కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Love Challenge Episode 17' Telugu Web Series Written By
Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
మ్యాచ్ ఫిక్సింగ్ విషయంగా జీవన్ కి కాల్ చేస్తాడు పూర్ణేష్.
తను రీథింకింగ్ లో ఉన్నట్లు చెబుతాడు జీవన్.
ఆద్య కాల్ చెయ్యడంతో తన ప్రోగ్రాం మార్చుకొని గ్రౌండ్ కి వస్తాడు.
ఇక చదవండి…
జీవన్ ని, 'అల్లుడుగారూ' అంటూ నిత్యా మేడం పలకరించడంతో స్టూడెంట్స్ అందరూ నిర్ఘాంత పోయారు.
'ఆమె జీవన్ గారూ అని పిలిచిందేమో.. తనకు అల్లుడు గారూ అంటూ వినిపించి ఉండవచ్చు' అనుకున్నాడు జీవన్.
కానీ మిగతా అందరూ దిగ్భ్రాంతి చెందినట్లు ఉండడంతో అతనికేమీ అర్థం కాలేదు.
ఆద్య మాత్రం తన సవతి తల్లి నిత్య వంక కోపంగా చూసి, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది.
"చూశావా జీవన్ దాని పొగరు! దీనికి కళ్ళు నెత్తి కెక్కాయి అంది" నిత్య.
ఆమె ఏం మాట్లాడుతోందో అర్థం చేసుకోలేక పోతున్నాడు జీవన్. ఏ మాత్రం పరిచయం లేని తనను 'అల్లుడుగారూ' అంటూ పిలిచింది. తన ముందే ఆద్యను చులకనగా మాట్లాడింది.
ఇంకా ఏదో చెప్పబోతున్న ఆమెను ఆగమన్నట్లు చెయ్యి ఊపాడు జీవన్.
"చూడండి మేడం! మీరు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి చెబుతున్నాను. అదే మరొకరు ఆద్య గురించి చులకనగా నా ముందు మాట్లాడి ఉంటే వాళ్ళ అంతు చూసే వాడిని. ఆద్య గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను సహించలేను. ఆద్య కోసం ఎవరినైనా ఎదిరిస్తాను. ఎంతకైనా తెగిస్తాను" ఆమె వంక సూటిగా చూస్తూ తన చూపుడు వేలు ఊపుతూ చెప్పాడు జీవన్.
మళ్లీ విద్యార్థుల్లో కలకలం రేగింది. అంత ధైర్యంగా అతను నిత్యా మేడం తో మాట్లాడటం తో ఈ విషయం ఏ పరిణామాలకు దారి తీస్తుందో నని అందరూ ఆందోళన పడుతున్నారు. దూరంగా వెళుతున్న ఆద్య దగ్గరికి కొంతమంది అమ్మాయిలు వెళ్లి విషయం చెప్పి వెనక్కి రమ్మన్నారు.
కాస్త దూరంగా శోభన్ కాలేజ్ ప్లేయర్స్ తో మాట్లాడుతున్న రిత్విక్ జరుగుతున్న గొడవ చూసి వీళ్ల దగ్గరకు వచ్చాడు. ఆద్య కూడా అక్కడికి చేరుకుంది.
రిత్విక్ జీవన్ వైపు తిరిగి, “ఏమైంది జీవన్? ఎనీ ప్రాబ్లం..” అని అడిగాడు.
ఎదురుగా ముఖాన్ని కంద గడ్డలా చేసుకొని ఆవేశంతో ఊగి పోతున్న నిత్యా మేడమ్ తో “ప్లీజ్ మేడం! దయచేసి ఆ కుర్చీలో కూర్చోండి. ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వండి. ఏం జరిగిందో ముందు నన్ను తెలుసుకోనివ్వండి. తరువాత మా స్టూడెంట్స్ తరఫున మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే, వాళ్ల చేత క్షమాపణ చెప్పిస్తాను. లేదా విద్యార్థి నాయకుడిగా నేనే క్షమాపణ చెబుతాను. దయచేసి కొంత సమయం నాకు ఇవ్వండి” అని రిక్వెస్ట్ చేయడంతో పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది నిత్యా మేడమ్.
తర్వాత జీవన్ భుజం మీద చేయి వేసి, "ఏం జరిగిందో చెప్పు జీవన్" అని అడిగాడు రిత్విక్.
