మదిలో మల్లెల మాల - పార్ట్ 14
- Chaturveadula Chenchu Subbaiah Sarma

- 19 hours ago
- 7 min read
#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #మదిలోమల్లెలమాల, #MadiloMallelaMala, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika

Madilo Mallela Mala - Part 14 - New Telugu Web Series Written By Ch. C. S. Sarma Published In manatelugukathalu.com On 04/02/2026
మదిలో మల్లెల మాల - పార్ట్ 14 - తెలుగు ధారావాహిక
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జరిగిన కథ:
తన కూతురికి లవ్ లెటర్ రాశాడనే అభియోగంపై రమణ అనే విద్యార్థిని సస్పెండ్ చేయమని ప్రిన్సిపాల్ కు చెబుతారు ఛైర్మన్ రామారావు. రమణ విషయంలో తొందరపడినట్లు భర్త రామారావుకు, కూతురు రంజనికి చెబుతుంది లక్ష్మీదేవి. రమణ తప్పు చెయ్యనట్లు తెలుసుకుంటారు రామారావు. ప్రిన్సిపాల్ ధర్మారావు గారి సహకారంతో రమణ, ఆనంద్ ఇంజనీరింగ్ లో చేరుతారు. సినిమారంగంలో నష్టపోయి, రామారావు కుటుంబం పేదవారుగా మారుతారు. వారికి సహాయం చేస్తూ ఉంటాడు రమణ. రమణ పనిచేసే కంపెనీలో ఉద్యోగానికి అప్లై చేస్తుంది రంజని.
గత ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మదిలో మల్లెల మాల - నా మాట కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 8 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 9 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 10 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 11 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మదిలో మల్లెల మాల - పార్ట్ 12 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక మదిలో మల్లెల మాల - పార్ట్ 14 చదవండి.
బిగ్‍బాస్ రమణను పిలిచాడు. మద్రాస్ బ్రాంచీలో కొన్ని సీనియర్ లెవల్ వెకన్సీలను ఫిల్ చేయవలసి ఉందని, ఆ ఇంటర్వ్యూలను కండక్ట్ చేసి, మంచి క్యాండిడేట్లను సెలక్ట్ చేసి రావలసిందిగా తెలియజేశాడు.
ఆ సాయంత్రం రమణ చెన్నైకి బయలుదేరాడు. ఎయిర్‍పోర్టులో రమణను డ్రాప్ చేసిన ఆనంద్...
"రంజని ఆ ఇంటర్వ్యూకి వస్తుంది," నవ్వుతూ అన్నాడు.
"నీకెలా తెలుసు?"
"తను నాకు ఫోన్ చేసింది. మన కంపెనీకి అప్లై చేసినట్లు చెప్పింది."
"ఏం, ఇప్పుడు తను పనిచేసే చోట బాగాలేదా?..."
"ఆమెకు మన కంపెనీలో చేరాలని ఎంతో ఆశ."
"కారణం?"
"మనది పెద్ద కంపెనీ కదా! ఒకవేళ తను వచ్చిందనుకో, సెలక్ట్ చేయి. అన్నింటికీ మంచిది," నవ్వుతూ చెప్పాడు ఆనంద్.
"ఏమిటి?" ఆశ్చర్యంతో అడిగాడు రమణ.
"షి ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్. కష్టపడి పనిచేస్తుంది."
"ఓ పని చేయి," చెప్పాడు రమణ.
ఆనంద్ రమణ ముఖంలోకి చూచాడు.
"నాకు బదులుగా నీవు వెళ్లి, నీ కోరికను తీర్చుకుని రా!..."
"బాస్ వెళ్ళమన్నది నిన్ను కదా, నేను ఎలా వెళ్లగలను?"
"అవును కదూ! ఇక ఈ పురాణాన్ని ఇంతటితో ఆపు. ఐ నో మై డ్యూటీ వెరీవెల్!" కాస్త సీరియస్‍గా చెప్పాడు రమణ.
"తెలిసిన వారికి సాయం చేస్తే జీవితాంతం గొప్పగా చెప్పుకుంటారు. ఈ విషయం నీకూ బాగా తెలిసిందే కదా!" నవ్వాడు ఆనంద్.
బోర్డింగ్ కాల్ వినిపించింది. రమణ బై చెప్పి లోనికి వెళ్ళిపోయాడు. ఆనంద్ కార్లో ఇంటికి బయలుదేరాడు. అతని మనస్సు నిండా సుధను గురించిన తలంపులే.
ఈ మధ్య కాలంలో ఆనంద్ ల్యాప్ టాప్, సెల్ ద్వారా సుధకు మెసేజెస్ పంపడం ప్రారంభించాడు. ఆవైపు నుంచి పాజిటివ్‍గా సమాధానాలు రాసాగాయి. రాత్రి పదకొండు, పన్నెండు మధ్య ప్రశాంత నిశీధి సమయంలో ఆ ఇరువురు ఆనందంగా చాటింగ్ చేసుకునేవారు.
రమణ ధర్మారావు గారికి, తను అర్జంటుగా చెన్నై వెళుతున్నానని, తిరిగి వచ్చి అమ్మతో మాట్లాడుతానని మెసేజ్ పంపాడు.
రమణ ఊర్లో లేని కారణంగా, పెద్దమ్మతో తన నిర్ణయాన్ని తెలియజేసేటందుకు ఇది తగిన సమయం అని ఆనంద్ నిర్ణయించుకున్నాడు. ఇంటికి చేరాడు.
ప్రశాంతంగా కూర్చొని దైవాన్ని ధ్యానిస్తున్న సునంద ప్రక్కన కూర్చున్నాడు. అతన్ని చూచిన సునంద...
"ఫ్లైట్ రైట్ టైంకు బయలుదేరిందా?" అడిగింది.
"ఎస్, పెద్దమ్మా! అక్కడ మనవాడూ రంజనిని కలవబోతున్నాడు," నవ్వాడు ఆనంద్.
"ఎందుకు?" ఆశ్చర్యంతో అడిగింది సునంద.
"ఆమె మా కంపెనీ ఇంటర్వ్యూకు వస్తున్నట్లు నాకు ఫోన్ చేసి చెప్పింది."
"ఈ విషయం మనవాడికి చెప్పి సెలక్ట్ చేయమన్నావా?"
"చెప్పాను. కానీ, మనవాడు ఇలాంటి మాటలను వినిపించుకోడు కదా పెద్దమ్మా! ముక్కు అంటాడు. సూటిగా అంటాడు," కాస్తంత చిరుకోపం కనిపించింది ఆనంద్ ముఖంలో.
"ఇద్దరి మధ్యా ఈ విషయంలో గొడవ జరిగిందా?"
"లేదు పెద్దమ్మా, భయపడకు. రాముడి మాటను లక్ష్మణుడు ఏనాడు కాదన్నాడు? నేనూ అంతే," నవ్వాడు ఆనంద్.
"సరేలే... పోయి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. భోజనం చేద్దాం."
"పెద్దమ్మా! నేను నీతో ఓ ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాలి."
"త్వరగా రా! భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. నేను డైనింగ్ టేబుల్ మీద అన్నింటినీ అమర్చుతాను."
"సరే!" చెప్పి తన గదివైపుకు వెళ్ళాడు ఆనంద్.
’సుధ విషయంలో తన అభిప్రాయాన్ని పెద్దమ్మకు తెలియజేయాలి. ఆమె సమ్మతిని పొందాలి’ అనుకున్నాడు ఆనంద్.
సెల్ మ్రోగింది. ఫోన్ చేసింది తల్లి.
"నాన్నగారి ఆరోగ్యం సరిగా లేదురా. మంచంలో ఉన్నారు. నిన్ను చూడాలని కలవరిస్తున్నారు. వెంటనే బయలుదేరిరా!" భోరున ఏడ్చింది.
ఆనంద్ తలపై పిడుగు పడినట్లయింది. హృదయంలో విచారంతో నిండిపోయింది.
వేగంగా క్రిందికి వచ్చాడు. గద్గద స్వరంతో అమ్మ చెప్పిన మాటలను సునందకు తెలియజేశాడు.
"నీవు వెంటనే బయలుదేరు ఆనందా! ఆయనకేం కాదు. నా మాట నమ్ము. బాధపడకురా!" గాంభీర్యంతో చెప్పింది సునంద.
ఆనంద్ పైకి వెళ్లి రెండు ప్యాంట్స్, షర్ట్స్ హ్యాండ్ బ్యాగులో పెట్టుకొని వేగంగా క్రిందికి వచ్చాడు.
ఏనాడు తన తల్లి ఏడ్చింది ఆనంద్ చూడలేదు. ఆమె ఏడుపు అతనికి ఎంతో భయాన్ని, బాధను కలిగించింది.
భుజంపై చేయి వేసి సునంద... "భయపడకు. పెద్ద వయస్సు కదా, చూడాలని చెప్పి ఉంటాడు. నీవు ధైర్యంగా బయలుదేరు. ఆయనకు ఏమీ కాదు. నా మాట నమ్ము," అనునయంగా చెప్పింది సునంద.
ఆనంద్ వీధిలో ప్రవేశించి ఆటో ఎక్కి బస్టాండుకు బయలుదేరాడు.
*
తల్లిదండ్రులు కాదన్నా భీమారావుకు రంజని పట్ల అభిప్రాయం మారలేదు. పెళ్లి చేసుకోలేకపోయినా, ఆమె పొందును ఒక్కసారి ఏ విధంగానైనా పొందాలనే తీవ్ర నిర్ణయానికి వచ్చాడు.
తన ఆశయం నెరవేర్చుకునేటందుకు రంగారావుతో చాలా సన్నిహితంగా వర్తించాడు. ఇరువురూ మంచి స్నేహితులుగా మారిపోయారు.
ఓ రాత్రి మందు పార్టీలో తన అభిప్రాయాన్ని భీమారావు రంగారావుకు తెలియజేశాడు. రంజనిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.
డబ్బే సర్వస్వంగా భావించిన రంగారావు, భీమారావుకు తన చెల్లెలుకు వివాహం జరిగితే, బాతుల బంగారయ్య చచ్చిపోతే వారి యావదాస్తి... సినిమా బేనర్ అంతా తన చేతుల్లోకి రాగలదనే నిర్ణయానికి వచ్చాడు.
భీమారావు, తన తల్లి తండ్రి రంజనితో తన వివాహాన్ని అంగీకరించని కారణం, త్వరలో తాము తీయబోతున్న కొత్త చిత్రానికి కొత్త నాయిక అవసరం అని, "నీ చెల్లెలు రంజని మంచి అందగత్తె కాబట్టి ఆమెను నీవు హైదరాబాదుకు తీసుకొని వస్తే, కొత్త సినిమాలో హీరోయిన్ తనే అవుతుందని" రంగారావు చెప్పాడు. భీమారావు మాటలు రంగారావుకు బాగా రుచించాయి.
ఫలితంగా ఊరికి వెళ్లి తల్లిదండ్రులకు కలిసి, వారి పట్ల ఎంతో ప్రేమను వలకబోసి నమ్మించి, వారిని తనతో హైదరాబాద్‍కు తీసుకుని పోతానన్నాడు. రంజనిని కలిసి ఆమెను అమ్మా నాన్నలతో కలిసి హైదరాబాద్ రమ్మని చెప్పాడు.
"నీ ప్రవర్తన, మాటల మీద నాకు నమ్మకం లేదు. ఉద్యోగాన్ని వదులుకుని నేను నీతో రాను," అంది రంజని.
ముందు తల్లితండ్రిని తనతో తీసుకుని వెళితే, ఆ తర్వాత వారిని చూచేటందుకు రంజని తన వద్దకు తప్పక వస్తుందనే విశ్వాసంతో, తల్లిదండ్రులతో రంగారావు హైదరాబాద్ చేరాడు.
*
ఊరికి చేరిన ఆనంద్‍ను తండ్రి చూచి శాంతించాడు. సునంద చెప్పినట్లుగానే, సంవత్సరం రోజులుగా కన్నబిడ్డను చూడకుండా అదే ధ్యాసలో ఉంటూ, వేళకు తిండి, నీళ్లు తీసుకోనందున ఆనంద్ తండ్రి దిగులుతో నీరసించిపోయాడేగాని, అతనికి ఏ వ్యాధీ లేదు. కొడుకును చూడగానే ఆనందంగా మంచంలో కూర్చొని, "నీవు త్వరలో వివాహం చేసుకోవాలని, దాన్ని నేను కళ్లారా చూడాలని," ఆనంద్‍ను కోరాడు.
"మీ ఆశయాన్ని త్వరలో నెరవేరుస్తాను నాన్నా!" అని ఆనంద్ వారికి మాట ఇచ్చాడు.
తరువాత, తల్లిదండ్రులకు సుధను గురించిన వివరాలను చెప్పాడు. మూగదన్న మాటను చెప్పలేదు. ఈ వార్తను విన్న ఆ దంపతులు ఎంతగానో సంతోషించారు. త్వరలో ఆనంద్, సుధల వివాహం ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, వారి వివాహాన్ని జరిపించాలనే నిర్ణయానికి వచ్చారు. సుధ ఫోటోను చూచి ఆనందించారు.
ఆనంద్ రామారావు గారి ఇంటికి వెళ్ళాడు. రంగారావు వచ్చి వారిని తనతో హైదరాబాదుకు తీసుకుని వెళ్ళాడనే వార్త విని ఆలోచనలో పడ్డాడు. రంజనికీ ఫోన్ చేసి అన్ని విషయాలను తెలుసుకున్నాడు.
సమయం సాయంత్రం నాలుగున్నర. అప్పటికి పదిహేను మందిని ఇంటర్వ్యూ చేశాడు రమణ.
ఆనంద్ ఫోన్ చేసి, తండ్రి అనారోగ్యం కారణంగా తను ఊరికి వచ్చానని మూడు రోజుల తర్వాత తల్లిదండ్రులను తీసుకొని తాను బెంగళూరుకు వస్తున్నట్లు రమణకు తెలియజేశాడు. చివరగా...
"బ్రదర్!... ఏం చేశావ్?"
"విషయం ఏమిటి?"
"మరచిపోయావా?..."
"నేను ఏ విషయాన్ని అంత సులువుగా మరువనన్న విషయం నీకు తెలుసుగా!..."
"అయితే రంజనీని ఏం చేశావ్?"
"ఏ రంజనీ!...."
"చాలా చాలా బాగుంది బ్రదర్!..."
"ఈ ఆఫీసులో ఓ రంజనీ ఉంది. నీకు తెలుసునో తెలియదో!...."
"నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నీవు ప్రేమలేఖ వ్రాసిన రంజనీ ఒక్కటే. ఆమె విషయాన్ని ఏం చేశావ్?" నవ్వాడు ఆనంద్.
"మన స్కూల్ మీట్ రంజనీ ఇంటర్వ్యూకు రాలేదురా!..." విసుగ్గా చెప్పాడు రమణ.
"రాలేదా!..." ఆశ్చర్యపోయాడు ఆనంద్.
రెండు క్షణాల తర్వాత... "వెళ్ళుతున్నానని నాతో చెప్పిందిరా!" అన్నాడు.
"ఒరేయ్ ఆనంద్!... ఆమె రాలేదు."
"అలాగా!..."
"అవును. అవును."
ఆనంద్ కట్ చేశాడు. రమణ ఆఫీస్ బాయ్‍ని పిలిచాడు.
"ఎవరైనా ఇంటర్వ్యూ కోసం వచ్చారా!" అడిగాడు.
"ఇప్పుడే... ఒకరు వచ్చారు సార్!..."
"ఆడా మగా!..."
"అమ్మాయి సార్!..."
"లోనికి పంపు"
రెండు నిమిషాల తర్వాత రంజనీ గదిలో ప్రవేశించింది. ఆమె తలంతా చిందరవందరగా ఉంది. ముఖాన చెమట. ముఖంలో అలసట రమణకు గోచరించాయి.
"గుడ్ ఆఫ్టర్నూన్ సార్" భయంతో మెల్లగా అంది.
"ప్లీజ్ టేక్ యువర్ సీట్. మంచినీళ్ళు తాగుతారా!..."
ఆశ్చర్యంగా రమణ ముఖంలోకి చూచి నవ్వుతూ తలాడించింది రంజనీ.
బెల్ నొక్కాడు రమణ. బాయ్ లోనికి వచ్చి... "సార్!..." అన్నాడు.
"వీరికి మంచినీళ్ళు, కాఫీ తీసుకొనిరా!... ఫాస్ట్" అన్నాడు రమణ.
రంజనీ కుర్చీలో కూర్చుంది. చేతి రుమాలుతో ముఖాన్ని తుడుచుకొంది.
రమణ తనను చూస్తున్నాడా లేదా అని అతని వైపుకు చూచింది.
ల్యాప్‍టాప్‍లో ఏదో మెసేజ్‍ను దీక్షగా చూస్తున్నాడు రమణ.
తనను చూడాలని గొంతు సవరించింది రంజనీ కానీ... రమణ ఏకాగ్రతలో మార్పు లేదు.
బాయ్ నీటి గ్లాసును, కాఫీ కప్పును టేబుల్‍పై రంజనీ ముందు ఉంచి వెళ్ళిపోయాడు.
దృష్టిని ల్యాప్‍టాప్ పైనే ఉంచి రమణ... "తీసుకోండి" అన్నాడు క్షణంసేపు ఆమె ముఖంలోకి చూచి. ఆ క్షణంలో రంజనీ చూపులు అతని చూపులతో కలిశాయి.
రంజనీ మంచినీటిని, కాఫీని తాగింది. ఏసి రూమ్ చల్లగాలి హాయిగా ఉందనిపించింది.
రమణ ల్యాప్‍టాప్‍ను పక్కకు జరిపాడు. రంజనీవైపు చూచాడు.
"కాల్ లెటర్‍లో ఇక్కడికి మీరు ఎన్ని గంటలకు రావాలని ఉంది?"
"త్రీ థర్టీ"
"ఇప్పుడు టైమ్!"
"ఫోర్ ఫార్టీఫైవ్" తన వాచీని చూచి చెప్పింది రంజనీ.
"అంటే!..."
"నలభై అయిదు నిమిషాల ఆలస్యం అయింది"
"కారణం...ఎప్పుడైనా వెళ్ళవచ్చుననే మీ..." రమణ పూర్తిచేయకముందే...
"సారీ సార్!... బస్ బ్రేక్ డౌన్ అయింది. ఒంటిగంటకు చెన్నై చేరవలసిన బస్సు మూడు గంటలకు చేరింది. అందువల్ల సమయానికి నేను రాలేకపోయాను." దీనంగా చెప్పింది రంజనీ.
"ఓ... మీ సర్టిఫికేట్లను చూపించండి"
ఫైల్‍ను రమణ చేతికి అందించింది రంజనీ.
"మీ పేరు?" యథాలాపంగా అడిగాడు రమణ. రంజనీ అందించిన ఫైలును చూస్తూ.
రంజనీ మౌనంగా ఉండిపోయింది. కొన్ని క్షణాలు... తర్వాత... "నా పేరు..." పేరు తెలిసి అడుగుతున్నావంటే నీవు!?... అనుకొని... తను పేరు చెప్పబోయే లోపలే రమణ... "రంజనీ" అన్నాడు.
"ఎస్ సార్!... మీకు బాగా తెలిసిన పేరు."
రమణ తలెత్తి రంజనీ ముఖంలోకి చూచాడు.
అందమైన స్వచ్ఛమైన నవ్వుతో రంజనీ రమణ ముఖంలోకి చూచింది.
"అత్తయ్యగారు... అదే మీ అమ్మగారు బాగున్నారా!..." అడిగింది అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ రంజనీ.
ఆశ్చర్యంతో రంజనీ కళ్ళల్లోకి చూచాడు రమణ. నాలుగు కళ్ళూ... ఒకటయ్యాయి. కొన్ని క్షణాల తర్వాత తొట్రుపాటుతో...
"ఆ... మీ అమ్మానాన్నా!... బాగున్నారుగా!..." అడిగాడు రమణ.
"ఆ... పదిరోజుల క్రిందట వారిని మా అన్నయ్య రంగా హైదరాబాదుకు తీసుకొని వెళ్ళాడు. నన్నూ రమ్మన్నాడు. ఈ ఇంటర్వ్యూ కారణంగా వెళ్ళలేదు."
"మీరు అమ్మానాన్నలను బాగా చూచుకోవాలి."
"నా ఉద్దేశ్యమూ అదే. వారిని నా దగ్గరే ఉంచుకొంటాను. అందుకే ఈ ఉద్యోగ ప్రయత్నం."
"మీ అమ్మగారు చాలా మంచివారు."
"మీ అమ్మగారు కూడా చాలా మంచివారని మా అమ్మ చెప్పింది. మీకు నా మీద కోపమా!"
"తన కోపము తనకు శత్రువు చదివారుగా!... నాకు ఎవరి మీదా కోపం లేదు."
ఆనంద్... రంజనీకి ఫోన్ చేశాడు. నెంబర్‍ను చూచి "ఎక్స్ క్యూజ్‍మీ సార్!..."
"మాట్లాడండి."
రంజనీ లేచి బయటికి వెళ్ళిపోయింది. రెండు నిమిషాల తర్వాత లోనికి వచ్చింది.
"సారీ సార్!..." అంది.
"ఫోన్ చేసింది ఎవరు?" అడిగాడు రమణ.
"ఆనంద్"
క్షణంసేపు రంజనీ ముఖంలోకి చూచి... "యు ఆర్ సెలెక్టెడ్"
"థాంక్యూ రమణ" ఆనందంగా అని... వెంటనే "సారీ ప్లీజ్"
నాలుకపై పళ్ళతో నొక్కి తలదించుకొంది రంజనీ. క్షణంసేపు రంజనీని చూచి రమణ కుర్చీనుంచి లేచి నిలబడ్డాడు.
"పదండి" అంటూ తను గదినుండి బయటికి నడిచాడు. రంజనీ అతన్ని అనుసరించింది.
"రమణా!..." పిలిచింది రంజనీ నవ్వుతూ.
వెనుదిరిగి చూచాడు రమణ. రంజనీ వేగంగా హ్యాండ్‍బ్యాగును తెరిచి గులాబీ పువ్వును బయటికి తీసింది. చేయి జాపి అతనికి చూపిస్తూ... "ఇది మీకోసం. రావడంలో ఆలస్యం అయినందున టెన్షన్‍లో లోన ఇవ్వడానికి మరచిపోయాను. తీసుకోండి" చిరునవ్వుతో అంది రంజనీ.
క్షణం తర్వాత... "గులాబీ అంటే మీకు ఎంతో ఇష్టం అని ఆనంద్ చెప్పాడు. అందుకే తెచ్చాను" అంది.
ఆ క్షణంలో రంజనీని నఖశిఖపర్యంతం పరీక్షగా చూచాడు రమణ. 'ఎంత అందం!... ఎంత స్వచ్ఛమైన నవ్వు!...' చిరునవ్వుతో గులాబీని అందుకొన్నాడు.
"థాంక్యూ సార్" నవ్వుతూ అంది రంజనీ.
"థాంక్యూ"
"ఇకనే వెళతాను"
"జాగ్రత్తగా వెళ్ళిరండి."
నవ్వుతూ అతని ముఖంలోకి చూచి రంజనీ ముందుకు కదిలింది. రమణ ఆమె వెనుకన ఉన్నాడు.
"ఆగండి" అన్నాడు.
రంజనీ... వెనుతిరిగి చూచింది.
"ఇప్పుడు మీరు ఎక్కడికి వెళుతున్నారు?" అడిగాడు రమణ.
"నెల్లూరికి..."
"ఎలా వెళతారు?"
"బస్సులో..." నవ్వుతూ చెప్పింది రంజనీ.
"మీరు నాతో రండి. నేను మిమ్మల్ని బస్టాండులో డ్రాప్ చేస్తాను."
ఇరువురూ కారులో కూర్చున్నారు. కారును హోటల్ ముందు ఆపాడు రమణ. టిఫిన్ చేశారు. రంజనీని బస్టాండులో దింపాడు.
"జాగ్రత్తగా వెళ్ళిరండి"
"అలాగే... థాంక్యూ" అంది నవ్వుతూ రంజనీ. ఆమె ఎక్కిన బస్సు కదిలింది.
============================================================
ఇంకా వుంది..
మదిలో మల్లెల మాల - పార్ట్ 15 త్వరలో
============================================================
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.




Comments