top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 5

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.

Video link

'Love Challenge Episode 5' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్

గత ఎపిసోడ్ లో…

గురుమూర్తి, కొడుకుతో మాట్లాడుతూ పార్టీలో యూత్ కి ప్రాధాన్యం ఇవ్వబోతున్నారని, కాలేజీలో ఇమేజ్ పెంచుకోమని చెబుతాడు.


జీవన్, బుకీ పూర్ణేష్ ని పిలిచి, మ్యాచ్ ఫిక్సింగ్ కి ఎంత కావాలో చెప్పమంటాడు.


ఆద్యకు దగ్గర కావడానికి దీప్యను వాడుకోవాలని, ఆమెను ట్రాప్ చెయ్యమని స్నేహితుడు చందూకి చెబుతాడు.

ఇక చదవండి…

"అదే.. ఎంతని చెప్పడం.. ఓ కోటి రూపాయలు.." అంటూ ఉండగా "ఒక్క నిముషం" అంటూ తండ్రికి కాల్ చేసాడు జీవన్.


గది బయటకు వెళ్లి తండ్రితో కాస్సేపు మాట్లాడి, తిరిగి లోపలికి వచ్చాడు.

"ఐదు కోట్లు" అన్నాడు పూర్ణేష్ వంక చూస్తూ.


కళ్ళు తిరిగాయి పూర్ణేష్ కి.

నమ్మలేనట్లు చూసాడు.


తను కోటి చెబితే యాభైకి బేరం కుదురుతుందని, పాతిక లక్షలు ఆటగాళ్లకు ఖర్చు పెట్టినా పాతిక తనకు మిగులుతుందని అనుకున్నాడు.

కానీ ఇదేమిటి? ఐదు కోట్లా..అది కూడా కాలేజీల మధ్య జరిగే మ్యాచ్ కి..


"ఇది కేవలం ఆటగాళ్లను మేనేజ్ చెయ్యడానికే. నీ పేమెంట్ ఊహించలేనంత ఉంటుంది" చెప్పాడు జీవన్.


"నువ్వు అనుకున్నది ఎలాగైనా జరిపిస్తాను. ప్రామిస్..ఇప్పట్నుంచే పనిలోకి దిగుతాను" బయలుదేరుతూ అన్నాడు పూర్ణేష్.


అతను మత్తుతో, అంతకు మించిన ఆనందపు మైకంతో ఊగి పోతున్నాడు.

"మా డ్రైవర్ ని డ్రాప్ చెయ్యమంటాను" అన్నాడు జీవన్.


"వద్దులే.. ఐ కెన్ మేనేజ్.." అన్నాడు పూర్ణేష్ తూలుతూనే.


"నీ మొహం. కిందికి వెళ్ళేలోగా పడిపోయేటట్లు ఉన్నావ్" అంటూ తన డ్రైవర్ కి కాల్ చేసాడు.


"పూర్ణేష్ గారిని ఆయన కార్లోనే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చెయ్యి. రిటర్న్, క్యాబ్ లో వచ్చెయ్యి" తన డ్రైవర్ తో చెప్పాడు జీవన్.


అతను వెళ్ళాక తన ఫ్రెండ్ చందూకి కాల్ చేశాడు.


"రేపు నాన్నను ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చెయ్యాలి. తిరిగి వచ్చేటప్పటికి పన్నెండవుతుంది. తరువాత కాలేజీకి రావడమెందుకు? డుమ్మా కొట్టేస్తాను. క్లాసులు పోతాయని బాధ లేదు. ఆద్యను ఒకరోజు మిస్సవుతానన్న బెంగ తప్ప. వీలుంటే కాలేజీ వదిలే టైం కి వచ్చి ఒక లుక్ వేస్తాను" అని చందూతో చెప్పాడు.


"అవునా.. రేపు రిత్విక్ కూడా కాలేజీకి రాడట" చెప్పాడు చందూ.