జీవన్ మాట్లాడుతూ “మన కాలేజీ స్టూడెంట్ గురించి .. అందునా ఆద్య లాంటి మంచి అమ్మాయి గురించి చులకన చేస్తూ మాట్లాడితే నాకు కోపం వచ్చింది. అలా మాట్లాడొద్దని గట్టిగా చెప్పాను" అన్నాడు.
ఆద్య మాట్లాడుతూ “మా పిన్ని అదే ..నిత్యా మేడంగారు నన్ను ఇబ్బంది పెట్టేలా మాట్లాడడంతో ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాను.
ఇందులో గొడవ పడడం ఏమీ లేదు. కానీ ఈ విషయంలో మిస్టర్ జీవన్ కల్పించు కోవలసిన అవసరం ఏముందో నాకు తెలియడం లేదు. గతంలోనే ఒక సారి చెప్పాను, నాకు కేర్ టేకర్ ఎవరూ అవసరం లేదని. నాకు ఏదైనా సమస్య అనిపిస్తే దాన్ని నేనే స్వయంగా పరిష్కరించు కోగలను.
నేను కాలేజీలో చేరినప్పుడే నా కోరిక మీద మా నాన్నగారు అందరు లెక్చరర్స్ తో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. అందులో నన్ను మామూలు స్టూడెంట్ లాగే చూడమని అందరినీ కోరాను” అని చెప్పింది ఆద్య.
నిత్యా మేడం మాట్లాడుతూ “ముందుగా నేను చెప్పేది అందరూ నిదానంగా వినండి” అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా రిత్విక్ ఆమెను వారించాడు.
“ఇలా ఓపెన్ గా అందరిలో మాట్లాడుకోవడం ఎందుకు? మేమంతా తెల్లవారితే ప్రతి రోజూ కాలేజీలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవలసిన వాళ్ళం. మీరు మా ఎండి రాఘవేంద్ర గారి భార్య. కాబట్టి విషయాన్ని మనం ఎప్పుడైనా విడిగా మాట్లాడుకుంటే బాగుంటుంది” అని చెప్పాడు రిత్విక్.
నిత్య రెండు చేతులూ జోడించి "నా వల్ల సమస్య ప్రారంభమైంది కాబట్టి చిన్న వివరణ ఇవ్వనివ్వండి. ఆద్య నా కూతురు. తను నాకు తల్లి స్థానం ఇవ్వకపోయినా నేను మాత్రం ఆద్యను కూతురుగానే భావిస్తున్నాను. ఇక ఈ రోజు జరిగిన సంఘటన గురించి చెబుతాను.
గంట క్రితమే మా దూరపు బంధువు ఒకాయన ఫోన్ చేసాడు.ఆయన తన మాటల్లో మన ఎంపీ గురుమూర్తి నాకు అన్నయ్య వరస అవుతాడని చెప్పాడు. అందుకని జీవన్ ని సరదాగా 'అల్లుడుగారూ' అని పిలిచాను.
విషయమేమిటని ఆద్య నన్ను అడిగితే ఈ విషయం సర్ప్రైజ్ గా చెప్పాలని అనుకున్నాను.
కాలేజ్ మేట్స్ లో ఒకరు.. అందునా జీవన్ లాంటి హీరో తనకు బంధువని తెలిస్తే ఆద్య సంతోష పడుతుందనుకున్నాను. కానీ ఆద్య మూర్ఖంగా.. సారీ.. జీవన్ కి కోపం వస్తుందేమో.. అపార్థం చేసుకొని దూరంగా వెళ్లిపోవడం, నేనేదో ఆద్యను టార్చర్ పెట్టినట్లు జీవన్ అనుకోవడం... ఇదంతా వెంట వెంటనే జరిగిపోయాయి. నా వల్ల జరిగిన పొరపాటుకు నేనే సారీ చెబుతున్నాను.
కానీ రిత్విక్ చెప్పినట్లుగా ఈ విషయం విడిగా కూర్చొని మాట్లాడుకుందాం.
ఎక్కడో ఎందుకు?
రిత్విక్ అండ్ జీవన్..
మీరిద్దరూ సాయంత్రం మా ఇంటికి టీ కి రండి.
ఆద్య ఎలాగూ అక్కడే ఉంటుంది. అందరం కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. కావాలంటే ముఖ్యమైన స్నేహితులు ఒకరిద్దరిని పిలుచుకొని రండి.
రాఘవేంద్ర గారు ఈ రోజు ఢిల్లీ కి బయలు దేరారు.అక్కడ ఏదో ముఖ్యమైన మీటింగ్ ఉందట.
కాబట్టి మనం సంకోచం లేకుండా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు." అని చెప్పింది.
జీవన్ మాట్లాడుతూ, "మీ ఆహ్వానానికి నా కృతజ్ఞతలు మేడం. నేనైతే తప్పకుండా వస్తాను. మీరు ఎలాగైతే మీ మనసులో ఉన్నది చెప్పారో నన్ను కూడా అలాగే చెప్పనీయండి" అన్నాడు.
తరువాత ఆద్యతో "ఆద్యా! ఇలా నలుగురిలో నీతో ఈ విషయం చెప్పడం ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెడుతుంది. కానీ ఇదే నా వలన నీకు కలిగే ఆఖరి ఇబ్బంది. జీవితంలో ఎప్పుడూ నా వల్ల నీకు చీమ కుట్టినంత అసౌకర్యం కూడా కలుగదు. ప్రామిస్!
నేను నిన్ను పేమిస్తున్నాను.
ఐ యామ్ క్లియర్..
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
మొదటిసారి నిన్ను చూసిన క్షణం నుంచీ ప్రేమిస్తున్నాను.
ఎవరి వల్లనైనా నువ్వు దూరం అవుతావంటే భరించలేను.
నిత్యా మేడం గారు 'అల్లుడుగారూ..' అని సంబోధించడం నేరమేమీ కాదు.
కానీ అందువల్ల నీకు నా మీద కోపం రావచ్చన్న ఊహే, నాకు మేడం గారి మీద కోపం తెప్పించింది.
నిన్న క్రికెట్ మ్యాచ్ లో నేను రాణించడానికి కారణం నువ్వు.
నీ దృష్టిలో పడాలన్న ఆలోచనే నాలో ఉన్న ఎనర్జీ ని బయటకు తీసింది.
నన్ను రాణించేలా చేసింది.
"అఫ్ కోర్స్ ! నాకంటే కొన్ని వందల మంది, వేలసార్లు బాగా ఆడి ఉంటారు.
కానీ నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే నీ వల్ల నేను మారుతున్నాను.
నా ప్రవర్తన, ప్రతిభ మారుతున్నాయి.
రాంగ్ థింకింగ్ అనే వరదలో కొట్టుకుపోతున్న నన్ను నీ ఆలోచనలు గట్టుకు చేరుస్తున్నాయి.
సో.. నిన్ను నేను వదులుకోలేను.
నీ ప్రేమను పొందడానికి ఏమైనా చేస్తాను.
మరో విషయం అందరి ముందూ స్పష్టం చేస్తున్నాను.
నీ మీద ఏ విధమైన వత్తిడీ తీసుకొని రాను.
నీ అంతట నువ్వు నాకు 'ఐ లవ్ యూ' అని చెప్పేదాకా వేచి చూస్తాను.
నీకు కావలసినట్లుగా నన్ను నేను మలుచుకుంటాను. నా మొత్తం ఆస్తిని వదులుకొని వచ్చెయ్యమన్నా వచ్చేస్తాను.
నువ్వు నాకు 'ఐ లవ్ యూ' చెబితే చాలు.
పెళ్లి కోసం ఎన్నేళ్లయినా ఆగుతాను.
అంతవరకూ అనవసరంగా టచ్ చెయ్యడానికి కూడా ప్రయత్నించను.
మిస్టర్ రిత్విక్! నువ్వు కూడా ఆద్యను లవ్ చేస్తున్నావని నాకు తెలుసు.
కమాన్!
టేక్ మై ఛాలెంజ్!
నువ్వు నాలా ఓపెన్ కాదు.
మనసులో ఉన్నది బయట పెట్టవు.
ఇప్పటి వరకు నాకంటే ఆద్యకు నువ్వే బెటర్ ఛాయిస్. ఆ విషయం నాక్కూడా తెలుసు.
కానీ ఆద్య నిన్ను కాదని, నన్ను ఎంచుకునేలా ప్రవర్తిస్తాను.
ఇది నా లవ్ ఛాలెంజ్" అన్నాడు జీవన్.
"జీవన్..ప్లీజ్ ఇప్పుడెందుకీ ఆవేశం? ఎందుకీ తొందర?
నా మీద టివి స్క్రోలింగ్స్ వేయించిన విషయం గురించి మాట్లాడుకోవడాన్ని కూడా క్రికెట్ టోర్నమెంట్స్ ముగిసేవరకు వాయిదా వెయ్యడానికి ఒప్పుకున్నాను.
ఇలా నలుగురిలో ఇప్పుడిలా ఆద్యని ఒక టాపిక్ లా చెయ్యడం బాగుందా?
ఆమె గురించి నలుగురూ డిస్కస్ చేసుకుంటూ వుంటే ఏం బాగుంటుంది?
ఇప్పటికి చేసింది చాలు.
ముందు టోర్నమెంట్స్ ముగియనీ.
ఆ తరువాత మేడం చెప్పినట్లు విడిగా మాట్లాడుకుందాం" రిక్వెస్ట్ చేసాడు రిత్విక్.
"మిస్టర్ రిత్విక్! ముందు చాలెంజ్ కి ఒప్పుకుంటే ఎప్పటిలాగే మనం ఫ్రెండ్స్ లా ఉంటాం. ఆద్యను ఇంప్రెస్ చెయ్యడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేద్దాం. ఆద్య నిర్ణయాన్ని ఇద్దరమూ ఒప్పుకుందాం. తరువాత కూడా అందరం ఫ్రెండ్స్ లాగే ఉందాం. దీని ప్రభావం టోర్నమెంట్ మీద ఉండదు. ఉన్నా అది ఆటలో కూడా ఇద్దరం పోటీ పడటానికి ఉపయోగ పడుతుంది."
పోటీ పడక తప్పదన్నట్లు చెప్పాడు జీవన్.
“ఇలా ఉన్నట్లుండి ఆద్యను అడగడం ..అది కూడా కాలేజీలో అందరి ముందూ అడగడం సరి కాదు. ఈ గొడవకు ఇంతటితో పుల్ స్టాప్ పెడతానంటే నేను కూడా ఛాలెంజ్ కి సిద్దమే. కానీ అందుకు ముందుగా మనం ఆద్య అనుమతి తీసుకోవాలి. అందుకు తగిన ప్రదేశం ఇది కాదు. తగిన సందర్భం కూడా కాదు." అన్నాడు రిత్విక్.
"ఎందుకు కాదు మిస్టర్ రిత్విక్? రాకుమార్తెకు స్వయంవరం ప్రకటించడం, కోరుకున్న వాడి మెడలో నిండు సభలో మాల వేసి ఆమె వరించడం ఎప్పటినుండో వుంది. ఇది కూడా అలాంటిదే. మన ఇద్దరిలో ఎవరంటే ఇష్టమో ఆద్య నిర్ణయిస్తుంది. ఆమె నిర్ణయానికి నేను ఎదురు చెప్పను. లెటజ్ స్టార్ట్ ది ఛాలెంజ్" అన్నాడు జీవన్.
అప్పటికే అక్కడికి చేరుకుంది లెక్చరర్ సామ్రాజ్యం.
"ఏం జరుగుతోందిక్కడ? ఇలా ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తూ అందరి ముందూ ఇలా రచ్చ చేయడం ఏమిటి?
జీవన్! నువ్వేమిటిలా..? చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఒక స్త్రీని నలుగురిలో వివస్త్రగా నిలబెట్టిన సంఘటనలు న్యూస్ లో చూస్తూ ఉంటాం. ప్రేమించలేదని యాసిడ్ పోసిన సంఘటనలు ఎన్నో చూసాం. ఇప్పుడు జరుగుతున్న సంఘటన అందుకేమీ తీసిపోదు. అసలు దీన్ని లవ్ అంటారా? లవ్ అయితే మాత్రం ఇలా వంద మంది ముందు చర్చ పెడతారా? నాలుగేళ్లు ఈ కాలేజీలో చదవాలని వచ్చిన అమ్మాయిని చేరిన మూడో రోజే హాట్ టాపిక్ చెయ్యడమేమిటి?
మిస్టర్ రిత్విక్!
నీ విజ్ఞత ఏమైంది? ఏ అమ్మాయికి చిన్న అసౌకర్యం కలిగినా ఆదుకోవడానికి ముందుంటావని నీకు పేరు.
నీ ముందు ఇలా ఆద్యను మానసికంగా నగ్నంగా చేస్తూ వుంటే నువ్వెలా ఉరుకున్నావ్? జీవన్ తో వివాదమెందుకని సంకోచిస్తున్నావా?” ఆవేశంగా మాట్లాడింది సామ్రాజ్యం.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments