top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 4

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Video link

'Love Challenge Episode 4' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్






గత ఎపిసోడ్ లో…

రిత్విక్ తో గొడవకు దిగిన వివేక్ ని చెంపమీద కొడతాడు జీవన్.

జరగబోయే క్రికెట్ మ్యాచ్ లో తాను ఏ ప్లేస్ లో రావాలనేది కెప్టెన్ గా రిత్విక్ నిర్ణయిస్తాడని, అతను తన స్నేహితుడని అందరిలో చెబుతాడు.

ఇంటికి వచ్చాక, జరగబోయే క్రికెట్ టోర్నమెంట్ లో రిత్విక్ ని దెబ్బ తీయాలని ప్లాన్ చేస్తాడు.

గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిపించిన బుకీ పూర్నేష్ ని ఇంటికి రమ్మంటాడు జీవన్.

ఇక చదవండి…


జీవన్ ఇంటికి చేరుకున్న పూర్నేష్ బయటినుంచే కాల్ చేసాడు.

"ఇంటి బయటే ఉన్నాను. నాన్నగారు ఇంట్లో ఉన్నారా? నేను నేరుగా నీ గదిలోకి రావచ్చా?" సందేహంగా అడిగాడు.


జీవన్ ఫోన్ లోనే బిగ్గరగా నవ్వుతూ, "నేను నాన్నతో కలిసి చాలా సార్లు పుచ్చుకున్నాను.

నీకేం భయం లేదు. కింద హాల్లో నాన్నగారు కనపడి, ఏదైనా అడిగితే నా పేరు చెప్పు. అయినా నువ్వొస్తున్నట్లు మా నాన్నగారి గన్ మాన్ కి చెప్పానులే" అన్నాడు.


తన కార్ ని రోడ్ కి అవతలి వైపు పార్క్ చేసి, గేట్ దగ్గరకు వచ్చాడు పూర్నేష్.

సెక్యూరిటీ అతన్ని గుర్తు పట్టి, లోపలికి వెళ్ళమన్నాడు.

లోపల మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఉన్న గన్ మాన్, "ఎం. పీ. గారు నిద్ర పోతున్నారు. జీవన్ సారు మిమ్మల్ని మేడ పైకి రమ్మన్నారు" అని చెప్పాడు.


నేరుగా మేడమీద ఉన్న జీవన్ గదిలోకి వెళ్ళాడు పూర్నేష్.

అప్పటికే జీవన్ మత్తులో తూలుతున్నాడు.


పూర్నేష్ ని చూడగానే "వెల్కమ్ దోస్త్! నువ్వు చేసే హెల్ప్ మీదే నా ఇమేజ్ ఆధారపడి ఉంటుంది" అన్నాడు అతన్ని గదిలోకి ఇన్వైట్ చేస్తూ.


"మొన్న అడ్డంగా దొరికినప్పట్లుండి నా మీద నిఘా ఎక్కువైంది.

అందుకే ఫోన్ లో ఏమీ కమిట్ కాలేదు" అన్నాడు పూర్నేష్, జీవన్ చూపించిన కుర్చీలో కూర్చుంటూ.


"అంతేగానీ ఏమీ మారలేదంటావ్.." అన్నాడు జీవన్ ఆతనికి మందు నింపిన గ్లాస్ అందిస్తూ.


"మీలాంటి పెద్దల సపోర్ట్ వుంటే మరి మంచివాళ్ళమయ్యే అవసరం మాకేముంటుందన్నా" అన్నాడు పూర్నేష్ చీర్స్ చెబుతూ.


"మంచివాడివయిపోతే నీతో మాకేం పని ఉంటుంది బ్రదర్" అన్నాడు జీవన్, విస్కీ సిప్ చేస్తూ.


పూర్నేష్ ఒక పెగ్గు తాగి, ఏదో చెప్పబోయి ఆగిపోయాడు.


"పర్లేదు చెప్పు. ధైర్యం చాలకపోతే మరో పెగ్గు తాగి చెప్పు" అన్నాడు జీవన్.


"ఇద్దరమూ బురదలో దొర్లిన వాళ్ళమయితేనే కదా ఒకరిదొకరు కడుక్కోవడానికి" అన్నాడు పూర్ణేష్.


అతని వంక సూటిగా చూసాడు జీవన్.

అంతే!


భయంతో వణికిపోయాడు పూర్ణేష్. ఎసి గదైనా అతని వళ్లంతా చెమటలు పట్టాయి.

బిగ్గరగా నవ్వేసాడు జీవన్.


"మందు కొట్టేటప్పుడు సమానత్వం పాటిస్తాను. ఎవరేమన్నా సీరియస్ గా తీసుకోను. మరేం భయపడకు" అన్నాడు మరింత గట్టిగా నవ్వుతూ.


రిలాక్సయ్యాడు పూర్ణేష్.

జేబులోంచి కర్చీఫ్ తీసి, చెమటలు తుడుచుకున్నాడు.


"నిజానికి పెద్ద ఆపద నుండి గట్టెక్కిస్తున్నారు నన్ను.

మీకు ఎప్పుడూ రుణపడి ఉండాలి నేను" అన్నాడు పూర్ణేష్, కాస్త స్థిమిత పడి.


"ఇక అసలు విషయానికి వస్తాను. ఒక్క నిముషం ఉండు. మంచింగ్ కి ఏమైనా తెమ్మని మా వంటవాడికి నువ్వు రాకముందే చెప్పాను. వాడు వచ్చి వెడితే మనం ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు" అంటూ మేడ పైనుంచి కిందికి వినపడేలా అమర్చిన కాలింగ్ బెల్ ఆపకుండా ఓ నిముషం నొక్కాడు.


మరో నిముషానికి కిందినుంచి వగరుస్తూ వచ్చాడు వాళ్ళ చెఫ్ సుందరం.


ఒక ప్టేట్ లో రోస్టెడ్ జీడిపప్పు, మరో ప్లేట్ లో ఆమ్లెట్ లు తీసుకొని వచ్చాడు.


"సారీ సర్! లేటయింది. అమ్మగారు ఒప్పుకోలేదు. 'ఇలా సర్వ్ చేస్తూ వుంటే రోజూ ఇంట్లోనే మొదలెడతాడు అబ్బాయి' అన్నారు. మీరు కొట్టిన బెల్ దెబ్బకు నాన్నగారు లేచారు. మీతో మాట్లాడాలట. పైకి వస్తానన్నారు" చెప్పాడు సుందరం.


"సరే.. నువ్వెళ్లు" అంటూ సుందరాన్ని పంపి, పూర్ణేష్ వంక చూసాడు జీవన్.

మళ్ళీ అతని వళ్ళంతా చెమటలు.


"అదుగో.. ఆ హేంగర్ కి టవల్ తగిలించి ఉంది. తుడుచుకో.. ఇంకా నయం. ప్యాంటు తడుపుకున్నావ్ కాదు" నవ్వాడు జీవన్.


"నాన్నగారు డైరెక్ట్ గా వచ్చేసి వుంటే అంత పనీ అయ్యేది. అవునుగానీ మీకేం భయం లేదా?" అడిగాడు పూర్ణేష్.


"మనం ఆ స్టేజి ఎప్పుడో దాటేశాం. చట్టం ఒప్పుకోదు గానీ, లేకుంటే నేనే ఎంపీ అయ్యేవాడిని" అన్నాడు జీవన్, కేర్ లెస్ గా.


సరిగ్గా అతను ఆ మాట అంటున్నప్పుడే అతని తండ్రి గురుమూర్తి లోపలికి ఎంటరయ్యాడు.


"సరిగ్గా చెప్పావురా. నేను కూడా అదే చెప్పాలనుకుంటున్నాను" అంటూ..

ఆయన్ని చూడగానే పూర్ణేష్ లేచి నిలుచున్నాడు.


అయన పూర్ణేష్ వంక చూసి, "నీ సంగతి మాట్లాడానోయ్. నీమీద విచారణకు మాజీ క్రికెటర్లతో ఒక కమిటీ వేస్తున్నారట. వాళ్లెవరో కనుక్కోమని చెప్పాను. అది తెలిశాక వాళ్ళను మేనేజ్ చెయ్యడానికి ప్రయత్నించాలి. కాస్త కష్టమే. అదెందుకో.. చాలా మంది డబ్బు మీద వ్యామోహం లేనట్టు ఉంటారు. నాకు తెలిసి అది భయం అనుకుంటాను. ఎవ్వరికీ అనుమానం రాకుండా ముట్టచెబుతామని చెప్పి, వాళ్ళని ఒప్పించాలి" అన్నాడు.


జీవన్ తన తండ్రితో "ఒక ముఖ్యమైన పనిమీద పూర్ణేష్ ని పిలిచాను. మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చా..?" అన్నాడు.


"నేను రేపు ఉదయాన్నే ఢిల్లీకి ఫ్లైట్ లో బయలుదేరాలి. లేకుంటే ఈ టైం లో నిన్ను డిస్టర్బ్ చేస్తానా.." అన్నాడు గురుమూర్తి.


జీవన్, పూర్ణేష్ వంక చూస్తూ "నువ్వు కాసేపు పక్క గదిలో ఉండు. మా మాటలయ్యాక పిలుస్తాను" అన్నాడు.


గురుమూర్తి దగ్గర సెలవు తీసుకొని, పక్క గదిలోకి వెళ్ళాడు పూర్ణేష్.


టీపాయ్ మీద ఉన్న మరో గ్లాస్ చూస్తూ "ఫుల్ గానే ఉంది..ఇంకా స్టార్ట్ చేసినట్లు లేదు.." అంటూ ఆ గ్లాస్ అందుకున్నాడు గురుమూర్తి.


"క్యారీ ఆన్ డాడ్. కూల్ గా విషయం చెప్పండి" అన్నాడు జీవన్, తన కుర్చీ కాస్త ముందుకు లాక్కుంటూ.


గురుమూర్తి మాట్లాడుతూ "పార్టీ అధినాయకుడు అనారోగ్యంతో ఉన్నాడు.

తాను ఉండగానే కొడుక్కి అధికారం కట్టబెట్టాలని అతని ప్లాన్.

వారసత్వ రాజకీయాలంటూ గొడవ పెడతారని సంకోచిస్తున్నాడు.

అందుకని పార్టీని యువరక్తంతో నింపాలని స్లోగన్ ఇచ్చాడు.


వీలున్న చోటల్లా కుర్రకారుని పార్టీ పదవుల్లో పెడతాడట.

వాళ్ళ చేత డిమాండ్ చేయించి కొడుక్కి అధికారం అప్పజెబుతాడట.


ఎమ్మెల్యే పదవికి వయోపరిమితి ఇరవయ్యొకటికి తగ్గించే బిల్లు పెట్టే యోచన కూడా ఉందట.


అది జరిగినా, జరక్క పోయినా పార్టీ పదవులు యువతరానికి అప్పజెప్పడం ఖాయం.


ఈ విషయాలు మాట్లాడటానికే నన్ను ఢిల్లీకి రమ్మని కబురు పంపారు.

ఇవన్నీ జరగడానికి సంవత్సరం పట్టొచ్చు. ఈ లోపల నీ చదువు పూర్తవుతుంది.


నేను నీకు చెప్పాలనుకున్నది ఒక్కటే. ఈ సంవత్సరం లోపల యూత్ లో నీ ఇమేజ్ బాగా పెంచుకో. స్పోర్ట్స్ లోగానీ, డాన్స్ లోగానీ, ముందు ఉండు. యూత్ లో నువ్వొక హీరోలా అనిపించుకోవాలి.


పబ్బుల చుట్టూ తిరిగితే నీ భజన చేసే నలుగురైదుగురికి గొప్పగా అనిపించవచ్చు.

కానీ ఒకటి గుర్తుంచుకో. సిటీలో మొత్తం స్టూడెంట్స్ ఎంతమంది? వాళ్లలో రెగ్యులర్ గా పబ్బులకు తిరిగే వాళ్ళు ఎంతమంది? పది శాతం కూడా ఉండరు.


మంచి పేరుకు ఎప్పుడూ విలువ ఉంటుంది. కాకుంటే మంచివాళ్ళు రాజకీయాల్లోకి రారు. అంతే.


చక్రధరం గారి అబ్బాయి మీ క్లాసేనటగా! అతన్ని ఒప్పించి సిటీ యూత్ లీడర్ గా చెయ్యాలని చూస్తున్నట్లు ఒక వార్త.


అదెంతవరకు నిజమో తెలీదు.

రేపు నేను ఢిల్లీ వెళ్ళాక క్లారిటీ రావచ్చు.

నేను నిన్ను కోరేది ఒకటే.

యూత్ లో నీ ఇమేజ్ పెంచుకో.


వీలుంటే ఆ చక్రధరం గారి అబ్బాయి కంటే నువ్వే మంచి ఛాయిస్ అనిపించుకో" అని చెప్పడం ముగించాడు.


తండ్రి చెప్పింది శ్రద్ధగా విన్నాడు జీవన్.


తరువాత తండ్రితో, "నాన్నా! మొదటిసారి నీ మనసులో ఉన్నది, నువ్వు చెప్పక ముందే చేయబోతున్నాను. పూర్ణేష్ ని పిలిపించింది అందుకే.


ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్స్ నెక్స్ట్ సండే మా కాలేజిలోనే జరగబోతున్నాయి.

ఫైనల్స్ కూడా మా కాలేజిలోనే ఆ పై ఆదివారం జరుగుతాయి.


మా టీం కి రిత్విక్.. అదే .. ఆ చక్రధరం కొడుకు కెప్టెన్.


పూర్ణేష్ తో మాట్లాడి అవతలి టీం లో ప్లేయర్స్ ని కొందర్ని కొనెయ్యమని చెప్పాను.

నువ్వు వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడుతాను.


ఈ రెండు మ్యాచ్ లలో నేను బ్రహ్మాండంగా ఆడేలా, ఆ రిత్విక్ ఫెయిల్ అయ్యేలా ప్లాన్ చెయ్యాలి. పూర్ణేష్ ఇలాంటి వాటిల్లో ఎక్స్పర్ట్.


పైగా మన సహాయం కావాలి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మన పేర్లు బయట పెట్టడు" సంతోషంగా చెప్పాడు జీవన్.


"చాలా సంతోషం. చెప్పానుగా.. నీ ఇమేజ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు.

మందు పార్టీలు ఇంట్లోనే చేసుకో.


గొడవ పెట్టొద్దని మీ అమ్మతో చెబుతానులే.

ఇంకేదైనా అవసరాలుంటే మన గెస్ట్ హౌస్ వాడుకో.." గ్లాస్ లోని మందు ఒక్క గుక్కలో తాగేసి చెప్పాడు గురుమూర్తి.


రాజకీయాల కోసం కొడుకును తప్పుదారిలో నడపడం ఎంత తప్పో ఆ క్షణంలో ఆతనికి తెలీదు.


"లవ్ యు డాడీ! ఇలాంటి డాడీ దొరకడం నా అదృష్టం" తండ్రిని హగ్ చేసుకొంటూ చెప్పాడు జీవన్.