"ఏం? ఎవరు చెప్పారు.." ఆతృతగా అడిగాడు జీవన్.


"తన ఫ్రెండ్ ప్రీతమ్ కి చెప్పాడట. అతను మరో కామన్ ఫ్రెండ్ కి చెప్పటంతో నాకు తెలిసింది" అన్నాడు చందూ.


"ఆలా అయితే నేను తప్పకుండా కాలేజీకి వస్తాను. వీలు దొరికితే ఆద్యను ఇంప్రెస్ చెయ్యడానికి ఏదైనా ప్లాన్ వెయ్యవచ్చు.


అన్నట్లు మర్చిపోయాను.. రేపు నీ బర్త్ డే సెలెబ్రేషన్ ప్లాన్ చేస్తున్నాను" అన్నాడు అప్పటికప్పుడు ఓ ప్లాన్ వేస్తూ..

"రేపా.. నా బర్త్ డే కి ఇంకా రెండు నెలలు ఉందిగా" అన్నాడు చందూ.

రేపు మన విక్కీ గాడి పబ్ లో పార్టీ అరేంజ్ చేస్తాను. ఆద్య, దీప్యలను పిలుద్దాం. ఆద్య రాకపోయినా దీప్య వచ్చేలా ప్లాన్ చేద్దాం. ఆద్యకు నేను దగ్గర కావాలంటే దీప్యను మన చేతుల్లో ఉంచుకోవాలి. నువ్వు దీప్యకు క్లోజ్ కావాలి. నీ గ్రిప్ లోకి తెచ్చుకోవాలి" చెప్పాడు జీవన్.


"దీప్య వస్తుందంటావా?" అనుమానంగా అడిగాడు చందూ.

"రప్పించాలి. ఆ రిత్విక్ గాడు రేపు కాలేజీకి రాకపోవడం మనకొక ఛాన్స్. వాడుంటే దీప్యను ఒప్పించడం కష్టం. ఓ పది మంది అమ్మాయిల చేత 'మేము పబ్ కి వెడుతున్నాం. నువ్వు కూడా రా.. సరదాగా ఉంటుంది' అని చెప్పిద్దాం.

నలుగురూ చేసేపని తప్పు కాదని చాలామంది అనుకుంటారు. మన అదృష్టం బాగుండి దీప్య పబ్ కి వస్తే విక్కీ తో చెప్పి డ్రింక్స్ లో.. అర్థమైందిగా.." అన్నాడు.

హుషారుగా విజిల్ వేసాడు చందూ.

"చాలా రోజులకు మంచి ఛాన్స్ అన్నమాట" అన్నాడు ఆనందంగా.

"కొంపదీసి మూవింగ్ కార్లో ఏదైనా చెయ్యబోయేవు.

అసలే రోజులు బాగాలేవు. జస్ట్ తనతో క్లోస్ గా కొన్ని ఫోటోలు.. అంతే" చెప్పాడు జీవన్.

"నువ్వెలా చెబితే అలానే" అన్నాడు చందూ.

వెంటనే తన తండ్రికి కాల్ చేసి రేపు కాలేజీలో ఇంపార్టెంట్ క్లాస్ ఉందని, ఎయిర్పోర్ట్ కి రాలేనని చెప్పాడు జీవన్.

ఆ రాత్రంతా జరగబోయే క్రికెట్ మ్యాచ్ లో తను డబుల్ సెంచురీ చేసినట్లు, ఆద్య తనకు దగ్గరైనట్లు, తను పార్టీ యూత్ లీడర్ అయినట్లు అందమైన కలలు కన్నాడు జీవన్.

ఆ రాత్రంతా సరైన నిద్ర లేకపోయినా, రాత్రి తాగిన మందు తాలూకు హ్యాంగ్ ఓవర్ తగ్గకపోయినా, పొద్దునే మెలకువ వచ్చింది జీవన్ కి.

