top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 7

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link



'Love Challenge Episode 7' Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్




గత ఎపిసోడ్ లో…

రిత్విక్ కి కేంద్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వివరిస్తాడు అతని తండ్రి చక్రధరం.

తాము కూడా పాలిటిక్స్ లోకి దిగవలసిన అవసరం వస్తుందని చెబుతాడు.

చందూ తో తాను ఈవెనింగ్ పార్టీ కి రాలేనని చెబుతాడు రిత్విక్.

దీప్యను పబ్ కి తీసుకొని వెళ్లి ఎలా ట్రాప్ చెయ్యాలో చందూకి వివరిస్తాడు జీవన్.

ఇక చదవండి…

ఆద్య, దీప్యలు క్లాస్ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి వాళ్ళ కోసం బయట వెయిట్ చేస్తున్నారు జీవన్, చందూలు.

వాళ్ళతో పాటు శాన్వీ, మరో నలుగురైదురు ఫైనల్ ఇయర్ అమ్మాయిలు కూడా ఉన్నారు.

"ఈవెనింగ్ వస్తున్నారుగా.." ఆతృతగా వాళ్ళను అడిగాడు జీవన్.

"చూస్తుంటే ఈ రోజు మీ బర్త్ డే అనిపిస్తోంది. చందూ కంటే మీరే ఎక్కువగా ఎక్సయిట్ అవుతున్నారు" అంది ఆద్య.

గతుక్కుమన్నాడు జీవన్. ఏం చెప్పాలో తెలీలేదతనికి.

"జీవనన్న ఎప్పుడూ అంతే. ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు పెడతాడు" అన్నాడు చందూ.

అతన్ని అభినందిస్తున్నట్లుగా భుజం తట్టాడు జీవన్.

తరువాత ఆద్య వంక తిరిగి ఏదో మాట్లాడబోతుండగా 'కాల్ చెయ్యొచ్చా' అని మెసేజ్ వచ్చింది ఆద్యకు.

"అది అన్నయ్య నెంబర్. కాల్ చెయ్యి" అంది దీప్య.

"ఎక్స్యూజ్ మీ" అంటూ పక్కకు వెళ్ళింది ఆద్య.

రిత్విక్ తో మాట్లాడుతున్న ఆద్య మధ్యమధ్యలో నవ్వుతుండడం అతని రక్తాన్ని మరిగిస్తోంది.

ఆవేశంతో రగిలిపోయాడు జీవన్.

అతని ముఖం చూసిన వారికి మయసభలో భంగ పడ్డ దుర్యోధనుడు గుర్తుకు వస్తాడు.

శాన్వీ అతని దగ్గరకు వెళ్లి, "నీ ఫీలింగ్స్ బయటపడుతున్నాయి. కంట్రోల్ యువర్ సెల్ఫ్" అని చిన్నగా చెప్పింది.

అతి కష్టం మీద తన ఆవేశాన్ని అణుచుకున్నాడు జీవన్.

రిత్విక్ తో మాట్లాడి తిరిగి వచ్చిన ఆద్య "అతను రావడం కష్టమే అంటున్నాడు" అని చెప్పింది.

"అలా అన్నాడంటే రిత్విక్ రానట్లే. మా నాన్నగారు ఒక ముఖ్యమైన పని నాకు అప్పజెప్పారు. కాబట్టి నేను కూడా రాలేను. ఆఫ్ కోర్స్! అన్ని ఏర్పాట్లు చేస్తాను. చందూ ఎవరూ రావడం లేదంటూ బాగా డిసప్పాయింట్ అవుతున్నాడు. ఒకవేళ మీరు కూడా రాలేకపోతే కనీసం దీప్యనైనా పంపండి" అన్నాడు జీవన్.

"ఎందుకో మీరే నన్ను రావద్దు అంటున్నట్లు ఉంది. ఈవెనింగ్ నేను ఖాళీగానే ఉంటాను. కాబట్టి నేను, దీప్య ఖచ్చితంగా వస్తాము. పబ్ లాంటి చోట్లకయితే ఆలోచిస్తాను కానీ రెస్టారెంట్ కి రావడానికి అభ్యంతరం ఏముంది?" అంది ఆద్య.

"భలేవారే! మీరు వస్తానంటే అంతకంటే మాకు కావలసింది ఏముంది? కాకపోతే నేను మిస్ అవుతున్నాను అన్న బాధ ఒకటే ఉంది. థాంక్యూ వెరీ మచ్ ఆద్య గారూ" అన్నాడు జీవన్.

తరువాత అతను శాన్వీ వంక చూసి కనపడకుండా చిన్న సైగ చేశాడు. శాన్వీ ఆద్య తో "లంచ్ కేనా? నేను కూడా వస్తున్నాను.. పదండి" అంది.