"సరేరా! ఆ పూర్ణేష్ తో మాట్లాడి బేరం కుదుర్చుకో" అని చెప్పి, కిందికి వెళ్లి పోయాడు గురుమూర్తి.

ఆయన వెళ్లిన వెంటనే ఆ గదిలోకి వచ్చాడు పూర్ణేష్.


ఖాళీగా ఉన్న తన గ్లాస్ వంక చూసి, "అదేమిటి? నేను వెళ్లేముందే ఫినిష్ చేసానా?" అన్నాడు.

"కాదులే. అది మా నాన్న లాగించేసాడు" అన్నాడు జీవన్.


"మంచి ఫ్రెండ్ లాగా ఉంటారు మీ నాన్నగారు. యు ఆర్ లక్కీ"అన్నాడు పూర్ణేష్.

అతని గ్లాస్ ని మళ్ళీ నింపి, చెప్పడం ప్రారంభించాడు జీవన్.


"మా కాలేజీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు.

సిటీ అంతా ఆ ఫలితాల కోసం చూస్తారు.

ఎప్పటినుండో టోర్నమెంట్ కండక్ట్ చేస్తూ వున్నా, మా వాళ్ళు కప్ గెలిచింది లేదు. కనీసం క్వార్టర్ ఫైనల్స్ దాటింది లేదు.


మొదటిసారిగా రిత్విక్ కెప్టెన్సీలో సెమీస్ కి వచ్చాము.


ఇప్పటి వరకు రిత్విక్ అద్భుతంగా ఆడుతుండగా నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నాను.

ఫైనల్ విన్ కాకపోతే జనం ఎవరినీ పట్టించుకోరు. సో.. మిగిలిన మ్యాచ్ లు గెలిచి కప్ కొట్టాలి.


రెండిట్లో నేను సూపర్ గా ఆడాలి.

రిత్విక్ ఫ్లాప్ కావాలి.


ఎలా ప్లాన్ చేస్తావో నీ ఇష్టం. అంతా నీ మీదే ఆధార పడి ఉంది" చెప్పడం ముగించాడు జీవన్.


"మరోలా అనుకోవద్దు జీవన్ గారూ! రెండువైపులా మనమే ఆడితేనే ఫలితం మన ఇష్ట ప్రకారం ఉంటుంది. కానప్పుడు ఫలితం ఎవరూ చెప్పలేరు. అటువైపు టీం లో ఒకరిద్దరే మనకు లోబడవచ్చు. ఏదైనా క్యాచ్ మిస్ చెయ్యడం.. రన్ అవుట్ మిస్ చేయడం.. లూస్ బౌలింగ్ చెయ్యడం లాంటివి వీలుని బట్టి చెయ్యవచ్చు.

రెండు జట్లూ ఒకే స్థాయిలో ఆడినప్పుడే ఇలాంటివి కీలకం అవుతాయి.


అలాగే ఒక ఆటగాడు మంచి ఫామ్ లో వుంటే అంత ఈజీగా అతన్ని అవుట్ చెయ్యలేరు.

అయినా అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను. వీలుంటే అంపైర్ ఎవరనేది కనుక్కొని, అటునుంచి కూడా ప్రయత్నిస్తాను" తన విశ్లేషణను వివరించి చెప్పాడు పూర్ణేష్.

"ఈ డీల్ కోసం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్?" అడిగాడు జీవన్.


"అది సరిగ్గా చెప్పలేను.. ఒక్కొక్కరు ఒక్కో అమౌంట్ కి ఆశ పడవచ్చు. అది ఆ ఆటగాళ్ల ఆశను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి ఉంటుంది. ఉదాహరణకు కోటి రూపాయలు ఇచ్చినా మీరు డకౌట్ కావడానికి ఒప్పుకోరు. అలా .." అంటూ ఉండగా "నాన్చకుండా అమౌంట్ చెప్పు" అన్నాడు జీవన్.


ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


63 views0 comments

Comments


bottom of page