కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Love Challenge Episode 18' Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
ఆద్య గురించి చులకనగా మాట్లాడిందని నిత్యా మేడం తో గొడవ పడతాడు జీవన్.
ఆద్య కు కాలేజీలో అందరి ముందు 'ఐ లవ్ యు' చెబుతాడు.
రిత్విక్ తో 'లవ్ ఛాలెంజ్' చేస్తాడు జీవన్.
ఇక చదవండి…
ఇంతలో అక్కడ ఉన్న వాళ్లను నెట్టుకుంటూ ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చారు.
వాళ్లు సరాసరి జీవన్ దగ్గరకు వెళ్లి, "మా ఇద్దరిలో ఎవరిని ప్రేమిస్తున్నావో చెప్పు" అన్నారు.
జీవన్ కి ఏమీ అర్థం కాలేదు.
"అసలు ఎవరు మీరు? నేను మీలో ఒకరిని ఎందుకు ప్రేమించాలి? నేను ఆద్యను ప్రేమిస్తున్నాను. ఆ విషయం ఇప్పుడే అందరి ముందూ చెప్పాను. ముందు మీరెవరో చెప్పండి" అని అడిగాడు.
తరువాత తన వంక నవ్వుతూ చూస్తున్న రిత్విక్ ని గమనించి, "ఓహో! ఇది నీ ప్లాన్ అనుకుంటాను" అన్నాడు.
"ప్లాన్ కాదు. జస్ట్ సిచువేషన్ నీకు అర్థం కావాలని ఇలా చేశాను. ఆ ఇద్దరు అమ్మాయిల లో ఒకర్ని లవ్ చేస్తున్నట్లు నువ్వు చెప్పగలవా? కచ్చితంగా చెప్పలేవు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నది ఆ ఇద్దరు అమ్మాయిలు మాత్రమే కాదు. అలాగే ఆద్య విషయంలో కూడా! మన ఇద్దరిలో ఒకర్ని ఎంచుకోవాలన్న నిబంధన ఆద్యకు ఎందుకు? మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ లో కూడా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా 'ఏదీ కాదు' అనే అప్షన్ కూడా ఉంటుంది. మరి ఆద్య కు రెండు ఆప్షన్స్ మాత్రమే ఇచ్చి వాటిలో ఒకటి ఎంచుకోమనడం న్యాయమా?” అన్నాడు రిత్విక్.
ఆద్య మాట్లాడుతూ "ఎగ్జాక్ట్లీ! ప్రపంచం చాలా విశాలమైనది. ప్రజలు అమితంగా ఇష్టపడే సినిమా హీరోలు, క్రికెట్ ప్లేయర్ లు వందల సంఖ్యలోనే ఉంటారు. కానీ కాలేజీలో చదువుకునే అమ్మాయిలు కొన్ని కోట్లలో ఉన్నారు. వాళ్లంతా ఈ కొద్ది మంది వెంటపడి ఐలవ్యూ చెబుతారా..? లేదు. ఒక అమ్మాయి తన పక్కింటి అబ్బాయి నో, ఎదురింటి అబ్బాయి నో ఇష్టపడవచ్చు. మరొక అమ్మాయి తన బావను పెళ్లి చేసుకోవాలని అనుకోవచ్చు. మరొక అమ్మాయి కాబోయే భర్త కోసం తన ప్రేమను దాచి పెట్టుకోవచ్చు. ఇలా ఎవరి ఇష్టాయిష్టాలు, వాళ్ల నిర్ణయాన్ని బట్టి ఉంటాయి. ఎవరి దాకానో ఎందుకు? నీ విషయమే తీసుకుందాం. నీకు ఒక హీరోయిన్ అంటే అంతులేని క్రేజ్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నీ ఆలోచన నా చుట్టూ తిరుగుతూ ఉంది. బహుశా ఆ హీరోయిన్ స్వయంగా ప్రపోస్ చేసినా నువ్వు ఒప్పుకోవేమో..
ఇక నువ్వు రాజుల కాలం నాటి స్వయంవరం గురించి మాట్లాడావు. స్వయంవరాన్ని రాజకుమార్తె తండ్రి ప్రకటిస్తాడు. తనకు తెలిసిన రాజులందరినీ ఆహ్వానిస్తాడు. వారిలో నచ్చిన వాడిని రాకుమార్తె ఎంపిక చేసుకుంటుంది. ఎవరూ నచ్చకపోతే ఆ స్వయంవరం రద్దవుతుంది. ఆ కాలంలోనే అమ్మాయికి అంత స్వేచ్ఛ ఉంటే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలను ఎదురుగా పెట్టి ఒకరిని ఎంచుకోమనడం ఎంతవరకు న్యాయం?" అంది ఆద్య.
రిత్విక్ కల్పించుకుంటూ "ఆద్య గారూ! ప్రేమించడం నేరం కాదు. కానీ దాన్ని సరైన సమయంలో, తగిన సందర్భంలో చెప్పకపోవడం జీవన్ చేసిన పొరపాటే. ఈ విషయం గురించి చర్చ ఇంతటితో ఆపాలనే, నేను ఛాలెంజ్ కి అంగీకరించాను. నా గురించి ఈ కాలేజీలో అందరికీ బాగా తెలుసు. చాలెంజ్ చేస్తే వెనక్కితగ్గే వాడిని కాదు. నేను అనుకున్నది ఏదీ సాధించకుండా వదిలిపెట్టలేదు. కానీ మీరు చెప్పినట్లు ఎవరినీ ఇష్ట పడకుండా ఉండే హక్కు మీకు ఉంది. అసలు ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయకుండా ఉండే హక్కు కూడా మీకు ఉంది. నిత్యా మేడమ్ చెప్పినట్టుగా నా ఉద్దేశ్యంలో ఈ విషయం గురించి పబ్లిక్ లో చర్చ ఆపేసి, మీ ఇంట్లో సమావేశం అవుదాం. మీరు ఛాలెంజ్ కి ఇష్టపడకపోతే అప్పుడే మాకు స్పష్టం చేయొచ్చు. ఒకవేళ ఛాలెంజ్ కి కానీ అంగీకరించే పక్షంలో దానికి తగ్గట్లుగా అగ్రిమెంట్ చేసుకుందాం. లేదా ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకొని, ఈ ఛాలెంజ్ కి సిద్ధంగా లేదని చెబితే, ఇంతటితో ఈ విషయాన్ని ఆపేస్తాం. మీకు ఎవరి వల్లా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత నాది" అని చెప్పాడు.
శాన్వీ కల్పించుకొని ఆద్య తో మాట్లాడుతూ "నీకోసం వీళ్ళిద్దరూ ముష్టి యుద్ధాలు చేసుకుంటామని చెప్పడం లేదు. ఒకరిమీద ఒకరు కక్షలు పెంచుకుంటామని కూడా చెప్పడం లేదు. కేవలం నీ అభిమానం, ప్రేమ పొందేలా ప్రవర్తిస్తారు. రెండు సింహాలు కొట్లాడుకుంటే అడవంతా అల్లకల్లోలం అవుతుంది. మన కాలేజ్ వాతావరణం దెబ్బ తినకుండా ఈ పోటీకి నువ్వు అంగీకరిస్తే మంచిది. నీ కోసం వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకోవడం లేదు. ఎవరికి వాళ్లు, నీ అభిమానం పొందేలా చక్కగా ప్రవర్తిస్తారు. నీ మీద ఏ రకంగానూ ఒత్తిడి తీసుకొని రారు. కాబట్టి అందుకు తగ్గ నిబంధనలు పెట్టి, ఈ ఛాలెంజ్ కి నువ్వు అంగీకరిస్తే బాగుంటుందని నాకనిపిస్తుంది" అంది.
క్షణాల్లోనే ఒక నిర్ణయానికి వచ్చింది ఆద్య.
"ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో సమావేశం అవుదాం. ఏం చేయాలనేది అక్కడ నిర్ణయించుకుందాం. నేను కాదంటే ఈ చాలెంజ్ ఇంతటితో విరమించుకోవాల్సి ఉంటుంది" అంది.
జీవన్ మాట్లాడుతూ "ఆద్యా! నేను ఇందాకే చెప్పాను. నిన్ను ఇబ్బంది పెట్టేది ఈ ఒక్కసారి మాత్రమే అని. ఆ అవకాశం ముగిసింది. ఇప్పటినుండి నీకు బాధ కలిగించే పని ఏదీ నేను చేయను. నువ్వు చెప్పినట్లు గానే సాయంత్రం మీ ఇంట్లో సమావేశం అవుదాం. ఛాలెంజ్ రద్దు చేసే అధికారం నీకు ఉంటుంది. ఎవరు ఎలా ఎలా ప్రవర్తించాలి అనే నిబంధనను కూడా నువ్వు పెట్టవచ్చు" అన్నాడు.
రిత్విక్ ఆద్య తో "థాంక్యూ వెరీమచ్ ఆద్య గారూ! పెద్ద గొడవ కావాల్సిన విషయాన్ని మీ విజ్ఞతతో, సంయమనంతో పరిష్కరిస్తున్నారు. మేము మ్యాచ్ ప్రాక్టీస్ పూర్తిచేసుకుని ఈవెనింగ్ మీ ఇంటికి వస్తాం" అన్నాడు.
జీవన్ మాట్లాడుతూ "ఆద్యా! సాయంత్రం లోపల నీ మనస్సు మారి రావద్దంటే కూడా నేను ఎదురు చెప్పను. ఈ విషయాన్నీ ఇంతటితో వదిలేస్తాను" అన్నాడు.
అన్ని విషయాల్లో ఆవేశంతో వ్యవహరించే జీవన్ ఆద్య విషయంలో ఇలా తగ్గి ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
లెక్చరర్ సామ్రాజ్యం మాట్లాడుతూ "రిత్విక్ అండ్ జీవన్! ఇద్దరూ వినండి. ఈరోజు జరిగిన సంఘటనని ఆద్య నెగటివ్ గా తీసుకుని ఉంటే మీరిద్దరూ నేరస్తుల లాగా నిలబడాల్సి వచ్చేది. సాయంత్రం ఏమౌతుందో నేను ఊహించలేక పోతున్నాను. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఆద్య అంగీకరిస్తే ఇది ఒక అమ్మాయి కోసం ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే పోటీ అవుతుంది. ఆమె అంగీకరించకుంటే ఇద్దరు కుర్రాళ్ళు ఒక మైనర్ అమ్మాయిని వేధించినట్లు అవుతుంది. ఈ పోటీ వద్దని ఆద్య చెబితే ఈ విషయం ఇంతటితో వదిలేయండి. అప్పుడే మీ గౌరవం మీకు దక్కుతుంది" అని చెప్పింది.
అంగీకారంగా తలలు ఊపారు రిత్విక్, జీవన్ లు.
నిత్యా మేడమ్, ఆద్యతో మాట్లాడుతూ "ఏదో కోపంతో నిన్ను రెండు మాటలు అన్నాను. కూతుర్ని తల్లి మందలించినట్లుగానే రెండు మాటలు అన్నాను. ఈరోజు అందరూ ఓపెన్ గా వాళ్ల మనసు విప్పి మాట్లాడారు కాబట్టి నేను కూడా అందరి ముందూ చెబుతున్నాను. జీవితంలో ఎప్పుడూ నిన్ను కోప్పడను" అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుంది.
తరువాత ఆద్య, నిత్యా మేడమ్ లు కార్ ఎక్కారు. తనకు బై చెప్పడానికి కార్ దగ్గరకు వచ్చిన రిత్విక్, జీవన్ లతో "ఛాలెంజ్ సాయంత్రం నుండి కాదు. 'ఇప్పుడే ప్రారంభం అయింది' అనుకొని ప్రాక్టీస్ చేయండి. మీరు చేసే స్కోర్ కి కూడా మార్కులు ఉంటాయి" అంది నవ్వుతూ.
వాతావరణం తేలిక పడింది.
వాళ్ళు వెళ్ళాక ప్రీతం, రిత్విక్ దగ్గరకు వెళ్లి "ఈవెనింగ్ ఎలా మాట్లాడుకోవాలో, కాసేపు డిస్కస్ చేసుకుందాం. ఈలోగా మిగతావాళ్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు" అన్నాడు.
"కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. మ్యాచ్ బాగా ఆడి మన కాలేజ్ పరువు నిలబెట్టాలి. నా ఫస్ట్ ప్రియారిటి అదే" అంటూ గ్రౌండ్ లోకి నడిచాడు రిత్విక్.
చందు, జీవన్ ని పక్కకు లాక్కొని వెళ్లి, "ఛాలెంజ్ గురించి ఓ గంట మాట్లాడుకుందాం. ప్రాక్టీస్ కి తరువాత వేడుదువులే" అన్నాడు.
"కష్టపడి ప్రాక్టీస్ చేయాలి. మ్యాచ్ బాగా ఆడి మన కాలేజ్ పరువు నిలబెట్టాలి. నా ఫస్ట్ ప్రియారిటి అదే" అంటూ గ్రౌండ్ లోకి నడిచాడు జీవన్ కూడా.
ఆ రోజు పూర్తి స్థాయి వన్డే తరహాలో ఆడారు. కాకపోతే బ్యాట్స్మెన్ కి యాభై పరుగులే పరిమితిగా పెట్టుకున్నారు.
రిత్విక్ జీవన్ లు ఇద్దరూ సులభం గానే ఆ యాభై పరుగులు పూర్తి చేశారు.
తరువాత రిత్విక్, జీవన్ తో నాతోపాటు నువ్వు కూడా మిగతా వాళ్ళ ఆట తీరుని కాస్త గమనిస్తూ ఉండు. ఎవరి ఆటతీరు లోనైనా కనిపించేటంత లోపం ఉంటే, వాళ్లకు చెప్పి సరి చేసుకోమందాం" అన్నాడు.
అంగీకారంగా తలూపాడు జీవన్.
రిత్విక్, జీవన్ ల బ్యాటింగ్ ముగిశాక, బయటకు వచ్చేశారు చందు, సందీప్, వివేక్, శాన్వీ. అందరూ ఖాళీ గా ఉండే ఒక రెస్టారెంట్ కి వెళ్లారు.
సందీప్ మాట్లాడుతూ “సాయంత్రం జరగబోయే లవ్ ఛాలెంజ్ కి మనం మోడల్ గా ఒక మేటర్ రెడీ చేద్దాం" అన్నాడు.
చందు మాట్లాడుతూ "ఛాలెంజ్ లో ఓడిపోయిన వాళ్లు అర గుండు తో కాలేజ్ క్యాంపస్ చుట్టూ మూడుసార్లు తిరగాలని రూల్ పెడదాం. రిత్విక్ అలా తిరుగుతూ ఉంటే చూడాలని ఉంది" అన్నాడు.
అతని మాటలకు మద్దతుగా సందీప్, వివేక్ లు టేబుల్ మీద తమ చేతులతో గట్టిగా తట్టారు. తను బయట పడకూడదన్న ఉద్దేశంతో శాన్వీ కూడా అలానే చేసింది.
వాళ్ల శక్తి కొద్దీ మేటర్ తయారుచేసి వాట్సప్ లో టైప్ చేసి, తమ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశారు. క్షణాల్లో ఆ మెసేజ్ కాలేజ్ అంతా పాకిపోయింది.
ప్రీతం, దీప్య, సాగరిక కూడా ఒక చోట కలుసుకుని అగ్రిమెంట్ ఎలా రూపొందించాలా అని ఆలోచించారు. తమకు తోచిన సలహాలను నోట్ చేసి ఉంచారు.
ప్రాక్టీస్ మ్యాచ్ ముగిశాక రిత్విక్, జీవన్ లు ఇళ్లకు వెళ్లి ఫ్రెషప్ అయి ఆద్య ఇంటికి చేరుకున్నారు.
చందు, సందీప్, ప్రీతం, శాన్వీ, దీప్య లను లవ్ ఛాలెంజ్ కి సాక్షులుగా ఉండటానికి ఆహ్వానించారు .
వాళ్ళు కూడా సమయానికి ఆద్య ఇంటికి చేరుకున్నారు.
అందర్నీ సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించారు నిత్యా మేడమ్, ఆద్య లు.
అందరికీ టీ తో పాటు బిస్కెట్స్ స్వయంగా సర్వ్ చేసింది ఆద్య.
ఆమె వంక ఆరాధనాపూర్వకంగా చూసింది శాన్వీ.
‘ఈ రోజు ఆద్య ఉన్న పరిస్థితిలో మరో అమ్మాయి వుంటే ఏం చేసేదో..
జీవన్ ని నలుగురిలో తిట్టి పోసేదేమో..
లేదా ఏడుస్తూ ఇంటికి వెళ్ళేదేమో..
లేదా ఇంట్లో వాళ్ళతో చెప్పి గొడవకు వచ్చేదేమో..
కానీ ఆద్య ఏమాత్రం తొణకలేదు.
ఛాలెంజ్ కి ముందే ఇద్దరినీ తన కంట్రోల్ లోకి తెచ్చుకుంది.
జీవన్ లాంటి షార్ట్ టెంపర్ మనిషి, ఆద్య చెప్పినదానికల్లా తల ఊపే స్టేజి కి వచ్చాడు.
ఎప్పుడూ హుందాగా ఉండే రిత్విక్ సైతం ఆద్య కోసం ఛాలెంజ్ కి దిగాడు'.
'హాట్స్ ఆఫ్ ఆద్యా' అనుకుంది మనసులో.
జీవన్ వంక ఒక హీరోని చూసినట్లు చూశాడు చందూ.
‘కాలేజ్ ఎండి కూతురికి కాలేజ్ లో అందరి ముందూ 'ఐ లవ్ యూ' చెప్పాడు జీవన్.
ఆద్యకు రిత్విక్ సపోర్ట్ చేస్తాడని తెలిసినా భయపడలేదు.
ఇప్పుడు ఆద్య ఇంటికే టీకి వచ్చాడు.
ఇంతకు మించిన హీరోయిజం తాను ఇంతవరకు ఎవ్వరి దగ్గరా చూడలేదు’ అనుకున్నాడు.
రిత్విక్ వంక అభిమానంతో చూసింది దీప్య.
‘మొదటి చూపులోనే ఆద్యను ఆకట్టుకున్నాడు అన్నయ్య.
ఇప్పుడీ ఛాలెంజ్ అవసరం ఏముంది?
జీవన్ ఎంత ప్రయతించినా ముందుకంటే మెరుగయ్యాడని అనిపించుకుంటాడేమో..
అంతేకాని అతను, రిత్విక్ అన్నయ్య స్థానాన్ని ఆక్రమించుకోగలడా?
అన్నయ్యని కాదని ఆద్య జీవన్ ని వరించడం అసాధ్యం.'
అనుకుంది దీప్య.
అందరూ టీ తాగుతూ ఉండగా నిత్యా మేడమ్ ఫోన్ మోగింది.
"ఎక్స్క్యూజ్ మీ" అంటూ లోపలి గదిలోకి వెళ్ళింది ఆమె.
ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పండి గురుమూర్తి అన్నయ్య గారూ" అంది.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments