top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 4

Updated: 7 days ago

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesinTelugu

ree

Case No. 37B - Part 4 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 22/09/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 4 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక పార్వతీపురం దాటి బెల్గాం లో గూడ్స్ రైలు ఎక్కింది. విజయవాడ చేరుకుంటుంది. కార్తీక పేరెంట్స్ ను కలవడానికి వైజాగ్ వెళ్తాడు శరత్. 


ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 4 చదవండి.. 


చేసేదేం లేక వెనుతిరగబోయాడు శరత్. దుకాణదారుని ముఖంలో చిన్న అసంతృప్తి. ‘అంతసేపు మాట్లాడి ఏం కొనకుండా వెళ్లిపోతున్నాడని దుకాణదారుని బాధ’ అనుకున్నాడు శరత్. 


"ఒక కొబ్బరి బొండాం కొట్టి ఇవ్వమన్నాడు శరత్. 


మహదానందంగా మంచి లేత బొండాం కొట్టి ఇచ్చాడు అతను. శరత్ కొబ్బరిబొండాం తాగి డబ్బులు ఇచ్చాడు. ఇంతలో దుకాణదారుని భార్య వచ్చింది. ఆమెను దుకాణదారుడు శరత్ కు పరిచయం చేశాడు. 


శరత్ "కార్తీక కనిపించకుండా పోయిన నాడు నల్ల అంబాసిడర్ కారు తిరిగి వెళ్లడం చూసారా?" అని అడిగాడు. 


కార్తీక ఫోటో చూపించాడు. ఆమె కార్తీకను గుర్తు పట్టింది. నల్ల అంబాసిడర్ కారు చిత్రాన్ని కూడా గుర్తు పట్టింది. ఆ అమ్మాయి కారులో కూర్చునే నిద్రపోతోందని, పక్కన ఒకడు, ముందు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారని చెప్పింది. 


"ఒక అమ్మాయితో కలిసి ముగ్గురు అబ్బాయిలు అరుకు వెళ్లారు. ఆ అమ్మాయి అరుకులో చాపరాయి జలపాతంలో పడి మరణించింది. కానీ వీళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు. తిరిగి వచ్చేటప్పుడు కార్తీకను కిడ్నాప్ చేశారు అనుకుంటే, వీళ్ళు అరుకు వెళ్లడానికి ముందు గానే బొర్రా దగ్గర ఇటికల పండుగ వసూళ్ల కోసం కారు ఆపినపుడు, కార్తీక ఫోటోలు తీసింది అని బిడ్డిక సోమ చెప్పేడు. అప్పుడే వీళ్ళు కార్తీకను అపహరించారు. తిరిగి కిందకు ఎప్పుడు వెళ్లారు? మళ్ళీ ఎందుకు వచ్చారు? కార్తీకను ఎందుకు అపహరించారు?" ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు అయ్యాయి. 


కార్తీక నెంబరుకు మళ్ళీ ఫోన్ చేసి చూసాడు. ఇంకా స్విచ్చడ్ ఆఫ్ అనే వస్తోంది. తిరిగి విశాఖపట్నం చేరుకున్నాడు శరత్. కార్తీక ఏ కంపెనీ సిమ్ వాడుతోందో కనుక్కుని, ఆ ఆఫీస్ కి వెళ్లి, తన వివరాలు చెప్పి, ఆఖరిసారిగా ఎక్కడ ఆ ఫోన్ వాడబడిందో కనుక్కున్నాడు. వాళ్ళు వెతికి ఇచ్చిన చిరునామా చూసి హతాశుడయ్యాడు. ఆ స్థలం అనంతగిరి దగ్గర చూపిస్తోంది. అరుకు ఎస్సైకి ఫోన్ చేసి, కార్తీక ఫోన్ ఆఖరి సిగ్నల్ అనంతగిరి పరిసరాల్లో చూపిస్తోందని, రోడ్ కు అటు ఇటు పొదల్లో వెతికించమని చెప్పేడు. తాను పనిచేస్తున్న ఆడిస్ సంస్థకు వెళ్లాడు. కామేశ్వరరావుకు అన్ని విషయాలు చెప్పి, దర్యాప్తుకు సంబంధించిన వివరాలు అన్ని రాసి, ఫైల్ లో పెట్టాడు. 


