కేస్ నెం 37 బి - పార్ట్ 6
- Nagamanjari Gumma
- 1 day ago
- 6 min read
#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesinTelugu

Case No. 37B - Part 6 - New Telugu Web Series Written By Nagamanjari Gumma
Published In manatelugukathalu.com On 02/10/2025
కేస్ నెం. 37 బి - పార్ట్ 6 - తెలుగు ధారావాహిక
రచన: నాగమంజరి గుమ్మా
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. కార్తీక పేరెంట్స్ ఇచ్చిన పబ్లిక్ బూత్ నంబర్ విజయవాడకు చెందినదని తెలుసుకొని, శరత్ కూడా విజయవాడకు వస్తాడు. ఆ టెలిఫోన్ బూత్ పక్కనే ఉన్న టీ కొట్టు అతను చెప్పిన వివరాలనుబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ లో కార్తీక కోసం వెతుకుతాడు. తాను తప్పించుకున్న వైనం గుర్తు చేసుకుంటుంది కార్తీక.
ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 6 చదవండి..
బస్ స్టాప్ కనిపించింది కార్తీకకు. బస్ స్టాప్ లో కూర్చుంది. ఏం చేయడానికి పాలుపోవడం లేదు. చుట్టూ చూసింది. ఎవరిదో బేగ్ మాత్రమే ఉంది. మనుషుల ఆచూకీ లేదు. దగ్గరగా వెళ్లి బేగ్ ని చేతుల్లోకి తీసుకుంది. బేగ్ మీద "అడిస్" అని స్టిక్కర్ కుట్టి ఉంది.
ఇంతలో "ఏయ్ అమ్మాయి, ఎవరు నువ్వు? నా బేగ్ ఎందుకు ముట్టుకున్నావు? ఏం తీస్తున్నావు?" అంటూ గద్దిస్తూ వచ్చాడు ఓ యువకుడు.
గబుక్కున బేగ్ వదిలేసింది కార్తీక.
దగ్గరగా వచ్చి, బేగ్ తీసుకుని, కొట్టడానికి చేయి ఎత్తి, కార్తీక ముఖం లోకి చూసాడు ఆ యువకుడు. ఆశ్చర్యంతో కళ్ళింత చేసుకుని, "కార్తీకా" అన్నాడు.
కార్తీక మరింత ఆశ్చర్యపోతూ "అవును" అంది.
"నేను మీకెలా తెలుసు?" అడిగింది కార్తీక.
"మీరే కాదు, మీ కథంతా కూడా తెలుసు. థాంక్ గాడ్. మొత్తానికి దొరికారు. మీకోసం మూడు రోజులుగా అన్వేషిస్తున్నాను. నా పేరు శరత్." అని చెప్పి, కరచాలనం కోసం చేయి జాచాడు.
కార్తీక సంశయిస్తూనే చేయి అందుకుని కరచాలనం చేసింది.
"ఒక్క నిమిషం" అంటూ తన మొబైల్ ఫోన్ తీసి, ఒక నెంబర్ డయల్ చేసి, "హలో, నేను శరత్ ని మాట్లాడుతున్నాను. కార్తీక తో మాట్లాడండి" అని చెప్పి, ఫోన్ దూరంగా పెట్టి, "మీ నాన్నగారు. విజయవాడలో ఉన్నట్లు మాత్రమే చెప్పండి. మిగతా వివరాలు వెళ్ళేక మాట్లాడుకుందాం." అన్నాడు.
కార్తీకకు ఫోన్ ఇచ్చాడు. కార్తీక తండ్రి తో 'తాను క్షేమంగా ఉన్నానని, విజయవాడలో ఉన్నానని, శరత్ ను కలిశానని, శరత్ తాను కలిసి ఇంటికి వస్తామని, ఇంటికి వచ్చాక అన్ని విషయాలు చెప్తానని' చెప్పింది. మొబైల్ ఫోన్ శరత్ కు ఇచ్చేసింది.
