top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 3

Updated: Sep 22

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesinTelugu

ree

Case No. 37B - Part 3 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 17/09/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 3 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక పార్వతీపురం దాటి బెల్గాం లో గూడ్స్ రైలు ఎక్కింది. విజయవాడ చేరుకుంటుంది. కార్తీక పేరెంట్స్ ను కలవడానికి వైజాగ్ వెళ్తాడు శరత్. 


ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 3 చదవండి.. 


సత్యనారాయణ, విశాలాక్షి దంపతులు నివసిస్తున్న ఇంటికి చేరుకున్నాడు శరత్. రెండు అంతస్తుల ఇల్లు సత్యనారాయణ గారిది. ఇంటి ముందు కళ్ళాపి జల్లి ముగ్గు పెట్టి ఉంది. ఒక మామిడి చెట్టు, ఓ మాదిరి కాయలతో నిండుగా ఉంది. బోలెడన్ని పూల మొక్కలు కూడా ఆ ఆవరణ లో ఉన్నాయి. మామిడి చెట్టు కింద రెండు కుర్చీలు వేసి ఉన్నాయి. మధ్యలో ఉన్న చిన్న టేబిల్ పై ఉన్న రేడియోలో నుంచి వార్తలు వస్తున్నాయి. 


కుర్చీలలో ఉన్నది సత్యనారాయణ, విశాలాక్షి దంపతులు అని గ్రహించాడు. తనని తాను పరిచయం చేసుకున్నాడు శరత్. కార్తీక తల్లి ముఖం వాడిపోయి ఉంది. తండ్రి కూడా దిగులుగా కనిపించాడు.

 

"బాబూ మా అమ్మాయి ఆచూకీ ఏమైనా తెలిసిందా?" ఆత్రంగా ప్రశ్నించింది విశాలాక్షి.


"లేదండీ. ఆ పని మీదనే వచ్చాను. కార్తీక కనబడకపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పగలరా?" అడిగాడు శరత్. 


"విశాలా! కాస్త మజ్జిగ తీసుకురా, ఎండనపడి వచ్చాడు అబ్బాయి" అన్నారు సత్యనారాయణ గారు.


"సరే" నని ఇంటి లోపలికి వెళ్ళింది విశాలాక్షి.


"మా అమ్మాయి చురుకైనది, తెలివైనది. చరిత్ర అన్నా, పురావస్తు శాస్త్రం అన్నా ఎంతో ఇష్టం కార్తీకకు. తన అభిరుచి మేరకు చదువుకుంది. డా. శ్యాం సుందర్ గారి దగ్గర పనిచేస్తోంది. పది రోజుల కిందట అరుకులో తవ్వకాలు అంటే అందరితో కలిసి వెళ్ళింది. ఆదివారం నాడు వచ్చి, కనిపించి వెళ్ళింది. 


రోజూ రాత్రి పూట ఫోన్ చేస్తుంది. పగటి పూట పనిచేసేచోట సిగ్నల్స్ సరిగ్గా ఉండవని చెయ్యదు. వెళ్లి నాలుగురోజులైనా గడవలేదు. ఇంతలో కార్తీక కనిపించడం లేదని శ్యామ్ గారు ఫోన్ చేశారు. ముందు రోజు రాత్రి కూడా మామూలుగానే ఫోన్ చేసి మాట్లాడింది. 


హడావిడిగా నేను, విశాల బయలుదేరి వెళ్లాం. అక్కడ అందరిని విచారించారు. అంతటా వెతికారు. వాళ్ళతో పాటు మేము కూడా వెతికాము. కార్తీక ఆచూకీ దొరకలేదు. మరుసటి రోజు ఉదయం పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వచ్చాము" అన్నారు సత్యనారాయణ. 


మజ్జిగ తీసుకు వచ్చింది విశాలాక్షి. మజ్జిగ పుచ్చుకొని, "ఇంకేమైనా చెప్పండి" అన్నాడు శరత్. 


"ఎక్కడికి వెళ్లినా మా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఫోన్ చేసి చెప్తుంది బాబూ. అలాంటిది ఎక్కడికి వెళ్లిందో? ఏమైపోయిందో? అర్ధం కావడం లేదు. ఫోన్ చేద్దామంటే స్విచడ్ ఆఫ్ అని వస్తోంది. తిండి సహించడం లేదు, నిద్ర రావడం లేదు. ఎక్కడ ఉందో పిల్ల." అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంది విశాలాక్షి.


"మీరు అధైర్యపడకండి మేడం. ఎలా అయినా కార్తీక గారి ఆచూకీ కనిపెడతాను. ఇంకా చెప్పవలసింది ఏమైనా ఉందా? మీకు ఎవరిపైనైనా అనుమానం ఉందా?” అడిగాడు శరత్.


“ఎవరిపైనా అనుమానం లేదన్నా”రు సత్యనారాయణ గారు.


“శ్యాం సుందర్ ఎలాంటి వారు?” అడిగాడు శరత్.


“చాలా మంచివారు. కార్తీక ఆయన దగ్గరే చదువుకుంది. చదువు పూర్తవగానే ఆయన దగ్గరే ఉద్యోగంలో చేరింది.” చెప్పింది విశాలాక్షి.


“సరేనండి. నేను మరి నేను వెళ్లి వస్తాను. మీకేదైనా అనుమానంగా ఉన్నా, ఏ విషయం తెలిసినా నాకు ఫోన్ చేయండి” అని తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు శరత్.


మౌనంగా తల ఊపారు కార్తీక తల్లిదండ్రులు. 


శరత్ ప్రహారీ గోడ దాటుతూ ఉండగా, "బాబూ శరత్!" పిలిచారు సత్యనారాయణ.


వెనుదిరిగి చూసాడు శరత్.


"మాట" అన్నారు సత్యనారాయణ.


వెనక్కి వచ్చాడు శరత్.


"రెండు రోజుల కిందట నాకు, మా ఆవిడకి ఒకే నెంబర్ నుంచి ఫోన్లు వచ్చాయి. విశాల ఫోన్ గదిలో ఉండిపోయింది. నాకు ఫోన్ వచ్చింది కానీ ఎవరూ పలకలేదు. ఏడ్చినట్లు అనిపించింది. మళ్ళీ ‘ఎవరూ’ అనగానే కట్ చేశారు. విశాల ఫోన్ లో కూడా ఆ నెంబర్ తో మిస్సడ్ కాల్ ఉండడంతో ఆ నెంబర్ కి ఫోన్ చేసాను. 


అది విజయవాడలో ఒక పబ్లిక్ ఫోన్. ముందు తెలియదు అన్నాడు. గట్టిగా అడిగితే, జ్ఞాపకం తెచ్చుకొని, అరగంట కిందట ఎవరో పిచ్చిది వచ్చి ఫోన్ చేసిందని, బయటకు వెళ్లి స్పృహ తప్పి పడిపోతే, ఎవరో హాస్పిటల్ కి తీసుకువెళ్ళేరని చెప్పేడు. మీకు ఈ సమాచారం ఏమైనా ఉపయోగపడుతుందా?" అని అడిగారు సత్యనారాయణ. 


"ఆ నెంబర్ మీ దగ్గర ఉందా ఇప్పుడు?" ఆతృతగా అడిగాడు శరత్.


ఫోన్ తీసి, ఆ నెంబర్ చెప్పారు సత్యనారాయణ. తన ఫోన్ లో ఆ నెంబర్ రాసుకుని, "నేను మీకు ఏ విషయం తర్వాత చెప్తాను" అని వెళ్ళిపోయాడు శరత్.


శరత్ కార్తీకను చేరుకున్నాడా? కార్తీక ఫోన్, హాండ్ బాగ్ ఏమయ్యాయి? స్పృహ తప్పిన కార్తీక ఏమయ్యింది?


****************

యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్. చక్కగా చదువుకునే పిల్లలు ఎందరు ఉంటారో, ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసే పిల్లలు అంతకు రెండు రెట్లు ఉంటారు అక్కడ. ఖరీదైన తల్లిదండ్రులు ఉన్న పిల్లలకు చెంచా గిరి చేసేవాళ్ళు కొందరు. గుంపును వెంటేసుకుని తిరగడం వారికి సరదా. సరదాలు, అవసరాలు తీరడం వీళ్ళకి ముఖ్యం. అలా తీర్చుకునే సరదాల్లో సినిమాలు, షికార్లకి తోడు సిగరెట్లు, ఖైనీలు, మందులతో పాటు ఈమధ్య కాలంలో మత్తు పదార్ధాలు కూడా చేరుతున్నాయి. 


ఆ పెద్ద వ్యక్తుల పిల్లలు నేరుగా ఈ వ్యవహారంలో కలగజేసుకోరు. హాస్టల్ లో ఉండే పిల్లలకు డబ్బు, ఆ వ్యక్తుల ఆచూకీ ఇస్తారు. ఈ పిల్లలు ఏదో సాహసం చేస్తున్నట్లు ఊహించుకొని మధ్యవర్తులుగా వ్యవహరించి, ఆ వ్యాపారుల నుంచి రహస్యంగా సరుకు కొని తమ స్నేహం చేసే ఆ పెద్ద కుటుంబాల పిల్లలకు అందజేస్తారు. ప్రతిఫలంగా వీరికి కూడా కొంత వాటా ఇవ్వడంతో వీరు కూడా ఆ మత్తు పదార్ధాలకు అలవాటు పడుతున్నారు. 


కొందరు రాజకీయనాయకులకు, సంఘ విద్రోహ శక్తులకు కూడా ఇక్కడి కొందరు విద్యార్థులతో సత్సంబంధాలు ఉంటాయి. వారికి అవసరమైన సందర్భాలలో ఏవో ఆశలు చూపించి, గుంపుగా విద్యార్థులను సభలకు పంపడం, కొట్లాటలు, గొడవలు, అల్లర్లు జరిగినప్పుడు వెనుక నుండి కొందరు పిల్లలని ప్రేరేపించి, గొడవ పెద్దది అయ్యేలా చూడటం, తర్వాత నెమ్మదిగా జారుకోవడం ఇత్యాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి.


కారులో వచ్చిన విద్యార్థులు ఇంకా మాల్ రాలేదని అసహనంగా ఎదురు చూస్తున్నారు. కొందరు తమని ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండే పరాన్నభుక్కులను విచారిస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా దాచి పెట్టి ఉంటే ఇమ్మని బతిమలాడుకొంటున్నారు. 


ఇంతలో సరుకు వచ్చినట్లు ఫోన్లకి సందేశాలు వచ్చాయి. మధ్యవర్తి కుర్రాళ్ళు డబ్బులు పట్టుకుని, వేగంగా బండ్లపై బయలుదేరి వెళ్లిపోయారు. కార్లలో వచ్చిన పిల్లల మొహాల్లో రిలీఫ్ కనబడింది.


***********


కార్తీక తండ్రి ఇచ్చిన నెంబరుకు ఫోన్ చేయడానికి నెంబర్ నొక్కే లోపు శరత్ కు వేరే ఫోన్ కాల్ వచ్చింది. చూస్తే అది అరుకు పోలీస్ స్టేషన్ నుంచి, సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసాడు. అరుకులో చాపరాయి ప్రాంతంలో జలపాతం దిగువగా ఒక స్త్రీ శవం కనిపించినట్లు తెలిసిందని, తాను అటు వెళ్తున్నానని, శరత్ ని కూడా రమ్మని ఆ ఫోన్ సారాంశం.


అడిస్ వ్యవస్థాపకుడు కామేశ్వరరావుకు ఆ విషయం ఫోన్ చేసి చెప్పి, అరుకు బయలుదేరాడు శరత్. కార్తీక తల్లిదండ్రులకు చెప్పాలని తోచలేదు శరత్ కు.


ఆగమేఘాల మీద ప్రయాణించి అరుకు చేరుకున్నాడు శరత్. చాపరాయి ప్రాంతానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ చాలామంది స్థానికులు గుమిగూడి ఉన్నారు. శరత్ నెమ్మదిగా లోయలోకి దిగాడు. చాపరాయి జలపాతంలో నీటి ఒరవడి తక్కువగా ఉంది. జాగ్రత్తగా ఒడ్డునుంచి కిందకు దిగాడు.


లోయలో చెట్టుకొమ్మలకు చిక్కుకుని ఉంది ఒక మహిళ మృతదేహం. బోర్లా పడి ఉంది. జుట్టు పోనిటైల్ వేసి ఉండటంతో అమ్మాయిగా పోల్చుకున్నారు. శరత్ రావడం చూసి, ఎస్సై సైగతో అక్కడ సిద్ధంగా ఉన్న పనివాళ్ళు ఆ మృతదేహాన్ని తిప్పారు. ముఖాన్ని చూస్తూనే శరత్ తో సహా అక్కడ ఉన్నవాళ్ళంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జలచరాలేవో తినేసినట్లు ముఖం పోలిక దొరకలేదు. జీన్ పేంట్ పైన ఎర్రని టీ షర్ట్ ఉంది. కష్టం మీద ఆ మృతదేహాన్ని ఒక గుడ్డలో చుట్టి, పైకి తీసుకువచ్చారు. అక్కడ పరిచి ఉన్న చాపపై ఉంచారు. 


తనకు తెలిసిన వివరాల ప్రకారం కార్తీక ఎత్తు 5 అడుగుల మూడు అంగుళాలు కానీ ఈ మృతదేహం ఎత్తు 5 అడుగులు కూడా ఉన్నట్లు అనిపించలేదు. పైగా కార్తీక కనబడకుండా పోయినప్పుడు చొక్కా ధరించి ఉంది. ఇక్కడ టీ షర్టు ఉంది కాబట్టి ఈ అమ్మాయి కార్తీక కాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉందని శరత్ గాఢంగా విశ్వసించి, ఎస్సై వంక చూసి తల అడ్డంగా తిప్పాడు. 


శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని సామాజిక ఆసుపత్రికి తరలించారు. బహుశా ఒంటరిగా అటు వచ్చిన ఏ పర్యాటకురాలో లేదా దొంగ ప్రేమకు బలి అయిపోయిన ఆడపిల్లో అనుకున్నాడు శరత్. మిస్సింగ్ కేసు ఇంకేదైనా నమోదు అయ్యిందేమో చూడమన్నాడు. ‘ఈ రెండు రోజుల్లో అలాంటివేవీ రాలేదని’ అన్నాడు ఎస్ఐ. 


వెళ్లి వస్తానని చెప్పి బయలుదేరి పోతూ ఉండగా నల్ల కారు విషయం గుర్తుకు వచ్చింది. కానీ ఈ విషయాలేవీ అరుకు ఎస్ఐ కి చెప్పలేదు శరత్. ఊరిలోకి వెళ్లి సోమాని పిలిచాడు. తన ఫోన్ లో నుంచి రకరకాల కార్లు, జీపుల బొమ్మలు చూపించాడు. అవేవీ కాదన్నాడు సోమ. 


అంబాసిడర్ కారు చూడగానే "ఇదే ఇదే.. కాకపోతే నల్లటిది" అన్నాడు సోమ. నల్ల అంబాసిడర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి కనిపెట్టడం తేలిక అనుకున్నాడు శరత్. మొదట కారును కనిపెట్టాలి తర్వాత కార్తీక ఫోన్, హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ ఉన్నాయో కనిపెట్టాలి అవి దొరికితే కార్తీక విషయం తెలుస్తుంది అనుకున్నాడు. 


బొడ్డవార దగ్గర మాత్రమే చెక్ పోస్ట్ ఉంది. అరుకు నుంచి బయలుదేరి బొడ్డవార వచ్చాడు శరత్. కానీ అక్కడ సీసీ కెమెరా లేదు. అక్కడ ఉన్న చెక్ పోస్ట్ వారిని కార్తీక మాయమైన రోజు చెప్పి, ఆరోజు బొడ్డవారలో లేదా ఆ ప్రాంతాలలో నల్లని అంబాసిడర్ కారు ఎవరైనా చూశారా అని అడిగాడు. "రోజూ ఎన్నో బళ్ళు వస్తూ, వెళ్తూ ఉంటాయి, జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం" అన్నారు. 


ఆ చుట్టుపక్కల అందరినీ అడిగి చూసాడు. అక్కడ చిన్న చిన్న టిఫిన్ దుకాణాలు ఉన్నాయి. దూరం నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఆగి టిఫిన్ చేస్తారు. వారందరినీ కూడా అడిగాడు. ఒక దుకాణదారు కాస్త సమాచారం ఇచ్చాడు. 


"ఆ కారుని ఏమంటారో తెలీదు కానీ, నల్ల కారులో ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి వచ్చారు. అదిగో ఆ ఎదురుగా ఉన్న వోటేల్ లో తిన్నారు. ఈ పక్కనున్న షాపులో డ్రింకులు, మంచినీళ్లు కొనుక్కున్నారు. ఆళ్ళు తిన్నగా నిలబడనేదు. ఒకడైతే అమ్మాయిని తడువుతూనే ఉన్నాడు. ఆ పిల్ల కిలకిలా నవ్వుతానే సెయ్యి ఇసురుతా ఉంది. 


ఆపిల్లకి జడ నేకపోతే నలుగురూ అబ్బాయిలే అనుకునేటోళ్లం. అందరూ పేంట్లు టీ సర్టులే ఏసినారు. ఎనక సీట్లో ఆ పిల్ల, ఇంకొకడు కూర్సున్నారు. తడివినోడు, ఇంకొకడు ముందాల కూర్సున్నారు. మళ్ళీ ఆళ్ళు ఎప్పుడు తిరిగి ఎల్లినారో సున్నేదు." అన్నాడు.


నల్ల అంబాసిడర్ కారు బొమ్మ ఫోన్ లో చూపించాడు శరత్. "ఈ కారే బాబూ" అన్నాడు అతను. 

"అయితే ఉదయం చూసిన మృతదేహం ఈ కారులో వచ్చిన అమ్మాయిదే అయి ఉంటుందా?" అనుకున్నాడు శరత్. 


"ఆ అమ్మాయి పొడుగ్గా ఉంటుందా? పొట్టిగా ఉందా?" అడిగాడు శరత్.


"కుదమట్టం గానే (పొట్టి) ఉంది బాబూ" అన్నాడు. 


ఫోన్ లో ఉన్న మృతదేహం ఫోటో చూపించాడు శరత్. 


"ముకం ఆనవాలు తెలీలేదు కానీ ఆ పిల్ల లాగే ఉంది బాబూ… అవే బట్టలు." అన్నాడు దుకాణదారుడు.

 

ఇప్పుడు మరొక చిక్కు సమస్య ఎదురైంది శరత్ కి. "ఆ అమ్మాయి శవం దొరికింది చాపరాయి దగ్గర. అది అరుకులో ఉంది. అంటే బొర్రా గుహలకు ఎగువన. కార్తీకని కారులో ఎక్కించుకుని పోయింది బొర్రాలో. పైగా ఆ కారు అరుకు వైపు వెళ్లబోతూ, గిరిజన స్త్రీలు వాహనాలు ఆపడంతో, ఆగి, ఫోటోలు తీస్తున్న కార్తీకను ఎక్కించుకుని వెనక్కి తిరిగి శృంగవరపుకోట వైపు వెళ్ళింది. 


చాపరాయి దగ్గర ఆ అమ్మాయి మరణిస్తే, భయపడి ముగ్గురు అబ్బాయిలూ వెళ్లిపోతూ, కార్తీకను తీసుకు వెళ్ళేరు అనుకోడానికి లేదు. అరుకులో ప్రవేశించే వాహనాలను మాత్రమే గిరిజన స్త్రీలు అడ్డుకుని పన్ను వసూలు చేస్తారు. వెళ్లే వాహనాలను అడ్డగించరు. అవి నిరాటంకంగా వెళ్లిపోతాయి. 


అయితే ఈ వ్యక్తులు వేరే వాళ్ళా? బిడ్డిక సోమ, దుకాణదారుడు ఇద్దరూ గుర్తించింది నల్లని అంబాసిడర్ కారునే. ఒకే రోజు ఒకే లాంటి రెండు అరుదైన కార్లు వచ్చే అవకాశం లేదు. అమ్మాయితో వెళ్లిన వారు వేరే అనుకుంటే అమ్మాయి మృతదేహం లభించింది, మరి ముగ్గురు అబ్బాయిల సంగతి ఏమిటి? దర్యాప్తు ముందుకు సాగడం లేదు. 


"ఆ కారులో వాళ్ళు ఎప్పుడు తిరిగి వెళ్లారో చూసారా?" అని అడిగాడు శరత్. 


"మద్దెనం నాను ఇంటికి ఎల్లిపోతాను. మా ఆడమనిసి వొచ్చి కూకుంటాది ఇక్కడ. నాను సూడనేదు" సమాధానం ఇచ్చాడు దుకాణదారుడు.


========================================================================

                                                       ఇంకా వుంది..


========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

2 Comments


@nagamanjarig1315

• 10 hours ago

ధన్యవాదాలండీ

Like


@SeshadriAllinone

• 10 hours ago

కథా‌ పఠనం చాలా బాగుంది

Like
bottom of page