top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Video link

'Love Challenge Episode 23' Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…

న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చక్కగా సమాధానం చెబుతుంది ఆద్య. జీవన్ మాట్లాడుతూ ఈ మోడల్ ఎలక్షన్స్ లో సాధారణ ఎన్నికల్లో జరిగే పొరపాట్లు జరగవని చెబుతాడు. రిత్విక్ మాట్లాడుతూ ఈ ఛాలెంజ్ ని సరైన దారిలో రాజకీయ ప్రవేశం చేయడానికి ఒక ట్రైనింగ్ లా భావిస్తున్నానని చెబుతాడు.

ఇక చదవండి…

ఆ గ్రామ సర్పంచ్, ఇతర ప్రముఖులు, స్థానిక పోస్ట్ మాస్టర్, ఆ ఊర్లోనే నివసిస్తున్న హై స్కూల్ హెడ్మాస్టర్.. హాస్టల్ దగ్గర రాఘవేంద్ర గారిని, లెక్చరర్స్ ని, స్టూడెంట్స్ ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు రిత్విక్, జీవన్ లను పరిచయం చేశాడు రాఘవేంద్ర.

ఆ గ్రామం లోని పేదలకి ప్రతి సంక్రాంతి పండుగకీ ఉచితంగా బట్టలు పంపిణీ చేయడం రాఘవేంద్ర గారికి అలవాటు. ఆద్య చాలా సార్లు ఆ కార్యక్రమానికి హాజరు అయి ఉండడంతో, ఆమెను ఆ గ్రామస్థులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం రాలేదు.

అందరూ ఆద్యను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరించారు.

రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ "సాయంత్రం గ్రామస్థులకు వీళ్ళను పరిచయం చేయడం కోసం, మోడల్ ఓటింగ్ గురించి చెప్పడం కోసం ఒక చిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేస్తున్నాం. వీలైనంత మంది ఆ కార్యక్రమానికి వచ్చేలా చూడండి" అని ఆ గ్రామ ప్రముఖులకు విజ్ఞప్తి చేశాడు.

ఆ గ్రామ పోస్ట్ మాస్టర్ మాట్లాడుతూ "నమూనా ఎలక్షన్ల గురించి మీరు నాకు ఫోన్ చేశారు కదా! నేను అప్పుడే చాలామంది గ్రామస్థులతో ఈ విషయం మాట్లాడాను. 'రాఘవేంద్ర గారు మన గ్రామానికి ఎంతో సహాయం చేస్తున్నారు. వారు అడిగిన చిన్న కోరికను కాదంటామా..' అని చాలా మంది గ్రామస్థులు అన్నారు" అని చెప్పాడు.

హై స్కూల్ హెడ్మాస్టర్ గారు మాట్లాడుతూ "నేను స్థానికంగా ఉండటం తో ఊర్లో వాళ్లు, మంచిచెడ్డలు మాట్లాడడం కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ మోడల్ ఎలక్షన్స్ లో ఓట్ చేయాల్సిన అవసరం గురించి చెబుతాను" అన్నాడు.

గ్రామ సర్పంచ్, ఇతర పెద్దలు కూడా తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని చెప్పి, సెలవు తీసుకున్నారు.

తరువాత రాఘవేంద్ర రావు గారు స్టూడెంట్స్ తో "మీరు కాసేపు రిలాక్స్ అయి, ప్రాక్టీస్ ప్రారంభించండి. లంచ్, స్కూల్ గ్రౌడ్ కే పంపిస్తాను. ఈ ఊర్లో ఉచితంగా వివాహం జరిపించడానికి ఒక కళ్యాణ మండపం కట్టించాను. ఇందాక చెప్పినట్లు అక్కడ ఈ రోజు రాత్రి 7 గంటలకు సభ జరుగుతుంది. రిత్విక్, జీవన్ లు తమను తాము గ్రామస్థులకు పరిచయం చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. అలాగే ఈ వారంలో అవకాశం ఉన్నప్పుడు వాళ్ల మనసుకు హత్తుకునేలా ఏదైనా నాటకం గాని, మరేదైనా సాంస్కృతిక కార్యక్రమం గాని ఏర్పాటు చేయవచ్చు" అని చెప్పాడు.

ఆ కాలేజ్ గ్రౌండ్ కి సంబంధించిన పనులు ఇంకా జరుగుతూ ఉండడంతో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం హై స్కూల్ గ్రౌండ్ కి వెళ్లారు.

