కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Love Challenge Episode 29' Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
చలపతి తో కలిసి, దీప్య ఉన్న హాస్టల్ గదికి వెళతాడు చందూ.
దీప్య, శాన్వీ లకు మత్తుమందు వాసన చూపి, స్పృహ తప్పిస్తారు.
పిక్నిక్ కి వెళ్ళినప్పుడు దీప్యను అటాక్ చేయబోతాడు చలపతి.
కానీ చందూ విసిరిన రాతి దెబ్బకు నీళ్లలో పడిపోతాడు.
రిత్విక్ అతన్ని పైకి తీసి, ఫస్ట్ ఎయిడ్ చేసి, హాస్పిటల్ కు తీసుకుని వెళతాడు.
ఇక చదవండి…
తన భుజం పైకి వాలిపోయిన దీప్య ని నెమ్మదిగా నడిపించుకుంటూ, పక్కనే ఉన్న సిమెంట్ బెంచ్ మీద పడుకోబెట్టింది శాన్వీ. ఆద్య తన వాటర్ బాటిల్ లోని నీళ్లను దీప్య పైన చిలకరించింది. కాసేపటికి నీరసంగా కళ్ళు తెరిచి కూర్చో బోయిన దీప్య, తిరిగి పక్కకు ఒరిగి పోయింది.
"దీప్యను హాస్పిటల్ లో చేర్చడం మంచిది" అంది లెక్చరర్ సామ్రాజ్యం.
స్టూడెంట్స్ అందరూ చేరి దీప్యను కార్లో చేర్చారు.
రాఘవేంద్ర, నిత్యా మేడం కి ఫోన్ చేసి "ఇంతటితో పిక్నిక్ ముగించి అందరూ సిటీకి వచ్చెయ్యండి. మిగిలిన రోజులు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోమందాం.
చలపతిని హాస్పిటల్ లో చేర్చారు. ఇంకా ప్రాణాపాయం ఉందన్నారు డాక్టర్ లు.
చలపతి కావాలనే గొడవకు ప్రయత్నించినట్లు, ఊర్లో వాళ్లు అనుకుంటున్నారు. అతను ఈమధ్య ఎవరితోనో తరచుగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నట్లు కూడా వాళ్లు చెప్పారు. అదృష్టవశాత్తూ అతను బతికితే పెద్ద సమస్య ఉండదు. కానీ ఏదైనా అయితే కాల్ రికార్డ్స్ బయటకు తీస్తారు పోలీసులు. స్థానికులు గురు మూర్తి ని అనుమానిస్తున్నారు.
ఒకవేళ గురుమూర్తి ఏదైనా ప్లాన్ వేసి ఉంటే, తన కొడుక్కి వచ్చే ఓట్లు తనే చెడగొట్టినట్లు అవుతుంది. ఎందుకంటే రిత్విక్ ప్రోగ్రామ్ తో ఇన్స్పైర్ అయిన గ్రామస్తులు, చలపతి పెట్టిన గొడవతో రిత్విక్ మీద సానుభూతి చూపిస్తున్నారు. సానుభూతి అనేది జనరల్ ఎలక్షన్స్ లోనే ఎంతో ప్రభావం చూపిన విషయం నీకు తెలుసు కదా!
గురుమూర్తి చేతులారా ఆ అవకాశం రిత్విక్ కి ఇచ్చినట్లయింది. పైగా తనతో గొడవ పడాలని ప్రయత్నించిన వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకు వెళ్లడం తో, రిత్విక్ మీద ఆ చలపతి బంధువుల్లో కూడా సానుభూతి పెరిగింది. అన్నట్లు ఆ గురుమూర్తి నీకేమైనా కాల్ చేశాడా..?" హఠాత్తుగా అడిగాడు రాఘవేంద్ర.
"లేదండీ!" తడబడింది నిత్యా మేడమ్.
"ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. అనవసరంగా వివాదాల్లోకి నీ పేరు తెప్పించు కోవద్దు. దీప్యను మన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కి తీసుకొని రా. నేను కూడా అక్కడికి వస్తాను" అన్నాడు రాఘవేంద్ర.
***
హాస్పిటల్ లో చేరిన దీప్యను లేడీ డాక్టర్స్ పరిశీలించి ఆమెకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేవని, కేవలం మానసికంగా డిస్టర్బ్ అయిందని చెప్పారు.
చందూని పోలీసులు అరెస్ట్ చేసి, స్వంత పూచీకత్తు మీద వదిలివేశారు. మరుసటి రోజు నిత్యా ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ యధావిధిగా జరిగింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన దీప్య కూడా ఆ ప్రాక్టీస్ మ్యాచ్ చూడడానికి వచ్చింది. చందూ మాత్రం రాలేదు. అతని గురించి ఎవరూ పట్టించు కోలేదు. మరో రెండు రోజులు స్టూడెంట్స్ అందరూ చక్కగా ప్రాక్టీస్ చేశారు.
ఆదివారం వచ్చింది.
అందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ ఆ రోజు జరగబోతోంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన నెహ్రూ జట్టు 50 ఓవర్లలో ౩౩౦ పరుగుల భారీ స్కోరు చేశారు. పిచ్ బౌలింగ్ కి అనుకూలంగా లేకపోవడంతో వాళ్ళు అంత స్కోర్ చేయగలిగారు.
రిత్విక్ తన టీం మేట్స్ ను దగ్గరకు పిలిచి "వాళ్ళు చేసింది భారీ స్కోరు. మనం నిదానంగా ఆడితే ఓవర్ ఓవర్ కు అస్కింగ్ రన్ రేట్ పెరిగిపోతుంది. అలా కాక వేగంగా స్కోర్ చేయాలని చూస్తే వికెట్లు పడిపోయి ఆల్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి జీవన్ ని, మరొక ప్లేయర్ ని ఓపెనర్స్ అండ్ పించ్ హిట్టర్స్ గా పంపిద్దాం. వాళ్లు తమ వికెట్ గురించి ఆలోచించకుండా మొదటి 10 ఓవర్లలో వీలైనన్ని రన్స్ చేస్తారు. దాంతో తరువాతి ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. వన్ డౌన్ లో కూడా పించ్ హిట్టర్ నే పంపిస్తాను. ఆ వికెట్ కూడా పడ్డాక నేను క్రీజ్ లోకి వస్తాను. అప్పటి పరిస్థితికి అనుగుణంగా ఆడుతాను" అని తన స్ట్రాటజీ వివరించాడు. అందరూ దానికి అంగీకరించారు.
బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఓపెనర్ లు ఇద్దరూ ధాటిగా ఆడి, పది ఓవర్ లలో నూట డెబ్బై పరుగులు చేశారు.
జీవన్ నూట పది పరుగులతో, మరో బ్యాట్స్మెన్ 50 పరుగులతో క్రీజులో ఉన్నారు. పది పరుగులు ఎక్స్ట్రాల రూపంలో వచ్చాయి.
పదకొండవ ఓవర్లో జీవన్ తో ఆడుతున్న బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాడు. రిత్విక్ ని క్రీజ్లోకి వెళ్ళమనీ, లేకపోతే బ్యాటింగ్ చేసే అవకాశమే రాదనీ అతని సన్నిహితులు సూచించారు. కానీ రిత్విక్ ముందు అనుకున్న ప్రకారమే మరో బ్యాట్స్మెన్ ని పించ్ హిట్టర్ గా పంపించాడు. జట్టు స్కోరు 36 ఓవర్ల కి ఒక వికెట్ నష్టానికి 254 లకు చేరింది.
నెక్స్ట్ ఓవర్ లో వికెట్ పడడంతో రిత్విక్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ చక్కగా ఆడి 43 ఓవర్లలోనే 331 పరుగుల విజయలక్ష్యాన్ని అవలీలగా ఛేదించారు. జీవన్ డబల్ సెంచరీ చేయగా, రిత్విక్ ఇరవై బాల్స్ లో నలభై పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు.
నిత్య ఇంజనీరింగ్ కాలేజ్ కల నెరవేరింది. ప్రారంభించిన పదేళ్లకు గానూ మొదటిసారిగా కప్ గెలుచుకున్నారు. రాఘవేంద్ర, నిత్యా మేడమ్, సామ్రాజ్యం మేడం తో సహా చాలా మంది లెక్చరర్స్ గ్రౌండ్ లోకి వచ్చి ఆనందంతో డాన్స్ చేశారు. టీం సభ్యులందరినీ మనస్ఫూర్తిగా అభినందించారు.
రిత్విక్, టీం మేట్స్ అందరికీ, తన స్టార్ హోటల్ లో ట్రీట్ ఏర్పాటు చేశాడు.
రిత్విక్, జీవన్, ఆద్యల స్నేహితులు కూడా హాజరయ్యారు.
డబుల్ సెంచురీ సాధించిన జీవన్ మీదే, అందరి చూపులూ ఉన్నాయి.
కానీ అతను ఉండాల్సినంత ఆనందంగా లేదు.
చందూ కూడా ఆ ఫంక్షన్ కి హాజరు కాలేదు.
దాంతో జీవన్ ఏదో దాస్తున్నట్లు అనిపించింది రిత్విక్, ఆద్యలకు.
సందీప్ ను పక్కకు పిలిచి తనకు ఏమైనా తెలుసేమోనని అడిగారు.
సందీప్ గొంతు బాగా తగ్గించి "మంచి నీళ్ల మడుగుకు వెళ్లడానికి ముందు రోజు రాత్రి అమ్మాయిలు ఉన్న ఫస్ట్ ఫ్లోర్ నుంచి చందూ కిందకి దిగి రావడం చూశాను.
అతను అంతకు ముందు రోజు నాతో, దీప్య మీద తనకు కోరిక ఉన్నట్లు చెప్పాడు.
అందుకోసం చలపతి సహాయం తీసుకుంటానని కూడా చెప్పాడు.
నేను అతన్ని మందలించాను. దాంతో అతను ఆ విషయం వదిలి వేశాడనుకున్నాను.
అతను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుండి రావడం తో నాకు అనుమానం కలిగింది. మరో అరగంట తరువాత నేను నిద్ర పట్టక నా రూం నుండి బయటకు వచ్చి పచార్లు చేస్తూ ఉంటే జీవన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి వస్తూ కనిపించాడు. నాకు ఇంతవరకే తెలుసు" చెప్పాడు సందీప్.
ఇంతలో హాస్పిటల్ నుండి రాఘవేంద్ర గారికి కాల్ వచ్చింది. చలపతి స్పృహలోకి వచ్చాడనీ, తన డెత్ స్టేట్మెంట్ ఇస్తున్నాడనీ చెప్పారు. స్టూడెంట్స్ అందరూ హాస్పిటల్ కు చేరుకున్నారు. సరిగ్గా అప్పుడే పోలీసులు బయటకు వస్తూ ఉన్నారు.
చలపతి చనిపోయాడనీ, అతని స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నామనీ చెప్పారు పోలీసులు.
స్టేట్ మెంట్ లో ఏం చెప్పాడో చెప్పమని రిక్వెస్ట్ చేశాడు రాఘవేంద్ర.
"తన తలకు రాయి తగలడం కేవలం యాక్సిడెంట్ అని చెప్పాడు. మడుగు దగ్గర ఉన్న ఒక కోతి, ఒక అమ్మాయి పైకి దూకడంతో చందూ రాయి విసిరాడనీ, ఆ రాయి గురితప్పి తనకు తగిలిందనీ చెప్పాడు. చివరి కోరిక గా తన బంధువులకు ఒక వాయిస్ మెసేజ్ రికార్డ్ చేయమన్నాడు.
అందులో తను ‘రిత్విక్ కి ద్రోహం చేయాలని చూసినా అతడు తన ప్రాణాలు కాపాడాలని ప్రయత్నించాడు కాబట్టి, జరగబోయే ఎన్నికల్లో రిత్విక్ కే ఓటు వేసి గెలిపించండి. ఇదే నా చివరి కోరిక..’ అంటూ తన వాళ్ళకి విజ్ఞప్తి చేశాడట”
వివరంగా చెప్పారు పోలీసులు.
రాఘవేంద్ర ఆనందంతో రిత్విక్ ని కౌగలించుకున్నాడు.
“నీ మంచితనమే నిన్ను కాపాడుతోంది. శత్రువులుగా మారాల్సిన వాళ్లు నీ ఫాన్స్ గా మారిపోతున్నారు. హ్యాట్సాఫ్ టు యు” అని అభినందించాడు.
రిత్విక్, జీవన్ తో "మనం ఇప్పుడు చందూ ఇంటికి వెళదాం. చలపతి స్టేట్మెంట్ వల్ల చందూ కి ఇక ఏ రిస్క్ ఉండదు. ఈ విషయం అతనికి చెబితే, రేపటి నుండి కాలేజీకి రెగ్యులర్ గా వస్తాడేమో" అన్నాడు.
జీవన్ "అలాగే పద. మనం ఇద్దరం వెళ్దాం" అన్నాడు.
ఇద్దరూ చందూ ఇంటికి చేరుకున్నారు. చందూ తండ్రి వీళ్లను గుర్తుపట్టి లోపలికి రమ్మన్నాడు.
తరువాత ఆయన చందూ గురించి చెబుతూ "వీడు ఎప్పుడూ ఏదో ఒక గొడవ తెస్తూ ఉండేవాడు. ఇంటి మీదకు ఎవరో ఒకరు కొట్లాటకు వస్తూ ఉండేవారు. ఆ తగాదాలు తీర్చలేక వాణ్ని ఇంట్లో నుంచి వేరే ఉరికి పంపించి వేయాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ వీడు వదలకుండా మొండిగా ఇక్కడే ఉన్నాడు. వీడికి చదువు అబ్బలేదు. బ్యాక్ లాగ్ లు 20 కి పైగా ఉన్నాయి.
మరో పదేళ్లయినా వీడు బీటెక్ పూర్తి చేయలేడు. అందుకే వాడిని ఏదైనా వ్యాపారం చేసుకోమని చెబుతున్నాను. నాగపూర్ లో మా బావమరిది హోటల్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాడు. వీడిని అందులో పార్ట్నర్ గా చేర్పించాము. నాగపూర్ వెళ్ళిపోయాడు. వాడి కొత్త ఫోన్ నెంబర్ ఇంకా మాక్కూడా ఇవ్వలేదు. ఇస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాం" అని చెప్పారాయన.
రిత్విక్ ఆయనతో మాట్లాడుతూ "బీటెక్ చివరి సంవత్సరం లో ఉన్నాడు. పూర్తి చేయమని చెప్పండి. ఇన్నాళ్లు పడిన శ్రమ వృధా అవుతుంది కదా" అన్నాడు.
ఆయన జవాబిస్తూ "వాడేమీ శ్రమ పడలేదు. కాలక్షేపం చేశాడు. ఈ వాతావరణం లో ఉన్నంతవరకు వాడు మనిషిగా మారడు" అని చెప్పాడాయన.
చేసేదేమీ లేక, కాంటాక్ట్ నెంబర్ దొరికితే ఇవ్వమని చెప్పి ఇద్దరూ అక్కడినుండి వచ్చేశారు.
తరువాత రిత్విక్ కి బై చెప్పి, జీవన్ వెళ్ళబోతూ ఉన్నాడు.
రిత్విక్ అతన్ని ఆపి, “మన ఛాలెంజ్ విషయమై నీతో కొంచెం మాట్లాడాలి. ఆద్య తో ఆల్రెడీ చెప్పాను. నీకు వీలుంటే రేపు సాయంత్రం వాళ్ల ఇంట్లో కలుద్దాం" అన్నాడు.
"నేను కూడా అదే విషయం చెప్పాలనుకున్నాను. చందూ మినహా అగ్రిమెంట్ లో సాక్షులుగా సంతకం పెట్టిన వాళ్ళను కూడా రమ్మందాం" అన్నాడు జీవన్.
***
నిత్యా మేడమ్ కి కాల్ చేశాడు గురుమూర్తి.
"చెప్పండి గురుమూర్తి గారూ!" అంది నిత్యా మేడమ్.
ఆమె ‘అన్నయ్య గారూ’ అని పిలవని విషయం గ్రహించాడు గురుమూర్తి.
"మనం పొరపాటు చేశాం చెల్లెమ్మా! అనవసరంగా ఇందులో జోక్యం చేసుకుని రిత్విక్ కి మంచి పేరు వచ్చేలా చేశాను. నేను చేసింది పెద్ద పొరపాటని ఇప్పుడు అర్థం అవుతోంది" అన్నాడు బాధగా,
“నిజమే గురుమూర్తి గారూ! నేను కూడా ఆద్య మీద అనవసరంగా కక్ష పెంచుకున్నాను. ఆద్య, జీవన్, రిత్విక్ లు ముగ్గురూ ఏ కల్మషం లేని వాళ్ళు. మనం వాళ్ళ వ్యవహారాల్లో తలదూర్చి పొరపాటు చేశాం. ఇంతటితో వాళ్ల విషయం వదిలేద్దాం" అంది నిత్యా మేడం.
"అలాగే చేస్తానమ్మా.. నా నిర్ణయం కూడా అదే. నీకు కాల్ చేసింది కూడా అది చెప్పడానికే" అని చెప్పి ఫోన్ పెట్టేశాడు గురుమూర్తి.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments