top of page
Original_edited.jpg

కేస్ నెం 37 బి - పార్ట్ 13

  • Writer: Nagamanjari Gumma
    Nagamanjari Gumma
  • 7 days ago
  • 8 min read

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesInTelugu

ree

Case No. 37B - Part 13 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 11/11/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. 


కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక, తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్ తో సహా గీచి, శరత్ కు ఇస్తుంది. పరిశోధన కోసం అరకు వెళ్లిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది. పారిపోతున్న దుండగుల కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఒక వ్యక్తి ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభిస్తాడు శరత్. ప్రొఫెసర్ శ్యాం సుందర్ దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం మత్తుమందు ప్రభావం వల్ల హాస్పిటల్ లో చేరుతారు. అరకులో యువతి మరణానికి కారణమైన వారిని విచారిస్తాడు శరత్. శరత్ ను ఎవరో అటాక్ చెయ్యడంతో హాస్పిటల్ లో చేరుతాడు.  

గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 13 చదవండి.. 


"ఊఁ. అందరూ వెళ్లిపోయారు. ఇంక చాలు." అన్నాడు కామేశ్వరరావు. 


రెప్పలల్లార్చి నెమ్మదిగా "సార్" అన్నాడు శరత్ ఆశ్చర్యంగా.


"ష్" అని నోటి మీద వేలుంచి, శరత్ పక్కనే కూర్చుని, "నీ బాస్ ని మై బాయ్… ఏది నిజమో, ఏది అబద్ధమో గ్రహించకపోతే అడిస్ ని ఎలా నిర్వహిస్తాను? నేను సాయంత్రం డాక్టర్ దగ్గరకి వచ్చినపుడే నీకు స్పృహ వచ్చిందని, డాక్టర్ చెప్పిందంతా విన్నావని గ్రహించాను. ఇంకో విషయం అక్కడ ఆఫీస్ మీద కూడా దాడి జరిగింది. ఏదో విషయం ఉందని గ్రహించాను. ఫైల్ దొరికింది. డీకోడ్ చేసి అంతా చదివాను, నేరస్తులు ఎవరో గ్రహించాను. కార్తీకకు ఫోన్ చేసి వస్తాను. నీ నటన కొనసాగించు" అని గుసగుసగా శరత్ కి చెప్పి, తలుపు దగ్గర నిలబడి, కార్తీకకు విషయం తెలియజేస్తూ ఫోన్ చేసాడు. 


శరత్ వైపు చూసి నవ్వాడు. శరత్ మళ్ళీ అభావంగా చూస్తూ ఉండిపోయాడు. నర్స్ తలుపు తోసుకుని వచ్చింది. శరత్ కి జ్వరం చూసి, చార్ట్ పై రాసి, బీపీ చెక్ చేసి, తిరిగి పడుకోపెట్టీంది. కామేశ్వరరావు శరత్ పక్కనే కూర్చుని చేయి నిమురుతూ కూర్చున్నారు. కాసేపటి తరువాత శరత్ తండ్రి వచ్చి, "బాబూ మావాడు ఎన్నాళ్ళు ఇక్కడ ఉండాలి? ఊరికి వెళ్లి డబ్బు తీసుకుని వస్తాను. ప్రమాదం జరిగిందని తెలియగానే కట్టుబట్టలతో అలా వచ్చేసాం" అన్నాడు.


"ఏం గాభరా లేదు పెద్దాయనా.. డబ్బు గురించి మీరు ఆలోచించకండి. మీవాడికి ఏం కాదు. మరి కాసేపట్లో శరత్ పోల్చగలిగే వాళ్ళు ఇంకొందరు వస్తున్నారు. వారిని కూడా పోల్చలేకపోతే అప్పుడు డాక్టర్ తో మాట్లాడుదాం. అవసరమైతే వేరే ఆసుపత్రికి మార్పిస్తాను. శరత్ పై అధికారిగా పూర్తి బాధ్యత నాది. మీ ఇద్దరికి స్నానానికి, ఉండటానికి ఏర్పాట్లు చేస్తాను. లేదా మా ఉద్యోగిని తోడు ఇచ్చి పంపిస్తాను, శరత్ గదికి వెళ్ళండి." అని చెప్పి ఫోన్ చేసి, అడిస్ ఉద్యోగిని పిలిచాడు. అతను వచ్చాక, శరత్ తల్లిదండ్రులను శరత్ గదికి పంపించి, వాళ్లకు కావాల్సిన వసతులు చూడమని, డబ్బు ఇచ్చి పంపించబోయాడు. 


ఈలోగా కార్తీక, ప్రొఫెసర్ శ్యాం సుందర్, సత్యనారాయణ, విశాలాక్షి వచ్చారు. అందర్నీ శరత్ తల్లిదండ్రులకు పరిచయం చేశాడు కామేశ్వరరావు.  విశాలాక్షి శరత్ తల్లిదండ్రులను పలకరించి, టీ, టిఫిన్ ఇచ్చింది. వాళ్ళు అవి తీసుకుని, కామేశ్వరరావుకు చెప్పి, అడిస్ ఉద్యోగి వెంట శరత్ గదికి వెళ్లిపోయారు. అందరూ వచ్చిన హడావిడికి శరత్ కళ్ళు తెరిచాడు. కానీ ముఖంలో ఏ భావం లేదు. కార్తీక శరత్ ను పిలిచింది. 


విజయవాడలో జరిగిన సంఘటనలు, ఇజాక్ విషయం జ్ఞాపకం చేసింది. శరత్ మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. కార్తీక నిస్సహాయంగా కామేశ్వరరావు వైపు చూసింది. సత్యనారాయణ, విశాలాక్షి కూడా ప్రయత్నించారు. ప్రొఫెసర్ గారు కార్తీక అదృశ్యమైనదని ఫిర్యాదు చేసిన తర్వాత పరిశోధన కోసం బొర్రా గుహల దగ్గర ఒకరోజు తమతో శరత్ గడిపిన విషయం జ్ఞాపకం చేశారు. ఉహు… శరత్ దేనికి ప్రతిస్పందించలేదు. కళ్ళలో కానీ, ముఖంలో కానీ మార్పు లేదు. విశాలాక్షి, సత్యనారాయణ బయటకు వెళ్లి కూర్చున్నారు.


ఆఖరి ప్రయత్నంగా ఒక వ్యక్తిని తీసుకువస్తానని చెప్పాడు కామేశ్వరరావు. బయటకు వెళ్లి పోలీసులతో మాట్లాడి, అనుమతి తీసుకున్నాడు. డాక్టర్ తో మాట్లాడి వేరే వార్డులో ఉన్న, బిష్ణు ను ఒకసారి తీసుకురమ్మన్నాడు కామేశ్వరరావు. వాళ్ళు వచ్చేలోగా అడిస్ గుమస్తాకు ఫోన్ చేసి, వారిద్దరి ఆరోగ్యం ఎలా ఉన్నది కనుక్కున్నాడు. వాచ్ మేన్, తాను ఇద్దరూ రాత్రే ఇంటికి వెళ్లిపోయామని, ఈ ఉదయం డ్యూటీకి వస్తామని గుమస్తా చెప్పేడు.


చక్రాల కుర్చీలో బిష్ణును తీసుకువచ్చింది నర్సు. శరత్ ముఖంలో మార్పు రాలేదు కానీ బిష్ణు శరత్ ని చూసి మొదట కాస్త బెదిరాడు. పక్కనే ఉన్న కార్తీకను చూసి గతుక్కుమన్నాడు. తర్వాత అక్కడ పరిస్థితి గమనించి స్థిమిత పడ్డాడు. 


కార్తీక బిష్ణును చూసి, "వీడే నాతో బొర్రా గుహలో అసభ్యంగా మాట్లాడాడు. నన్ను ఎత్తుకుపోయినపుడు ముక్కుకు మత్తు పెట్టింది కూడా వీడే"నని చెప్పింది. ప్రొఫెసర్ వైపు చూసాడు కామేశ్వరరావు. అప్పటికే ప్రొఫెసర్ కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. కార్తీక చెప్పడం తోనే ప్రొఫెసర్ లేచి, లాగిపెట్టి లెంపకాయ కొట్టాడు బిష్ణుని. ఇంకా కొట్టబోతూ ఉంటే కామేశ్వరరావు వారించాడు. పోలీసులు చూసుకుంటారని ప్రొఫెసర్ ని శాంత పరిచాడు.


ఎవరిని చూసినా, శరత్ లో మార్పు రాలేదు. కామేశ్వరరావు అప్పుడే జ్ఞాపకం వచ్చినట్లు, ఎవరికో ఫోన్ చేసి, కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, తీసుకురమ్మని చెప్పాడు. మరో ఇద్దరు శరత్ ను చూడటానికి వస్తున్నారని, ట్రీట్మెంట్ అప్పుడే మొదలు పెట్టవద్దని, డాక్టర్ కి చెప్పాడు కామేశ్వరరావు. 


సత్యనారాయణ, విశాలాక్షి లోపలకు వచ్చారు. కార్తీకతో బయలుదేరుదామని చెప్పేరు. తప్పనిసరై ప్రొఫెసర్ కూడా లేచారు. అందరూ కామేశ్వరరావు దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు. కార్తీక మరోసారి శరత్ వైపు చూసింది. శరత్ కన్ను కొట్టినట్లనిపించింది. ఉలిక్కిపడి చూసింది. శరత్ ముఖం అభావంగా అలాగే ఉంది. 'పొరపాటు పడ్డాను' అనుకుంది.


ఆఫీస్ కి వెళ్లి వస్తానని చెప్పి కామేశ్వరరావు లేచాడు. ఎవరో వస్తారని, అప్పటివరకు చికిత్స ప్రారంభించవద్దని చెప్పినందున డాక్టర్ మరి రాలేదు. అది కార్పోరేట్ ఆసుపత్రి కాకపోవడంతో రోగుల చికిత్సకు అంత హడావుడి పడరెవరూ! పోలీసులకు చెందిన ప్రత్యేకమైన కేసు కావడంతో నర్సు మాత్రం వచ్చి కూర్చుంది. స్నానపానాలు కానిచ్చేసి, విశాలాక్షి ఇచ్చిన టీ తాగి, టిఫిన్ చేసి, శరత్ తల్లిదండ్రులు మళ్ళీ ఆసుపత్రికి వచ్చి, శరత్ దగ్గరే కూర్చున్నారు.


*******


ఆఫీస్ కి వెళ్లిన కామేశ్వరరావు ఒక ఆడియో రికార్డ్ తీసుకుని, కమీషనర్ ఆఫీస్ కి వెళ్ళాడు. కమీషనర్ ప్రఫుల్లచంద్ర కామేశ్వరరావుకు మంచి స్నేహితుడు. వ్యక్తిగతంగా మాట్లాడాలని తన కార్డును బంట్రోతుకు ఇచ్చి పంపించాడు కామేశ్వరరావు. ప్రఫుల్లచంద్ర వెంటనే రమ్మన్నాడు. రెండు కాఫీలు పంపమని చెప్పి, ఒక గంట వరకు ఎవరూ ఇటు రాకూడదు అని ఆదేశించాడు కమీషనర్.  కామేశ్వరరావు, కార్తీక కిడ్నాప్ అయినప్పుడు, ప్రొఫెసర్ శ్యాం సుందర్ తన సహాయం కోరింది మొదలు, శరత్ మీద దాడి జరగడం వరకు అన్ని విషయాలు వివరించారు. ఆడియో టేప్ వినిపించారు. బిష్ణు ఇచ్చిన వివరాలు విని కమీషనర్ తెల్లబోయాడు. శరత్ ను కొట్టి పడేసిన తర్వాత, తాను హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు, తన ఆఫీస్ మీద కూడా దాడి జరిగిందని, పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చానని చెప్పాడు. 


కమీషనర్ వెంటనే తన సిబ్బందికి ఫోన్ చేసి, కార్తీక కేసు విషయం, రోడ్ మీద అంబాసిడర్ ఏక్సిడెంట్, తదితర విషయాలలో పురోగతి గురించి కనుక్కున్నాడు. అనుమానితుల జాబితా తయారు చేసుకున్నాడు. ఆసుపత్రికి ఫోన్ చేసి, శరత్ కి చికిత్స చేస్తున్న డాక్టర్, నర్సుల ఫోన్ నెంబర్లు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ రెండు నెంబర్ల నుంచి వెళ్లిన, వచ్చిన కాల్స్ లిస్ట్ సంపాదించమని ఒక నమ్మకస్తుడైన కానిస్టేబుల్ ను పురమాయించాడు. కామేశ్వరరావు తన వ్యూహం తెలియజేశాడు. కమీషనర్ దానికి కొన్ని మార్పులు సూచించాడు. 


టౌన్ స్టేషన్ కు ఫోన్ చేసి, బినోయ్, జీతూలను అరెస్ట్ చేసిందీ లేనిదీ కనుక్కున్నాడు. వాళ్ళని గత రాత్రి ఒక ప్రైవేట్ హోటల్ గదిలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వాళ్ళ గది నుండి, మాదకద్రవ్యాలు, ఇనపకడ్డీలు రెండు, రివాల్వర్ ఒకటి స్వాధీనం చేసుకున్నామని, బినోయ్ నుదుటికి గాయమై కుట్లు వేసి ఉన్నాయని, ఇద్దరూ స్వల్ప మోతాదులో మత్తుపదార్ధం తీసుకొని ఉన్నారని చెప్పారు. కామేశ్వరరావుతో కాసేపు మాట్లాడాడు కమీషనర్. తర్వాత సి. ఐ కి ఫోన్ చేసి మాట్లాడి, బినోయ్, జీతూలను విడిచిపెట్టమన్నాడు. వాళ్ళకి తెలియకుండా నిఘా పెట్టమని కమీషనర్ ఆదేశించాడు. 


తర్వాత కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి. కానిస్టేబుల్ తెచ్చిన లిస్టులో నర్స్ కాల్ రిజిస్టర్ లో ఒక నెంబర్, కామేశ్వరరావు దగ్గరున్న అనుమానితుని నెంబర్ తో సరిపోయింది. కమీషనర్ కామేశ్వరరావును అభినందించారు. ఇప్పుడు అనుమానితుని కాల్ లిస్ట్ కావాలన్నాడు కమీషనర్. "మీ కానిస్టేబుల్ వెళ్తున్నప్పుడు నేను ఆ నెంబర్ కూడా ఇచ్చాను" అన్నాడు కామేశ్వరరావు. "అఖండుడివి రా నువ్వు" అన్నాడు కమీషనర్ చనువుగా. "నువ్వు, నీ ఉద్యోగులు చాలా చురుకుగా ఉన్నారు" అన్నాడు.


ఆ లిస్ట్ లో నర్స్ నెంబర్ మాత్రమే కాకుండా వేరే రెండు నెంబర్లు కూడా తరచుగా ఉన్నాయి. 


"అభినందనలు తర్వాత ముందు చేప చేజారిపోతుంది పద, పద.." అన్నాడు కామేశ్వరరావు. కామేశ్వరరావు, కమీషనర్ ఇద్దరూ పోలీస్ కారు కాకుండా వేరే కారులో బయలుదేరారు. 


అంతలో పోలీసుల దగ్గర నుండి కమీషనర్ కి ఫోన్ వచ్చింది. ‘వానపాములు (ఎరలు) ఎవరికో ఫోన్ చేస్తున్నారని, జగదాంబ జంక్షన్ దగ్గర ఉన్నార’ని. కారును నెమ్మదిగా జగదాంబ వైపు నడిపిస్తూ వానపాములను వెతుకుతున్నారు కమీషనర్, కామేశ్వరరావులు. ఆ జనసంద్రంలో వానపాములు ఏం కనిపిస్తాయి? ఇంతలో కమీషనర్ చూసాడు. "అదిగో… అటు చూడు" అన్నారు. 


వానపాములు అటు ఇటు చూస్తూ, దశపల్లా హోటల్ వైపు వెళ్తున్నాయి. కమీషనర్ దశపల్లా హోటల్ మేనేజర్ కు ఫోన్ చేసాడు. "మీ హోటల్ లోకి రెండు వానపాములు వస్తున్నాయి, వాటి వెనుకే చేప కూడా వస్తుంది, ప్రత్యేక గదిలో కూర్చోపెట్టమ”ని, వారి గుర్తులు చెప్పాడు. ఫోన్ చేసింది కమీషనర్ కావడంతో మేనేజర్ "సరే" అన్నాడు. వానపాములు దశపల్లా హోటల్ లో ప్రవేశించి, ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చోబోయాయి. 


"సర్… ఆ ఏసీ గదిలో కూర్చోండి. ప్రత్యేక సర్వీస్ ఉంటుంది" అన్నాడు మేనేజర్. వాళ్లిద్దరూ అటు వెళ్లి గదిలో కూర్చున్నారు. వారిద్దరిలో ఒకడు ఫోన్ తీసి ఎవరికో ఫోన్ చేసాడు.


అప్పుడే ఒక కారు వేగంగా దశపల్లా ఆవరణలో ప్రవేశించింది. డ్రైవింగ్ సీట్ లో ఉన్న వ్యక్తిని చూసి కమీషనర్, కామేశ్వరరావు ముఖాలు చూసుకున్నారు. ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ, కారు దిగి లోపలకు వెళ్లి, నేరుగా ప్రత్యేక గదిలోకి వెళ్ళాడు. కామేశ్వరరావు కమిషనర్ నెమ్మదిగా గది బయటకు చేరారు. సర్వర్ మంచి నీళ్ళు లోపలికి తీసుకువెళ్తూ వీరిని చూసి ఏదో అనబోయాడు. కమిషనర్ నోటి మీద వేలుంచి "ష్" అన్నాడు. సర్వర్ తల ఊపి లోపలికి వెళ్లిపోయాడు. లోపల మాట్లాడుకుంటున్న వారి మాటలు బయటకు కొద్దిగా వినపడుతున్నాయి. సర్వర్ వచ్చేడని, వాళ్ళ మాటలు ఆపారు. ఇంతలో సర్వర్ బయటకు వచ్చేసాడు. 


కొత్తగా వచ్చిన వ్యక్తి, కమిషనర్ 'చేప' అని సంబోధించిన వ్యక్తి ప్రొఫెసర్ శ్యాం సుందర్. అతను మాట్లాడుతూ "శరత్ కు జ్ఞాపకశక్తి పోయింది. మరేం గాభరా లేదు. మీ ఇద్దరూ డబ్బు తీసుకొని ఒరిస్సా వెళ్లిపోండి. బిష్ణు పోలీసులకు దొరికిపోయాడు. వాడిని ఏదో విధంగా విడిపించాలి." అన్నాడు. శ్యాం సుందర్ ఎదురుగా ఉన్న వానపాములు రెండూ బినోయ్, జీతూలు.


"సార్! ఆ పిల్ల మీ మనిషని మాకు తెలియదు. మీకోసం బొర్రా వచ్చాము.  ఆ అమ్మాయి బొర్రా దగ్గర బిష్ణుతో గొడవ పడింది. అక్కడ నుంచి మీకు ఫోన్ చేసాము. మీకు ఫోన్ కలవలేదు. అరకు వెళ్తే అక్కడ బిష్ణు లవరు జలపాతంలో పడి చచ్చిపోయింది. భయం వేసి వెనకకు వచ్చేసాము. కానీ మీకు చెప్పి వెళితే మంచిదని మళ్లీ తిరిగి వచ్చాము. బిష్ణుకు మత్తు తలకెక్కితే అమ్మాయి కావాలి. రోడ్డు మీద ఆ పిల్లని చూడగానే మీ విషయం మర్చిపోయి, ఆ పిల్లని కిడ్నాప్ చేసి తీసుకు పోవాలనుకున్నాము.


కానీ పార్వతీపురంలో ఆ పిల్ల తప్పించుకుపోయింది. మీరేమో పోలీస్ రిపోర్టు ఇచ్చారు. మళ్లీ వచ్చి మీ దగ్గర తీసుకున్న మాల్ హాస్టల్ కుర్రాళ్ళకి ఇచ్చి వస్తూ ఉంటే ఆ శరత్ గాడు దాడి చేశాడు. నా కారుకు యాక్సిడెంట్ అయ్యింది. బిష్ణును అలాగే వదిలేసి పారిపోయాము. మళ్ళీ మీ సూచనలు వచ్చేవరకు దాగి ఉన్నాము. కానీ ఆ పోలీసులు మమ్మల్ని కనిపెట్టేశారు. ఎందుకో మళ్లీ వదిలేసారు. మీరు కూడా మమ్మల్ని పంపించేస్తే మేము ఒరిస్సా వెళ్ళిపోతాము సార్. మరి ఇటు రాము. మమ్మల్ని వదిలేయండి సార్! బిష్ణుని కూడా వదిలి పెట్టేయండి సార్." అంటూ చెప్పుకుపోయాడు బినోయ్. శ్యాం సుందర్ చేస్తున్న సైగలను పట్టించుకోలేదు.


సర్వర్ వీరు ఆర్డర్ ఇచ్చిన పదార్థాలు తెచ్చి టేబిల్ మీద పెట్టి బయటకు వచ్చేశాడు. కమీషనర్ ఫోన్ తీసి, ఎవరికో ఫోన్ చేసి, మాట్లాడకుండా పెట్టేసాడు.


"చూడు బినోయ్! ఈ విషయాలన్నీ నాకు తెలుసు. ఈ డబ్బు తీసుకోండి. బయట నా కారు ఉంది. ఆ కారుతో వెళ్లి ఆసుపత్రి దగ్గర బిష్ణును ఎక్కించుకొని, తీసుకొని వెళ్ళిపోండి. కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండండి. అన్ని చక్కపడ్డాక నేను పిలుస్తాను." అన్నాడు శ్యాంసుందర్.


"ఎక్కడికి వెళ్ళేది?" అంటూ కమిషనర్, కామేశ్వరరావు లోపలికి వచ్చారు. కమిషనర్ సూచనతో వచ్చిన పోలీసులు ప్రొఫెసర్ ను బినోయ్, జీతోలను చుట్టుముట్టారు. అందర్నీ స్టేషన్కు తీసుకువెళ్లారు. ప్రొఫెసర్ తో పాటు బినోయ్, జీతూ,  బిష్ణులకు కూడా ఛార్జి షీట్ రాసి, కేసు ఫైల్ చేశారు.


"మా పోలీసులు నెలల పాటు చేసే పరిశోధన మీ అడిస్ పుణ్యాన త్వరగా అయిపోయింది. శరత్ కు అభినందనలు. అన్నట్లు శరత్ పరిస్థితి ఏమిటి?" అన్నాడు కమీషనర్.


కామేశ్వరరావు ఫోన్ రింగ్ అయ్యింది. "ఊఁ, ఆఁ" అని మాట్లాడి ఫోన్ పెట్టేసాడు. కమీషనర్ వైపు తిరిగి, "వస్తున్నాడు, నువ్వే అడుగు" అన్నాడు.


కార్తీక, శరత్ కలిసి వచ్చారు. జైలు గదిలో ఉన్న ప్రొఫెసర్ ని చూసి కార్తీక "సర్, ఇదంతా చేసింది మీరా? పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పవలసిన మీరే మత్తుపదార్ధాలు విద్యార్థులకు అలవాటు చేస్తున్నారా? ఎందరు అమాయకులు నాశనమైపోతున్నారు? ఎన్ని జీవితాలు వాడిపోతున్నాయి? ఎన్ని కుటుంబాలు నాశనమైపోతున్నాయో గమనించారా? నేను చదివిన గ్రంథాలలో మత్తులో తేలిన వాడికి చదువు చెప్పను అన్నాడు గురువు. మన పురాణాలు, చరిత్ర గురువుకు ఇచ్చిన స్థానం అలాంటిది. మాయ చేసి విద్య నేర్చుకున్నాడు శిష్యుడు. కానీ మీరేం చేశారు?


గురువు ముసుగు వేసుకుని, పిల్లల్ని మత్తులో ముంచుతున్నారు. నన్ను కిడ్నాప్ చేసింది మీ మత్తుమందులు తిన్నవాళ్ళే అని తెలియక నా కోసం రిపోర్ట్ ఇచ్చి, మీ ఉరితాడు మీరే తగిలించుకున్నారు." శ్యాం సుందర్ వైపు అసహ్యంగా చూస్తూ, తిట్టిపోసింది కార్తీక. శ్యామ్ సుందర్ తల వంచుకున్నాడు. 


"తర్వాత ఏమిటి శరత్?" ప్రశ్నించాడు కమీషనర్. 


"కేస్ నెంబర్ 37 బి పూర్తి అయిపోయింది సర్. మీరు అనుమతిస్తే కొన్నాళ్ళు సెలవు తీసుకుంటాను." అన్నాడు శరత్.


"ఈ బి ఏంటి?" అడిగాడు కమీషనర్.


"కార్తీక కేసు 37 వది. తర్వాత చేపట్టిన కేసు బి." అన్నాడు కామేశ్వరరావు.


"నీ విషయం ఏమిటి కార్తీక?" అడిగాడు కమీషనర్.


"వాళ్ళ నాన్నగారు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానన్నారట సర్." అన్నాడు శరత్.


"అంతే కాదు సర్, నేను మరొక మంచి ప్రొఫెసర్ ని వెదుక్కోవాలి. పరిశోధన కొనసాగించాలి." అంది కార్తీక.


"చాలా సంతోషం కామేశ్వర్. మీ అడిస్ సహాయంతో మీరు ఇలాగే మరికొన్ని కేసులు పరిష్కరించి, మాకు సహాయపడతారని ఆశిస్తున్నాను." అంటూ కామేశ్వరరావు తో కరచాలనం చేసాడు కమీషనర్.


శరత్, కార్తీక, కామేశ్వరరావు బయటకు నడిచారు.


కారులో కూర్చున్నాక, "శరత్! చేప దొరికింది. శ్యాం సుందర్ కు మాల్ పంపిణీ చేస్తోంది ఎవరు? చిన్న చేపను పట్టుకున్నాం. పెద్దచేపలను, తిమింగలాలను వదిలేస్తున్నామేమో" అన్నాడు కామేశ్వరరావు.


"కేస్ నెంబర్ 37 సి మొదలు పెట్టాలా సర్?" అడిగాడు శరత్. ముగ్గురూ నవ్వుకున్నారు.


========================================================================

                                                       శుభం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి నాగమంజరి గుమ్మా గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page