top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 22

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link Of Love Challenge Telugu Serial

'Love Challenge Episode 22' Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్గత ఎపిసోడ్ లో…

సెమిస్ లో రిత్విక్, జీవన్ లు బాగా రాణించడంతో నిత్యా కాలేజ్ టీం సులభంగా గెలుస్తుంది.

ప్లేయర్స్ కి ట్రీట్ ఇస్తాడు రాఘవేంద్ర.

అక్కడికి మీడియాను పిలిచి లవ్ ఛాలెంజ్ టాస్క్ ఏమిటో చెబుతుంది ఆద్య.

ఇక చదవండి…


న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తోంది ఆద్య.

"మీరు అడిగిన ప్రశ్న సరైనదే .మాక్ అసెంబ్లీ, మాక్ పార్లమెంట్, మాక్ ఎలక్షన్స్.. ఇలాంటివి ఒక స్కూల్లోనో, కాలేజ్ లోనో కండక్ట్ చేయవచ్చు. ఆ టీచర్ల, లెక్చరర్ల ఆదేశంతో స్టూడెంట్స్ దాంట్లో పాల్గొంటారు.

కానీ పొద్దున లేచి తమ వ్యవసాయ పనుల్లో, కూలి పనుల్లో నిమగ్నమై ఉంటారు గ్రామస్తులు. తమ పనులు మానుకొని నమూనా ఎలక్షన్ లో ఓట్ చేయడానికి రావడం కష్టమే. కానీ ఆ ఊరు మా నాన్నగారికి సొంత ఊరు. ఆయన చాలా ఏళ్ళ నుంచి ఆ ఊరిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

నిన్న ఈ ప్రతిపాదన నాన్నగారితో చెప్పినప్పుడు ఆయన ఆ గ్రామస్థులు కొందరికి ఫోన్ చేసి కనుక్కున్నారు. ఖచ్చితంగా మాకు సహకరిస్తామని వాళ్ళు చెప్పారు. ఏ పనికైనా ప్రయత్నం మొదలు పెడితే దారులు వాటంతట అవే కనిపిస్తాయి.


ఆ గ్రామానికి యాభై లక్షలు విరాళంగా ఇవ్వాలని నాన్నగారు ఎప్పటి నుండో అనుకుంటున్నారు.

కాబట్టి ఈ నమూనా ఎన్నికలు ముగిశాక, ఆ మొత్తాన్ని ఆ గ్రామం కోసం ఖర్చు చేస్తారు. ఎందుకోసం ఖర్చు పెట్టాలన్నది పూర్తిగా వాళ్ళ నిర్ణయానికే వదిలి పెడతారు. రిత్విక్, జీవన్ లు కూడా కొంత మొత్తాన్ని ఇస్తే, దాన్ని కూడా జతచేసి ఆ గ్రామ ప్రముఖుల పేర్లతో ముందుగానే బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. ఈ ఎన్నికలయ్యాక వాళ్ళందరూ కలిసి కూర్చుని ఈ మొత్తాన్ని ఎలా ఖర్చు పెట్టాలో తీర్మానించుకున్నారు. వీళ్ళిద్దరూ ఒకే మొత్తాన్ని ఇస్తారు కాబట్టి, ఓటింగ్ లో డబ్బు ప్రభావం ఉండదు. " అని చెప్పింది ఆద్య.

రిత్విక్, జీవన్ లు ఒకరితో ఒకరు మాట్లాడుకొని "మేము కూడా చెరో 50 లక్షలు విరాళంగా ఇస్తాము" అని చెప్పారు.

"సో.. ఇప్పుడు ఒకటిన్నర కోటి జమ అవుతుంది.

ఇంత మొత్తం వాళ్లకు ఇస్తున్నందుకు బదులుగా ఆ గ్రామస్థులను నేను కోరేది ఒక్కటే.

