top of page

విద్యయా అమృత మష్నుతే

#VidyayaAmruthaMaghnathe, #విద్యయాఅమృతమష్నుతే, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Vidyaya Amrutha Maghnathe New Telugu Story Written By Dr. Brinda M N

Published In manatelugukathalu.com On 21/09/2025

విద్యయా అమృత మష్నుతే - తెలుగు కథ

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


ఇల్లంతా కోలాహలం, మామిడాకుల తోరణాలతో కళకళ, ఆడపడుచుల సాంప్రదాయ వస్త్రధారణంతో తళతళలు, చిన్నారుల చిరునవ్వుల కేరింతలు, ముదుసలివారి ముసిముసి నవ్వుల ముచ్చట్లు, వరసైన వారి వయ్యారాల ప్రేమ వలపులు, అబ్బో, ఎన్నో, ఎన్నెన్నో.


"ఏంటే! పెళ్లికూతురా, ఎప్పుడు ముస్తాబవుతావంటా? ఇంకా రెండు గంటలు ఉంది ముహూర్తానికి" పిన్ని రుసరుసలు. 


"అందరూ తలావో చేయి వెయ్యండర్రా, రండి" మేనత్త పెద్దరికం. 


"అదేంటమ్మా, మనవరాలా! ముఖంలో కాస్త కళ గూడా లేదు, జీవచ్ఛవంలా ఏంటా చూపు?" అమ్మమ్మ గడుసుతనం. 


"మా స్నేహితురాలు చదువుకుంటానంటే వినక, కుయ్యో మొర్రో అన్న పట్టించుకోక, పెళ్లి చేస్తే ఎలా?" కోపంతో స్నేహితురాలు వ్యంగ్యం.


కబుర్లతో చకచకా పెళ్లిపీటలపై పెళ్లికూతురు కూర్చోవడం, మాంగల్యధారణ అవటం, అరుంధతి నక్షత్ర దర్శనం, అప్పగింతల కార్యక్రమంతో చేతులు దులుపుకున్నారు పెద్దలు. 


అత్తయ్య ఇంటికి వచ్చిన నితిక్షకు అంతా వింతగా తోచింది భర్త మోతుబరి రైతు, పంట పొలాలు బాగానే ఉన్నాయి. 

 

"నితిక్ష, వంట చేయలేదా, ఇలా కూర్చుని ఆలోచిస్తే ఇంటి పని ఎవరు చేస్తారమ్మా? వెళ్ళు పని చూసుకో" అత్తమ్మ పెత్తనం. 


మౌనంగా వెళ్ళింది వంటింట్లోకి నితిక్ష. పెద్ద కుటుంబం కావడంతో విపరీత పని ఒత్తిడితో సతమతమవుతోంది. భర్తతో మాట్లాడడానికి అవకాశం లేకపాయే. చూస్తూ ఉండగానే నితిక్ష నీల్లోసుకుంది. నెలలు దగ్గర పడడంతో పుట్టింటికి వెళ్ళింది. 


సీమంతానికి అనుకోకుండా టీచరు వచ్చింది. "నితిక్ష.. అయిందేదో అయింది, నీకు డెలివరీ అయిన తర్వాత వీలు చూసుకుని అప్పుడప్పుడు చదువు మీద శ్రద్ధ పెట్టమ్మా"

 

తల ఊపింది నితిక్ష.


"నితీ! చూడు మొన్న నాకు ఆటల్లో ప్రథమ బహుమతి, చిత్రలేఖనంలో తృతీయ బహుమతి, నువ్వే ఉంటే ఇలా ఎన్నో బహుమతులు గెలుచుకునే దానివి, కానీ వద్దులే నీ బొజ్జలో బాబు ఉన్నాడు కదా! బాగా చూసుకో" స్నేహితురాలు పరామర్శ.

చంటిబిడ్డ, పెద్దవారు, బంధువుల సపర్యలతో ఐదేళ్లు గడిచాయి. ముగ్గురు పిల్లల తల్లి అయింది నితిక్ష. ఒకరోజు పొలానికి కావాల్సిన అత్యవసర సామాగ్రిని తీసుకొస్తున్న సమయంలో విధి వక్రించి నితిక్ష భర్తకు యాక్సిడెంట్ అయింది, కాలం చేశాడు. 


పల్లెటూరు కావడంతో నితిక్షకు తెల్లచీర అంటించి అన్నింటికీ దూరం ఉంచేవారు. పిల్లల్ని అసహ్యంగా చూసేవారు. బయటకు వెళితే పోకిరిల పుప్పొడి మాటలు. 


"ఇదిగో అమ్మాయి! రేపు నీ పిల్లల్ని పొలానికి పంపు, ఆ పని, ఈ పని చేయడానికి వీలుగా ఉంటుంది" బావగారి ఆజ్ఞ. 


మౌనంగా తల ఊపింది నితిక్ష. 


వారం రోజుల పాటు పొలానికి వెళ్లి బురదంతా పూసుకొని పొక్కులు, పుండ్లతో ఇంటికి వచ్చారు పిల్లలు. తట్టుకోలేక పోయింది నితీక్ష. అమ్మమ్మ ఆరోగ్యం బాలేదని కబురు వస్తే పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళింది. 


"నితిక్ష, నిన్ను చూస్తే గుండె తరుక్కు పోతుంది" ఏడ్చింది అమ్మమ్మ. 


"దాని కర్మ అలా తగలెడితే ఎవరేం చేస్తారమ్మ" తల్లి జవాబు.

 

విషయం తెలుసుకున్న టీచర్ స్నేహితురాలితో పిల్లల్ని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పి పంపింది నితిక్షకు. 


"నితిక్ష, నువ్వు బాగా చదివే పిల్లవి. మీ అమ్మానాన్న నీ గొంతుకోశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా ఓపెన్ లో పదవ తరగతి కట్టి చదివి పాస్ అవ్వు. నీ కాళ్ళ మీద నిలబడడం అలవాటు చేసుకో"


"సరే, టీచర్"


అత్తగారింటికి వచ్చిన నితిక్ష చాలా సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. గొడవల అనంతరం పిల్లల్ని తీసుకుని పట్టణానికి వచ్చింది. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని వారాలకు కుదుర్చుకుంది. కష్టపడి పని చేసి వచ్చిన డబ్బుతో పిల్లల్ని చూసుకుంటూ పది, ఇంటర్, డిగ్రీ పాసయ్యింది. 


ఇంట్లోనే చిన్న ట్యూషన్ కేంద్రం ప్రారంభించింది. అందరీ పిల్లలతో పాటు తన పిల్లలకి కూడా పాఠాలు అక్కడే చెప్పేది. ఒకసారి ఓ పిల్లవాడి తండ్రి వాళ్ళ బాబుని తీసుకుని వెళ్ళడానికి వచ్చి నితిక్ష చెప్పే పాఠాన్ని విని ఆశ్చర్యపోయాడు. 


"అమ్మ! మీరు ఏం చదువుకున్నారు? ఇంత చక్కగా చెబుతున్నారు"


"డిగ్రీ చదువుకుంది మా అమ్మ" పెద్దవాడు గొప్పగా చెప్పాడు. 


"మీరు బిఎడ్ చేయలేదా?"


"అంటే" నితిక్ష ప్రశ్నార్థకం. 


ఆయన అంతా వివరించి, విధానం చెప్పి పుస్తకాలు, పరీక్ష ఫీజులకు డబ్బులు ఇచ్చాడు. 


"వద్దండి"


"అయ్యో! మీలాంటి వారికి సేవ చేసే పుణ్యాన్ని దక్కనీయవమ్మా. "


పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల, వసతి గృహ సదుపాయాలు ఉన్న చోట చేర్పించింది. తాను కూడా దగ్గర్లోనే జాయిన్ అయింది. ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని, కష్టాల కడలిని దాటుకుని, తన పని తాను చేస్తూ బీ. ఎడ్ పూర్తి చేసింది. అదృష్టం తలుపు తట్టినప్పుడు అన్ని అలా తన్నుకు వస్తాయి కాబోలు. చిన్ననాటి స్నేహితురాలు బజారులో కనిపించింది. 


"నితిక్ష ! ఏంటే నువ్వేనా! ఇలా, మన ఊరు వెళ్లినప్పుడు మీ ఇంటికి వెళ్ళా, నీ గురించి ఏమో కథలు కథలుగా చెప్పారు, బాధేసింది. కానీ నువ్వు నా కళ్ళముందు అంటూ" గట్టిగా ఆలింగనం చేసుకుంది. 


"పరిమళ నాది బి. ఎడ్ అయిపోయింది"


"వాట్! రియల్లీ! నితీ! ఎంత శుభవార్త చెప్పావు, నువ్వు డీఎస్సీ ఎగ్జామ్ రాయాలి, నేను స్కూల్లో టీచర్గా పని చేస్తున్నాను, నా శక్తి మేరకు నీకు సహాయం చేస్తాను. "


"సరే"


సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వచ్చారు. కూతురు, మనవడు, మనవరాళ్లను చూసి ఆనందించారు. 


"అమ్మ! నువ్వు ఒప్పుకుంటే మంచి సంబంధం చూస్తాం. అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాం. " తండ్రి మాట. 


"అవును నితిక్ష, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. వారిని ఎక్కడైనా చేర్పించి నువ్వు క్రొత్త జీవితాన్ని ప్రారంభించు. " తల్లి ఉవాచ. 


"అమ్మ! నువ్వు ఒక ఆడదానివై ఇలా మాట్లాడుతున్నావా? నాన్న! ఇంకో పెళ్లి చేసుకుని రెండోసారి విధవ కావాలా? జీవితమంటే ఒంటరి పోరాటం అని బాగా అర్థమైంది. బ్రతకడానికి నీడను చూసుకున్నాను చాలు, " 


తల్లిదండ్రులు మారు మాట్లాడకుండా, నెమరు వేసుకొని జీవితంలోని చేదు అనుభవాల్ని గుక్క త్రిప్పకుండా చెప్పింది నితిక్ష. 


డీఎస్సీ పరీక్షకు సంపూర్ణంగా సన్నద్ధమై కష్టపడి రాసి మంచి ఉత్తీర్ణత సాధించి టీచర్ పోస్ట్ కొట్టింది నితిక్ష. పరిమళ ఇంటికి మిఠాయిలతో వెళ్ళింది. 


"పరిమళ, నీ ఋణం ఎలా తీర్చుకోను, నీవల్లే ఈరోజు ఉద్యోగం వచ్చింది. "


"అవేం మాటలే, నువ్వు నా ప్రాణ స్నేహితురాలు, నువ్వు కష్టపడుతూ అహో రాత్రులు సాధన చేశావు, సాధించావు అంతే"


 పిల్లలు పది, ఇంటర్, డిగ్రీ స్థాయిలకు చేరుకున్నారు వారున్న చోటు కంటే కొద్ది దూరంలో పోస్టింగ్ ఇచ్చారు నితిక్షకు క్రొత్త కావడంతో చిన్నగా పని నేర్చుకుంటుంది 

నితిక్ష. ఆరు నెలల తర్వాత అనుకోకుండా ప్రభుత్వ పథకాల కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టర్ పాఠశాలకు వచ్చాడు. ఏదో పనిమీద పాఠశాల చివరి వరకు వెళ్ళిన నితిక్షకు ఆ సమూహంలో దూసుకెళ్లడం వీలుకాక పోయింది. 


రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఊరి జనం చుట్టూ మూగడంతో కలెక్టర్ గారిని చూడలేకపోయింది పైగా అందరూ తప్పుకోండి తప్పుకోండి, దారి ఇవ్వండి, దారి ఇవ్వండి కలెక్టర్ గారికి దారి ఇవ్వండి అంటూ కేకలు పెట్టడం చూసి నివ్వెర పోయింది నితిక్ష. 


తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల వలన తనకు బయట ప్రపంచం తెలీదు. బి. ఎడ్ చేస్తున్నా కూడా పిల్లలు, ఇల్లు ఆరోగ్యం పైనే శ్రద్ధ ఉంచడంతో ఇతర విషయాలపై వ్యాపకం ఉండేది కాదు. మరుసటి రోజే పరిమళ ఇంటికి వెళ్ళింది. 


"పరిమళ, నిన్న కలెక్టర్ గారు వచ్చారు మా పాఠశాలకు" అంటూ జరిగినదంతా వివరించింది. 


"ఓ, పంతులమ్మ! కలెక్టర్ను పలకరించలేదన్నమాట!! నవ్వుతూ ఉంది పరిమళ. 


"పరిమళ, ఏం చేస్తే అలా అవుతారే?"


"ఏంటే"


"అదే కలెక్టర్ కావాలంటే"


"ఓసి, నీ దుంప తెగ, కొంపతీసి కలెక్టర్ కావాలనే నీ ఉద్దేశం"


"పరిమళ, నేను జీవితంలో అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు, పిల్లలు పెద్దవారయ్యారు, వారికి కష్టం విలువ తెలుసు ప్రతి పైసా విలువ కూడా తెలుసు, లోకజ్ఞానం నిండుగా ఉంది, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలరు అన్న గట్టి నమ్మకం ఉంది వారికి ఒకసారి మంచేదో చెడు ఏదో ఇంకొన్ని తార్కాణాలు తీసుకొని వివరిస్తాను, ముందుకు తీసుకెళ్తారు. ఇది చదవడానికి ఏం చేయాలో చెప్పవే"


"నితిక్ష ! నువ్వు స్థితిలో ఉండే మాట్లాడుతున్నావా? ఏంటే, నీ కోరికకు అంతుబొంతూ లేకుండా పోతుంది. "


 "ఏం పరిమళ, నేను కలెక్టర్ అయితే తప్పేంటి"


"అది కాదు నితిక్ష"


"మరి, చెప్పు పరిమళ"


పరిమళ గ్రూప్స్ గురించి క్షుణ్ణంగా వివరించింది. అంతే పాఠశాలకు వెళ్లి రిజైన్ చేసి, రెండేళ్లు కోచింగ్ తీసుకుని బాగా కష్టపడి చదివి డిప్యూటీ కలెక్టర్గా ఆర్డర్స్ తీసుకొని కొలువులో జాయిన్ అయిన మూడు రోజులకే తను పనిచేసిన పాఠశాలకు తనిఖీకి వచ్చింది. 


అనుకోకుండా వచ్చిన నితిక్షను చూసి అందరూ అవాక్కయ్యారు. పట్టుదల, ధ్యేయం, లక్ష్యం, కృషి, సంకల్పం గొప్పవైతే గొప్పవారు కాకుండా పోతారా? 


‘విద్యయా అమృత మష్నుతే’ అనే కవచాన్ని సంపూర్ణంగా తొడిగిన ఘనత నితిక్షకే దక్కుతుంది అని మనసులో అనుకుంటూ ఆనందాశ్రువులు రాలుస్తూ అలాగే ఉండిపోయింది పరిమళ. 


నీతి: కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం, పట్టుదల ఉంటే కానిది లేదు, వీటికి ప్రత్యక్ష సాక్షులు మనలోనే ఉంటారు. మన మధ్యనే ఉంటారు. వారి జాడలో నడుస్తూ ముందడుగు వేసినప్పుడే జీవితం సుగమ్యమవుతుంది. 

 

 "జై తెలుగుతల్లి! జై భరతమాత"


 సమాప్తం


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


Comments


bottom of page