top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Love Challenge Episode 25' Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్



గత ఎపిసోడ్ లో…

నిత్యా మేడమ్ కి ఫోన్ చేసిన గురుమూర్తి, రిత్విక్ ని డీఫేం చేయడానికి తను వేసిన ప్లాన్ వివరిస్తాడు. తన వంతు సహకారం అందిస్తానని చెబుతుంది నిత్యా మేడమ్. గ్రామస్థులతో జరిగిన సమావేశంలో ప్రభుత్వాలు ఏర్పడ్డ పరిణామ క్రమం వివరిస్తాడు రిత్విక్.

ఇక చదవండి…



"నేను చెప్తున్నది మీకు అర్థమవుతోందా" అని అడిగాడు రిత్విక్.


"మా హై స్కూల్ హెడ్మాస్టర్ గారు ఏ విషయమైనా అరటి పండు ఒలిచి పెట్టినట్టు చక్కగా వివరించి చెబుతారు. మీరు చెప్పేది కూడా అలాగే ఉంది" అన్నారు గ్రామస్థులు.


తిరిగి తన ప్రదర్శన కొనసాగించాడు రిత్విక్.


ముందులాగే నలుగురు స్టూడెంట్స్ మెడలోని పలకల్లో 'ప్రజలు' అని రాసుకొని ఉన్నారు.


వాళ్లు 'నాయకుడు' అని రాసి ఉన్న వ్యక్తికి వేలు చూపించి పనులు చెబుతూ ఉంటే అతను చేస్తూ ఉన్నాడు. మరి కొంత సేపటి తర్వాత నాయకుడు ఒకచోట కూర్చొని ఉండగా ప్రజలు అతని దగ్గరికి వచ్చి నమస్కరించడం ప్రారంభించారు.


మరికొంతసేపటికి ఆ నాయకుడు ప్రజల్లో ఒకరి మీద కోపం తెచ్చుకుని కాలితో బలంగా తన్నినట్లు నటించాడు. మిగిలిన ప్రజలు మౌనంగా ఉండిపోయారు.


మళ్లీ స్టేజ్ ముందుకు వచ్చాడు రిత్విక్.

"ప్రజలందరూ తన చుట్టూ తిరుగుతూ ఉండటంతో, నాయకుడికి డిమాండ్ పెరిగింది. అతన్ని మంచి చేసుకుని తమ పనులు జరిపించుకోవాలి అని ప్రజలు ప్రయత్నాలు ప్రారంభించారు. దాంతో నాయకుడి ఆధిపత్యం మొదలైంది. అతను ఒకరి మీద దౌర్జన్యం చేసినా మిగతావాళ్లు, ‘మనల్ని ఏమీ అనలేదు కదా’ అని నిర్లిప్తంగా ఉండడం ప్రారంభించారు.

చెప్పడం ఆపి కాస్త పక్కకు వెళ్ళాడు రిత్విక్.

నాయకుడు అని రాసి ఉన్న వ్యక్తి హఠాత్తుగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కింద పడిపోయాడు.

ప్రజలు 'నేనే నాయకుడిని' అంటూ ఒకరితో ఒకరు కొట్టుకోవడం ప్రారంభించారు.

తిరిగి స్టేజ్ మధ్యకి వచ్చాడు రిత్విక్.


ఒక నాయకుడు శక్తి హీనుడైనప్పుడు లేదా మరణించినప్పుడు నాయకత్వం కోసం కొట్లాట జరిగేది. ఎవరికి వాళ్లు ‘నేనే నాయకుడు కావాల’ని పంతం పట్టే వాళ్ళు. ఈ సమస్యకు పరిష్కారంగా నాయకుడి కొడుకునే తిరిగి నాయకుడిగా ఉంచేవారు. అదే రాచరిక వ్యవస్థకు దారితీసింది. రాజు తరువాత అతని కొడుకు రాజుగా రావడం ఆనవాయితీ అయింది. వంశపారంపర్య పరిపాలన కొనసాగింది. ఎప్పుడైనా ఆ వంశంలో ఒక రాజు అసమర్ధుడు లేదా బలహీనుడు అయినప్పుడు మరొకరు అతని స్థానాన్ని ఆక్రమించే వాళ్ళు. అప్పటి నుండి వాళ్ళ వంశం పరిపాలన చేసేది" అని చెప్పి వెనక్కి వెళ్ళాడు.

ఇప్పుడు రాజు అని పలక మీద రాసుకుని ఉన్న వ్యక్తిని, ప్రజలు భుజాల మీదకు ఎత్తుకుని మోస్తున్నారు.