నెల రోజుల పాటు వీళ్ళిద్దరూ ఆ గ్రామస్థులకు అందుబాటులో ఉంటారు. వాళ్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలు చూపుతారు. మీకు ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. మనుషుల స్వభావాన్ని గ్రామస్తులు చాలా సులభంగా కనుక్కో గలరు. కాబట్టి నెల తర్వాత వాళ్లు ఇవ్వబోయే తీర్పు సరైనదే అయి వుంటుంది అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఇద్దరినీ నిశితంగా పరిశీలించి సరైన వ్యక్తిని ఎన్నుకుంటారు." అంది ఆద్య.

ఒక ప్రముఖ పత్రికకు చెందిన మహిళా విలేకరి లేచి "మిస్ ఆద్యా! నేను ఒక కఠినమైన ప్రశ్న అడుగుతాను. ఏమీ అనుకోరుగా" అంది.

అడగమంది ఆద్య.

"ఈ పోటీకి, మీరు లవ్ చేయడానికి సంబంధం ఏమిటి? ఎవరు మంచి వ్యక్తి అయితే వాళ్ళనే ప్రేమిస్తారా లేక ఎవరు జనాలకు ఎక్కువ సహాయం చేస్తే వాళ్ళని ప్రేమిస్తారా? నాకు తెలిసిన ఒక బాబా ఉన్నాడు. ఎవరు ఏ సమస్య అడిగినా తగిన పరిష్కారం చెప్పగలడు. కట్టుకున్న బట్టలు తప్ప తన సొంతానికి ఏమీ ఉంచుకోడు. ఒకవేళ ఈ పోటీలో ఆయన కూడా పాల్గొంటే ఖచ్చితంగా గ్రామస్థులందరూ ఆ బాబా కే ఓటు వేస్తారు. అప్పుడు మీరు అతన్ని వరిస్తారా?" అని అడిగింది.

ఆద్య నవ్వుతూ "నిజంగానే కష్టమైన ప్రశ్న అడిగారు. ఒక అమ్మాయి ప్రేమించడానికి తగిన అర్హతలు వీళ్ళిద్దరికీ ఉన్నాయి. ఆ అర్హతలతో పాటు ఎవరి వ్యక్తిత్వం ఉన్నతమైనదో తెలుసుకొని వాళ్ళనే వరిస్తాను. మీరు చెప్పిన అన్నీ తెలిసిన బాబా వస్తే ఆయన్ని జడ్జి గా ఉండమని చెబుతాను. అంతేకానీ కంటెస్టెంట్ గా కాదు" అని చెప్పింది.

ఆద్య చెప్పిన సమాధానాన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు అక్కడ ఉన్న స్టూడెంట్స్.

ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు మాట్లాడుతూ "రామకృష్ణాపురం గ్రామాన్ని ఎంపిక చేసుకోవడానికి అది మీ నాన్నగారి సొంత ఊరు అనేదే కారణమా.. మరేదైనా కారణం ఉందా?" అని అడిగాడు.

“కొత్త విధానం వైపు గ్రామస్థుల ఆలోచన మళ్ళించడం, అది మనకు తెలిసిన గ్రామం అయితే సులభమవుతుందని భావించాము. క్యాస్ట్ గురించి నేను మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కానీ ప్రజలు ఓటు వేయడానికి గల కారణాల్లో డబ్బు, మద్యం ప్రభావం కాకుండా కుల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది.

ఈ గ్రామంలో రిత్విక్, జీవన్ ల కాస్ట్ కి సంబంధించిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఆ గ్రామం గురుమూర్తి గారి నియోజక వర్గంలో లేదు. కాబట్టి గెలవడానికి ఇద్దరికీ సమానావకాశాలు ఉంటాయి. ఇవే ఆ గ్రామాన్ని ఎంపిక చేయడానికి ముఖ్య కారణాలు " అంది ఆద్య.

"ఈ టాస్క్ వల్ల మీరు సమాజంలో ఏమైనా మార్పు తేవాలి అనుకుంటున్నారా?" అని ప్రశ్నించాడు ఒక విలేఖరి.