రిత్విక్, జీవన్ ల ఆట తీరును ఆ స్కూల్ పిల్లలు చాలా ఆసక్తిగా గమనించారు.

ఆరోజు ప్రాక్టీస్ పూర్తయ్యాక స్టూడెంట్స్ అందరూ రిఫ్రెష్ అయి 7 గంటల కల్లా కళ్యాణ మండపం చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చాలామంది గ్రామస్థులు చేరుకుని ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. మార్పును అంగీకరించే మనస్తత్వం, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి కేవలం నగర, పట్టణ ప్రజలకే కాదు, పల్లెల్లో నివసించే వారికి కూడా ఉంటుందని వాళ్లకు అప్పుడు అర్థమైంది. రాఘవేంద్ర తో పాటు గ్రామ సర్పంచ్, హై స్కూల్ హెడ్ మాస్టర్, పోస్ట్ మాస్టర్ స్టేజ్ మీద కూర్చున్నారు.

ఆద్యను కూడా స్టేజి పైకి రమ్మని పిలిచినా అవసరమైనప్పుడు వస్తానంటూ కింద తన ఫ్రెండ్స్ పక్కనే కూర్చుంది.

ఆ సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ "రాఘవేంద్ర గారు పుట్టిన ఊరిని మర్చిపోకుండా, మన గ్రామం కోసం ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ఇంకా చేస్తున్నారు. అలాగే ప్రభుత్వం ద్వారా అందే ఆర్ధిక సహాయాలు కూడా, తనకున్న పలుకుబడిని ఉపయోగించి మనకు సక్రమంగా చేరేలా చూస్తున్నారు. ఇప్పుడు కూడా మన గ్రామం కోసం భారీ విరాళం ప్రకటించారు. ఆ విషయం ఆయనే స్వయంగా ప్రకటిస్తారు" అని చెప్పాడు.

రాఘవేంద్ర లేచి నిలబడి అందరికీ నమస్కరించాడు.

తర్వాత అక్కడ సమావేశమైన వారందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ "జన్మనిచ్చిన తల్లిదండ్రులను చూసుకోవడం మన బాధ్యత. వాళ్ల తో సమానంగా పుట్టిన ఊరిని కూడా ఆదరించాలి అని నా అభిప్రాయం. ప్రతి గ్రామం నుంచి కూడా ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు, విదేశాల్లో ఉంటున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ తలా ఒక చెయ్యి వేస్తే ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఎవరి కోసమో ఎదురు చూడకుండా, ప్రభుత్వ సహాయం కోసం పడిగాపులు కాయకుండా ముందుగా నేనే రంగం లోకి దిగాను. తరువాత ఒకరొకరుగా నాతో చేయి కలపడం ప్రారంభించారు. అందరి సహకారం తోనే, కొన్ని చిన్న చిన్న పనులు చేయగలిగాను.

ఇప్పుడు సిటీ నుంచి వచ్చిన కాలేజీ స్టూడెంట్స్ కోసం ఒక విషయం చెబుతాను.

మన దేశ జనాభా దాదాపు 140 కోట్లు. ఇంతమందికి సరిపోయే ఆహారం మన రైతులు పండిస్తున్నారు. రైతులందరూ ముందుగానే ఒక సంవత్సరానికి తమకు కావాల్సిన ఆహారధాన్యాలను నిల్వచేసుకొని, ఆ సంవత్సరం పంట పండించడం మానేస్తే ఏమౌతుందో తెలుసా? ఇంత జనాభాకు కావలసిన ఆహారాన్ని ఎగుమతి చేయగలిగిన దేశమే లేదు.

ఒకవేళ ఉండి, అక్కడినుండి దిగుమతి చేసుకున్నా, అందుకు ప్రతిగా మన దేశంలో ఉండే మొత్తం బంగారు నిల్వలను అందుకోసం ఖర్చు చేయాలి. ఇది ఒక్క సంవత్సరం పరిస్థితి మాత్రమే. ఆ మరుసటి సంవత్సరానికి దేశంలో ఆకలి చావులు లక్షల్లో ఉంటాయి.

కాబట్టి అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఒక రైతు తన భూమిలో తను సాగుచేసి, ఆ పంటను తగిన ధరకు అమ్ముకున్నా సరే, అతడు దేశానికి ఎంతో మేలు చేసినట్లు లెక్క. ఎందుకంటే అతను ఉత్పత్తిని పెంచుతున్నాడు. భూమిలో ఒక గింజను నాటి వందకు పైగా గింజలను నేల నుండి సంపాదిస్తున్నాడు. అలాంటి రైతు పట్ల నిజమైన అవగాహన ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఖచ్చితంగా ఈ దేశానికి ఎంతో మేలు జరుగుతుంది.

