ధర్మ సందేహాలు 3: 'Asathya Dosham' New Telugu Story Written By Mallavarapu Seetharam Kumar
అసత్య దోషం (ధర్మ సందేహాలు 3)
రచన : మల్లవరపు సీతారాం కుమార్
రోజులాగే సాయంత్రమయ్యేసరికి టీచర్స్ కాలనీ వాస్తవ్యులు, రామాలయంలో రాధాకృష్ణమూర్తి గారితో ముచ్చటించడానికి సమావేశమయ్యారు.
అందరికీ వందనం చేసి కూర్చున్నారు రాధాకృష్ణమూర్తి గారు.
మోహనరావు అనే భక్తుడు లేచి, "పాపాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉందా? అలాగే అసత్య దోషానికి పెద్ద శిక్షలు ఉండవా? చాలా కాలం క్రితం చదివిన ఒక కథను ఆధారం చేసుకొని అడుగుతున్నాను" అని ప్రశ్నించాడు.
"మీ సందేహానికి కారణమైన కథను చెబితే, సమాధానం కూడా ఒక కథలా చెబుతాను"అన్నారు రాధాకృష్ణమూర్తి గారు.
మోహన్ రావు మాట్లాడుతూ "తన పాపాన్ని మరొకరికి మార్చాలని చూసిన ఒక వ్యాపారస్తుడి కథ- చిన్నప్పుడు ఒక పుస్తకంలో చదివాను. దాన్ని మీకు వివరిస్తాను" అంటూ ఆ కథను ప్రారంభించాడు.
***
ఒక వూరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా తెలివయినవాడు. కానీ అతని లోపం నిజాయితీ లేక పోవడం. పనయ్యాక ఎదుటి వ్యక్తిని పట్టించుకోడు. ఇచ్చిన మాటను సులభంగా దాటవేస్తాడు.
ఒక సారి ఒక పిల్లి, ఆ వ్యాపారి కుండలో పెట్టిన నెయ్యి తినేసింది. అది చూసిన వ్యాపారి కోపంతో రగిలి పోయాడు. విచక్షణ కోల్పోయాడు. పక్కన వున్న దుంగ తీసుకొని విసిరాడు. అది నేరుగా వెళ్లి పిల్లికి తగిలింది. తగల కూడని చోట తగిలిందేమో, ఆ పిల్లి ప్రాణాలు వదిలింది.
కొంత సమయం తరువాత అతనికి కోపం తగ్గింది. కొద్ది కొద్దిగా విచక్షణ రాసాగింది. కోపం స్థానం లో పాప భయం పట్టుకుంది.
‘పిల్లిని చంపితే బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంటుంది’ అని విని వున్నాడు. రోజు రోజుకు భయం పెరగ సాగింది. చివరికి ఆ మానసిక వ్యధ భరించలేక ఒక పురోహితుడిని సంప్రదించాడు.
వ్యాపారి: స్వామీ! ఇదీ జరిగింది.. నాకు పరిష్కారం చెప్పండి
పురోహితుడు: "వ్యాపారీ, పిల్లిని చంపడం 'బ్రహ్మ హత్య' తో సమానం. నువ్వు నరకానికి పోతావు. ఇది చాలా పెద్ద పాపం. నీకు నరకం లో తీవ్రమయిన శిక్షలు ఉంటాయి. "
వ్యాపారి: "ఎందుకని స్వామీ? "
పురోహితుడు: అంతే నాయనా! పెద్ద పాపాలకు పెద్ద శిక్ష. చిన్న పాపాలకు చిన్న శిక్ష. పిల్లిని చంపడం బ్రాహ్మణుని చంపడం తో సమానం. "
వ్యాపారి: "స్వామీ మరి పరిష్కారం "
పురోహితుడు: "ఒక బంగారు పిల్లిని దానం చెయ్యి. పాపం పోతుంది. "
వ్యాపారి: "స్వామీ, నాకు అంత శక్తి లేదు. "
పురోహితుడు: "అయితే కనీసం ఒక వెండి పిల్లి విగ్రహం తెప్పించి దానం చెయ్యి. "
వ్యాపారి: "స్వామీ, నష్టాలలో వున్నాను. శక్తి లేదు. "
పురోహితుడు: "మరి శిక్షలు అనుభవించు !"
వ్యాపారి: "స్వామీ, దయ ఉంచి ఏదయినా తక్కువలో పోయే పరిష్కారం చెప్పండి.. "(అడిగాడు అతి వినయం గా)
పురోహితుడు: ( ‘ఓరి పీనాసి’ అనుకొని ) "ఇదే నీకు ఆఖరి అవకాశం. నాకు దక్షిణ గా నూరు రూపాయలు ఇవ్వు. "
వ్యాపారి: "స్వామీ! ఆలా చేస్తే ఆ పాపం పోతుందా ?"
పురోహితుడు: "పోదు. కానీ ఆ పాపం నేను స్వీకరిస్తాను. "
వ్యాపారి: "మరి మీరు ఆ శిక్షలు అనుభవిస్తారా ?"
పురోహితుడు: "లేదు నాయినా! మేము గాయత్రి జపం చేసి, పోగొట్టుకుంటాము".
దీనికి వ్యాపారి ఒప్పుకొని, పిల్లిని చంపిన పాపాన్ని పురోహితుని కి బదిలీ చేసాడు.
"స్వామీ! మీరు గాయత్రీ జపం పూర్తి చేసిరండి. అప్పుడు ఆ పాపం ఇద్దరికీ ఉండదు. నేను పైకం సిద్ధం చేసి వుంచుతాను ". అన్నాడు.
అలాగే అని పురోహితుడు, గాయత్రీ జపానికి వెళ్ళాడు.
మరునాడు వ్యాపారి వద్దకు వచ్చి, “జపం పూర్తి అయింది. ఇపుడు నీవు పూర్తిగా బ్రహ్మ హత్యా పాపం నుండి విముక్తి పొందావు. "అన్నాడు పురోహితుడు.
వ్యాపారి సంతోషించి, "స్వామీ, చాల సంతోషం. వెళ్ళిరండి " అన్నాడు.
“మరి నా దక్షిణ?” అడిగాడు పూజారి.
"స్వామీ ! మీకు నేను పైకం ఇవ్వను. నేను నూరు రూపాయలు ఇవ్వని, మోసం చేసిన పాపానికి స్వల్ప శిక్ష నరకం లో అనుభవిస్తాను. ఎలాగూ పిల్లిని చంపిన పాపం నాకు లేదు. దక్షిణ ఎగ్గొట్టి మిమ్ములను మోసం చేసిన స్వల్ప పాపానికి గాను, స్వల్ప శిక్షకు నేను సిద్ధం. తమరు దయచేయండి "అన్నాడు వ్యాపారి నవ్వుతూ.
***
కథ చెప్పడం ముగించాడు మోహనరావు.
తర్వాత రాధాకృష్ణ మూర్తి గారిని "కథ విన్నారు కదా! ఇలా చేసిన పాపాన్ని ఇంకొకరికి బదిలీ చేయవచ్చునా? ఆ వ్యాపారికి నిజంగా చిన్న శిక్ష పడుతుందా..?" అని ప్రశ్నించాడు.
రాధాకృష్ణ మూర్తి గారు సమాధానం చెబుతూ "ప్రతి ఒక్కరూ వారి కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే. మీరు చెప్పింది కేవలం ఒక కథ. ఆ కథ ప్రకారం పురోహితుడు సూచించిన పరిహారం ఒక హిప్నాటిజం లాంటిది. తప్పు తెలుసుకున్న వ్యాపారస్తుడు, జీవితాంతం బాధతో కుమిలి పోకుండా ఆ పరిహారాన్ని సూచించాడు.
తనకు అంతటి బాధను తప్పించిన వ్యక్తిని, తన తెలివితేటలు ఉపయోగించి మోసం చేయాలనుకోవడం చాలా దుర్మార్గం. స్టేషన్ లో మన లగేజ్ మోయలేక పోర్టర్ కి అప్పగించి, బయటకు వచ్చాక అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఎగ వెయ్యాలని చూడడం చాలా అసహ్యకరమైన పని. ఆ వ్యాపారస్తుడు పిల్లిని చంపిన విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోతే సమస్య లేదు. కానీ అది దోషమని నమ్మిన వ్యక్తి, తనకు పరిహారం చూపిన వ్యక్తిని మోసం చేయడం తప్పుగా అనుకోక పోవడం అతని అజ్ఞానం.
అసత్య దోషం అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది. ఆ అసత్య మాడిన వ్యక్తి ఉద్దేశాన్ని బట్టి, దానివల్ల కలిగే పరిణామాలను బట్టి అతడికి శిక్ష ఉంటుంది. ఈ విషయం మీకు చక్కగా తెలియడానికి అసత్యమాడి లాభం పొందిన వాళ్ళ గురించి, సత్యం చెప్పి శిక్ష అనుభవించిన వాళ్ల గురించి ఒక కథ చెబుతాను" అన్నారు.
సభికులంతా ఆయన చెప్పబోయే కథ కోసం వేచి ఉన్నారు.
కథను ప్రారంభించారు రాధాకృష్ణ మూర్తి గారు.
***
ధర్మపురి రాజ్య మహారాణి తమ నగరానికి దక్షిణంగా అడవిలో ఉన్న అమ్మవారి గుడిని దర్శించుకోవాలని అనుకుంది. ఆమె వెళ్ళడానికి పల్లకీని ఏర్పాటు చేయడంతో పాటు ఇరవై మంది సైనికులను తోడుగా పంపాడు మహారాజు. మార్గమధ్యంలో చెట్ల చాటునుండి బందిపోటు దొంగలు బాణాలతో దాడి చేశారు. చాలా మంది సైనికులు చనిపోయారు.
మహారాణి పల్లకీ దిగి అడవిలోకి పారిపోయింది. ఒక సైనికుడు వర్తమానం మహారాజుకు చేరవేయడానికి వెనక్కి వెళ్ళాడు. మిగిలిన సైనికులు, బందిపోట్లు ఆమె వెంట పడకుండా కాసేపు నిలువరించారు. కానీ బందిపోట్లు వాళ్లను కూడా చంపివేసి మహారాణి కోసం వెతకడం మొదలుపెట్టారు. పరిగెత్తుకుంటూ వెడుతున్న మహారాణిని ఒక మేకల కాపరి చూశాడు. విషయం తెలుసుకొని తన మేకల మంద మధ్యలో ఆమెను దాగి ఉండమని చెప్పి, తన నల్లటి కంబళి ఆమెపైన కప్పాడు. బందిపోట్లు వచ్చి అతన్ని ప్రశ్నించి నప్పుడు ఇటు వైపు ఎవరూ రాలేదని చెప్పాడు. బందిపోట్లు మరోవైపు వెతుక్కుంటూ వెళ్లారు.
గుడి దగ్గరకు చేరుకొని అమ్మ వారికి నమస్కరించి, పూజారికి విషయం చెప్పింది మహారాణి. ఆమెను దాచడానికి సరైన ప్రదేశం లేకపోవడంతో, గర్భగుడిలో అమ్మ వారి వెనక దాక్కోమని ఆమెకు చెప్పాడు పూజారి. కొంతసేపటికి బందిపోట్లు వచ్చి పూజారిని ప్రశ్నించగా ఇక్కడికి ఎవరూ రాలేదని సమాధానం ఇచ్చాడు పూజారి.
బందిపోట్లు తిరిగి వెళ్ళిపోతూ ఒక చెట్టు కింద జూదం ఆడుకుంటున్న ఇద్దరు యువకులను చూసి, మహారాణి గురించి ప్రశ్నించారు. నిజం చెబితే వంద వరహాలు ఇస్తామని చెప్పారు. వాళ్లు మహారాణి గుడి వైపే వెళ్లిందని చెప్పారు.
బందిపోట్లు తిరిగి గుడి వైపు వెళ్లబోతుండగా, తన సైన్యంతో అక్కడికి వచ్చిన మహారాజు బందిపోట్లను చుట్టుముట్టి, బంధించాడు.
మహారాణిని క్షేమంగా రాజ్యానికి తీసుకొని వచ్చాడు.
ఆ దేశ న్యాయాధికారి ధర్మ నిర్ణయంలో యముడితో సమానుడు.
ఆయన బందిపోట్లకు మరణ దండన విధించాడు.
అసత్యమాడిన మేకల కాపరికి నూరు వరహాల జరిమానా, మహారాణిని కాపాడినందుకు పది వేలా నూరు వరహాల బహుమానం ఇవ్వమని తీర్పు చెప్పాడు.
పూజారికి అసత్యమాడినందుకు నూరు వరహాలు, గుడి ప్రక్షాళనకు నూరు వరహాలు జరిమానా, మహారాణిని కాపాడినందుకు పది వేలా రెండు వందల వరహాల బహుమానం ఇవ్వమని తీర్పు చెప్పాడు.
"అబద్ధాలు చెప్పిన వాళ్లకు మంచి బహుమానం ఇచ్చారు. నిజం చెప్పిన మాకు ఇంకా పెద్ద బహుమానం ఇవ్వాలి" అన్నారు జూదరులు.
మీరు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అన్నది కాదు ప్రశ్న.
ఆ చెప్పడం లో మీ ఉద్దేశం ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి అన్నవి కూడా పరిగణించాలి.
మీరు బందిపోట్లకు సహకరించి రాజ ద్రోహానికి పాల్పడ్డారు. అందుకు మీకు మరణ దండన విధించాలి. కానీ మీరు నిజం చెప్పానంటున్నారు కాబట్టి, మీ సత్య సంధతకు మెచ్చి, ఆ శిక్షని కఠిన జీవిత ఖైదుగా మారుస్తున్నాను. బందిపోట్ల దగ్గర వంద వరహాలు ఆశించినందుకు గాను జీవిత ఖైదుతో పాటు వంద కొరడా దెబ్బలు అదనపు శిక్షగా విధిస్తున్నాను" అని తీర్పు చెప్పాడు".
***
కథ చెప్పడం ముగించారు రాధాకృష్ణ మూర్తి గారు.
సభికులంతా ఆయన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు.
అయన మోహన రావును ఉద్దేశించి మాట్లాడుతూ " ఆ వ్యాపారి ఉద్దేశం తన పాపాన్ని ఇంకొకరికి అంటగట్టడమే కాక, తనకు సహాయం చేసిన వాళ్ళను మోసగించడం. ఇందుకు పెద్ద శిక్షే పడాలి" అని తన వివరణ ముగించారు.
మోహనరావుతో సహా అందరూ ఆయనకు నమస్కరించి సెలవు తీసుకున్నారు.
***శుభం ***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments