అహంకారమా! సెలవు
- Dr. C S G Krishnamacharyulu
- Sep 21
- 6 min read
#CSGKrishnamacharyulu, #CSGకృష్ణమాచార్యులు, #అహంకారమాసెలవు, #AhankaramaSelavu, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ahankarama Selavu - New Telugu Story Written By - Dr. C. S. G. Krishnamacharyulu
Published in manatelugukathalu.com on 21/09/2025
అహంకారమా! సెలవు - తెలుగు కథ
రచన: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
సాయంత్రం అయిదు గంటల సమయం. ఎండ వేడి తగ్గింది కానీ, గాలిలేక వుక్క పోత పెరిగింది. అప్పుడే యిల్లు చేరిన సురేష్, భార్య ఇంట్లో లేదని గ్రహించి, చికాకు, కోపం అతిశయించగా, భార్యను వుద్దేశించి తిట్లదండకం అందుకున్నాడు. అంతలో ఇంటి ద్వారం గంట మ్రోగింది.
“వచ్చింది మహా తల్లి. ఎప్పుడనగా వెళ్ళిందో. ఇన్నాళ్ళు అణిగిమణిగి వున్న ఈ మనిషికి ఇంత స్వతంత్రం యెలా వచ్చింది? ఎవడినైనా తగులుకుందా? లోనికి వచ్చాక కడిగి పారేస్తా, ” అని అనుకుంటూ తలుపు తీసాడు.
ఎదురుగుండా అతని భార్య శ్యామల, ఆమె ప్రక్కన ఒక యువతి.
"ఎవరీ అమ్మాయి?" కటువుగా అడిగాడు సురేష్.
"ముందు లోనికి రానివ్వండి. ఇది వివరంగా చెప్పే విషయం" అంటూ శ్యామల లోనికి వచ్చేందుకు అడుగు ముందుకు వేసింది.
"అలా కుదరదు. చెప్పే లోనికి రా. నీ స్నేహితురాలి కూతురు కదూ. ఎందుకు తీసుకొచ్చావు?"
"ఇలా బయటే నిలబెట్టి, నిలదీయడం మంచి పని కాదు. ముందు లోపలికి రానివ్వండి. "
అవమానంతో యెర్రబడ్డ ఆమె ముఖం, గొంతులో ధ్వనించిన కాఠిన్యం, అతడిని వెనక్కి వెళ్ళేలా చేసాయి.
శ్యామల, ఆ యువతిని నేరుగా రెండో పడక గదిలోకి తీసుకుని వెళ్ళింది.
"నిద్ర లేక కళ్ళు యెర్రబడ్డాయి. పడుకో. భోజనం వేళ నిద్రలేపుతాను" అని చెప్పి హాలులో కూర్చుని వున్న భర్త దగ్గరికి వచ్చింది. అతని కెదురుగా సోఫాలో కూర్చుని, " మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసారు. అందుకే ఫోన్ కలవలేదు. చీటీ వ్రాసి బల్ల మీద పెట్టి వెళ్ళాను. చూడ లేదా "
“ఆ విషయం వదిలెయ్యి. ఈ అమ్మాయి సంగతి చెప్పు. "
" నా స్నేహితురాలు వనజ గురించి తెలుసుకదా. అది కేన్సరుతో చనిపోయింది. దాని భర్త అయిదేళ్ళక్రితం కరోనా తో చనిపోయాడు.. ఈ బిడ్డ బాధ్యత తీసుకునే బంధువులెవ్వరూ లేరు. అందుకే ఆ అమ్మాయి బాధ్యత నేను తీసుకున్నాను. "
" నేనున్నాను అని ఎగబడి బాధ్యత తీసుకున్నావు. నా అనుమతి అక్కరలేదా? నా ఇంట్లో స్థానం, నా సంపాదనాలో భాగం, ఒక అనాధకి నేనెందుకు ధారాదత్తం చెయ్యాలి? నా పనులు ఎగ్గొట్టి, అనాధలను నెత్తికెక్కించుకుంటానంటే నేనొప్పుకోను. తీసుకుని వెళ్ళి అనాధాశ్రమంలో చేర్చి రా!"
