top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 5

Updated: 2 days ago

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesinTelugu

ree

Case No. 37B - Part 5 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 27/09/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 5 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. కార్తీక పేరెంట్స్ ను కలవడానికి వైజాగ్ వెళ్తాడు శరత్. వాళ్లకు వచ్చిన ఫోన్ విజయవాడలోని పబ్లిక్ బూత్ నుండి అని తెలుసుకుని, విజయవాడ చేరుకుంటాడు. పక్కనే ఉన్న టీ కొట్టు అతను చెప్పిన వివరాలనుబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ లో కార్తీక కోసం వెతుకుతాడు. 


ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 5 చదవండి.. 


ఓ మూడు గంటలు వెనక్కి వెళ్తే, శరత్ మార్చురీకి వెళ్లి పరిశీలిస్తున్న సమయంలో ఇక్కడ ఆసుపత్రిలో బెడ్ మీద ఉన్న కార్తీకకు మెలకువ వచ్చింది. తాను ఎక్కడ ఉందో మొదట అర్ధం కాలేదు. లేచి కూర్చుంది. అదొక ఆసుపత్రి. చేతికి సెలైన్ పెట్టినట్లు, పక్కనే సెలైన్ బాటిల్, సూది ఉన్నాయి. చుట్టూ చూసింది. దాదాపు అందరూ నిద్రలో ఉన్నారు. 


అక్కడక్కడా ఏవేవో చప్పుళ్ళు వినబడుతున్నాయి. సెలైన్ బాటిల్ ఇచ్చిన శక్తితో, కాస్త ఓపిక చేకూరిందేమో బెడ్ దిగింది. మెల్లిగా నడుచుకుంటూ బాత్రూమ్ వైపు వెళ్లి, ముఖం కడుక్కుంది. ఎంత కడిగినా మసి వదలడం లేదు. చిక్కగా నల్లగా వస్తూనే ఉన్నాయి నీళ్లు. చేతులు దులిపి, చొక్కాకేసి తుడుచుకుని బయటకు వచ్చింది. అప్పుడే ఎవరో బయటకు వెళ్లినట్లున్నారు, తలుపు ఓరగా తెరిచి ఉంది. 


బయటకు నడిచింది కార్తీక. బయట కుళాయి దగ్గర ఎవరో ముఖం కడుక్కోవడం చూసి, అటువైపు నాలుగడుగులు నడిచి, మళ్ళీ కుళాయి నీళ్లతో ఈ నలుపు వదిలేది కాదని ప్రయత్నం విరమించుకొని, ఆసుపత్రి గేటు దాటి బయటకు అడుగుపెట్టింది. అక్కడ ముఖం కడుక్కుంటున్నది శరత్. 


బయటకు వచ్చిందే కానీ ఎటు వెళ్ళాలో పాలుపోలేదు. దగ్గరలోనే బస్ స్టాప్ కనిపిస్తే వెళ్లి కూర్చుంది. ఒకరొకరుగా ప్రయాణికులు వస్తున్నారు. మాసిన బట్టలు, చెదరిన జుట్టు, సగం మసి కడిగిన ముఖం, మతిభ్రమణం చెంది తిరుగుతున్న అమ్మాయిలా తోచిందేమో, దూరంగా నిలబడ్డారు. 


ఎవరో ఒకరు ఒక ఏపిల్ పండు చేతిలో పెట్టేరు. అన్యమనస్కంగానే నోట్లో పెట్టుకుని తినడం ప్రారంభించింది కార్తీక. మరొకరెవరో పదిరూపాయల నోటు కార్తీక ముందు పడేసారు. వారి వైపు అభావంగా చూసి, నోటు తీసి చొక్కా జేబులో పెట్టుకుంది. మరొక కుర్రాడు కార్తీకవైపు పరిశీలనగా చూసి, చేతితో డబ్బులు పట్టుకొని, కార్తీక చొక్కా జేబులో చెయ్యిపెట్టి, నోటుపెడుతూ వత్తాడు. 