"రండి. ఏమైనా తిన్నారా?" అడిగాడు శరత్.
"అమ్మవారి గుడిలో ప్రసాదం తిన్నాను" చెప్పింది కార్తీక.
మళ్ళీ "ఒక్కనిమిషం" అని చెప్పి, మొబైల్ ఫోన్ తీసి, ఎవరికో ఫోన్ చేసాడు.
"సర్, కార్తీక దొరికింది. క్షేమంగా ఉంది." అని చెప్పాడు.
అవతలి వారు చెప్పింది విని, "సరే సర్, తన ప్రాథమిక అవసరాలు తీర్చి, విశాఖపట్నం తీసుకువస్తాను. ఉంటాను సర్." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు.
"చెప్పండి మిస్ కార్తీక! కాఫీ, టీ ఏమైనా తాగుతారా? గత నాలుగు రోజులుగా ఇవే దుస్తులతో ఉన్నారు. మార్చుకుంటానంటే కొత్త దుస్తులు కొంటాను" అన్నాడు శరత్.
"కొత్త బట్టలు వద్దులెండి. ఎలాగూ ఇంటికి వెళ్తున్నాం కదా, ఇంటికి వెళ్ళేక మార్చుకుంటాను. మీరు అడిగారు కాబట్టి, కాఫీ తాగాలనిపిస్తోంది." అంది నవ్వుతూ. దగ్గరలో ఉన్న హోటల్ కు తీసుకు వెళ్లి రెండు కాఫీ ఆర్డర్ ఇచ్చి,
"చెప్పేనుగా, నా పేరు శరత్. విశాఖపట్నం లో అన్వేష్ డిటెక్టివ్, ఇన్వెస్టిగేషన్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ 'అడిస్' లో డిటెక్టివ్ లాంటి వాణ్ణి. మీరు కనిపించక పోయేసరికి ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ గారి అభ్యర్ధన మేరకు మిమ్మల్ని వెతికే బాధ్యతను నాకు అప్పగించారు మా చీఫ్ కామేశ్వరరావు గారు." అన్నాడు శరత్.
"చాలా సంతోషం శరత్ గారు, మీరు కనిపించకపోతే, కాదు కాదు, మీ బేగ్ కనిపించక పోతే, అది నేను తీసి ఉండకపోతే, నేను ఈ విజయవాడ రోడ్లపై అడుక్కుని, ఎన్నో అవస్థలు పడి, ఎప్పటికో ఇల్లు చేరేదాన్ని." అంది కార్తీక.
కాఫీ తాగి హోటల్ లో నుంచి బయలుదేరారు. ఆటో ఎక్కి, రైల్వేస్టేషన్ చేరుకున్నారు. ఇద్దరికి విశాఖపట్నం రిజర్వేషన్ టికెట్లు తీసుకుని, రైలు రావడానికి సమయం ఉండటంతో "మీ కథ చెప్పండి" అన్నాడు శరత్. రైలు వచ్చేలోగా క్లుప్తంగా విషయం చెప్పింది కార్తీక.
విజయవాడ ఆసుపత్రిలో శరత్ పక్కనుంచే కార్తీక వెళ్లిన విషయం ప్రస్తావనకు రాగానే ఇద్దరూ ఆశ్చర్య పోయారు. ఇంతలో ఏదో వెలుగు శరత్ వాచీ డయల్ పై పడి ప్రతిఫలించింది. కార్తీక "ఇదే వెలుగు, బస్ కిటికీలో నుంచి నా కళ్లపై పడింది" అంటూ "అవును అప్పుడు మిమ్మల్ని ఒక్క క్షణం చూసాను, అంతలో కళ్లపై వెలుగు పడటంతో కళ్ళు మూసుకున్నాను. బస్ వెళ్ళిపోయింది" అంది కార్తీక.
రెండు సార్లు కార్తీక, శరత్ లు కలవబోయి, అంతలో తప్పుకోవడం, ఇప్పుడు ఇలా యాదృచ్చికంగా కలవడం దైవఘటనగా భావించారు ఇద్దరూ. ఇంతలో రైలు వచ్చింది. రైలు ఎక్కి విశ్రాంతిగా కూర్చున్నాక మంచినీళ్లు సీసా అందించాడు శరత్.
"నాకు దాహంగా ఉన్నట్లు మీకెలా తెలుసు?" అంటూ గడగడా తాగేసింది. నవ్వి, సీసా మూతపెట్టి బేగ్ లో పెట్టుకుని, కార్తీక చెప్పిన కథలో తనకు కలిగిన సందేహాలను అడిగి, చెప్పించుకున్నాడు శరత్.
విశాఖపట్నంలో దిగి, కార్తీక ఇంటికి కాకుండా, అడిస్ కార్యాలయానికి తీసుకువెళ్లాడు.
‘అరుకులో దొరికిన శవం ఎవరిది? ఆ ముగ్గురు యువకులు అరుకు వెళ్లబోతూ, కార్తీకను కిడ్నాప్ చేసి, ఎందుకు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎప్పుడు లభిస్తాయో’ ఆలోచిస్తున్నాడు శరత్.
***
కార్తీక, శరత్ కార్యాలయంలో ప్రవేశించేసరికి అక్కడ కార్తీక తల్లిదండ్రులు, విశాఖపట్నం, అరుకు పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, ప్రొఫెసర్ శ్యాం సుందర్ సిద్ధంగా ఉన్నారు. కార్తీక తల్లి విశాలాక్షి గబగబా వచ్చి కార్తీకను హత్తుకుని ఏడ్చేసింది. తండ్రి సత్యనారాయణ కూతురి చేయి పట్టుకుని ప్రేమగా వత్తాడు.
"మిస్ కార్తీక, మీరు ముందు కూర్చోండి. మీ కిడ్నాప్ జరిగిన నాడు ఏం జరిగిందో చెప్పండి" అడిగాడు కామేశ్వరరావు అడిస్ చీఫ్.
కార్తీక జరిగిందంతా వివరించింది. కార్తీకను వైద్య పరీక్షకు పంపితే మంచిదని సూచించాడు కామేశ్వరరావు. అనంతగిరి దగ్గర మలుపు లోయలో పడి ఉన్న కార్తీక ఫోన్, హేండ్ బేగ్ లను అరుకు ఎస్సై తన బృందంతో వెతికించి తెచ్చాడు. ఫోన్ ఇస్తూ, ఆ ఫోన్ మీద నేరస్తుల వేలిముద్రలు ఉండే అవకాశం ఉందని, అందుచేత తాను ఫోన్, హేండ్ బేగ్ లను ఫోరెన్సిక్ వారికి ఇచ్చి వేలిముద్రలు తీయించానని చెప్పాడు.
తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఆన్ చేసి, కొంతసేపు ఛార్జింగ్ పెట్టి తెరిచింది. ఆరోజు తాను తీసిన అంబాసిడర్ కారులో యువకుల ఫోటోలను అందరికి చూపించింది కార్తీక. ఆ ఫోటోలు పోలీస్ వారు తమ ఫోన్ లోకి తీసుకున్నారు. శరత్ కూడా తీసుకున్నాడు. విశాఖపట్నం కేంద్ర ఆసుపత్రికి కార్తీకను తీసుకు వెళ్లారు. కామేశ్వరరావు, పోలీస్ వారి అనుమానాలకు తగిన పరీక్షలన్ని నిర్వహించారు. రక్త పరీక్షలు, స్కాన్ లు చేశారు.
ఆ ఫలితం వచ్చేలోపు కామేశ్వరరావు విజయవాడ ఆసుపత్రి ప్రధాన వైద్యునికి ఫోన్ చేసాడు. కార్తీక వివరాలు చెప్పి, అపస్మారక స్థితిలో చేరినప్పుడు కార్తీకకు చేసిన పరీక్షలు, ఇచ్చిన మందుల వివరాలు సేకరించారు. అక్కడ ఏక్సిడెంటు అయినవారితో పాటు కార్తీకను కూడా ఆసుపత్రిలో చేర్చడం వలన ఆమెను ప్రత్యేకంగా పరీక్షించలేదు అక్కడి డాక్టర్లు.
ఆమె తిండి, నీళ్లు లేకపోవడం వలన స్పృహ తప్పిందని ప్రాధమికంగా నిర్ధారించి, సెలైన్ పెట్టేరు. మధ్యలో ఒకసారి స్పృహ వచ్చినా మళ్ళీ తెలివి తప్పిపోయింది. రెండు సీసాలు పూర్తిగా ఎక్కిన తర్వాత కార్తీకకి మెలకువ రావడం, కాస్త ఓపిక చేకూరడంతో అక్కడ నుంచి తప్పించుకోవడం జరిగేయని తెలిసింది.
ఈలోగా కార్తీక రక్త పరీక్షల నమూనాల ఫలితాలు వచ్చేయి. రక్తంలో నిషేధిత మాదకద్రవ్యం ఆనవాళ్లు కనిపించినట్లు రిపోర్ట్ లో ఉంది. ఈ ఫలితం, ఆ ఫోటోలు చూశాక, ఆ యువకులు నిషేధిత మాదకద్రవ్యాలు ఉపయోగిస్తున్నట్లు రుజువయ్యింది.
కార్తీక క్షేమంగా చేరుకున్నందున, చేయవలసిన రాతకోతలన్నీ పూర్తి చేసి, అందరి దగ్గర రాత పూర్వక స్టేటుమెంటు తీసుకుని, సంతకాలు తీసుకుని, అరకు, విశాఖపట్నం పోలీసులు కార్తీక మిస్సింగ్ కేసు క్లోజ్ చేశారు. ప్రొఫెసర్ శ్యాం సుందర్ గారు, కార్తీక తండ్రి, కామేశ్వరరావు గారికి ఇవ్వవలసిన ఫీజు చెల్లించి, శరత్ కు మళ్ళీ మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్తీక, ఆమె తల్లిదండ్రులు, ప్రొఫెసర్ అక్కడనుంచి బయలుదేరారు.
"మిస్ కార్తీక!" పిలిచాడు శరత్.
కార్తీక వెనుదిరిగి చూసింది. "మీ డైరీ…" అందించాడు శరత్.
"మీ అనుమతి లేకుండా చూడవలసి వచ్చింది." క్షమాపణ పూర్వకంగా నమస్కరిస్తూ చెప్పాడు. కార్తీక చిరునవ్వుతో తల పంకించింది.
"అమ్మా! కార్తీక! రెండు రోజులు విశ్రాంతి తీసుకుని పనిలోకి వచ్చెయ్. నేను మళ్ళీ కలుస్తాను." అని చెప్పి ప్రొఫెసర్ గారు వెళ్ళిపోయారు.
"మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని అనుకోకపోతే, నాకు ఇంకొన్ని అనుమానాలు మిగిలిపోయేయి… మీరు కాస్త విశ్రాంతి తీసుకున్నాక మళ్ళీ కలుస్తాను. ముఖ్యంగా మీ డైరీ గురించి…" అన్నాడు శరత్.
"సరే" అంది కార్తీక. వాళ్ళు ముగ్గురూ వెళ్లిపోయారు.
*******
"శరత్… ఇప్పుడు పూర్తిగా చెప్పు… కార్తీక మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ నువ్వు మొన్న హడావిడిగా కొంత చెప్పావు. రాసినంత వరకు నీ పరిశోధన వివరాలు చదివాను. తర్వాత విషయాలు కొన్ని ఫోన్ లో చెప్పేవు. ఇప్పుడు మొత్తం వివరించు. తర్వాత వివరంగా రాసి ఫైల్ లో పెట్టు." అన్నారు కామేశ్వరరావు గారు.
శరత్ తన పరిశోధన మొదలుపెట్టింది లగాయతు జరిగింది మొత్తం పూసగుచ్చినట్లు వివరించాడు. అన్నీ సావధానంగా విన్నాక మధ్య మధ్యలో అనుమానాలు తీర్చుకుంటూ "కేసు క్లోజ్ అయిపోలేదు శరత్" అన్నారాయన.
శరత్ ఆశ్చర్యపోయాడు. "ఎందుకలా అనిపించింది సర్" అన్నాడు.
"జాగ్రత్తగా పరిశీలించు… కార్తీకను మనం వెతికి పట్టుకోలేదు. కిడ్నాపర్లు నుంచి విడిపించలేదు. ఆమె వారి బారి నుంచి తెలివిగా, ధైర్యంగా తప్పించుకొని, క్షేమంగా తిరిగి వచ్చింది. మనకు అప్పగించిన కేసు వరకు పూర్తి అయిపోయినట్లే. కానీ కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి.
ఆ కిడ్నాపర్లు ఎవరు? అరుకులో మరణించిన అమ్మాయి ఎవరు? నల్ల అంబాసిడర్ కారులో అమ్మాయితో కలిసి వచ్చిన వచ్చిన కుర్రాళ్ళు, కార్తీకను కిడ్నప్ చేసింది ఒకే బృందమా? అలా అయితే వారితో వచ్చిన అమ్మాయి ఏమయ్యింది? వాళ్లకు ఆ నిషేధిత మాదకద్రవ్యాలు ఎలా వచ్చాయి? వెళ్లిపోతున్నవాళ్ళు మళ్ళీ ఎందుకు తిరిగి అరుకు వెళ్లాలనుకున్నారు? కార్తీకను కిడ్నాప్ చేశాక ఎందుకు వెనక్కి తిరిగి వెళ్లిపోయారు? ఎక్కడికి తీసుకువెళ్లబోయారు?
ఇవన్నీ కనిపెట్టాలి. నిజానికి ఇవన్నీ పోలీస్, ఎక్సయిజ్ లేదా నార్కోటిక్ వాళ్ళు చేయవలసిన పరిశోధన. వదిలేద్దామా? లేదా మన ఉత్సాహం కొద్దీ పూర్తి చేద్దామా?" అడిగాడు కామేశ్వరరావు.
కాసేపు ఆలోచించాడు శరత్. "అంత లోతుగా ఆలోచించలేదు కానీ, అరుకులో లభించిన శవం ఎవరిది? నల్ల అంబాసిడర్ లో వచ్చిన వాళ్ళు ఎవరు? అంతవరకే నా ఆలోచన వెళ్ళింది. నిజమే సర్. ఇవన్నీ కనిపెడదాం. కానీ నాకు కార్తీక డైరీ విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆమెతో మాట్లాడి వస్తాను. అప్పుడు ఈ పరిశోధన తిరిగి ప్రారంభిస్తాను." అన్నాడు శరత్.
"సరే వెళ్ళిరా!" అన్నాడు కామేశ్వరరావు.
========================================================================
ఇంకా వుంది..
కేస్ నెం 37 బి - పార్ట్ 7 త్వరలో..
========================================================================
నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
పేరు: నాగమంజరి గుమ్మా
భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు
వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని
నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా
ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.
వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం.
విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం
పురాణ ప్రవచనం చేయడం
రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.
విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.
@nagamanjarig1315
•14 hours ago
ధన్యవాదాలండీ
@SeshadriAllinone
•14 hours ago
చాలా బాగా చదువు తున్నారు రచయిత్రి ఆలోచనలకు అనుగుణంగా