top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

వెంటాడే నీడ ఎపిసోడ్ 18

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Ventade Nida Episode 18' New Telugu Web


Series Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్


వెంటాడే నీడ చివరి ఎపిసోడ్


గత ఎపిసోడ్ లో…

మామిడి తోట దగ్గర పోలీసుల్ని చూసిన అగంతకుడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు.

ఆ ప్రయత్నంలో కాలుజారి, కింద పడతాడు. అతని తల, ఒక రాయికి కొట్టుకుని తీవ్రంగా గాయపడతాడు.


అతన్ని చికిత్స కోసం విజయవాడ తరలిస్తారు.


చలపతిరావు ఇంటి దగ్గర శంకర శాస్త్రి కోసం మాటువేసి వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని, తీవ్రంగా గాయపరుస్తారు.


అతన్ని కూడా చికిత్స కోసం విజయవాడ తరలిస్తారు.


సుమంత్ ఆచూకీ తెలుసుకున్న విశాల్, అతని కోసం విజయవాడ బయలుదేరుతాడు.


ఇక చదవండి…


హోమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసిన శంకరశాస్త్రి, తన బావమరిది చలపతిరావు తో కలిసి, హాస్పిటల్ లో ఉన్న సుమంత్ ని కలుస్తాడు. కొడుకును చూడగానే చలపతిరావు పట్టరాని ఆనందంతో అతన్ని కౌగిలించుకున్నాడు. తండ్రిని ఓదార్చిన సుమంత్ శంకరశాస్త్రి పాదాలకు నమస్కరించ బోతాడు.

అతన్ని వారించిన శంకరశాస్త్రి “భగవంతుడి అనుగ్రహం ఉండబట్టే నువ్వు క్షేమంగా బయటపడ్డావు” అన్నాడు.

“నేను స్పృహలో లేనప్పుడు ఒక వింత ఆకారం నన్ను వెంటాడుతున్నట్లు అనిపించేది. ఆ ఆకారం నన్ను అగాథంలోకి తోస్తున్న సమయంలో మీరు కాపాడినట్లు అనిపించేది” అని చెప్పాడు సుమంత్.

“ నిజమే బాబూ! నిన్ను కాపాడుతున్నందుకు ఏదో దుష్ట శక్తి ఆయన మీద పగబట్టింది. దాడికి ప్రయత్నించింది” అని చెప్పాడు చలపతిరావు.

శంకరశాస్త్రి, సుమంత్ తో మాట్లాడుతూ “నీ కోసం మృత్యుంజయ హోమం చేశాను. ఇక నీకు ఏ భయమూ ఉండదు”అన్నాడు.

ఇంతలో డాక్టర్ గోవర్ధన్ అక్కడికి వచ్చాడు. ఆయనకు నమస్కరించాడు సుమంత్.

చలపతిరావు కూడా ఆయనకు నమస్కరిస్తూ “చక్కటి వైద్యం అందించి మా అబ్బాయి తొందరగా కోలుకునేలా చేశారు” అంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాడు.

డాక్టర్ గోవర్ధన్, సుమంత్ తో మాట్లాడుతూ “హైదరాబాద్ నుండి ఏ సి పి ప్రతాప్ గారు వస్తున్నారు. ఆయన వచ్చాక నేరస్తులను గుర్తుపట్టే కార్యక్రమం ఉంటుంది. ఈలోగా విశ్రాంతి తీసుకోండి. ఎక్కువ స్ట్రెయిన్ కావద్దు” అన్నాడు.

తరువాత చలపతిరావు వైపు తిరిగి “పోలీసులు వచ్చాక ఎంత కాదనుకున్నా సుమంత్ ని ప్రశ్నలతో ముంచెత్తుతారు. కాబట్టి అంత వరకైనా అతన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి” అని చెప్పాడు.

శంకర శాస్త్రి డాక్టర్ తో "ఒక్క నిముషం. ఈ మంత్రించిన ఆంజనేయ స్వామి తాయత్తు సుమంత్ చేతికి కట్టేసి వెడతాను" అన్నాడు.

ఒక్కసారిగా డాక్టర్ గోవర్ధన్ ముఖం వికృతంగా మారింది.

"ఇదిగో పెద్దాయనా! చెబుతుంటే అర్థం కాదా? పేషేంట్ ని ఇబ్బంది పెట్టొద్దు. ముందు అందరూ బయటకు వెళ్ళండి" అన్నాడు కఠినంగా.

కానీ శంకర శాస్త్రి, ‘ఒకే ఒక్క క్షణం..’ అంటూ సుమంత్ చేతికి తాయత్తు కట్టాడు.

"మీక్కావలసిన ఇద్దరూ దొరికారు. ఇదే హాస్పిటల్ లో ఉన్నారు. ఇంకా ఎందుకు భయం?" అన్నాడు డాక్టర్ గోవర్ధన్ తన కోపాన్ని అదుపు చేసుకుంటూ.

అతని కంఠంలో మార్పును గమనించాడు శంకర శాస్త్రి.

"ఒక దుష్ట శక్తి కూడా సుమంత్ మీద పగబట్టి ఉంది. దాని ఆటలు కట్టించడానికే ఈ తాయత్తు. మీ మాట కాదని తాయత్తు కట్టినందుకు నన్ను క్షమించండి" అంటూ బయటకు నడిచాడు.

అతనితో పాటు మిగతా వాళ్ళు కూడా బయటకు వెళ్లారు.

వాళ్ళతో పాటు వెళుతున్న నర్స్ ని ఆగమన్నాడు డాక్టర్ గోవర్ధన్.

"నువ్వు ఇక్కడే ఉండు. ఒకసారి సుమంత్ ని పూర్తిగా చెక్ చేద్దాం. పోలీసులు వచ్చాక లేటెస్ట్ పొజిషన్ అడుగుతారు కదా" అన్నాడు.

దాంతో ఆమె అక్కడే ఉండిపోయింది. సుమంత్ ని షర్ట్ విప్పి వెల్లకిలా పడుకొమ్మన్నాడు డాక్టర్ గోవర్ధన్.

"ఇదిగో... ఆ తాయత్తును తీసెయ్యి. పేషేంట్ ని స్కానింగ్ కి పంపాలి" అన్నాడు ఆ నర్స్ తో.

"స్కానింగ్ ఉదయమే చేసారు కదా సార్" అంది ఆ నర్స్.

"చెప్పిన పని చెయ్యి. ఎదురు మాట్లాడితే నీ ఉద్యోగం తీయించేస్తాను" కోపంగా అన్నాడు గోవర్ధన్.

"సారీ సార్. మాది వేరే మతం. మీ తాయత్తును తాకను. వేరే నర్స్ ని పంపిస్తాను" అంది ఆ నర్స్.

"సరే. అలాగే ఏడువ్" కోపంగా అన్నాడు గోవర్ధన్.

బయటకు నడిచిన ఆ నర్స్, నేరుగా శంకర శాస్త్రి వాళ్ళు ఉన్న వైపు వెళ్ళింది.

"డాక్టర్ మాటల్లో తేడా కనిపిస్తోంది. ఎప్పుడూ 'సిస్టర్' అని మర్యాదగా పిలిచే అయన ఇప్పుడు కోపంగా మాట్లాడుతున్నారు. నన్ను ఆ తాయత్తు తీసెయ్యమన్నారు. ఏదో చెప్పి తప్పించుకొని వచ్చాను" అని శంకర శాస్త్రి తో చెప్పిందామె.

"హోమం పూర్తయింది కాబట్టి సుమంత్ కి ఏ ఆపదా ఉండదు కదా" అన్నాడు చలపతిరావు.

“హోమ ప్రభావం వల్లనే ఆ దుష్ట శక్తి పన్నాగం మనకు తెలిసింది. మనం మిన్నకుంటే ఆపద తప్పదు" అన్నాడు శంకర శాస్త్రి.

"మా వూరి వాళ్ళు చాలా మంది ఇక్కడే ఉన్నారు కదా. అందర కలిసి అతన్ని పట్టుకుందాం" అన్నాడు చలపతి రావు.

"మన సుమంత్ ప్రాణాలు కాపాడాడు ఆ డాక్టర్ గోవర్ధన్. గోవిందు లాగా ఇతను బలి కాకూడదు. నేను డాక్టర్ ఒంటినుంచి ఆ దుష్ట శక్తిని పంపడానికి ప్రయత్నిస్తాను. అతను డాక్టర్ ని వదలకుండా అతని చేత ఆత్మహత్యకు ప్రయత్నిస్తే, మీరు అతన్ని ఆపి కాపాడండి" అన్నాడు శంకర శాస్త్రి.

తరువాత అతను ఒక్కడే ఆ గదిలోకి వెళ్ళాడు.

లోపలికి వచ్చిన శంకర శాస్త్రి వంక కోపంగా చూసాడు డాక్టర్ గోవర్ధన్.

"నన్నుకనిపెట్టేశావన్నమాట" అన్నాడు ఆవేశంగా.

"నేనంటే భయం పోలేదన్న మాట" అన్నాడు శంకర శాస్త్రి అతని వంక సూటిగా చూస్తూ.

"ఇది నాకూ, ఆ సుమంత్ కు మధ్య ఉన్న విషయం. నువ్వు కల్పించుకోవద్దు" అన్నాడు డాక్టర్ గోవర్ధన్.

"అంటే నువ్వు ఆ తోట మాజీ యజమాని గోవర్ధన బాబు ఆత్మవని ఒప్పుకుంటున్నావా? మా సుమంత్ మీద నీకు కక్ష ఎందుకు? అతని తప్పు వుంటే నేను తప్పుకుంటాను. నువ్వు అతన్ని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు" అన్నాడు శంకర శాస్త్రి.


"తప్పు ఒప్పులు చూస్తే నేను దయ్యాన్ని ఎందుకవుతాను? నా మనవడు గోవర్ధన్ చేసేది నాకెప్పుడూ తప్పుగా అనిపించదు. అతనో అమ్మాయిని లొంగదీసుకోవాలనుకున్నాడు. తనకు సంబంధం లేకపోయినా ఆ సుమంత్ గాడు అడ్డుపడి మావాడి ముఖం మీద రాయితో కొట్టాడు..

దాంతో వాడి ముఖం వికృతంగా మారిపోయింది. చనిపోవాలనుకున్నాడు. కానీ మనసు మార్చుకొని పగ తీర్చుకోవడానికి నిర్ణయించుకున్నాడు. నా మనవడికి నా వంతు సహకారం అందించాలనుకున్నాను. కానీ వాడు ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుకులాడుతూ ఇదే హాస్పిటల్ లో ఉన్నాడు. అందుకే మీ అందరి అంతు చూసేదాకా నాకు తృప్తి కలగదు " అంది డాక్టర్ గోవర్ధన్ లో ఉన్న గోవర్ధన బాబు ఆత్మ.

"నీ మనవడి పరిస్థితికి కారణం అతను చేసిన తప్పులే. చచ్చే ముందైనా అతని తప్పులు తెలియజేసి కళ్ళు తెరిపించు. లేదంటే నీలాగే అతను కూడా దయ్యంగా మారుతాడు" అంటూ శంకర శాస్త్రి తనతో తెచ్చుకున్న ఒక పొట్లాన్ని బయటకు తీశాడు. అందులో కాటుక లాంటి పదార్థం ఉంది.


"ఈ కాటుకతో నీ అల్లుడిని కాపాడుకుంటావా?" అంది గోవర్ధన బాబు ఆత్మ వికృతంగా నవ్వుతూ.

"ఇది కాటుక కాదు. హోమం తాలూకు రక్ష. దీనితో నీ నుండి డాక్టర్ గారిని కాపాడుతాను" అంటూ ఆ రక్షను డాక్టర్ గోవర్ధన్ నుదుటిన పూశాడు.

దాంతో గోవర్ధన్ బాబు ఆత్మ, డాక్టర్ ని వదిలి పెట్టక తప్పలేదు.

వెళ్లే ముందు "ఇంతటితో అయిపోయిందనుకోకు. మళ్ళీ వస్తాను" అని కేక పెట్టింది.

"నేను భగవద్భక్తుడిని. క్షుద్ర పూజలు చెయ్యను. భూత వైద్యుని పిలిపించి నిన్ను భూస్థాపితం చేస్తాను" అన్నాడు శంకర శాస్త్రి.

తనను ఆవహించిన ఆత్మ వెళ్లిపోవడంతో డాక్టర్ గోవర్ధన్ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు.

"ఏం జరిగింది?" అని శంకర శాస్త్రిని ప్రశ్నించాడు అతను.

"ఒక దుష్ట శక్తి మిమ్మల్ని లొంగదీసుకోవాలని ప్రయత్నించింది. కానీ వీలుకాక వెళ్ళిపోయింది" అన్నాడు శంకర శాస్త్రి.

లోపల ఏంజరుగుతుందోనన్న అతృతతో అందరూ లోపలికి వచ్చారు.

తన వంక సందేహంగా చూస్తున్న నర్స్ తో "సిస్టర్! ఏమిటలా చూస్తున్నారు?" అని అడిగాడు డాక్టర్ గోవర్ధన్.

"హమ్మయ్య! మీరు మా డాక్టర్ గారే.." అంది నర్స్ సంతోషంతో.


ఇంతలో విశాల్ అక్కడికి వచ్చాడు. సుమంత్ ని ఆనందంతో కౌగలించుకున్నాడు.

చాలా సేపు ఇద్దరికీ మాటలు రాలేదు.

హైదరాబాద్ నుండి ఏసిపి ప్రతాప్, విజయవాడ ఏసిపి తో కలిసి ఆ హాస్పిటల్ చేరుకున్నాడు.

ఇద్దరు నేరస్థుల పరిస్థితీ తీవ్రంగా ఉండటంతో పోలీసులు వాళ్ల స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కొంతసేపటికి వాళ్లిద్దరూ చనిపోయారు.

తరువాత ఇద్దరు ఏసీపీలు సుమంత్, విశాల్ లతో విడిగా మాట్లాడారు.


జరిగింది తెలుసుకోవాలని ఎదురు చూస్తున్న మిగతా వారికి జరిగిన సంఘటనలు వివరించారు.

వాళ్ళు చెప్పిన వివరాలు ఇవి...


ఆ మామిడి తోట కంచికచెర్లకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గోవర్ధన పురం అనే గ్రామానికి చెందింది.

ఆ తోట యజమాని గోవర్ధన్ బాబు ఆ గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా.


అతడు తన ధనబలంతో, అధికార బలంతో చాలా అకృత్యాలు చేసేవాడు. ఎందరో స్త్రీలను బలాత్కారం చేశాడు.

ఆ తోటకు కాపలా కాసేవారు, కుటుంబంతో సహా అక్కడే ఒక గుడిసె వేసుకొని కాపురం ఉండేవారు. ఆ తోటమాలి భార్యను గోవర్ధనం బాబు బలవంతంగా లొంగదీసుకోవడంతో ఆ దంపతులు ఆ తోటలోనే ఆత్మహత్య చేసుకున్నారు.

ఆ భయంతో తరువాత ఆ తోటకు కాపలాగా వచ్చిన కుటుంబం ఆ తోటలో ఒక రాయిని పాతి, ఆ రాయికి కుంకుమ బొట్లు పెట్టి గంగమ్మగా కొలిచేవారు.

ఆ అమ్మవారు తమను కాపాడుతుందని నమ్మేవారు.

తోటమాలి లేని సమయం చూసి గోవర్ధన బాబు ఆమెను బలాత్కారం చేయబోయాడు. ఆమెను వెంబడించే క్రమంలో కాలు జారి ఆ గంగమ్మ రాయి తలకు బలంగా తగిలి ప్రాణాలు విడిచాడు.

దాంతో అయన కొడుకు ఆ తోటను తమ దాయాదులైన హేమంత్ వాళ్ళ తాతకు అమ్మేశాడు.

కొన్నేళ్ళకు హేమంత్ వాళ్ళ తాత మరణించడంతో ఆ తోట అచ్చి రాలేదని వాళ్ళ నాన్న దాన్ని లీజుకు ఇచ్చేసాడు.

గోవర్ధన్ బాబు మనవడి పేరు కూడా గోవర్ధన్. బుద్ధులు కూడా తాతవే.


ఆ తోటను అతడు వాసు అనే తన స్నేహితుడికి లీజుకి ఇప్పించాడు.


అతనితో కలిసి ఆ తోటను యథేచ్ఛగా తన అసాంఘిక కార్యకలాపాలకు వాడుకునే వాడు.

హేమంత్ కూడా అప్పుడప్పుడూ ఆ తోటను ఫ్రెండ్స్ తో పార్టీలకు వాడుకునేవాడు.

కానీ గోవర్ధన్ తో పెద్దగా కలిసేవాడు కాదు.

షణ్ముగం ఆ తోటకు వాచ్ మాన్ గా చేరాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ హాస్టల్ లో ఉండి, చదువుకుంటున్నారు.

ఆ తోటకు కుర్రాళ్ళు తరచుగా వచ్చి పోతుండటంతో షణ్ముగం తన కూతుళ్లను ఎప్పుడూ తోట దగ్గరకు రానిచ్చేవాడు కాదు. తనే వెళ్లి వాళ్ళను చూసి వచ్చేవాడు.

లేదా అతని భార్య చంద్రికా వాళ్ళ ఇంట్లో అందరూ కలిసేవారు.

కోవిడ్ కారణంగా పిల్లలు ఉంటున్న హాస్టల్ మూసివేశారు.

దాంతో వాళ్ళు తోట దగ్గరకు వచ్చేసారు.

చంద్రిక తల్లికి కోవిడ్ సోకి సీరియస్ గా ఉండటంతో షణ్ముగం, చంద్రికలు ఇద్దరూ ఆమెను చూడటానికి వెళ్లారు. పిల్లలకు కోవిడ్ వస్తుందన్న భయంతో వాళ్ళను తీసుకెళ్లలేదు.

అన్ని జాగ్రత్తలూ చెప్పి, రాత్రికి ఖచ్చితంగా తిరిగి వస్తామని చెప్పి వెళ్లారు.

ఆ రోజు రాత్రి ఏడుగంటలైనా వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు.


ఇప్పటిలాగే ఆ రోజు కూడా ఉరుములు, మెరుపులతో పెద్ద వాన వచ్చింది.


షణ్ముగం కూతుళ్లు తోటలోకి రావడం గోవర్ధన్, అతని స్నేహితుడు వాసు ముందే గమనించారు.


వయసులో ఉన్న అందమైన అమ్మాయిలను చూడగానే, ఎలాగైనా వాళ్ళను లొంగదీసుకోవాలనే దుర్భుద్ధి పుట్టింది.

అదను కోసం చూస్తున్న వాళ్లకు షణ్ముగం, చంద్రికలు ఊరికి వెళ్లడం కలిసొచ్చింది.

రాత్రి ఎనిమిది గంటలకు పెద్ద వాన రావడం, కరెంట్ పోవడం తో ముఖానికి ముసుగులు ధరించి గుడిసె తలుపును తట్టారు. తెరుచుకోక పోవడంతో కాళ్లతో బలంగా తన్నారు. ఆ తలుపు విరిగి పడింది. ఆ సమయానికి షణ్ముగం కూతుళ్లు బుడ్డి దీపం వెలిగించుకుని భోజనం చేస్తున్నారు. వీళ్ళను చూసి భయపడి చేతిలో ఉన్న ప్లేట్లు కింద పడేశారు.

తమ మీదకు వస్తున్న గోవర్ధన్, వాసులను తప్పించుకుని చీకట్లో తోటలోకి పరుగెత్తారు.

ఆపద కలిగినప్పుడు తోటలో ఉన్న గంగమ్మ కాపాడుతుందని గతంలో తల్లి చెప్పి ఉండటంతో ఆ దిశగా వానలో తడుస్తూ పరుగెత్తారు.

ఇక ఆ రోజు సుమంత్ తన స్నేహితుడు విశాల్ ను కంచిక చర్ల లో ఉన్న అతని రూమ్ దగ్గర కలిసాడు. కాసేపు మాట్లాడుకున్నాక సుమంత్ బయలుదేరాడు.

అతను బయలుదేరిన కాస్సేపటికి వాన మొదలైంది.

మామిడి తోట దగ్గరికి వచ్చేసరికి ఉరుములు, మెరుపులతో వాన పెద్దదైంది.

కాస్సేపు ఆగుదామని తోటలోకి వచ్చాడు సుమంత్.

కరెంట్ పోవడంతో అంతా చీకటిగా ఉంది.

మొబైల్ లో టార్చ్ ఆన్ చేసి గుడిసె దగ్గరకు వచ్చాడు. తలుపు తీసి ఉండటంతో లోపలికి వెళ్ళాడు.

టార్చ్ వెలుగులో నేలమీద పడిఉన్న ప్లేట్లను, చెల్లా చెదురుగా పడిఉన్న అన్నాన్ని చూశాడు.

షణ్ముగానికి కూతుళ్లు ఉన్నట్లుగానీ, వాళ్ళు ఆపదలో ఉన్నారనిగానీ అతనికి తెలీదు.

తోటమాలి మీద ఎవరో దాడి చేసినట్లు భావించి "షణ్ముగం.. షణ్ముగం.." అని అరుస్తూ ఆ చీకట్లో తోటంతా తిరుగుతున్నాడు.

మెరుపు వెలుతురులో సుమంత్ ని గుర్తించాడు గోవర్ధన్.

సుమంత్ అడ్డు తొలగితే కానీ అమ్మాయిలను దక్కించుకోలేమనుకున్నాడు.

చేతికందిన కట్టెను తీసుకొని సుమంత్ మీదకు దాడికి ప్రయత్నించాడు.


అతన్ని ఎదుర్కోవడానికి సుమంత్ సరైన ఆయుధం కోసం చూశాడు.

నేలలోంచి పొడుచుకుని వచ్చినట్లున్న ఒక రాయిని చూశాడు.


నిజానికది షణ్ముగం దంపతులు పూజిస్తున్న గంగమ్మ రాయి.

వానకు నేల మెత్తబడి ఉండటంతో సుమంత్ ఆ రాయిని సులభంగా పెకలించాడు.

తన మీదకు వస్తున్న గోవర్ధన్ ముఖం మీద ఆ రాయితో బలంగా మోదాడు.

ముఖాన్ని చేతులతో కప్పుకుని కింద పడిపోయాడు గోవర్ధన్.

అతన్ని సమీపించి ముసుగును తొలగించి చూశాడు సుమంత్.

టార్చ్ వెలిగించాడు. అతని ముఖమంతా రక్తసిక్తమై గుర్తు పట్టలేనట్లుగా ఉంది.

విశాల్ కోసం కాల్ చేసాడు.

సిగ్నల్ అందలేదు.

వెంటనే గుడిసె దగ్గరకు వచ్చాడు.

తన బైక్ ని స్టార్ట్ చేసి విశాల్ రూమ్ కి చేరుకొని జరిగినదంతా అతనికి చెప్పాడు.


వెంటనే ఇద్దరూ ఆ మామిడి తోట దగ్గరకు వచ్చారు.

వీళ్ళు వెళ్లేసరికి షణ్ముగం, అతని భార్య గుడిసెలో ఉన్నారు.

"ఇందాక నేలంతా అన్నం పడిఉంది. తలుపు తీసి ఉంది. లోపల ఎవ్వరూ లేరు. ఏమైనా జరిగిందా?" అని అడిగాడు సుమంత్.

" ఏదో చెట్టు విరిగి పడ్డ శబ్దం వినిపిస్తే చూద్దామని వెళ్ళాం. తొందర్లో తలుపు సరిగా మూయలేదేమో.. గాలికి అన్నం గిన్నె పడిపోయి ఉంటుంది" అన్నాడు షణ్ముగం.

విశాల్ చేతిని పట్టుకుని బయటకు లాక్కుని వచ్చాడు సుమంత్.


"వీళ్ళు ఎందుకో అబద్ధం చెబుతున్నారు. తోటలో నేను గాయపరిచిన వ్యక్తి పడి ఉంటాడు. అతన్ని చూపిస్తాను" అంటూ విశాల్ తో కలిసి తోటంతా వెదికాడు.

ఇందాక తను అతన్ని అటాక్ చేసిన ప్రదేశాన్ని గుర్తు పట్టాడు.

కానీ అక్కడ ఎవరూ లేరు.


ఒక చెట్టుకు కాస్త ముందు నేలలో ఒక రాయి పాతి ఉంది.

దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఉన్నాయి.

వానకు ఆ బొట్లు కరిగి అక్కడంతా ఎర్రగా ఉంది.

సుమంత్ ని అక్కడనుంచి తన రూమ్ కి తీసుకుని వచ్చాడు విశాల్.

ఆ తోటలో దయ్యాలు ఉంటాయని విని ఉండడం వల్ల అలా భ్రమ కలిగి ఉండవచ్చని అభిప్రాయ పడ్డాడు విశాల్.

నిజానికి అక్కడ జరిగింది ఏమిటంటే సుమంత్ వెళ్ళగానే వాసు, గోవర్ధన్ దగ్గరకు వెళ్లి అతన్ని కదిలించి స్పృహ తెప్పించాడు.

స్పృహలోకి వచ్చిన గోవర్ధన్, సుమంత్ తనను గుర్తించి ఉంటాడని, పోలీసుల్ని తీసుకొని వస్తాడని ఊహించుకుని అదే విషయం వాసుతో చెప్పాడు.

వాసు అతడిని వేరే పేరుతో విజయవాడలో ఒక హాస్పిటల్ లో చేర్పించాడు.

గోవర్ధన్ షర్ట్ ను, చెప్పులను కృష్ణా తీరంలో ఉంచి, ఉద్యోగం రానందున ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఒక ఉత్తరం రాసి ఆ షర్ట్ జేబులో ఉంచాడు.

గోవర్ధన్ కాస్త కోలుకున్నాక ఇద్దరూ హైదరాబాద్ చేరుకున్నారు.


కానీ గోవర్ధన్ ఊహించినట్లు సుమంత్ అతన్ని గుర్తించలేదు.

పైగా జరిగింది నిజమా కాదా అనే సందేహంలో పడ్డాడతను.

షణ్ముగం, గోవర్ధన్ ని అనుమానించాడు. కానీ గోవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నట్లు వినడంతో కూతుళ్ళ భవిష్యత్తు దృష్ట్యా జరిగింది ఎవ్వరికీ చెప్పలేదు.

గోవర్ధన్, వాసులు ఇద్దరూ హైదరాబాద్ లో చైన్ స్నాచింగ్, ఏటీఎం లో ఒంటరిగా ఉన్నవాళ్లను అటాక్ చేయడం లాంటి నేరాలు చేస్తూ ఆ డబ్బుతో విలాసాలకు అలవాటు పడ్డారు.

పైగా గోవర్ధన్, తను మరణించినట్లు అందరూ నమ్ముతుండడంతో సుమంత్ మీద పగ తీర్చుకున్నా తన పేరు బయటికి రాదనుకున్నాడు. అంతదాకా తను అజ్ఞాతంలో ఉండాలనుకున్నాడు.

వాసు మాత్రం అప్పుడప్పుడూ తన ఊరికి, మామిడి తోట దగ్గరకు వచ్చేవాడు. ఇక్కడి విషయాలు గోవర్ధన్ కి చేరవేసేవాడు.

సుమంత్ తన స్నేహితులకు మామిడి తోటలో పార్టీ ఇస్తున్న విషయం గోవర్ధన్, వాసులకు తెలిసింది. వాళ్ల మిత్ర బృందంలో తమకు తెలిసిన వాళ్ల చేత సుమంత్, విశాల్ తాగిన డ్రింక్ లో మత్తు మందు కలిపించారు.


వాళ్ళు మత్తు ప్రభావంలో డ్రైవ్ చేస్తూ వుంటే యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నారు.

మత్తులో ఉన్న సుమంత్ కి గత ఏడాది ఒక వ్యక్తి తనమీద దాడి చేయడం, తను అతన్ని గాయపరచడం ఒక కలలా గుర్తుకు వచ్చాయి.

తన వదిన హాస్పిటల్ లో అడ్మిట్ అయిన విషయం తెలిసిన విశాల్ విడిగా వెళ్లిపోవడం, సుమంత్ భ్రమకు లోనై బైక్ మీదనుంచి పడిపోవడం జరిగింది. దాంతో గోవర్ధన్ కి యాక్సిడెంట్ చేసే అవసరం రాలేదు.

ఇక గోవర్ధన రావు అనే వ్యక్తి ఒక మాజీ ఎంపీ.


తన బ్లాక్ మనీలో కొంత దాచమని తన మాజీ పీఏ మోహన్ వద్ద ఉంచాడు. అయన ఆ డబ్బును తన కారు డ్రైవర్ ఇంట్లో ఉంచాడు. వికాస్ ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నాడు. గోవర్ధన రావు చేసిన ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగలేదు.

దాంతో వికాస్ మీద కక్ష కట్టాడు మాజీ ఎంపీ గోవర్ధన రావు.

వికాస్ కి సంబంధించిన వివరాలు సేకరించాడు.

డైరెక్ట్ గా వికాస్ మీద అటాక్ చేస్తే తననే అనుమానిస్తారని భావించాడు.

అతని భార్యను చంపితే వికాస్ జీవితాంతం బాధ పడతాడని అనుకున్నాడు.


అయితే నేరుగా ఆమెను చంపడం కాక, ముందొక మహిళను, వెనకొక మహిళను చంపి ఇది ఒక సైకో కిల్లర్ చేసినట్లు నమ్మించాలని చూశాడు.

అందుకు తగిన వ్యక్తి కోసం వెదికాడు.

ఏటీఎం లో ఒక వృద్ధుడిని దారుణంగా అటాక్ చేసిన గోవర్ధన్ ని బెయిల్ ఇప్పించి విడిపించాడు. అప్పటికే గోవర్ధన్ వేరే పేరుతో ఐడి తయారు చేసుకున్నాడు.

అతనితో ముందుగా ఒక స్త్రీ హత్య, తరువాత అదే తరహాలో వికాస్ భార్య హత్య, తరువాత మరో హత్య చేసేలా సుపారీ ఇచ్చి మాట్లాడుకున్నాడు గోవర్ధన రావు.

అయితే వికాస్ భార్య తప్పించుకోవడంతో అతని కొడుకును కిడ్నాప్ చెయ్యాలని చూశాడు గోవర్ధన్.


దాంతో అతను సైకో కిల్లర్ కాదని, వికాస్ ని టార్గెట్ చేసిన వ్యక్తి అని మాకు అనుమానం కలిగింది.

అదే సమయంలో మామిడి తోట దగ్గర వాసు, గోవర్ధన్ పేరుతో డాక్టర్ దంపతులను బెదిరించాలని చూశాడు. సిఐ కిషోర్ ని గాయపరిచింది అతనే.

ఇక గోవర్ధన్, శంకర శాస్త్రి గారిని అటాక్ చెయ్యాలని చూసి, దొరికిపోయి , గ్రామస్థులు కొట్టిన దెబ్బలకు చనిపోయాడు.

"గోవర్ధన్, వాసుల మరణ వాంగ్మూలం, విశాల్, సుమంత్, షణ్ముగం, అతని భార్య చెప్పిన వివరాలను బట్టి మేము ఈ అభిప్రాయానికి వచ్చాము. పోలీసులం కాబట్టి మేము ఎక్కడా దయ్యాల ప్రస్తావన తేలేదు. అందుకు సంబంధించిన వివరాలు శంకర శాస్త్రి గారిని అడిగి తెలుసుకోండి " అంటూ వివరించాడు ఎసిపి ప్రతాప్.

శంకర శాస్త్రి మాట్లాడుతూ "చనిపోయిన మాజీ సర్పంచ్ గోవర్ధన బాబు దయ్యంగా మారడం నిజం. అతను ఆ తోటలో తచ్చట్లాడుతూ ఉండటం చాలా మంది గమనించారు. అయితే ఆ తోటలో ఉన్న గంగమ్మ ప్రభావం వల్ల అతను ఎవరికీ హాని చేయలేక పోయేవాడు. కేవలం బెదిరించగలిగే వాడు. తోటలో పార్టీ ముగిసాక గోవర్ధన్ బాబు తాలూకు దయ్యం సుమంత్ వెనక విశాల్ ఆకారంలో కూర్చుంది. కానీ అతని నీడ మాత్రం వికృతాకారంలో సుమంత్ కి కనపడింది. గోవర్ధన్ నాకు డ్రైవర్ గా వచ్చి, మర్రి చెట్టు దగ్గర కార్ ఆపినప్పుడు సుమంత్ నాతో ఫోన్ లో 'దగ్గరలో ఏదైనా మర్రి చెట్టు వుందా' అని అడిగాడు. దీక్ష మీద చెట్టు కొమ్మ పడబోతోందని చెప్పాడు.

దయ్యం చెయ్యబోయే పని అతనికి తెలియడం వల్లే అది చెప్పగలిగాడు.

గోవింద్ ని ఎవరో ప్రలోభ పెట్టారని మీరు అంటున్నారు. కానీ అతన్ని గోవర్ధన్ ఆవహించి సుమంత్ ని చంపాలని చూశాడు. అదే సమయానికి నేను సుమంత్ ఫోటోపై తాయెత్తును ఉంచడం, సుమంత్ లారీకింద పడకుండా నిలదొక్కుకోవడం కాకతాళీయం కాదు.


ఇక డాక్టర్ గోవర్ధన్ ని కూడా ఆ గోవర్ధన్ బాబు ఆత్మ ఆవహించింది. ఇవన్నీ మీ లాజిక్ లకు అందవు కానీ పచ్చి నిజాలు. ఏమైనా ప్రతి విషయంలో మాకు అండగా నిలిచిన హైదరాబాద్, విజయవాడ పోలీసులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను" అన్నాడు శంకర శాస్త్రి.

"దయ్యాల ప్రమేయం లేదనుకుంటే ఇద్దరు నేరస్తులూ హతమయ్యారు కాబట్టి కథ సుఖాంతమైనట్లే. దయ్యం ఉందనుకుంటే దాని విషయంలో మేము సహాయం చేయలేము. మీరే ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదేమైనా సుమంత్, దీక్షల పెళ్లికి మమ్మల్ని పిలవడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా వస్తాను" అన్నాడు ఎసిపి ప్రతాప్.

అందరూ ఆనందంగా నవ్వుకున్నారు.


***సమాప్తం ***


ఈ సీరియల్ ను ఆదరించి తమ అమూల్యమైన అభిప్రాయాలు తెలిపిన పాఠకులకు వందనాలు.


ఈ సీరియల్ లోని పాత్రలు, సన్నివేశాలు పూర్తిగా కల్పితం.

కథలో పేర్కొన్న ప్రదేశాలు, వివిధ పాత్రల హోదాలు కేవలం సందర్భానుసారం వాడుకోబడ్డాయి. ఎవరినీ ఉద్దేశించి కాదు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).



75 views0 comments

Comments


bottom of page