ఉలిక్కిపడింది కార్తీక. చేతిలో ఏపిల్ కింద పడేసి, వెర్రిగా అరుస్తూ, ఆ కుర్రాడి చేయి పట్టుకుంది. పట్టుకున్నట్టే, మెలితిప్పి వదిలేసింది. ఎంత బలంగా మెలితిప్పిందంటే, మోచేతి దగ్గర వాపు కనిపించేలా. ఆ కుర్రాడు చెయ్యి పట్టుకుని బాధతో ఒకటే ఏడుపు. పరిస్థితి గమనించి కూడా ప్రేక్షకుల్లా చూస్తున్న ప్రయాణికులు కుర్రాడి ప్రవర్తనకు తగిన శాస్తి జరిగిందని కొందరు ఆలోచించారు. 


పిచ్చిదానిలా ఉన్న కార్తీక చేతిలో బలానికి ఆశ్చర్య పోయారు కొందరు. ఏడుస్తూ వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు. ఇంతలో బస్ వచ్చింది. అందరితో పాటు కార్తీక కూడా బస్ ఎక్కింది. టికెట్ తీసుకునేవాళ్లను గమనించి, తాను కూడా కృష్ణానది ఒడ్డుకు ఒక టికెట్ తీసుకుంది. 


బస్ దిగి కృష్ణమ్మ ఒడ్డుకు చేరింది. నెమ్మదిగా కృష్ణలోకి దిగింది. ఒంటికి పట్టిన మసి పోయేలా తనివి తీరా కృష్ణమ్మ జలాలలో స్నానం చేసింది. ఒడ్డుకు వచ్చి కూర్చుంది. స్నానం చేసేసరికి ఎంతో భారం దిగినట్లు తేలికగా అనిపించింది కార్తీకకు. కొందరు భక్తులు కాలినడకన కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్తూ ఉండటంతో వారిని అనుసరించి వెళ్ళింది. 


తాను కూడా కొండమీద కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంది. ఉచిత అన్నప్రసాదం స్వీకరించింది. నాలుగు రోజులు తర్వాత లభించిన భోజనమేమో ఆవురావురుమంటూ రుచిని కూడా పట్టించుకోకుండా తిన్నది. భోజనం అయ్యాక భుక్తాయాసంతో బస్ షెల్టర్ దగ్గరకు వచ్చి కూర్చుంది. ఆలోచనలు నాలుగురోజుల వెనుకకు పరిగెత్తాయి. 


******

కార్తీక విజయవాడలో లేదేమో.. తాను అనవసరంగా ఇటు వచ్చాననిపించింది శరత్ కు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసరికి ఇంద్రకీలాద్రి కొండమీదకి వెళ్ళే సిటీ బస్ కనిపించింది. అమ్మవారి దర్శనం చేసుకుంటే బాగుండును అనిపించింది. తరువాత వచ్చే బస్ కోసం వేచి చూసి, బస్ రాగానే కొండమీదకు ఒక టికెట్ తీసుకున్నాడు. అమ్మవారి దర్శనం చేసుకుని, ప్రసాదం తీసుకుని, బస్ స్టాప్ కు వచ్చి నిలుచున్నాడు. కొండ కిందకు వెళ్లే బస్ వచ్చింది. శరత్ బస్ ఎక్కేడు. 


శరత్ కొండ కిందకి వెళ్లే బస్ ఎక్కిన తర్వాత బస్ కదులుతుండగా, కార్తీక భోజనం చేసి అటువైపు వచ్చింది. శరత్ కూర్చున్న సీట్ కిటికీ ఎదురుగా ఉన్న బెంచీపై బస్ షెల్టర్ లో కూర్చుంది. శరత్ కాస్త తల తిప్పి చూస్తే కార్తీక కనిపించేది. శరత్ ని కార్తీక చూసింది. శరత్ చేతికి ఉన్న వాచీ డయల్ పై సూర్యకాంతి పడి, రిఫ్లెక్ట్ అయి, కార్తీక కళ్ళలోకి పడింది. 


కార్తీక ఒక్కసారి మోచేతితో కళ్ళకి అడ్డం పెట్టి మూసుకుంది, శరత్ ఎక్కిన బస్ కదిలి కొండ కిందకి వెళ్ళిపోయింది. శరత్ బస్ దిగి అక్కడ నుంచి తాను బస చేసిన హోటల్ కి వెళ్లి, బేగ్ తీసుకుని, రూమ్ ఖాళీ చేసి, విశాఖపట్నం వెళ్లే బస్ ఎక్కడానికి బస్ స్టాప్ కు వచ్చాడు. 



*******


చైత్ర పరబ్ సందర్భంగా గిరిజన స్త్రీలు అరుకు (బొర్రా) లోకి వచ్చే వాహనాలను అడ్డగిస్తూ రహదారి సుంకం వసూలు చేస్తున్నారు. తవ్వకాలు జరుగుతున్న స్థలంలో చరవాణి సంకేతాలు లేకపోవడంతో, ప్రొఫెసర్ గారికి చెప్పి, బయటకు వచ్చింది కార్తీక. జరుగుతున్న సంబరం కార్తీకను ఆకర్షించింది. 


ప్రొఫెసర్ గారికి ఫోన్ చేసింది "సర్, ఇక్కడ గిరిజన స్త్రీలు వాహనాలను ఆపి, రహదారి సుంకం వసూలు చేస్తున్నారు. వీరి పండుగ కాస్త ఆసక్తి గా ఉంది. మీరు అనుమతిస్తే నేను మరి కాసేపు ఇక్కడే ఉండి, ఫోటోలు తీసుకుని వస్తాన"ని చెప్పింది. 


సంప్రదాయ వస్త్రధారణతో, జుట్టును సిగ చుట్టి, సిగ చుట్టూ స్థానికంగా లభించే పూలను చుట్టి జట్లు జట్లుగా, వచ్చే వాహనాలను ఆపి రహదారి సుంకం వసూలు చేస్తున్నారు, ఎక్కువ సొమ్ము ఇచ్చిన వారికి థింసా నృత్య పద్దతిలో నమస్కరిస్తున్నారు. ఉత్సాహం ఉన్న యువతీ యువకులు కోరితే, వారిని తమ జట్టులో కలుపుకుని నృత్యం చేస్తున్నారు. 


అన్ని దృశ్యాలు వరుసగా ఫోటోలు తీసుకుంది. ఆగి ఉన్న కార్ల నుంచి కాస్త దూరంగా వెళ్లి ఫోటోలు తీస్తోంది. 


ఇంతలో ఒక నల్లని అంబాసిడర్ కారు వచ్చి ఆగింది. ఆ కారును ముందు రోజు బొర్రా గుహల ముందు కూడా చూసి ఉండటంతో, ఆసక్తిగా చూసింది. ఒకసారి అరుకు, బొర్రా చూసి తిరిగి వెళ్లిన వ్యక్తులు మళ్ళీ వెంటనే తిరిగి రావడం అరుదు. ఉన్న రెండు మూడు రోజుల్లో అక్కడ ఉన్న పర్యాటక ప్రదేశాలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం చూసుకుని వెళ్తారు. 


ఆ ప్రాంతాలపై అవగాహన లేని వారైతే గైడ్ సహాయం తీసుకుంటారు. బొర్రా దగ్గర రైలు దిగి, లేదా కారు/ బస్సు దిగి గుహలు చూసి, అక్కడ నుంచి అరుకు వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మరి ఎక్కడా ఆగనవసరం కానీ, మళ్ళీ రానవసరం కానీ ఉండదు. 


