ప్రేమ తీరాలు - పార్ట్ 8
- Lakshmi Sarma B

- Sep 30
- 8 min read
Updated: Oct 7
#Prema Theeralu, #ప్రేమతీరాలు, #LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #TeluguStory, #తెలుగుకథ, #TeluguWebSeries

Prema Theeralu - Part 8 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 30/09/2025
ప్రేమ తీరాలు - పార్ట్ 8 - తెలుగు ధారావాహిక
రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఇంజనీరింగ్ చదువుతున్న ఫణి, స్నేహితుడు కరుణాకర్ చెల్లెలు లలితను ప్రేమిస్తాడు. పెద్దల అనుమతితో వారి వివాహం జరుగుతుంది. లలిత గర్భవతి అవుతుంది. పండంటి బాబుకు జన్మనిస్తుంది. కరుణాకర్ రాధను వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత కరుణాకర్, చెల్లెలు లలితల మధ్య దూరం పెరుగుతుంది. ఫణికి అనారోగ్యంగా ఉండటంతో హాస్పిటల్ కు తీసుకొని వెళ్తుంది లలిత. ఫణికి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ ఆపరేషన్ కు ఇరవై లక్షల దాకా అవుతుందనీ చెబుతారు డాక్టర్లు. సహాయం కోసం అన్న కరుణాకర్ దగ్గరకు వెళ్లిన లలితను వదిన రాధ అవమానిస్తుంది. ఫణీకి ఆర్థిక సహాయం చేస్తానంటాడు అతని మేనేజర్ కిరణ్.
గత ఎపిసోడ్ ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఇక ప్రేమ తీరాలు పార్ట్ 8 చదవండి.
“అవునూ.. మీ బాబు కనిపించడేం.. ఈ రోజు ఆదివారమే కదా ఇంట్లో లేడు” చుట్టు చూస్తూ అడిగాడు.
“మా వాడికి మా పక్కింట్లో ఆంటీ బాగా అలవాటు. ఆవిడ ఒక్కర్తే ఉంటుంది. వాడికిష్టమైనవి ఏవో చేసి పెడుతుంది. కాసేపు టీవి చూస్తూ ఆవిడతో ఉంటాడు. లలితా. ఒకసారి బాబును పిలుచుకురా,” చెప్పాడు ఫణి.
“అలాగే,” అంటూ లలిత వెళుతుంటే నల్లటి వాలుజడ ఆమె నడకకు నాట్యమాడుతున్నట్టు కదులుతుంటే రెప్ప వాల్చకుండా అలాగే చూస్తున్నాడు కిరణ్.
“హయ్ అంకుల్.. మీరు మా నాన్న ఆఫీసరట కదా. మా అమ్మ చెప్పింది, ” అంటూ వచ్చాడు కపర్ధి.
“హల్లో బాబు .. ఎలా ఉన్నావు.. నేను వచ్చి ఎంతసేపయిందో తెలుసా? నీకు తెలియదా. నేను వస్తున్నట్టు.. అబ్బా.. నువ్వు లేవు నాకు బోరు వచ్చింది,” కపర్ధిని దగ్గరకు తీసుకుని మీద కూర్చోబెట్టుకుంటూ అడిగాడు కిరణ్.
“ఇదిగో వీళ్ళే నన్ను పంపించారు. మీరు మా నాన్న ఆఫీసరని, నేను గోల చేస్తే మీరు కోపగించుకుంటారని నన్ను మామ్మ దగ్గరుంచారు. అంకుల్.. మీరు చూస్తే మా నాన్నంతనే
ఉన్నారు. మరి పెద్ద ఆఫీసరన్నారు.. మీకు పెద్ద మీసాలుంటాయి, లావుగా ఉంటారనుకున్నాను, అసలు మిమ్మల్ని చూస్తే అలా లేరు, ” కిసుక్కున నవ్వుతూ అన్నాడు.
“ఏయ్ కపర్ధి.. తప్పు. పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదన్నానా.. ఇలారా స్కూల్ హోంవర్క్
చేసుకుందువుగానీ, ” కోపంతో కొడుకువైపు చూస్తూ అంది.
“అరే ఎందుకంత కోపం.. చిన్న పిల్లవాడు. తమాషాగా మాట్లాడుతున్నాడు. అందులో తప్పేముంది లలితా, మేము మేము ఫ్రెండ్స్. నువ్వు మా మధ్యలోకి రాకూడదు కదా, ”
“ అవును మనం ఫ్రెండ్స్,” అన్నాడు కిరణ్ చేతిలో చెయ్యి వేస్తూ. అందరూ నవ్వుకున్నారు.
