top of page

వెంటాడే నీడ ఎపిసోడ్ 16

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Ventade Nida Episode 16' New Telugu Web Series


Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్


గత ఎపిసోడ్ లో…

సీఐ కిషోర్ ని వెనకనుండి అటాక్ చేస్తాడు అగంతకుడు.

ఏసిపి ప్రతాప్ విజయవాడ పోలీసుల్ని అప్రమత్తం చేస్తాడు.

లారీ కిందికి సుమంత్ ని తోసేయాలని ప్రయత్నించాడు గోవిందు.

కుదరక పోవడంతో తనే కారు కిందకి దూకుతాడు.

సుమంత్, తన తండ్రికి కాల్ చేసి తన పరిస్థితి వివరిస్తాడు

ఇక చదవండి…


గోవిందును హాస్పిటల్ లో అడ్మిట్ చేసిన తరువాత హాస్పిటల్ మేనేజర్ సుమంత్ ను ఏం జరిగిందని అడుగుతాడు.


"గోవిందు నా వద్దకు వచ్చి డాక్టర్ గోవర్ధన్ నాకు విషం ఇంజెక్ట్ చెయ్యబోతున్నాడని చెప్పాడు. నా చెయ్యి పట్టుకొని నన్ను బలవంతంగా బయటకు తీసుకొని వచ్చాడు. అప్పుడతని చూపులు మామూలుగా లేవు. ఏదో మత్తులో ఉన్న వాడి చూపుల్లా ఉన్నాయి. నన్ను రోడ్డు మీద వేగంగా వస్తున్న లారీ కిందకు నెట్టెయ్యాలని చూశాడు. అదృష్టవశాత్తు నేను పడిపోలేదు. మీరు రావడంతో అతను కారు కిందకు దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు" చెప్పాడు సుమంత్.


"నాకు ఒక సందేహం. గోవిందు మిమ్మల్ని లారీ కిందకు నెట్టడానికి తన బలాన్నంతా ఉపయోగించాడు. మేము దూరం నుండే అది గమనించాము. కానీ మీరు ఎంతమాత్రం కదల్లేదు. మాకు చాలా ఆశ్చర్యం కలిగింది" అన్నాడు హాస్పిటల్ మేనేజర్.


"నాక్కూడా అదే అర్థం కావడం లేదు. నిజానికి నాకు వంట్లో చాలా నీరసంగా ఉంది. గోవిందు నా చెయ్యి పట్టుకుని నన్ను బయటకు సులభంగా లాక్కొని వెళ్ళాడు. కానీ అతను తోసినప్పుడు నేను స్థిరంగా ఉన్నాను. ఇది ఖచ్చితంగా దైవానుగ్రహమే. మా మామయ్య శంకర శాస్త్రి నాకోసం పూజలు చేస్తున్నారు. ఆ ప్రభావమే నన్ను కాపాడి ఉండవచ్చు" అన్నాడు సుమంత్.


తరువాత అతను రిసెప్షన్ లో ఉన్న ఒక ఫోన్ నుండి తన తండ్రికి కాల్ చేశాడు. తనకు యాక్సిడెంట్ అయిన విషయం తెలియజేశాడు.


తరువాత హాస్పిటల్ మేనేజర్ తో "నేను అనుకున్నదే కరెక్ట్. సరిగ్గా గోవిందు నన్ను లారీ కిందకు తోసే సమయానికి మా మామగారు నా ఫోటో పైన విబూది ఉంచారట" అని చెప్పాడు.


ఇంతలో లోకల్ ఎస్సై ఆ హాస్పిటల్ కి వచ్చాడు.

మేనేజర్ ఆయన్ని విష్ చేసి "మీరు వస్తున్నట్లు మా ఎండి గారు చెప్పారు. రండి" అంటూ ఆహ్వానించాడు.

తరువాత ఆయనకు సుమంత్ ను పరిచయం చేశాడు.


అయన సుమంత్ ని విష్ చేసి,"నా పేరు శ్రీకాంత్. ఈ ఏరియా ఎస్సైని. జరిగిన విషయాలు నాకు చెప్పండి" అన్నాడు.


హాస్పిటల్ మేనేజర్ కి చెప్పిన విషయాలే ఆయనకు కూడా వివరించాడు సుమంత్.


అయన నవ్వి, " డాక్టర్ గోవర్ధన్ పాయిజన్ ఇంజక్ట్ చేస్తాడనే భయం, గోవిందుతో బయటకు పరిగెత్తేలా చేసింది. అదే ప్రాణ భయం గోవిందు మిమ్మల్ని కారు కిందకు తోసినప్పుడు పడకుండా ఆపింది. అంతకు మించి దైవ శక్తులూ లేవు, దయ్యాల మాయలూ లేవు" అన్నాడు.


"అలాగే అనుకుందాం. కానీ గోవిందు ఎప్పటిలా లేడు. ఏదో దయ్యం ఆవహించినవాడిలా ఉన్నాడు. పైగా అతను నన్ను లారీ కిందకు తొయ్యడానికి కారణం ఏముంది? తాను ఎందుకు చనిపోవడానికి ప్రయత్నించాడు?" ప్రశ్నించాడు సుమంత్.


"మిమ్మల్ని చంపమని ఎవరో అతనికి డబ్బులు ఇచ్చి వుంటారు. హాస్పిటల్ మేనేజర్, సెక్యూరిటీ చూడడంతో దొరికి పోతాననే భయంతో కారు కిందకు దూకాడు. నాకు ఒక విషయం చెప్పు. నీకు గోవర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఉందా?" అడిగాడు ఎస్సై శ్రీకాంత్.

ఉలిక్కి పడ్డాడు సుమంత్.


'ఆ పేరు వీళ్ళకెలా తెలుసు?' అని ఆలోచిస్తున్నాడు సుమంత్.

"నా దగ్గర దాచకుండా చెప్పండి మిస్టర్ సుమంత్. ఆ పేరుగల వ్యక్తులు మీకు తెలుసా?" అడిగాడు శ్రీకాంత్.


"నాకు యాక్సిడెంట్ జరిగిన రోజు మేము ఒక మామిడి తోటలో పార్టీ చేసుకున్నాం. ఆ తోట మా స్నేహితుడు హేమంత్ వాళ్ళది. దాని మాజీ యజమాని పేరు గోవర్ధనం. అయన మనవడి పేరు కూడా అదే" గుర్తు చేసుకొని చెప్పాడు సుమంత్.


"అతనితో నీకు పరిచయం కానీ విరోధం కానీ ఉన్నాయా?" అడిగాడు శ్రీకాంత్.

"లేవు" నమ్మకంగా చెప్పాడు సుమంత్.

"పోనీ.. మరెవరితోనయినా గొడవలు ఉన్నాయా.." అడిగాడు ఎస్సై శ్రీకాంత్.

కాస్త ఆలోచించాడు సుమంత్.


చాలా రోజుల క్రితం ఆ తోటలో తనకు కలిగిన అనుభవం గుర్తుకు వచ్చిందతనికి.

కానీ అది కేవలం భ్రమేనని అప్పుడు తనకి అనిపించింది.


అప్పట్లో ఆ విషయం విశాల్ కి చెప్పాడు. అతను దాన్ని భ్రమగా కొట్టి పడేశాడు.

ఇప్పుడు ఆ విషయం ఇతనికి చెప్పాలా?..

అవసరం లేదనిపించింది సుమంత్ కి.


అతని తటపటాయింపు చూసిన ఎస్సై "ఆ మామిడి తోటకు సంబంధించి ఏదో మిస్టరీ దాగి ఉందనిపిస్తోంది. అక్కడ హైదరాబాద్ కి చెందిన సిఐ కిషోర్ పైన ఎవరో గోవర్ధన్ అనే వ్యక్తి దాడి చేశాడని అక్కడి ఏసిపి ప్రతాప్ గారు మా ఏసిపి గారికి చెప్పారట. హైదరాబాద్ లో వికాస్ అనే ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ భార్య పైన దాడికి ప్రయత్నించిన వ్యక్తి కూడా తన పేరు గోవర్ధన్ అని చెప్పాడు.."చెబుతూ ఉన్నాడు ఎస్సై.