ఈ కారు టూరిస్ట్ కారు కాదు. ముందు ఎక్కిన వారిని దింపేసి, మళ్ళీ మరొక బేచ్ ని తీసుకు వచ్చేరు అనుకోడానికి. పైగా ఆ కారులో ఉన్న వ్యక్తులు, వారి ప్రవర్తన తనకు బాగా జ్ఞాపకం. వాళ్ళు ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఒక అబ్బాయి గుహలో ఆ అమ్మాయితో శృతి మించి ప్రవర్తించసాగాడు. ఆ అమ్మాయి పరిగెడుతూ, సందర్శకులను అనుమతించే హద్దుగా కట్టిన తాడు దాటి, తవ్వకాలు జరిగే ప్రదేశానికి కూత వేటు దూరంలోకి వచ్చేసింది. 


ఆ అబ్బాయి కూడా ఆమె వెనకాలే వచ్చాడు. తవ్వకాలలో దొరికిన రాళ్లను కూలీలతో మోయించుకు వస్తున్న కార్తీక వీళ్ళని చూసింది. ఆ అబ్బాయి ఏదో మత్తులో ఉన్నట్లు తూగుతూ, తూలుతూ వస్తున్నాడు. ఇది పర్యాటకులు వచ్చే ప్రదేశం కాదని, వారిని వెళ్లిపోమని చెప్పింది కార్తీక. ఆ అబ్బాయి వినలేదు, సరికదా తన వెనుకే వస్తున్న ఇద్దరు అబ్బాయిలను పిలిచాడు. 


ఆ అమ్మాయి వెనుదిరిగి వచ్చి తూలుతూ నడుస్తున్న అబ్బాయి చేయి పట్టుకుని తీసుకువెళ్లిపోయింది. కానీ వెనుకనే వచ్చిన మరో ఇద్దరు అబ్బాయిలు కార్తీకను చూస్తూ, అసభ్యంగా ఒరియాలో వ్యాఖ్యానిస్తూ, సైగలు చేస్తూ వెళ్లిపోయారు. కార్తీక ప్రొఫెసర్ గారికి ఈ విషయం చెప్పడమా మానడమా అని కాసేపు సంఘర్షణ పడి, చిన్న విషయంగా భావించి, మిన్నకుండిపోయింది. 


వారు నలుగురూ బొర్రా గుహల నుండి బయటకు వచ్చి, నల్ల అంబాసిడర్ ఎక్కడం, అరుకు వైపు సాగిపోవడం, వారి వెనుకనే వచ్చిన కార్తీక గమనించింది. ఆ విషయం అక్కడే మరచిపోయింది. 


ఇప్పుడు మళ్లీ అదే కారు, అదే ముగ్గురు అబ్బాయిలను చూడడంతో అదంతా గుర్తుకు వచ్చింది కార్తీకకు. ఆరోజు తూగుతూ నడిచిన అబ్బాయి ముందు తలుపు తీసుకుని బయటకు వచ్చాడు. కారు డిక్కీ తెరచి, బేగ్ లో నుంచి చిన్న పొట్లం బయటకు తీసాడు. ముంజేతి మీద వేసుకుని వాసన చూసాడు. మిగిలిన పొట్లాన్ని కారులో కూర్చున్న స్నేహితులకు ఇచ్చాడు. 


కార్తీక దూరం నుంచే ఈ సంఘటనలన్నీ చరవాణిలో చిత్రాలుగా మలచింది. నల్ల అంబాసిడర్ ముందున్న కార్లు సుంకం చెల్లించి వెళ్లిపోవడంతో కొంచెం ముందుకు వచ్చింది. గిరిజన స్త్రీలు, వారితో పాటు కార్తీక కూడా కారు దగ్గరకు వచ్చారు. కారు వెనుక సీట్ లో కూర్చున్న అబ్బాయి, కార్తీకను చూసి గుర్తుపట్టాడు. కారు తలుపు తెరిచి, కార్తీకను కారులోకి లాగి తలుపు మూసాడు. 


ముందు డ్రైవర్ సీట్ లో కూర్చున్న అబ్బాయి వీపు మీద తట్టి, వెనుకకు తీసుకుపొమ్మన్నాడు. వెంటనే కారు రివర్స్ చేసి కొండ దిగిపోయారు. కార్తీక ముక్కు దగ్గర ఆ పొట్లంలో ఉన్న పొడి బలవంతంగా పెట్టాడు. ఘాటుగా ముక్కుకు తగిలేసరికి వాసన పీల్చిన కార్తీక స్పృహ కోల్పోయింది. బొర్రా దాటి, విజయనగరం, బొబ్బిలి దాటి పార్వతీపురం రోడ్ మీదుగా కారు సాగిపోతోంది. 


కార్తీకకు స్పృహ వచ్చి మెల్లిగా కళ్ళు తెరిచింది. కారులోనూ, బయట కూడా చీకటిగా ఉంది. చీకటి పడి చాలాసేపు అయినట్లుంది. కార్తీక పక్కనున్న వ్యక్తి నిద్రపోతున్నాడు. కార్తీకకు స్పృహ వచ్చినట్లు వాళ్ళు ఇంకా గమనించలేదు. జాగ్రత్తగా వారికి అనుమానం రాకుండా తన మొబైల్ కోసం వెతికింది. హేండ్ బేగ్, మొబైల్ రెండూ కనబడలేదు. ఇంతలో పక్కనున్న వ్యక్తికి మెలకువ వచ్చింది. గబుక్కున కళ్ళు మూసుకుంది. 


"ఏదైనా ధాబా దగ్గర ఆపండ్రా. తినేసి వెళదాం. " అన్నాడు. 


"ఓహ్. లేచావా? చాలా సేపటి నుంచి మంచి హోటల్ కోసం చూస్తున్నాం. సరే కానీ ఆ పిల్ల లేచిందా?" అన్నాడు డ్రైవింగ్ చేస్తున్నవాడు. 


రాత్రి, పగలు నడిచే పంజాబీ ధాబా దగ్గర కారు ఆగింది. పక్కన కూర్చున్న అబ్బాయి కార్తీకను కదిపి చూసాడు. కార్తీక కదలకుండా అలాగే పడి ఉంది. "లేదురా" అన్నాడు. 


ముగ్గురూ కారు దిగి ధాబా వైపు కదిలారు. ఇదే సమయమని నెమ్మదిగా కారు తలుపు తెరుచుకుని, బయట పడింది కార్తీక. ఆగి ఉన్న కార్లను చాటు చేసుకుంటూ జాగ్రత్తగా ఆ పరిసరాలు దాటి కనబడిన రోడ్ మీదుగా పరుగు ప్రారంభించింది. ఇంతలో రైలు కూత వినబడింది. మరో ఆలోచన లేకుండా అటువైపు పరుగుతీసింది. రైల్వేస్టేషన్ చేరుకుంది. 


స్టేషన్ పేరు చూసి ఉలిక్కిపడింది. పార్వతీపురం. ఎక్కడి అరుకు? ఎక్కడి పార్వతీపురం? తనను కిడ్నాప్ చేసిన వారు ఎవరు? ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అంతా అయోమయంగా ఉంది. తలంతా దిమ్ము గా ఉంది. ఎక్కడయినా పడుకుని నిద్రపోవాలని ఉంది. కానీ వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి, తనని తీసుకుపోతే? ఆ ఊహకే భయం వేసింది కార్తీకకి. 


స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్లి అడిగింది. కూలీ ఏదో చెప్తూ, తనను అదోరకంగా చూసేసరికి భయం వేసి బయటకు పరుగుతీసింది. అయినా వెంబడించాడు వాడు. చీకట్లో నక్కింది. వాడు వెతికి వెళ్ళిపోయాక ప్లాట్ ఫారం పై ఉన్న కొళాయి దగ్గరకు వెళ్లి ముఖం కడుక్కుని, నాలుగు దోసిళ్ళ నీళ్లు తాగింది. ప్రయాణికులు తక్కువగా ఉన్నారు. తననే చూస్తున్న ఒక ముసలి వ్యక్తి దగ్గరకు వెళ్ళింది కార్తీక. 


"పెద్దాయనా! ఇప్పుడు ఏ రైలు వస్తుంది?" అడిగింది కార్తీక. 


"నువ్వు ఏడకు బోవాల?" ఆరాగా అడిగాడు ముసలివ్యక్తి. చేతిలో లగేజీ లేకుండా, కనీసం హేండ్ బేగ్ అయినా లేకుండా, రాత్రి వేళ ఒంటరిగా వచ్చిన కార్తీకను అనుమానంగా చూసాడు. 


"విశాఖపట్నం" చెప్పింది కార్తీక. 


"ఇప్పుడు అటు పోయే రైళ్లు లేవు. వచ్చినా ఇక్కడ పెద్దగా ఆగవు. బెలగాం పో. అక్కడ అన్ని రైళ్లు ఆగుతాయి. నీ సామాన్లేవీ?" అడిగాడు ముసలివ్యక్తి. 


అర్ధం కానట్లు చూసింది కార్తీక. "బెలగాం?" అంది ప్రశ్నార్థకంగా. 


"బెలగాం.. ఇలా ఇటు పోతే బెలగాం టేసను వస్తది. " అది కూడా తెలీదా అన్నట్లు చూసాడు. 


రోడ్ మీదకు వెళ్తే తనని ఎత్తుకొచ్చిన వాళ్ళు తిరిగి తనని వెతుక్కుంటూ వస్తే దొరికిపోతుంది. ఈ పట్టాలపై పరుగెత్తడం తప్ప గత్యంతరం లేదు తనకి. త్వరగా ఎక్కడికైనా చేరి నిద్రపోవాలన్నట్లు ఉంది కార్తీకకు. ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు అని నిశ్చయించుకొని, ఆ చీకటిలోనే పట్టాల మీదుగా బెలగాం వైపుగా పరుగు ప్రారంభించింది. ముసలివ్యక్తి ఆశ్చర్యంగా కార్తీక వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాడు. 

***


తీరిగ్గా భోజనం ముగించుకుని, ధాబా నుండి తిరిగి వచ్చారు ముగ్గురు యువకులు. కారు తలుపు తీసి ఎక్కబోతూ కారులో కార్తీక లేకపోవడం గమనించి కంగారుపడ్డారు. "ఏదిరా ఆ పిల్ల? ఎటు వైపు వెళ్ళింది" అనుకుంటూ చుట్టుపక్కల అంతా తిరిగి గాలించారు. ఆగి ఉన్న ఏ కారులో నైనా ఎక్కిందేమో అని చూసారు. తమ కారు ఎక్కి, వచ్చిన దారివెంట మళ్ళీ వెనక్కి వెళ్లి వెతికారు. అదే సమయంలో కార్తీక రోడ్ బదులు రైలు పట్టాల వెంట బెలగాం వైపు వెళ్తోంది. కార్తీక కనబడక, వెనుతిరిగి రాయగడా వైపుగా వెళ్లిపోయారు ఆ యువకులు. 


****

కార్తీక పరుగు పరుగున బెలగాం రైల్వేస్టేషన్ చేరి, వచ్చిన గూడ్స్ రైలు ఎక్కి, మత్తు ప్రభావం చేత, పరిగెత్తి అలసిపోయి ఉండటం చేత, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది. విజయవాడలో మేలుకొని, ఆగి ఉన్న రైలు దిగింది. కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర, ప్రసాదం స్వీకరించి, గతాన్ని తల్చుకున్న కార్తీక విశాఖపట్నం చేరే మార్గం అన్వేషించ సాగింది. మెట్ల మార్గం గుండా తిరిగి కొండ కిందకి వెళ్ళింది. కొంచెం దూరం నడిచింది. 


========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

1 Comment


@రత్నమంజరి

•3 days ago

👍

Like
bottom of page