వాళ్లకు బై చెప్పి జీవన్ వెళ్ళిపోయాడు. శాన్వీ, మరో ఇద్దరు అమ్మాయిలు ఆద్య, దీప్యలతో కలిసి క్యాంటీన్ వైపు కదిలారు.

శాన్వీ పక్కనున్న స్నేహితురాలు "నేను కూడా సాయంత్రం రావడం లేదు" అంది.

"ఎందుకలా..?" అడిగింది శాన్వీ.

"జీవన్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీ కాబట్టి హై రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ రెస్టారెంట్ లో దోశలతో సరి పెడతారని అనుకోలేదు" అంది ఆ అమ్మాయి.

శాన్వీ మాట్లాడుతూ "నిజానికి పబ్ లో అరేంజ్ చేయాలనుకున్నారు కానీ అక్కడికి అయితే ఆద్య రాదని రెస్టారెంట్ కి ప్రోగ్రాం మార్చాడు జీవన్" చెప్పింది శాన్వీ.

"అయ్యో! నా కోసం ప్రోగ్రాం మార్చడం ఎందుకు? నేనొక్కదాన్నీ రాకపోతే ఏమైంది? ఒక పని చేద్దాం. రెస్టారెంట్ లో చందూ కి విషెస్ చెప్పి, మేము వచ్చేస్తాం. తరువాత మీరు పబ్ కి ప్రొసీడ్ అవ్వండి" అంది ఆద్య.

"మేము వచ్చేస్తాం.. అంటూ దీప్యను కూడా కలపడం ఎందుకు? తననైనా పబ్ లో ఎంజాయ్ చెయ్యనివ్వండి" అంది శాన్వీ స్నేహితురాలు.

"అవును. ఈ రోజుల్లో పబ్ కి వెళ్లడం చాలా కామన్. నీకు ఈ విషయంలో ఏదైనా డౌట్ ఉంటే రిత్విక్ కి కాల్ చేసి కనుక్కో" అంది శాన్వీ.

"అలాగేలే.. ముందు రెస్టారెంట్ కి వస్తాం. తర్వాత పరిస్థితిని బట్టి డిసైడ్ చేస్తాం" చెప్పింది ఆద్య.

శాన్వీ తన నడక వేగాన్ని తగ్గించి, మిగతా వాళ్ళని ముందుకు వెళ్ళనిచ్చింది.

తర్వాత జీవన్ కి కాల్ చేసి, "ఇద్దరూ సాయంత్రం రెస్టారెంట్ కి తప్పకుండా వస్తున్నారు. తరువాత అక్కడ ఆ దీప్యను కన్విన్స్ చేసి పబ్ కి తీసుకొని వెళ్ళచ్చు" అని చెప్పింది.

" థాంక్యూ శాన్వీ. మంచి హెల్ప్ చేస్తున్నావు" అన్నాడు జీవన్.

శాన్వీ తో మాట్లాడి ఫోన్ పెట్టేసిన జీవన్ వెంటనే విక్కీ కి కాల్ చేశాడు.

"ఈవెనింగ్ రెస్టారెంట్ లో ఉన్న మినీ ఫంక్షన్ హాల్ లో కేక్ కటింగ్ జరిగేలా ఏర్పాటు చెయ్యి. తరువాత ఇంట్రెస్ట్ ఉండేవారిని పబ్ కి తీసుకొని వెళ్ళవచ్చు.. నేను కాసేపట్లో అక్కడికి వస్తాను. మిగతా విషయాలు డైరెక్ట్ గా మాట్లాడుకుందాం" అని చెప్పి చందూతో "మనం ఒకసారి వెన్యూ దగ్గరకు వెళదాం. ఏర్పాటు చూసుకోవాలి కదా. ఈవెనింగ్ నేను ఉండను కాబట్టి అన్ని ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేవో ఇప్పుడే చూసుకోవాలి. ఈ జీవన్ వేసిన ప్లాన్ కి తిరుగు ఉండదు" అన్నాడు.

ఇద్దరూ కాలేజీ నుండి బయలుదేరారు.

జీవన్ తో మాట్లాడిన శాన్వీ మనసులోనే నవ్వుకుంది. ఈరోజు పబ్ లో జీవన్ వేసిన ప్లాన్ ఎలాగైనా బెడిసికొట్టేలా చేయాలి అని అనుకుంది. తన వేగాన్ని పెంచి ముందు వెళ్తున్న వాళ్ళను చేరుకుంది.

***

చందూ తో కలిసి విక్కీ వాళ్ళ రెస్టారెంట్ దగ్గరకు వెళ్ళాడు జీవన్. ముందుగానే ఫోన్ చేసి ఉండటంతో వీళ్ళు వెళ్ళేసరికి విక్కీ, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నిలుచొని ఉన్నాడు.

జీవన్, చందూ లు కారు దిగగానే, జీవన్ దగ్గర్నుండి ఆ కార్ కీస్ తీసుకొని, పార్క్ చేయమని తన అనుచరుడికి ఇచ్చాడు.

"ముందు రెస్టారెంట్ లో ఉన్న ఫంక్షన్ హాల్ చూద్దాము" అన్నాడు జీవన్.

లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉన్న మినీ ఫంక్షన్ హాల్ కి తీసుకొని వెళ్ళాడు విక్కీ.

దాదాపు 200 మంది పట్టేలా ఉన్న ఆ ఎయిర్ కండిషన్డ్ ఫంక్షన్ హాల్ ఎంతో రిచ్ గా ఉంది. దాన్ని చూసి చాలా సంబరపడిపోయాడు చందూ.

'జీవన్ లాంటి స్నేహితుడు పక్కన లేకుంటే తను కనీసం ఇటువైపు కన్నెత్తి చూసి ఉండే వాడు కూడా కాదు. జీవన్ కి జీవితాంతం స్నేహితుడిగా ఉండాలి' అనుకున్నాడు చందూ.

"సాయంత్రం 5 గంటల నుండి గెస్ట్ లు వస్తారు. 6 గంటలకు కేక్ కటింగ్ ఉంటుంది. ప్రోగ్రాం అయ్యాక పబ్ కి వెళ్లే ఏర్పాటు ఉంది కాబట్టి వీలైనంతవరకూ ఎనిమిది గంటలకు ఇక్కడి నుంచి అందరూ వెళ్లిపోవాలి. తరువాత ముఖ్యమైన వాళ్లతో పబ్ లో ప్రోగ్రాం ఉంటుంది. ఇక నువ్వు చేసిన ఏర్పాట్లు చెప్పు" విక్కీతో అన్నాడు జీవన్.

"ఇక్కడ ఈవెనింగ్ 5 గంటల నుంచి వెల్కమ్ డ్రింక్ అందిస్తాము. 5:30 కి స్నాక్స్ అండ్ టీ లేదా కాఫీ ఇస్తాము.." అంటూ చెబుతున్న విక్కీ ని ఆపి, ఇవి కాదు నేను అడిగేది" అన్నాడు జీవన్.

"ఓ.. ఐ యాం సారీ! రండి.." అంటూ వాళ్ళిద్దరినీ తన రూమ్ లోకి తీసుకొని వెళ్ళాడు విక్కీ. తన కంప్యూటర్ ఆన్ చేసి, బిల్డింగ్ ప్లాన్ వాళ్లకు చూపిస్తూ మా హోటల్ కి సరిగ్గా వెనుక వైపు పబ్ ఉంటుంది. అవసరం అనుకుంటే పబ్ కి మెయిన్ ఎంట్రెన్స్ నుండే కాకుండా ఇక్కడి నుండి కూడా వెళ్ళవచ్చు. పబ్ కి పక్కనే నాలుగు అపార్ట్ మెంట్ లు ఉన్న ఒక బిల్డింగ్ ఉంటుంది. పబ్ లో లో కార్యక్రమం ముగిశాక నేరుగా ఇంటికి వెళ్లలేని వాళ్ల కోసం ఆ అపార్ట్మెంట్ లు ఉపయోగిస్తాం" చెప్పాడు విక్కీ.

"విషయం సింపుల్ గా ముగిసిపోతే పరవాలేదు కానీ ఏదైనా గొడవ అయితే మాత్రం ఈ రెస్టారెంట్ తో సహా చుట్టుపక్కల ఉండే అన్ని సీసీ కెమెరాల రికార్డింగ్స్ పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. చందూ ఆ అమ్మాయితో కలిసి పబ్ నుంచి ఆ అపార్ట్మెంట్ కి వెళ్ళినట్లు ఎటువంటి రికార్డ్ ఉండకూడదు" అన్నాడు జీవన్.

విక్కీ తన కంప్యూటర్ లో పబ్ బిల్డింగ్ తాలూకు వీడియో చూపిస్తూ "పబ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. వెనకవైపు ఒక చోట గోడ కొద్దిగా పడిపోయినట్లు ఉంటుంది. ఆ గోడను సులభంగా దాటుకొని పక్కనున్న అపార్ట్మెంట్ల లోకి వెళ్ళవచ్చు. అవసరమైతే ఆ గోడ దగ్గర ఈజీ గా దాటడానికి వీలుగా ఒక స్టూల్ వేయిస్తాను" అని చెప్పాడు విక్కీ.

"మత్తుమందు సంగతేమిటి?" అడిగాడు జీవన్.

"అది చాలా లైట్ డోస్ లో ఉంటుంది. ఒక అరగంట కి నార్మల్ అయిపోతారు. జరిగినవి గుర్తుండవు" చెప్పాడు విక్కీ.

జీవన్, చందూ భుజం మీద చేయి వేసి "ప్లాన్ అంతా బాగుంది. ఫెయిల్ కావడానికి ఎక్కడా అవకాశం లేదు. నువ్వు పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకొని శృతి మించితే తప్ప. నీ ఫేక్ బర్త్డే కోసం, తరువాత జరిగే ఏర్పాట్ల కోసం భారీగా ఖర్చు పెడుతున్నాను. అంతా ఆద్యను నా వైపు తిప్పుకోవడానికి ఆ దీప్య సహాయ పడుతుందని. నీ వల్ల ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం సహించను" అన్నాడు జీవన్.

తరువాత విక్కీ వంక తిరిగి, ఆ అమ్మాయిని కార్ ఎక్కించాక వీడు మళ్లీ అపార్ట్మెంట్ కి వస్తాడు. వీడి కోసం ఎవరినైనా అరేంజ్ చెయ్యి. బర్త్డే కదా పాపం.. ఎంజాయ్ చేస్తాడు" అన్నాడు.

సరేనన్నట్లు తల ఊపాడు విక్కీ.

తరువాత చందూ వంక చూసి “నువ్వు చాలా లక్కీ దోస్త్! నీ గురించి జీవన్ తీసుకున్న కేర్ మీ నాన్న కూడా తీసుకోని ఉండడు" అన్నాడు.

"నిజమే! అందుకే జీవనన్న కోసం నా ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను" అంటూ తన స్వామిభక్తిని ప్రకటించాడు చందూ.

జీవన్, విక్కీతో "నా కోసం నిన్ను ఇబ్బందుల్లోకి నెడుతున్నానా?" అని అడిగాడు.

"ఈ రెస్టారెంట్ మా బంధువుల పేరుతో ఉంది. రికార్డ్స్ ప్రకారం నేను ఇక్కడ ఫ్లోర్ ఇంచార్జ్ మాత్రమే.

ఇక పబ్ , ఆ పక్కనున్న అపార్ట్మెంట్స్ మా మామయ్య పేరుతో ఉన్నాయి. వాళ్ళుకూడా వేరే వాళ్లకు లీజ్ కి ఇచ్చినట్లు రాసిపెట్టాం. ఒక వేళ ఎప్పుడైనా రైడ్ జరిగితే ఇంకొకరికి లీజ్ కి ఇచ్చినట్లు రాసుకొని యధాప్రకారం నడిపిస్తాం.

ఇలాంటి విషయాల్లో ఇప్పుడు నాకు బాగా అనుభవం వచ్చింది. అన్నీ మించి, ఇరుక్కుంటే మీరున్నారు కదా! ఎన్నిసార్లు నన్ను మీ నాన్నగారు గట్టెంకించ లేదు?" అన్నాడు విక్కీ జీవన్ పట్ల కృతజ్ఞత ప్రకటిస్తూ .

"థాంక్ యు విక్కీ! మేము బయలు దేరుతాం. ఫోర్ థర్టీ కి చందూ కొంతమంది ఫ్రెండ్స్ తో ఇక్కడికి వస్తాడు. నేను సీన్ లో ఉండను. నా నెంబర్ కి కాల్ చెయ్యొద్దు. మరీ అవసరమైతే చందూకి చెప్పు. వేరే నంబర్ ఇస్తాడు" అని చెప్పి అక్కడినుంచి బయలుదేరాడు జీవన్.

అలా ఆ రోజు ఒక కోటీశ్వరుడైన అబ్బాయి, మరో కోటీశ్వరుడి కూతురికి దగ్గర కావడానికి ఒక సాధారణమైన పద్దెనిమిదేళ్ల అమ్మాయిని ట్రాప్ చెయ్యడానికి, బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకోవడానికి రంగం సిద్ధమైంది.

ఆ అమ్మాయికి ఏవిధమైన సపోర్ట్ లేదు, కేవలం 'అన్నయ్యా' అని పిలుచుకునే రిత్విక్ తప్ప.

కానీ అతనొక్కడే వందమందితో సమానమనీ, నమ్మిన వాళ్ల కోసం ఎవర్నైనా ఎదిరిస్తాడనీ వీళ్ళెవ్వరూ ఊహించలేదు.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


36 views0 comments

Comments


bottom of page