top of page

కేస్ నెం 37 బి - పార్ట్ 8

#NagamanjariGumma, #నాగమంజరిగుమ్మా, #CaseNo37B, #సస్పెన్స్, #SuspenseStoriesInTelugu

ree

Case No. 37B - Part 8 - New Telugu Web Series Written By Nagamanjari Gumma

Published In manatelugukathalu.com On 12/10/2025

కేస్ నెం. 37 బి - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక

రచన: నాగమంజరి గుమ్మా

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరకు ప్రాంతంలో ఆర్కియాలజీ తవ్వకాలకు వెళ్లిన ప్రొఫెసర్ శ్యాం సుందర్, తన సహాయకురాలు కార్తీక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఆమెను వెదకడానికి డిటెక్టివ్ శరత్ బయలుదేరుతాడు. శత్రువులనుండి తప్పించుకునే ప్రయత్నంలో కార్తీక విజయవాడ చేరుకుంటుంది. కార్తీక పేరెంట్స్ ఇచ్చిన పబ్లిక్ బూత్ నంబర్ విజయవాడకు చెందినదని తెలుసుకొని, శరత్ కూడా విజయవాడకు వస్తాడు. ఆ టెలిఫోన్ బూత్ పక్కనే ఉన్న టీ కొట్టు అతను చెప్పిన వివరాలనుబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ లో కార్తీక కోసం వెతుకుతాడు. మొత్తానికి కార్తీకను కలిసి తన ఇంటికి పంపుతాడు. కేసును పూర్తిగా పరిశోధించాలనుకుంటాడు. స్వతహాగా చిత్రకారిణి అయిన కార్తీక, తనను కిడ్నాప్ చేసిన కారు బొమ్మను నెంబర్ తో సహా గీచి, శరత్ కు ఇస్తుంది.


ఇక కేస్ నెం. 37 బి - పార్ట్ 8 చదవండి.. 


 శరత్ అడిస్ ఆఫీస్ కు వెళ్ళాడు. కామేశ్వరరావు గారు ఇంకా రాలేదు. మిగిలిన స్టాఫ్ లో కొంతమంది వచ్చి ఉన్నారు. తాను నిన్న చెప్పిన విషయాలు అన్నీ వివరంగా రాసి ఫైల్ లో పెట్టాడు. ఈరోజు తనకు, కార్తీకకు మధ్య జరిగిన సంభాషణ కూడా రాసి పెట్టాడు. కార్తీకతో డైరీ వివరాలు చర్చించడానికి వెళ్ళినపుడు మొబైల్ లో రికార్డర్ ఆన్ లో పెట్టి ఉంచాడు. అది వింటూ, అవసరమైన విషయాలన్నీ రాసి పెట్టాడు. సంభాషణ అంతా వేరే పెన్ డ్రైవ్ లో సేవ్ చేసి పెట్టి, ఫైల్ లో ఉంచాడు. ఈలోగా కామేశ్వరరావు హాస్పిటల్ నుంచి కార్తీక రిపోర్టులు మొత్తం తీసుకువచ్చారు. అవి కూడా ఈ ఫైల్ లో పెట్టారు.


"ఏం నిర్ణయించుకున్నావు శరత్?" అడిగారు కామేశ్వరరావు గారు.


"పరిశోధిస్తాను సర్. ఆ కారు నెంబర్ కార్తీక డైరీ లో వేసిన చిత్రం లో దొరికింది." అన్నాడు శరత్. 


"గుడ్. గో ఎహెడ్" అని భుజం తట్టి వెళ్లిపోయారు కామేశ్వరరావు గారు.


శరత్ తన వ్యూహం సిద్ధం చేసుకున్నాడు. పోలీస్ లకు తెలిస్తే ఒప్పుకుంటారో లేదో… అందుకే రహస్యంగా తన పరిశోధన కొనసాగించడానికి నిశ్చయించుకున్నాడు.


తన మొబైల్ లో ఉన్న యువకుల ఫోటోలు ఒకసారి చూసాడు. అరుకు బయలుదేరి వెళ్లాడు. బొడ్డవార దగ్గర ఆగి, ఇంతకుముందు సమాచారం ఇచ్చిన వ్యక్తిని కలిసి, ఫోటోలు చూపించాడు. ఆ వ్యక్తి ముగ్గురు యువకులను గుర్తించాడు. కారు కూడా అదే అన్నాడు. దానితో కాస్త ధైర్యం వచ్చింది శరత్ కి. పరిశోధన ముందుకు సాగుతుందనిపించింది. అక్కడనుండి అరుకు బయలుదేరాడు. మధ్యలో బొర్రా గుహల దగ్గర ఆగలేదు. ప్రొఫెసర్ కు కానీ, కార్తీకకు కానీ తాను అరుకు వస్తున్నట్లు చెప్పలేదు. 


టూరిస్టులుగా వచ్చినవారు ఏదో ఒక హోటల్ లో రూమ్ తీసుకుంటారు. అందుకే అక్కడ ఉన్న అన్ని హోటల్స్ లో ఆ యువకుల ఫోటో చూపించి విచారణ చేసాడు. ఒక హోటల్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక రూమ్, ఇద్దరు అబ్బాయిలు మరో రూమ్ మొత్తం రెండు రూములు తీసుకున్నట్లు రాసి ఉంది. తన గుర్తింపు కార్డు చూపించి, వారి పేర్లు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు రాసుకున్నాడు. 


"వారు ఆధార్ కార్డుల లాంటి గుర్తింపు కార్డులు ఏమైనా ఇచ్చారా?" అని అడిగాడు శరత్. 


"ఒకరు ఆధార్ కార్డు, మరొకరు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారని, కానీ అప్పుడు కరెంట్ లేకపోవడం వలన జిరాక్స్ కాపీ తీసుకోలేదని, తర్వాత మర్చిపోయామని" మేనేజర్ తెలియజేశాడు. 


"వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేసి వెళ్లిపోయారు? వాళ్ళతో ఉన్న అమ్మాయిని మీరు వెళ్ళేటప్పుడు చూసారా?" అని శరత్ ప్రశ్నించాడు.


"ఆ తర్వాత రోజు ఉదయం అందరూ బయట తిరగడానికి వెళ్లారు. సాయంత్రం మిగతా అందరూ కార్ లో బయటే ఉండగా ఒక్కడు మాత్రం వచ్చి, రూములు రెండూ ఖాళీ చేసి, బేగ్ లు తీసుకుని కార్ దగ్గరకు వెళ్లిపోయాడు. అప్పుడు కార్ లో అమ్మాయి ఉన్నది, లేనిది చూడలేదు" అని మేనేజర్ చెప్పాడు. ఇక అక్కడ చేసేదేం లేక తిరిగి వచ్చాడు శరత్. 


బయటకు వెళ్తూ, అక్కడ ఉన్న ఒక రూమ్ బాయ్ ని పిలిచాడు. భుజం మీద చేయివేసి మాట్లాడుతూ, "నువ్వేనా వాళ్ళ రూమ్ లకు సర్వీస్ చేసింది?" అని అడిగాడు. 


"అవును సార్. కానీ నాకేం తెలీదు సార్, నేనేం చూడలేదు సార్." అన్నాడు వాడు. 


"నీ పేరేమిటి?" అడిగాడు శరత్.


"సీమోను"


"చూడు సీమోను… నువ్వు ఏమి చూశావో నాకు తెలుసు. అక్కడ అంతమంది ఉండగా నిన్నే ఎందుకు బయటకు తీసుకువచ్చాను? నువ్వు చూసింది నిర్భయంగా చెప్పు." అన్నాడు శరత్ చీకట్లో రాయి వేస్తూ…


వాడు నీళ్లు నములుతున్నాడు. "నీకు తెలుసా? వాళ్లలో ఒకడు నిన్న ఆక్సిడెంట్ చేసి దొరికిపోయాడు. వాళ్ళు నీ గురించి చెప్పేరు." అన్నాడు శరత్.


వాడు ఒక్కసారిగా బావురుమన్నాడు. "సార్! అంతా చెప్పేస్తాను. నన్ను పోలీస్ దగ్గరకు తీసుకువెళ్ళకండి సార్" అన్నాడు వాడు.


"సరే" నని, వెనక్కి వచ్చి, మేనేజర్ కి చెప్పి, వారు తీసుకున్న రూమ్ కి సీమోనును తీసుకువచ్చాడు శరత్. 