“నేను కాపురానికి వచ్చినప్పుడు మీ అమ్మగారు, ఒక మాట చెప్పారు. నాకొడుక్కి అహం, తన మాట చెల్లాలన్న పంతం వున్నాయి. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ మీ మధ్య అనురాగం పెరుగుతుంది వాడి అహం తగ్గుతుంది. అలాగే. వయసుతో పాటు మానసిక పరిపక్వత పెరిగి పంతం పోతుంది. అంతదాకా నువ్వు సర్దుకుపోతే మీ కాపురం నిలబడుతుంది.
ఆ మాటకు వయస్సు పదేళ్ళు. ఇన్నాళ్ళ మన కాపురం, మీలో యే మార్పూ తేలేకపోయింది. మీ పంతం, మీ అహంకారం అలాగే వున్నాయి. కానీ నేను మారాను. నా కలల ప్రపంచానికి దూరమయ్యాను. మీకు సేవలు చేసీ చేసీ, ఒక సేవాయంత్రంగా మారిపోయాను. ".
"ఏదో గొప్ప విషయంలా చెప్తున్నావేంటి. మన పెద్దలు భార్యని కార్యేషు దాసి అనే చెప్పారు. నీ ధర్మం నువ్వు పాటిస్తున్నావు. "
"నాకేనా ధర్మాలు, మీకుండవా? భర్తను కార్యేషు యోగి అన్నారు. మీరలా వున్నారా? కోపంతో చెలరేగిపోతున్నారు."
"నేనింతే. ఇలాగే వుంటాను. ఆ అమ్మాయి బాధ్యత తీసుకోవడం నాకిష్టం లేదు. రేపు ఆ అమ్మాయి ఎవడితోనో లేచిపోతే.. పొలీసు కేసులవీ నా వల్ల కాదు. "
"అలా అనుకునే బదులు ఆ అమ్మాయి ఇంజినీరై, మంచి వుద్యోగం చేస్తుందని అనుకోవచ్చు కదా?"
"అవన్నీ గాలి కబుర్లు. ఇది డేటింగులు, మేటింగుల కాలం. పాత రోజుల్లో యేమో గాని, ఈకాలంలో ఆడపిల్ల గుండెల మీద కుంపటే. మర్యాదగా రేపు వుదయం, ఆ అమ్మాయిని ఆశ్రమంలో చేర్పించు. ”
"అలా చేయడం నాకిష్టం లేదు. నా స్నేహధర్మం ఆమెను నా కూతురిగా చూసుకోవడం. "
"అయితే, ఆ అమ్మాయితో బాటే నువ్వూ వెళ్ళిపో"
శ్యామల కొద్ది సేపు మౌనంగా వుండిపోయింది. ఆ మౌనం అతడి ఆవేశాన్ని తగ్గించి, విచక్షణని పెంచుతుందని ఆమె ఆశించింది. కానీ, అతడి ముఖ వైఖరిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో, నిరాశకు గురై యిలా అంది.
"నేను వెడితే మీరెలా వుంటారు? అన్నీ నేను చేసిపెట్టినా అసంతృప్తిగా వుండే మీకు నేను లేకుండా జరుగుతుందా?"
"జరగనిది నీకు. నువ్వు సంపాదించే ముష్టి ఇరవైవేలు చాలక, వేరే దిక్కు లేక, నువ్వూ, ఆ పిల్లా నా దగ్గరికే వస్తారు. ఆ అవమానం నీకెందుకు గాని, ఆ పిల్లను అనాధాశ్రమంలో చేర్చి, హాయిగా నాతో వుండు"
" అవమానాలు.. అవకాశమే లేదు. ఊరకే పగటి కలలు కనకండి. రేపు వుదయం మీరు పలహారం తిన్నాక, ప్రశాంతంగా ఆలోచించి, నేను వుండాలో లేక వెళ్ళాలో చెప్పండి. ఇప్పుడు నాకు వంట పని వుంది, " అంటూ శ్యామల వంట గదివైపు వెళ్ళింది.
@@@
అది అమావాస్య రాత్రి కావడంతో, ఆకాశం కారు చీకటి తెరల మాటున దాగింది. అంధకారాన్ని చూడడం ఇష్టం లేక, సురేష్ కిటికీ తలుపులు మూసి మంచం మీద కూర్చున్నాడు. శ్యామల రాలేదు. రెండో పడక గదిలో ఆ అమ్మాయికి తోడుగా పడుకుని వుంటుందన్న ఆలోచన కలిగించిన వెగటు భావంతో, అతడు, పడుకుని అసహనంగా అటూ ఇటూ దొర్లాడు. క్రమంగా అతనికి సాయంత్రం శ్యామల అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. రోషంతో అతని మనసు త్రుళ్ళిపడింది. అతనిలా అనుకున్నాడు.
“అహంకారం, పంతం అంటూ నిందారోపణలు చేసింది. పేదరికంలో వున్న అమ్మాయిని దయతో పెళ్ళి చేసుకున్నందుకు కృతజ్ణతతో వుండక, ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతోంది. నేను మారలేదట, అమ్మ చెప్పింది కాబట్టి సేవలు చేస్తోందట, లేకుంటే చెయ్యదా? తనకి వేరే ఆప్షన్ వుందా? తనేమన్నా భూలోక రంభా, ఏ మగవాడైనా వెంటబడి ఆరాధించడానికి?
అజ్ణానంతో, అహంకరించి మాట్లాడుతోంది. బయటి ప్రపంచంలో ఒక్క నెల రోజులు వుండగలదా? అయినా దీనికి జరగాలి శాస్తి. అప్పుడే కాళ్ళ బేరానికి వస్తుంది. రేపు వెళ్ళిపొమ్మని చెప్పేయ్యాలి. " అలా తీర్మానం చేసుకున్నాక సురేష్ మనసు కుదుట బడింది. కొద్దిసేపటిలో నిద్ర పట్టింది.
రెండో పడక గదిలో, శ్యామల సురేష్ మాటలకు భయపడ్డ హాసినికి మనోధైర్యాన్ని పెంచే విషయాలు ఎన్నో చెప్పింది.
“రేపటినుంచి నీకు నేను, నాకు నువ్వు. నా వుద్యోగం మనకి అన్నం పెడుతుంది. నీ చదువుకు, నా అత్తగారిచ్చిన బాంక్ డిపాజిట్లు వున్నాయి. మనకి కావల్సింది ధైర్యం. అది ఎప్పుడూ కోల్పోకు. నాలుగేళ్ళు నువ్వు కష్ట పడితే ఇంజినీర్ అయిపోతావు. మంచి ఉద్యోగం వస్తుంది. అవునా ! మరింక దిగులెందుకు? అప్పుడు, ఈ అంకుల్ వచ్చి నిన్ను, నన్ను మెచ్చుకుంటారు. నీ పెళ్ళి ఆయనే దగ్గరుండి జరిపిస్తారు. నీ తల్లి ఆశీస్సులవల్ల అన్నీ శుభప్రదంగా జరుగుతాయి. “
శ్యామల మాటల ప్రభావంతో హాసిని నిశ్చింతగా నిద్రపోయింది. నీలిరంగు విద్యుద్దీప కాంతిలో కూర్చున్న శ్యామలకు, ఒక్క సారిగా దిగులనిపించింది. ఆమె యిలా అనుకుంది.
“పది సంవత్సరాల తర్వాత నాకోసం నేను నిలబడాల్సిన అవసరం వచ్చింది. సతి ధర్మం పతి సేవయే అన్న సంప్రదాయ వాదులు కూడా, భార్య మనోరధాన్ని నిర్లక్ష్యం చెయ్యమని భర్తలకు సలహా యివ్వలేదు. నా అదృష్టం, నా అత్తగారు నన్ను బానిసగా భావించలేదు.
ఏ నాడైనా నీకు నా కొడుకుతో వుండలేని పరిస్థితి వస్తే, నువ్వు నిస్సహాయురాలివిగా వేదన చెందకూడదు. అందుకే, నీ పేర బాంకులో డిపాజిట్లు వేసి వుంచాను. అవి, ఈ నగలు నీ అభిమానాన్ని కాపాడుతాయి అని ఒకనాడు యిచ్చిన ధైర్యమే ఈ నాడు, నా స్నేహధర్మాన్ని, నిర్వర్తించే అవకాశాన్నిచ్చింది. ”
నిర్వేదంతో శ్యామల అత్తగారికి మనసులో ప్రణామాలర్పించింది.
@@@
ప్రతి రోజూలాగే సురేష్ ఇల్లు చేరాడు. శ్యామల యిల్లు విడిచి వెళ్ళదని, ఆ అమ్మాయిని ఆశ్రమంలో దిగవిడిచి వచ్చేస్తుందని, అతని ప్రగాఢ నమ్మకం. కానీ అతనికి శ్యామల బదులు ఆశాభంగం యెదురైంది. బల్ల మీద వ్రాసి వున్న లేఖ అతని మనసులో మంటలు రేపింది.
శ్రీవారు,
నన్ను మన్నించండి, తొలిసారిగా, మీ మాట విననందుకు. నాకు తప్పలేదు. ఒక యువతిని, అందులో నా ప్రియమైన స్నేహితురాలి కూతురిని, ఈ కుటిల కామపిశాచుల లోకంలోకి ఒంటరిగా
పంపి మిత్ర ద్రోహానికి, ఆత్మ హననానికి పాల్పడకూడదని వెళ్ళిపోతున్నాను.
నాకు మీగురించే బెంగ. స్త్రీ మగవాడు లేకున్నా బ్రతకగలదు. మగవాడు అలా కాదు. భౌతికంగా, మానసికంగా, అతడికి స్త్రీ సహాయం అవసరం. పని మనిషిని మానకుండా రమ్మని చెప్పాను. మనకు తెలిసిన వంట మనిషిని రమ్మన్నాను. మంచి జీతమిచ్చి పెట్టుకోండి. మీ మందులు ఇంక మీరే చూసుకోవాలి. జాగ్రత్త. మీకు అవసరం పడినప్పుడు, ఫోన్ చెయ్యండి. వస్తాను, కానీ హాసినితో మాత్రమే. మళ్ళీ పెళ్ళి చేసుకోదల్చుకుంటే చెప్పండి. విడాకులు తీసుకుందాము.
ఆరోగ్యం జాగ్రత్త.
శ్యామల.
ఆ వుత్తరం చదివాక సురేష్ లో అంతర్మధనం ప్రారంభమైంది.
“శ్యామల కావాలని నన్ను విడిచి వెళ్ళలేదు. నేను నిర్దయగా గెంటేస్తే వెళ్ళిపోయింది. వెడుతూ ఒక తల్లిలా ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. వెళ్ళి ఇంటికి తెచ్చుకుంటే?”
అలా తలచి అతని మనసు మెత్త పడే వేళ అతని అహం తిరగబడింది.
“ఆ ఆలోచనే వద్దు. ఆడది హద్దుల్లో వుండాలి. కష్టాలు పడి, కాళ్ళ మీద పడ్డప్పుడు చూద్దాం. ఈలోగా నా పని నేను చేసుకోగలనని నిరూపిస్తాను".
అహానికి తలొగ్గిన అతను, మనసు రాయి చేసుకున్నాడు.
@@@
రెండు నెలలు గడిచేసరికి సురేష్ కి జ్ఞానోదయమైంది.
పనిమనిషి స్వేచ్చాజీవి. నచ్చినప్పుడు వచ్చి నచ్చిన పని చేసి వెళ్ళిపోతుంది, వంట మనిషి కులాసా పక్షి. రీల్స్ చూస్తూ వంట చేస్తుంది. రుచి అనే పదం ఆమె వండిన పదార్ధాలకు తెలియదు. మందులు టైముకు వేసుకోవడం కుదరడంలేదు. ఇవన్నీ భౌతిక కష్టాలు. ప్రేమగా పిలుస్తూ, తన చుట్టూ తిరిగే ఆమె తిరిగి వచ్చేలా లేదు. ఆజ్ణలు జారీ చేసే నోటికి పనిలేక, పిచ్చెక్కిపోతోంది. ఇలాంటి మానసిక కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఉండబట్ట లేక శ్యామల సహోద్యోగినిని కలిసి విచారిస్తే ఆమె యిలా చెప్పింది.
“హాసినిని ఇంజినీరింగ్ కాలేజిలో చేర్పించింది. తను ఉద్యోగం చేస్తూ, ఇంటి వద్ద, సాయంత్రం మ్యూజిక్ తరగతుల ద్వారా అదనంగా సంపాదిస్తోంది. హాసిని చాలా మంచి పిల్ల, శ్యామలని కన్న తల్లిగా భావించి, పనులలో సహాయం చేస్తూ, చదువుకుంటోంది. వారిద్దరూ అన్యోన్యంగా, ఆనందంగా వుంటున్నారు. ”
శ్యామల జీవితం నిశ్చింతగా సాగుతోందన్న వార్త, అతనికి అశనిపాతంలా తగిలింది. అతను వేదనతో మానసికంగా కృంగిపోయాడు. రెండురోజులు తీవ్రంగా ఆలోచించి ఇలా అనుకున్నాడు.
“మగవాడు లేకున్నా స్త్రీ హాయిగా బ్రతకగలదు గానీ, స్త్రీ లేకుండా మగవాడు బ్రతకలేడన్న మాట నిరూపితమైంది. ఇన్నాళ్ళు ఆమె నా అహాన్ని, పంతాన్ని గెలిపించింది. అందుకు కృతజ్ణతగా ఒక్క సారి ఆమెను గెలిపించలేని మూర్ఖుడినయ్యాను. ఒక అనాధ ఆడపిల్లపట్ల దయ చూపలేని స్వార్ధపరుడినయ్యాను.
ఇంక ఆలస్యం వద్దు. నాకు సరైన బ్రతుకు దారి చూపని అహంకారమా, ఇంక సెలవు. శ్యామలని నా సహచరిగా ప్రేమిస్తాను. హాసినికి తండ్రి ప్రేమని అందిస్తాను. ” అలా అనుకోగానే, అతని మనసు వుల్లాసభరితమైంది,
@@@@@
C..S.G . కృష్ణమాచార్యులు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: Dr. C..S.G . కృష్ణమాచార్యులు
శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, తిరుపతి లో మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసరుగా రిటైర్ అయ్యాను. ప్రస్తుత నివాసం పుదుచెర్రీ లో. నేను రచించిన మేనేజ్మెంట్ పాఠ్య గ్రంధాలు ప్రెంటిస్ హాల్, పియర్సన్ ఎడ్యుకేషన్, వంటి ప్రముఖ సంస్థలు ప్రచురించాయి.
ఈ మధ్యనే నాకిష్టమైన తెలుగు రచనా వ్యాసంగం, ప్రారంభించాను. ఆ సరస్వతీ మాత కృపవల్ల కొన్ని బహుమతులు గెలుచుకున్నాను. అందులో కొన్ని. చేజారనీకే జీవితం- నవల, ( కన్సొలేషన్ -మన తెలుగు కథలు .కాం ). మనసు తెలిసింది, చీకటి నుంచి వెలుగుకు, (వారం వుత్తమ కథ- మన తెలుగు కథలు .కాం), గురువే కీచకుడైతే (3 వ బహుమతి - విమల సాహితీ ఉగాది కథల పోటీ) ఒకే పథం- ఒకే గమ్యం( ప్రత్యేక బహుమతి --వాసా ప్రభావతి స్మారక కథల పోటీ- వాసా ఫౌండేషన్ & సాహితీకిరణం), తెలుగు భాష (ప్రత్యేక బహుమతి- పద్యాలు - షార్ సెంటర్ ఉగాది పోటీ), జంటగా నాతి చరామి ( కన్సొలేషన్- సుమతి సామ్రాట్ కథల పోటీ).
సర్ర్వసాధా రణము .ఎప్పుడు కోపము వచ్వ్హినా ఇది నా ఇల్లు .ఇంట్లోనుండీ వెళ్ళు అని మగవాళ్లే అంటారు . ఆడ్స్వాళ్ళ్స్కు హక్కు లేనట్లు అహంతో మాట్లాడటము .నిజాన్ని చెప్పినతీరు బాగుంది .
ఈ కధ చాల బాగా రాసారు.🙏🌻
మన సమాజంలో చాలా కుటుంబాలలో సురేష్ లాంటి మగవాళ్ళని చూస్తాము. ఆన్నీ చేసే భార్యను లోకువగా చూస్తారు. మూర్కత్వం, అహంకారం, చేతకానితనంతో ఉన్న సురేష్ అనే పాత్రని, మార్చి ముగింపు ఇవ్వడంలో, రచయిత గారి సున్నితమైన మనుసు మరియు ఈ కధ ద్వారా సమాజంలో వీలైనంత మార్పు రావాలన్న ఆకాంక్ష కనిపిస్తోంది. నేను అయితే బ్రతకడం చేతకాక, గుర్తింపు సంక్షోభంలో సురేష్ పోయాడని రాసుంటా.
మగవారిలో సహజంగా ఉండే పురుష అహంకారాన్ని రచయిత చాలా చక్కగా వర్ణించారు. చివరగా సురేష్ వాస్తవాన్ని గ్రహించి,మనసున్న మనిషిగా మారాలనుకోవడం కథకు కొసమెరుపు.