top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 2

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Love Challenge Episode 2' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్




గత ఎపిసోడ్ లో…

'నిత్య ఇంజనీరింగ్ కాలేజీ' ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్- రిత్విక్, జీవన్ లు.


రిత్విక్ ఒక ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్ కొడుకైతే, జీవన్ ఎం పీ కుమారుడు.


ఇక ఫస్ట్ ఇయర్ లో ఆ కాలేజ్ ఎం డి కూతురు ఆద్య చేరుతుంది.


చేరిన రోజే కాలేజ్ బ్యూటీగా అనిపించుకుంటుంది.

తనతో మాట్లాడటానికి వస్తున్నదని అనుకున్న ఆద్య, రిత్విక్ తో మాట్లాడటంతో ఉడుక్కుంటాడు జీవన్.


అతనితో పరాచికాలాడబోయిన స్నేహితురాలు శాన్వీ చెంప చెళ్లుమనిపిస్తాడు.


ఇక చదవండి...



రిత్విక్ దీప్య లతో పాటు తన క్లాస్ రూమ్ కి బయలుదేరుతుంది ఆద్య. రిత్విక్ ముందు వెళుతుండగా అతని వెనుక దీప్య, ఆద్య లు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది అబ్బాయిలు కాస్త దూరంగా వాళ్లను ఫాలో అవుతున్నారు. ఎదురుగా వస్తున్న అబ్బాయిలు అందరూ ఆద్య వంక ఆసక్తిగా చూస్తున్నారు.


అది గమనించిన దీప్య, ఆద్య తో చిన్నగా, " ఈ రోజే ఆఖరు. రేపటి నుండి నేను నీతో కలిసి నడవను" అంది నవ్వుతూ.


"అదేం కాదు. నన్ను చూస్తున్నట్లు నటిస్తూ నీ వంకే చూస్తున్నారు అనిపిస్తోంది" అంది ఆద్య తను కూడా నవ్వుతూ.


"నేను ఇదివరకు కూడా ఈ కాలేజీకి వేరే పనిమీద రెండు మూడు సార్లు వచ్చాను. ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ రోజే అంతలా చూస్తున్నారంటే అది నీ కోసమే. ఆ విషయం నీకు కూడా తెలుసు" అంది దీప్య.


"అసలు విషయం నేను చెప్పనా" అంది ఆద్య రహస్యం చెప్పబోతున్నట్లుగా.

ఏమిటన్నట్లు చూసింది దీప్య.


"ఈ అమ్మాయికి ఆల్రెడీ చక్కటి ఫ్రెండ్ ఉన్నాడు. మనం ట్రై చేసినా లాభం ఉండదు అనుకుని ఉంటారు నీ గురించి" తన గొంతు వీలయినంత తగ్గించి అంది ఆద్య.


ముందు వెళుతున్న రిత్విక్ ఠక్కున ఆగి వెనక్కి తిరిగి చూశాడు.

ఉలిక్కిపడింది ఆద్య.


'తన మాటలు అతను విన్నాడా.. తన గురించి ఏమనుకుంటాడో.. అసలు తన స్వభావానికి విరుద్ధంగా ఇలా ఈ అబ్బాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నాను..?' అనుకుంది ఆద్య.


వెనక్కి తిరిగిన రిత్విక్ ఎడమ వైపు ఉన్న పెద్ద బిల్డింగ్ ను చూపిస్తూ "ఇది మన కాలేజీ లైబ్రరీ. అన్ని సబ్జెక్టులకు సంబంధించి, నాలుగు వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. కేవలం సబ్జెక్ట్ కి సంబంధించినవి మాత్రమే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ కి ఉపయోగపడే ఎన్నో ఇంగ్లీష్, తెలుగు పుస్తకాలు కూడా ఉన్నాయి. చాలా కొద్ది ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే ఇన్ని పుస్తకాలు ఉంటాయి" అని చెప్పాడు.


'హమ్మయ్య! ఇతను నా మాటలు విన్నట్టు లేదు. బ్రతికాను.. మరోసారి ఎప్పుడూ ఇలా అబ్బాయిల గురించి కామెంట్స్ చేయకూడదు ' అని మనసులో అనుకుంది ఆద్య.


