top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 3



'Love Challenge Episode 3' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…

ఆద్య, దీప్యలకు క్లాస్ రూమ్ చూపించడానికి తనతో తీసుకొని వెళ్తుంటాడు రిత్విక్.

జీవన్ తన స్నేహితుడు సందీప్ కి కాల్ చేసి, రిత్విక్ కి ఎదురు వచ్చి ఏదో ఒక సాకుతో గొడవ పెట్టుకోమంటాడు.


సందీప్ తన అనుచరుడు వివేక్ తో వచ్చి రాబోయే క్రికెట్ టోర్నమెంట్ లో జీవన్ ఏ ప్లేస్ లో రావాలనే విషయంగా గొడవకు దిగుతాడు.

ఇక చదవండి...



"వదిలేయ్ జీవన్. నువ్వు గట్టిగా కొడితే ఎవరూ తట్టుకోలేరు. అయినా వాడు నీ ఫ్యాన్. నీ టాలెంట్ ని అన్యాయంగా తొక్కేస్తోంటే తట్టుకోలేక రిత్విక్ ని ఎదిరించాడు. డబ్బున్న వాళ్ళు అక్రమాలు చేస్తుంటే అందరూ మౌనంగా ఉండలేరు కదా! పైగా మన కాలేజీ మేనేజ్ మెంట్ కూడా టాలెంట్ ఉండే వాళ్లనే ప్రోత్సహిస్తుంది కానీ డబ్బుకో పరపతికో లొంగిపోదు కదా!" జీవన్ ని శాంతపరుస్తూ అన్నాడు సందీప్.


జీవన్ కోపంగా "మైండ్ యువర్ టంగ్ మిస్టర్ సందీప్!

వివేక్.. నువ్వుకూడా ఒళ్ళు దగ్గర పెట్టుకో.


ఎవర్ని ఏ ప్లేస్ లో దింపాలి అనేది కెప్టెన్ నిర్ణయిస్తాడు. కెప్టెన్ గా రిత్విక్ టాలెంట్ ఏమిటనేది రాబోయే టోర్నమెంట్ లో తెలుస్తుంది. తొందరపడి ఇలా గొడవ పడటం బాగోలేదు. పైగా రిత్విక్ ఎప్పుడూ తాను ఒక కోటీశ్వరుడి కొడుకునని గొప్పలు పోలేదు. ఈ కాలేజ్ లో ఒక సాధారణ స్టూడెంట్ ఎలా ఉంటాడో అలానే ప్రవర్తిస్తాడు. ఆ అలుసుతోనే కదా నువ్వు అతనితో గొడవపడే సాహసం చేసావు. ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు. ముందు రిత్విక్ కి సారీ చెప్పి ఇక్కడినుంచి దూరంగా వెళ్ళిపో" అన్నాడు.


రిత్విక్ ఫ్రెండ్ ప్రీతమ్ సందీప్ కి వేలు చూపిస్తూ "ఈ కాలేజీలో రిత్విక్ కి ఎందరు ఫాన్స్ ఉన్నారో చూపించమంటావా?" అన్నాడు.


జీవన్ చప్పట్లు కొడుతూ "సరిగ్గా చెప్పావు ప్రీతమ్! రిత్విక్ ఫాన్స్ లిస్ట్ చెప్పేటప్పుడు నీ తరువాత నా పేరే చెప్పు. ఈ మాట నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను." అన్నాడు.


సందీప్, వివేక్ వంక చూసి, "చూసావా! టీం లో తన పొజిషన్ జీవన్ చూసుకోగలడు. అతనికి నీ సహాయం అక్కర్లేదు" అన్నాడు.


వివేక్, రిత్విక్ చేతులు పట్టుకొని, "ఐ యామ్ సారీ ఫ్రెండ్. నా ఉద్దేశం నిన్ను ఎదిరించాలని కాదు" అన్నాడు మొహం రిక్వెస్టింగ్ గా పెట్టి.


రిత్విక్ అతని భుజం తట్టి, "ఇట్స్ ఓకే. నేనేదీ మనసులో ఉంచుకొనులే" అన్నాడు.

సందీప్, వివేక్ లు అక్కడినుంచి వెళ్లిపోయారు.


"షీ ఈజ్ మిస్ దీప్య" అంటూ పరిచయం చేసాడు రిత్విక్.


"హాయ్!" అంటూ అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చింది దీప్య.


"ఐ యామ్ జీవన్. కలిసి తిరక్క పోయినా, రిత్విక్ కి మంచి స్నేహితుడిని" తనను తాను పరిచయం చేసుకున్నాడు జీవన్.


"షీ ఈజ్ మిస్ ఆద్య. మన ఎండి రాఘవేంద్ర గారి కూతురు. నాక్కూడా ఇప్పుడే పరిచయం" అన్నాడు రిత్విక్.


సందిగ్ధం లో పడింది ఆద్య. ఇందాక దీప్య అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చింది.

ఇప్పుడు తనేం చెయ్యాలి...


ఆమె సందిగ్ధానికి పుల్ స్టాప్ పెడుతూ రెండు చేతులూ జోడించి, 'నమస్తే' అన్నాడు జీవన్.


తేలిగ్గా ఊపిరి పీల్చుకొని ప్రతి నమస్కారం చేసింది ఆద్య.


"మీరు కాలేజీలో చేరిన రోజే మిమ్మల్ని పరిచయం చేసుకోగలగడం నిజంగా నా అదృష్టం. అదికూడా రిత్విక్ ద్వారా పరిచయం కావడం మరింత సంతోషంగా ఉంది" అని ఆద్య తో చెప్పాడు.


తరువాత రిత్విక్ వైపు తిరిగి, “నువ్వు పరిచయం చేసిన స్నేహితురాలిని జీవితాంతం గుర్తుంచుకుంటాను" అన్నాడు.


"నన్నేనా..థాంక్ యు జీవన్" అంది దీప్య.


"నువ్వు రిత్విక్ ని 'అన్నయ్యా..' అంటావటగా. కాబట్టి నేను కూడా నీకు అన్నయ్యని.." అన్నాడు జీవన్.


ఆద్యతో సహా అందరు నవ్వేశారు.


వాతావరణం తేలిక పడటంతో అందరూ కబుర్లు చెప్పుకుంటూ క్లాస్ రూమ్ వైపు నడిచారు.

ఆద్య, దీప్యలను వాళ్ళ క్లాస్ రూమ్ వద్ద విడిచారు జీవన్, రిత్విక్ లు.


జీవన్ ఆ క్లాస్ రూమ్ డయాస్ మీదకు వెళ్లి, "ఫ్రెండ్స్..షీ ఈజ్ ఆద్య అండ్ షీ ఈజ్ దీప్య.

దీప్య మా సిస్టర్. ఇక ఆద్య మన ఎండి గారి కూతురు. నాకూ, రిత్విక్ కూ మంచి ఫ్రెండ్.

ర్యాగింగ్ చెయ్యాల్సిన సీనియర్స్ స్వయంగా వచ్చి క్లాస్ రూమ్ లో దిగబెడుతున్నారంటే వీళ్ళ వేల్యూ తెలుసుకోండి. భయపెడుతున్నాననుకోకండి. జస్ట్.. చెబుతున్నానంతే!" అన్నాడు.


ఆ క్లాస్ లో ఉన్న సాత్విక అనే అమ్మాయి లేచి నిలబడి, "నేను, ఆద్య ఇంటర్ ఒకే కాలేజీలో చదివాం. ఆద్య అందరితో బాగా క్లోజ్ గా ఉంటుంది. అదే సమయంలో ఎవర్ని దూరంగా ఉంచాలో కూడా తనకు బాగా తెలుసు. సాఫ్ట్ గా కనిపించినా తను చాలా డేరింగ్" అని చెప్పింది.


ఆద్య సాత్వికని విష్ చేసి, "మరీ బిల్డప్ ఇవ్వకు" అంది.