మా అమ్మాయి ని ప్రేమిస్తున్నానంటూ ఇద్దరు కుర్రవాళ్ళు వచ్చారు. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు? మా అమ్మాయి జోలికి రావద్దని వాళ్ళను హెచ్చరిస్తాడు. లేదా వాళ్ల గురించి, వాళ్ల స్థితిగతుల గురించి విచారించి, నచ్చిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు.

ఇక్కడ పోటీకి వచ్చిన ఇద్దరూ అన్ని విధాలుగా సమఉజ్జీలు. ఇద్దరూ రేపోమాపో రాజకీయాల్లోకి రావాల్సిన వాళ్ళు. కాబట్టి వీళ్లను ప్రజలకు దగ్గర చేయాలని అనుకున్నాను. వీళ్లు ఈ వారం రోజులు ఇక్కడ ఉంటారు. తర్వాత కూడా వీలైనప్పుడల్లా ఇక్కడికి వచ్చి మీకు కావలసిన సహాయం చేస్తారు. ముఖ్యంగా మీకు తెలియని విషయాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తారు.

ఇక సర్పంచ్ గారు చెప్పినట్లు, నేను మన గ్రామ అభివృద్ధి కోసం 50 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తున్నాను. వీళ్లిద్దరూ కూడా చెరో 50 లక్షలు విరాళంగా ఇస్తున్నారు" చెప్పడం ఆపాడు రాఘవేంద్ర.

వెంటనే సభంతా చప్పట్లతో మార్మోగింది.

రాఘవేంద్ర తన మాటలు కొనసాగిస్తూ "మొత్తం డబ్బును ముందుగానే బ్యాంకులో డిపాజిట్ చేయిస్తున్నాను. నెల తర్వాత జరగబోయే మోడల్ ఎన్నికల్లో వీళ్ళిద్దరితో పాటు మన గ్రామం నుండి మరో వ్యక్తి కూడా పోటీలో ఉంటాడు. ముగ్గురిలో మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఓటు వేయవచ్చు.

వీళ్లిద్దరికీ కాక, మూడవ వ్యక్తికి ఓట్ వేసినా మేము ప్రకటించిన డబ్బు మీకే చెందుతుంది. కాబట్టి మీరు నిర్భయంగా, నిశ్చింతగా ముగ్గురిలో మీకు నచ్చిన వాళ్లకు ఓటు చేయవచ్చు. మీరు ఎవరికి ఓటు చేసినా ముందు ముందు నేను చేయబోయే సహాయం లో ఎటువంటి మార్పు ఉండదు. మిమ్మల్ని మెప్పించి ఓట్ చేయించుకునే బాధ్యత వీళ్లదే" అని చెప్పాడు.

తర్వాత ఆయన మైక్ రిత్విక్ చేతికిఇచ్చి "నిన్ను అందరికీ పరిచయం చేసుకో" అని చెప్పాడు.

అతను స్టేజి మీదికి వచ్చి అందరికీ నమస్కరించాడు.

తర్వాత మాట్లాడుతూ "నా పేరు రిత్విక్. మా నాన్న గారు చక్రధరం గారు. ఆయన ఒక వ్యాపార వేత్త. వ్యాపార రంగంలో నిజాయితీగా ఉండడం చాలా కష్టమైన పని. కానీ ఆయన దాన్ని అనుసరిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రత్నాదిత్య గారు మా నాన్నగారికి గురువు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ నమ్మకమే పునాదిగా మా వ్యాపార అభివృద్ధి చేశారు నాన్నగారు.

ఆయన్ని చూసి నేను నేర్చుకున్నది కూడా అదే! నీతి నిజాయితీతో ఉంటే ఏ రోజుకైనా మనిషి ఉన్నత స్థానానికి చేరుకుంటాడు అనేది నా నమ్మకం. ఈ నెల రోజుల్లో మీకు మరింత దగ్గర కావడానికి, నన్ను మీ మనిషిగా మీరందరూ అనుకోవడానికి నా శక్తి మేరా ప్రయత్నిస్తాను" అని చెప్పాడు.

అందరూ అతన్ని అభినందిస్తూ చప్పట్లు కొట్టారు.

తరువాత జీవన్ స్టేజి మీదకు వచ్చాడు.

అతను మాట్లాడుతూ" నా పేరు జీవన్. మా నాన్న గురుమూర్తి ఒక ఎంపీ.

కాబట్టి ఎన్నికలు నాకు కొత్త కాదు.

మామూలుగా జరుగుతున్న ఎన్నికలను చూసినపుడు అందరిలాగే నేను కూడా 'డబ్బు, మద్యం, కుల ప్రభావం లేకుండా ఎన్నికలు జరిగితే బాగుంటుంది' అని ఒక యువకుడిగా అనుకునేవాడిని. కానీ వెంటనే అలా జరగదులే.. అనే నిరాశ.

కానీ ఈ నమూనా ఎన్నికల్లో ఆ అవకాశం వచ్చింది.

పోటీదారులమైన మేమిద్దరమూ, నిర్వహిస్తున్న రాఘవేంద్ర గారు, వారి అమ్మాయి ఆద్య.. ముగ్గురమూ ధర్మానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి ఈ ఎన్నికల్లో వచ్చే గెలుపు, నిజమైన గెలుపు. మీ తీర్పు కోసం దేశమంతా ఎదురు చూస్తోంది" అన్నాడు.

అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టి జీవన్ ని కూడా అభినందించారు.

తరువాత ఆద్య స్టేజ్ మీదకు వచ్చి "రిత్విక్ జీవన్ లు రేపు ఈ స్టేజి మీద చిన్న నాటకాలు ప్రదర్శించబోతున్నారు. అందరూ తప్పకుండా రావాలి” అని కోరింది .

తరువాత, ఆ సభకు వచ్చిన వారందరికీ ఓట్ ఆఫ్ థాంక్స్ చెప్పింది ఆద్య.

ప్రోగ్రాం ముగిశాక స్టూడెంట్స్ అందరూ హాస్టల్ కి చేరుకున్నారు. అబ్బాయిలకు గ్రౌండ్ ఫ్లోర్ లో, అమ్మాయిలకు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే రూమ్స్ లో వసతి ఏర్పాటు చేశారు. అందరూ వాళ్ళకు కేటాయించిన రూమ్స్ లో రిఫ్రెష్ అయి, డిన్నర్ కి కిందనే ఉన్న క్యాంటీన్ కి చేరుకున్నారు.

కాలేజీ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి ఊర్లో నుంచి వండించి అక్కడికి తెచ్చిన ఆహారాన్ని, క్యాంటీన్ లో వడ్డించారు.

చందూ, సందీప్ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.

ఎదురు వరసలో భోంచేస్తున్న దీప్య వంక ఆశగా చూస్తూ "ఆ రోజు పబ్ లో జస్ట్ మిస్ అయింది. ఆ రిత్విక్ గాడు అంతా చెడగొట్టాడు" అని సందీప్ తో అన్నాడు చందూ.

"ఇక ఆశ వదులుకో. మన జీవన్, ఆ రిత్విక్ గాడికి అసిస్టెంట్ లా మారి పోయాడు కదా!" అన్నాడు సందీప్.

"నాకైతే దీప్యని వదులుకోవాలని లేదు" సందీప్ చెవిలో చిన్నగా అన్నాడు చందూ.

"మరి తన ఫోటో సెల్ లో పెట్టుకుని, చూసుకుంటూ తృప్తిపడు" అన్నాడు సందీప్.

"అలాంటి పనులు ఇంటర్ లో కూడా చెయ్యలేదు ఈ చందూ. ఇక్కడి నుంచి వెళ్లేలోగా ఎలాగైనా ఒక్కసారి.." అంటూ చెప్పడం ఆపి సందీప్ వంక చూసి చిన్నగా కన్నుకొట్టాడు చందూ.

"మ్యాచ్ విషయంలో రిత్విక్ తో గొడవ పడబోతేనే జీవన్ నన్ను కొట్టాడు. ఇప్పుడు నువ్వు అమ్మాయిల విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే, రిత్విక్ నుండి నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ ఉండరు. అతని కంటే ముందు జీవన్ చేతిలో చావు దెబ్బలు తప్పవు" అన్నాడు సందీప్.

"నాకు తెలుసు. అయినా ఆశ చావలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను" అన్నాడు చందూ.

ఇంతలో దీప్య భోజనం ముగించి, హ్యాండ్ వాష్ కోసం లేచింది.

తను తినడం పూర్తి కాకున్నా గబుక్కున పైకి లేచాడు చందూ.

అతని వంక అయోమయంగా చూసాడు సందీప్.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


37 views0 comments

Comments


bottom of page