అతను ఆద్య వైపు చూస్తూ "మీ కాలేజీ గురించి మీకే చెబుతున్నాడేమిటని అనుకుంటున్నారా. ఈ లైబ్రరీ నాకు అంతగా నచ్చింది. తెలిసిన వాళ్ళందరికీ దీని గురించి చెబుతూ ఉంటాను. ఇప్పుడు చెప్పడం కూడా దీప్యకు తెలియాలనే.." అన్నాడు నవ్వుతూ.


తరువాత తిరిగి నడక కొనసాగించాడు.


ఈసారి దీప్య, ఆద్య చెవిలో చిన్నగా "ఇందాక పరిచయం చేసేటప్పుడే 'రిత్విక్ అన్నయ్య' అని చెప్పాను, నీకు లైన్ క్లియర్ చేస్తూ" అంది నవ్వుతూ.


"నాకు అలాంటి డైవర్షన్స్ ఉండవు. నా కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీదే ఉంటుంది. ఇతనికంటే అందగాడు నాకు తారసపడినా.." అంది ఆద్య.

"అంటే రిత్విక్ అన్నయ్య అందగాడు అని ఒప్పుకున్నట్లే గా.." నవ్వింది దీప్య.


మళ్ళీ టక్కున వెనక్కి తిరిగాడు రిత్విక్.

ఒక్కసారి అటూ ఇటూ చూసింది ఆద్య.

కాస్త దూరంలో టాయిలెట్ రూమ్స్ ఉన్నాయి.


అతను ఆద్య తో మాట్లాడుతూ "ఈసారి వీటి గురించి చెప్తాను అనుకుంటున్నారా..? నిజం చెప్పాలంటే మన కాలేజీ లో టాయిలెట్ రూమ్స్ చాలా చక్కగా మైంటైన్ చేస్తారు. కానీ నేను చెప్పాలనుకున్నది అది కాదు. అదిగో.. ఎదురుగా కనిపించే పెద్ద బిల్డింగ్ చూడండి. అందులో ఫోర్త్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ ఫోర్ నాట్ వన్ లో మీ క్లాస్ రూమ్ ఉంటుంది.

క్రింద గ్రౌండ్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ వన్ నాట్ వన్ లో మా క్లాస్ రూమ్ ఉంది" అన్నాడు రిత్విక్.


ఇంతలో వాళ్లకు ముందుగా వెళ్తున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆగి, రిత్విక్ ను విష్ చేసి, "ఇంటర్ కాలేజీ క్రికెట్ పోటీలు నెక్స్ట్ సండే కదా" అని అడిగారు.


"అవును.. అవును. మన కాలేజీ స్టేడియంలోనే" చెప్పాడు రిత్విక్.


వాళ్లు ఇంకా ఏదో ఏదో మాట్లాడ బోయి, రిత్విక్ వెనక ఉన్న అమ్మాయిలను చూసి ఆగారు. అది గమనించిన ఆద్య "పరవాలేదు.. మాతో వస్తూ మాట్లాడండి" అంది.


"ఈసారి తనని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా పంపకపోతే ఊరుకోనని జీవన్ అన్నాడట. గొడవలు ఎందుకు? అతన్ని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా పంపితే సరిపోతుందిగా" అన్నాడు వాళ్లలో ఒక కుర్రాడు.


"చూడు సందీప్! అలా గొడవలు పడతారని ఒకరికి భయపడితే అందరూ గొడవలకు దిగాలని చూస్తారు. కెప్టెన్ గా ఉన్న వ్యక్తి భయాలకు, ప్రలోభాలకు లోబడితే ఆ జట్టు రాణించదు" అన్నాడు రిత్విక్.

***

ఇక ఇక్కడ


తనను చెంపమీద కొట్టిన జీవన్ ని చంపెయ్యాలన్నంత కోపం వచ్చింది శాన్వీకి.

నలుగురిలో తన పరిస్థితి ఘోరంగా తయారయ్యింది.


అతనితో తిరిగినప్పుడే నలుగురిలో చులకనయ్యింది తను.

ఇప్పుడు కాలేజీలో అందరి మధ్య తనను అవమానించాడు.

ఇక తనని చూసి అందరూ నవ్వుకుంటారు.


ఇప్పుడతనితో గొడవ పడొచ్చు. కానీ అతన్ని ఎదిరించి, తను చెయ్యగలిగింది ఏమీ లేదు.

తను ఇక అతని మనిషి కాదని తెలిస్తే అందరికీ లోకువై పోతుంది.


అడ్డమైన వాళ్లందరితో కామెంట్లు చేయించుకునే కంటే అతనితో స్నేహంగా ఉన్నట్లే నటిస్తే మంచిది.


అదను చూసి జీవన్ ని ముంచెయ్యాలి.

అసలు అదను కోసం చూడడమెందుకు? అవకాశం కల్పించుకోవాలి.

ఈ కాలేజీలో జీవన్ ని ఎదిరించ గలిగేది రిత్విక్ మాత్రమే.

జీవన్ కి అన్ని విధాలా సమ ఉజ్జీ అతనే.


అతనికీ, జీవన్ కీ మధ్య పోటీ పెట్టాలి.

క్షణాల్లో పథక రచన చేసేసింది శాన్వీ.


"జీవన్! ఈ క్షణంలో నాకేమనిపిస్తోందో తెలుసా.." సూటిగా అతని వంకే చూస్తూ అంది.

ఒక్కసారి ఆమె వంక చూసాడు జీవన్.


ఏం చేయగలుగుతుంది శాన్వీ?

కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తుందా?


చేస్తే కాస్త ఇబ్బందే.

ప్రిన్సిపాల్ మొండివాడు.


ఎవ్వరికీ భయపడడు.

పైగా ఎండి రాఘవేంద్ర కు మంచి స్నేహితుడు.


అవన్నీ తనకో లెఖ్ఖ కాదు.

కానీ తన తండ్రిని ఎదిరిస్తే ఆద్యకు కోపం రాదూ!


దీనికి ఓ సారీ చెప్పి పడేస్తే సరిపోతుంది.. అనుకుంటూ చెప్పబోయాడు.


అంతలో శాన్వీ "ఫ్రెండ్స్! అందరూ వినండి. చెంప దెబ్బ కొట్టడానికైనా సరే.. జీవన్ చెయ్యి నా చెంపను తాకింది. ప్రైవేట్ గా టచింగ్స్ సంగతి వదిలెయ్యండి. ఇలా ఓపెన్ గా అందరి ముందూ నన్ను టచ్ చెయ్యడం... ఐ ఫీల్ ఐ యామ్ సో లక్కీ. లవ్ యూ జీవన్!" అంది.


చుట్టూ ఉన్న వాళ్ళందరూ " నువ్వు చాలా స్పోర్టివ్ శాన్వీ" అంటూ అభినందించారు.


జీవన్ కూడా అభినందిస్తున్నట్లుగా శాన్వీ భుజం తట్టాడు.


పక్కనే ఉన్న జీవన్ ఫ్రెండ్ మోటూ తన మొబైల్ లో దేనికోసమో వెతుకుతూ ఉండటంతో అందరూ అతని వంక ఆసక్తిగా చూసారు.


"ఆ.. దొరికింది" అంటూ 'అబ్బ నీ.. తియ్యనీ.. దెబ్బ' సాంగ్ ప్లే చేసాడు మోటూ.


జీవన్, శాన్వీ లతో సహా అందరూ బిగ్గరగా నవ్వేశారు.


"జీవన్! ఆద్య నీకు నచ్చిందని నాకు అర్థమైంది. కానీ ఆమె విషయంలో నీకు పోటీ రిత్విక్ అని తెలుసుకో.

ఆమెకు రిత్విక్ ఎవరో తెలీక పోయినా, అప్పుడే అతనితో పరిచయం అయిపోయింది.

నువ్వు చూస్తూ వుంటే వాళ్ళు తొందర్లోనే దగ్గరయి పోతారు.

అతని ఇమేజ్ ని తగ్గించేయాలి.

ఇప్పుడే అతనితో గొడవ పెట్టుకొని నీ తడాఖా చూపించు" అంది అతన్ని రెచ్చగొడుతూ.


"మంచి ఐడియా.." అంటూ శాన్వీ బుగ్గ మీద చిటిక వేసాడు జీవన్.

తరువాత తన ఫ్రెండ్ సందీప్ కి కాల్ చేసాడు.


అతను లిఫ్ట్ చెయ్యగానే "ఎక్కడున్నావ్ రా " అని అడిగాడు.

"క్లాస్ రూమ్ బయటే ఉన్నాను. ఏమైనా పనుందా?" అడిగాడు సందీప్.


"ఆ రిత్విక్ గాడు ఇద్దరమ్మాయిల్ని వెంటేసుకొని అటువైపు వస్తున్నాడు. ఆతనికి ఎదురెళ్లి ఏదో ఒక సాకుతో చిన్న గొడవ పెట్టుకో. వివేక్ ని నీతో తీసుకొని వెళ్ళు. ఈ లోపల నేను వచ్చేస్తాను" అని చెప్పి కాల్ కట్ చేసాడు.


"ఏవైనా క్రికెట్ బ్యాట్ లాంటివి తెమ్మంటావా?" అడిగాడు అతని ఫ్రెండ్ చందూ.


"ఏమీ అవసరం లేదు. అసలు మీరెవ్వరూ రావద్దు. జస్ట్ శాన్వీ అండ్ మోటూ నన్ను ఫాలో అయితే చాలు" అంటూ ముందుకు కదిలాడు జీవన్.


అతని ఉద్దేశం అర్థం కాకపోయినా అతన్ని అనుసరించారు వాళ్లిద్దరూ.

***

అక్కడ రిత్విక్ మాటలు విన్న సందీప్ తన పక్కనున్న వివేక్ వైపు చూసాడు.

అతను మాట్లాడుతూ "జీవన్ ఏదో అంటాడని కాదు. స్టూడెంట్స్ అందరికీ అదే అనిపిస్తోంది" అన్నాడు ఇంచుమించుగా రిత్విక్ దారికి అడ్డు నిలుచుంటూ.


వాళ్లకు కాస్త వెనగ్గా వస్తున్న రిత్విక్ స్నేహితులు గబగబా ముందుకు వచ్చారు.


రిత్విక్ ఫ్రెండ్ ప్రీతమ్, రిత్విక్ దగ్గరకు వచ్చి , "రిత్విక్! జీవన్ వాళ్ళు ఏదో గొడవ ప్లాన్ చేస్తున్నారు. మన ఫ్రెండ్స్ అందర్నీ రమ్మని చెప్పనా.." అని అడిగాడు.


ఆద్య కల్పించుకుంటూ "ఈ కాలేజీలో కూడా అలా కొట్లాటలు జరుగుతాయా? అలాంటి వాళ్లందరికీ టీసీ ఇచ్చి పంపేలా చూస్తాను" అంది.


వివేక్, రిత్విక్ వంక చూస్తూ "అడిగినదానికి జవాబు చెప్పకుండా అమ్మాయిలతో కబుర్లేమిటి?" అంటూ మీదికి వచ్చాడు.

వివేక్ ఇంచుమించు తన మీదకు రావడంతో రిత్విక్ కు కోపం వచ్చింది. అప్రయత్నంగా అతని పిడికిలి బిగుసుకొంది.


ఎప్పుడూ శాంతంగా ఉండే రిత్విక్ కి కోపం వస్తే ఎలా ఉంటుందో సందీప్ గతంలో ఒకసారి చూసి ఉన్నాడు.


అతను వివేక్ ని పక్కకు లాగి, "ఏమిటిది.. రిత్విక్ మీదకు వెడతావా? ఏమనుకుంటున్నావ్ అతని గురించి? వాళ్ళ నాన్నెవరో తెలుసా.. అయన తలుచుకుంటే నిన్ను నలిపేస్తాడు" అన్నాడు.


"న్యాయం అడిగితే నలిపేస్తారా? ధనికుల చేతిలో నలిగిపోవడానికి స్టూడెంట్స్ నల్లులు కాదు. పులులు" ఆవేశంగా అన్నాడు వివేక్.


అంతే...


అతని చెంప చెళ్లుమంది.


కొట్టింది రిత్విక్ కాదు.


అప్పుడే అక్కడికి చేరుకున్న జీవన్...


చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ అందరూ వీళ్ళ చుట్టూ గుమికూడారు.


చెంప దెబ్బ తిన్న వివేక్ తనను కొట్టింది జీవన్ అని తెలిసి ఆశ్చర్యపోయాడు.


జీవన్ మరోసారి వివేక్ ని కొట్టబోతుండగా సందీప్ ఆపాడు.


ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



115 views0 comments
bottom of page