top of page

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 24

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Love Challenge Episode 24' Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్



గత ఎపిసోడ్ లో…

తన స్వంత ఊరు రామకృష్ణాపురం లో ఒక సభ ఏర్పాటు చేసి, రిత్విక్, జీవన్ లను ఆ గ్రామస్థులకు పరిచయం చేస్తాడు రాఘవేంద్ర.

ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో దీప్య మీద తనకు కోరిక ఉన్నట్లు సందీప్ తో చెబుతాడు చందూ.

అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా చెబుతాడు.

ఇక చదవండి…

హ్యాండ్ వాష్ దగ్గరకు వెడుతున్న దీప్య తన వెనుకే చందూ వస్తున్నట్లు గమనించింది. అతడు తన వేగాన్ని పెంచి ఆమె పక్కకు చేరబోయాడు.

ఇంతలో వెనకనుండి "హాయ్ చందూ!" అంటూ అతన్ని పలకరించింది శాన్వీ.

చేసేది లేక ఆమె కోసం ఆగాడు చందూ, "హాయ్ శాన్వీ" అంటూ.

"మాకంటే వెనగ్గా వచ్చావ్.. అప్పుడే భోజనం ముగించావా.." అడిగింది శాన్వీ.

'తనని శాన్వీ గమనిస్తోందన్న మాట.. జాగ్రత్తగా ఉండాలి' అనుకున్నాడు.

"ఎందుకో తినాలనిపించ లేదు" అన్నాడు చందూ.

"లేనిపోనివి ఆలోచిస్తూ ఉండకు. ఆకలి తగ్గిపోయి, ఆరోగ్యం పాడవుతుంది" అంది శాన్వీ.

"ఏంలేదు. నీ దగ్గర దాచడమెందుకు? పబ్ కి వచ్చిన రోజునుండి దీప్య నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. తనకు నామీద అనుమానం వచ్చినట్లు ఉంది. సారీ చెబుదామని వెనకే వెడుతున్నాను" అన్నాడు సంజాయిషీ ఇస్తున్నట్లుగా.

"రిత్విక్ ఆ విషయాన్ని అప్పుడే వదిలేసాడు. పూర్నేష్ ని సరిగ్గా విచారిస్తే ఎవరు చేయించారో, ఎవరు సహకరించారో అంతా బయట పడుతుంది. కానీ దీప్య పేరు నలుగురిలో నానగూడదని, అంతటితో వదిలేసారు. నువ్వు మళ్ళీ తవ్వుకుంటానంటే నీ ఇష్టం" అంది శాన్వీ.

"అలా అని కాదు. జీవన్ మారాక, మునుపు ఎలా ఉండేవాడో ఎవరూ పట్టించుకోవడం లేదు.

ఆ రోజు హాస్టల్ రూమ్ లో జీవన్ నీ గొంతు పట్టుకోలేదా? కానీ ఇప్పుడు నువ్వు అతనితో మామూలుగానే ఉండటం లేదా..

అలాగే నన్ను కూడా దీప్య క్షమించేయవచ్చు కదా అని.." అన్నాడు చందూ.

"జీవన్, తన గ్లాసు అడుగున వదిలేసిన మందు తాగి ఆనందించే వాడివి.. ఇప్పుడేమిటి జీవన్ తోనే పోల్చుకుంటున్నావు?" కాస్త గొంతు పెంచి అంది శాన్వీ.

‘దీనికి సరైన సమయం చూసి వాత పెట్టాలి’ అనుకున్నాడు చందూ.

ఇంతలో హ్యాండ్ వాష్ చేసుకొన్న దీప్య తిరిగి వస్తూ ఉండటంతో, "సరేలే.. ఈ టాపిక్ వదిలేయ్! జీవన్ తో ఇలా అన్నానని చెప్పకు ప్లీజ్" అన్నాడు చందూ.

అప్పుడే అక్కడికి వచ్చిన దీప్య "ఇప్పుడు మీరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలిసి పోయింది" అంది.

చందూ ఉలిక్కిపడి, "మేమా.. మేమేమీ మాట్లాడుకోవడం లేదే.." అన్నాడు.

"బిర్యాని చాలా బాగుంది కదా! మరో రౌండ్ వేసి, ఆ తరువాతే చేతులు కడుక్కుందాం అనుకుంటున్నారు. అంతేనా?" అంది నవ్వుతూ.

శాన్వీ కూడా నవ్వేసి "అదేం కాదు. జీవన్ లో మార్పు వచ్చాక అతన్ని అందరూ అభిమానిస్తున్నారు కదా! అలాగే తను కూడా మారుదాం అనుకుంటున్నాడు చందూ" అంది.

దీప్య ఒకసారి చందూ వంక చూసి, "మారాల్సినంత పొరపాట్లు చందూ గారు ఎప్పుడూ చేయలేదు అనుకుంటాను" అని, అక్కడి నుండి వెళ్ళిపోయింది.

"చూశావా! దీప్యకు నామీద కోపం ఏం లేదు" అన్నాడు చందూ.

"మెచ్యూర్డ్ పర్సన్స్ అలాగే బిహేవ్ చేస్తారు. రిత్విక్, ఆద్య, దీప్య లాంటి వాళ్ళు ఆ కోవకే చెందుతారు. దీప్య ఉద్దేశ్యం నువ్వు గిల్టీ ఫీలింగ్ తో బాధపడకూడదని. ఇలాంటివి నీకు అర్థం కావడానికి మరో పదేళ్లు పడుతుంది లే" అంటూ హ్యాండ్ వాష్ దగ్గరికి నడిచింది శాన్వీ.

'ఈ శాన్వీ ఇంతే. అర్థం కాకుండా మాట్లాడుతుంది. దీప్యకి నేనంటే ఇష్టం ఉన్నట్లే ఉంది' అని మనసులో అనుకున్నాడు చందు.

ఆద్య, రాఘవేంద్ర ల పక్కన కూర్చుని భోజనం చేస్తున్న నిత్య, గురుమూర్తి నుండి కాల్ రావడంతో వెంటనే కట్ చేసింది. క్షణాల్లో తన భోజనం ముగించి పైకి లేస్తూ ఉండగా మరోసారి ఫోన్ మోగింది.

"మా బంధువులు హాస్పిటల్ లో ఉన్నారు అని చెప్పాను కదా! వాళ్లే కాల్ చేస్తున్నారు" అని ఆద్యతో అంటూ బయటకు నడిచింది.

క్యాంటీన్లో ఇంకా భోజనం చేస్తున్న ఫ్రెండ్స్ కి, లెక్చరర్స్ కి సర్వ్ చేద్దామని లోపలికి రాబోతున్న శాన్వీ హడావిడిగా బయటికి వస్తున్న నిత్యా మేడం ని చూసి పక్కకు తప్పుకుంది.

బయటకు వచ్చిన నిత్యా మేడమ్, ఫోన్ లిఫ్ట్ చేసి, "భోంచేస్తూ ఉండగా మీ ఫోన్ వచ్చింది. అందుకని తీయలేదు. చెప్పండి అన్నయ్య గారూ" అంది.

"అయ్యో! నిన్ను డిస్టర్బ్ చేసినట్టు ఉన్నాను చెల్లెమ్మా. మళ్లీ చేస్తానులే" అన్నాడు గురుమూర్తి.

"పరవాలేదు లెండి అన్నయ్య గారూ! ఎప్పుడూ ఎవరో ఒకరు పక్కన ఉంటారు. ఇదే మంచి సమయం, చెప్పండి" అందామె.

"మా పార్టీ వాళ్ల ద్వారా గాలించి,ఆ ఊళ్లో ఒక మనిషిని పట్టాను. అతని పేరు చలపతి. అతను, మీ కాలేజీ అమ్మాయిల్లో ఎవరితోనైనా అందరి ముందూ అసభ్యంగా ప్రవర్తిస్తాడు.

రిత్విక్ గనక ఆవేశపడి అతని మీద చేయి చేసుకుంటే, అతని చేత రిత్విక్ మీద కేసు పెట్టిస్తాను. అతను తన బంధువులను రెచ్చగొట్టి, రిత్విక్ కి వ్యతిరేకంగా ఓటు వేయిస్తాడు.

ఒకవేళ జీవన్ అతన్ని కొడితే, అతను క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతాడు.

కళ్ళముందు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నా రిత్విక్ పట్టించుకోలేదని ఊర్లో వాళ్లు అనుకుంటారు. సమయానికి మీరు అక్కడ ఉంటే పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చగలరు" అంటూ తన ప్లాన్ వివరించాడు గురుమూర్తి.

"అలాగే అన్నయ్య గారూ! రాఘవేంద్ర గారు రేపు రాత్రి స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అయ్యాక సిటీ కి వచ్చేస్తారు. నేను, ఆద్య శనివారం వరకు ఇక్కడే ఉంటాము. ఈ లోపల మీ ప్లాన్ అమలైతే నాకు వీలున్నంతవరకు సహకరిస్తాను" అంది నిత్యా మేడం.

దూరం నుండి ఆమెనే గమనిస్తున్న శాన్వీ కి నిత్యా మేడం ఎవరితో మాట్లాడుతోందో అర్థం కాలేదు. కానీ ఏదో గూడుపుఠాణి జరుగుతోందని మాత్రం ఆమెకు అనిపించింది.

ఆద్య, రిత్విక్ లను అలర్ట్ చేయాలని అనుకుంది.

లంచ్ పూర్తయ్యాక రిత్విక్, కొందరు స్నేహితులను దగ్గరకు పిలిచి, మరుసటి రోజు రాత్రికి ఒక నాటకం ప్రదర్శించాలని అన్నాడు. అందుకు సంబంధించిన స్కిట్ ను వాళ్లకు వివరించి, ఎలా నటించాలో వివరంగా చెప్పాడు.

జీవన్ కూడా ఒక నాటకం వేయడానికి స్నేహితులతో కలిసి ప్రిపేర్ అయ్యాడు. మర్నాడు ఉదయం తొమ్మిదింటికి ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ కు చేరుకొని ప్రాక్టీసు ప్రారంభించారు. సెమిస్ లో ఫాస్ట్ బౌలింగ్ ఎదుర్కోలేక తడబడి అవుట్ అయిన తమ బ్యాట్స్ మెన్ కి శోభన్ టీం ఫాస్ట్ బౌలర్ చేత బౌలింగ్ వేయించాడు రిత్విక్.

ఆరోజు రాత్రి ఏడు గంటలకు కళ్యాణ మండపం చేరుకున్నారు అందరూ.

స్టూడెంట్స్ చేయబోయే ప్రోగ్రాం ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ గ్రామస్థులు.

ముందుగా రిత్విక్ చేయబోయే ప్రదర్శన ప్రారంభమైంది.

రిత్విక్ స్టేజి మీదకు వచ్చిమాట్లాడుతూ "మీకు, 'అసలు ప్రభుత్వం అవసరమేమిటి?', 'నాయకుడు ఎలా ఉండాలి' అనే వాటి గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పి స్టేజి వెనగ్గా మైక్ పట్టుకొని నిలుచున్నాడు.


ఒక నలుగురు కుర్రాళ్ళు ముందుకు వచ్చి నిలుచున్నారు.

ఆ నలుగురూ వాళ్ళ మెడల్లో పలకలు తగిలించుకొని ఉన్నారు. దాని మీద 'ప్రజలు' అని రాసి ఉంది.

వాళ్ళు భుజానికి ఒక గుడ్డ సంచీ తగిలించుకుని ఉన్నారు. దాన్ని ప్రేక్షకులు కనపడేలా చూపించారు. దానిమీద 'డబ్బులు' అని రాసి ఉంది. వాళ్లు ఆ సంచీ ఓపెన్ చేసి అందులో ఉండే రంగు రంగుల కాగితాలు అందరికీ చూపించారు. అవి కరెన్సీ నోట్లని అందరికీ అర్థమైంది.


వాటిని తిరిగి సంచీలో వేసుకున్నారు. అప్పుడు ఒక సినిమా పాట ప్లే చేశారు. నలుగురూ ఆనందంగా డాన్స్ చేస్తూ ఉన్నారు. హఠాత్తుగా మరో నలుగురు వ్యక్తులు కర్రలు తీసుకొని వచ్చారు. వీళ్ళను కొట్టినట్లు నటిస్తూ, వీళ్ళ డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు.

అప్పుడు రిత్విక్ స్టేజ్ ముందువైపుకు వచ్చి "మన దేశ ప్రజలు కష్టపడి సంపాదించే వారు. కాబట్టి వాళ్లకు ఇతరులను దోచుకోవడం, దోపిడీలను ఎదుర్కోవడం తెలీదు. సుఖంగా జీవిస్తూ ఉండేవారు. అప్పుడు ఇతర దేశస్తులు మన మీద దాడి చేసి మన సంపద దోచుకుని పోయారు.

అప్పుడు మన ప్రజలకు అర్థమైంది ఏమిటంటే 'అందరూ తమ తమ వృత్తులు చేసుకుంటే చాలదు. మనల్ని కాపాడుకోవడానికి కొందరు ఉండాలి' అని తెలుసుకున్నారు. తమ రక్షణ కోసం కొందరిని నియమించుకున్నారు” చెప్పడం ఆపి తిరిగి వెనక్కి వెళ్ళాడు రిత్విక్.

నలుగురు యువకులు తిరిగి ఆనందంగా డాన్స్ చేస్తూ ఉన్నారు. మెడలో 'మిలిటరీ' అని పలకలో రాసుకొని ఉన్న వ్యక్తి కాపలా కాస్తున్నాడు.

మరికొంతసేపటికి హఠాత్తుగా మళ్లీ నలుగురు వ్యక్తులు ప్రజల మీద దాడి చేశారు. కానీ మిలిటరీ వ్యక్తి వాళ్ళని తరిమేశాడు.

తిరిగి ప్రజలు ఆనందంగా ఉన్నారు.

మళ్ళీ నలుగురు వ్యక్తులు వచ్చారు.

"మీరు సాగు చేస్తున్న భూమి మీది కాదు, నాది" అన్నాడొక వ్యక్తి.

మరో వ్యక్తి, "ఈ ఇళ్ళు మావి. మీరందరూ వెళ్లి పోండి" అంటూ అందరినీ నెడుతున్నాడు.

మరో ఇద్దరు వ్యక్తులు "ఈ డబ్బులు మావి" అంటూ, ప్రజల దగ్గర ఉండే డబ్బులు లాక్కున్నారు.

మళ్లీ స్టేజి ముందుకు వచ్చాడు రిత్విక్.

"మీరు వ్యవసాయం చేసే భూమి మీదే అనడానికి ఆధారం ఏమిటి?" అని సభికులను ప్రశ్నించాడు.

" మా నాన్న రాసి ఇచ్చిన వీలునామా ఉంది" అన్నాడు ఒక వ్యక్తి.

"ఈసీ తీస్తే నా పేరు వస్తుంది" అన్నాడు ఒక రైతు.

రెవెన్యూ రికార్డుల్లో హక్కు, అనుభవం నా పేరుతోనే ఉన్నాయి" అన్నాడు మరొక వ్యక్తి.

"ఇప్పుడు గమనించారు కదా.. ఇతర దేశస్థుల నుంచి రక్షించడానికి మిలటరీ ఉండాలి. అలాగే మీ భూమి రికార్డులు సేకరించడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉండాలి. శాంతిభద్రతలు అదుపుచేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వుండాలి. ఇంకా మీకు తెలిసినవి చెప్పండి" అని అడిగాడు.

"పిల్లలకు చదువు చెప్పడానికి స్కూల్స్ ఉండాలి" అని ఒక మహిళ అంది.

"జబ్బు వస్తే చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్స్ ఉండాలి" అన్నాడో వ్యక్తి.

"ఇక్కడి నుండి మరొక చోటికి వెళ్లాలంటే బస్సు.. ఆటో.. ఇలా ఏదో ఒక వాహనం ఉండాలి" అన్నాడు ఇంకొక వ్యక్తి.

"డబ్బులు దాచుకోవడానికి బ్యాంక్ కావాలి" అన్నాడు ఒక పొదుపరి.

"బ్యాంకు ఉంటేనే కదా మేము తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోగలిగేది" అన్నాడు మరొక రైతు.

"కావలసినవి కొనుక్కోవడానికి అంగడి వుండాలి" అన్నాడు ఒక వ్యక్తి.

అప్పుడు రిత్విక్ కల్పించుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? అందుకే ఇవి చేయించడానికి ప్రజలు తమ సమూహం నుంచి ఒక వ్యక్తిని నాయకుడిగా ఉంచేవారు" అని చెప్పి తిరిగి వెనక్కి వెళ్ళాడు రిత్విక్.

ఇప్పుడు ఆ ఆ నలుగురు ప్రజలు ఒక వ్యక్తిని తమ నాయకుడిగా ప్రకటించారు.

తిరిగి ప్రజలు అని బోర్డు తగిలించుకున్న నలుగురూ, తమ పనులు చేసుకుంటూ , డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.

మళ్లీ వాళ్ల మీద దాడి చేయడానికి కొంతమంది వచ్చారు.

'నాయకుడు' అని బోర్డు తగిలించుకున్న వ్యక్తి 'సైనికుడు' అని బోర్డు తగిలించుకున్న వ్యక్తిని వాళ్ల మీదికి పంపాడు. వాళ్లు పారిపోయారు.

తిరిగి డాన్స్ కొనసాగుతోంది.

మరొక వ్యక్తి వచ్చి 'ఈ భూమి నాది' అన్నాడు. కానీ 'రెవెన్యూ' బోర్డు తగిలించుకున్న వ్యక్తి అతడిని నెట్టి వేశాడు. దౌర్జన్యం చేయబోతున్న మరో వ్యక్తిని 'పోలీస్' అని బోర్డు తగిలించుకున్న వ్యక్తి తరిమేశాడు.

అప్పుడు రిత్విక్ తిరిగి స్టేజ్ ముందుకు వచ్చి "ఏ సమూహానికైనా రక్షణ కావాలంటే ఒక నాయకుడు ఉండాలి అని మీకు అందరికీ అర్థమైంది కదా?" అని అడిగాడు.

అవునన్నట్లు ఊపారు అందరూ.

"ఇప్పుడు ఆ నాయకత్వంలో రకాల గురించి మీకు చూపిస్తాను" అన్నాడు రిత్విక్. అందరూ ఆసక్తిగా అతను చెప్పబోయే దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

ఇంకా ఉంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


46 views0 comments
bottom of page