కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Love Challenge Episode 26' Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
రిత్విక్ తో కావాలనే గొడవ పడతాడు చలపతి అనే వ్యక్తి.
గ్రామ పెద్దలు అతన్ని వారిస్తారు.
అతను మద్యం సేవించి, మళ్ళీ వస్తాడు.
మహిళలు కూర్చున్న వైపు పూల చెండు విసురుతాడు చలపతి.
ఇక చదవండి…
జరుగుతున్నది గమనిస్తూనే ఉంది నిత్యా మేడం.
జీవన్ స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి, అతను వచ్చేలోగా చలపతిని రిత్విక్ అటాక్ చేస్తాడు అనుకుంది.
కానీ అనూహ్యంగా ఇంతకు ముందు చలపతితో వాదించిన 70 ఏళ్ల వృద్ధుడు తన చేతి కర్రను బలంగా విసిరాడు.
అది చలపతి కి తగలలేదు కానీ, అతను కోపంగా ఆ వృద్ధుడిని బూతులు తిట్టడం ప్రారంభించాడు.
దాంతో అక్కడ ఉన్న ఆ గ్రామస్థులు మహిళలతో సహా ఒక్కసారిగా చలపతి మీదికి దూకారు. అతనితో పాటు అతని అనుచరులు ఇద్దరినీ చితకబాది, బయటకు నెట్టేశారు.
గ్రామ సర్పంచ్ స్టేజ్ మీదకు వచ్చి "ఇతను ఎవరో ప్రేరేపిస్తే ఇక్కడికి వచ్చి గొడవ పెట్టుకున్నట్టు నాకనిపిస్తోంది. ఈరోజు ప్రోగ్రాం ఇంతటితో ముగిద్దాం. రేపు ఉదయం చలపతిని పంచాయితీలో విచారిస్తాం. రేపు రాత్రికి మీరు యధాప్రకారం ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు" అన్నాడు.
దాంతో జీవన్ అండ్ టీం స్టేజ్ మీద నుండి కిందికి వచ్చేశారు.
రాఘవేంద్ర స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి "నేను ఎన్నో మార్లు, ఊర్లో మీటింగ్స్ పెట్టాను. ఎప్పుడూ ఏ విధమైన సమస్యా రాలేదు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే, ఇతన్ని ఎవరో కావాలని రెచ్చగొట్టినట్లు అనిపిస్తోంది. విషయం పెద్దది కాకుండా రేపు పంచాయతీలో ఇతని విషయం సర్పంచి గారు విచారిస్తారు. రేపు నాకు బిజినెస్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంది. కాబట్టి నేను ఇప్పుడే బయలుదేరి సిటీ కి వెళ్తున్నాను. వీలైనంత వరకు రేపు రాత్రికి తిరిగి వచ్చి, జీవన్ చేయబోయే ప్రోగ్రాం చూస్తాను" అని చెప్పి హైదరాబాద్ కు బయలుదేరాడు.
ఆరోజు రాత్రి గ్రామస్థులంతా గుంపులుగా చేరి ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. హాస్టల్లో స్టూడెంట్స్ కూడా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. రిత్విక్ చేసిన ప్రదర్శన చూసి ముగ్ధులయ్యారు గ్రామస్థులు. చలపతి అతనితో గొడవకు ప్రయత్నించడంతో రిత్విక్ మీద వాళ్ళ అభిమానానికి, సానుభూతి కూడా తోడయింది. కొందరు జీవన్ ని అనుమానించారు. మరికొందరు, రాజకీయాల్లో ఉన్న గురుమూర్తి ఈ పని చేయించి ఉంటాడని నమ్ముతున్నారు.
రాఘవేంద్ర సిటీకి వెళ్లడంతో, గదిలో ఆద్యతో ఉన్న నిత్యా మేడం, గురుమూర్తి కి కాల్ చేయడానికి సమయం కోసం చూస్తూ ఉంది. శాన్వీ అక్కడికి వచ్చి మాట్లాడాలంటూ ఆద్యని తీసుకుని వెళ్ళింది.
వెంటనే నిత్యా మేడం తలుపు మూసి, గురుమూర్తి కి కాల్ చేసింది.
"జీవన్ స్టేజ్ మీద ఉన్న సమయం చూసి మీకు మిస్డ్ కాల్ ఇచ్చాను. మీరు కూడా వెంటనే చలపతిని పంపారు. కానీ రిత్విక్ కంటే ముందుగా ఆ పెద్దాయన రియాక్ట్ అయ్యాడు. వెంటనే ఊర్లో వాళ్ళందరూ అతని మీద దాడి చేసి తన్ని తరిమేశారు. రిత్విక్ కి అతని దగ్గరకు వెళ్లే అవకాశమే రాలేదు. విషయం బెడిసికొట్టింది. కొందరు జీవన్ ని కూడా అనుమానిస్తున్నారు" అని చెప్పింది.
గురు మూర్తి మాట్లాడుతూ "అవును. నేను తొందర పడకుండా ఉండాల్సింది. పల్లెటూరి ప్రజల సంగతి తెలిసిందే కదా! చలపతి లాగా చిల్లర వేషాలు వేసే వాళ్ళని, మూలనున్న ముసలమ్మ కూడా చావ గొడుతుంది. నాకైతే మరొక ఉపాయం తట్టింది. మీరు సరేనంటే దాన్ని అమలు చేద్దాం" అన్నాడు.
"చెప్పండి!" అంది నిత్యా మేడమ్.
"ఈరోజు జీవన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ జరగలేదు కాబట్టి రేపు జరగనివ్వండి. లేకుంటే అతన్ని గ్రామంలో ఎవరూ పట్టించుకోరు. మరుసటి రోజు స్టూడెంట్స్ తో ఏదైనా టూర్ ప్లాన్ చేయండి. అక్కడ మళ్లీ చలపతితో అమ్మాయిలను అల్లరి పెట్టిద్దాం. జీవన్ లేని సమయం చూసి ప్లాన్ చేద్దాం. గ్రామస్థులు ఎవరూ ఉండరు కాబట్టి ఖచ్చితంగా రిత్విక్ గొడవకు దిగుతాడు. చలపతి, అతని అనుచరులు రక్తం కారేలా దెబ్బలు తగిలించుకుని ఊర్లో ఉన్న తమ బంధువులను రెచ్చ గొడతారు. గ్రామస్థుల్లో ఒకసారి నిప్పు రాజేస్తే అది ఏళ్ల తరబడి రగులుతూనే ఉంటుంది. ఎలక్షన్ లు వచ్చేసరికి ఒక గ్రూపు ఖచ్చితంగా రిత్విక్ కి వ్యతిరేకంగా ఓటు వేస్తారు. మిగిలిన ఓట్లు చెరిసగం తెచ్చుకున్నా జీవన్ గెలిచి పోతాడు. ముందు ముందు జీవన్ పొలిటికల్ ఎంట్రీ కి ఇది పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది" అన్నాడు గురుమూర్తి.
"అలాగే అన్నయ్య గారూ! టూర్ ప్రోగ్రాం కి రాఘవేంద్ర గారిని ఒప్పిస్తాను. మ్యాచ్ ప్రాక్టీస్ కి ఒకరోజు వేస్ట్ అవుతుందంటారేమో.. ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక మీకు చెబుతాను" అంది నిత్యా మేడమ్.
"ఈరోజు జరిగిన గొడవ గురించి వివరాలు ఏమైనా తెలిసాయా" శాన్వి తో కలిసి బయటకు నడుస్తూ అడిగింది ఆద్య.
"చెబుతాను గానీ ముందుగా నీ పర్సనల్ విషయం ఒకటి అడుగుతాను. ఏమీ అనుకోవు కదా" అడిగింది శాన్వీ.
"ఏమిటో అది?" అంది ఆద్య.
"మీ పిన్నికి.. అదే.. నిత్యా మేడమ్ కి , నీమీద కోపం ఉందా?" అడిగింది శాన్వీ.
చెప్పడం ప్రారంభించింది ఆద్య.
"ఆమె మొదట్లో మా కాలేజీలో లెక్చరర్ గా పని చేసేది. నాన్న గారితో పరిచయం పెంచుకుంది. ఆయనకు ఇతర వ్యాపారాలు కూడా ఉండడంతో లెక్చరర్ ఉద్యోగం మానేసి, ఆయన దగ్గర పిఎ గా చేరింది. నెమ్మదిగా ఆయన మనసు తనవైపు తిప్పుకుంది. అమ్మకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉండటంతో ఈమె వైపు ఆకర్షితుడయ్యాడు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండే నాన్న, ఈమె విషయంలో తప్పటడుగు వేశాడు. నేను చిన్న పిల్ల గా ఉన్నప్పుడే అమ్మను ఒప్పించి విడాకులు తీసుకుని, నిత్యా మేడమ్ ని పెళ్లి చేసుకున్నాడు. తరువాత కొద్ది రోజులకే అమ్మ మరణించిందట.
ఆ విషయాలేవీ నాకు తెలియదు. నాకప్పుడు రెండు మూడేళ్లు. చిన్నప్పుడు ఆమెనే ‘అమ్మా’ అని పిలిచేదాన్ని. ఆమెకి పిల్లలు పుట్టలేదు. పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. పిల్లలు కలగరు కాబట్టి నన్ను దగ్గరకు తీసుకుంటుంది అని నాన్నగారు భావించారు. కానీ అప్పటి నుండి నా మీద ద్వేషం పెంచుకుంది ఆమె.
పైకి మామూలుగానే ఉన్నా, నన్ను పరాయి మనిషి లా చూస్తోందనేది నాకు మాత్రమే తెలుసు. అన్ని విషయాల్లో ఉన్నతంగా ఉండే నాన్నగారు ఈమె విషయంలో లొంగి పోవడం నాకు బాధ కలిగించింది. స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే పరిచయాల మీద నమ్మకం పోయింది.
కానీ రిత్విక్ నిష్కల్మషమైన ప్రవర్తన నాలో మార్పు తెచ్చింది. అలాగే నా కోసం మారిన జీవన్ ప్రవర్తన కూడా నాకు నచ్చింది" చెప్పడం ముగించి "ఇంతకీ ఇదంతా ఎందుకు అడిగావు" అని ప్రశ్నించింది ఆద్య.
"నిన్న రాత్రి లంచ్ టైంలో నిత్యా మేడమ్ ఎవరితోనో రహస్యంగా మాట్లాడడం గమనించాను. నిన్న గొడవ కు ముందు కూడా ఎవరికో కాల్ చేసి వెంటనే కట్ చేసింది. తరువాత ఎంట్రన్స్ వైపు పదేపదే చూస్తోంది. కొద్దిసేపటికే చలపతి వచ్చాడు. అప్పుడు నేను ఆమె వెనక కుర్చీ లోనే కూర్చుని ఉన్నాను" అని చెప్పింది శాన్వీ.
"నిజమే! ఆ గురుమూర్తి, మా పిన్నికి దూరపు బంధువు అట. ఒకవేళ ఈ చాలెంజ్ విషయంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారేమో అని నాకు అనుమానంగా ఉంది" అంది ఆద్య.
"విషయాన్ని రిత్విక్ తో చెప్పమంటావా" అని శాన్వీ అడిగితే "వద్దు. వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే మంచి స్నేహితులు అవుతున్నారు. ఇద్దరు శక్తివంతులైన యువకులు ఒకే వైపు ఉంటే, వాళ్ళ బలం పది రెట్లు పెరుగుతుంది. భవిష్యత్తులో ఆరోగ్యకరమైన రాజకీయ స్నేహాలు రావడానికి ఇది దోహదపడుతుంది. నువ్వు చెప్పదలుచుకున్న నీ అనుమానం, జీవన్ తోనే చెప్పు. తన తండ్రి వైపు తప్పు ఏదైనా ఉంటే అతను సరి చేస్తాడు. అవసరమైతే తండ్రికి ఎదురు తిరుగుతాడు" అంది ఆద్య.
***
ఇదే విషయం గురించి చందూ, సందీప్ కూడా మాట్లాడుకుంటున్నారు.
"ఆ చలపతి గాడిని ఎవరు పంపించి ఉంటారు? ఒకవేళ జీవన్ కు తెలియకుండా వాళ్ళ నాన్న గురుమూర్తి పంపించాడేమో.." అన్నాడు సందీప్.
"ఎంత మాత్రం కాదు" అన్నాడు చందూ.
"మరెవరు పంపి ఉంటారంటావు?" అడిగాడు సందీప్.
"నా కోసం దేవుడే పంపించాడు. దీప్యను లొంగదీసుకునే విషయంలో ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వేమో చేతులెత్తేశావు. సమయానికి ఆ చలపతి గురించి తెలిసింది. అతన్ని కలిసి సహాయం తీసుకుంటాను. అతనికి కావలసిన సహాయం చేస్తాను" అన్నాడు చందూ.
"ఇలాంటి పనులు చేస్తే జీవన్ ఒప్పుకోడు" అన్నాడు సందీప్.
"జీవన్ కు తెలియకుండా నేరుగా వాళ్ళ నాన్నతో మాట్లాడుతాను" అన్నాడు చందూ.
అనుకున్నదే తడవుగా ఆయనకు ఫోన్ చేశాడు.
"నమస్తే సార్! నేను మీ అబ్బాయి జీవన్ స్నేహితుడు చందూని" అన్నాడు.
"చెప్పు చందూ! ఏమిటి అక్కడి విశేషాలు?" అడిగాడు గురుమూర్తి.
"నిన్న చలపతి అనే వాడు వచ్చి గొడవ చేయాలని చూడటం, ఊరి జనాలు రిత్విక్ కి మద్దతుగా అతన్ని తన్ని తరమడం.. మీకు తెలిసే ఉంటుంది. ఇందులో మీ చేయి ఉన్నట్లు ఊర్లో వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటిదేమీ ఉండదని నేను అందరికీ చెప్పాను. కానీ మనలో మాట.. మీకు ఏదైనా సహాయం కావలసి ఉంటే నాతో చెప్పండి. జీవన్ కి కూడా తెలియకుండా నడిపిస్తాను" అన్నాడు చందూ.
"నీకు తెలిస్తే జీవన్ తో చెప్పేస్తావని, నిన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయలేదు. చలపతి తో నిన్ను కాంటాక్ట్ చేయమని చెబుతాను. జాగ్రత్తగా డీల్ చేయండి. ఎవరికీ అనుమానం రాకూడదు" అన్నాడు గురుమూర్తి.
"తప్పకుండా సార్! మీ మీద కానీ, జీవన్ మీద కానీ ఈగ ను కూడా వాలనివ్వను" నమ్మకంగా చెప్పాడు చందూ.
కాల్ కట్ చేశాక సందీప్ వైపు తిరిగి "చూశావా! ఆ చలపతి అనేవాడు గురుమూర్తి పంపిన మనిషే. నిమిషంలో ఎలా బయట పెట్టానో చూడు. ఇక అతను టచ్ లోకి వస్తే స్వామి కార్యం, స్వకార్యం రెండూ జరుగుతాయి" అన్నాడు.
"నీ మాటలు నాకు భయాన్ని కలిగిస్తున్నాయి చందూ! అనవసరపు గొడవల్లో ఇరుక్కుంటా వేమోనని అనుమానంగా ఉంది. ఆ దివ్య గురించి వదిలేయ్. స్టూడెంట్ గా సరదా కోసం చిన్న చిన్న పొరపాట్లు చేయడం వేరు. కానీ ఏదైనా పెద్ద పొరపాటు చేస్తే, లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది” అన్నాడు సందీప్.
"ఈ నగరానికి ఏమైంది? అందరూ రిత్విక్ లాగా సాధువులు అయిపోతున్నారు" నవ్వుతూ అన్నాడు చందూ.
మరికొంత సేపటికి ఒక అన్నోన్ నంబర్ నుండి కాల్ వచ్చింది చందూ కి.
"నేను చలపతి ని మాట్లాడుతున్నాను. పెద్ద సారు నీ గురించి చెప్పిండ్రు. నీకోసం హాస్టల్ బయట బైక్ లో ఉన్నాను. ఎవరు చూడకుండా వచ్చి కలువు. ఇద్దరం కలిసి మందు కొడదాం" అన్నాడు చలపతి.
'వీడు గట్టివాడే.. చావు దెబ్బలు తిని రెండు గంటలు కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ మందు కొట్టడానికి రెడీ అయిపోయాడు" అనుకున్నాడు చందూ.
ఎవరూ గమనించని సమయం చూసి హాస్టల్ బయటకు వెళ్ళాడు.
చందూని వెనక కూర్చోబెట్టుకొని, ఊరికి ఆ హాస్టల్ కి మధ్య ఉన్న ఒక గుడిసె దగ్గరకు తీసుకొని వెళ్ళాడు చలపతి.
అతనితోపాటు గుడిసెలోకి ప్రవేశించాడు చందూ.
లోపల ఒక పాతికేళ్ళ అందమైన యువతి ఉంది.
చలపతి ని చూడగానే "రా మామా! పాడు జనాలు ఎన్ని దెబ్బలు కొట్టారు.." అంది అతని భుజం మీద చెయ్యి వేస్తూ.
సగం జారిన ఆమె పైట వంక రెప్పలార్పకుండా చూస్తున్నాడు చందూ.
అది క్రీగంట గమనించిన ఆ యువతి చలపతి తో “బయట గుండిగలో వేడి నీళ్లు కాచి ఉంచాను. స్నానం చేసి రా మామా! నువ్వు వస్తావని తెలిసి చేపల పులుసు చేసి ఉంచాను" అంది.
ఆమె నడుము ఒంపుల వంక, ఎద పొంగుల వంక దొంగ చూపులు చూస్తూ ఉన్నాడు చందూ.
ఆ యువతి చందూ దగ్గరకు దాదాపు అనుకున్నట్లు వచ్చి నిలుచుని "నిన్ను గమనించు కోమని చెప్పాడు మామ. ఏం కావాలో మొహమాట పడకుండా అడుగు" అంది చందూని కవ్విస్తున్నట్లు చూస్తూ.
చందు లో టెన్షన్ పెరిగిపోయింది.
ఆమె చందూ చేతులు తీసి తన భుజాల పైన వేసుకొని "ఇంకా భయమెందుకు? అడుగు" అంది.
చందు ఆమెను గట్టిగా కౌగిలించుకుని ముఖమంతా ముద్దులు పెట్టేస్తున్నాడు. అంతలో హఠాత్తుగా ఆ గుడిసె తలుపు తెరుచుకుంది.
ఎదురుగా చలపతి ఉన్నాడు.
గుండె ఆగినట్లైంది చందూకి.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments