top of page
Original_edited.jpg

కేస్ నెం 37 బి - పార్ట్ 12

  • Writer: Nagamanjari Gumma
    Nagamanjari Gumma
  • Nov 4
  • 7 min read

Updated: 7 days ago

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesInTelugu

ree

Case No. 37B - Part 12 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 04/11/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 12 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. 


కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక, తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్ తో సహా గీచి, శరత్ కు ఇస్తుంది. పరిశోధన కోసం అరకు వెళ్లిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది. పారిపోతున్న దుండగుల కారుకు యాక్సిడెంట్ అవుతుంది. ఒక వ్యక్తి ఫోన్ లోని కాల్ డేటా ఆధారంగా విచారణ ప్రారంభిస్తాడు శరత్. ప్రొఫెసర్ శ్యాం సుందర్ దగ్గర పనిచేసే ఇజాక్ కుటుంబం మత్తుమందు ప్రభావం వల్ల హాస్పిటల్ లో చేరుతారు. అరకులో యువతి మరణానికి కారణమైన వారిని విచారిస్తాడు శరత్.  


ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 12 చదవండి.. 


శరత్ అడిస్ కార్యాలయానికి వెళ్లి, తన పరిశోధనను రాసి పెట్టాడు. రికార్డ్ చేసిన టేపును నాలుగైదు టేపుల్లోకి ఎక్కించాడు. వివిధ ప్రదేశాల్లో భద్రపరచాడు. ఆ విషయాన్ని కోడ్ భాషలో రాసి పెట్టి, ఫైల్ మూసాడు. ఇంటికి బయలుదేరాడు శరత్. ఆఫీస్ కి తానున్న గది దగ్గరే కావడంతో నడిచే వస్తాడు శరత్. బిష్ణు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్న శరత్ పరిసరాలను గమనించలేదు. పక్కనుంచి బండి మీద వెళ్తున్న ఇద్దరిలో వెనక కూర్చున్న వ్యక్తి, చేతిలో ఉన్న ఇనుప కడ్డితో బలంగా శరత్ తలపై కొట్టాడు.


శరత్ తేరుకునే లోపే, బండి తిప్పి ఎదురుగా వచ్చి, మరో దెబ్బ రెండోవైపు వేసాడు ఆ వ్యక్తి. క్షణాల వ్యవధిలో తలకి రెండువైపులా దెబ్బ తగలడంతో, కిందపడి స్పృహ కోల్పోయాడు శరత్. తలకి తగిలిన గాయం నుంచి నెమ్మదిగా రక్తం కారుతోంది. ఆ దారంట పోయేవారు దాడిచేసిన వారిని అడ్డగించారు కానీ, వాళ్ళు ఆయుధాన్ని చూపి బెదిరించడంతో వదిలేశారు. ఒకరు ఆసుపత్రికి, పోలీసులకు ఫోన్ చేశారు. శరత్ ఎవరో తెలిసిన మరొకరు పరుగున పక్కనే ఉన్న అడిస్ కార్యాలయానికి వెళ్లి తెలియజేసారు. అడిస్ కార్యాలయం నుండి ఇద్దరు వ్యక్తులు వచ్చి, శరత్ ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు.


విషయం తెలుసుకున్న కామేశ్వరరావు కాస్త ఆలస్యంగా ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలో శరత్ గాయాలకు చికిత్స చేస్తున్న డాక్టర్ తో కామేశ్వరరావు మాట్లాడాడు. "కొట్టిన వ్యక్తులు శరత్ కు ప్రాణాపాయం కలగకుండా, గట్టి దెబ్బ మాత్రమే కొట్టారని, జ్ఞాపకశక్తికి ఏమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని, శరత్ కి స్పృహ వస్తే కానీ ఏ విషయం చెప్పలే"మని చెప్పాడు డాక్టర్.


కామేశ్వరరావుకు చిత్రంగా అనిపించింది. ఇదే ఆసుపత్రిలో కొద్ది గంటల క్రితం ఒక కేసు విషయమై పరిశోధన చేసిన శరత్, ఇప్పుడు తానే గాయపడి చికిత్స పొందుతున్నాడు. శరత్ కు జరిగిన సంఘటన గురించి కార్తీకకు చెప్పాలా వద్దా అని ఆలోచించాడు కామేశ్వరరావు. అవసరం లేదనుకుని ఊరుకున్నాడు. కార్తీక కేసు ఎప్పుడో మూసివేయబడింది. 


కామేశ్వరరావు విషయం తెలియగానే, ఆసుపత్రికి వచ్చే ముందే శరత్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. వారిద్దరూ దగ్గరే ఉన్న ఊరిలో ఉంటారు. విషయం తెలియగానే హడావిడిగా వచ్చారు. శరత్ ను చూసి ఎంతో బాధపడ్డారు. వారికి, తమ ఉద్యోగులిద్దరూ అక్కడే ఉన్నారని,  శరత్ ని చూసుకోమని, శరత్ కు స్పృహ వచ్చినా, ఏదైనా అవసరం అయినా, ఫోన్ చేయమని చెప్పి అడిస్ కార్యాలయానికి వెళ్ళాడు కామేశ్వరరావు. 


కార్యాలయం అంతా గందరగోళంగా ఉంది. వాచ్ మేన్, గుమస్తాలకు గాయాలై, స్పృహతప్పి పడి ఉన్నారు. వారిని వెంటనే దగ్గర లోని ఆసుపత్రికి పంపించాడు. అక్కడ ఉండే ఇద్దరు ఉద్యోగులు శరత్ ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కాబట్టి ఆఫీస్ లో ఎవరూ లేరు. శరత్ రాసిన రిపోర్టుల గురించి చూసాడు. దేనికోసమో వెతికినట్లు ఫైల్స్ ఉన్న అల్మరాలన్ని చిందరవందరగా ఉన్నాయి. ఇన్నేళ్ళ నుంచి అడిస్ నడుపుతున్నా ఇటువంటి సందర్భం ఎప్పుడూ ఎదురవలేదు.


ఆఫీస్ పై జరిగిన దాడికి పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీ గా ఫిర్యాదు చేశాడు కామేశ్వరరావు. శరత్ ఉన్న ఆసుపత్రికి ఫోన్ చేసి, అక్కడ ఉన్న సహోద్యోగులిద్దరిని రమ్మన్నాడు. వారు వచ్చిన తర్వాత చిందరవందరగా ఉన్న ఫైల్స్ అన్ని సర్దిపెట్టారు. ఒకసారి చూసిన విషయం మర్చిపోడు కామేశ్వరరావు. అందుచేత ఏ ఫైల్ ఎక్కడ ఉండాలో అలాగే అమర్చుకున్నాడు. 


అన్ని అమర్చగా ఒక ఫైల్ మిగిలిపోయింది. అది ఏ వరుసలో ఉండాల్సిన ఫైలో ఎంత ఆలోచించినా జ్ఞాపకం రాలేదు. ఫైల్ తెరచి చూసాడు. అన్ని తెల్లకాగితాలే. కానీ కొత్త ఫైల్ కాదు. పైన ఏ కేస్ నెంబర్ కూడా లేదు. ఫైల్  నలిగి ఉంది. అంటే వాడిన ఫైల్ అన్నమాట. నాలుగు కాగితాలు మాత్రమే ఉన్నాయి. ఆ ఫైల్ తెచ్చి టేబుల్ మీద పెట్టుకున్నాడు. 'తనకు తెలియకుండా ఒక సీక్రెట్ ఫైల్ ఆఫీస్ లో ఉందా? ఎవరు పెట్టేరు? ఏం రాసేరు? ఎలా డీకోడ్ అవుతుంది?' ఆలోచిస్తున్నాడు కామేశ్వరరావు.


అంతలో ఏదో ఆలోచన తోచింది. ఆఫీస్ సమయం పూర్తి అయ్యేవరకు ఏవో పనులతో కాలక్షేపం చేసాడు. అందరూ వెళ్లిపోగానే, తాను లోపలే ఉండి, నైట్ వాచ్ మేన్ ని బయట తాళం వేసేయమన్నాడు. అన్ని గదుల్లో లైట్లు, ఫ్యాన్ లు ఆపుచేసాడు. తన సెల్ ఫోన్ కూడా సైలెంట్ లో పెట్టాడు. అంగుళం మందం, ఆరు అంగుళాల పొడవున్న కొవ్వొత్తి వెలిగించి, ఆ వెలుగులో కొత్త ఫైల్ లోని తెల్ల కాగితాలు పరిశీలించడం ప్రారంభించాడు.


మొదట ఒక వైపు నిమ్మరసం రాసి చూసాడు. ఫలితం లేదు. కొద్దిగా వేడి సెగ చూపించాడు. లాభం లేదు. చాలా సేపు మథన పడిన తరువాత, పెన్సిల్ తో కాగితాన్ని ఒక మూల నుంచి నలుపు చేస్తూ వచ్చాడు. అక్షరాలు, అంకెలు కనబడసాగాయి. తెల్ల కాగితంపై తెల్లని పెన్ తో రాసిన అక్షరాలు అవి. అక్షరాలు మినహా మిగతా భాగం నలుపు కాగానే అక్షరాలు కనబడుతున్నాయి. గబగబా నలుపు దిద్దేపని పూర్తిచేశారు. చదివేసరికి అసలు విషయం బయటపడింది. 


కార్తీక కేసు తర్వాత శరత్ కొనసాగిస్తున్న పరిశోధన మొత్తం అక్కడ రాసిపెట్టాడు. అలాగే తాను రికార్డు చేసిన రీల్స్ కాపీలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అందులో చెప్పాడు. మొత్తం కేసంతా మల్లెపువ్వులా విడిపోయింది. అనుకోకుండా కార్తీక కిడ్నాప్ అయ్యింది. ప్రొఫెసర్ శ్యాంసుందర్ కార్తీక విషయంలో ఫిర్యాదు చేయకపోతే ఈ డొంకంతా కదిలేది కాదు… మొత్తానికి ఒక పెద్ద నేరం వెలుగులోకి రానుంది. అందుకే శరత్ మీద దాడి జరిగింది అనుకున్నాడు కామేశ్వరరావు. 


ఆ ఫైల్ లో చెప్పిన స్థలాలలో చూసాడు. టేపులు ఉన్నాయి. అన్నీ యధాతథంగా భద్రపరచి, ఈ ఫైల్ ను పూర్తి అయిపోయిన కేసుల ఫైల్ వరుసలో మధ్యలో దాచాడు. ఒళ్ళు విరుచుకుంటూ టైం చూసాడు. తెల్లవారుజాము నాలుగు గంటలయ్యింది. ఆవలిస్తూ, తలుపు తీయమని వాచ్ మేన్ కి చెప్పడానికి ఫోన్ తీసాడు. అప్పటికి హాస్పిటల్ నుంచి నాలుగు మిస్సెడ్ కాల్స్ ఉన్నాయి. వాచ్ మేన్ కి చెప్పి, తలుపు తీయించి, ఎవరూ చూడకుండా బయటకు వచ్చి, హాస్పిటల్ కు ఫోన్ చేసాడు. 


"శరత్ కు మెలకువ వచ్చింది, విషయం చెప్పాలని, త్వరగా ఆసుపత్రికి రమ్మని" చెప్పేరు. ఎక్కువ ఆలస్యం చేయకుండా, ఇంటికి వెళ్లి స్నానపానాదులు పూర్తిచేసుకుని, ఆసుపత్రికి బయలుదేరాడు కామేశ్వరరావు. శరత్ గదిలో ఒక నర్సు మాత్రమే ఉంది. కామేశ్వరరావును చూసి, డాక్టర్ ని పిలవడానికి వెళ్ళింది. శరత్ తలకు కట్టుతో కళ్ళు మూసుకునే ఉన్నాడు. శరత్ తల్లిదండ్రులు సందర్శకులు కూర్చునే గదిలో ఉన్నారు. "శరత్…" పిలిచాడు కామేశ్వరరావు. శరత్ లో కదలిక లేదు. ఇంతలో డాక్టర్ వచ్చాడు. 


"చెప్పండి డాక్టర్" అన్నాడు కామేశ్వరరావు.


 "శరత్ కు ఇంతకు ముందు ఎప్పుడైనా తలకు గాయమయ్యిందా?" ప్రశ్నించాడు డాక్టర్.


"రెండు, మూడు  రోజుల కిందట అనుకుంటాను డాక్టర్, ఆగి ఉన్న కారులోంచి తోసేస్తే, తల డివైడర్ కి కొట్టుకొని కాసేపు దిమ్మెక్కినట్లు అయ్యింది అన్నాడు శరత్" చెప్పాడు కామేశ్వరరావు.


"ఓహో. మళ్ళీ ఇప్పుడు తలకు రెండు వైపులా బలమైన దెబ్బలు తగిలాయి. స్కాన్ కూడా తీసాము. ఫ్రాక్చర్స్ ఏమి లేవు కానీ, శరత్ ఎవరిని గుర్తు పట్టడం లేదు." చెప్పాడు డాక్టర్.


కామేశ్వరరావు తట్టుకోలేక పోయాడు. గభాలున అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు. నర్స్ వెంటనే మంచినీళ్లు ఇచ్చింది. తాగి, తెప్పరిల్లి, "ఇది నిజమేనా డాక్టర్" అని అడిగాడు.


"ఇప్పటివరకు శరత్ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. మీకే మొదట చెప్తున్నాను. కావాలంటే పరీక్షించుకోండి" అన్నాడు డాక్టరు


డాక్టర్ నిజమే చెప్తాడని తెలిసినా "శరత్…" పిలిచాడు కామేశ్వరరావు. శరత్ కళ్ళు తెరవలేదు. మళ్ళీ పిలిచాడు. ఉహు… బయటకు వెళ్లి, సందర్శకుల గదిలో ఉన్న శరత్ తల్లిదండ్రులను తీసుకువచ్చాడు. శరత్ కు స్పృహ వచ్చిందని, పలకరించమని చెప్పాడు. వాళ్ళు కూడా వచ్చి పిలిచారు. అబ్బే. 


డాక్టర్ శరత్ ను తట్టి పిలిచాడు. శరత్ కళ్ళు తెరిచి చూసాడు. 


"శరత్ మీ అమ్మ, నాన్న వచ్చారు. మీ బాస్ కూడా వచ్చారు. విష్ చెయ్యి" అన్నాడు డాక్టర్. 


శరత్ అభావంగా చూస్తూ ఉండిపోయాడు. 

"అయ్యో! నేనే అనవసరంగా ఈ పరిశోధన కొనసాగించమన్నాను. శరత్ కు ఇంతటి పరిస్థితి ఏర్పడటానికి నేనే కారణం. మన్నించండి అమ్మా." అని శరత్ తల్లి చేతులు పట్టుకుని వలవలా ఏడ్చేశాడు కామేశ్వరరావు. అంత పెద్ద అధికారి అలా ఏడుస్తూ ఉంటే శరత్ తల్లిదండ్రులు ఏమి మాట్లాడలేకపోయారు.


"ఎంత ఖర్చు అయినా నేను భరిస్తాను. శరత్ కు మంచి వైద్యం చేయిస్తాను" అన్నాడు కామేశ్వరరావు. డాక్టర్, కామేశ్వరరావు భుజం తట్టి బయటకు వెళ్ళిపోయాడు. కళ్ళు తుడుచుకుంటూ శరత్ తల్లిదండ్రులు కూడా బయటకు వెళ్లిపోయారు. నర్స్ కూడా బయటకు వెళ్ళిపోయింది.


*********


"నటవిట గాయక గణికా" పద్యం వల్లెవేస్తూ నిద్రలేచింది కార్తీక. 


"నిద్రలో కూడా అవే కలవరింతలా?" కాఫీ తీసుకుని వచ్చిన తల్లి అడిగింది కార్తీకని.


"అమ్మా! ఇందీవరాక్షుడు గంధర్వుడు. ఏ రూపమైనా ధరిస్తాడు. ఎవరితోనైనా తిరుగుతాడు. వాడికి ఆయుర్వేదాన్ని నేర్పను అని బ్రహ్మమిత్రునికి ఎందుకంత మొండి పట్టుదల? సరే మాయోపాయంతో విద్య నేర్చుకున్నాడు, ఆ విషయాన్ని గొప్పగా, వెక్కిరిస్తూ గురువుగారికి ఎందుకు చెప్పాలి? గురువు గారేమో రాక్షసుడవు కమ్మని ఎందుకు శపించాలి? చెప్పవా అమ్మా…"


"తెల్లారిందా? రాత్రి ఏదో పుస్తకం చదువుతూ నిద్రపోతావు. కలలో అవే విషయాలు కనిపిస్తాయో ఏమో? సందేహంతో నిద్రలేస్తావు. ముందు ముఖం కడుక్కుని, కాఫీ తాగి కిందకు రా. నీ సందేహాలు నాన్నగారి అడుగు. నాకు పని ఉంది" అని వెళ్ళిపోయింది విశాలాక్షి.


"హుఁ బోలెడన్ని పురాణాలు చదువుతుంది. ఏదైనా అడిగితే మాత్రం… నాకు తెలీదు, మీ నాన్నగారిని అడుగు అని తప్పించుకుంటుంది" ఉక్రోషంగా అంటూ ముఖం కడుక్కొని వచ్చింది. కాఫీ తాగి, కిందకు వచ్చింది. తండ్రిని అదే ప్రశ్న అడిగింది.


"బ్రహ్మమిత్రుడు జ్ఞాని, మహర్షి, ఆయుర్వేద రహస్యాలు తెలిసిన వైద్య గురువు. ఏ విద్య అయినా నేర్చుకోడానికి కొన్ని అర్హతలుంటాయి. ఆసక్తి ఉంది కదా అని అందరికి విద్య బోధిస్తే, కొందరు మాత్రమే సద్వినియోగం చేస్తారు. కొందరు నేర్చుకున్న విద్య వదిలేసి, కొత్త ఉపాధులు వెతుక్కుని, నిరుపయోగం చేస్తారు. మరికొందరు అనవసర ప్రయోగాలు చేసి దుర్వినియోగం చేస్తారు. అందుకే గంధర్వుడు అయిన ఇందీవరాక్షునికి ఆయుర్వేద విద్య నేర్పను అన్నాడు బ్రహ్మమిత్రుడు." వివరంగా చెప్పాడు సత్యనారాయణ.


అడగడమైతే అడిగింది కానీ, ఏదో ఆలోచిస్తోంది కార్తీక. "బొర్రా గుహల దగ్గర ముగ్గురు అబ్బాయిలని, ఒక అమ్మాయిని చూసింది. వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించారు. బయటకు వచ్చిన తర్వాత కూడా వెళ్లిపోకుండా…కారు దగ్గరే  ఎవరి కోసం ఎదురుచూస్తూన్నట్లు?" తల విదిలించింది కార్తీక.


**************

కార్తీకకు ఏదో జ్ఞాపకం వస్తున్నట్లు ఉంది. కానీ పోల్చలేకపోతోంది. డైరీ తీసి ఆనాటి చిత్రం తీసి చూసింది. ఆ చిత్రంలో కారు దగ్గర ఇద్దరు యువకులు, మెట్ల మీద మరో యువకుడు యువతి, వారి వెనుక ఇంకొంచెం దూరంలో కూలి యువకునితో మరొక యువతి, గుహలలోకి దిగే దారి, అక్కడ కొందరు మనుషులు, ఒకరు చేయి ఊపుతున్నారు. కొందరు లోపలికి వెళ్లేవారు, కొందరు బయటకు వచ్చేవారు… అంతే… ఇదే ఆ చిత్రం. కారుపై నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ విషయం తనకు జ్ఞాపకమే లేదు. కానీ ఇక్కడ బొమ్మలో ఉంది. అలాగే ఇంకేదైనా విషయం తన మెదడు పొరలలో ఉండిపోయిందా? ఆలోచించి బుర్ర వేడెక్కి పోయింది. 


ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే కామేశ్వరరావు గారు. పొద్దుపొద్దున్నే ఎందుకు ఫోన్ చేసారబ్బా? అనుకుంటూ ఫోన్ ఎత్తింది."నిన్న రాత్రి శరత్ కు ఏక్సిడెంట్ అయ్యిందని, ప్రాణాపాయం లేదు కానీ, జ్ఞాపకశక్తి పోయినట్లు అనుమానం గా ఉందని, ఒకసారి కార్తీక వస్తే చూసి నిర్ధారణ చేయవచ్చునని, అలాగే ప్రొఫెసర్ గారికి కూడా చెప్పి తీసుకురమ్మని" చెప్పేరు. 


కార్తీక నిశ్చేష్టురాలయ్యింది. "కంగారు పడే పని లేదని, శరత్ కు చికిత్స జరుగుతోందని, శరత్ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారని, నెమ్మదిగా రమ్మని" చెప్పేరు. 


కార్తీక వెంటనే శరత్ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ప్రొఫెసర్ కి ఫోన్ చేసింది. సత్యనారాయణ, విశాలాక్షి తాము కూడా ఆసుపత్రికి వస్తామన్నారు. శరత్ తల్లిదండ్రుల కోసం టీ, టిఫిన్ తయారుచేసింది విశాలాక్షి. అందరూ టిఫిన్ చేసేసరికి ప్రొఫెసర్ గారు కూడా వస్తున్నట్లు తెలియజేసారు. ప్రొఫెసర్ గారి కారులో అందరూ బయలుదేరారు.


========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page