హితేష్ అనే కుర్రాడు లేచి, "అంటే ఆద్య బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అన్నమాట.. ఐ మీన్ ఆద్యగారు.." అన్నాడు తన మాటల్ని తనే సవరిస్తూ.

జీవన్ "ఇప్పుడే చెప్పాను జాగ్రత్తగా ఉండమని..." అంటూ ఏదో అనబోతుండగా ఆద్య అతన్ని ఆగమన్నట్లుగా సైగ చేసింది.


"మిస్టర్ జీవన్! థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. కానీ నన్ను మామూలు కాలేజీ అమ్మాయి లాగే ఉండనివ్వండి ప్లీజ్! డోంట్ డిప్రైవ్ మీ అఫ్ కాలేజ్ లైఫ్" అంది కాస్త గట్టిగానే.

తరువాత తన గురించి కామెంట్ చేసిన హితేష్ వంక తిరిగి, "థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ మిస్టర్.. కానీ మరీ ఫాస్ట్ గా వెళ్లొద్దు. నాలుగేళ్లు కలిసి ఉంటాంగా. నా గురించి పూర్తిగా తెలుస్తుంది" అంది.


అప్పుడే క్లాస్ రూమ్ లోకి వచ్చిన లెక్చరర్ సామ్రాజ్యం, "ఇప్పుడే స్టాఫ్ రూమ్ లో ఆద్య మాటలు విన్నాను. ఆమె మాటల్లో ఎంతో పరిణితి ఉంది. చెప్పడమెందుకు.. మీ క్లాసేగా..

తన ప్రవర్తనతో అందర్నీ కట్టి పడేస్తుంది. మీకే ఓ రెండుమూడు రోజుల్లో ఆమె గురించి తెలుస్తుంది" అంది.


ఆద్య- రిత్విక్, జీవన్ లతో "మీ ఇద్దరికీ థాంక్స్. సీ యూ అగైన్" అంది.


లెక్చరర్ మేడం వచ్చాక కూడా వాళ్ళు క్లాస్ రూమ్ లో ఉండడం భావ్యం కాదన్న ఆమె ఉద్దేశం ఇద్దరికీ అర్థమైంది.


అందరికీ బై చెప్పి ఇద్దరూ అక్కడినుంచి నిష్క్రమించారు.


ఆ రోజు కాలేజీ ముగిసాక ఒక్కొక్కరి ఆలోచనలూ ఒక్కో లాగా ఉన్నాయి.


జీవన్ ఇంటికి వెళ్ళాక ఆ రోజు హ్యాపీగా ముగిసినట్లు, రిత్విక్ మీద తనదే పై చేయి అయినట్లు భావించాడు.


ముందుగా తనతో పరాచికాలాడబోయిన శాన్వీని చెంప దెబ్బ కొట్టడం, ఆమెతో పాటు మిగతా వాళ్లందరికీ ఒక వార్నింగ్ ఇచ్చినట్లయింది.


ఉదయం రిత్విక్ తో కలిసి ఆద్య క్లాస్ రూ లోకి వెడుతోంది. వాస్తవానికి ఆ సీన్ లో తన పాత్ర లేదు. కానీ శాన్వీ రెచ్చగొట్టడంతో సందీప్ ని రిత్విక్ తో గొడవ పెట్టుకొమ్మని పంపించాడు.


తాను సందీప్, వివేక్ లకు సపోర్ట్ చేస్తే ఆద్య దృష్టిలో విలన్ అయిపోతాడు.

అందుకే తన ప్లాన్ వెంటనే మార్చేశాడు. వివేక్ ని కొట్టి, క్లాస్ పీకడంతో ఆ సీన్ లో మెయిన్ పోర్షన్ తనదే అయింది. రిత్విక్ కేవలం గెస్ట్ ఆర్టిస్ట్ లాగా అయిపోయాడు.

అసలు ఆద్య కూడా తన పెర్ఫార్మెన్స్ కి ప్రేక్షకురాలు అయిపోయింది.


క్లాస్ రూమ్ లో హితేష్ కామెంట్ చెయ్యడం, తాను అతనికి వార్నింగ్ ఇవ్వబోవడంతో ఆద్యకు కాస్త మాట్లాడే అవకాశం కలిగింది.

అప్పుడు కూడా రిత్విక్ ప్రేక్షకుడు మాత్రమే.


ఆద్యకు దగ్గర కావడానికి దీప్యను ఉపయోగించుకోవాలి.

అందుకు ముందుగా దీప్యను లైన్ లో పెట్టాలి.


తనకది మంచినీళ్లు తగినంత సులభం.

కానీ ఆద్య దృష్టిలో తను తిరుగుబోతు కాకూడదు.


సో.. దీప్యను లైన్ లో పెట్టే పని చందూకి అప్పగించాలి.


పబ్బులకు రెస్టారెంట్ లకు తిప్పి మంచి గిఫ్ట్స్ కొనివ్వమని చెప్పాలి.

అందుకోసం అయ్యే ఖర్చు లక్షల్లో ఉన్నా సరే .. తను భరించాలి..


మొత్తానికి ఆద్య పరిచయమైన మొదటి రోజే తను మంచి ఇమేజ్ కొట్టేసాడు..

హుషారుగా ఇంట్లోని తన గదిలో విస్కీ బాటిల్ ఓపెన్ చేసాడు జీవన్.


రాబోయే క్రికెట్ టోర్నమెంట్ ని తన ఇమేజ్ పెంచుకోవడానికి , రిత్విక్ ని జీరో చెయ్యడానికి వాడుకోవాలి.


మొదటి పెగ్ వెయ్యగానే అతనికి ఆ ఆలోచన కలిగింది.

వెంటనే క్రికెట్ బుకీ పూర్నేష్ కి కాల్ చేసాడు.


అతను ఇటీవల జరిగిన వన్ డే లో కొందరు ప్లేయర్స్ ని లొంగదీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. క్రిమినల్ కేస్ కూడా పెట్టారు.


సహాయం కోసం తన తండ్రి గురుమూర్తిని కలవడం కోసం తన సహాయం తీసుకున్నాడు పూర్నేష్.


ఫోన్ లిఫ్ట్ చేసిన పూర్నేష్ తో "నీ సహాయం కావాలి పూర్ణా!" అన్నాడు జీవన్.


"సగం సహాయం చేసేసానుగా.. కేస్ కొట్టేశాక మిగతా సహాయం చేస్తాను" అన్నాడు పూర్నేష్.

"ఆ సహాయం కాదోయ్. కొందరు ప్లేయర్స్ ని కొనాలి" అన్నాడు జీవన్ నవ్వుతూ.

ఉన్న కేసే తెగలేదు. మళ్ళీనా.." అన్నాడతను.


"ఇదేమీ ఇంటర్నేషనల్ మ్యాచ్ కాదు. జస్ట్ ఇంటర్ కాలేజ్ పోటీలు" చెప్పాడు జీవన్.

"ఫోన్ లో ఎందుకులే.. ఏ పబ్ లో ఉన్నవో చెప్పు. డైరెక్ట్ గా కలుస్తాను" అన్నాడు పూర్నేష్.


"పబ్ లో ఫ్రీ గా ఉండదు. ఇంట్లోనే సిట్టింగ్. వచ్చేయ్. మందు కొడుతూ మాట్లాడుకుందాం" మత్తుగా అన్నాడు జీవన్.


ఇక ఆద్య ఆలోచనలు...


లెక్చరర్స్ తో, నాన్ టీచింగ్ స్టాఫ్ తో తను అనుకున్నది మొదటిరోజే చెప్పేసింది. తనను సాధారణ స్టూడెంట్ లాగా చూడమని కోరింది.


చేరిన రోజే ఇద్దరు ప్రామినెంట్ సీనియర్స్ - రిత్విక్, జీవన్ లతో పరిచయం కలిగింది.

రిత్విక్ ప్రవర్తన సహజంగా ఉంది. కానీ జీవన్ తనను ఇంప్రెస్ చెయ్యడానికి కాస్త నటించినట్లు అనిపిస్తోంది. అతని ప్రవర్తన కాస్త గమనించాలి.


క్లాస్ రూమ్ లో కూడా హితేష్ విషయంగా మాట్లాడుతూ తను సాధారణ స్టూడెంటేనని అందరికీ క్లియర్ చేసింది. తనకు కేర్ టేకర్ లాగా ఉండొద్దని జీవన్ కి ఇండైరెక్ట్ గా చెప్పింది.


దీప్య లాంటి మంచి ఫ్రెండ్ దొరికింది.

రిత్విక్ తో కమ్యూనికేట్ చేయడానికి సహకరిస్తుంది.


అయినా అతనితో తను డైరెక్ట్ గా మాట్లాడలేదా? మీడియేటర్ కావాలా?

అసలు అతని గురించిన ఆలోచనలు ఎందుకు..


దీప్యతో అతని గురించి కామెంట్ చేయడమేమిటసలు..

రిత్విక్ తనను డిస్టర్బ్ చేస్తున్నాడా..


నో.. తను అందరు అబ్బాయిలతో ఉన్నట్లే అతనితో కూడా ఫ్రాంక్ గా ఉండాలి.

ఆ రాత్రంతా ఇలా ఆలోచిస్తూ పడుకుంది ఆద్య.


ఇక శాన్వీకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు.

అమ్మానాన్నల దగ్గర కూడా చిన్న దెబ్బ తినని తనను కాలేజీలో నలుగురి ముందూ కొట్టాడు జీవన్.


అతన్ని రెచ్చగొట్టి రిత్విక్ మీదకు పంపాలని చూసింది తను.

కానీ అతను తెలివిగా వివేక్ ని కొట్టి, మంచి మార్కులు కొట్టేసాడు.


ఏమో.. ఆ ఆద్య చాల తెలివైందని విన్నాను.

జీవన్ ట్రాప్ లో అంత తొందరగా పడుతుందా..


ఆద్య ఆలోచనలు తెలుసుకోవాలంటే ముందుగా దీప్యకు క్లోజ్ కావాలి.

అవసరమైతే దీప్యకు ఒక బాయ్ ఫ్రెండ్ ని చూసి పెట్టాలి.


ఎవర్ని చూడాలబ్బా..

ఎస్.. మోటూ ని ప్రయోగించాలి.


జీవన్, తనని హీరో పక్కన ఉండే కమెడియన్ లాగా చూస్తుంటాడని ఒకసారి తన దగ్గర వాపోయాడు. ఆ వెంటనే తన చేతులు పట్టుకొని తను జీవన్ గురించి ఆలా అన్నట్లు ఎవరితో చెప్పొదంటూ తన దగ్గర ప్రామిస్ చేయించుకున్నాడు.


అతన్ని కాస్త రెచ్చగొడితే జీవన్ కి వ్యతిరేకంగా తనతో జత కట్టడం ఖాయం.

ఎన్నో ఆలోచనలతో ఆ రోజు నిద్ర పోలేదు శాన్వీ.


ఇక రిత్విక్ మానసికంగా చాలా దృఢంగా ఉంటాడు.


కానీ ఆ రోజు కాలేజీలో ఉండగానే ఢిల్లీలో ఉన్న తండ్రి చక్రధరం గారి దగ్గర్నుండి కాల్ వచ్చింది.


"రిత్విక్! జాగ్త్రత్తగా విను. ఇన్నాళ్లు అన్ని పార్టీలతో కలిసిపోతూ మన వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి కలుగుతోంది.


పూర్తి వివరాలు రేపు నేను వచ్చాక చెబుతాను. రేపు కాలేజీకి వెళ్లొద్దు. నీతో చాలా మాట్లాడాలి" ఆందోళన ధ్వనించింది అయన గొంతులో.


రేపు తండ్రి ఏం చెప్పబోతాడో అని ఆలోచిస్తూ ఉండిపోయాడు రిత్విక్.


ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).




78 views0 comments
bottom of page