"సార్ ఆ అమ్మాయి, అబ్బాయికి ఈ రూమ్ ఇచ్చారు సార్, ఇంకో ఇద్దరు అబ్బాయిలు పక్క రూమ్ లో ఉన్నారు సార్. ఈ గదిలో ఉన్నవాడు బాగ్ లో నుంచి ఉప్పు పొట్లం తీసాడు సార్. చేతిమీద వేసుకుని వాసన చూసాడు సార్. నేను మంచినీళ్లు తెచ్చి పెడుతూ చూసాను సార్. నన్ను వెళ్ళిపొమ్మని నలుగురూ ఈ గదిలోనే కూర్చుని తలుపులు వేసుకున్నారు సార్. ఇదిగో సార్ తలుపుకు ఈ కన్నం లోపలి నుంచి కనిపించదు, బయటి నుంచి చూస్తే మాత్రం లోపలి వారు కనిపిస్తారు" అని బయటకు వచ్చి తలుపులు మూసి చూపించాడు. అది మామూలు కన్నం లానే ఉంది మధ్యలో చిన్న భూతద్దం లాంటిది పెట్టినట్లున్నారు, లోపల వైపు మాత్రం చాలా సన్నటి కన్నం ఉంది. వంగి చూసాడు శరత్. లోపలి దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. "అప్పుడు నలుగురూ కూర్చుని సిగరెట్లు కాల్చారు సార్. ఈలోగా అలికిడి అయితే నేను భయపడి వెళ్ళిపోయాను సార్" అన్నాడు.


"ఇంకా చెప్పు… అసలు విషయం చెప్పలేదు నువ్వు." అన్నాడు శరత్.


శరత్ వైపు ఓసారి చూసి తలదించుకున్నాడు. "ఊఁ చెప్పు" గద్దించాడు శరత్. "మళ్ళీ గంట తర్వాత వచ్చాను సార్. ఈ రూమ్ లో ఇద్దరే ఉన్నారు. ఆ అబ్బాయిలిద్దరూ పక్క రూమ్ కి వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లి 'ఏమైనా కావాలా అన్నా?' అని అడిగాను. 'అక్కర్లేదు పోరా' అన్నాడు ఒకడు. ఇక్కడికి వస్తే ఆ అమ్మాయి బట్టలు వేసుకుంటోంది." మళ్ళీ శరత్ వైపు చూసి తలదించుకున్నాడు సీమోను. 


"ఊఁ చూడకూడనివి అన్నీ చూశావన్నమాట. ఇప్పుడు అసలు విషయం చెప్పు" అన్నాడు శరత్.


"సార్… వదిలేయండి సార్… నాకేం తెలీదు సార్…" ఏడవడం మొదలుపెట్టాడు సీమోను. 


"చూడు, అసలు విషయం చెప్తే వదిలేస్తాను. లేదా ఇలాగే తీసుకెళ్లి… " అంటూ ఉండగానే, శరత్ కాళ్ళను చుట్టేసి "చెప్తాను సార్, నన్నేం చేయకండి" బావురుమన్నాడు. 


"ఛీ… మొహం తుడుచుకో… ఇప్పుడు చెప్పు… " అన్నాడు శరత్.


"నేను బయటకు వచ్చేసాను. ఆ పిల్ల నాకు నచ్చింది. ఇంకా ఇంకా చూడాలి అనిపించింది. వాళ్ళు రూమ్ తాళం ఇచ్చి, బయటకు వెళ్లారు. నేను వెంటనే ఆ రూమ్ తాళం తీసుకుని, ఆ పిల్ల ఫోటో కాని, బట్టలు కానీ తీసుకుందామని, వాళ్ళ రూమ్ లోకి వెళ్ళాను. ఒక బేగ్ లో చాలా ఉప్పు పొట్లాలు ఉన్నాయి. వాళ్ళు చేతి మీద వేసుకుని నాకడం చూసాను. అది గుర్తుకువచ్చి, ఒక చిన్న ఉప్పు పొట్లం తీసుకున్నాను. తెలిసిపోతుందేమో అని భయం వేసి, గబగబా రూమ్ కి తాళం వేసి, బయటకు వచ్చేసాను. ఇంతలో మళ్ళీ వాళ్ళు వచ్చేసారు. భోజనం తెమ్మన్నారు. తెచ్చి ఇచ్చాను. 


ఒక గదిలో అమ్మాయి, అబ్బాయి, ఇంకో గదిలో ఆ ఇద్దరు అబ్బాయిలు పెద్ద సౌండ్ తో పాటలు పెట్టి, డాన్స్ చేస్తూ, మధ్య మధ్యలో ఉప్పు పొట్లం నాకుతూ, వాసన చూస్తూ, ఛండాలం పనులు చేస్తున్నారు సర్. నాకు అసహ్యం అనిపించింది. చూడలేక వెనక్కి వచ్చేసి, రూమ్ కి వెళ్లి పడుకున్నాను. మరునాడు ఉదయం పదకొండు వరకు ఎవరూ నిద్ర లేవలేదు. నన్ను రూమ్ సర్వీస్ కి పిలవలేదు. మధ్యాహ్నం నిద్రలేచి, మళ్ళీ భోజనం తెప్పించుకుని, అందరూ ఒక రూమ్ లోనే తిన్నారు సర్. అప్పుడు ఆ పిల్ల బాడీ, డ్రాయరు మాత్రమే వేసుకుంది సార్. నాకు మనసు ఆగలేదు సార్. వాళ్ళు భోజనం చేసి, అందరూ కార్ లో బయలుదేరి వెళ్ళారు సార్. నేను మేనేజర్ గారికి సెలవు పెడతానని చెప్పి, బండి మీద వాళ్ళ కార్ వెతుకుతూ వెళ్ళాను. వాళ్ళ వెనకాలే తిరిగాను సార్. చాపరాయి దగ్గర ఫోటోలు తీసుకున్నారు. నేను కూడా నా ఫోన్ లో చాటుగా ఆ అమ్మాయి ఫోటో తీసుకున్నాను సార్. వాళ్ళు అందరూ నీళ్లలో ఆడుకున్నారు. నేను ఆ పిల్లనే వీడియో తీస్తున్నాను. ఇంతలో ఆ అమ్మాయి పట్టుజారి పడిపోయింది సార్. వీళ్ళు పట్టుకోవాలని చూసినా వీలుకుదరలేదు. రాతికి కొట్టుకొని గట్టిగట్టిగా అరిచింది. ఒకడు వెళ్లబోయాడు, జారిపోయాడు సార్. మిగతా ఇద్దరూ వాడి చేతులు పట్టుకున్నారు. ఆ పిల్ల కొట్టుకొనిపోయింది. నేను వీడియో తియ్యడం ఆపి, గబగబా హోటల్ కి వచ్చేసాను సార్. వాళ్ళు చాలా సేపటి తర్వాత హోటల్ కి వచ్చి రూమ్ ఖాళీ చేసి వెళ్లిపోయారు సార్" చెప్పేసాడు వాడు.


"ఆ వీడియో నీ దగ్గర ఉందా?" అడిగాడు శరత్. 


గుటకలు మింగుతూ ఫోన్ ఇచ్చాడు. 


"ఓపెన్ చేసి ఇవ్వు"


ఒక్కో ఫోటో, వీడియో అన్ని చూసాడు శరత్. అవన్నీ తన ఫోన్ లోకి కాపీ చేసుకున్నాడు. "అవి ఉప్పు పేకెట్లు కాదని నీకు తెలుసు. అందుకే వెళ్లి దొంగతనం చేశావు. నిజం చెప్పు… ఎన్ని పేకెట్లు తీసావు? అవి వాడటం నేరం అని తెలీదా?" గట్టిగా నిలదీశాడు శరత్. 


"నిజం సార్, ఒట్టు సార్ ఒక్కటే తీసాను సార్. ఇంకా నా దగ్గరే ఉంది సార్" అంటూ జేబులో నుంచి తీసి ఇచ్చాడు. శరత్ రుమాలుతో జాగ్రత్తగా ఒక్క కొస పట్టుకొని వేరొక పాలిథిన్ కవర్లో వేసి చుట్టి, తన జేబులో పెట్టుకున్నాడు ఆ పొట్లాన్ని. సీమోనుకు జేబులో నుంచి డబ్బులు తీసి ఇచ్చి, భుజం తట్టి, "భయపడకు" అని చెప్పి, హోటల్ బయటకు వచ్చాడు శరత్. 


ఆ అమ్మాయి ప్రమాదవశాత్తు జారిపడిపోయి మరణించిందని అర్ధమవుతూనే ఉంది. మత్తు తలకి ఎక్కితే ఎంత వెధవ పని అయినా చేయిస్తుంది. కొట్టుకుపోయిన పిల్లని అలా ఎలా వదిలేసి వెళ్లిపోయారు? ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి తరపు వారు ఎవరైనా ఆ అమ్మాయి కనిపించడం లేదని రిపోర్ట్ చేయలేదా? వెళ్లిపోతున్నవాళ్ళు బొర్రా దాటిన తర్వాత మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చినట్లు? కార్తీకను ఎందుకు కిడ్నాప్ చేసినట్లు? వాళ్ళని పట్టుకుంటే కానీ వివరం తెలియదు అనుకుంటూ బయలుదేరాడు శరత్. 


కార్తీక పార్వతీపురంలో తప్పించుకుంది. అంటే వాళ్ళు ఒరిస్సా వైపు వెళ్లి ఉండాలి. తనకు దొరికిన వివరం ప్రకారం ఆ కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. ఆలోచిస్తూ అరకు నుండి బయలుదేరాడు. 


బస్సు విశాఖపట్నం ఎన్. ఏ. డి. జంక్షన్ చేరుతుండగా యధాలాపంగా తలతిప్పిన శరత్ కళ్ళకు నల్లని అంబాసిడర్ హైవే మీద కనిపించింది. నల్లని అంబాసిడర్ కార్లు ఎన్నో ఉన్నా, ఇది తాను వెదికే కారు ఎందుకు కాకూడదు? అని ఆలోచించి గబుక్కున బస్ దిగి, ఆటో ఎక్కాడు. హైవే మీద పొమ్మన్నాడు. చాలా వేగంగా, నల్లని అంబాసిడర్ కనిపించేవరకు వెతకాలని డ్రైవర్ కి చెప్పాడు. మద్దిలపాలెం చేరుకునే లోపు, అంబాసిడర్ కనిపించింది. జాగ్రత్తగా దాని వెనకే పొమ్మన్నాడు. కారు నెంబర్ చూసాడు. అదే కారు. వెదకబోయిన తీగ కాళ్లకు తగిలినట్లయ్యింది. 


========================================================================

                                                       ఇంకా వుంది..


కేస్ నెం 37 బి - పార్ట్ 9 త్వరలో..

========================================================================

నాగమంజరి గుమ్మా గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం :

పేరు: నాగమంజరి గుమ్మా

భర్త పేరు: పట్రాయుడు కాశీ విశ్వనాధం గారు

వృత్తి: ఆంగ్లోపాధ్యాయిని

నివాసం: శృంగవరపుకోట, విజయనగరం జిల్లా

ప్రవృత్తి: పద్యరచన, కవితలు, కథలు, నాటిక, యక్షగానం, నృత్యరూపకం, వ్యాసం, నవల వంటి ఇతర సాహిత్య రూపాలలో కూడా ప్రవేశం.

వివిధ వేదికలపై శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడసాని మోహన్ గారు, శ్రీ ఆముదాల మురళి గారు, శ్రీ మైలవరపు మురళీకృష్ణ గారు, శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు, శ్రీమతి ఆకెళ్ల బాలభాను, శ్రీ తాతా సందీప్ శర్మ మొదలగు వారి అష్టావధానం, శతావధానాలలో పృచ్ఛకురాలిగా సమస్య, వర్ణన, దత్తపది, అప్రస్తుత ప్రసంగాలలో పాల్గొనడం. 

విద్యార్థులను పద్య, శ్లోక, ధార్మిక పోటీ పరీక్షలకు శిక్షణ నివ్వడం

పురాణ ప్రవచనం చేయడం

రచనలు: శ్రీ గణేశ చరిత్ర, విశ్వనాధ శతకం, ఆరామద్రావిడ వంశ ప్రవరలు, ఆయుష్మతి, పుష్పమంజరి ముద్రిత రచనలు.

విహంగ విలాసం, ఫలవిలాసం, జలచరవిలాసం, భక్తిమంజరి, టేకుపూలదండ, ఖండకావ్యమంజరి అముద్రిత రచనలు.

ఆంద్రప్రదేశ్  ప్రభుత్వ Scert వారి 4 వ తరగతి తెలుగు పాఠ్య పుస్తక రచన.

2 Comments


@saiKumar-e6q3m

•1 day ago

Super

Like

@రత్నమంజరి

•1 day ago

🎉

Like
bottom of page