వివరాలు రాస్తూ ఉండగా కార్తీక తండ్రి చెప్పిన ఫోన్ కాల్ విషయాలు శరత్ స్ఫురణ లోకి వచ్చాయి. ఒకవేళ ఆ ఫోన్ చేసింది కార్తీక అయితే? ఆ ఆలోచన రాగానే వెంటనే ఫోన్ తీసి విజయవాడ పబ్లిక్ కాల్ అని రాసి పెట్టిన నెంబర్ వెతికి తీసి ఫోన్ చేసాడు. అవతలి వైపు ఎవరో మాట్లాడుతున్నారు. అరగంట ఆగి మళ్ళీ ఫోన్ చేసాడు. ఈసారి కూడా బిజీ. సహనం పోతోంది శరత్ కి. మళ్ళీ పావుగంట ఆగి ఫోన్ చేసాడు. ఈసారి రింగ్ అయ్యింది. ఎవరో ఫోన్ ఎత్తారు. 


"హలో" అన్నాడు శరత్.


"హలో, ఇది పబ్లిక్ ఫోన్. మీరెవరు? ఎందుకు ఫోన్ చేశారు? మీకు ఈ నెంబర్ ఎలా తెలుసు?" వరుసగా ప్రశ్నలు వేసాడు అవతలి వ్యక్తి.


దర్యాప్తు ముందుకు సాగక చిరాకుగా ఉన్న శరత్ కి ఆ ప్రశ్నలతో చిర్రెత్తుకొచ్చింది. అయినా తమాయించుకొని, "ఒక సమాచారం (ఇన్ఫర్మేషన్) కావాలి." అన్నాడు.


"ఇది రైల్వే విచారణ కేంద్రం కాదు, మీరు ఏది అడిగితే అది చెప్పడానికి." అన్నాడు అవతలి వ్యక్తి.


ఒళ్ళు మండిపోయింది శరత్ కి. "మిస్టర్! ఇటు వైపు మాట్లాడుతున్నది పోలీస్. ఒళ్ళు దగ్గరపెట్టుకుని అడిగిన వాటికి సమాధానం ఇవ్వు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జైలులో పడేస్తాను. జాగ్రత్త" అన్నాడు కటువుగా.


బెదిరినట్లున్నాడు అవతలి వ్యక్తి. "క్షమించండి సర్. పోలీస్ అని తెలియక ఏదేదో మాట్లాడేసాను. మీకు ఏ సమాచారం కావాలో అడగండి." అన్నాడు.


పాచిక బాగానే పారింది అనుకుంటూ, "ఈ మధ్య రెండు రోజుల్లో మీ దగ్గరకి వచ్చి, ఎవరైనా అమ్మాయి ఫోన్ చేసిందా?" అని అడిగాడు శరత్.


"ఏమిటి మాట్లాడుతున్నారు సర్, రోజూ ఎంతోమంది అమ్మాయిలు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఇక్కడ మాట్లాడింది కూడా అమ్మాయిలే" అన్నాడు అతను.


వీడితో ఇలా అయ్యే పని కాదనుకొని, "నీ ఎడ్రస్ చెప్పు." అన్నాడు శరత్.


"ఏ.. ఎందుకు సార్… వద్దు సార్… మీరు అడగండి సార్, చెప్తాను" అన్నాడు భయపడుతూ.


"ముందు ఎడ్రస్ చెప్తావా? లేదా? అది కూడా నేనే కనుక్కుని వచ్చి నిన్ను మక్కెలిరగ తన్నమంటావా?" అన్నాడు కోపంగా శరత్.


