాదిత్య గారి రాజకీయ ప్రవేశం ఉండవచ్చు. ఆయనతో పాటే మనం కూడా. ఎందుకంటే తటస్థంగా వుంటే మనుగడ సాగించలేని పరిస్థితి వస్తోంది.
ఇక ప్రస్తుత అధికార పక్షం పరిస్థితి ఏమిటంటే ఆ పార్టీ అధినాయకుడు అనారోగ్యంతో ఉన్నాడు. కుమారుడికి అధికారం అప్పగించబోతున్నాడు. అంతకంటే ముందుగా దేశవ్యాప్తంగా పార్టీ రాష్ట్ర శాఖలన్నిట్లో యువతరానికి పెద్దపీట వేస్తున్నాడు. వాళ్ళందరి కోరికతో కొడుక్కి పార్టీ పగ్గాలు అప్పగించ బోతున్నాడు.
నిన్ను సిటీ యువజన విభాగం అధ్యక్షుడిగా చేస్తామని కూడా అడిగారు. కానీ పూర్తిగా అవినీతి మయమైన ఈ పార్టీలో నువ్వు ఇమడలేవని నాకు తెలుసు. అందుకే సున్నితంగా తిరస్కరించాను. బహుశా వాళ్ళు గురుమూర్తి కొడుకుని అప్రోచ్ అవుతారేమో..
ఏమైనా రెండేళ్లలో జరగబోయే ఎన్నికల్లో యువతరానికి ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి నువ్వు కూడా సిద్ధంగా ఉండు.
ఇమేజ్ పెంచుకోవడానికి నువ్వు ప్రత్యేకంగా చెయ్యాల్సింది ఏమీలేదు. నీ లీడర్షిప్ క్వాలిటీస్, నిజాయితీ, ఇతరులకు సహాయం చెయ్యాలన్న నీ తపన నిన్ను నాయకుడిగా నిలబెడతాయి. కానీ ఎదుటివాళ్ళు నిన్ను టార్గెట్ చేస్తారనేది మరిచిపోవద్దు.
నువ్వు ధర్మ యుద్ధమే చెయ్యి. నా కోరిక కూడా అదే. కానీ ఎదుటివాడు ఎలాగయినా గెలవాలనుకుంటాడు. జాగ్రత్తగా ఉండు. ఏ ఛాలెంజ్ లోనైనా నువ్వే గెలవాలి" అన్నాడు చక్రధరం ఉద్వేగంగా.
"తప్పకుండా నాన్నగారూ" అన్నాడు రిత్విక్ ఆత్మవిశ్వాసంతో.
అతని ఆ నిర్ణయమే జరగబోయే లవ్ ఛాలెంజ్ కి దారి తీస్తుందని అతనికి అప్పట్లో తెలియదు.
ఇంటికి చేరుకున్నాక తండ్రితో మరింత వివరంగా మాట్లాడాడు రిత్విక్.
సంవత్సరం గడిచాక రిత్విక్ హీరోగా సినిమా తియ్యాలనుందని కూడా చెప్పాడు చక్రధరం.
నవ్వి ఊరుకున్నాడు రిత్విక్.
తరువాత తన గదిలోకి వచ్చాడు.
సైలెంట్ లో ఉన్న అతని ఫోన్ లో చందూ నుండి నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి.
వెంటనే అతనికి కాల్ చేసాడు.
"ఈ రోజు నా బర్త్ డే అన్నా! సాయంత్రం విక్కీ వాళ్ళ రెస్టారెంట్ లో చిన్న ట్రీట్.
మనవాళ్ళు చాలా మంది వస్తున్నారు. నువ్వు ఏదో పనిలో ఉంటావని ప్రీతమ్ చెప్పాడు. వీలుంటే రావాలన్నా!" నాలుక చివరి నుంచి ఆహ్వానించాడు చందూ.
నవ్వుకున్నాడు రిత్విక్. అతని ఉద్దేశం తాను రావాలని కాదు. వస్తున్నానో లేదో కన్ఫర్మ్ చేసుకోవడమేనని గ్రహించాడు. తాను రాకుంటే ఆద్య, దీప్యల విషయంలో వాళ్ళ ప్లాన్ ఏదో.. దాన్ని నడిపిస్తారు.
"సారీ చందూ! నాన్నగారి కంపెనీ పనులు కొన్ని చూడాలి. తొంభై భాగాలు రాలేను. కానీ ఏమాత్రం వీలున్నా.. ఐ విల్ బి దేర్" అన్నాడు రిత్విక్ రాలేనన్నందుకు నొచ్చుకుంటున్నట్లుగా.
"పర్లేదు రిత్వికన్నా! నేను అర్థం చేసుకున్నానులే.." అని ఫోన్ పెట్టేసాడు చందూ.
దీప్యకు కాల్ చెయ్యాలి. క్లాస్ లో ఉంటారేమో.. అనుకుంటూ 'కాల్ చెయ్యొచ్చా..' అని మెసేజ్ పెట్టాడు.
'వదినకే మెసేజ్ పెట్టొచ్చుగా' అని రిప్లై ఇచ్చింది దీప్య.
వదినెవరు?.. అర్థం కాలేదు రిత్విక్ కి.
ఆ మాటే మెసేజ్ పెట్టాడు.
"నిన్ననే కదా వదినతో పరిచయమైంది. అప్పుడే ఆమె ట్రాన్స్ లో పడిపోయావా?అందుకేనా నీ షార్ప్ నెస్ తగ్గిపోయింది? "
వెంటనే అటునుంచి రిప్లై వచ్చింది.
అప్పుడర్థమైందతనికి.
"నాన్న త్వరలో సినిమా తియ్యబోతున్నారట.'అల్లరి చెల్లెలు' అని టైటిల్ పెట్టి నిన్నే లీడ్ రోల్ లో పెడతాను" అంటూ రిప్లై ఇచ్చాడతను.
"అల్లరి పెళ్ళాం అని పెట్టి, వదిననే .. అయ్య బాబోయ్.. వదిన.. సారీ.. ఆద్య పక్కనే ఉంది. ఈ మెసేజ్ లు చూస్తోంది. ఫైవ్ మినిట్స్ ఆగి కాల్ చెయ్యి. లంచ్ బ్రేక్ కాబట్టి బయట ఉంటాం. ఈసారి డైరెక్ట్ గా వదినకే.. సారీ.. ఆద్యకే చెయ్యి. నెంబర్ లేదని తప్పించుకుంటావేమో.. కాంటాక్ట్ షేర్ చేస్తున్నాను"అని రిప్లై ఇచ్చింది దీప్య.
***
చందూ ఫోన్ పెట్టగానే పక్కనే ఉన్న జీవన్ ఆతృతగా అడిగాడు "ఏమన్నాడు రిత్విక్" అంటూ.
"నైంటీ పర్సెంట్ రాలేడట" సంతోషంగా చెప్పాడు చందూ.
"అయితే ఈ రోజే ఆ దీప్యను ట్రాప్ చేద్దాం" చెప్పాడు జీవన్.
"ఒక వేళ ఆద్య కూడా వస్తే..." చందూ తన సందేహం వెలిబుచ్చాడు.
"ఇంకా చాలా మంది అమ్మాయిలు వస్తారు కదా! ఆద్యను కార్నర్ చేసి, మాటల్తో ఎంగేజ్ చెయ్యమని చెబుతాను. నువ్వు మాత్రం దీప్యనే గమనిస్తూ ఉండు. ఆమె మత్తు కలిపిన డ్రింక్ తాగగానే విక్కీ నీకు సిగ్నల్ ఇస్తాడు.
ఆ పబ్ కాంపౌండ్ వాల్ గోడ వెనుక వైపు ఒక చోట కాస్త పడిపోయినట్లు ఉంటుంది. వాస్తవానికి అది రైడ్ జరిగినప్పుడు సెలెబ్రిటీలు తప్పించుకోవడానికి చేసిన ఏర్పాటు.
ఆ దారిలో నువ్వు దీప్యను పక్కనే ఉన్న బిల్డింగ్ దగ్గరకు తీసుకొని వెళ్ళు. ఆమె స్పృహలోనే ఉంటుంది. మత్తు ప్రభావం వల్ల నీతో వస్తుంది. అది నాలుగు పోర్షన్ ల అపార్ట్మెంట్. ఆ అపార్ట్మెంట్స్ అన్నీ విక్కీ హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయి. ఆ బిల్డింగ్ వాచ్ మన్ నిన్ను ఒక అపార్ట్మెంట్ లోకి తీసుకొని వెడతాడు.
అక్కడ ముందుగానే సిసి కెమెరాలు ఏర్పాటు చేయించాను.
దీప్యను బెడ్ రూమ్ లోకి తీసుకొని వెళ్ళు. సిసి కెమెరాల్లో పడేలా ఆమెను హగ్ చేసుకోవడం లాంటివి చేసి బయటకు వచ్చెయ్యి" ప్లాన్ మొత్తం వివరించాడు జీవన్.
"అలాగే అన్నా!" అని పైకి అన్నాడు చందూ.
మనసులో మాత్రం 'హగ్ చేసుకొని వచ్చెయ్యాలట. నేనేమన్నా బ్యాటరీతో నడిచే బొమ్మనా.. నువ్వు స్విచ్ నొక్కగానే ఆగిపోవడానికి.. వయసులో ఉండే కుర్రాడిని. ఒంటరి గదిలో అమ్మాయి దొరికితే ఏదో ఒకటి జరిగిపోతుంది' అనుకున్నాడు.
ఏం జరుగుతుందనేది ఆ రాత్రికే తెలుస్తుంది.
'ఏం జరక్కుండా నేను చూసుకుంటాను' అన్న రిత్విక్ మాట ఎంతవరకు నిలుస్తుందనేది కూడా తెలుస్తుంది.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments