ప్రేమ తీరాలు - పార్ట్ 9
- Lakshmi Sarma B

- Oct 7
- 9 min read
Updated: Oct 12
#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

Prema Theeralu - Part 9 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 07/10/2025
ప్రేమ తీరాలు - పార్ట్ 9 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది. వారికి కపర్థి అనే బాబు పుడతాడు. కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత కరుణాకర్, చెల్లెలు లలితల మధ్య దూరం పెరుగుతుంది. ఫణికి అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది లలిత. ఫణికి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ ఆపరేషన్ కు ఇరవై లక్షల దాకా అవుతుందనీ చెబుతారు డాక్టర్లు. సహాయం కోసం అన్న కరుణాకర్ దగ్గరకు వెళ్లిన లలితను వదిన రాధ అవమానిస్తుంది. ఫణీకి ఆర్థిక సహాయం చేస్తానంటాడు అతని మేనేజర్ కిరణ్. తన ఇంటి అమ్మకం కోసం పెదనాన్న దగ్గరకు వెళ్తాడు ఫణి.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ప్రేమ తీరాలు పార్ట్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 4 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 5 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రేమ తీరాలు పార్ట్ 6 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇక ప్రేమ తీరాలు పార్ట్ 9 చదవండి.
“అరే ఫణి నువ్వా రా రా. ఇప్పుడేనా రావడం.. కోడలు, మనవడు రాలేదా, ఏమేవ్. మా రాజశేఖరం కొడుకు ఫణి వచ్చాడు. కాసిన్ని మంచినీళ్ళు తీసుకురా,” భార్యను కేకవేస్తూ ముఖమంతా నవ్వు పులుముకుంటూ ఫణిని కూర్చోమన్నాడు సోమశేఖరం.
“బాగున్నారా పెదనాన్న… మీ ఆరోగ్యం బాగుందా.. పెద్దమ్మ, బాగున్నావా,” ఆమె తెచ్చిన మంచినీళ్లు తీసుకుంటూ అడిగాడు.
“అదేమిట్రా నువ్వొక్కడివే వచ్చావు.. పిల్లలను తీసుకరాకూడదా, ఏమిటో మీ నాన్నవాళ్ళు పోయినప్పటినుండి మన ఊరికి రావడమే మానేశావు. పెద్దవాళ్లం మేమున్నామని అయినా
రావాలనిపించలేదా నీకు,” ఆప్యాయంగా మాట్లాడుతూ నిష్టూరమాడింది.
“అలాగేం లేదు పెద్దమ్మ. నీ కోడలు కూడా వచ్చింది. పిలుచుకొస్తానుండండి,” మంచినీళ్లు తాగి వెళ్లాడు లలితను పిలవడానికి.
“రామ్మా లలిత… ఎన్నాళ్ళయిందో చూసి బాగున్నావా ?,” అడిగింది కోడలిని దగ్గరకు తీసుకుంటూ.
“ బాగున్నానత్తయ్యా… మామయ్య మీరు బాగున్నారా,” అంటూ పెద్దవాళ్ల కాళ్ళకు దండంపెడుతూ అత్త పక్కన కూర్చుంది.
“పెదనాన్న… మా ఇల్లు ఏమైంది? అక్కడ అంత పెద్ద బంగ్లా వచ్చిందేమిటి,”
“నాయనా ఫణి. అవన్ని తరువాత మాట్లాడుకుందాము. ముందు భోజనాలు కానీ. ఎప్పుడనగా బయలదేరారో ఏమో పదండి,” చెప్పాడు.
కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకున్నాక భోజనాలు అవి ముగించాకా అసలు విషయం మొదలుపెట్టాడు సోమశేఖరం.
“ఆ ఇల్లు ఇప్పుడు మా పెద్దబ్బాయి కట్టుకుని అందులోనే ఉంటున్నాడు,”
“అదేంటి అది మా ఇల్లు కదా,” అనుమానంగా చూస్తూ అడిగాడు ఫణి.
“అవును ఒకప్పుడు మీదే. కానీ మీ నాన్న పోయినప్పుడు నువ్వు ఇక ఈ ఊరికి రానని నాకు రాసిచ్చావు. అప్పటికి.. నేను చెప్పాను దీన్ని అమ్మి నీకు డబ్బులిస్తాను అన్నాను.
నువ్వేమన్నావో తెలుసా ? మా నాన్నతో పాటే ఇవన్ని పోయాయి నాకివేమి వద్దు.. ఇంకెప్పుడు ఈ ఊరికి రాను అని చెప్పి ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టి నాకిచ్చి
వెళ్ళిపోయావు. ఏదో బాధలో అలా అంటున్నావు కొన్నాళ్ళయ్యాక రాతపోతావాని ఎదురు చూసాను. నీ జాడ లేదు. నువ్విక రావని మొన్ననే నాకొడుకు.. అదే మీ అన్న ఇల్లుకట్టుకున్నాడు. అయినా నువ్వేం పరాయివాడివా.. ఇది మనిల్లే కదా. నీ ఇష్టం వచ్చినన్ని రోజులుండు కాదంటానా,” పళ్ళికిలిస్తూ చెప్పాడు.
ఫణికి తల గిర్రున తిరిగిపోయింది. ఉన్న ఒక్క ఆశ పోయింది. ఎంత మోసం.. బాధలో ఉన్నాని తెలిసి నాతో దొంగ సంతకాలు పెట్టించుకుని ఆస్తి కాజేస్తారా.. ఛీ ఛీ.. ఏం మనుషులు వీళ్ళు..
అందుకే ఎక్కడలేని ప్రేమ నటిస్తున్నారు. అదే మాట అన్నాడు వాళ్ళతో.
“చూడు నాయన … ఇప్పుడనుకోని బాధపడి లాభంలేదు. నువ్వెంత బాధపడినా పది మందిని పిలిచి అడిగినా ఈ ఇల్లు నాదే అంటారు. ఎందుకంటే ఆ రోజు నువ్వు అందరి ముందే చెప్పి పేపర్లమీద సంతకం పెట్టావు. నీకు ఏమైనా డబ్బులు సహాయం కావాలంటే చెప్పు నాకు తోచింది ఇస్తాను,”
“ ఛీ ఛీ,” అసహ్యంగా తలవూపాడు ఫణి.
“మామయ్య… మీరు సహాయం చేస్తానంటున్నారని అడుగుతున్నాను. ఆయనకు ఆపరేషన్ కు ఇరవై లక్షల వరకు డబ్బులవసరం ఉన్నాయి. ఎంతో కొంత మీరు ఏర్పాటు చేస్తే తీసుకుని వెళ్ళిపోతాము. మాకు ఈ జాగలతో పని లేదు,” అడిగింది దీనంగా.
“అయ్యో అవునా తల్లి.. సరే, నువ్వు నోరు తెరిచి అడిగావు కాబట్టి ఇస్తాను, ఏమేవ్. ఆ పెట్టెలో ఓ లక్ష రూపాయలు ఉన్నట్టున్నాయి ఇటు పట్రా,” అని కేకవేసాడు.
“లలిత… మనకేం అవసరంలేదు. వాళ్ళు వేసే ముష్టి వాళ్ళనే ఉంచుకోమని చెప్పు. పద మనం వెళదాం,” చకచక లేచి బయటకు వచ్చాడు. అతన్ని అనుసరించింది లలిత.
“పోరా. నీకే అంత ఉంటే నాకెంత ఉండాలి.. ఈ ఊర్లో సర్పంచిని, ఏదో పాపం కదా అని సహాయం చేస్తానంటే తలపొగరు చూడు.. ఆ తండ్రికి ఉన్నట్టే ఉంది,” అన్నాడు వెనకనుంచి ఫణికి వినబడేలా. సుర్రుమని చూసి వెనకకు తిరుగబోయాడు. చటుక్కున చెయ్యి పట్టుకుని ఆపింది లలిత.
“చూసావా లలిత.. నా అనుకున్నవాళ్ళే ఎంత మోసం చేసారో, నా బాధలో నేనుంటే అదే అదనుగా తీసుకొని నాచేత తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకుని ఆస్తి కాజేసారు. వీళ్ళకు ఎంతవరకు న్యాయం లలిత ఇది,” గుండెలో బాధ తన్నుకురాగా లలితను పట్టుకుని అడిగాడు దారిలో.
“ఊరుకోండి … మామయ్య ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా.. గుంటకాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారు, యాత్రల నుండి రాగానే మీ పేరు మీద చేస్తానన్నారు. వాళ్ళే లేకుండా పోయారు పాపం. వాళ్ళే లేకపోయినాక మనకా ఆస్తి మాత్రం ఎందుకు చెప్పండి. మీరు ఎక్కువగా ఆలోచించి మనసు పాడుచేసుకోకండి,” భర్తను ఊరడిస్తూ చెప్పింది.
ఎవరి మనసుల్లో వాళ్ళే బాధపడుతూ మౌనంగా ఆలోచిస్తూ అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. ఇల్లు వచ్చి డ్రయివరు పిలిచే వరకు లేవలేదు ఇద్దరు.
“అరే అప్పుడే వచ్చేసామా,” కారు దిగుతూ అన్నాడు ఫణి.
“మీరు అలసిపోయి మాంచి నిద్రలో ఉన్నారు. అందుకే మీకు తెలియలేదు సార్,”
“ఇదిగో రమేశ్. నీ డబ్బులు.. చాలా బాగా నడిపించావు కారు. ఎప్పుడు అవసరమైనా పిలుస్తాను. అందుబాటులో ఉంటావా,” అడిగాడు ఫణి.
“అలాగే సర్. మీరు ఎప్పుడు కావాలన్నా ఒక్క ఫోన్ చెయ్యండి. ఎక్కడున్నా వచ్చేస్తాను. కాకపోతే ముందుగా చెప్పారంటే ఎటైనా వెళ్లేది ఉంటే వేరే వాళ్ళకు చెప్పి వస్తాను సార్,” అంటూ వెళ్ళిపోయాడు డ్రయివర్ రమేశ్.
“అదేంటి లలిత… ఫోన్ చేస్తానన్నావు చేయ్యనేలేదు.. వెళ్ళిన పని అయిందా.. తొందరగానే తిరిగివచ్చారు, ఫణి అలా ఉన్నాడేం.. నీరసంగా.. దారిలో ఏమి ఇబ్బందికాలేదు కదా,” ఆత్రుతగా అడిగింది సావిత్రమ్మ.
“లేదు పిన్ని. మేమనుకున్నది ఒకటయితే అక్కడ జరిగింది ఇంకొకటి,” జరిగింది మొత్తం చెప్పింది లలిత.
“ ఇదెక్కడి అన్యాయం. ఒంటరివాణ్ణి చేసి ఆస్తి దక్కించుకుంటారా.. అన్యాయంగా వచ్చిన సొమ్ము తిని వాళ్ళేం బాగుపడతారులే తల్లి. ఫణి.. ఇదేమి పట్టించుకోకు. నీ ఆరోగ్యం బాగుపడితే ఇంతకంటే ఎక్కువే సంపాదించుకోగలవు. రండి వడ్డిస్తాను. బాబు ఇప్పుడే నిద్రపోయాడు,” అంది.
వారంరోజులు గడిచిపోయాయి. ఫణి ఆ ఆలోచనలనుండి బయటకు రావడం కష్టంగా ఉంది.
కిరణ్ రెండుసార్లు ఫోన్ చేసాడు, ఎంతవరకు వచ్చింది.. ఆపరేషన్ డబ్బులు తయారుగాపెట్టానని. కానీ ఫణి మొండితనంతో ముందుకు రావడం లేదు. లలిత ఎంత
బ్రతిమాలిన వినడంలేదని చెప్పింది కిరణ్ తో. ఉన్నట్టుండి కిందపడిపోయాడు ఫణి.
అప్పుడే వచ్చిన కిరణ్ ఫణిని లేవనెత్తి కారులో పడుకోబెట్టుకుని హుటాహుటిన హాస్పిటల్ లో జాయిన్ చేసాడు.
డాక్టర్లు కంగారు పడుతూ.
“ఏమిటమ్మా ఇది.. ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా, మించినాక తీసుకొచ్చి ఏమన్నా అయితే మమ్మల్ని తిట్టిపొయడానికా? చూస్తే చదువుకున్నాదానిలా ఉన్నావు.. ఆ మాత్రం తెలియకపోతే ఎలా,” డాక్టర్ గట్టిగా చివాట్లు పెడుతూ ఫణి వెంబడి ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాడు.
ఈ లోపల సిస్టర్ వచ్చి డబ్బులు కట్టించుకుని లలితతో సంతకాలు పెట్టించుకున్నారు, ఏది జరిగినా బాధ్యత మాది కాదని. కాళ్ళు చేతులు వణుకుతుండగా సంతకం పెట్టింది దేవుడిమీద భారం వేసి.
“లలిత.. ఏమిటిది.. ఏడుస్తున్నావా.. ఛ ఛ.. ఫణి క్షేమంగా తిరిగి వస్తాడు. ఇదిగో ఈ కాఫీ తాగు,” లలిత భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు. లలిత ఏది పట్టించుకునే స్థితిలో లేదు.
అతనిచ్చిన కాఫీ తాగి కళ్ళు మూసుకుని కూర్చుంది మనసులో దైవాన్ని ప్రార్థిస్తూ.
లలిత పక్కనే కూర్చొని తల నిమురుతూ కూర్చున్నాడు కిరణ్. ఐదారు గంటలు కష్టపడి గానీ ఆపరేషన్ పూర్తి చేసారు డాక్టర్లు. ఆ విషయం వచ్చి చెప్పాడు డాక్టర్.
“నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. సమయానికి నీ భర్తను తీసుకవచ్చావు కాబట్టి సరిపోయింది. ఏ మాత్రం లేటు చేసినా మా కష్టం వృధా అయ్యేది. ఆయన స్పృహ లోకి వచ్చాక ఒక్కరే వెళ్ళి చూడండి,” చెప్పాడు డాక్టర్ నవ్వుతూ.
“కళ్ళవెంబడి నీళ్ళు ధారా కారుతుండగా రెండుచేతులు జోడించి డాక్టరుకు దండంపెట్టి. కిరణ్ వైపు తిరిగి కాళ్ళకు దండం పెట్టింది. ఈ హఠాత్ సంఘటనకు చలించిపోయాడు కిరణ్.
“లలిత … ఏంటిది నాకు దండం పెడుతున్నావు,” రెండు చేతులతో లేవనెత్తి లలితవైపు ప్రేమగా చూస్తూ అన్నాడు. ఒక్క క్షణం లలితకు అర్థం కాలేదు. తేరుకుని పక్కకు జరిగింది..
ఫణిని చూసిన లలితకు ఉద్వేగం భరించుకోలేకపోయింది. మనసులో మౌనంగా రోదించసాగింది. అతన్ని క్షేమంగా కాపాడిన దేవుళ్ళందరికి శతకోటి దండాలు పెడుతూ
అక్కడే ఉన్న కూర్చిలో కూర్చుంది.
కిరణ్ వెళ్ళిపోతాడేమో ఒక్కదాన్ని ఎలా చూసుకోవాలోనని భయపడుతున్న లలిత మనసు గ్రహించిన వాడిలా.
“లలిత.. నేను ఫణిని చూసుకుంటాను. నువ్వింటికి వెళ్ళు. బాబును చూసుకుని రెస్ట్ తీసుకో. రేపు ఉదయం నేను వచ్చి తీసుకవస్తాను,” అనునయంగా చెప్పాడు.
“లేదు, నేనెక్కడికి వెళ్ళను. ఆయనకు తోడుగా నేనే ఉంటాను. మీరు వెళ్ళండి,”
“అదేంటి.. నువ్వొక్కదానివి ఎలా ఉండగలవు.. ఏ రాత్రి ఫణికి ఏదైనా ఇబ్బంది అయితే ఏం చెయ్యగలవు, పోనీ మీ వాళ్ళెవరన్నా ఉంటే నేనలాగే వెళ్ళిపోతాను చెప్పండి,”
“నాకు తోడుగా ఎవరు లేరు. కానీ మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిదికాదు. ఇప్పటికే చాలా సహాయం చేసారు,” భయంగానే అంది కిరణ్ వెళ్ళిపోతే ఎలా అనుకుంటూ.
“లలిత, నువ్వు నన్నపార్థం చేసుకుంటున్నావు. ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకోకపోతే మనిషిగా నేనెందుకు చెప్పు, మీ అన్నయ్యనే ఉంటే అలాగే అనే దానివా.. పోనీ ఇద్దరం ఇక్కడే ఉందాము సరేనా,” అడిగాడు.
“సరే,” అంది తలవూపుతూ.
రాత్రంతా అక్కడే కుర్చీలలో కూర్చున్నారు ఎప్పుడు పిలుస్తారోనని. చూసి చూసి పక్కనే ఉన్న కిరణ్ భుజం మీద తలవాల్చి నిద్రలోకి జారుకుంది లలిత. సిస్టర్ ను పిలిచి ఒక బెడ్ షీట్ అడిగి లలితకు కప్పి ఆమె భుజం చుట్టు చేతులువేసాడు పడిపోకుండా.
ఎవరి ఆపదలో వాళ్ళుంటే పుల్లలు పెట్టడానికి సమయం కోసం రడీగా ఉంటారు కొందరు. లలిత కిరణ్ భుజం మీద తల వాల్చి పడుకోవడం అతను ఆమె భుజాలచుట్టూ చేతులతో పట్టుకోవడం రెండుజతల కళ్ళు గమనించాయన్న సంగతి వీళ్ళకు తెలియదు. మంచి మనసుతో ఉన్నా లేనివి సృష్టించే గుణాలు కలిగిన వాళ్ళకు మంచి కనిపించదు.
లలిత ఎవరి గురించి భయపడిందో ఆ సరిత… రాధ ఈ రోజు హాస్పిటల్ తనను చూసిందన్న విషయం లలితకు తెలియదు. రేపటి తన జీవితం ఎలా మలుపు తిరగబోతుందో కూడా లలిత ఊహించి ఉండదు. సమయం కోసం వేచి ఉన్న మేక వన్నె పులులున్నారని తన జీవితంతో వాళ్ళు ఆడుకోబోతున్నారని తెలియని అమాయకురాలు లలిత.
“లలిత… నువ్వా ఇక్కడున్నావేంటి ఎవరైనా నీకు కావలసిన వాళ్ళున్నారా,” పక్కనే కుర్చీలో కూర్చున్న కిరణ్ వంక అదోలా చూస్తూ అడిగింది రాధ.
“వదినా నువ్వా … నీకెలా తెలుసు ఫణికి ఆపరేషన్ అయినట్టు.. అన్నయ్య వచ్చాడా,” అంటూ చుట్టూ చూసింది ఆనందంతో.
“ఆ నేను నీకోసం రాలేదు. ఇదిగో నా స్నేహితురాలు సరిత వాళ్ళమ్మగారు ఇదే హాస్పిటల్ ఉంటే రోజు వస్తున్నాను తనకు తోడుగా నువ్వు కనిపించావని పలకరించాను,” పక్కనే ఉన్న కిరణ్ ను లలితను ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అంది రాధ.
లలిత మనసు చివుక్కుమంది ఆ మాటలకు ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉంది.
“సరిత… నేను చెప్పాను చూడు.. లలిత.. మా ఆడపడుచు. నీ కాబోయే మీ బావను పెళ్ళి చేసుకుందని చెప్పావు చూడు.. ఈవిడే,” వ్యంగ్యంగా వేలు చూపెడుతూ అంది సరితతో.
“ఓహో ఈవిడేనా. అంటే మా బావా కాకుండా ఇంకా వేరే వాళ్ళతో కూడా వస్తుందన్నమాట బయటకు, హలో లలిత.. మా బావెక్కడ.. ఇంట్లో ఉన్నాడా.. నువ్వెవరికోసమో హాస్పిటల్ చుట్టు తిరుగుతున్నట్టున్నావు, ఇతను నీకు బాగా కావలసిన వాడున్నట్టున్నాడు,” వెకిలిగా నవ్వుతూ కిరణ్ ను చూస్తూ అడిగింది లలిత.
“చూడు, నువ్వెవరో నాకు తెలియదు. ఇలా అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసే వాళ్ళంటే నాకసహ్యం. ఛీ ఛీ.. ఏం మాట్లాడాలో తెలియని మూర్ఖులు,” ఈసడించుకుంటూ డాక్టర్ రౌండ్స్ కు వచ్చాడని బయట కూర్చోమంటే కూర్చొన్నారు. అనవసరంగా వీళ్ళ కళ్ళలో పడ్డాను అనుకుంది. వెనకాలే వెళ్లాడు కిరణ్. వీళ్ళెవరో లలితతో మాట్లాడుతున్నదేమిటో
అర్థంకాలేదు కిరణ్ కు.
ఈ వారం రోజులు ఫణి కోసం లలితకు తోడుగా హాస్పిటల్ చుట్టు తిరిగాడు కిరణ్. లలితను ఇంటికి తీసుకవెళ్ళడం తీసుకరావడం ఇద్దరు కలిసి హోటల్ లంచ్ డిన్నర్
చెయ్యడం. హాస్పిటల్ ఫణి దగ్గర కూర్చొని మాట్లాడడం కిరణ్ వేసే జోకులకు లలిత పడి పడి నవ్వడం ఇవన్ని గమనించే వాళ్ళున్నారని తెలియదు.
ఫణి పూర్తిగా కోలుకున్నాడని డిశ్చార్జి చేసాడు డాక్టర్. ఫణిని తీసుకుని ఇంట్లో దింపి ఆ రోజు సాయంత్రం వరకు ఉండి లలితకు పనిలో సహాయం చేసి వెళ్ళిపోయాడు. ఫణికి చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే తన వాళ్ళు అనుకున్న వాళ్ళే దూరం పెట్టారు. ఏ సంబంధం లేని కిరణ్ డబ్బు సహాయం చెయ్యడమే కాకా దగ్గరుండి నాకు ఆపరేషన్ చేయించి లలితకు తోడుగా ఉన్నాడంటే కిరణ్ ఎంతమంచివాడు. పాపం లలిత ఒక్కతే ఎంత గాబరా పడేదో అదే విషయం లలితతో కూడా చెప్పాడు.
లలిత నవ్వి ఊరుకుంది. సావిత్రమ్మ కపర్ధిని చూసుకోవడమే కాక ఫణి ఇంటికి వచ్చినప్పటినుండి ఇక్కడే లలితకు సహాయంగా ఉంటుంది. ఫణి మాములుగా అయి తిరుగుతున్నాడు బాబుతో ఆడుకోవడం హోం వర్క్స్ ఉంటే చేయించడం చేస్తున్నాడు. కిరణ్ కుదిరినప్పుడల్లా వస్తూనే ఉన్నాడు. ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటూ గడుపుతారు వచ్చినప్పుడల్లా కపర్ధి కోసం బొమ్మల్ని తినే వస్తువులు తెస్తూ కాసేపు ఆడుకుని వెళతాడు.
“కిరణ్ … నేను ఈవారంలో ఆఫీసుకు వద్దామనుకుంటున్నాను ఇప్పుడు బాగానే ఉన్నాను,”
“అప్పుడే ఆఫీసుకు వస్తావా? ఏంటి ఇంట్లో ఉండడం బోరుగా ఉందా? లేకపోతే సెలవులు అయిపోతున్నాయని కంగారు పడుతున్నావా,”
“అలా కాదు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అని అనుకున్నాను, మీకు డబ్బులుకూడా ఇవ్వాలి కదా మెల్లిగా నెల నెలా ఇచ్చేద్దామని అనుకున్నాను, నాకు వేరే విధంగా డబ్బులు వచ్చే దారేలేదు ఎలా తీర్చగలనో అర్థం కావడంలేదు,” ముఖం చిన్నబుచ్చుకుని అన్నాడు.
“ఓహో నువ్వలా ఆలోచిస్తావని నేను ఊహించలేదు ఫణి. సరే అయితే.. నువ్వెంత తొందరగా ఆఫీసుకు వచ్చి నా ఋణం తీర్చుకుంటే అంత మంచిది, నేను వెళుతున్నాను. ఇక నుండి మీ ఇంటికి రావడం మానేస్తున్నాను,” అంటూ కోపంగా చూస్తూ వెళ్లడానికి లేచాడు.
ఒక్క క్షణం ఏమి అర్థంకాలేదు ఫణి లలితకు. ఇదేమిటి ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు అనుకొని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
“కిరణ్ … అంత కోపంగా ఉన్నారేంటి ఏం జరిగింది,” తడబడుతూ అడిగాడు.
“ఇంకా ఏం జరగాలి మీరు నన్నింతగా అవమానస్తారనుకోలేదు, నేను మీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంటే మీరు నన్ను పరాయివాడిలా చూస్తున్నారు, అలాంటప్పుడు నేను మీ మీద ఎందుకు దయ తలచాలి. నువ్వు ఆఫీసుకు వచ్చి నీ జీతంలో సగం డబ్బులు
నెల నెలా కట్టు, నా అప్పు తొందరలో తీరిపోతే మీకు నాకు ఎలాంటి సమస్యలుండవు,”
“కిరణ్ … నన్ను క్షమించు. నేను వేరే భావంతో అనలేదు. మీరు అపార్థం చేసుకున్నారు, మేమెప్పుడు మిమ్మల్ని పరాయివాళ్ళు అనుకోలేదు. రక్తసంబంధం కన్నా ఎక్కువగా మిమ్మల్ని అనుకుంటున్నాము, నేను తప్పుగా మాట్లాడి మీ మనసు నొప్పిస్తే నన్ను మన్నించు కిరణ్,” కిరణ్ రెండుచేతులు పట్టుకుని బ్రతిమాలాడు ఫణి.
“అవును కిరణ్. మొదట్లో మిమ్మల్ని ఆఫీసరుగానే చూసాము. కానీ మీరు మాకు చేసిన సహాయం తో మాకు ఆప్తులైపోయారు, ఈయనకు దగ్గరుండి ప్రాణబిక్ష పెట్టారు. మాకు తోడుగా నిలిచి మాకు దగ్గరి బంధువయ్యారు. అలాంటి మిమ్మల్ని పరాయివాడుగా ఎలా అనుకోగలం అనుకున్నారు.. ఈయనకు ఇంట్లో తోచడం లేదు. అలా మెల్లిగా రోజు ఆఫీసుకు వెళ్ళి వస్తుంటే కాలక్షేపం అవుతుందని అలా అడిగారు,” అంది లలిత.
“అమ్మయ్యా మీరు నవ్వారు అంటే మీ కోపంపోయినట్టే కదా!,” అడిగింది తనే మళ్ళి.
“లేదు లలిత, మీ మీద నాకెప్పుడు కోపంలేదు, రాదు కూడా. ఫణి ఇప్పుడే ఆఫీసుకు రాకుడదని అలా కోపగించుకున్నట్టు అన్నానే గాని నాకు తెలియదా.. మీరు నన్నెంత బాగా చూసుకుంటున్నారో. ఆ.. ఫణి.. ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరిచాను. నువ్వెలాగు ఆఫీసుకు వస్తానన్నావు కదా. నేను అనుకోకుండా ఆఫీసు పని మీద రెండునెలలు అమెరికా వెళ్ళాల్సి ఉంది. నేను వచ్చేవరకు మన ఆఫీసు బాధ్యతలు నీకప్పగిస్తాను చూసుకుంటావా,” అడిగాడు అప్పుడే గుర్తుకు వచ్చి.
“అవునా కంగ్రాచ్యులేషన్స్ కిరణ్ … మీరు చెప్పలేగానీ చెయ్యకుండా ఉంటానా? చెప్పండి ఎప్పుడు వెళుతున్నారు,” ఆత్రుతగా అడిగాడు ఫణి.
“మమ్మల్ని ఒంటిరిని చేసి మీరు వెళ్లిపోతున్నారా మీ ఆత్మీయత కరువౌతుంది మాకు మీరు వచ్చేవరకు,” అంది బాధపడుతూ.
“నేను మాత్రం మిమ్మల్ని మిస్ అవడంలేదా ? కానీ తప్పదు కదా! కంపెనీ లాభాల బాట నడుస్తున్నది, ఇంకా ఇంకా ఎదగాలంటే ఇలాంటివి తప్పవు ఫణి … నీ ఆరోగ్యం జాగ్రత్త, నేను వెళ్ళమన్న కదా అని గంటల తరబడి అక్కడే కూర్చోకు, లలిత ఇదిగో ఈ కార్డు దగ్గర పెట్టుకో. నీకు ఎప్పుడు ఏ అవసరమొచ్చినా డబ్బు వాడుకో. మీది నాది అనుకోవద్దు, అలాగే డ్రయివరు కూడా నేను లేకపోతే ఖాళీగానే ఉంటాడు కాబట్టి నువ్వు ఫోన్ చెయ్యగానే వస్తాడు. ఫణి.. నువ్వు కొన్ని రోజులు కారు నడపకుండా ఉంటే మంచిది,” అన్ని చెబుతూ బయటకు రాబోయాడు.
అప్పుడే ఆటో దిగిన సరిత పూలబొకే పట్టుకుని తలుపుదగ్గర నిలబడి లోపల మాట్లాడుకుంటున్న మాటలన్ని విన్నది.
“ఓహో ఇంటికి కూడా వస్తాడన్నమాట ఈయనగారు,” కిరణ్ ను ఎగాదిగా చూస్తూ అంది. వింతగా ఆమెను చూస్తూ వెళ్ళిపోయాడు కిరణ్.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.





Comments