అయన మాటలకూ అడ్డు వస్తూ " వికాస్ నాకు తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్ విశాల్ కు అన్నయ్య అవుతాడు అతను" చెప్పాడు సుమంత్.

"ఆ విశాల్ నంబర్ గుర్తు ఉంటే చెప్పు. గోవర్ధన్ గురించి అతనికేమైనా తెలుసేమో కనుక్కుంటాను" అన్నాడు శ్రీకాంత్.


"స్పృహలోకి వచ్చాక ముందు విశాల్ కోసమే ట్రై చేశాను. స్విచ్ ఆఫ్ అయినట్లు వచ్చింది. అయినా మీరు కూడా ట్రై చేయండి" అంటూ నంబర్ చెప్పాడు సుమంత్.

ఆ నంబర్ కి కాల్ చేశాడు శ్రీకాంత్.

అటువైపు ఎవరూ లిఫ్ట్ చెయ్యలేదు.

మరోసారి ట్రై చేశాడతను.


ఈసారి ఫోన్ లిఫ్ట్ చేసిన వ్యక్తి వికృతంగా నవ్వాడు.

"ఎవడ్రా ఈ గోవర్ధన్ ని డిస్టర్బ్ చేస్తున్నది?" కోపంగా అడిగాడతను.

"గోవర్ధన్…? నేను ఎస్సై శ్రీకాంత్ ని. నువ్వేనా మామిడి తోటలో సిఐ కిషోర్ ని అటాక్ చేసింది?" అడిగాడు శ్రీకాంత్.


"నేను నీకు దొరికాక గోవర్ధన్ పేరుతో ఉండే కేసులన్నీ నా మీద బనాయించుదువు గానీ, నీకు చేతనయితే ముందు నన్ను పట్టుకో. ఆ గోవర్ధన్ ఎవడో సిఐ మీద అటాక్ చేశాడన్నావు. నేను ఎస్సైని లేపెయ్యలేనా.. నేను శంకర శాస్త్రి పని పట్టాలని చూస్తున్నాను. దమ్ముంటే నన్ను ఆపు" అంటూ వికృతంగా నవ్వి కాల్ కట్ చేశాడతను.

శ్రీకాంత్ తిరిగి కాల్ చేసినా అతను లిఫ్ట్ చెయ్యలేదు.


ఇంతలో చలపతిరావు పంపిన కృష్ణాపురం గ్రామస్థులు ఆ హాస్పిటల్ చేరుకున్నారు.

సుమంత్ క్షేమంగా ఉండడం చూసి సంతోషించి, పలకరించారు.

తరువాత వాళ్ళు ఒక అగంతకుడు శంకర శాస్త్రి డ్రైవర్ గా వచ్చి మర్రి చెట్టు దగ్గర కారును ఆపడం, అతని చేతిలో సుమంత్ ఫోన్ ఉండటం, చెట్టు కొమ్మ విరిగి దీక్ష మీద పడబోవడం.. మొదలైనవన్నీ ఎస్సైకి, సుమంత్ కి చెప్పారు.


ఎస్సై వెంటనే వాళ్ళ దగ్గర ఆ గ్రామ సర్పంచ్ నంబర్ అడిగి తీసుకున్నాడు.

అతనికి కాల్ చేసి చలపతిరావు ఇంటికి కాపలాగా కొందరు పోలీసుల్ని పంపిస్తున్నట్లు, పోలీసులు వచ్చేదాకా కొందరు యువకులను సహాయంగా ఉంచమని చెప్పాడు.

"నా ఫోన్, విశాల్ ఫోన్ కూడా ఆ వ్యక్తి చేతిలోనే ఉన్నాయి. నా మొబైల్ అతని దగ్గర నుండి మా మామయ్య లాక్కున్నాడు" చెప్పాడు సుమంత్.


"విశాల్ దగ్గర ఇప్పుడు వేరే నంబర్ ఉందా? అతను వికాస్ తమ్ముడని చెప్పావు కదూ! పోనీ వికాస్ నంబర్ గుర్తుందా?" అడిగాడు శ్రీకాంత్.

"గుర్తుంది. ఎందుకంటే విశాల్ నంబర్ కీ, వాళ్ళ అన్నయ్య నంబర్ కీ లాస్ట్ డిజిట్ మాత్రమే తేడా" అంటూ వికాస్ నంబర్ చెప్పాడు సుమంత్.

వెంటనే ఆ నంబర్ కి కాల్ చేశాడు ఎస్సై శ్రీకాంత్.


అటువైపు కాల్ లిఫ్ట్ చెయ్యగానే "నేను ఎస్సై శ్రీకాంత్ ని మాట్లాడుతున్నాను. వికాస్ గారేనా మాట్లాడుతున్నది?" అని అడిగాడు.

వికృతమైన వికటాట్టహాసం వినిపించింది అతనికి.

"ఎవరది? నేను ఎస్సైని మాట్లాడుతున్నాను" అన్నాడు శ్రీకాంత్.


"ఇప్పుడే సిఐ తల పగలగొట్టాను.మరో రెండు హత్యలు చేయబోతున్నాను. అయ్యాక కాల్ చెయ్యి. అన్నట్లు నా పేరు గుర్తుంచుకో.. గోవర్ధన్ నా పేరు" చెప్పి కాల్ కట్ చేశాడతను.

రోమాలు నిక్కబొడుచుకున్నాయి శ్రీకాంత్ కి.


బయట వాన ఉద్ధృతి పెరిగింది.

పెద్ద మెరుపు మెరిసింది.

దగ్గర్లోనే పిడుగు పడ్డ శబ్దం వినిపించింది.

అదే సమయంలో కరెంట్ పోయింది.


"ఎమర్జెన్సీ లైట్లు వెలగలేదేమిటి?" ఆశ్యర్యంగా అంటూ ఎవరికో కాల్ చేశాడు హాస్పిటల్ మేనేజర్.


గాలికి ఆ హాస్పిటల్ కిటికీలు టపటపా కొట్టుకుంటున్నాయి.


ఆ గాలి హోరులో 'దేవుడు లేడని చెప్పు. ఒప్పుకుంటాను. కానీ దయ్యాలు లేవని అంటావా.. ఈ గోవర్ధన్ ని అవమానించావు నువ్వు' అన్న మాటలు వినిపించాయి ఎస్సై శ్రీకాంత్ కి.

***

ఇక్కడ మామిడి తోట దగ్గర...


అగంతకుడి కోసం వెతుకుతున్న ఇద్దరు కానిస్టేబుల్స్ కి ఏసిపి ప్రతాప్ కాల్ చేసి ముందు కిషోర్ ని సేవ్ చెయ్యమని చెప్పాడు.


అతనికోసం వెతుకుతున్న వాళ్లకు అతను ఒక చోట నేలమీద పడిపోయి ఉండటం గమనించారు.


వీళ్ళు దగ్గరకు వచ్చేసరికే అతను శక్తిని కూడగట్టుకొని పైకి లేస్తున్నాడు.

అతన్ని సమీపించిన వాళ్ళు "సర్, మీరు అలా ఆ చెట్టుకింద కూర్చోండి. ఒకరు మీకు కాపలాగా ఉంటాం. మరొకరు ఆ గుడిసె దగ్గరకు వెళ్తాము" అన్నారు.


"నో... నాకేం పరవాలేదు. ఇద్దరూ ఆ గుడిసె దగ్గరకు వెళ్ళండి. ఆ డాక్టర్ ఫ్యామిలీని కాపాడండి. ఇది నా ఆర్డర్" అన్నాడు సిఐ కిశోర్.


చేసేది లేక వాళ్లిద్దరూ గుడిసె వైపు వెళ్లారు.

ఇంకా వుంది…


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు కథ పేరు పైన క్లిక్ చేయండి.



రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).


73 views0 comments
bottom of page