top of page

వెంటాడే నీడ ఎపిసోడ్ 13

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Ventade Nida Episode 13' Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…


కూతుర్ని తీసుకుని సుమంత్ వాళ్ళ ఊరికి బయలుదేరుతాడు శంకరశాస్త్రి. డ్రైవర్ ని పేరు అడిగితే అతను సక్రమంగా సమాధానం ఇవ్వడు. కారును ఊడల మర్రి చెట్టు దగ్గర ఆపుతాడు. అతని చేతిలోని ఫోన్ తీసుకొని దూరంగా పరిగెడతాడు శంకరశాస్త్రి.

ఇక చదవండి...


విశాల్ కి కాల్ చేసిన సుమంత్ కి స్విచ్చ్డ్ ఆఫ్ అని సమాధానం వచ్చింది.. తన ఫోన్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవాలని తన నెంబర్ కి కాల్ చేశాడు.


ఫోన్ తీసిన వ్యక్తి "ఎవరూ?" అని అడుగుతాడు.


"నా పేరు సుమంత్. మీరెవరు? నా ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది?" అని అడుగుతాడు సుమంత్.


అటువైపు నుండి సమాధానం రాదు. ఏదో పెనుగులాట జరిగిన శబ్దం వినబడింది.


మరి కొద్దిసేపటికి "సుమంత్! నువ్వేనా..? నేను మీ మామయ్య శంకరశాస్త్రిని" అంటూ తన మామయ్య కంఠం వినపడింది.

ప్రాణం లేచి వచ్చినట్లయింది సుమంత్ కి. చాలా కాలం తరువాత తనకు తెలిసిన వాళ్ల కంఠం వినపడింది.


"మామయ్యా! నా సంగతి తర్వాత చెబుతాను. ముందు దగ్గర్లో మర్రి చెట్టు ఏదైనా ఉందా..చెప్పండి' అని అడిగాడు సుమంత్.


"అవును బాబూ! ఉంది" అన్నాడు శంకరశాస్త్రి.


"ఒక దయ్యం ఆ చెట్టు కొమ్మ విరిచి దీక్ష మీద వేయబోతున్నట్లు నాకు కల వచ్చింది. ఒకసారి చూడండి మామయ్యా!" అన్నాడు సుమంత్.


వెంటనే శంకరశాస్త్రి వెనక్కి తిరిగి చూశాడు. అదే సమయంలో గాలి బలంగా వీచింది. దీక్ష మీద పడబోతున్న చెట్టుకొమ్మ కాస్త పక్కకు జరిగి ఆ కారు డ్రైవర్ పైన పడింది.


నిశ్చేష్టురాలయింది దీక్ష. కొమ్మ తన పైన పడలేదు. తన తల్లి ఉన్న కారు పైన కూడా పడలేదు. సరిగ్గా ఆ కారు డ్రైవర్ పైన పడింది. దూరంగా ఉన్న తండ్రి తమ వైపే చూస్తూ ఉండటం గమనించింది దీక్ష.


'ఆ కొమ్మ అ గాలి వల్ల పక్కకు జరిగిందో తన తండ్రి చూపు తగిలి జరిగిందో కానీ మొత్తానికి అదృష్టం తమవైపు ఉంది' అనుకుంది.


అంతలో అంత పెద్ద చెట్టు కొమ్మనూ పక్కకు నెట్టి ఆ వ్యక్తి పైకి లేచాడు. ఇంతలో ఆ దారిలో వెడుతున్న ట్రాక్టర్ లోని వ్యక్తులు చెట్టు కొమ్మ విరిగి పడడం గమనించి మర్రి చెట్టు దగ్గర ట్రాక్టర్ ఆపారు.


అది గమనించిన ఆ కారు డ్రైవర్ దీక్ష వంక చూస్తూ "అప్పుడే ఏమైంది లే! నా తడాఖా చూపిస్తాను" అంటూ అంత వానను కూడా లెక్కచేయకుండా పొలాల వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు.


శంకరశాస్త్రి సుమంత్ తో "నువ్వు చెప్పినట్లే ఏదో చెట్టు కొమ్మ విరిగి పడింది బాబూ! నేను ఇప్పుడే అక్కడికి వెళ్లి మళ్ళీ కాల్ చేస్తాను" అని చెప్పి మర్రిచెట్టు దగ్గరికి వచ్చాడు.


ట్రాక్టర్ నుండి దిగిన వ్యక్తులు శంకరశాస్త్రి ని గుర్తించి, "మీరు చలపతి రావు గారి బంధువులు కదా! నమస్కారం స్వామీ" అన్నారు.


కొంతమంది యువకులు "ఆ పరిగెత్తుతున్న వాడిని వెంబడించమంటారా" అని అడిగారు. అవసరం లేదని చెప్పిన శంకరశాస్త్రి దీక్ష దగ్గరకు వచ్చాడు.


"అమ్మా! నీకు ఏమీ ప్రమాదం కాలేదు కదా.." అని అడిగాడు.


"ఏం కాలేదు నాన్నా! నా పైన పడాల్సిన ఆ చెట్టు కొమ్మ ఆ దుర్మార్గుడి మీద పడింది. నువ్వు చేసిన పుణ్యమే గాలి రూపంలో వీచి నన్ను కాపాడినట్లే అనుకుంటున్నాను" అంది దీక్ష.


కారులోంచి దిగిన పార్వతమ్మ కూతుర్ని హత్తుకుంది.

తర్వాత భర్త వైపు తిరిగి "మీరు ఆ డ్రైవర్ సెల్ తీసుకుని ఎందుకు పరిగెత్తారు?" అని అడిగింది.


“అతనికి ఫోన్ చేసిన వ్యక్తి , 'నా పేరు సుమంత్. నా ఫోన్ నీ దగ్గర ఎలా ఉంది' అని అడిగాడు. సరిగ్గా ఆ సమయానికి గాలి బలంగా నా వైపు వీచడం తో సుమంత్ అన్న మాటలు నా చెవిలో పడ్డాయి. ముందు సుమంత్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే పెద్ద సమస్య తీరినట్లు అవుతుంది అనుకొని ఆ ఫోన్ లాక్కొని పరిగెత్తాను" అని చెప్పాడు శంకరశాస్త్రి.


ట్రాక్టర్ లోంచి దిగిన వాళ్ళల్లో ఒక యువకుడు "నాకు కారు డ్రైవింగ్ వచ్చు. నేను డ్రైవింగ్ చేస్తాను, పదండి" అన్నాడు.


దాంతో భార్య, కూతురు దీక్షలతో మళ్ళీ కార్లో కూర్చున్నాడు శంకర శాస్త్రి. కారు బయలు దేరింది.


"సుమన్ ఆచూకీ దొరికిందన్నమాట. ఇప్పుడు ఫోన్ చెయ్యండి" అంది పార్వతమ్మ.


ఫోన్ చేయాలని చూశాడు శంకరశాస్త్రి.


కానీ నీళ్ళ లో తడిసిన ఆ ఫోన్ పని చేయలేదు.


"ఇంటికి వెళ్లాక ప్రయత్నిద్దాం నాన్నా" అంటూ దీక్ష ఆ మొబైల్ నుంచి సిమ్ కార్డ్ బయటకు తీసి తుడిచి,తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకుంది.


కారును చలపతిరావు ఇంటి ముందు ఆపాడా యువకుడు.


అతనికి కృతజ్ఞతలు చెప్పి ఇంట్లోకి వెళ్ళారు శంకర శాస్త్రి, పార్వతమ్మ, దీక్షలు.


వాళ్లను సాదరంగా ఆహ్వానించారు చలపతిరావు దంపతులు.


పూర్తిగా తడిసి ముద్దయిన వాళ్లను చూసి "అదేమిటి? దారిలో కారు లోంచి దిగారా?" అని అడిగాడు చలపతిరావు.


వాళ్లు తల తుడుచుకోవడానికి టవల్ అందించింది చలపతిరావు భార్య అన్నపూర్ణ.


శంకరశాస్త్రి తల తుడుచుకోకుండానే దీక్ష హ్యాండ్ బ్యాగ్ నుంచి ఫోన్, సిమ్ కార్డు బయటికి తీసి చలపతిరావుకి అందించి “వీటిని పొడి బట్టతో తుడవాలి" అన్నాడు.


విషయం అర్థం కాకపోయినా చలపతిరావు అలాగే చేశాడు.


అప్పుడు శంకర శాస్త్రి మాట్లాడుతూ, "ముందుగా ఒక శుభవార్త. మన సుమంత్ క్షేమంగా ఉన్నాడు" అన్నాడు.


చలపతి రావు, అన్నపూర్ణల ముఖాల్లో ఆనందం వెల్లి విరిసింది.


జరిగిన సంఘటనలన్నీ వివరంగా చెప్పాడు శంకర శాస్త్రి.


చివరగా, "మొత్తానికి సుమంత్ తొందర్లోనే మనకు కనిపిస్తాడు. మనసు కుదుట పడుతోంది. ఈ ఫోన్ ఆన్ అయితే సుమంత్ కి కాల్ చెయ్యవచ్చు. లేకున్నా సుమంత్ తనే మనకు కాల్ చేస్తాడు " అన్నాడు.


"పార్వతమ్మ మాట్లాడుతూ “ముందు ఆ డ్రైవర్ ఎవరో, ఎందుకలా ప్రవర్తించాడో కనుక్కోండి" అంది.


వెంటనే సుందరయ్యకు కాల్ చేసాడు శంకర శాస్త్రి..


"ఇప్పుడే నేను మీకు కాల్ చేయబోతున్నాను శాస్త్రి గారూ! మా డ్రైవర్ లేడని, వేరే మనిషితో మీ కోసం కారు పంపాను. ఆ డ్రైవర్, దార్లో ఒక పొడవాటి మనిషి రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉండటంతో దిగి చూశాడట.


అంతే! అతను నేను పంపిన మనిషి మీద దాడి చేసి, బాగా కొట్టి, రోడ్డు పక్కనున్న పొదల్లోకి తోసేసాడట.


"అతను ఇప్పుడే స్పృహలోకి వచ్చి, నాకు విషయం చెప్పాడు. అతనెవరో కార్లు దొంగతనం చేసే మనిషి కాబోలు. కారు రాలేదని మీరైనా కాల్ చేసి ఉండాల్సింది. మీరు ఉరికి వెళ్ళారా?" అడిగాడు సుందరయ్య.


'అతను కారు దొంగ కాదు. మా శత్రువు. మమ్మల్ని ఆపదలలోకి నెట్టడానికి డ్రైవర్ గా వచ్చాడు. బహుశా రేపు మృత్యుంజయ హోమం జరగకుండా ఆపాలని ప్రయత్నించి ఉంటాడు. అతను పారిపోయాడు. మీ కారు మా దగ్గరే ఉంది.మేము కృష్ణాపురం లోనే ఉన్నాము" చెప్పాడు శంకర శాస్త్రి..


“కారు గురించి బెంగ లేదు. మీరు క్షేమంగా ఉన్నారు. అంతే చాలు" అన్నాడు సుందరయ్య.


ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఫోన్ పెట్టేశాడు శంకర శాస్త్రి.

***

తండ్రికి ఫోన్ చేసిన వికాస్, తన కొడుకు వైభవ్ ని కిడ్నాప్ చెయ్యడానికి ఎవరో వచ్చినట్లు తెలుసుకొని ఆందోళన చెందుతాడు.


"నాన్నా! నువ్వేం కంగారు పడకు. ఇంట్లోనే ఉండు. కాసేపట్లో శ్రేయ డెలివరీ కాబోతుంది. తరువాత కాల్ చేస్తాను" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు. అతను రిసెప్షన్ దగ్గరకు వచ్చేసరికి ఏసీపీ ప్రతాప్ అక్కడకు వచ్చి ఉన్నాడు.


అయన వికాస్ కి విష్ చేసి, తనను తాను పరిచయం చేసుకున్నాడు.


"మిమ్మల్ని చూడక పోయినా మీ గురించి విన్నాను. డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసింది మీరే కదా! " ఆయనకు షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నాడు వికాస్.


"నేను కూడా మీ గురించి విన్నాను. ఈ మధ్యనే ఒక రాజకీయ నాయకుడి వాచ్ మాన్ ఇంటిపై దాడి చేసి డెబ్భై కోట్లు పట్టుకున్నది మీరే కదా! ఈ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పడం లేదు. ఓ పావు గంట నాకోసం కేటాయిస్తారా?" అన్నాడు ఏసీపీ ప్రతాప్.


"అలాగే. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడే తెలిసింది. మా ఇంటి దగ్గర్నుంచి, మా అబ్బాయిని కిడ్నాప్ చెయ్యడానికి ఎవరో ప్రయత్నించారు. దయచేసి ప్రొటెక్షన్ ఏర్పాటు చెయ్యండి" అంటూ రిక్వెస్ట్ చేసాడు వికాస్.


అడ్రస్ అడిగి తెలుసుకొని వెంటనే ఆ ఏరియా ఎస్సైకి కాల్ చేసాడు ప్రతాప్.


వికాస్ ఉంటున్న ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చెయ్యమని చెప్పాడు. అలాగే ఆ ఏరియాలోని సీసీ కెమెరాల సహాయంతో ఆ ఇంటికి వచ్చిన వ్యక్తిని ట్రేస్ చెయ్యమన్నాడు.


తరువాత ఆయనతో పాటు బయట ఉన్న లాన్ వేపు నడిచాడు వికాస్.


"మీ భార్య పైన జరిగిన హత్యా ప్రయత్నం ఒక సైకో కిల్లర్ చేసినట్లు బయటకు అనిపించినా ఎవరో మీ పైన కక్షతో చేసినట్లు అనిపిస్తోంది. మీకు ఎవరి మీదయినా అనుమానం ఉందా? ఎవరితోనైనా కక్షలు ఉన్నాయా? మీరు చెప్పే సమాధానం కేస్ సాల్వ్ చెయ్యడంలో చాలా ఉపయోగ పడుతుంది" అడిగాడాయన.


"మొదట్లో నేను కూడా ఇది సీరియల్ కిల్లర్ పని అనుకున్నాను. కానీ ఇప్పుడు మా అబ్బాయిని అపహరించాలని చూడటంతో నా మీద కక్షతోనే చేశారనిపిస్తోంది. నాకు ఎవ్వరితో గొడవలు లేవు.

ఇందాక మీరు చెప్పిన డెబ్బై కోట్ల కేస్ విషయంగా ఆ రోజు రైడ్ ముగిసాక నాకొక కాల్ వచ్చింది. దొరికిన సొమ్ములో సగం మేమందరం పంచుకొని అతన్ని వదిలివేయాలట.


నేను ఒప్పుకోలేదు. తరువాత పూర్తి మొత్తం మమ్మల్నే ఉంచుకొని అతన్ని వదిలెయ్యమన్నారు. దానికి కూడా నేను లోబడ లేదు. జరిగిన విషయాలు మా పై అధికారులకు చెప్పాను. వాళ్ళు ఆఫీస్ తరఫున పోలీసులకు రాత పూర్వకంగా తెలుపుతామన్నారు" చెప్పాడు వికాస్.


"మీరు రైడ్ చేసింది మోహన్ అనే ఒక చిన్న నాయకుడి కార్ డ్రైవర్ ఇంటి పైన. అక్కడ అంత మొత్తంలో డబ్బు ఉందని మీకెలా తెలిసిందో చెప్పగలరా?" అడిగాడు ప్రతాప్.


వికాస్ మౌనం చూసి, "ఓకే. మీ ఇన్ఫార్మర్ గురించి చెప్పనవసరం లేదు. కానీ మాకు అందిన వివరాల ప్రకారం ఆ డబ్బు గోవర్ధన రావు అనే మాజీ మినిష్టర్ ది.

ఈ మోహన్ అనే వ్యక్తి గతంలో అయన దగ్గర పిఎ గా పని చేసాడు.


ఇద్దరూ కలిసి గతంలో రియల్ ఎస్టేట్ దందాలు చేసేవాళ్ళు.." చెప్పాడాయన.


గోవర్ధన రావు... ఆ పేరు వినగానే వికాస్ రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

ఆ పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తున్నాడు.


ఇంకా వుంది…

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


85 views0 comments

Comments


bottom of page