"చెప్తాను సార్. చాలామంది అమ్మాయిలు ఇక్కడి నుంచే ఫోన్ మాట్లాడుతారు సార్. కానీ రెండు రోజుల కిందట వచ్చిన ఒక నల్ల అమ్మాయి గురించా సార్ మీరు అడుగుతున్నారు? అది పిచ్చిది సార్. మంచి నీళ్ళు అడిగింది. తాగేక, ఫోన్ చూసి, చేసుకుంటానంది. చేసుకోమన్నాను. ఫోన్ చేసింది కానీ ఏమీ మాట్లాడలేదు సార్. ఫోన్ నేనే కట్ చేసాను." అని చెప్పాడు.


"నీ ఎడ్రస్ చెప్పు" అన్నాడు మళ్ళీ శరత్.


"సార్… సార్… సార్… వద్దు సార్… మీరడిగింది చెప్పేను కదా సార్, జైలుకు తీసుకు వెళ్లద్దు సార్" బతిమాలాడు అవతలి వ్యక్తి.


"తీసుకువెళ్లను కానీ, ఎడ్రస్ చెప్పు" అన్నాడు శరత్.


ఎడ్రస్ చెప్పి, శరత్ ఫోన్ పెట్టేయగానే ఫోన్ బూత్ కు తాళం పెట్టి, గబగబా బయటకు వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి.


******

బండి మీద వెళ్లిన వాళ్లలో ఇద్దరు తిరిగి వచ్చారు. “మాల్ ఇవ్వడం లేదని, వాళ్ళు వచ్చి మీతోనే మాట్లాడతామంటున్నారని” కారులో వచ్చిన వారికి చెప్పారు. ఇద్దరి మధ్య కాసేపు సంభాషణ జరిగాక వీళ్లిద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. అరగంట తర్వాత అందరూతిరిగివచ్చారు. వారితో పాటు నలుగురు కొత్త వ్యక్తులు వచ్చారు. వచ్చిన వారిలో ఒకరు కాస్త పెద్దవ్యక్తి. తనతో ఉన్న ముగ్గురు కుర్రాళ్లకు కారులో ఉన్నవారికి చూపించి, కాసేపు మాట్లాడి, ఆ ముగ్గుర్ని తీసుకుని తిరిగి వెళ్లిపోయారు. మాట్లాడుతూనే సరుకు ఎప్పుడు చేతులు మారిందో ఎవ్వరూ గుర్తించలేదు.

********


ఆలస్యం చేయకుండా అర్ధరాత్రి దొరికిన రైలు పట్టుకుని శరత్ విజయవాడ బయలుదేరాడు. వెలుగురేకలు విచ్చుకునే సమయానికల్లా విజయవాడలో దిగాడు. విజయవాడ మహానగరం నిద్రలేస్తూ ఉంది. రాత్రంతా సరిగ్గా నిద్రలేక మండుతున్న కళ్ళని, ముఖాన్ని చల్లని నీళ్లతో కడుక్కుని, స్టేషన్ బయట ఉన్న టీ దుకాణంలో టీ తాగి, ఫోన్ బూత్ ఎడ్రస్ గురించి వాకబు చేసాడు. 


దొరికిన ఆటో పట్టుకుని ఆ వైపుగా వెళ్ళాడు. స్టేషన్ కు దాదాపు ఔటర్ లాంటిది ఆ ప్రాంతం. రైలు పట్టాలకు ఉత్తరంగా అక్కడొకటి ఇక్కడొకటిగా ఇళ్ళు, దక్షిణంగా కాస్త దూరంలో బీడు భూమి కనిపించాయి. కాలిబాట మీదుగా ఇళ్ళవైపు నడిచాడు. ఒక సిమెంట్ రోడ్ లో ఎడమవైపు టెలిఫోన్ బూత్ కనిపించింది. ఆ పక్కనే ఒక కూడలి ఉంది. దుకాణాలు ఏవి ఇంకా తెరవలేదు. 


పాల పేకెట్లు, పేపర్లు వేసే కుర్రాళ్ళు సైకిళ్ల మీద తిరుగుతున్నారు. ప్రశాంతంగా వాకింగ్, జాగింగ్ చేసే కుర్రాళ్ళు, యువతులు, వృద్ధులు కొందరు తిరిగి వస్తున్నారు, కొందరు వెళ్తున్నారు. పనిచేసుకునే కొందరు స్త్రీలు ఆ రోడ్ పక్కన ఉన్న దుకాణాల ముందర తుడిచి, నీళ్లు చల్లి ముగ్గులు పెట్టి వెళ్తున్నారు. "హాయిగా రాత్రి నిద్రపోయి, ఉదయం రైలుకు వచ్చి ఉంటే దుకాణాలు తీసి ఉండేవి, తనకు కావలసిన సమాచారం దొరికి ఉండేది, అనవసరంగా అర్ధరాత్రి బయలుదేరి వచ్చాను" అనుకున్నాడు శరత్. 


"దర్యాప్తు చేపట్టి నాలుగురోజుల గడిచిపోయాయి. కార్తీక దొరుకుతుందన్న నమ్మకం సన్నగిల్లిపోతోంది. తానే ఇలా అధైర్యపడితే, కార్తీక తల్లిదండ్రుల మాటేమిటి" అనుకున్నాడు. తల విదిలించి, అక్కడ కనిపించిన టీ దుకాణంలోకి వెళ్లి కూర్చున్నాడు. ఒక టీ చెప్పేడు.


"బాబూ… ఈ ప్రదేశానికి కొత్తా? ఎప్పుడూ ఈ ప్రాంతాల్లో చూడలేదు తమరిని." అన్నాడు టీకొట్టు ఆసామి టీ ఇస్తూ.


తాగుతున్న టీ గుటకవేయబోతూ ఉలిక్కిపడ్డాడు శరత్. "ఈ ప్రాంతంలో ఉన్న అందరూ నీకు పరిచయమేనా పెద్దాయనా?" అని అడిగాడు.


"నేను ఇక్కడ పాతికేళ్లుగా టీకొట్టు నడుపుతున్నాను. నాకు తెలియని మనుషులు లేరు, నాకు తెలియని విషయము లేదు బాబూ" అన్నాడు గర్వంగా…


వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లైంది. "ఈ మధ్య ఈ ప్రాంతంలో ఏదైనా సంఘటన జరిగిందా? ఎవరైనా అమ్మాయి స్పృహ తప్పి పడిపోవడం లాంటివి…" అడిగాడు శరత్.


కాసేపు తల గోక్కుని "అమ్మాయి సంగతి ఏమో కాని, ఒక పిచ్చిది తూలుతూ నడుస్తూ వచ్చి పడిపోయింది. మొకం మీద ఎన్ని నీళ్లు కొట్టినా లెగకపోతే 108 కి ఫోన్ చేస్తే, వాళ్ళు వొచ్చి, ఆస్పత్రికి తీసుకెళ్లిపోయారు." అన్నాడు టీ కొట్టు ఆసామి.


"చందర్రావు, అప్పుడే కదా మినీ వేన్ ఒకటి తిరగబడిపోయింది. అప్పుడు గాయపడిన వాళ్ళని కూడా అదే అంబులెన్స్ లో ఎక్కించి తీసుకుపోయారు కదూ" అన్నాడు టీ తాగడానికి వచ్చి, వీళ్ళ సంభాషణ విన్న స్థానికుడొకడు. "అవునవును. ఇద్దరికి కాళ్ళు, చేతులు విరిగినాయి. ఇద్దరికి బుర్ర పగిలింది డైవరుకు ఎన్ని దెబ్బలు తగిలినాయో లెక్కలేదు. మరో నలుగురికి చిన్న దెబ్బలు తగిలాయి." అన్నాడు టీకొట్టు ఆసామి.


"ఏ హాస్పిటల్ లో చేర్చారు?" అడిగాడు శరత్.


"ఏక్సిడెంటు కేసు కదా, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు" అన్నాడు అతను.


ఫోన్ లో ఉన్న కార్తీక ఫోటో అక్కడ ఉన్నవారికి చూపించి, "ఈ అమ్మాయి ఆ గాయపడిన వారిలో కానీ, స్పృహ తప్పిన అమ్మాయి కానీ అవుతుందా?" అని అడిగాడు.


"అబ్బే ఈ అమ్మాయి కాదు బాబూ… అసలు ఇలాంటి అమ్మాయే అక్కడ లేదు" తేల్చేశారు వాళ్ళు. అక్కడ ఉన్న అందరూ కార్తీక ఫోటోను ఓసారి చూసి ఇచ్చారు.


అయినా సరే ఆ ఆసుపత్రికి వెళ్లి విచారిస్తే, కార్తీక ఆచూకీ దొరకవచ్చు అని నమ్మకంగా అనిపించింది శరత్ కి. వాళ్ళకి ‘థాంక్స్’ చెప్పి, అక్కడనుంచి బయలుదేరబోయాడు. "ఇదిగో బాబూ, ఇంతకీ నువ్వెవరు? ఆ పిల్ల నీకేటవుద్ది? ఆపిల్లకి ఏమైంది?" వరుసగా ప్రశ్నలు వేశారు టీకొట్టు ఆసామి, స్థానికుడు…


ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, వినిపించనట్లు ముందుకుపోయాడు శరత్. 


దారిన పోయే ఆటో పట్టుకుని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడు. అక్కడ ఆవరణ ఊడుస్తున్న పనివారిని మొన్నటి ఏక్సిడెంటు గురించి, చేరిన వ్యక్తుల గురించి కనుక్కున్నాడు శరత్. మొదట ఒక పట్టాన చెప్పలేదు వాళ్ళు. ఇది ఏక్సిడెంటు కేసు కాబట్టి ఏ వివరం చెప్పడానికి ఇష్టపడలేదు. శరత్ జేబులో నుండి ఒకనోటు తీసి వారి చేతిలో పెట్టాడు. 


వెంటనే డ్రైవరు, తల పగిలిన ఒక అమ్మాయి మరణించారని, చిన్న గాయాలు అయినవాళ్ళు అప్పుడే చికిత్స తీసుకుని వెళ్లిపోయారని, మిగిలిన వాళ్ళు లోపల వార్డులో ఉన్నారని చెప్పారు. మరణించిన వారి శవాలకు ఇవాళ పోస్ట్ మార్టం చేస్తారని, నిన్న ఆ డాక్టర్ అప్పటికే వెళ్లిపోయాడని, శవాలు శవాలగదిలో ఉన్నాయని కూడా చెప్పారు. మరో నోటు చేతులు మారేసరికి, శవాల గదికి తీసుకువెళ్లారు. అక్కడ కాపలాదారుకు విషయం చెప్పి, శరత్ ని లోపలికి పంపించారు. 


ముక్కు మూసుకుని లోపలికి వెళ్లి చూసాడు. ఇనప బల్లలపై దాదాపు ఆరేడు శవాలున్నాయి. కింద మరో రెండు. అన్నిటినీ పరిశీలనగా చూసాడు శరత్. వివిధ కేసుల్లో నిన్న, మొన్న మరణించిన వారే అంతా… బంధువులు రాక కొన్ని, వివరాలు తెలియక మరికొన్ని అక్కడ పడి ఉన్నాయి. వాటిలో కార్తీక ఆచూకీ లేదు. గబగబా బయటకు వచ్చి, కొళాయి దగ్గర మొఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకున్నాడు. 


"వార్డులోకి వెళ్లి చూడాలి" అని అడిగాడు శరత్.


"కష్టం బాబూ… ఇప్పుడు లోపలికి రానియ్యరు. పది దాటాల" అన్నారు వాళ్ళు శరత్ జేబువైపు చూస్తూ…


వాళ్ల చూపుల్ని పట్టించుకోకుండా "సరే అయితే" అని చెప్పి, దగ్గరలో ఉన్న ఒక మాదిరి లాడ్జిలో రూమ్ తీసుకుని, స్నానం చేసి, ఒక గంట విశ్రాంతి తీసుకుని, టిఫిన్ చేసి పది గంటలకల్లా తిరిగి వచ్చాడు.


అప్పటికే ఓపీ ప్రారంభమయ్యింది. రోగులు, వారి సహాయకులు ఆసుపత్రి నిండా చేరి ఉన్నారు. లోపలికి వెళ్లి, వార్దుబాయ్ కి విషయం చెప్పి, చేతిలో నోటు పెట్టేసరికి, ఏక్సిడెంటు జరిగిన పేషేంట్లు ఉన్న జనరల్ వార్డుకు తీసుకువెళ్లి, "త్వరగా చూసి వచ్చేయండి" అన్నాడు. అందరిని చూసి, బయటకు వచ్చి, "ఒక బెడ్

ఖాళీగా ఉంది, ఎవరూ లేరా?" అన్నాడు శరత్.


"బెడ్ ఖాళీ లేక కొందరిని వరండాలో బెంచీల మీద పడుకోపెడుతున్నారు. బెడ్ ఎందుకు ఖాళీ గా ఉంటుంది?" అంటూ, అక్కడ ఉన్న నర్స్ ని అడిగాడు. ఆ నర్సు కంగారు పడిపోతూ “ఇక్కడ ఓ పిల్ల ఉండాలి” అంది. 


వార్దుబాయ్ సహాయంతో బాత్రూం సహా అంతటా వెతికింది. ఆ పేషేంట్ మాయమైన విషయం తెలిసింది. షీట్ మీద పేరు కోసం చూసాడు శరత్. "తెలియదు" అని ఉంది. 


నర్స్ గాభరాపడుతూ, "ఈ పేషేంట్ కి నిన్న రాత్రి వరకు స్పృహ రానేలేదు. 3 సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. తిండి నీళ్లు లేక పడిపోయింది అన్నారు. కానీ రాత్రి స్పృహ లోకి వచ్చింది. పేరు అడిగితే పిచ్చి చూపు చూసింది. ‘వేను ఏక్సిడెంటు వలన తలకి దెబ్బ తగిలిందేమో, ఉదయం చూద్దాం’ అన్నారు నైట్ డ్యూటీ డాక్టర్ గారు. ఇంతలో ఎలా మాయమైపోయింది? ఎక్కడకు పోయింది?" అని అడిగిన వాళ్లకు, అడగని వాళ్లకు చెప్పి వాపోతోంది. 


ఫోన్ లో ఉన్న కార్తీక ఫోటో చూపించాడు శరత్. "ఈ అమ్మాయేనా?" అని అడిగాడు. 


"ఈ పిల్ల కాదు. కానీ ఆ పిల్ల కూడా పేంట్ షర్ట్ తోనే ఉంది. ఒళ్ళంతా, ముఖమంతా మసి దట్టంగా పట్టి ఉంది" అంది నర్సు.


శరత్ మార్చురీ నుంచి బయటకు వచ్చి, కుళాయి దగ్గర ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కునే సమయంలో ఆ పక్కనుండే వెళ్ళిపోయింది కార్తీక. వెళ్లిందని శరత్ కి తెలియదు, తనకోసం శరత్ వెతుకుతున్నాడని, అతడు ఇక్కడే ఉన్నాడని కార్తీకకు తెలియదు. 


========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

1 Comment


@nagamanjarig1315

•1 day ago

ధన్యవాదాలండీ

Like
bottom of page