కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Love Challenge Episode 28' Telugu Web Series
Written By Mallavarapu Seetharam Kumar
రచన: మల్లవరపు సీతారాం కుమార్
గత ఎపిసోడ్ లో…
గురుమూర్తి తో చెప్పి ఎక్కువ డబ్బులు ఇప్పిస్తానని చలపతి తో చెబుతాడు చందూ.
దీప్య మీద చందూకి ఉన్న కోరిక తీర్చడానికి సహకరిస్తానని చెబుతాడు చలపతి. సమాజం మీద కులాల ప్రభావం గురించి చక్కటి ప్రదర్శన ఇస్తాడు జీవన్.
ఇక చదవండి…
చలపతి చెప్పినట్లు హాస్టల్ బయటికి వస్తాడు చందూ.
ముందు రోజులాగే అతన్ని బైక్ మీద ఎక్కించుకుని గుడిసె దగ్గరకు తీసుకొని వెడతాడు చలపతి.
వాళ్లు గుడిసె లోపలికి వెళ్ళేసరికి, గ్లాసుల్లో మందు పోసి సిద్ధంగా ఉంచింది ఆ యువతి.
"ఇంత తొందరగా అరేంజ్ చేస్తావనుకోలేదు" అన్నాడు చందూ.
"ఇలాంటి వాటిలో ముహూర్తాలు చూసుకో కూడదు. అయినా నేను చేసేదేముంది? అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావు. నువ్వుండే చోటే అమ్మాయి ఉంది.
నీ కోసం మందు, ఆ అమ్మాయి కోసం మత్తుమందు రెడీ చేశాను. అంతే నేను చేసింది" అన్నాడు చలపతి.
ఆ యువతి మద్యం నింపిన గ్లాసును చందూకి అందించింది.
గ్లాస్ అందించేటపుడు తన చూపుడు వేలితో అతని అర చేతిలో సుతారంగా రాసింది.
అతడు అదేమీ గమనించలేదు. చందూ మనసంతా దీప్య మీదే ఉంది.
అది గమనించిన ఆ యువతి "ఈ రోజుకు వదిలేస్తున్నాను. రేపు నాతోనే ఉండాలి" అంది, చలపతికి వినిపించకుండా.
కాస్త మైకం తలకెక్కాక చందూలో విచక్షణ నశించింది.
"ఇక పోదాం పద" పైకి లేస్తూ చలపతి తో అన్నాడు.
ఇద్దరూ చలపతి బైక్ లో బయలుదేరారు.
హాస్టల్ వెనకవైపు ప్రహరీ గోడకు కాస్త దూరంగా బైక్ ఆపాడు చలపతి.
ఇద్దరూ ఆ గోడను అవలీలగా దాటారు.
"మీరందరూ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఆ గది ముందువైపు కిటికీ ఫ్రేమ్ తాలూకు స్క్రూలు తీసి, కిటికీ ని ఊరికే ఆనించి పెట్టాను. దాన్ని తీసుకొని లోపలికి వెళ్లి పోదాం. ప్రతి రూమ్ లో ఇద్దరు ఉంటారని చెప్పావు కదా.." అంటూ తన జేబులోంచి రెండు హ్యాండ్ కర్చీఫ్ లు, ఒక మత్తు మందు స్ప్రే బయటకు తీశాడు. రెండు కర్చీఫ్ లకు ఆ మత్తు మందు స్ప్రే చేసి , ఒకటి చందూకు ఇచ్చాడు.
"లోపలికి వెళ్లగానే ఆ అమ్మాయి ముక్కు మీద ఈ కర్చీఫ్ ఒక నిమిషం పాటు అదిమి వుంచు. నేను మరో అమ్మాయిని కవర్ చేస్తాను. తరువాత నేను బయటకు వచ్చేస్తాను. నువ్వు వచ్చేవరకు బయట వెయిట్ చేస్తాను. అవసరం అయితే నన్ను పిలువు. నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు" అని చెప్పాడు చలపతి.
ఇద్దరూ క్షణాల్లో ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నారు. దీప్య, శాన్వీలు ఉన్న గది తలుపు పక్కనే కారిడార్ వైపు ఉన్న కిటికీని ఫ్రేమ్ తో సహా అవలీలగా తీసి పక్కన పెట్టాడు చలపతి. ఇద్దరూ కిటికీ దూకి లోపలికి ఎంటరయ్యారు.
***
పక్క రోజు ఉదయం స్టూడెంట్స్ అందరూ ఆరు గంటలకల్లా నిద్రలేచారు. మడుగు దగ్గరికి పిక్నిక్ వెళ్లే ఉత్సాహంతో తొందరగా రెడీ అవుతున్నారు. శాన్వీ, రిత్విక్ కి కాల్ చేసి దీప్యకు ఒంట్లో బాగాలేదనీ, జ్వరం వచ్చేలా ఉందనీ చెప్పింది.
వెంటనే రిత్విక్, జీవన్, ఆద్యలు ముగ్గురూ వాళ్ల దగ్గరికి వచ్చారు.
ఏమైంది అంటూ దీప్యని అడిగారు.
"ఒంట్లో కాస్త నీరసంగా ఉంది. కొద్దిగా స్టొమక్ పెయిన్. జ్వరం వచ్చేలా ఉంది. నేను ఇంటికి వెళ్లి పోతాను" అంది దీప్య.
ఆందోళన పడ్డాడు రిత్విక్.
"అయితే పద. ఇద్దరం హైదరాబాద్ వెళ్ళిపోదాం. హాస్పటల్లో చూపిస్తాను" అన్నాడు.
"అంత అవసరం లేదు అన్నయ్యా! కాస్త నీరసంగా ఉంది. అంతే! వెహికల్ అరేంజ్ చెయ్, చాలు. నేను వెళ్తాను" అంది దీప్య.
"అదేమిటి? నువ్వు ఇలా ఉంటే మేము పిక్నిక్ కి వెళ్లి ఎలా ఎంజాయ్ చేయగలము?" అంది ఆద్య.
"ఇది పెద్ద ప్రాబ్లం కాదు. నాకోసం పిక్నిక్ క్యాన్సిల్ చేసుకోవద్దు. నేను కూడా వస్తాను. సాయంత్రానికి తగ్గకుంటే అప్పుడు వెళ్ళిపోతాను" అని చెప్పింది దీప్య.
అందరూ రిలీఫ్ గా ఫీల్ అయ్యారు.
శాన్వీ మాత్రం "తనకు ఓపిక లేకున్నా మీ కోసం వస్తాను అంటోంది. నేను, దీప్య వెళ్లిపోతాము. మీరు కావాలంటే మీకు తెలిసిన హాస్పిటల్ కు ఫోన్ చేసి, బాగా ట్రీట్మెంట్ జరిగేలా చూడండి" అంది.
కానీ దీప్య తనకు ఏమీ కాలేదనీ, తను ఖచ్చితంగా పిక్నిక్ కి వస్తాననీ గట్టిగా చెప్పడంతో అందరూ కలిసి మంచినీళ్ల మడుగు దగ్గరకు బయలు దేరారు.
ఒక వ్యాన్, నాలుగు కార్లలో స్టూడెంట్స్ అందరూ బయలుదేరారు. చుట్టూ రాళ్ల గుట్టలు, చెట్లు.. నడుమ పెద్ద మడుగు ఉంది. అందులో నీళ్ళు స్వచ్ఛంగా, అడుగు కనిపించేలా ఉన్నాయి. బోట్ షికార్ చేయడానికి, ఈత కొట్టడానికి ఏర్పాట్లు చేసి ఉన్నారు.
స్టూడెంట్స్ రిత్విక్ ని డాన్స్ చేయమని కోరారు.
"ఎప్పటిలా సోలో డాన్స్ చేస్తే కుదరదు. ఆద్యతో కలిసి డ్యూయెట్ చేయాలి" అంది శాన్వీ.
ఒప్పుకోలేదు రిత్విక్.
జీవన్ మాట్లాడుతూ, “నాలుగేళ్ల నుంచి సోలో డాన్స్ లు చూసి బోర్ కొట్టేసింది. కాబట్టి డ్యూయెట్ కి ఆద్యతో డాన్స్ చేయాల్సిందే. నేనేమీ అనుకోను" అన్నాడు.
"అలా కాదు. అందరం కలిసి డాన్స్ చేద్దామంటే ఓకే" అన్నాడు రిత్విక్.
స్టూడెంట్స్ అందరూ సంతోషంతో విజిల్స్ వేశారు.
రిత్విక్, ఆద్యతో కలిసి కొన్ని స్టెప్స్ వేయగా జీవన్ అనూహ్యంగా దీప్య చెయ్యి పట్టుకొని కొన్ని స్టెప్స్ వేయించాడు.
అందరూ కలిసి ఒక గ్రూప్ సాంగ్ కి డాన్స్ చేశారు.
ఒంటిగంట వరకు అందరూ సరదాగా కాలక్షేపం చేశారు.
తరువాత అందరికీ లంచ్ సర్వ్ చేశారు.
ఆద్య, శాన్వీ,సాగరికలు దగ్గరుండి అందరికీ వడ్డించారు.దీప్య మాత్రం కొన్ని స్నాక్స్ తిని, కాసేపు రెస్ట్ తీసుకుంటానని మడుగు పక్కగా ఒక టవల్ పరుచుకొని పడుకుంది.
భోజనాలు ముగిశాక నిత్యా మేడం జీవన్ ని పిలిచి "నాకు కాస్త తల తిరుగుతున్నట్లుగా ఉంది. ఒక టాబ్లెట్ పేరు చెబుతాను. దగ్గర్లో ఏదైనా మెడికల్ షాప్ ఉంటే తీసుకుని రా" అని అడిగింది.
అలాగేనంటూ వెంటనే బయలుదేరాడు జీవన్.
సందీప్ అతనికి తోడుగా వస్తానన్నాడు.
జీవన్ వెళ్ళాక, కాస్త పక్కకు వెళ్లి, గురుమూర్తి కి కాల్ చేసింది నిత్యా మేడమ్.
ఆమె పక్కకు వెళ్ళడం గమనించిన శాన్వీ, ఆద్యకు సైగ చేసి చూపించింది.
గురుమూర్తి ఫోన్ తీయగానే "అన్నయ్య గారూ! జీవన్ ని బయటకి పంపించాను. రిత్విక్ ఇక్కడే ఉన్నాడు. చలపతి ని పంపించండి" అని చెప్పింది.
తల్లి ఎవరితోనో మాట్లాడడం గమనించిన ఆద్య నేరుగా ఆమె దగ్గరకు వచ్చి "ఫోన్లో నాన్నగారేనా.. ఫోను ఇలా ఇయ్యి. నేను మాట్లాడాలి" అంటూ ఫోన్ అందుకో బోయింది.
నిత్యా మేడమ్ భయపడుతూ ఫోన్ వెనక్కి లాక్కొని, "నాన్నగారు కాదులే. మా బంధువులు" అంటూ ఫోన్ కట్ చేసింది.
ఆమె వంక విచిత్రంగా చూస్తూ వెనక్కి వచ్చేసింది ఆద్య.
శాన్వీ, ఆద్య పక్కకు వచ్చి "చూశావా.. మీ పిన్ని ప్రవర్తన కాస్త తేడాగా అనిపిస్తోంది. ఆమె ఎవరికి ఎందుకు కాల్ చేస్తోందో తెలియడం లేదు" అంది.
ఇంతలో ఒక బైక్ వేగంగా వచ్చి మడుగు పక్కన పడుకొని ఉన్న దీప్య పక్కన ఆగింది.
అందులోంచి, ముఖానికి మాస్క్ తగిలించుకొని వచ్చిన చలపతి కిందికి దిగాడు.
తన మాస్క్ తీసి దీప్య దగ్గరకు వచ్చాడు. భయంతో పైకి లేచిన దీప్యతో "రాత్రి జరిగింది గుర్తు లేనట్లు నటిస్తున్నావా?" అంటూ దగ్గరకు లాక్కో బోయాడు.
ఇది గమనించిన రిత్విక్ మెరుపు వేగంతో అక్కడికి వస్తున్నాడు. ఇంతలో ఒక రాయి బలంగా చలపతి తలకు తగిలింది. అతని తల నుండి రక్తం ధారగా కారింది. కళ్ళు బైర్లు కమ్మడంతో అతను మడుగులో పడిపోయాడు.
అందరూ ఆ రాయి వచ్చిన వైపు చూసారు. అది విసిరింది చందూ.
నీళ్లలో పడ్డ చలపతి, పైకి లేకపోవడంతో అతనికి స్పృహ తప్పిందని అర్థమైంది రిత్విక్ కి.
వెంటనే నీళ్లలోకి దూకిన అతను, చలపతిని పైకి లేపి ఒడ్డుకు తీసుకు వచ్చాడు.
రక్తం కారుతున్నచలపతి తలకు కట్టుకట్టి, స్నేహితుల సహాయంతో తన కారు లోకి చేర్చాడు. చలపతిని వెనక సీట్లో కూర్చోబెట్టి, ప్రీతం ని అతని పక్కన కూర్చోమన్నాడు. వెంటనే వేగంగా సిటీకి బయలుదేరాడు.
నిత్యా మేడమ్ చెప్పిన టాబ్లెట్ తీసుకుని, సందీప్ తో కలిసి తిరిగి వస్తున్నాడు జీవన్.
"జీవన్ అన్నా! ఒక విషయం చెబుతాను. నువ్వు కోపం తెచ్చుకోకూడదు” అన్నాడు సందీప్.
“ఏమీ అననులే.. చెప్పు” అన్నాడు జీవన్.
"మొన్న చందూ గాడు మాట్లాడుతూ, పబ్ లో కలిసినప్పటి నుండి దీప్తి మీద మోజు పుట్టిందనీ , అందుకోసం చలపతి సహాయం తీసుకుంటాననీ అన్నాడు” భయపడుతూనే చెప్పాడు సందీప్.
సడన్ బ్రేక్ వేశాడు జీవన్. కారు కీచ్ మంటూ శబ్దం చేస్తూ ఆగిపోయింది.
“ఆ మాట ఆరోజే నాకు చెప్పాలి కదా” కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అన్నాడు జీవన్.
“ధైర్యం చాల లేదన్నా! నువ్వు కోపం తో చందూని తిట్టడమో కొట్టడమో చేస్తే అతడు నా మీద పగ పడతాడని భయం వేసింది. పైగా అతనివి ఉత్త మాటలే గాని, నిజంగా ఏదో చేస్తాడని అనుకోలేదు” అన్నాడు సందీప్.
“ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చందూ ఏం చేశాడు?” సందీప్ భుజాలు పట్టి కుదుపుతూ అడిగాడు జీవన్.
“నిన్న రాత్రి రెండు గంటలప్పుడు నిద్ర పట్టక సిగరెట్ తాగుదామని రూమ్ బయటకు వచ్చాను. ఫస్ట్ ఫ్లోర్ మెట్ల నుంచి చందూ కిందికి వచ్చి తన రూమ్ లోకి వెళ్ళడం చూశాను" చెప్పడం ఆపాడు సందీప్.
“యూ ఇడియట్! వెంటనే పైకి వెళ్లి ఏం జరిగిందో చూడాలి కదా.. లేదా దీప్యకో, శాన్వీకో, నాకో.. ఎవరో ఒకరి కి ఫోన్ చేయాలి కదా” ఆవేశంగా అన్నాడు జీవన్.
“శాన్వీకి ఫోన్ చేశాను అన్నా! తను తీయలేదు. ఏం చేద్దామా అని బయటకు వచ్చి పచార్లు చేస్తూ ఉంటే..” చెప్పడం ఆపి బలంగా ఊపిరి పీల్చుకున్నాడు సందీప్.
తరువాత పారి పోవడానికి వీలుగా కార్ డోర్ తెరిచి, “నువ్వు మెట్లు దిగుతూ కిందికి రావడం చూశాను” అన్నాడు.
జీవన్ అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి “ఈ విషయం ఎవరికైనా చెప్పావా” అని అడిగాడు.
“చెప్పలేదు” అన్నాడు సందీప్.
***
ఇంతలో జీవన్ కి, రిత్విక్ కారు వేగంగా వస్తూ ఉండటం కనిపించింది. జీవన్ విండో లోంచి తల బయట పెట్టి రిత్విక్ ని కారు ఆపమన్నట్లుగా చెయ్యి ఊపాడు.
జీవన్ కారు పక్కగా తన కారు ఆపాడు రిత్విక్.
"చలపతిని, చందూ రాయితో బలంగా కొట్టాడు. దెబ్బ బలంగా తగిలింది. ఇతని ప్రాణాలకి అపాయం కలిగితే చందూ కి పనిష్మెంట్ తప్పదు. అతని కెరీర్ పాడవుతుంది. చలపతిని హాస్పిటల్లో చేరుస్తున్నాను” అని చెప్పాడు.
జీవన్, సందీప్ తో “నీకు కారు డ్రైవింగ్ వచ్చు కదా! నువ్వు ఊర్లోకి వెళ్లి, ఈ టాబ్లెట్ నిత్యా మేడమ్ కి ఇవ్వు” అంటూ తను కారు దిగి, రిత్విక్ పక్కన కూర్చున్నాడు.
వెనక సీట్లో చలపతిని కూర్చోబెట్టి, అతను పడిపోకుండా ప్రీతం పట్టుకొని ఉన్నాడు.
జీవన్ ఎక్కగానే తిరిగి కారుని వేగంగా పోనిచ్చాడు రిత్విక్.
***
చలపతి ని తీసుకొని రిత్విక్ బయలుదేరగానే, స్టూడెంట్స్ అందరూ దీప్య చుట్టూ మూగారు. జరిగిన సంఘటనకు బాగా డిస్టర్బ్ అయిన దీప్య, ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుని “నాకు ఏమైంది?" అంటూ ఏడ్చింది.
శాన్వీ దీప్యను దగ్గరకు తీసుకుని, గట్టిగా హగ్ చేసుకుని, వీపుమీద ఆప్యాయంగా నిమిరింది.
హఠాత్తుగా ఏదో గుర్తుకు వచ్చిన దానిలా దీప్య, శాన్వీని అక్కడి నుంచి దూరంగా తీసుకొని వెళ్లి, "నిజం చెప్పు! రాత్రి ఏం జరిగింది?" అని ప్రశ్నించింది.
కళ్ళలో నీళ్ళు తిరిగాయి శాన్వీ కి.
దీప్య భుజం తడుతూ "ఏమీ జరగలేదు. నువ్వు అప్సెట్ కావద్దు. నేను ఉన్నాను కదా! కూల్.." అంది.
కానీ దీప్య మాత్రం ఏదో గుర్తుకు వచ్చిన దానిలా భయంతో గడగడా వణికి పోతూ స్పృహ తప్పి శాన్వీ పైన వాలిపోయింది.
ఇంకా ఉంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
కొత్త బంగారు లోకం ఎక్కడుంది? (కవిత)
రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).
Comments