top of page
Original_edited.jpg

బంగారు కొడుకు

  • Writer: Achanta Gopala Krishna
    Achanta Gopala Krishna
  • 11 hours ago
  • 5 min read

#AchantaGopalaKrishna, #ఆచంటగోపాలకృష్ణ, #బంగారుకొడుకు, #BangaruKoduku, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Bangaru Koduku - New Telugu Story Written By Achanta Gopala Krishna

Published In manatelugukathalu.com On 17/11/2025

బంగారు కొడుకు - తెలుగు కథ

రచన: ఆచంట గోపాలకృష్ణ


రాఘవరావు, సీతమ్మలది ఓ మారుమూల పల్లెటూరు. 

రాఘవరావు ఒక చిన్న షాపు లో చేసేవాడు, 

సీతమ్మ గృహిణి. 


వారి ఆశ, ఆశయం, కల.. అన్నీ ఒకే ఒక్క కొడుకు, సాయిరాం. 

మనం కష్టపడుతున్నాం. వాడికి ఉన్నదాంట్లో బాగా చూసుకోవాలి అనేవాడు రాఘవరావు. 


సాయిరాం తెలివైనవాడు, పట్టుదల కలవాడు. తల్లితండ్రులు పడే కష్టం చూస్తూ పెరిగాడు.. అందుకే పట్టుదలగా వాళ్ళని కష్టపెట్టకుండా చూసుకోవాలి అని బాగా చదువుకునేవాడు, మంచి మార్కులు తో పాస్ అయ్యేవాడు.. 

ప్రతి మార్కు వెనుక తల్లిదండ్రుల కష్టం ఉండేది.

 

“ఏమండీ, ఈ నెల కాలేజీ ఫీజుకు ఇంకో ఐదు వందలు తక్కువైంది. ఇంక ఏం చేద్దాం?" అని అడిగింది సీతమ్మ.


“భయపడకే సీతమ్మా, ఇంకో షాప్ లో, ఒక గంట అకౌంట్స్ 

చూడడానికి ఒప్పుకున్నా, ఇక్కడ పని అవగానే అక్కడికి వస్తా అని చెప్పా.. కొంచెం ఆలస్యము అవుతుంది, కాని 

పరవాలేదు, నా కొడుకు కోసమే కదా! వాడు పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి. వాళ్ళని అడ్వాన్స్ అడిగి తీసుకుని వస్తా. రేపు కట్టేయ మని చెప్పు..” అన్నాడు.. 

ఆ కష్టం, ఆ త్యాగం ఫలించింది. 

సాయిరాం ఇంజనీరింగ్ పూర్తి చేసి, క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో బెంగుళూరులో పెద్ద ఐటీ కంపెనీలో లక్షన్నర జీతంతో ఉద్యోగం సంపాదించాడు. 


"అమ్మా, నాన్నా.. మీరు పడిన కష్టం ఎప్పటికీ మర్చిపోను. నేను మిమ్మల్ని మహారాజుల్లా చూసుకుంటా. త్వరలోనే నా దగ్గరకు తెచ్చేసుకుంటా” అన్నాడు బెంగళూరు వెళుతూ.. 


"నువ్వు బాగుంటే అదే పదివేలు నాన్నా.. ఇంకా మాకు ఓపిక ఉందిగా.. కొన్నాళ్ళు కస్టపడి జాగ్రత్త చేసుకో.. నీ భవిష్యత్ అవసరాలకు ఇపుడే సరి అయిన సమయం.. జాగ్రత్తగా ఉండు. " అని ఆశీర్వదించి పంపించారు.. 


సాయిరాం మూడు సంవత్సరాలు ఒంటరిగా కష్టపడి, జీతం మూడు లక్షలకు పెంచుకున్నాడు. సొంతంగా ఫ్లాట్ కొన్నాడు. తరువాత, సుజాత అనే అమ్మాయి తో పెళ్లి చేశారు.. 


సుజాత కూడా మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చింది, 

కష్టాలు చూసి పెరిగినదే. సుజాతకు అన్ని సౌకర్యాలు కల్పించాలనేది సాయిరాం కోరిక. సుజాత ఒక ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్ చూపిస్తూ, "సాయి, ఆన్లైన్‌లో చూశాను. ఇది కొత్త బ్రాండ్ కలెక్షన్. నా ఫ్రెండ్ దగ్గర ఉంది, చాలా బాగుంది.” అంది.

 

పాపం, చిన్నప్పటి నుంచి మంచి వస్తువులు ఏవీ వాడలేదు కదా. ఇప్పుడు కొనుక్కోవాలని ఉంది అనుకుని వెంటనే క్రెడిట్ కార్డు తీస్తూ “అయ్యో, ఇందుకేనా బాధ. నీకు నచ్చితే తప్పకుండా తీసుకో. ఇకపై నీకు ఏ లోటూ ఉండకూడదు. 

నువ్వు చిన్నప్పుడు పడ్డ కష్టాలన్నీ నేను దూరం చేస్తాను. " అన్నాడు.


అలా వారు హాలిడే ట్రిప్పులు, నెక్లెస్‌లు, ఖరీదైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో జీవితాన్ని నింపేసుకున్నారు. తల్లిదండ్రులు, ఉన్న ఊరు, వారి సాధారణ జీవితం, సాయిరాం కొత్త ప్రపంచానికి దూరమయ్యాయి. 


"హలో అమ్మా, ఏం చేస్తున్నావ్? ఫోన్ ఎందుకు చేశావు.. చెప్పు అమ్మా..” అన్నాడు.

 

“చాలా సార్లు ట్రై చేశా దొరకలేదు.. చూసి నువ్వు అయినా ఫోన్ చేస్తావేమో అని ఎదురు చూసా..” అని అంది సీతమ్మ.


“అవును, బిజీగా ఉన్నాను. ఈ వారం ఆఫీసులో చాలా పని ఎక్కువ గా ఉంటోంది.. వచ్చే వారం పక్కా ఫోన్ చేస్తాను. 

ఆ.. డబ్బు పంపాలా, సారీ అమ్మా, మర్చిపోయా. రేపు ఉదయం పంపిస్తాను, ఉంటాను అమ్మా.. సుజాత పిలుస్తోంది. " అనిపెట్టేసాడు.. 


ఫోన్.. వారం కాస్త నెల అయింది. 

నెల కాస్త మూడు నెలలు అయింది. 

తల్లిదండ్రులకు డబ్బు పంపడం మర్చిపోవడం, ఫోన్ కాల్స్ లేకపోవడం, ఇంటికి వెళ్లడానికి పండుగలకు కూడా కుదరకపోవడం మామూలైంది. 


రాఘవరావు బాబాయ్ కొడుకు వెంకట్రావు ప్రైమరీ స్కూల్ లో టీచర్‌. ఒకరోజు అన్న వదినలు ను చూడడానికి వెళ్ళాడు.. 

“అన్నయ్య, ఎలా ఉన్నారు..” అని పలకరించాడు.. 


“బాగానే ఉన్నాం.. ముసలి వయసు వచ్చేసింది కదా.. 

ఇదివరకులా పని చేయలేక పోతున్నా.. కళ్ళు కూడా కనిపించట్లేదు..” అన్నాడు.. 


“మరి వాడు సాయి ఏం చేస్తున్నాడు.. డబ్బు పంపిస్తున్నాడా.. ఫోన్ చేస్తున్నాడా..” అని ఆడిగాడు.. 


“ఆ బాగానే ఉన్నాడు” అన్నాడు రాఘవరావు.. 


“అన్నయ్య అలాగే అంటాడు కానీ.. మీరు చెప్పండి వదిన.. 

మీ ముఖం లో నిర్లిప్తత కనిపిస్తోంది.. నిజం చెప్పండి..” అన్నాడు వెంకట్రావు.. 


“ఈ మధ్య వాడు ఫోన్లు సారిగా చేయట్లేదు.. డబ్బు కూడా.. అంటున్నాడు కానీ మరిచి పోయా అంటున్నాడు.. నాకు అర్ధం అయిన విషయం ఏమిటంటే.. సంపాదన కి మించి ఖర్చులు చేస్తున్నాడు అనే అనుమానం ఉంది.. ఇపుడు కాకపోతే ఎపుడు దాచుకుంటారు.. రేపటికోసం కొంత దాచుకోవాలి కదా.. మాకు ఎలాగూ ఇది అలవాటే.. 

ఉన్న దాంట్లో బ్రతకడం అలవాటే” అని అంది.. 


“అది అలాగే అంటుంది గాని.. నువ్వు పట్టించుకోకు..” 

అన్నారు రాఘవ.. 


“ఆయన ప్రేమ అలా ఉంటుంది గాని.. వాడి మంచి కోసమే గా.. చెపుతోంది.. ఖర్చులు తగ్గించు కోమంటే తప్పా.. రేపు పిల్లలు పుడతారు.. వాళ్ళ ఖర్చులు ఎలా.. అది ఆలోచించట్లేదు..” అని అంది సీతమ్మ.. 


“మీరు చెప్పేది నిజమే కదా.. అన్నయ్య.. మీరు ఒకసారి మాట్లాడొచ్చు కదా..” అన్నాడు.. 


“వాడిది చిన్న వయసు కాదు.. వాడే అర్ధం చేసుకోవాలి.. మనం చెపితే అధికారం చెలాయిస్తున్నామని.. అనుకుంటాడు.. నేను చెప్పలేను” అన్నారు రాఘవ.. 


“సరే చూద్దాం మారతాడు లే.. నేను వస్తా అన్నయ్య.. 

మళ్ళీ కలుస్తా” అని వచ్చేశాడు.. వెంకట్రావు.. 


కొడుకు నిర్లక్ష్యం గురించి అన్నయ్య, వదిన బాధను చూసి తట్టుకోలేక, బెంగుళూరు కు వచ్చాడు. 


సాయిరాం ఫ్లాట్.. అది ఫ్లాట్ కాదు, ఒక ప్యాలెస్. విలాసవంతమైన జీవితం. 


"సాయిరాం, మీ ఇల్లు చాలా బాగుందిరా. నీకు ఇంత పెద్ద ఉద్యోగం దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. "


"థాంక్స్ బాబాయ్. సుజాత చిన్నప్పుడు చాలా కష్టపడింది. 

అందుకే ఆమె కోసం ఏ లోటూ లేకుండా చూస్తున్నాను. అడిగిందల్లా కొంటున్నాను. " అన్నాడు.

 

"నువ్వు కూర్చోరా సాయిరాం. నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం. "


సాయిరాం కూర్చున్నాడు. 

బాబాయ్ కళ్లల్లో మొదటిసారి కోపాన్ని, బాధను చూశాడు.


వెంకట్రావు: (నిశబ్దంగా, నెమ్మదిగా మొదలుపెట్టి) "ఒరేయ్ అబ్బాయ్, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయి కష్టాలు పడివచ్చింది కాబట్టి గారం గా చూసుకుంటున్నావ్.. మంచిది, ఎంతో అభినందనీయం. 

ఆమెకు సౌఖ్యాలు ఇవ్వాలని అనుకోవడం గొప్ప విషయం. 

కానీ.. ఒక్క క్షణం ఆలోచించు. మీ అమ్మ.. సీతమ్మ కూడా అదే కష్టాలు పడింది కదరా! అంతకు మించి కష్టపడింది.. నిన్ను పెంచి పెద్ద చేసింది.. 


నీకు గుర్తున్నాయా? నీ ఇంటర్మీడియట్ ఫీజు కోసం మీ నాన్న తన పాత సైకిల్‌ను అమ్మాడు. మీ అమ్మ తన బంగారు ముక్కుపుడకను తాకట్టు పెట్టింది.. 

నీ మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజు కట్టడానికి! నువ్వు చదువు ఆగిపోకూడదని అవే కష్టాలు పడుతూ నిన్ను కష్టపడి పెంచింది. 


అసలు వాళ్ళని బాగా చూసుకోవడానికే కదరా నువ్వు రాత్రి పగలు కష్టపడి చదివి.. ఉద్యోగం సంపాదించి.. ఇంత సాధించావు.. 


నీకు భార్య రాగానే ఆ త్యాగాన్ని, ఆ కష్టాన్ని, ఆ ఆశయాన్ని మర్చిపోయావా? నీ భార్య మధ్య తరగతి కష్టాలు మాత్రమే నీకు గుర్తున్నాయా.. అమ్మ నాన్న అక్కడ ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు అనే విషయం ఒకసారి ఆలోచించి చూడు..” అన్నాడు వెంకట్రావు.


"నువ్వు ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నావ్. సుజాత అడిగింది కొనడం బాగానే ఉంది. కానీ నీ కన్నతల్లిదండ్రులు నీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు. 


'వాడు చాలా బిజీగా ఉన్నాడులే' అని వాళ్లను వాళ్లే సమాధానం చెప్పుకుంటున్నారు. నీ భార్య సౌఖ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెడుతున్నావ్, కానీ కన్నవాళ్ల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం నాకు నచ్చలేదురా. ఇది ధర్మం కాదు. "అన్నాడు వెంకట్రావ్.. 


ఒక్కసారి ఆలోచనలో పడ్డాడు సాయి.. 


అవును కదా.. 

ఈ హడావిడి లో నేను అసలు ఆ పాయింటే మర్చిపోయా.. అనుకుని 

"నన్ను క్షమించండి బాబాయ్! నా కళ్లు తెరిపించారు. 

నా స్వార్థాన్ని నేను గుర్తించలేకపోయాను. నాకు మళ్లీ జీవితాన్ని అర్థమయ్యేలా చెప్పారు. ఈ ప్యాలెస్ కట్టిన తర్వాత నా తల్లిదండ్రుల ప్యాలెస్ (హృదయం)ను పట్టించుకోలేదు. "


"ఇదిగో, రియలైజ్ అయితే చాలురా. ఎవరినీ నిర్లక్ష్యం చేయకు. నువ్వు నీ భార్యను బాగా చూసుకోవాలి, అదే సమయంలో నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులను కూడా గౌరవంగా చూసుకోవాలి. అదే నిజమైన కొడుకు లక్షణం. "


ఆ రోజు రాత్రి, సాయిరాం, సుజాతకు బాబాయ్ మాటలన్నీ చెప్పాడు. సుజాత కూడా తన పొరపాటును గుర్తించింది. 

"సాయి, మీరు చాలా కష్టపడ్డారని తెలుసు. కానీ.. మీ అత్తయ్య, మామగారు పడ్డ త్యాగం ముందు నా కష్టం ఎంత ?

నావి కోరికలు.. వాళ్ళది బాధ్యత.. నాకు తెలియకుండా నేను మిమ్మల్ని వారినుండి దూరం చేశాను. నన్ను క్షమించండి. 

బాబాయ్ గారు చెప్పింది నిజం. ఇకపై మన జీవితంలో వారే మొదటి ప్రాధాన్యత. "


మరుసటి రోజే, సాయిరాం తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వెంటనే బెంగుళూరుకు రావాలి అని, తనతోనే ఉండాలని గట్టిగా చెప్పాడు. వెళ్ళి ఇద్దరిని తీసుకుని వచ్చేశాడు.. 

తల్లిదండ్రులు వచ్చారు. ఆ ఇంట్లో ఖరీదైన వస్తువుల కంటే, ఆ తల్లిదండ్రుల నవ్వు, ఆశీర్వాదాలు నిండాయి. 

సాయిరాం 'బంగారం లాంటి కొడుకు' అయ్యాడు. 

వెంకటరావు వచ్చాడు.. 


“ఇపుడు మనసు కుదుట పడింది రా.. నీ జీవితం తో పాటు.. 

తల్లితండ్రులకు కూడా కొంత సమయం కేటాయిస్తున్నావ్.. చాలా సంతోషం గా ఉంది.. వాళ్ళు మరీ ఏమి కోరుకుంటారు రా పిల్లల దగ్గర నుండి.. ప్రేమ గా ఒక పలకరింపు.. అంతేగా

తిన్నావా.. ఆరోగ్యం ఎలా ఉంది.. అనే నాలుగు మాటలు.. 

వాళ్ళకి స్వాంతన ఇస్తాయి.. బ్రతుకు మీద ఆశ కల్పిస్తాయి.. ఆనందాన్ని ఇస్తాయి.. 


ఆ నాలుగు మాటలకి కూడా ఖాళీ లేని జీవితాలు వ్యర్థం.. 

ఎంత సంపాదించి.. ఏమి సాధించి ఉపయోగం ఉండదు.. 

కొన్ని పరిస్థితులు వలన వాళ్ళు మీకు దూరంగా వేరే ఊరిలో ఉండొచ్చు.. 


కనీసం ఇంటికి వచ్చాక.. 

ఒక ఫోన్ కాల్.. అమ్మ ఎలా ఉన్నావ్.. 

నాన్న సరిగ్గా నిద్ర పడుతోందా.. అని పలకరిస్తే.. ఏమవుతుంది.. 


జీవితలో.. వాళ్ళకి ఎంతో సాధించిన సంతృప్తి.. 

అలాగే ఏ సెకండ్ శాటర్డే.. సండే సెలవు ఉంటే.. 

ఎంతసేపు వాళ్ళని కలిసి రావడానికి.. 

ఈ స్పీడ్ ప్రపంచం లో ఆ ఆలోచన రాకపోవచ్చు.. 

కానీ మనమే గుర్తుంచుకోవాలి.. 

ఎంతసేపు ఉద్యోగం సంపాదన.. 

వీటి మీదే కాదు జీవితపు పరిమళాలను కూడా మనం కోలుపోకూడదు.. 

టీచర్ ను కదా కొంచెం ఎక్కువ చెప్పి ఉంటాను.. ఏమి అనుకోకు రా అబ్బాయి..” అన్నాడు వెంకట్రావు.. 


“లేదు బాబాయ్.. మీరు మరిచిపోయిన విలువలను గుర్తు చేశారు అంతే.. ఇక మీదట ఫ్యామిలీ కి ఆఫీసు కి సమానం అయిన ఇంపార్టెన్స్ ఇస్తా..” అన్నాడు.. 


“ఒరేయ్ అబ్బాయ్ నీకు ఇష్టమైన వంటలు రెడీ చేశా.. రండి తిందురు గాని” అని పిలిచింది సీతమ్మ.. 


తన తల్లి చేతి వంట తిని ఎంత కాలం అయిందో అనుకుని ఆనందం గా డైనింగ్ టేబుల్ దగ్గర కు వచ్చాడు.. సాయి 

అందరూ కలిసి భోజనాలు చేస్తూ.. నవ్వుతూ.. మాట్లాడు కుంటు పూర్తి చేశారు.. 


మన పిల్లల భవిష్యత్గురించి ఇంతగా ఆలోచించే మనం.. 

మనమే వాళ్ళ భవిష్యత్ అని ఆశలు పెట్టుకునే ఆ తల్లితండ్రుల ఒంటరి తనాన్ని పోగొడదాం.. మన చిన్నప్పుడు మనకి ఇచ్చిన ప్రేమని రెట్టింపు చేసి తిరిగి ఇచ్చేద్దాం.. 

"బంగారు కొడుకుల్లా"


శుభం


ఆచంట గోపాలకృష్ణ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం:

నా పేరు ఆచంట గోపాలకృష్ణ

రచనలు..కథలు ,సిరీస్ ,కవితలు సమీక్షలు రాయడం ఇష్టం..

15 సంవత్సరాలు గా రచనలు చేస్తున్నా..

నాకు flyincoloursachantagopalakrishna.blogspot.com అనే బ్లాగ్ ఉంది..


ఇంకా pratilipi ane magazine lo సిరీస్ రాస్తున్నా..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page