ప్రేమ తీరాలు - పార్ట్ 10
- Lakshmi Sarma B
- 4 days ago
- 7 min read
#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries
Prema Theeralu - Part 10 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 12/10/2025
ప్రేమ తీరాలు - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది. వారికి కపర్థి అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత కరుణాకర్, చెల్లెలు లలితల మధ్య దూరం పెరుగుతుంది. ఫణికి అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్‌కు తీసుకొని వెళ్తుంది లలిత. ఫణికి బ్రెయిన్ ట్యూమర్ ఉందని, ఆపరేషన్‌కు ఇరవై లక్షల దాకా అవుతుందని చెబుతారు డాక్టర్లు. సహాయం కోసం అన్న కరుణాకర్ దగ్గరకు వెళ్లిన లలితను వదిన రాధ అవమానిస్తుంది. స్వంత పెదనాన్న ఫణి ఇంటిని ఆక్రమించు కుంటాడు. మేనేజర్ కిరణ్ సహాయంతో ఆపరేషన్ జరిగి ఫణి కోలుకుంటాడు. కిరణ్, లలితల పరిచయాన్ని వేరే దృష్టితో చూస్తారు రాధ, సరిత.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ప్రేమ తీరాలు పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 7 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ప్రేమ తీరాలు పార్ట్ 10 చదవండి.
“ఎవరు… సరితా… అరే, నువ్వెప్పుడు వచ్చావు? నీకు మా ఇల్లెలా తెలుసు? రా రా… లలిత, తను సరిత, మా మామయ్య కూతురు. ఎలా ఉన్నావు? ఎక్కడుంటున్నావు? ఏంటి సంగతులు?” సరితను చూడగానే ఉత్సాహంగా అడిగాడు ఫణి.
“నేను ఇక్కడే ఉంటున్నాను. అమ్మ మొన్నటివరకు నాతోనే ఉంది. అన్నయ్య వచ్చి తీసుకువెళ్ళాడు. ఇప్పుడెలా ఉన్నావు? నీ ఆరోగ్యం కుదుటపడిందా? నాకు తెలియదు నువ్వు అదే హాస్పిటల్‌లో ఉన్నావని. అప్పుడే వచ్చి చూసేదాన్ని,” బాధపడుతూ అంది సరిత.
“అవునా? నువ్వప్పుడు అక్కడే ఉన్నావా? అరే, లలిత, నీకు తెలియదు కదా. పాపం, తనొక్కతే అయిపోయింది. నువ్వు తోడుండేదానివి తెలిసుంటే... చూశావా లలిత, అందరం అక్కడే ఉన్నా కలుసుకోలేకపోయాము. మరి నీకు ఎవరు చెప్పారు సరిత?” అడిగాడు.
“నాకు స్నేహితురాలు రాధ చెప్పింది. తను మీ ఆవిడకు వదినట కదా?” లలిత వైపు చూస్తూ అంది.
“ఓహో! అవునా… మరి తను రాలేదేం? సరే, నీ గురించి తెలిసి చాలా బాధనిపించింది సరిత. నువ్వు ఒంటరిగానే ఉంటున్నావని తెలిసింది. మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు కదా, నీకు నచ్చిన వాణ్ణి చూసుకుని. ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావు? అయినా ఏమంత వయసైందని… పోనీ నన్ను చూడమంటావా?” నవ్వుతూ అడిగాడు.
“ఏం చేస్తాం బావా… పెళ్ళి చేసుకుని మోసపోయాను. హాయిగా నువ్వు చేసుకుని ఉంటే నాకీ బాధ తప్పేది కదా! నన్ను కాదని నువ్వు సుఖపడుతున్నావా చెప్పు? నువ్వు అమాయకుడివి కాబట్టి ముసుగులో గుద్దులాటలు నీకు తెలియవు.”
“నాకేం సరిత, నేను బాగానే ఉన్నాను. లలితలాంటి భార్య దొరికినందుకు నేను అదృష్టవంతుడిననే చెప్పాలి. బుద్ధిమంతుడైన బాబు! ఇంతకంటే నాకేం కావాలి? రాకరాక మనింటికి వచ్చింది. తనకేమైనా చేస్తున్నావా తినడానికి?” సరిత మాటలు, చూపులు తట్టుకోలేక వంటగదిలోకి వెళ్ళిపోయిన లలితను అడిగాడు.
“ఆఆ చేస్తున్నాను, ఉండండి,” లోపల్నుంచి సమాధానం ఇచ్చింది.