“నీ కోసం ఏం తెచ్చానో చూసావా,” తను తెచ్చిన బ్యాగులోనుండి రిమోట్ కారు తీసి కపర్ధికి ఇచ్చాడు కిరణ్.
“వావ్.. సూపర్ ఫ్రెండ్. థాంక్యూ, ” అమాంతంగా కిరణ్ బుగ్గమీద ముద్దుపెడుతూ అన్నాడు. కిందకు దిగి వెళ్లాడు కారుతో ఆడుకోవడానికి.
“ఫణి.. అసలు విషయానికి వద్దాము .. నేను రెండురోజుల్లో డబ్బులు తయారుగాపెడతాను. మీరు హాస్పిటల్ కు వెళ్ళకముందు చెప్పండి. వెంటనే హాస్పిటల్ కు పంపిస్తాను.క్షేమంగా ఆపరేషన్ చేయించుకోని ఇంటికి వచ్చాక మిగతా విషయాలు తరువాత మాట్లాడుకుందాము, ” చెబుతూ లలిత వైపు చూసాడు.
“చాలా సంతోషం సర్.. కాదు.. కిరణ్ .. మీ మేలు జన్మలో తీర్చుకోలేము, మీలాంటి స్నేహం మాకు దొరికినందుకు నిజంగా నేను గర్వపడుతున్నాను, ” లేచి కిరణ్ చేతులుపట్టుకున్నాడు ఫణి.
“ఋణాలదేముంది ఫణి.. ఎలాగైనా తీర్చుకోవచ్చు. మనసుంటే మార్గాలు చాలా ఉంటాయి. లలిత చేతి వంట తింటే ఋణాలు అవే తీరిపోతాయంటున్నాను, ” లలితను చూస్తూ అన్నాడు. లలితకు తెలియని భయం పట్టుకుంది కిరణ్ మాటలు వింటుంటే.
“కిరణ్.. మీరెప్పుడు రావాలనుకున్నా స్వతంత్రంగా రండి. మీకేం కావాలన్నా లలిత చేసి పెడుతుంది, మీకు మొహమాటం లేకుండా అడిగి చేయించుకోండి. అంతే కదా లలితా” నవ్వుతూ భార్యను అడుగుతూ కిరణ్ తో చెప్పాడు.
“తప్పకుండా వస్తాను. లలితా.. నీకేం ఇబ్బంది కాదు కదా,”
“అదేం లేదు. మీకిష్టమైనప్పుడు రండి, ” మొహమాటంగా అంది, లోపల భర్తను తిట్టుకుంటూ. ఈయనకేం తెలియదు. కొంచెం మంచిగా మాట్లాడగానే అందరు మంచివాళ్ళే అనుకుంటాడు.
“ఏమండి.. మీరేంటి ఆయనను ఎప్పుడైనా రావచ్చొని చెబుతున్నారు, ఆయనేమన్నా మనకు చుట్టమా పక్కమా. ఎవరినెంతలుంచాలో అంతనే ఉండాలి. అందరిని నెత్తిలో పెట్టుకోవద్దు అర్థం చేసుకోండి, ” కిరణ్ వెళ్ళిపోగానే గట్టిగా చివాట్లు పెట్టింది లలిత.
“అదేంటి లలిత అలా అంటున్నావు. కిరణ్ మనకు ఎలాంటి ఆత్మీయుడో నీకర్థం కాలేదా? ఇరవై లక్షలు ఎవరైనా ఊరికే ఇస్తారా చెప్పు.. ఏ చుట్టము కూడా ఇవ్వరు. ఎలాంటి కాగితం రాసుకోకుండా అంత డబ్బివ్వడానికి ఒప్పుకున్నాడంటే అతని మంచితనం నీకు తెలియడంలేదా, ” అడిగాడు నొచ్చుకుంటూ.
“అదికాదండి .. మంచివాడే కావచ్చు కానీ అతని చూపులు నాకు చాలా బాధకలిగించాయి, ” ఇంకేం చెప్పాలో అర్థంకాక.
“ఆయనంతే లలిత. చాలా సరదా మనిషి. ఆఫీసులో కూడా అంతే అందరితో కలిసిమెలిసి తిరుగుతాడు. మనసులో కపటం లేదు. అందరు అలాగే అనుకుంటారు తెలుసా.. అయినా మన పొలం అమ్మగానే ఆయన డబ్బు ఇచ్చేసామంటే మనింటికెందుకు వస్తాడు చెప్పు, ” భార్యను ఆర్తిగా దగ్గరకు తీసుకున్నాడు. లతలా చుట్టుకుంది లలిత. లోపల ఎక్కడో ఆడుకుంటున్నాడు కపర్ధి కారుతో.
********* ********* ********** ********
“లలితా. ఈరోజు మనం ఊరెళ్ళి విషయం కనుక్కుని వద్దాము, డ్రయివరును మాట్లాడుకుందాము. నేను కారు అంత దూరం నడిపించడం కష్టమేమో, ” ఉదయం లేస్తూనే అడిగాడు ఫణి.
“అలాగే వెళదాము. కానీ మీకు అంత దూరం కూర్చొవడానికి ఓపిక ఉంటుందా? లేదంటే నేను వెళ్ళి వస్తాను. మీకు తోడుగా పిన్ని ఉంటుంది, ” భర్తకు కాఫీ అందిస్తూ అంది.
“బాగుంది.. నాకే ఎవ్వరు తెలియరు. ఆ ఊర్లో నీకేం తెలుస్తుంది లలిత, అయినా ఒక్కదానివి అంత దూరం వెళితే మధ్యలో కారు చెడిపోతే ఇబ్బందిగా ఉంటుంది, పైగా ఆ ఊరి వాళ్ళు నిన్నెవరు గుర్తుపట్టరు. నువ్వెవరితో మాట్లాడగలవు.. నాకు బాగానే ఉంది. కాకపోతే అంత దూరం కారు నడపొద్దని డ్రయివరును పెట్టుకుందామన్నాను, ” చెప్పాడు.
“బాబును పిన్ని దగ్గరుంచి వెళదామా అక్కడ తినడానికి ఇబ్బంది అవుతుందేమో, మన పని చూసుకొని తిరిగి ఏ రాత్రి వరకైనా వచ్చేద్దాము, ”
“అలాగే వాడిని తీసుకెళితే మనకు ఇబ్బంది, వాడికి ఇబ్బందిగా ఉంటుంది. పిన్ని దగ్గరుండని. వచ్చాక పిలుచుకుందాము. త్వరగా బయలుదేరితే మంచిది, ట్రాఫిక్ లేని టయంలో తొందరగా వెళ్ళొచ్చు, ” అన్నాడు.
“అలాగే. నేను త్వరగా టిఫెన్ చేస్తాను. తిని బయలుదేరుదామండి. ఈలోగా మీరు వాణ్ణి లేపి తయారుచెయ్యండి, మనకు పులిహోరా కూడా కలుపుతాను. మనకు మధ్యాహ్నం తినడానికి అవుతుంది, ” చెబుతూ చకచకా వంటగదిలోకి వెళ్లింది.
“లలితా.. ఎందుకురా అంత కష్టపడతావు.. బయట ఎక్కడైనా తిందాము. లేని పనులు ఎందుకు నెత్తినవేసుకుంటావు, ” లలిత వెనకాలే వచ్చి ఆమెను తన వైపుకు తిప్పుకుంటూ అడిగాడు.
“అబ్బా వదలండి. నేను తొందరగా పని తెమల్చుకోనివ్వండి, మీకు ముందే ఆరోగ్యం సరిగా లేదు. ఇలాంటి సమయంలో మీరు బయటి తిండి తినడం మంచిదికాదు. మీరు
నన్ను వదిలేస్తే నా పని నేను చేసుకుంటాను బాబు, ” అంది నవ్వుతూ.
“అదికాదు లలిత .., ” అంటూ ఆమెను గట్టిగా కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేసాడు.
“అయ్యో వదలండి. ఇదేం పని.. వేళాపాళ లేదు మీకు, ” చిలిపిగా నవ్వుతూ అతనికి చక్కిలిగింతలు పెట్టింది. నవ్వుతూ మెలికలు తిరుగుతూ లలితను వదిలేసాడు ఫణి.
***
“పిన్ని .. ఇదిగో వీణ్ణి నీ దగ్గర వదిలి మేము ఊరు వెళుతున్నాము. ఏ రాత్రి వరకైనా వచ్చేస్తాము. దేవుడి దయవల్ల ఆ పొలం పని కాస్త అయిపోతే మనకు ఎంతోకొంత డబ్బుల ఇబ్బంది తగ్గుతుంది, ”
“అలాగే తల్లి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. వీడి గురించి మీరేం కంగారుపడకండి. ఒకరోజు లేటయినా పరవాలేదు. దగ్గరుండి పని చేసుకుని రండి, మళ్ళి మళ్ళి వెళ్ళాలంటే కుదరదు. అందరిని కలిసి పొలం బేరం చేసుకోండి, ” సంతోష పడుతూ చెప్పింది సావిత్రమ్మ.
“అలాగే పిన్ని. నీ నోటి పుణ్యానా అది అమ్ముడుపోతే మనకే బాధ ఉండదు. పిన్ని.. ఇదిగో పులిహోరా కలిపాను. తీసుకోండి. మధ్యాహ్నం తినడానికని నేను పెట్టుకున్నాను.
మేము వచ్చేముందు ఫోన్ చేస్తాము. మీరు రాత్రికి చేసుకునే దానిలో మా కోసం కొంచెం ఎక్కువ చెయ్యండి పిన్ని, కపర్ధి.. అమ్మమ్మను సతాయించకు సరేనా, ” చెబుతూ బయలుదేరారు లలితా ఫణి.
“నువ్వంతగా చెప్పాలా లలిత మీరు వచ్చేముందు ఫోన్ చెయ్యండి, సరేనా. రారా బాబు, ” అంటూ కపర్ధి చెయ్యి పుచ్చుకుని లోపలకు వెళ్ళింది.
“లలిత.. ఎన్నాళ్ళ తరువాత మా ఊరు వెళుతున్నాము తలుచుకుంటే బాధగా ఉంది, అమ్మా నాన్న ఉంటే ఎన్ని సార్లు వచ్చేవాళ్ళమో కదా, ” బయట పచ్చని పొలాలు చూస్తూ అన్నాడు ఫణి.
“అవునండి .. పల్లెటూరులంటే నాకు చాలా ఇష్టం. ఆ పచ్చని పోలాలు కమ్మటి వాసనలు వెదజల్లుతుంటే ఎంత బాగుంటుందో, మా చిన్నప్పుడు నేను అన్నయ్య ఊర్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడు పోలాలవెంటే తిరిగేదాన్ని. ఎంత బాగుండేదో, ” పాత రోజులు గుర్తు చేసుకుంటూ అంది.
“అమ్మో నాకు ఈ ఊర్లు అంటే అస్సలు నచ్చవు. ఛీ ఛీ.. ఎప్పుడు చూసిన ఏవో గొడవలు.బస్సు సౌకర్యం ఉండదు. ఒక మంచి హాస్పిటల్ గానీ పిల్లలు చదువుకోవడానికి ఓ మంచి స్కూల్ ఏమి ఉండవు. పోనీ ఎవరన్నా పిల్లలను బాగుచేద్దామని ట్యూషన్ చెబుతాను రండిరా అంటే లేదు మేము బాయికాడికి పోవాలి అని గోళీలు ఆడుకోవాలని చెబుతారే కానీ బాగుపడాలన్న ధ్యాసే ఉండదు మట్టి మనుషులు, ” ముఖం చీదరింపు పెట్టుకుని అన్నాడు.
“పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. అలాగే వాళ్ళకు అలవాటయింది. ఏమండి.. మీరు నన్ను చేసుకోకుంటే మీకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదేమో హాయిగా మీ మరదలిని చేసుకుంటే సుఖపడేవాళ్ళు కదా, నేను నష్టజాతకురాలిని. నావల్ల అందరికి ఇబ్బందులు వస్తాయని ఓ జోతిష్కుడు చెప్పాడు. అప్పుడు నేను అది నమ్మలేదు. కానీ ఇప్పుడు చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది” భర్త భుజం మీద తలపెట్టుకుని అంది.
“ఛ ఛ ఏమిటా మాటలు.. ఎవరు చెప్పారు నీ వల్ల ఇబ్బందులు వస్తున్నాయని.. ఆ మాటకొస్తే నేననాలి. పెళ్ళయ్యాక కొన్నాళ్ళు సంతోషంగా గడిపాము. తరువాత నేను నా బాధలో ఉండిపోయి నిన్ను బాబును పట్టించుకోకపోతే నువ్వు బాబును నన్ను కళ్ళల్లో పెట్టుకుని కాపాడావు. నిన్ను గాలికి వదిలేసినట్టు నీ గురించే ఆలోచించని నన్ను ప్రేమతో నన్నో మనిషిగా చేసావు. అలాంటి నిన్ను ఎవరంటారు, అవును.. నేను మా మరదలిని పెళ్ళి చేసుకుంటానని నీతో ఎవరు చెప్పారు, ” లలిత తలపై చెయ్యివేసి ప్రేమగా నిమురుతూ అడిగాడు ఫణి.
“ఏం.. మీరు చెప్పకపోతే నాకు తెలియదా? ఆమె ఎంతగా బాధపడిందో ఏమో.. ఆమె ఉసురే ముట్టిందేమో మనకు.. అందుకే ఒకటి ఒకటి కష్టాలు వస్తునే ఉన్నాయి, ”
“నేనేం ఆమెకు మాటివ్వలేదే పెళ్ళి చేసుకుంటానని.. మా నాన్న వాళ్ళు చెప్పారట, నాకు నచ్చిన అమ్మాయిని నేను చేసుకున్నాను. ఇంకా నయం తనను పెళ్ళి చేసుకుంటే మూన్నాళ్ళకే నన్ను వదిలి వెళ్ళిపోయేది. మంచి సంబంధం చూసి పెళ్ళి చేసారట. అది నిలుపుకుందనుకున్నావా, గోల గోల చేసి అతన్ని విడిచిపెట్టిందట. నువ్వు గనుక నన్ను పట్టుకుని ఉన్నావు కానీ అదే సరిత అయి ఉంటే ఎప్పుడో నా మానాన నన్ను వదిలి పారిపోయేది. చూడు లలిత .. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమౌతాయట. ఎవరికెవరు రాసి ఉంటే వాళ్లతోనే అవుతాయంటా, ఆహా.. నువ్వు తప్పించుకోవాలనుకున్నా నేను వదలనుగా.. నిన్ను ఎన్ని జన్మలెత్తినా నేనే నీ భర్తగా పుడతాను తెలుసా, ” ఆమె చెవి మెలిపెడుతూ అన్నాడు.
“అబ్బా నొప్పి వదలండి.. మీరు ఎప్పుడైనా విసుగొచ్చి నన్ను వద్దనుకున్నా ప్రతి జన్మలో మీకే భార్యగా పుట్టివ్వమని ఘోరమైన తపస్సు చేసి మిమ్మల్ని భర్తగా పొందుతాను ఏమనుకున్నారో, ” నాలిక బయట పెట్టి వెక్కిరిస్తూ అంది.
“అది, అలా రా దారికి.. ఇంకెప్పుడు నీ వల్ల నాకు ఇబ్బందులు అంటూ సుత్తి మొదలుపెట్టకు, లలిత.. మనకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని ముందుకు పోవాలిగానీ వాటినే తలుచుకుంటూ బాధపడకూడదని తెలుసుకున్నాను. కష్టాల తరువాత మనకు అన్ని మంచిరోజులు వస్తాయి కాబోలు.. ఇప్పుడేం అంత కష్టమొచ్చిందని బాధపడుతున్నావు. ఈ ఆపరేషన్ అయిపోయిందంటే చాలు హాయిగా ఉందాము లలిత, ” ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు.
“వదలండి డ్రయివరు చూస్తాడు .. అంతేనండి. మీరు ఆ గండం నుండి బయటపడితే చాలు, ఇక మనకేమి బాధలు ఉండవండి. మన బాబుతో మనం హాయిగా ఉందాము, ”
“అంటే మనకు ఒక బాబు చాలంటున్నావా.. అదేం కుదరదు. నేను మా నాన్నకు ఒక్కడినే కొడుకును. ఒంటరిగా చాలా బాధపడ్డాను తెలుసా, అందుకే నాకు గంపెడు మంది పిల్లలు కావాలి, నేను హాస్పిటల్ నుండి రాగానే మనం ఆదే పనిలో ఉండాలి. కాదు కూడదంటే నేనూరుకోను. ఇప్పుడే చెబుతున్నాను, ” బుంగమూతి పెట్టి అన్నాడు.
కిలకిలా నవ్వుతూ. “ఏంటి గంపెడు మంది పిల్లలా.. అమ్మో నావల్ల కాదు బాబు.. ఒక్కడితోనే చాలా ఇబ్బందిపడినాను. మీకంతగా కావాలనుకుంటే మీరే కనండి ఒకటి కాదు రెండు గంపలమంది పిల్లలను నాకేం అభ్యంతరంలేదు, ” ఇంకా నవ్వుతూనే అంది.
“ఏయ్ నిన్ను, ” అంటూ ఆమె బుగ్గను కిసుక్కున కొరికాడు.
“అబ్బా నొప్పి మీరు మరీ చిన్నపిల్లాడయిపోతున్నారు చిలిపిచేష్టలు ఎక్కువౌతున్నాయి. ఏమండి.. మనకు ఎన్ని అడ్డంకులు వచ్చినా నన్ను మీ ప్రేమకు దూరం చెయ్యరు కదూ.. ఎవరు మన మధ్యకు రాకూడదు. ఈ బంధం మనకే శాశ్వతంగా ఉంటుందని నాకు మాటివ్వండి, ” చెయ్యి జాపుతూ అడిగింది కన్నీళ్లు నిండిన కళ్ళతో.
“లలిత.. ఏమిటా పిచ్చి మాటలు.. మన మధ్యకు ఎవరో వస్తారని ఎందుకనిపించింది నీకు, నేనేమన్నా చపల చిత్తుడిననుకున్నావా నిన్ను కాదని వేరే వాళ్ళను దగ్గరకు తియ్యడానికి, కలలో కూడా నీ ఎడబాటు భరించుకోని నన్ను అడిగే ప్రశ్న కాదు లలిత. మనను విడదీసే అధికారం ఒక్క మరణానికి మాత్రమే ఉంది, నాకు నువ్వు తప్పా ఈ ప్రపంచంలో ఇంకేది వద్దు. ప్రమాణం చేస్తున్నాను. ఎంతటి విషమ పరిస్థితిలో కూడా నిన్ను వదలనని మాటిస్తున్నాను లలిత. మరీ నువ్వు కూడా అంతే కదూ, ” అడిగాడు ఆమె చేతిలో చెయ్యి వేస్తూ.
లలిత కూడా అతని చేతిని గట్టిగా పట్టుకుని పెదవులానికించుంటూ, “మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనండి.. ఏమో మనసులో భయంగా ఉంటుంది, మీ మరదలు సరిత ఇక్కడే ఉందని తెలిసింది. తనకు నా మీద చాలా కోపంగా ఉందట, తనెప్పుడైనా వచ్చి నామీద లేనిపోనివి చెప్పి మన మధ్య ఏమైనా అడ్డంకులు సృష్టిస్తుందేమోనని భయంతో అడిగాను మిమ్మల్ని, ” అతని ఒడిలో తలపెట్టుకుని పడుకుంటూ అడిగింది.
“సరిత .. ఇక్కడే ఉందా ? నీకెలా తెలుసు తన గురించి, ” ఆశ్చర్యంగా అడిగాడు.
ఆ రోజు తన వదిన చెప్పిన మాటలు చెప్పింది.
“ఓహో అదా సంగతి.. అందుకేనా నువ్వు భయపడుతున్నావు.. పిచ్చిదానా, నేను తనను చేసుకునేది ఉంటే ఆరోజే చేసుకునే వాణ్ణి కదా. ఇప్పుడు తను నన్ను వెదుక్కుంటూ రాగానే తనను పెళ్ళి చేసుకుంటానని ఎలా అనుకున్నావు లలిత, ” పడి పడి నవ్వుతూ అడిగాడు.
ఇంతలో ఊరు రావడంతో “సార్ ఊరొచ్చింది ఇల్లెక్కడో చెప్పండి సార్, ” అడిగాడు డ్రయివరు. అప్పుడప్పుడు అద్దంలో నుండి వీళ్ళ వైపు చూసి చూడనట్టు చూస్తూ తనలో తానే ముసిముసిగా నవ్వుకున్నాడని వీళ్ళకు తెలియదు.
“ఆ అదిగో ఆ ముందు గల్లీలోకి పోయి అక్కడ ఆపు అక్కడే మా ఇల్లు, ” ఒకవైపు ఆనందం మరోవైపు బాధతో చెప్పాడు ఫణి.
“ఇదేమిటి లలిత .. ఇక్కడ మన పాత ఇల్లు లేదు పెద్ద బంగ్లా ఉందేమిటి, ఉండు మా పెదనాన్నను కలిసి వస్తాను నువ్వు కార్లోనే కూర్చో, ” వడి వడిగా అడుగులువేస్తూ వెళ్ళాడు.
తలుపుకొట్టగానే ఫణి పెదనాన్న తలుపు తీసాడు.
=================================================================================
ఇంకా వుంది..
=================================================================================
లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ
నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,
నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.
ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.
మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,
లక్ష్మి శర్మ
లాలాపేట సికింద్రాబాద్
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.





Comments