ఎయిర్ పోర్ట్ కి బయలుదేరుతున్న తండ్రికి ఇంటినుండే బై చెప్పాడు.

ట్రిమ్ గా రెడీ అయి, ముందుగానే కాలేజీకి బయలుదేరాడు.

తన గ్యాంగ్ వాళ్ళకి కాల్ చేసి, వాళ్ళను కూడా తొందరగా రమ్మన్నాడు.

శాన్వీ, మోటూ, చందూలే కాక, ఓ పదిమంది అమ్మాయిలు, అబ్బాయిలు అక్కడ గుమికూడారు.

జీవన్ అందరితో "ఈ రోజు మన చందూ బర్త్ డే. సాయంత్రం మా ఫ్రెండ్ విక్కీ వాళ్ళ పబ్ లో మీ అందరికీ పార్టీ. ఆద్య, దీప్యలను కూడా పార్టీకి పిలుద్దాం. కాకపోతే వాళ్లకు రెస్టారెంట్ లో ట్రీట్ అని చెబుదాం. కొత్తగా చేరిన వాళ్ళు కదా! పబ్ అంటే భయపడతారు. వచ్చాక వెన్యూ మారిందని చెబుదాం. రెండూ పక్క పక్కనే కదా. అప్పుడు తిరిగి వెళ్ళలేరు. తప్పకుండా అటెండ్ అవుతారు" అన్నాడు.

అందరూ సరేనన్నారు.

ఆద్య, దీప్యలు కాలేజీకి వచ్చేసరికి జీవన్ తో పాటు ఓ పదిమంది అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు.


జీవన్ వాళ్ళను ఆపి, "ఇతను మా ఫ్రెండ్ చందూ. మీకొక చిన్న రిక్వెస్ట్ చేస్తాడట, ఇఫ్ యూ డోంట్ మైండ్" అంటూ చందూ ని వాళ్లకు పరిచయం చేసాడు.

చందూ వాళ్ళిద్దరినీ విష్ చేసి, "ఈ రోజు నా బర్త్ డే. సాయంత్రం హోటల్ విక్కీ లో చిన్న ట్రీట్ ఇస్తున్నాను. ప్లీజ్ డోంట్ మిస్. తప్పకుండా మీరిద్దరూ రావాలి. మా ఫైనల్ ఇయర్ లో అయితే అమ్మాయిలందరూ వస్తున్నారు. జూనియర్స్ లో కూడా కొందరు వస్తున్నారు" అని రిక్వెస్ట్ చేసాడు.

జీవన్ తో బాటు అక్కడే వున్న శాన్వీ కూడా వాళ్ళేం చెబుతారోనని ఎదురు చూస్తోంది.


ఉన్నట్లుండి, జీవన్ కల్పించుకుంటూ "ఆద్యను ఇబ్బంది పెట్టకండి. ఎండి గారి కూతురిగా తనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. దీప్యను గట్టిగా రిక్వెస్ట్ చెయ్యండి" అన్నాడు.

"గట్టిగా చెప్పాల్సిన పని లేదు. ఈవెనింగ్ నేను ఫ్రీయే. తప్పకుండ వస్తాను. రిత్విక్ అన్నయ్యను పిలిచారా?" అడిగింది దీప్య.

తడబడ్డాడు చందూ.

అది గమనించిన జీవన్, "వీడికి రిత్విక్ తో అంత చనువు లేదు. నన్ను పిలవమన్నాడు. రిత్విక్ ఈ రోజు కాలేజీకి వచ్చినట్లు లేదు. ఏదైనా అనుకోని పని తగిలిందేమో.." అన్నాడు.


"ఏమో ఏమిటి? కాల్ చేసి కనుక్కోవచ్చుగా.. నీ దగ్గర నంబర్ ఉందా?" దీప్యని అడిగింది ఆద్య.

"అయ్యో.. తనకెందుకు శ్రమ.. నేను కాల్ చేస్తానులెండి.." అన్నాడు జీవన్.

ఈలోగా దీప్య, రిత్విక్ కి కాల్ చేసి ఫోన్ ఆద్య చేతికి ఇచ్చింది.

"అదేమిటి.. మీ అన్నయ్యతో నువ్వే మాట్లాడు" కంగారుగా అంది దీప్య.

"అన్నయ్య కాబట్టే ఎందుకు డిస్టర్బ్ చేసావని కోప్పడతాడేమో.. నిన్నైతే ఏమీ అనలేడుగా.."అంది దీప్య.

ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆద్యకు.


"హలో.. దీప్యా! చెప్పమ్మా.." అటువైపు నుండి అడిగాడు రిత్విక్.

లెక్చరర్లందరినీ సమావేశ పరిచి మాట్లాడగలిగిన ఆద్యకు ఆ క్షణంలో ఎందుకో మాటలు రాలేదు.

"చెప్పు దీప్యా! ఏదైనా ప్రాబ్లమా.. ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారా? నేను బయలుదేరుతున్నాను వుండు.." ఆందోళన ధ్వనిస్తోంది అతని మాటల్లో.

ఇక మాట్లాడక తప్పలేదు ఆద్యకు.

"నేను.. నేను తన ఫ్రెండ్ ఆద్యను. నథింగ్ సీరియస్ హియర్. జస్ట్ కాలేజీకి ఎందుకు రాలేదా అని అడగడానికి చేసింది తను. ఈవెనింగ్ మిస్టర్ చందూ బర్త్ డే సెలెబ్రేట్ చేస్తున్నారట. మమ్మల్ని ఇన్వైట్ చేసాడు. మీ విషయం అడిగితే కాలేజీకి రాలేదన్నారు. జస్ట్ కనుక్కుందామని చెయ్యమన్నాను" చెప్పింది ఆద్య.

"మా క్లాస్ మేట్ చందూ బర్త్ డే ఈ రోజా? లాస్ట్ ఇయర్ వినాయక నిమజ్జనం రోజు సెలెబ్రేట్ చేసినట్టు నాకు బాగా గుర్తు. అంటే ఇంకా దాదాపు రెండు నెలల టైం ఉంది. ఒక్క క్షణం. నా దగ్గర మా క్లాస్ మేట్స్ అందరి పుట్టిన రోజు వివరాలు ఉన్నాయి. నేను వెరిఫై చేసి ఓ ఐదు నిముషాల్లో మీకు కాల్ చేసి చెబుతాను. ప్రస్తుతానికి ఏ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకండి" అన్నాడు రిత్విక్, గొంతు తగ్గించి మాట్లాడుతూ.

"అయితే సాయంత్రానికి ఫ్రీ అవుతారన్న మాట" అంది ఆద్య.


"మా నాన్నగారు కాసేపట్లో ఢిల్లీనుండి వస్తున్నారు. నాతో అర్జెంటు గా మాట్లాడాలట. అందులోని అర్జెన్సీని బట్టి నేను సాయంత్రానికి ఫ్రీ అవుతానా లేదా తెలుస్తుంది. సరే.. మీరు అవతలికి వెళ్ళాక కాసేపాగి కాల్ చేయండి" అని పెట్టేసాడు.

"కాసేపాగి కాల్ చేస్తాడట. ఓకే. మేము సాయంత్రం రావడానికి ట్రై చేస్తాం. ఏ విషయం మళ్ళీ చెబుతాం" అని చెప్పి దీప్యతో కలిసి అక్కడినుండి కదిలింది ఆద్య.

ఆద్య, రిత్విక్ తో మాట్లాడుతున్నంత సేపూ జీవన్ రక్తం మరుగుతూనే ఉంది.

ఈ దీప్య ఒకటి.. టక్కున ఆ రిత్విక్ కి కాల్ చేసేసింది. చేసిన మనిషి, ఫోన్ ఆద్యకి ఇవ్వడమేమిటి?


ముందు దీప్యను లొంగదీసుకోవాలి.

లేకుంటే రిత్విక్, ఆద్యల పెళ్లి దగ్గరుండి జరిపించేలా ఉంది.

చ.. పానకంలో పుడక అని ఇలాంటివాళ్లనే అంటారేమో..

‘నిన్ను సూప్ లో స్పూన్ లాగా వాడుకోవాలి. ఒక్కసారి మా చేతిలోకి వస్తే ఇక చూడు…’ నలుగురిలో ఉన్న విషయం మరిచి ఆవేశంతో ఊగిపోతున్నాడు జీవన్.

అతని ఫీలింగ్స్ పూర్తిగా ఎంజాయ్ చేసిన మనిషి శాన్వీ.

రిత్విక్ తో ఫోన్ లో మాట్లాడుతున్న ఆద్య ముఖ కవళికలు అందంగా కదులుతుంటే అందరూ ఆమె వంకే చూస్తున్నారు.

ఆమె రిత్విక్ తో స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటున్నట్లు ఫీల్ అయిన జీవన్ ముఖం అతనికి తెలీకుండానే వికృతంగా మారడం శాన్వీకి బలే కిక్ ఇచ్చింది. ఇక సాయంత్రం పబ్ కి వెళ్లకపోయినా పరవాలేదు అనుకుంది.

"సాయంత్రం వస్తారంటావా?" వాళ్ళు వెళ్ళాక జీవన్ ని అడిగాడు చందూ.

"వాళ్ళు రాకపోతే ఏమిటి? ఇందరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా. ముందు విక్కీ కి కాల్ చేసి సాయంత్రానికి ఏర్పాట్లు చూడాలి" అంటూ చందూ ని అక్కణ్ణుంచి కాస్త దూరంగా తీసుకోని వెళ్ళాడు.

అతనితో తన ప్లాన్ ఇలా చెప్పాడు.


"నా పొలిటికల్ ఎంట్రీ తొందర్లో ఉంటుందని నాన్నగారు చెప్పారు. కాబట్టి సాయంత్రం నేను పబ్ కి రాను. నా ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్నాను. అందువల్ల మొత్తం నువ్వే మేనేజ్ చెయ్యాలి. దీప్యకు సర్వ్ చేసేది కూల్ డ్రింక్ అయినా సరే..హాట్ డ్రింక్ అయినా సరే.. అందులో మత్తుమందు కలిపే ఏర్పాటు విక్కీ చూసుకుంటాడు. దాని ప్రభావంతో స్పృహ తప్పదు. కానీ ఆలోచనా శక్తి నశిస్తుంది.

పక్కనున్న మనిషి ఏం చెప్పినా కాదనలేరు. ప్రతిదానికీ నవ్వుతూ ఉంటారు. నువ్వు ఇది అడ్వాంటేజ్ గా తీసుకొని, దీప్యతో కొన్ని ఫోటోలు తీసుకోవాలి. తనతో కాస్త క్లోజ్ గా ఫోటోలు దిగాలి.

వాటిని ఉపయోగించుకొని రెస్టారెంట్ లకు, రేవ్ పార్టీలకు తీసుకుని వెళ్ళు.

ఆమె యాక్సెప్ట్ చేస్తే నీ ఇష్టం. లేకుంటే ఆద్యను నాకు దగ్గర చెయ్యడానికి మాత్రమే వాడుకుందాం. నీ ఎంజాయ్మెంట్ కోసం వేరే వాళ్ళను ఏర్పాటు చేస్తానులే"

చెప్పడం ముగించాడు జీవన్.

"అన్నా! పాలిటిక్స్ లోకి వెళ్లినా నేనే నీ అసిస్టెంట్" అన్నాడు చందూ.

'సర్లేరా.. ఆలూ లేదు.. చూలూ లేదు.. అన్నట్లు" నవ్వాడు జీవన్.

***

క్లాస్ రూమ్ వైపు వెళ్తున్నారు ఆద్య, దీప్యలు.

కాస్త దూరం వెళ్ళగానే లైబ్రరీ బిల్డింగ్ కనిపించింది.


నిన్న తనతో తమ కాలేజీ లైబ్రరీ గురించి రిత్విక్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

ఆమె పెదాలపై సన్నని చిరునవ్వు విరిసింది.


"అన్నయ్య గుర్తుకు వస్తున్నాడా?" అడిగింది దీప్య నవ్వుతూ.

కోపం నటిస్తూ ఆమె వంక చూసింది ఆద్య.

అంతలో దీప్య ఫోన్ మోగింది.

అప్రయత్నంగా ఫోన్ అందుకోవడానికి చెయ్యి జాపింది ఆద్య.

"దొరికావులే.." అంటూ ఫోన్ అందించింది దీప్య.

"హలో.. ఆద్యా.. మీరే కదూ.." కన్ఫర్మేషన్ కోసం అడిగాడు రిత్విక్.

"నేనే.. చెప్పండి" అంది ఆద్య.


"కన్ఫర్మ్ గా చెబుతున్నాను. చందూ బర్త్ డే కి ఇంకా రెండు నెలల టైం ఉంది.

డేట్ అఫ్ బర్త్ రికార్డ్ ప్రకారమైనా.. లాస్ట్ ఇయర్ సెలెబ్రేట్ చేసుకున్న దాన్ని బట్టి అయినా అంతే. నాకు బాగా గుర్తు. లాస్ట్ ఇయర్ అతని బర్త్ డే రోజు వినాయక నిమజ్జనం కావడంతో బాగా ట్రాఫిక్ జాం కావడంతో చాలా ఇబ్బంది పడ్డాం. నేను లేని టైం చూసి ఏదో ప్లాన్ చేసారు" చెప్పాడు రిత్విక్.

"వాళ్ళు పిలిచింది రెస్టారెంట్ కే కదా" అంది ఆద్య.


"ఆలా చెప్పి ఒప్పిస్తారు. అక్కడికి వచ్చాక ప్రోగ్రాం మారిందని చెప్పి పబ్ కి తీసుకొని వెడతారు. చుట్టూ ఉన్న చాలా మంది అమ్మాయిలు పబ్ కి రావడానికి సిద్ధంగా వుంటే సాధారణంగా ఎవరూ కాదనలేరు. ముఖ్యంగా కొత్తగా చేరిన అమ్మాయిలు, సీనియర్స్ ని కాదనలేరు" చెప్పాడు రిత్విక్.

"ఈ విషయంలో మంచి అనుభవం ఉన్నట్లుందే.." సరదాగా అనింది ఆద్య.

కానీ అన్న వెంటనే నాలుక్కరుచుకుంది. అతనితో ఆలా మాట్లాడి ఉండకూడదు.

"అయితే రేపు రెస్టారెంట్ కి వెడదామా?" నవ్వుతూ అన్నాడు రిత్విక్.

"మీ పైన వైల్డ్ జోక్ వేసినా తేలిగ్గా తీసుకున్నారు. ఐ లైక్ యువర్ ఆటిట్యూడ్" మనస్ఫూర్తిగా అతన్ని అభినందించింది ఆద్య.

"మీ అభిమానానికి థాంక్స్. సాయంత్రం రెస్టారెంట్ కి వస్తామని చెప్పండి.

ఏం జరక్కుండా నేను చూసుకుంటాను. బిలీవ్ మీ" అన్నాడు రిత్విక్.

"తప్పకుండా వెడతాం. మీమీద పూర్తి భరోసా ఉంది" అంది ఆద్య.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


47 views0 comments

Comments


bottom of page