"ప్రజలు ఎప్పుడూ మార్పుకి వ్యతిరేకం కాదు. రూలింగ్ పక్షం చేతిలో డబ్బు పుష్కలంగా ఉంటుంది. అధికార యంత్రాంగం వాళ్ల కనుసన్నల్లో ఉంటుంది. అలాగని ఎప్పుడూ అదే పార్టీ అధికారంలో ఉండదు కదా!అంటే దీని అర్థం ప్రజలు వద్దనుకున్నప్పుడు ఎంతటి వాడైనా దిగి పోవలసిందే. కాబట్టి కొత్త ఆలోచనలకు, నిజాయితీగా చేసే ప్రతిపాదనలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది" అని చెప్పింది ఆద్య.

మరో విలేఖరి ప్రశ్నిస్తూ " ఈ మోడల్ ఎన్నికలను ఆదర్శంగా తీసుకోవాలంటే అన్ని చోట్లా ఇలా ఆ ఊర్లో లేని కాస్ట్ కి సంబంధించిన అభ్యర్థులు దొరకరు కదా!" అన్నాడు.

సమాధానంగా ఆద్య" ఈ ఊర్లో కూడా స్థానికుడైన ఒక వ్యక్తిని ఈ మోడల్ ఎన్నికలలో నిలబెడుతున్నాం. అతను ఆ ఊర్లో పుట్టి పెరిగిన వాడు. ఆ ఉరి ఓటర్లలో తొంభై శాతం అతని సామజిక వర్గం వారే ఉంటారు.

'ఎవరిని ఎన్నుకున్న ఒకటే' అని ప్రజలకు అనిపించినప్పుడే ప్రజలు తమ వాడికి ఓట్ వెయ్యాలని ఆలోచిస్తారు. సరైన అభ్యర్థి దొరికితే ప్రజలు కులాన్ని పట్టించుకోరని నా అభిప్రాయం. వీళ్ళిద్దరూ దాన్ని ప్రూవ్ చెయ్యబోతున్నారు" అంది ఆద్య.

"రిత్విక్, జీవన్ లను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాము" అన్నారు విలేకరులు.

వాళ్లు అందుకు అంగీకరించారు.

"ముందుగా జీవన్ ను అడగటం ప్రారంభించారు విలేకరులు.

“మీ నాన్నగారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎలక్షన్లలో ఏమేమి జరుగుతాయి అనేది మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు అందుకు భిన్నంగా ప్రవర్తించ గలరా? మీ దృష్టిలో కొన్ని విషయాలు తప్పుగా కనపడవు కదా? అంటే ఓటర్ లను ప్రలోభ పెట్టడం, బెదిరించడం.. లాంటివి " అని అడిగాడు ఒక విలేఖరి.

జీవన్ సమాధానమిస్తూ "ఎక్కువమంది, 'అందరితో పాటే మనము' అనే సిద్ధాంతానికి లోబడతారు. ఒకరిని చూసి ఒకరు పొరపాట్లు చేస్తూ ఉంటారు. రిత్విక్ లాంటి ఏ కొద్దిమందో ప్రవాహాన్ని ఎదిరించి నిలబడతారు. అతని ప్రభావంతో నాలాంటి వాళ్లు పక్కన చేరితే, ఆ ప్రవాహానికి అడ్డు గోడ ఖచ్చితంగా తయారవుతుంది" అని చెప్పాడు.

స్టూడెంట్స్, జీవన్ చెప్పినదానికి మద్దతు తెలిపారు.

మరొక రిపోర్టర్ రిత్విక్ ని ప్రశ్నిస్తూ, " మీ మొత్తం ఆస్తులు ఎంత" అన్నాడు.

వెంటనే అతనే మాట్లాడుతూ "చెప్పమని కాదు. కానీ వేల కోట్ల లోనే ఉంటుంది కదా! మీరు కోరుకుంటే ఒక సెలబ్రిటీ ని హాలీవుడ్ నుండైనా పిలిపించుకో గలరు. ఆమెతో డేట్ చెయ్యగలరు. మరి ఇక్కడ ఒక అమ్మాయి కోసం ఛాలెంజ్ చేసి, అవస్థలు పడాల్సిన అవసరం ఏముంది?" అని అడిగాడు.

"మీ కంటికి ఆద్య హాలీవుడ్ సెలబ్రిటీ కంటే తక్కువగా కనిపిస్తోందా" అని అడిగాడు రిత్విక్.

అందరూ నవ్వేశారు.

ఆ రిపోర్టర్ ఏం చెప్పాలో తెలీక "నా ఉద్దేశం అది కాదు.." అంటూ ఏదో చెప్పబోయాడు.

"మీరు చెప్పాలనుకున్నది అర్థమైంది. కానీ నాకు కావాల్సింది డబ్బు కోసం వచ్చి వినోదాలు పంచే వాళ్లు కాదు. వ్యక్తిత్వం ఉన్న అమ్మాయితో జీవితాంతం ఉండాలనుకుంటున్నాను. పైగా ఆద్య మమ్మల్ని సింహంతోనో పులితోనో పోరాడామన లేదు. సరైన మార్గంలో ప్రజలకు దగ్గర కమ్మంటోంది. గ్రామస్థుల, రైతుల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసుకోమంటోంది. ఇది ఒక రకంగా మా రాజకీయ ప్రవేశానికి ట్రైనింగ్ లాంటిది. పాలిటిక్స్ లోకి వచ్చాక చుట్టూ వందిమాగధులు చేరుతారు. ఏంచేసినా జైకొడతారు. ఇప్పుడలా కాదు. ఈ మోడల్ ఎలక్షన్ లలో ఎవరి పొరపాట్లు వాళ్ళు తెలుసుకోవచ్చు"అన్నాడు.

వచ్చిన వాళ్ళలో ఒక సీనియర్ రిపోర్టర్ మాట్లాడుతూ ఈ టాస్క్ సక్రమంగా జరిగితే రాజకీయాల్లో ఒక మంచి మార్పుకు శ్రీకారం చుడుతుంది. పోటీదారులు ఒక సంయమనానికి వచ్చి తాము ఖర్చు చేయాలనుకునే దాంట్లో సగం మొత్తం ఆ గ్రామానికి లేదా నియోజకవర్గానికి శాశ్వతంగా ఉపయోగపడే పనులు కోసం ఖర్చు చేస్తే ఎన్నికలు సక్రమంగా జరగడంతో పాటు ఉద్రిక్తతలు సగానికి సగం తగ్గుతాయి. ఆల్ ది బెస్ట్" అన్నాడు.

"రాఘవేంద్ర మాట్లాడుతూ "వారం రోజులపాటు టీం లో ఉండే అందరికీ ఆ ఊర్లో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం. మీకు ఏ అసౌకర్యం కలగకుండా చూస్తాం. అక్కడి స్కూల్ గ్రౌండ్ లో రోజంతా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ వారం ముగిశాక అందరూ ఇక్కడికి వచ్చెయ్యవచ్చు. ఆ తరువాత రిత్విక్, జీవన్ లు తమకు వీలైన సమయంలో ఆ గ్రామానికి వచ్చి పోతూ ఉండవచ్చు. గ్రామస్థులతో ఫోన్ లో టచ్ లో ఉండవచ్చు. ఇద్దరికీ కార్లు ఉన్నాయి కాబట్టి 50 కిలోమీటర్లు పెద్ద సమస్య కాదు" అన్నాడు.

జీవన్ మాట్లాడుతూ "మొదటగా ఈ లవ్ ఛాలెంజ్ ప్రస్తావన నేను తెచ్చాను. హాస్యాస్పదం కావాల్సిన ఆ ఛాలెంజ్ ని ఆద్య అందరూ ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం లాగా మార్చింది. అందరం ఆమెను అభినందిద్దాం" అంటూ లేచి నిలబడి చప్పట్లు కొట్టాడు.

మిగిలిన వాళ్లు కూడా పైకి లేచి ఆమెను అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.

