top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 7

Updated: 4 days ago

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesInTelugu

ree

Case No. 37B - Part 7 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 07/10/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 7 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. కార్తీక పేరెంట్స్ ఇచ్చిన పబ్లిక్ బూత్ నంబర్ విజయవాడకు చెందినదని తెలుసుకొని, శరత్ కూడా విజయవాడకు వస్తాడు. ఆ టెలిఫోన్ బూత్ పక్కనే ఉన్న టీ కొట్టు అతను చెప్పిన వివరాలనుబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ లో కార్తీక కోసం వెతుకుతాడు. మొత్తానికి కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు.


ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 7 చదవండి.. 


మరునాడు ఉదయమే కార్తీకకు ఫోన్ చేద్దామని చేతిలోకి ఫోన్ తీసుకున్నాడు శరత్. ఇంతలో కార్తీక నుండి ఫోన్ వచ్చింది. 


"హలో.. శుభోదయం కార్తీక గారు. మీకే ఫోన్ చేద్దామనుకుంటూ ఉండగానే మీరే చేశారు. ఏమిటి విషయం?" అడిగాడు శరత్. 


"హలో శరత్ గారు, శుభోదయం. బీచ్ కి వాకింగ్ కి వచ్చాను. మీరు డైరీ విషయం మాట్లాడాలన్నారు కదా, వీలైతే వస్తారేమో, కనుక్కుందామని ఫోన్ చేసాను" అంది కార్తీక. 


"సరేనండి. ఇప్పుడే బయలుదేరుతున్నాను. " చెప్పి, ఫోన్ పెట్టేసి, గబగబా తయారై బీచ్ కు బయలుదేరాడు శరత్. 


కార్తీక అప్పటికే నడక పూర్తిచేసి విశ్రాంతిగా ఇసుకలో కూర్చుంది. అలలు పాదాలను గిలిగింతలు పెడుతూ తాకుతున్నాయి. నడుస్తున్నవారిలో కార్తీకను వెతుకుతూ వస్తున్న శరత్ ను చూసి, అరిచి పిలిస్తే బాగోదని, ఫోన్ చేసి "ఇక్కడున్నాను, రమ్మని" చెప్పింది కార్తీక. 


శరత్ వచ్చి కూర్చుంటూ "చాలాసేపు అయ్యిందా వచ్చి?" అన్నాడు. 


"అవును, సూర్యోదయానికి ముందే వాకింగ్ అలవాటు. అంతలో మీరు చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి ఫోన్ చేసాను" అంది కార్తీక. 


"మీకు చిత్రలేఖనం వచ్చుననుకుంటాను" అన్నాడు శరత్. 


"ఏదో అలా హాబీగా గీస్తూ ఉంటాను. ప్రవేశమే కానీ ప్రావీణ్యత లేదు. కానీ చరిత్ర అంటే ఇష్టం వలన ప్రఖ్యాత భారతీయ రాజవంశాల పతాకాలు, పురాణ కాలం నాటి పతాకాలు కొన్ని సేకరించి చిత్రించాను. " చెప్పింది కార్తీక. 


"చూసాను. మీ డైరీ లో కూడా రాతలో కాకుండా బొమ్మల లోనే ఉన్నాయి విషయాలు. నాకు తీరిగ్గా చూసే అవకాశం లేకపోయింది. డీకోడ్ చేయలేదు. " చెప్తూ నవ్వేసాడు శరత్. 


"రండి, ఇంటికి వెళదాం" ఎండ పెరగడంతో లేచింది కార్తీక. శరత్ కూడా లేచి కార్తీకను అనుసరించాడు. ఇద్దరూ బీచ్ నుండి బయటకు వచ్చి, తమ వాహనాలు ఆపి ఉన్నచోటకు వచ్చారు. "ఓ.. మీరు కూడా బండి మీదనే వచ్చారా?" అన్నాడు శరత్. తలవూపింది కార్తీక. ఇద్దరూ బయలుదేరి కార్తీక ఇంటికి చేరుకున్నారు. 


మామిడిచెట్టు కింద ఉన్న కుర్చీలలో సత్యనారాయణ కూర్చుని దినపత్రిక చదువుతున్నారు. కార్తీక, శరత్ రావడం చూసి, దినపత్రిక మడుస్తూ, "కూర్చో బాబూ" అన్నారు. కార్తీక "డైరీ తీసుకువస్తాను" అంటూ లోపలికి వెళ్తూ, "అమ్మా! శరత్ వచ్చారు, కాఫీ తీసుకురా" అని కేకేసింది. ఒక చేతితో మంచినీళ్ల సీసా, మరో చేతితో డైరీ తీసుకువచ్చింది. 


ముందుగా మంచి నీళ్ళు ఇచ్చి, డైరీని టీపాయ్ మీద పెట్టింది. శరత్ కాసిని మంచినీళ్లు తాగాడు. ఈలోగా విశాలాక్షి నలుగురికి కాఫీలు తీసుకుని వచ్చింది. కాఫీ తాగుతూ, కుశల ప్రశ్నలు, కార్తీకను తీసుకువచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు చెప్పడాలు అయ్యేయి. శరత్ నవ్వుతూ.. "నేనెక్కడ మీ అమ్మాయిని పట్టుకున్నానండీ? మీ అమ్మాయే నా బేగ్ పట్టుకుంది" అన్నాడు. 


"సరేలే. ఆ అబ్బాయి ఏదో విషయం మాట్లాడటానికి వచ్చాడు. మనం ఉంటే ఇలాగే కబుర్లాడుతాం. లోపలికి పద" అన్నాడు సత్యనారాయణ. 


"పర్వాలేదండీ. మీరు కూర్చోండి. మేం మాట్లాడుకుంటాం. " అంటూ డైరీ తీసి "ఇప్పుడు మాత్రం మీ అనుమతి తోనే సుమా" అన్నాడు శరత్ కార్తీక వైపు చూస్తూ. 


"ఊఁ. కానీయండి. " అంది కార్తీక


తెల్లకాగితాలు, పెన్సిల్, రబ్బరు తెచ్చి పెట్టింది కార్తీక. అవసరం లేదనుకున్న పేజీలు తిప్పేసాడు. ఒక పేజీ దగ్గర ఆగాడు. ఆ పేజీలో ఒక పుస్తకం, చేతులు పట్టుకున్న ఇద్దరు పిల్లల బొమ్మలు ఉన్నాయి. అది చూసి, కాసేపు ఆలోచించి, "ఈరోజు కొత్త పుస్తకం కొన్నాను. అంటే కొత్త స్నేహితుడు లభించినట్లు" అని రాసాడు శరత్. 


చప్పట్లు కొట్టింది కార్తీక. "అద్భుతం, భలే రాసారు. ఇంకా ప్రయత్నించండి. " ఉత్సాహపరిచింది కార్తీక. “నిజమే ఆరోజు పెద్దనామాత్యుడు రచించిన ‘మనుచరిత్ర’ కొన్నాను. ” చెప్పింది. 


మరి కొన్ని పేజీలు తిప్పాడు. ఒక పేజీలో వరుసగా ఒక కొండ - శిశువు, చిన్న పాప, ఐదు తలల స్త్రీమూర్తి, ముగ్గురు స్త్రీలు, పుస్తకం - వీణ, అన్నం వడ్డిస్తున్న స్త్రీ మూర్తి, డబ్బులతో నిండిన పళ్లెం, పులి - త్రిశూలం, ఎర్రని ముఖం - ఎద్దు - సింహం, పది చేతులలో పదిరకాల వస్తువులు పట్టుకున్న స్త్రీమూర్తి చిత్రం ఒకదాని కింద మరొకటిగా మూడు పేజీలలో ఉన్నాయి. 


శరత్ లెక్కపెట్టాడు. మొత్తం పది చిత్రాలు ఉన్నాయి. మొదటిది కొండ అంటే పర్వతం, పక్కనే శిశువు అంటే పార్వతి. తర్వాత చిన్న పాప అంటే బాల, మూడవది గాయత్రి, తర్వాత సరస్వతి.. మరోసారి చిత్రాల వరుస లెక్కపెట్టాడు శరత్. పది ఉన్నాయి. "అయితే ఇవి అమ్మవారి దసరా నవరాత్రుల రూపాలు. ఒకటి శైలపుత్రి, రెండవది బాలాత్రిపురసుందరి, మూడవది ఐదు శిరసులతో గాయత్రి దేవి, నాలుగవది ముగ్గురు స్త్రీలు అంటే లలితాదేవి సచామర రమావాణి సవ్య దక్షిణ సేవితా.. , ఐదవ చిత్రం సరస్వతి దేవి, ఆరవది అన్నపూర్ణ దేవి, ఏడవ చిత్రం లక్ష్మీదేవి, ఎనిమిదవ చిత్రం దుర్గ, తొమ్మిదవ చిత్రం మహిషాసురమర్ధిని. కానీ పదవది? " అన్నాడు శరత్. 


"శభాష్, మీరు డిటెక్టివ్ అని ఋజువు చేసుకున్నారు శరత్ గారు. కేవలం మూడు చిత్రాలు పరిశీలించి, పది చిత్రాల వివరాలు చక్కగా చెప్పేసారు. పదవది శక్తి స్వరూపిణి అయిన స్త్రీ. రాజరాజేశ్వరి అవతారం. " అంది కార్తీక. 


కార్తీక తల్లి, తండ్రి కూడా ఆసక్తిగా చూస్తున్నారు. వాళ్ళు కార్తీక డైరీ ఎప్పుడూ చూడలేదు. కార్తీక బొమ్మలు వేస్తుందని తెలుసు కానీ ఇలా డైరీ కూడా బొమ్మలతో రాస్తుందని తెలీదు. అందుకే ఆసక్తి కనబరుస్తున్నారు. 


"ప్రాచీన కాలం నుంచి మన దేశంలో స్త్రీ శక్తి స్వరూపిణి. అందుకే ఆరాధనలన్నీ స్త్రీ మూర్తికే జరిగాయి. వేదాల ఆధారంగా బ్రహ్మదేవుడు సృష్టి చేస్తే, ఆయన భార్య సరస్వతి విద్యకు ఆధారం. విష్ణువు లోకాలను పాలిస్తే, ఆయన భార్య లక్ష్మీదేవి ధనానికి ప్రతిరూపం. శివుడు లయకారుడు అయితే ఆయన భార్య పార్వతి ధైర్యానికి మాతృక. మిగతా స్త్రీ స్వరూపాలన్నీ ఈ ముగ్గురి నుంచి ఉద్భవించినవే. " చెప్పాడు శరత్. 


"అంతే కాదు శరత్ గారూ, భారతీయ సమాజం స్త్రీ పురుషులిద్దరికి సమాన హక్కులు అధికారాలు ఇచ్చింది. ఇతర పాశ్చాత్య దేశాల్లో స్త్రీని విలాస వస్తువుగా, ఆటబొమ్మగా చూసే రోజుల్లో మనదేశంలో స్త్రీ మాతృమూర్తిగా, శక్తి స్వరూపిణిగా, కుటుంబ యజమానిగా పూజలందుకుంది. గౌరవనీయమైన స్థానంలో ఉంది. ఆనాటి స్త్రీలు వేదాలు చదివారు, ఆశ్రమాలు నిర్వహించారు, రాజ్యాలు ఏలారు, మంత్రాంగం చేశారు. పటిష్టమైన సమాజ నిర్మాణానికి ఇంటి నుండే పునాదులు వేశారు. "


"ఉమ్మడి కుటుంబాలలో పురుషులు వ్యవసాయం, పశుపోషణ, కులవృత్తులు, వర్తకం మొదలైన సమాజోపయోగ కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటే, ఆ ఇంట పుట్టిన సంతానం, ఆడపిల్లలైనా, మగపిల్లలైనా ఆ ఇంటిలో ఉన్న స్త్రీలందరి చేత సమానంగా ప్రేమించబడి, బాధ్యత, శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, చాకచక్యం కలిగిన ఉన్నత శ్రేణి పౌరులుగా తీర్చిదిద్దబడేవారు. అవసరమైన నైపుణ్యాల కోసం గురుకులానికి వెళ్ళేవరకు, ప్రాథమిక విద్య మొత్తం ఇంట్లోనే స్త్రీల పర్యవేక్షణలో జరిగేది. "


"లలితకళలైన సంగీతం, నాట్యం, చిత్రలేఖనం స్త్రీలకు అలవోకగా అబ్బితే, సాహిత్యం, శిల్పం పురుషుల చేతిలో ప్రకాశించేవి. ఈ సాహిత్యానికి, శిల్పానికి ఆలంబన, ప్రేరణ మళ్ళీ స్త్రీయే. అంతే కాదు, కనీసం ఇరవై నుండి ముప్పైమంది కుటుంబసభ్యులు, వీరితో పాటు పనివారు, సేవకులు, పాలికాపులు వీరందరి భోజన సదుపాయాలు, అతిథులకు భోజన తాంబూలాది సత్కారాలు, ఇంటికి వచ్చే పంట లెక్కలు, రోజు వారీ లెక్కలు, జమాఖర్చులు.. ఏ కార్యాలయానికి తీసిపోని కార్యనిర్వహణ.. ఇవన్నీ ఆ ఇంటి స్త్రీలే చూసుకునేవారు. ఏదైనా సమస్య వస్తే, స్త్రీలే పరిష్కరించేవారు. ఒకవేళ పురుషుల వరకు వెళ్తే 'అది స్త్రీల వ్యవహారం, మనకి అనవసరం' అన్న చందంగా వదిలేసేవారు. 


పురుషులు కళలు, వ్యవసాయం, వర్తకం, వృత్తులు, గ్రామ/ రాజ్య రక్షణ బాధ్యతలు చూసుకునేవారు. ఒక పద్ధతిగా కుటుంబ, సమాజ వ్యవహారాలు నడిచిపోయేవి. దేవాలయాల సేవకు అంకితమైన దేవదాసీలతో పాటు, సాధారణ వేశ్యలకు కూడా విద్యలోనూ, లలితకళలలోనూ చక్కని పరిజ్ఞానం ఉండేది. గ్రంథాలు రాయకపోయినా సమయానుకూలంగా పద్యాలు, శ్లోకాలు చెప్పడంలో దిట్టలుగా ఉండేవారు. " చెప్పింది కార్తీక. 


ఏదో చదువుతోంది అనుకున్నారు కానీ, తమ కూతురికి చరిత్ర పట్ల, వేదకాలం నాటి స్త్రీల పట్ల ఉన్న అవగాహనకు కార్తీక తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. 


"అవును కార్తీకా, నువ్వన్నది నిజం. మా తాతగారు చెప్తూ ఉండేవారు, వాయువ్య ప్రాంతం నుంచి, హిమాలయాలు, ఆరావళి పర్వత ప్రాంతాల ఆవల, నివసించే కొన్ని తెగల ప్రజలు, వర్తకంకోసం సముద్రం దాటి వచ్చిన కొన్ని దేశాల ప్రజలు మనదేశం మీదకు దండెత్తి వచ్చేసరికి ఇక్కడ అన్నీ చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి. ఒక సమర్ధుడైన రాజు సామ, దాన, భేద దండోపాయాలతో ఎక్కువ భూభాగం ఆక్రమించి రాజ్యపాలన చేసినా, అతని వారసులు సమర్థులు కాకపోవడంతో చిన్న రాజ్యాలు ఏర్పడేవి. ఒకే దేశ భావన లేదు. చిన్న రాజ్యాలైనా సుభిక్షంగా ఉండేవి. ప్రశాంతంగా ఉండేవి. 


విదేశీయులు దండయాత్రలకు వచ్చేటప్పటికి మన దేశ పరిస్థితి చూసి ఆశ్చర్యం కలిగింది. దేశ సౌభాగ్యం, స్త్రీల వైభవం చూసి వారికి ఈర్ష్య కలిగింది. వారి దేశాల్లో స్త్రీ అంటే పురుషునికి చెందిన విలాస వస్తువు మాత్రమే. దేశ సంపద కొల్లగొట్టడంతో పాటు, పద్ధతి, నియమాల్లేని యుద్ధ విధానాలతో మన దేశరాజులను ఓడించారు. అంతే కాకుండా ఆక్రమించిన ప్రాంతాలను సర్వనాశనం చేశారు. పురుషులను సంహరించారు. స్త్రీలను చెరబట్టారు. సంపదలు దోచుకున్నారు. గ్రామాలను తగులబెట్టారు. 


దేశ సౌభాగ్యానికి స్త్రీ పురుషులిద్దరి సమాన భాగస్వామ్యం గ్రహించిన ఆ ధూర్తులు, మనదేశంలో స్త్రీలకు సరైన న్యాయం జరగడం లేదని, మనవన్నీ మూఢనమ్మకాలని, పిచ్చి ఆచారాలని, మన దేశస్తులు అనాగరికులని ప్రచారం చేయడం ప్రారంభించారు. స్త్రీల ప్రాధాన్యతను తగ్గించడం మొదలుపెట్టారు. 


మనదేశంలో దేశపర్యటన చేసినవారు తక్కువ. కాలినడకన ఇంత పెద్ద దేశం తిరగాలంటే మాటలు కాదు. వారందరూ గుర్రాలపై దేశమంతటా తిరిగి, అసత్య ప్రచారాలు చేసి, రాజ్యాన్ని విస్తరించుకున్నారు. అసలు విషయం తెలియని మనదేశ ప్రజలు వారు చెప్పిందే నిజమని నమ్మేరు. మనస్త్రీలకు అసలైన అన్యాయం విదేశీ దాడుల తర్వాతే జరిగిందట. " అని చెప్పేరు సత్యనారాయణ. ‘అవునన్నట్లు’గా తలవూపేరు శరత్, కార్తీక. 


వీరు చర్చల్లో ఉండగా విశాలాక్షి టిఫిన్, మరోసారి కాఫీ, తయారుచేసి తీసుకువచ్చింది. కాఫీ, టిఫిన్లు చూసిన శరత్ వాచీ చూసుకున్నాడు. చాలా సమయం గడిచిపోయింది. "అవునండీ. మీరు చెప్పింది నిజమే. మన భారతీయ సమాజం స్త్రీలకు ఇచ్చిన గౌరవం ఇంకేదేశం ఇవ్వలేదనే చెప్పాలి. అసలైన ఆ స్వేచ్చా స్వతంత్ర్యాలు మరుగున పడిపోయి, విచ్చలవిడితనం స్వేచ్ఛగా రూపాంతరం చెందింది. అసలైన మన చదువులను వదిలి, విదేశీ చదువులపై మోజు పెంచుకోవడం, చదువులు, ఉద్యోగాల పేరిట తల్లిదండ్రులను విడిచి ఉండటం.. వీటివలన పెరిగే వయసులో పెద్దల నియంత్రణ లేక, అదుపాజ్ఞలు లేక ఈనాడు యువత పెడదారులు పట్టడం జరుగుతోంది. మన కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతోంది. " ఆవేదనగా అన్నాడు శరత్. 


"సరే సరే.. నేనేదో మీ పనులకు అడ్డం వచ్చినట్లున్నాను.. మీరు కానివ్వండి. " అన్నాడు సత్యనారాయణ. 


"ముందు కాఫీ, టిఫిన్లు కానివ్వండి. అప్పుడు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. " అన్నది విశాలాక్షి. 


"మీ సంఘటన జరిగిన తేదీ తియ్యండి" కార్తీకను అడిగాడు శరత్. 


కార్తీక డైరీలో పేజీలు తిప్పుతుండగా "ఆగండి" అన్నాడు. అక్కడ బొర్రా గుహలకు దిగే దారి, ఆ పక్కనే కారు బొమ్మలు గీయబడి ఉన్నాయి. కారు పక్కనే ఒక కుర్రాడు, కాస్త దూరంలో మరొకడు ఉన్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి పక్కపక్కనే నడుస్తున్న చిత్రం అది. మొదట చూసినపుడు అర్ధం కాలేదు కానీ కార్తీక వివరాలు చెప్పిన తర్వాత ఆ చిత్రం స్పష్టంగా అర్ధమయ్యింది. ఫొటోలో చూసిన యువకులకు, ఈ చిత్రంలోని బొమ్మలకు పోలికలు ఉన్నాయనిపించింది. చిత్రాన్ని పరిశీలనగా చూసాడు. కారుకు ఉన్న నెంబర్ ప్లేట్ పై అంకెలు కూడా వేసింది కార్తీక. అవి అన్ని పెన్సిల్ చిత్రాలే అయినా చక్కగా ఉన్నాయి. జాగ్రత్తగా చూసి కారు నెంబర్ రాసిపెట్టుకున్నాడు శరత్. ఆ కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్ తో ఉంది. ఆ తర్వాత మరి డైరీ రాయలేదు. "థాంక్స్ కార్తీక గారు, అవసరమైతే మరోసారి కలుస్తాను. " అని చెప్పి, సత్యనారాయణ, విశాలాక్షి దగ్గర కూడా సెలవు తీసుకుని బయలుదేరాడు శరత్. 


========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

1 Comment



@ratnamanjari8642

•15 hours ago

👍

Like
bottom of page