“బావా, నాకిప్పుడేమీ వద్దు గానీ, నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడాలి. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. చెప్పు బావా, ఎప్పుడు ఎక్కడ కలుద్దాము?” లలిత వింటుందేమోనని మెల్లగా అడిగింది.
“సరిత… నీవు ఏదో దాస్తున్నావు. నా దగ్గర నీకేదైనా ఇబ్బంది ఎదురైందా? చెప్పు. ఎక్కడో? ఎందుకు ఇప్పుడు చెప్పకూడదా? ఇక్కడ పరాయివాళ్ళెవరు లేరు కదా?”
“బావా… నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచే తెలుసు కానీ…” వంటగదిలోకి చూస్తూ చెప్పడం ఆపింది.
“సరే నీ ఇష్టం. నేను రేపటినుంచి ఆఫీసుకు వెళుతున్నాను. నీకు వీలైతే మా ఆఫీసు దగ్గర కలుద్దాము సరేనా?” లలిత తినడానికి ఏమైనా తెస్తుందేమోనని అటువైపు చూస్తూ అన్నాడు.
“సరే అయితే నేను రేపే మీ ఆఫీసుకు వస్తాను. అక్కడ అన్నీ విషయాలు మాట్లాడుకుందాము. నేను వెళతాను బావా,” అంటూ బ్యాగు తీసుకుని వెళ్ళిపోయింది.
“ఏయ్ సరితా! ఆగు. టిఫిన్ చేసి వెళుదువుగానీ. లలిత నీకోసం చేస్తుంది. కనీసం లలితకు చెప్పి వెళ్ళు,” వెనకనుండి ఫణి పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది. లోపల ఉన్న లలిత ఈ సంభాషణంతా వింటూనే ఉంది. “ఏం మాట్లాడుతుంది ఈయనతో నా ముందు చెప్పడానికి వెనకాముందాడుతుందంటే ఏదో ఉంది,” అనుకుంది మనసులో.
ప్రిజ్‌లోనుండి సమోసాలు వేయించుకుని ప్లేట్లలో పెట్టుకుని వచ్చింది ఏమి తెలియనట్టు.
“ఏమండి, ఇదే మీ మరదలు. తన కోసమని వేడి వేడిగా సమోసాలు చేసాను,” అంది.
“అదేంటి లలిత, ఇంతసేపు చేసావు! నువ్వు లోపలనే ఉండేసరికి ఏమనుకుందో ఏమో. గబుక్కున వెళ్ళిపోయింది. ఏమిటో చిన్నప్పటి నుంచీ ఇంతే హడావుడి మేళం,” సమోసా తింటూ అన్నాడు.
“అలా ఏం ఉండదు లేండి. తను వచ్చింది మీకోసం, మీతో మాట్లాడి వెళ్ళింది,” ముభావంగా అంది.
“నాన్న, ఇదిగో మా స్కూల్‌లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా టీచర్లందరూ నన్నెంత మెచ్చుకున్నారో తెలుసా!” స్కూల్ నుండి వస్తూనే తండ్రి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు కపర్ధి.
“అవునా? ఏది ఆ ప్రైజ్, నన్ను చూపించు. వావ్! సూపర్ కన్నా. దేనిలో వచ్చింది నాన్న? నీకు ఈ ప్రైజ్!” కొడుకును గట్టిగా హత్తుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంటూ అడిగాడు.
“తెలుగులో పద్యాలు రాయమన్నారు. చూడకుండా నాకు అమ్మ నేర్పించింది కదా! చకచకా రాసి ఇచ్చాను. ఒక్కరూ రాయలేకపోయారు. మా హెడ్ మాష్టారు అందరిని తిట్టి, ‘చూడండ్రా! మీతోటి వాడే కదా కపర్ధి ఎంత చక్కగా రాసాడు చూడండి!’ అన్నాడు. పాపం, అందరూ బాధపడ్డారమ్మా. నాకైతే ఏడుపొచ్చింది వాళ్లను చూస్తుంటే,” తండ్రిని వదిలి తల్లి ఒడిలో కూర్చొని చెప్పాడు. లలిత పరధ్యానంలో ఉండి పట్టించుకోలేదు.
“లలిత! ఏమిటా పరధ్యానం? వాడు అంత సంతోషంగా చెబుతుంటే ఎటో చూస్తున్నావు, ఏమైంది?” అడిగాడు.
“అబ్బే, ఏం లేదు. మా బాబుకు ఇంత మంచి ప్రైజ్ వచ్చిందంటే ఆనందంతో మాటలు రావడంలేదు మా బంగారు తండ్రి,” కితకితలుపెడుతూ నవ్వింది లలిత.
“అబ్బ, అమ్మా వద్దు!” కిలకిలా నవ్వుతూ అన్నాడు కపర్ధి. ఆ రాత్రంతా లలితకు నిద్రపట్టలేదు. “ఏం మాట్లాడుతుంది తను నా ముందు చెప్పలేక పోయిందంటే అంత రహస్యమేముంది? ఈయన కూడా నాతో చెప్పలేదు తను అలా అడిగిందని. రేపు ఏం చెప్పినా నాతో ఈయన చెబుతాడా? మా మధ్య కలతలు పెట్టడానికే ప్రయత్నం చేస్తుందేమో. తనను కాదని నన్ను చేసుకున్నాడు కదా, అది మనసులో పెట్టుకుని సాధిస్తుందేమో,” ఆలోచనలతో తెల్లవారుజామున నిద్రపోయింది.
“లలిత, నేను ఆఫీసుకు వెళుతున్నాను. డ్రైవర్ వచ్చాడు. నాకు ఓపిక ఉన్నంతసేపు ఉండివస్తాను. నాకోసం చూస్తూ తినకుండా కూర్చోకు సరేనా,” భార్యను మురిపెంగా పట్టుకుని మెడ వంపులో చిన్న ముద్దుపెట్టుకుని బయలుదేరాడు.
“బావా, వచ్చావా? వస్తావో లేదో, మీ ఆవిడ రానిస్తుందో లేదోనని అనుకున్నాను. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం రా బావా,” లంచ్ సమయంలో వచ్చి చొరవగా అతని చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న హోటల్‌కు తీసుకెళ్లింది. ఇబ్బందిగా అనిపించి చెయ్యి వదిలించుకోబోయాడు కానీ సరిత వదలలేదు.
“ఇప్పుడు చెప్పు సరిత, నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటో?” కాఫీ తాగుతూ అడిగాడు.
“బావా, నువ్వు నా మీద కోపం రాకుండా నేను చెప్పేది విను. ముందు నీకు కొన్ని ఫోటోలు, వీడియోలు చూపెడతాను. తరువాత నేను చూసింది నీకు చెబుతాను. అప్పుడు చెప్పు, నువ్వు చెప్పదలచుకున్నదేమిటో,” నవ్వుతూ ఫణికి దగ్గరగా జరిగి తన ఒంపుసొంపులు తగిలేలా కూర్చొని ఫోన్ చూపెట్టసాగింది.
ఏం చూపెడుతుందో అర్థం కాక చూడసాగాడు. లలిత కనిపించగానే నిటారుగా కూర్చున్నాడు. లలిత కిరణ్ భుజం మీద పడుకోవడం, అతని చేతులు ఆమె వీపు మీద ఉండడం చూసాడు. ఒక్క క్షణం కళ్ళు బైర్లు కమ్మాయి ఫణికి.
“ఇంకా చూడు బావా! నీ అవిడ రాసలీలలు, నీ వెనక వాళ్లు ఆడుతున్న నాటకం నీకు తెలియాలనే నిన్ను ఇక్కడకు పిలిచాను. నన్ను ఎలాగో కాదన్నావు, ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు — ఇందుకోసమా బావా?” అంటూ ఇంకా కొన్ని వీడియోలు ముందుపెట్టింది. ఒకరి కౌగిలిలో ఒకరు ముద్దులు పెట్టుకుంటూ పరవశించిపోతున్నారు. హోటల్‌లో ఒకరి నోట్లో ఒకరు తినిపిస్తూ కూర్చున్నారు. కారులో కూర్చొని కిరణ్ ఒడిలో తలపెట్టుకుని పడుకున్న లలితను అతను చేస్తున్న చేష్టలు చూడలేకపోయాడు.
“సరిత… ఆపు! నేను చూడలేకపోతున్నాను. నేను ప్రాణంగా ప్రేమించిన లలిత ఇలా చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను. ఎంత నమ్మకద్రోహి ఆ కిరణ్! నాకు సహాయం చేసినట్టు నటిస్తూ నా వెనక ఇంత బాగోతం ఆడతాడా? ఛీ ఛీ! వాడి బుద్ధి మంచిది కాదు. లలితకేమైంది? నేను లేనిది ఒక్క క్షణం కూడా ఉండలేనన్నది అలాంటిది… సరిత, ఇదంతా నిజం కాదని చెప్పు. నేను తట్టుకోలేకపోతున్నాను, చెప్పు సరిత,” సరిత చేతుల్లో ముఖం దాచుకుని బాధపడుతుంటే—
“బావా, నువ్వు అలా బెంబేలుపడకూడదు. అసలే నీ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగవుతుంది. నీకేం బావా, మగవాడివి. ఆడదానికే లేని సిగ్గు, లజ్జా నీకెందుకు? ఇది ఎన్నాళ్లనుండి జరుగుతుందో తెలియదు కానీ మా అమ్మ హాస్పిటల్‌లో ఉంది. తనకోసం నేను, రాధ వచ్చేవాళ్ళం. అప్పుడు రాధ చూసి నాకు చెప్పింది. నేను తట్టుకోలేక పోయాను. నా బావకు ఇంత అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఎలా సహించుకోగలను?” కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పడం ఆపింది.
“సరిత, నిజంగా నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తనతో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడ గలను? తను నా ఎదురుగా తిరుగుతుంటే నేనెలా భరించగలను? ఇప్పుడేం చేయాలి? నాకేం తోచడం లేదు,” నెత్తిపైన రాళ్లతో కొట్టిన బాధగా ఉంది ఫణికి.
“ఇంత అమాయకుడివి కనుకనే తను ఇలా చేస్తుంది. నువ్వు చూసావు కదా, ఆ కిరణ్ అమెరికాకు వెళుతున్నానంటే నీ భార్య ముఖం ఎలా వాడిపోయిందో! ఆయన కూడా నీకివ్వకుండా తన క్రెడిట్ కార్డిచ్చి ‘డబ్బులు అవసరముంటే వాడుకో’ అన్నాడు, గుర్తుందా? నేను అప్పుడే వచ్చి విన్నాను. నాకు చాలా బాధ వేసింది బావా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉంటే తనతో ఫోన్‌లో మాట్లాడడం కుదరదు. అందుకే నిన్ను ఇంట్లో లేకుండా చేసాడు. చూశావా అతడి తెలివి? బావా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను నీకు ధైర్యంగా ఉంటాను. తన విషయమేంటో తేల్చుకుందాం. అంతగా కావాలంటే ఈ వీడియోలు అందరిముందు పెడదాం. ఏం చేస్తుంది?” ఫణిని రెచ్చగొడుతూ, తనలోని కసినంత చూపెడుతూ అంది.
“సరితా… నేనిక తన ముఖం చూడలేను. తన ముందుకు వెళ్లి మాట్లాడడం కూడా నాకిష్టం లేదు. నువ్వు ఉంటున్న ఇంటికి నన్ను తీసుకువెళతావా? నాకు కొంత ప్రశాంతత కావాలి,” సరిత చేతులు పట్టుకుని బ్రతిమాలాడు.
“బావా, నీకంటే నాకు ఇంకెవరున్నారు? నీ కోసం నేను ఏం చెయ్యమన్నా చేస్తాను. కానీ విషయం తెలియకుండా నువ్వు దాక్కుంటే లాభం లేదు. తను నీకోసం వెదుక్కుంటూ వస్తుంది. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు పోలీసులు వచ్చి నిన్ను అరెస్ట్ చేస్తారు. ఇదంతా ఎందుకు బావా?”
“మరి నన్నేం చెయ్యమంటావు? పిచ్చి లేస్తుంది సరిత నాకు,” జుట్టు పీక్కుంటూ అన్నాడు.
“ఇంత చేసిందాన్ని ఆమాత్రం నిన్ను కాపాడలేనా? చెప్పాను కదా, నేను నీ సుఖం కోరుకున్నదాన్నని. నాకు తెలిసిన లాయరు ఉన్నాడు. ఇప్పుడే వెళ్లి తనకు విడాకుల కోసం నోటీసు తీసుకుందాం. లాయరుకి ఆ వీడియోలు చూపిస్తే కళ్ళమూసుకుని నీకు విడాకులు ఇస్తాడు. నోటీసుతోపాటు నీ ఆవిడకు ఆ వీడియోలు కొన్ని చూపిద్దాం. ఇక అప్పుడు నోరు మూసుకుని విడాకుల పేపరుపై సంతకం పెడుతుంది. లేదంటే ఆ వీడియోలు అందరిముందు పెడదామని బెదిరిద్దాం. చచ్చినట్టు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. వాడి దగ్గరకే పోతుందో, ఇంకా ఎవడ్నైనా చూసుకుంటుందో మనకెందుకు?” లోపల ఉప్పొంగుతున్న సంతోషాన్ని భరించుకోలేకపోయింది. తను చెప్పినట్టు వింటున్న తన బావా, తొందరలో తన వాడవుతాడన్న భావనతో.
“సరే, నువ్వెలా చెబితే అలాగే చేద్దాం. పద,” తూలిపడబోతూ అన్నాడు. గట్టిగా పట్టుకుని అతని భుజాన్ని తనకు ఆనించుకుని నడిపించుకుంటూ వచ్చి కారెక్కారు.
ఫోన్ చేసినా తీయడం లేదు. సాయంత్రం అయిపోయింది, ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీసుకు ఫోన్ చేస్తే “మధ్యాహ్నమే వెళ్ళిపోయాడు” అన్నారు. ఎక్కడికి వెళ్ళాడు? అంటే — ఆ సరితతో తీసుకెళ్ళిందా? సినిమాలు, షికార్లు అంటూ తిప్పుతుందేమో. సరేలే, ఎంతవరకు తిరుగుతారు? రాత్రివరకైనా వస్తాడు. అప్పుడు చూద్దాం ఏం చెబుతాడో అనుకుంది. రాత్రంతా ఎదురు చూసింది. సావిత్రమ్మకు చెప్పాలంటే నామోషి అనిపించింది. ఎదురు చూస్తూ తెల్లవారుజామున నిద్రపోయింది.
“లలిత… లలిత…” దడదడ తలుపులు బాదుతుంటే గబుక్కున లేచి తలుపు తెరిచింది.
“ఏంటి లలిత, ఇంత పొద్దుపోయినా తలుపు తెరవలేదు! పిల్లాడికి స్కూల్ టైం అయిపోయింది కదా? ఫణి ఆరోగ్యంగానే ఉన్నాడు కదా? నాకు చాలా భయంగా అనిపించి తలుపు కొట్టాను. ఆ కళ్ళేంటి? రాత్రి నిద్రపోలేదా? ఎర్రగా వాచిపోయాయి. ఏమైంది లలిత?” ఆదుర్దాగా అడిగింది.
“ఏం లేదు పిన్ని. రాత్రి ఈయన ఇంటికి రాలేదు. తన కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. తెల్లారుజామున నిద్రపోయాను, అందుకే లేవలేకపోయాను,” మొహమాటంతో చెప్పింది.
“అదేమిటి లలిత? రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు ఫణి? ఫోన్ చేయలేదా ఎక్కడున్నాడో? నాకు చెప్పలేదేంటి? మరి నేను నీకు తోడుగా ఉండేదాన్నిగా,” అంది.
“వాళ్ల మరదలు వాళ్లింటికి వెళుతున్నానని చెప్పాడు. కాకపోతే ఎంత రాత్రివరకైనా వస్తాడని ఎదురు చూసాను. మొదటిసారి ఆయన ఇంట్లో లేకపోవటంతో నిద్ర రాలేదు. బాబును తయారు చేసి నేను స్కూల్లో దింపి వస్తాను,” అక్కడే ఉంటే ఇంకా ఏం అడుగుతుందోనని లోపలికి వచ్చేసి కపర్ధిని లేపి చకచకా బ్రెడ్, పాలు తాగించి స్కూల్లో దింపి వచ్చింది. మనసంతా గందరగోళంగా ఉంది. ఇంకా ఇంటికిరాని భర్త కోసం ఎదురుచూస్తుంది. ఫోన్ పనిచేయడం లేదు. ఎక్కడని వెతకను? కిన్నురాలై దుఃఖం తన్నుకొస్తుండగా ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంటిముందు కారు ఆగడంతో పరుగున బయటకు వచ్చింది. కారులోనుండి సరితతో పాటుగా దిగుతున్న భర్తను చూడగానే రోషం పొంగుకొచ్చి చివ్వున వెనక్కు తిరిగిపోయింది లలిత.
“లలిత… ఇలా రా! మీ ఆయన నీతో ఏదో మాట్లాడాలట. అలా ముఖం దాచుకుంటావెందుకు?” నిర్లక్ష్యంగా పిలిచింది సరిత.
=================================================================================
ఇంకా వుంది..
ప్రేమతీరాలు - పార్ట్ 11 త్వరలో
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

@swapnaj8931
• 1 day ago
Papam Lalitha