ఇంతలో స్టేజి మీదికి ఒక అమ్మాయి వచ్చింది. రాజు ముందు నుంచి తిరుగుతూ వెళ్ళిపోయింది.

"ఎవరా అమ్మాయి?" అని అడిగాడు రాజు.

"పక్క దేశపు యువరాణి" అని చెప్పాడు అనుచరుడు.

"నన్ను పెళ్లి చేసుకుంటుందేమో కనుక్కో" అన్నాడు రాజు.

అనుచరుడు పక్కకి వెళ్ళి తిరిగి వచ్చి, "ఆ దేశపు రాజు ఒప్పుకోలేదు" అన్నాడు.

"అయితే యుద్ధం చేద్దాం" అన్నాడు రాజు.

తర్వాత ఇటు వైపు నుండి ఇద్దరు సైనికులు, అటువైపు నుండి ఇద్దరు సైనికులు ఒకరితో ఒకరు యుద్ధం చేసి కిందపడిపోయారు.

తిరిగి స్టేజి ముందుకు వచ్చాడు రిత్విక్.

"మీరు జానపద సినిమాలు చూశారా?" అని అడిగాడు.

"చూశాము" అన్నట్లు తల ఊపారు కొందరు. కొందరికి అర్థం కాక మౌనంగా ఉన్నారు.

"జానపద సినిమాలంటే రాజుల కథలు ఉండే సినిమాలు" అని వివరించాడు రిత్విక్.

మా చిన్నప్పుడు చాలా సినిమాలు చూశాము" అన్నారు గ్రామస్థులు.

"రాజు గుర్రం మీద కూర్చుని కత్తి యుద్ధం చేసేవాడు" అని చెప్పాడు ఒక వ్యక్తి.

"మీకు కత్తియుద్ధం వచ్చా?" హఠాత్తుగా అడిగాడు రిత్విక్.

రాదన్నాడు అతను.


"పోనీ, గుర్రపు స్వారీ వచ్చా?" తిరిగి ప్రశ్నించాడు రిత్విక్.

రాదనే బదులిచ్చాడు అతను.

"ఒక రాజ్యానికి రాజు అనగానే ఎవరికి వాళ్ళం, గుర్రం మీద కూర్చుని కత్తియుద్ధం చేసినట్లు ఊహించుకుంటే బాగానే ఉంటుంది. కానీ రాజుల కాలం వచ్చినా, మనం మామూలు మనుషులమే. మీరు వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేను చదువుకుంటూ ఉంటాను. మన గ్రామమే ఒక రాజ్యం అనుకుందాం. మన రాజ్యానికి ఆపద వస్తే, ప్రాణాలైనా ఇచ్చి పోరాడుతాం. కానీ మన ఊరి రాజు, పక్క ఊరికి రాకుమార్తె కోసం యుద్ధం చేస్తే అందుకోసం చనిపోవడం న్యాయమా?


అంటే ఒక దేశ ప్రజల మాన ప్రాణాలు ఆ దేశం రాజుగారి బుద్ధి మీద ఆధారపడి ఉండేవి. రాజ భోగాలకు అలవాటు పడ్డవారు విచ్చలవిడిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు.

రాజు మంచి వాడైతే పాలన బాగుండేది. కానీ అతడు దుర్మార్గుడైతే ఇదిగో.. ఇలా మనమో.. మన వాళ్ళో ప్రాణాలు కోల్పోవాలి.." అంటూ కింద పడిపోయి వున్న వాళ్ళను చూపించాడు.


తిరిగి తన మాటలు కొనసాగిస్తూ "అదే ప్రజాస్వామ్య వ్యవస్థకు దారి తీసింది. ప్రజలు నాయకుడిని ఎన్నుకునే విధానం వచ్చింది" అది చెప్పి పక్కకు జరిగాడు.

ఇప్పుడు స్టేజ్ మీదకి 'మొదటి నాయకుడు', 'రెండవ నాయకుడు' అని రాసుకొని ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చారు.

ప్రజలు మొదటి నాయకుడిని "నిన్ను ఎన్నుకుంటే మాకోసం ఏం చేస్తావు" అని అడిగారు.

"మీ ఊరి చెరువు పూడిక తీసి ఇస్తాను. చెరువుకట్ట కు గండి పడకుండా మరమ్మతు చేస్తాను" అని చెప్పాడు ఆ వ్యక్తి.

రెండవ నాయకుడు “మీ పిల్లలు, కాలేజీ చదువు కోసం బయటకు వెళ్లకుండా, ఇక్కడే కాలేజ్ కట్టిస్తాను" అన్నాడు.


రిత్విక్ మాట్లాడుతూ “మొదట్లో అందరూ తమ గ్రామానికి, పట్టణానికి ఉపయోగపడే పనులు జరగాలని కోరుకునే వారు. కానీ గెలిచినవాడు ఆ పనులు చేసేవాడు కాదు. తిరిగి ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో ఆశ చూపి ఓట్లు రాబట్టుకునే వారు. ఎన్నికల ముందు ఎలా జరుగుతుందో చూడండి” అన్నాడు.


మొదటి నాయకుడు ప్రజల్లో ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి, “నువ్వు మా క్యాస్ట్ . కాబట్టి నాకే ఓటు వేయాలి” అన్నాడు.


రెండవ వ్యక్తి దగ్గరకు వెళ్లాడా నాయకుడు.

ఆ రెండో వ్యక్తి కాస్త పొట్టిగా ఉన్నాడు.


“నేను గెలిస్తే పొట్టి వాళ్లకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను” అన్నాడు.

అతను ఆనందం గా ‘మీకే ఓటు వేస్తాను’ అన్నట్టు తల ఊపాడు.

నాయకుడు మూడో వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు.

అతను పొడుగ్గా ఉన్నాడు.


“నేను గెలిస్తే పొడుగు వాళ్లకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను” అన్నాడు.

అతను నాయకుడి కాళ్లకు దండం పెట్టి, “మీకే ఓటు వేస్తాను” అన్నాడు.


నాలుగవ వ్యక్తి లావుగా ఉన్నాడు.

“లావుగా ఉన్న వాళ్లకు వెయ్యి రూపాయలు ఇస్తాను” అన్నాడు నాయకుడు.

“నా ఓటు ఖచ్చితంగా మీకే” అన్నాడతను.


నాయకుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


కొంతసేపటికి మెడలో దండ తో “నేను గెలిచాను” అంటూ తిరిగి వచ్చాడు.

వెంటనే, “అందరూ పన్నులు కట్టండి” అంటూ ప్రజల చేతిలో ఉన్న కొన్ని రంగు కాగితాలను తీసుకున్నాడు.


వాటిని లెక్క చేశాడు ‘ఎనిమిది వేలు ఉన్నాయి’ అని ప్రేక్షకులకు వినపడేలా అన్నాడు.


తరువాత నలుగురికీ తలా ఒక వెయ్యి వంతున, నాలుగు వేలు ఇచ్చాడు. మిగిలిన నాలుగు వేలు జేబులో వేసుకున్నాడు.


తరువాత అటూ ఇటూ చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ నాయకుడు.


అప్పుడు మొదటి వ్యక్తి పెద్దగా అరుస్తూ "మొదట నా దగ్గర 2000 ఉన్నాయి. 'ఈయన గెలిచి వెయ్యి రూపాయలు ఇస్తే, 3000 అవుతాయి' అనుకున్నాను. కానీ ఇప్పుడు నా దగ్గర వెయ్యి రూపాయలే ఉన్నాయి" అన్నాడు.

మిగిలిన ముగ్గురూ "మా పరిస్థితి కూడా అంతే" అన్నారు ఏడుస్తూ.


అప్పుడు రెండవ నాయకుడు వాళ్ల దగ్గరకు వచ్చి “చూశారా! నా మాట నమ్మక పొరపాటు చేశారు. ఈసారైనా నాకు ఓటు వేయండి” అన్నాడు.

రిత్విక్ తిరిగి మాట్లాడుతూ “నాయకులు ఇప్పుడు ప్రజలకు వ్యక్తిగత లాభాలు చూపించి ఆశ పెడుతున్నారు. నిజానికి వీటి వల్ల పెద్దగా ఉపయోగం లేదు. కేవలం 'నాకు ఏదో లాభం చేకూరింది' అనే భ్రమ కల్పిస్తున్నారు. ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును కూడా పన్నుల రూపంలో, పెరిగిన ధరల రూపంలో పోగొట్టుకుంటున్నారు. నాయకులు వాళ్ల స్వార్థం వాళ్లు చూసుకుంటున్నారు. కాబట్టి ఓటు వేసే ముందు నిజమైన అభివృద్ధి ఎవరు చేస్తారు అని ఆలోచించి ఓటు చేయాలి" అంటూ చెప్పడం ముగించాడు.


సభంతా చప్పట్లతో మారుమోగిపోయింది. గ్రామ సర్పంచ్ తో సహా ప్రముఖులు స్టేజ్ మీదకు వచ్చి రిత్విక్ ని అభినందించారు.


రాఘవేంద్ర, ఇతర లెక్చరర్స్ కూడా స్టేజి మీదికి వచ్చి రిత్విక్ ని ప్రశంశించారు. స్టూడెంట్స్ అందరూ కింద నుంచే ‘రిత్విక్.. రిత్విక్..’ అంటూ నినాదాలు చేశారు.

అందరికీ వినయంగా నమస్కరించాడు రిత్విక్.

తర్వాత అతను స్టేజ్ మీద నుండి కిందకి దిగబోతూ ఉండగా. "కాస్త ఆగండి బాబూ!" అని ఎవరో అనడం తో ఆగాడు.

జనాల్లో నుంచి ఒక వ్యక్తి పైకి లేచి "మాలాంటి పేద వాళ్లకి అందే పది పన్నెండు రూపాయలను కూడా ఇవ్వొద్దు అని చెబుతున్నారా మీరు?" అని ఆవేశంగా అడిగాడు.

అందరూ అతని వంక చూశారు.

గ్రామ సర్పంచి కోపంగా "ఒరేయ్ చలపతీ! ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జరుగుతున్న విషయాలను, మన కళ్ల ముందు ఒక సినిమా వేసి చూపించినట్టుగా చేశాడు ఈ అబ్బాయి. ఊరంతా అతన్ని అభినందిస్తూ ఉంటే నువ్వు తప్పులు వెతుకుతున్నావా" అని అడిగాడు.


జీవన్ అతని వంక చూస్తూ "ఈ మీటింగ్ అయ్యాక నన్ను కలువు. నీకు తగ్గ సమాధానం అప్పుడు చెబుతాను" అని కోపంగా అన్నాడు.


ఆ గ్రామానికి చెందిన 70 ఏళ్ల మాజీ సర్పంచ్ అతనితో మాట్లాడుతూ "నువ్వు పేదవాడివి ఏమిటి చలపతీ? పేద వాడినని చెప్పి గవర్నమెంట్ డబ్బు తింటున్నావు. కాదని నా వంక చూసి చెప్పగలవా" అని అడిగాడు.

రిత్విక్ జోక్యం చేసుకుంటూ "చలపతి గారిని మాట్లాడనివ్వండి. జవాబు చెప్పక పోతే ఆయన ఆలోచన అలాగే ఉంటుంది" అన్నాడు.

సర్పంచి కల్పించుకుంటూ "మీకు తెలియదు బాబూ! అతను ఇప్పుడే లోపలికి రావడం నేను చూశాను. మీరు చెప్పింది ఏమీ వినకుండా తప్పు పట్టడం ఏమిటి? తెలియక అడిగిన వాళ్లకి, సమాధానం చెప్పవచ్చు. ఏదో ఒక రకంగా గొడవ పడాలని వచ్చిన వాళ్ళతో మాట్లాడలేరు మీరు" అన్నాడు.

చలపతి ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.

గ్రామ సర్పంచి స్టేజ్ మీదకు వచ్చి మైక్ తీసుకుని “మన ఊరికి సహాయం చేద్దామని వచ్చిన వాళ్లతో ఇలా గొడవ పడడం మంచిది కాదు. దయచేసి మన ఊరికి చెడ్డపేరు తీసుకుని రావద్దు" అని కోరాడు.


తరువాత జీవన్ చేయబోయే ప్రదర్శనకు రంగం సిద్ధమవుతోంది.

జీవన్ స్టేజి మీదికి వచ్చాడు.


సరిగ్గా అప్పుడే బయటకు వెళ్ళిన చలపతి, తిరిగి వచ్చాడు.

ఇప్పుడతను ఫుల్ గా మద్యం సేవించి ఉన్నాడు.


మనిషి తూలిపోతూ ఉన్నాడు.

చేతికి కి మల్లెపూలు చుట్టుకుని వచ్చాడు.


అతనితో పాటు మరో ఇద్దరు కూడా వచ్చారు.

అతను కట్టుకున్న పంచె జారిపోతోంది.

అయినా గమనించే స్థితిలో లేడు.

"నన్ను వెళ్లిపోమంటావా? ఎంత ధైర్యం నీకు.." అంటూ అరుస్తున్నాడు.


హఠాత్తుగా తన చేతికి చుట్టుకుని ఉన్న మల్లెపూల దండను తీసి అమ్మాయిలు కూర్చున్న వైపు విసిరాడు.


ఇంకా ఉంది...


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


38 views0 comments

Comments


bottom of page