top of page

ఫ్యాక్షన్ చచ్చిపోయింది

#PallaVenkataRamarao, #పల్లావెంకటరామారావు, #FactionChachhipoyindi, #ఫ్యాక్షన్

ree

Faction Chachhipoyindi - New Telugu Story Written By - Palla Venkata Ramarao

Published In manatelugukathalu.com On 21/09/2025

ఫ్యాక్షన్ చచ్చిపోయింది - తెలుగు కథ

రచన: పల్లా వెంకట రామారావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

 

మొబైల్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు రాయుడు.


అవతల నుంచి "అన్నా! నేను వీర శేఖర వర్మని" అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి.


దానికి రాయుడు "నీ నెంబరు ఫీడ్ చేసుకున్న లేబ్బా. పేరు పడతాది. నువ్వు చెప్పాల్సిన పనిలే, అయినా నువ్వే నాకు అన్న లాగా ఉంటావు. నేను నీకు అన్ననేంది?" అన్నాడు.


"అంటే సీమలో అలాగే పిలవాలి కదా" అన్నాడు వీర.


"అబ్బో సీమ నీళ్లు వంటబట్టినాయే. సర్లే ఏంది విషయం?" అడిగాడు రాయుడు.


"చెప్పినా కదా నిన్ను కలవాలి, నీతో చాలా పని ఉంది అని" బదులిచ్చాడు వీర.


"సరేలే రా.. నాకూ ఇప్పుడు పనేం లేదు గాని" అనుమతి ఇచ్చాడు రాయుడు.


"పాస్వర్డ్ గుర్తుంది కదా" అనుమానంగా అడిగాడు వీర.

 "ఆ.. ఆ.. గుర్తుంది లేబ్బా! ముందు నువ్ రా.." కాస్తంత విసుగ్గా అన్నాడు రాయుడు.

 *****

తుమ్మ చెట్టు కింద రాయుడు కూర్చొని ఉండగా వీర శేఖర్ వచ్చాడు. దగ్గరికి వచ్చి " ఆకాశం ఎర్రగా ఉంది" అంటూ ఒక రకమైన స్వరంతో పలికాడు వీర.


రాయుడు పైకి చూసి ఒకలాగా మొహం పెట్టి "యాడా.. మామూలుగానే ఉందే" అన్నాడు.


వీర "పాస్వర్డ్ మర్చిపోయావా?"అన్నాడు.

 

రాయుడు నాలుక కరుచుకుని "ఆ మర్చిపోయినా. మల్లడుగు" అన్నాడు.


వీర "ఆకాశం ఎర్రగా ఉంది" అన్నాడు మళ్లీ.


రాయుడు "అది పులి చంపిన లేడి నెత్తురుతో ఎర్రబడింది" అని బదులిచ్చి మళ్లీ ఎక్స్ప్రెషన్ మార్చి.


"అయినా పాస్వర్డ్ అంటే వన్ టూ త్రీ ఫోర్ అట్ ది రేట్ ఆఫ్ స్టార్ ఇలా పెట్టుకుంటారు కదా! ఇదేంది?" అని అడిగాడు.


దానికి వీర "అదేంటి సీమ లో పుట్టిన నీకు తెలియదా? ఫ్యాక్షనిస్టులు ఇలాగే పెట్టుకోవాలి కదా!" ఒకింత ఆశ్చర్యంగా అడిగాడు.

రాయుడు "ఇక్కడ ఫ్యాక్షనిస్టులు ఎవరున్నారబ్బా" అంటూ దిక్కులు చూశాడు.


హా అంటూ బాధగా మూలిగాడు వీర.


"సర్లే గానీ ఇంతకీ నీ బాధేంది చెప్పబ్బా" సూటిగా అడిగాడు రాయుడు.


వెంటనే వీర "సింధూరం.. రక్త చందనం.. బందూకం.. సంధ్యారాగం కావాలోయ్ కసి కవనానికి" అంటూ గట్టిగా పలికాడు.


అది విన్న రాయుడు "ఇది శ్రీ శ్రీ రాసిన కవిత కదూ. కసి అనే పదం ఒకటి నువ్వు తగిలిచ్చినావ్" అన్నాడు.


మళ్లీ హా అంటూ మూలిగాడు వీర.


ఏమబ్బా మాటిమాటికీ అట్టా మూల్గుతన్నావ్. కొంపదీసి పైల్స్ ఏమన్నా ఉన్నాయా?" అడిగాడు రాయుడు.


మళ్లీ హా అంటూ మూలగబోయి తమాయించుకుని అడ్డంగా తలూపాడు వీర.


"ఇంతకీ నీకేం కావాలో చెప్పరాదు" సూటిగా అడిగాడు రాయుడు.


"కసి... పగ తీర్చుకోవాలి" బదులిచ్చాడు వీర.

"ఎవరిపైనా" తాపీగా అడిగాడు రాయుడు.


"నా శత్రువు పైన" అన్నాడు వీర.


"అందరూ శతృవు పైనే పగ తీర్చుకునేది. మితృలమీద తీర్చుకుంటారా? సర్లే ఎందుకు తీర్చుకోవాలా?" అడిగాడు రాయుడు.


"వాడి వల్ల మా కుటుంబం ఊరువదిలి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను దేశమే విడిచి వెళ్లాను. అమెరికాలో ఉన్నాం. ఇన్నాళ్లకు పగ గుర్తుకొచ్చి వచ్చినా" మాటల్లో ఆవేశం చూపాడు వీర.


"ఎట్లా గుర్తొచ్చింది?" మరింత తాపీగా అడిగాడు రాయుడు వీర ఆవేశాన్ని పట్టించుకోకుండా.


దానికి వీర "మొన్ననే రిలీజ్ అయింది కదా 'చూస్తే చంపేస్తా' అనే మూవీ. ఆ సినిమా చూశాక నా పగ గుర్తొచ్చింది" అన్నాడు.


"సర్లే ఇంతకీ నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావ్?" అడిగాడు రాయుడు.


వీర రెచ్చిపోతూ "మనుషుల్ని వెంటేసుకుని ఊరికి రావాలా. ఊరి మధ్యలో నిలబడి నా శత్రువుని తొడకొట్టి సవాల్ చేయాలా. వాడు కొట్లాట కొస్తే కొడవలితో తెగనరకాల. దాని కోసం నువ్వు మనుషుల్ని, కొడవళ్లని సప్లై చేయాలా. బాంబులు కూడా కావాల. చెప్పు చేస్తావా? కావలసినంత డబ్బులు ఇస్తా" గబగబా చెప్పాడు.


దానికి రాయుడు ఊ అని దీర్ఘం తీసి "నువ్వు ఇంకా ఏ కాలం లో ఉండవబ్బా. ఇప్పుడు ఎవరూ పంచలెగ్గట్టి కొడవళ్లు పట్టుకుని తిరగడం ల్యా. బాంబులు చుట్టేవారే లేరు. పంట కోయడానికి కూడా కొడవళ్లు వాడడంల్యా. మిషన్లతో కోస్తండారు. ఇంగ మనుషులు అంటావా ఉపాధిపని మొదలైన కాడినుంచి ఐదు వందలు ఇస్తామన్నా కూలి పనులకు ఎవరూ రావడం ల్యా. ఇంగ ఇట్లాంటి దానికి ఎవరొచ్చ్యారు?”


 వీర ఆశ్చర్యంగా చూశాడు.


"పెళ్ళాన్ని, తల్లిని కూలికి పంపి, పేకాట ఆడ్తా, మందు తాగి ఊరికైనా ఉంటన్నారు గానీ ఎవరు కష్టపడడంల్యా. నీకు ప్రాణాలకు తెగించి వచ్చారా? లచ్చలిచ్చినా కూడా రారు.అయినా ఇప్పుడు ఎవరికి ఏం బలం ఉందనీ. గట్టిగా తొడలు కొడితే లోపల ఎంకలు పుటుక్కున ఇరుగుతాయి . ఇప్పుడు అందరూ తాగేది క్యాన్ వాటర్ కదా. దానికి తోడు బిపీలు, షుగర్, గ్యాస్ ట్రబుల్లు ఉంటాయి" చెప్పుకుపోతున్నాడు రాయుడు.


అయోమయంగా చూస్తున్నాడు వీర.


"నెల నెలా రేషన్ షాపులో సరుకులొచ్చ్యాయి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే పింఛన్లొచ్చ్యాయి. గవర్నమెంట్ బడిలో చదువు ఫ్రీ. రోగాలు వస్తే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. పెద్ద రోగాలొచ్చే ఆరోగ్య పథకం ఉంది. గవర్నమెంట్ ఇల్లు కట్టి ఇస్తాది. ఇంక పని చేయాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఎవరూ రారు. ఒళ్లొంచి పనులు చేసుకోడానికే బరువైతాంటే నీకు కొట్లాటలకొచ్చారా? భలేవాడివే" అన్నాడు రాయుడు.


"మరి శత్రువు మీద పగ తీరేది ఎట్టా?" ఆవేశంగా ప్రశ్నించాడు వీర.


"వచ్చిన కాన్నుంచి ఇంటాండా శత్రువు.. పగ.. అంటన్నావు. ఇంతకీ ఎవరా శత్రువు?" అడిగాడు రాయుడు.


"సందులో గంగన్న" ఊగిపోతూ చెప్పాడు వీర.


"సరి పోయింది పో. ఆ గంగన్నా, వాని పెళ్ళాం.. ఏనాడో చచ్చిపోయారు.


"అవునా! అయితే వాని కొడుకులు ఉంటారుగా" అన్నాడు వీర.


"ఉండేది ఒక కొడుకు. వాడు సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటూ పూనేలో ఉండాడు. అయినా వాన్తో నీకేం పని?" ప్రశ్నించాడు రాయుడు.


"వాని మీద పగ తీర్చుకుంటా" అన్నాడు వీర.


"అదే ఎట్లా? వాడేం చేసినాడు?"


 "ఏం ఆస్తులు పంచుకున్నప్పుడు పగకూడా పంచుకోవాలి కదా" అన్నాడు వీర.


రాయుడు అతని వంక ఓ టైపులో చూసి"నువ్వు తెలుగు సినిమాలు బాగా చూచ్చావు కదా!" అని అడిగాడు.


 దానికి వీర "అవును నీకు ఎట్లా తెలుసు? అమెరికాలో ఏ సినిమా రిలీజ్ అయినా చూస్తా.ముఖ్యంగా మన ఫ్యాక్షన్ సినిమాలు, యాక్షన్ సినిమాలు" అన్నాడు.


విన్న రాయుడు చాలా సహనంతో "తెలుచ్చాందిలే. చూడబ్బా! నీకు సినిమాలు ఇష్టం ఉంటే బొమ్మ కొని అమెరికాలో ఆడిచ్చుకో. పది రూపాయలు లెక్కొచ్చాది. ఇంకా లెక్క ఎక్కువైతే అనాథాశ్రమాలు,వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఆడికి పోయి అన్నదానమో, ఇంగొకటో చెయ్. పుణ్యం, పేరు వస్తాది. అంతేగాని ఇట్లాంటి పిచ్చి పనులు ఎందుకబ్బా? సినిమాలదేముంది? యాపారం కోసం అతిగా తీస్తారు. అది చూసి అట్నే చేసినావంటే సంకనాకిపోయేది నువ్వే. 


అయినా ఇప్పుడు సీమలో ఫ్యాక్షన్ యాడుందబ్బా? ఎప్పుడో చచ్చిపోయింది. అందరూ చదువుకుంటున్నారు.

సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటున్నారు. ఏం నువ్వు ఒక్కనివే అమెరికాకు పోయినా అనుకుంటున్నావా? ప్రతి యేటా వేలాది మంది సీమ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు, ఎన్నో దేశాలకు పోతన్నారు. సీమ ప్రజల గురించి ఇలా ఆలోచించడం మంచిది కాదు. అయినా వేరే చోట ఎంత దారుణం జరిగినా హత్య అంటారు. అదే సీమలో జరిగితే ఫ్యాక్షన్ అంటారు. ఎందుకీ తేడా? 


ఇయ్యన్నీ మానుకోండబ్బా. బాగుంటాది. సీమ అనగానే బాంబులు, కొడవళ్ళు అంటారు.ఏమయ్యేమన్నా వంటికి తగిలిచ్చుకోని తిరుగుతారా ఇక్కడోళ్ళు?. రోంత బుర్రపెట్టి ఆలోచించండి " ఘాటుగా చెప్పాడు రాయుడు. ఆ ఘాటుకు వీర శేఖర్ బుర్రలోని తుప్పు వదిలిపోయింది.

 *****************************

సూచన: కథ రాయలసీమ మండలికంలో రాయడం జరిగింది.

***

పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు

Profile Link:


జన్మస్థలం:     ప్రొద్దుటూరు, కడప జిల్లా. 

జననం:         1974 

తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ

చదువు:        ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)

ఉద్యోగం:       స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) 

అభిరుచి:      సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్)  travel India telugu     

                    (యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)

రచనలు:  'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,

                   వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,

                   బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల

                   ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల

                   బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

 సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం

                    మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ      

                    కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా 

                    రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ 

                    వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.

1 Comment


@That_Fellows

•13 hours ago

Like
bottom of page