ఎలాంటి గొడవలకు దారి తీస్తుందో నని భయపడ్డ ఈ లవ్ ఛాలెంజ్ చక్కటి రూపుదిద్దుకోవడం, సెమీ ఫైనల్ మ్యాచ్ లో జట్టు ఘన విజయం సాధించడం.. ఈ రెండు ఆనందాలతో స్టూడెంట్స్ అందరూ తృప్తిగా ఇళ్లకు వెళ్లారు.

***

మరుసటి రోజు, క్రికెట్ టీం లో ఉండే స్టూడెంట్స్ అందరూ ఉదయం ఎనిమిదింటికి తమ కాలేజ్ చేరుకున్నారు. ఆద్య, లవ్ ఛాలెంజ్ కి సాక్షులుగా ఉన్న దీప్య, చందూ, సందీప్, ప్రీతం, శాన్వీ లు కూడా అక్కడికి చేరుకున్నారు. కాలేజ్ లోనే అందరికీ అల్పాహారం ఏర్పాటు చేశారు.

మోటూ, సాగరికలు కూడా ఈ వారం ఆ గ్రామం లోనే ఉంటామని చెప్పడంతో వాళ్ళని కూడా రమ్మన్నారు.

సెమీస్ మ్యాచ్ ప్రాక్టీస్ కి సహకరించిన శోభన్ కాలేజ్ స్టూడెంట్స్ కొందరు ఫైనల్స్ కి కూడా సహకరిస్తామని చెప్పడం తో వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నారు.

సరిగ్గా తొమ్మిది గంటలకు కాలేజ్ బస్సు లో అందరూ రామకృష్ణాపురం బయలుదేరారు.

స్టూడెంట్స్ కేరింతలు, ఆటపాటలు, క్విజ్ ప్రోగ్రామ్స్, అంత్యాక్షరి పోటీలు .. ఇలా సరదాగా వాళ్ళ ప్రయాణం సాగింది.

స్టూడెంట్స్ ఆనందానికి అడ్డు రాకూడదని రాఘవేంద్ర, నిత్య తమ కారులో వస్తున్నారు.

ఇంకో కార్లో మరి కొందరు లెక్చరర్స్ వస్తున్నారు.

వాళ్ళ ప్రయాణం నలభై కిలోమీటర్లు హై వే లో, పది కిలోమీటర్ లు మెటల్ రోడ్ లో సాగింది. ఆ దారి ఎటువైపు చూసినా పచ్చటి పైరులు, రోడ్ కి రెండు వైపులా ఎత్తైన చెట్లతో చూడ్డానికి ఆహ్లాదం కలిగిస్తోంది.

ఆ దారిలో కొంత దూరం వెళ్ళగానే రోడ్ పక్కనే ఐదెకరాల విస్తీర్ణంలో బంతి పూల తోట కనిపించింది.

అక్కడ బస్సు ఆపించింది ఆద్య.

"ఈ తోట మాదే. అందరం ఇక్కడ కాసేపు స్పెండ్ చేసి ఫోటోలు తీసుకుందాం" అంది.

అందరూ ఆనందంతో కేకలు పెడుతూ బస్సు దిగారు.

తోటంతా తిరుగుతూ, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు.

ఓ గంట గడిచాక మళ్ళీ బయలుదేరారు.

పదకొండు గంటలకు ఆ వూరు చేరుకున్నారు.

రాఘవేంద్రగారు ఆ వూళ్ళో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చెయ్యబోతున్నారు. ఆ బిల్డింగ్ నిర్మాణం, ఆ కాలేజ్ లో చేరేవాళ్ల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్ బిల్డింగ్ నిర్మాణం పూర్తి అయ్యాయి. కాలేజ్ ఇంకా ప్రారంభం కాలేదు.

ఊరికి కాస్త దూరంగా ఉన్న ఆ హాస్టల్ లో స్టూడెంట్స్ కి విడిది ఏర్పాటు చేశారు రాఘవేంద్ర.

బస్సు ఆ హాస్టల్ బిల్డింగ్ ముందు ఆగింది.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


43 views0 comments

Comments


bottom of page