కేస్ నెం 37 బి - పార్ట్ 9
- Nagamanjari Gumma 
- Oct 17
- 6 min read
Updated: Oct 23
#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesInTelugu

Case No. 37B - Part 9 - New Telugu Web Series Written By Nagamanjari Gumma
Published In manatelugukathalu.com On 17/10/2025
కేస్ నెం. 37 బి - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక
రచన: నాగమంజరి గుమ్మా
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. శరత్ కూడా విజయవాడకు వస్తాడు. కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక, తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్ తో సహా గీచి, శరత్ కు ఇస్తుంది.పరిశోధన కోసం అరకు వెళ్లిన శరత్ తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా విశాఖ దగ్గర ఆ కారు కనిపిస్తుంది.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
కేస్ నెం. 37 బి - పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేస్ నెం. 37 బి - పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేస్ నెం. 37 బి - పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేస్ నెం. 37 బి - పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేస్ నెం. 37 బి - పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కేస్ నెం. 37 బి - పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 9 చదవండి..
కారు యూనివర్సిటీలో ప్రవేశించింది. కారు దిగి ముగ్గురు యువకులు అబ్బాయిల వసతిగృహం వైపు వెళ్లడం చూసి, ఆటోకి డబ్బులు ఇచ్చేసి పంపేసాడు. ఆ యువకులను అనుసరిస్తూ వసతిగృహం వరకు వెళ్లి బయటే ఆగిపోయాడు. కారు హాస్టల్ ముందు ఆగి ఉంది. ఖాళీగా ఉంది. అందరూ లోపలికి వెళ్లినట్లు ఉన్నారు. అంతలో వారిలో ఒకడు బయటకు వచ్చాడు. శరత్ చెట్టు చాటుకు వెళ్ళాడు.
తన దగ్గర ఉన్న ఫోటోలలో చూసిన ముగ్గురిలో ఒకడు. డ్రైవింగ్ చేసిన యువకుడు. ఆ యువకుడు కారు డిక్కీ తీసి, ఒక బేగ్ తీసుకుని భుజాన వేసుకుని లోపలకు వెళ్ళాడు. అరగంటలో ముగ్గురూ తిరిగి వచ్చారు. వెళ్తున్నప్పుడు బరువుగా ఉన్న ఆ బేగ్ ఇప్పుడు తేలిగ్గా ఉంది. ఇద్దరు కారులో ముందు కూర్చున్నారు. మూడో వాడు తూలుతూనే ఉన్నాడు. వెనకసీటులో కూర్చున్నాడు. ముగ్గురిని పోల్చుకున్నాడు శరత్. కారు కదిలే లోపు గబగబా వచ్చి కారుకు అడ్డంగా నిలబడ్డాడు. డ్రైవర్ వైపు వెళ్లి, మర్యాదగా కారు ఆపమని చెప్పి, వెనక తలుపు తెరిచి, తూలుతున్న వాడి పక్కన కూర్చున్నాడు శరత్.
"ఏయ్! ఎవరు నువ్వు? ఈ దౌర్జన్యం ఏమిటి?" అడిగాడు డ్రైవింగ్ చేస్తున్నవాడు.
"అరిస్తే పీక కోస్తాను… మీరు, మీరు చేస్తున్న వెధవ పనులు అన్ని తెలుసు. ముందు నేను చెప్పిన చోటికి కారు పోనివ్వండి." అంటూ లాగిపెట్టి ముగ్గురికి తలొకటి వడ్డించాడు.
ఇంతలో అనుకోని సంఘటన…
శరత్ పక్కన ఉన్న, మత్తులో తూలుతున్న యువకుడు శరత్ ను పీక పట్టి గట్టిగా కారులో నుండి తోసేశాడు. శరత్ ఎక్కినపుడు కారు తలుపు పూర్తిగా ముయ్యలేదేమో, కారులో నుండి శరత్ బయటకు పడిపోయాడు. వెంటనే తలుపు మూసి "పోనీరా" అన్నాడు వాడు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడు వెంటనే కారును ముందుకు పోనిచ్చాడు.
విసురుగా నేలపై పడడంతో తల పక్కనే ఉన్న పేవ్ మెంటుకు గుద్దుకొని, దిమ్మెక్కిపోయింది శరత్ కి. కాసేపు అచేతనంగా ఉండిపోయాడు.
******
కాసేపటికి తేరుకున్న శరత్ లేచి తలవిదిలించాడు. ఫోన్ తీసి, కామేశ్వరరావు గారికి ఫోన్ చేసి, "విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులను నల్ల అంబాసిడర్ కారు విషయంలో అప్రమత్తం చేయమని, వాళ్ళు యూనివర్సిటీ తాలూకు అబ్బాయిల వసతిగృహం నుండి తనను కొట్టి వెళ్లిపోయారని, ఎటు వెళ్లిందీ చూడలేదని" చెప్పాడు.
అక్కడ నుంచి బయలుదేరి, యూనివర్సిటీ బయటకు వచ్చాడు. సొంత వాహనం ఉపయోగించడానికి ఇష్టపడడు శరత్. వీలైనంత వరకు బస్సులు, రైళ్లు, ఆటోలలోనే ప్రయాణిస్తాడు. నలుగురూ మాట్లాడుకునే విషయాల వలన తనకు కావలసిన సమాచారం అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఆటో వాళ్ళని నల్ల అంబాసిడర్ కారు ఎటు వెళ్లిందో కనుక్కున్నాడు. దాదాపు అందరూ "ఇప్పుడే వచ్చామని, కార్ ని చూడలేదని" చెప్పారు. ఒక డ్రైవర్ అప్పుడే టీ తాగి ఇటు వచ్చి, శరత్ విచారణ విన్నాడు. తాను నల్ల అంబాసిడర్ కారుని హనుమంతవాక వైపు వెళ్లడం చూశానన్నాడు.
వెంటనే అటు వెళ్లే ఆటో పట్టుకుని వెళ్ళాడు శరత్. హనుమంతవాక వరకు వెళ్ళకుండానే జనం గుమిగూడి ఉండటం చూసి, ఆటో ఆపించేడు శరత్. నల్ల అంబాసిడర్ డివైడర్ కి గుద్దుకొని ఆక్సిడెంట్ కి గురై పడి ఉంది. వెనుక సీట్ లో ఉన్న వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకోని కారణంగా గాయాలు తగిలి, తలుపు సగం తెరుచుకొని, చేతులు బయటకు వేసి, స్పృహ లేని స్థితిలో పడి ఉన్నాడు. మిగతా ఇద్దరి ఆచూకీ లేదు. కార్ తలుపులు తెరిచి ఉన్నాయి. అక్కడ గుమిగూడిన వారిని మిగతా ఇద్దరి గురించి ప్రశ్నించాడు.
కారు డివైడర్ కి గుద్దుకోగానే తలుపులు తెరిచి ఇద్దరు వ్యక్తులు పారిపోయారని, ఇక్కడికి వచ్చి చూస్తే ఈ వ్యక్తి గాయాలతో పడి ఉన్నాడని చెప్పేరు. అంబులెన్స్ కి, పోలీస్ వారికి ఫోన్ చేసి చెప్పి, కార్ ముందు భాగంలో చూసాడు. అద్దాలు విరిగి ఉన్నాయి. స్టీరింగ్ మీద నెత్తుటి చారికలు ఉన్నాయి. కాబట్టి డ్రైవింగ్ చేసినవాడికి గాయాలు తగిలినట్లు గుర్తించాడు. దగ్గరలో ఏవైనా ఆసుపత్రులు ఉన్నాయేమో విచారించాడు. ఈలోగా అంబులెన్స్, పోలీస్ జీప్ వచ్చాయి.
"ఈ యువకుడు కొన్ని నేరాలలో సంబంధం ఉన్నవాడని, జాగ్రత్తగా చూడమని, తమ చీఫ్ కామేశ్వరరావు గారు వచ్చి అన్ని విషయాలు తెలియజేస్తారని" పోలీస్ వారికి చెప్పాడు శరత్. గాయపడిన యువకుణ్ణి కె.జి.హెచ్ కు తరలించారు. ప్రాథమిక దర్యాప్తు అనంతరం కారును కూడా అక్కడ నుంచి తీసేసారు.
చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ అన్ని వెతికాడు శరత్. ఒక ఆసుపత్రిలో ఆచూకీ కాస్త దొరికింది. శరత్ చూపించిన ఫోటోలోని యువకుల్లో "ఒకడికి నుదుటికి గాజుపెంకులు గీసుకున్న గాయాలు అయ్యాయని, 'కారుతో డివైడర్ గుద్దుకున్నామని చెప్పేరని, కారు అద్దం పగిలి పెంకులు నుదుటికి గుచ్చుకున్నాయని' చెప్పడంతో ప్రాథమిక చికిత్స చేసి, కుట్లు వేసి పంపేమని" ఆసుపత్రిలో చెప్పేరు. "కానీ వాళ్ళు ఎటువైపు వెళ్ళేరో గమనించలేదు" అన్నారు.
బయటకు వెళ్లి అక్కడ ఉన్న ఆటో, కార్లు మొదలైన డ్రైవర్లను విచారించాడు శరత్. ఒక కారు మాట్లాడుకున్నారని, విశాఖపట్నం వైపు వెళ్ళేరని చెప్పేడు.
అంటే వాళ్ళు విశాఖపట్నం లోనే ఉన్నారా? తనను తప్పుదారి పట్టించారా? లేదా వేరే ప్రయాణ సాధనాలతో ఒరిస్సా వెళ్ళారా? ఏదేమైనా తన దృష్టి నుంచి ప్రస్తుతానికి తప్పించుకోవచ్చు… కానీ వాళ్లని పట్టుకొని విషయం తెలుసుకోనిదే విడిచిపెట్టే ప్రసక్తి లేదు, అనుకొని మళ్ళీ వెనుదిరిగి కేజీహెచ్ వైపుగా వెళ్ళాడు.
బయట నిలబడున్న పోలీస్ ని అడిగి, ఆక్సిడెంట్ లో గాయపడిన యువకుడిని ఏ వార్డులో చేర్చేరో కనుక్కున్నాడు. అక్కడకు వెళ్లి ఆ యువకుడికి చికిత్స చేసిన డాక్టర్ ని కలిసాడు. డాక్టర్ శరత్ కు నివ్వెరపోయే నిజాలు తెలియజేశాడు. నిజానికి ఆ యువకుడు పూర్తిగా మత్తుమందులకు బానిస. రక్తంలో అణువణువు మత్తుమందులతో నిండిపోయి ఉంది. విరుగుడు లేదా నివారణ చర్యలు కూడా కష్టమే. మత్తులో ఉండగానే అతని తలకు సీట్ కొట్టుకోవడంతో స్పృహ తప్పి, దాదాపు కోమా స్టేజిలో ఉన్నట్లు తెలియజేశాడు. ఎప్పుడు స్పృహ వస్తుందో చెప్పలేని స్థితిలో ఉన్నాడు.
అక్కడ నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి, ఎస్సైని కలిసి, వారి కారులో దొరికిన వస్తువులను పరిశీలించాడు. ఒక చిన్న పుస్తకంలో ఏవో అంకెలు, పేర్లు ఉన్నాయి. ఎస్సై చూడకుండా ఆ పుస్తకాన్ని తన జేబు లోనికి పంపించేసాడు. ఇంకా వెతకగా బేగ్ ని అంటుకొని తెల్లని పొడి ఉంది. వాళ్ళ పేర్లు వివరాలు తెలియలేదు. అంతలో ఒక విషయం గుర్తొచ్చింది శరత్ కి. స్పృహ తప్పినవాడి సెల్ ఫోన్ ఉండాలి కదా… అడిగాడు ఎస్సై ని. ఫోన్ లాక్ ఉందని, మర్నాడు మెకానిక్ కి చూపించాలని దాచి ఉంచేనని, సొరుగులో నుంచి తీసి ఇచ్చాడు.
సిగ్నల్ కోసం వచ్చినట్లు బయటకు వచ్చి, ఫోన్ ని జాగ్రత్తగా పరిశీలించి, లాక్ ఓపెన్ చేసాడు శరత్. కానీ ఆ విషయం ఎస్సై కి తెలియనివ్వలేదు. కాల్ రిజిస్టర్ చూసి పేర్లు, నెంబర్లు ఆ చిన్న పుస్తకం లో నోట్ చేసుకున్నాడు. తన ఫోన్ కి ఫోన్ చేసి, ఆ ఫోన్ నెంబర్ కూడా రాసుకున్నాడు. ఇంతలో కానిస్టేబుల్ వచ్చి ఎస్సై గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. ఫోన్ మళ్ళీ లాక్ చేసి, ఓపెన్ అవనట్లుగా ముఖం పెట్టుకుని వచ్చాడు. "రేపు ఫోన్ ని మెకానిక్ చూశాక, నాకు ఓసారి ఫోన్ చేయండి. ఫోన్ లో ఏవైనా వివరాలు దొరకవచ్చు." అని చెప్పి వచ్చేశాడు శరత్.
అడిస్ ఆఫీస్ కు వచ్చాడు శరత్. పోలీస్ స్టేషన్ లో సంపాదించిన చిన్న పుస్తకం తీసి, వాటిలో ఉన్న పేర్లు, అంకెలు పరిశీలించాడు శరత్. అలాగే కాల్ రిజిస్టర్ లో ఉన్న పేర్లు కూడా పరిశీలించాడు. ఆ పేర్లన్నీ ఒక లిస్ట్ రాసాడు. కొన్ని పేర్లు క్రమం తప్పకుండా ఎక్కువసార్లు వచ్చి ఉన్నాయి. అసలు విషయం తెలియకుండా ఒక నిర్ధారణకు రాకూడదని ఊరుకున్నాడు.
కామేశ్వరరావు గారికి ఆరోజు పరిశోధన వివరాలు రాసి, ఫైల్ లో పెట్టాడు. మళ్ళీ యూనివర్సిటీ అబ్బాయిల హాస్టల్ కు వెళ్ళాడు. తన పుస్తకం లో ఉన్న పేర్లలో ఎక్కువ సార్లు కనిపించిన పేర్లు జ్ఞాపకం పెట్టుకుని ఆ యువకుల కోసం అడిగాడు. వాళ్ళు ఉంటున్న బ్లాక్ వైపు చూపించాడో యువకుడు. అక్కడికి వెళ్లి, ఆ పేర్లు గల యువకుల కోసం మళ్ళీ అడిగాడు. వారు ఉంటున్న గది చూపించారు. తలుపు కొట్టాడు శరత్.
ఎవరూ పలకలేదు. మళ్ళీ కొట్టాడు. ఈసారి తలుపును కాస్త నెట్టాడు. తెరుచుకుంది. లోపల నలుగురు యువకులు అడ్డదిడ్డంగా పడి నిద్రపోతున్నారు. కదిపి చూసాడు. ఒక్కరికి కూడా ఒంటి మీద స్పృహ ఉన్నట్లు లేదు. వారందరూ మాదకద్రవ్యాలు ఉపయోగించారని అర్ధమయ్యింది. ఇది చాలా పెద్ద కేస్ అయ్యేలా ఉంది. కామేశ్వరరావు గారికి ఫోన్ చేసి విషయమంతా వివరించాడు శరత్.
"ఇంకా చాలామంది మాదకద్రవ్యాలు తీసుకొని ఉండవచ్చునని, వారిని కనిపెట్టాలా? వద్దా? ఈ యువకులను ఏం చేయాలి?" అని అడిగాడు.
"ఆ పేర్లు తనకు ఇవ్వమని, ఆ విషయం తాను చూసుకుంటానని" చెప్పేడు కామేశ్వరరావు.
వారిని అలా వదిలేసి, వారి వస్తువులు అన్నీ వెతికాడు. ఫోన్ లలో ఉన్న నెంబర్లు, సందేశాలు మొదలైనవన్ని నోట్ చేసుకున్నాడు. ఒకసారి వారి వైపు జాలిగా చూసి, బయటకు వచ్చేశాడు శరత్. కామేశ్వరరావు గారికి మొదటి ఫోన్ లో, పుస్తకంలో, ఇప్పుడు వీరి ఫోన్ లో దొరికిన విషయాలు అన్ని మెసేజులుగా పంపేసాడు. అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్లి రిపోర్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాడు శరత్.
========================================================================
ఇంకా వుంది..
========================================================================
నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
పేరు: నాగమంజరి గుమ్మా
భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు
వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని
నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా
ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.
వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం.
విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం
పురాణ ప్రవచనం చేయడం
రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.
విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.



@lavanyadv2782
•10 hours ago
👌👌👌