top of page

ఋణావేశ రసగుల్లా

#Runavesa Rasagulla, #ఋణావేశరసగుల్లా, #DrBrindaMN, #డాక్టర్.బృందఎంఎన్., #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Runavesa Rasagulla - New Telugu Story Written By Dr. Brinda M N

Published In manatelugukathalu.com On 28/09/2025

ఋణావేశ రసగుల్లా - తెలుగు కథ

రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.


ఒక అందమైన దాంపత్య వృక్షానికి కాచిన అద్వితీయ ఫలాలు త్రక్ష, కాంక్ష. పండుగ పబ్బాలు, ఇరుగు పొరుగు వారి పేరంటాలు, చుట్టాల రాకపోకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భజనలు, పాఠశాల పోటీల్లో తర్ఫీదు ఇలా ఒకటేమిటి నిరంతరం ఆ గృహంలో హడావుడి ఉండేది. ధనావేశ, ఋణావేశాలు కలిస్తేనే విద్యుత్ ప్రవహించి ప్రసరిస్తుంది, అలాగే సంసారంలో ఆవేశాలు వికటిస్తే జీవితం దుర్భరమవుతుంది. 


పెద్దలు కుదిర్చిన పెళ్లితో ఒకటయ్యారు శ్రీకర్, సరయు. ఎనిమిది వసంతాల తర్వాత ఆపిల్ పండులాంటి సుపుత్రుడు ప్రవేశించడంతో వారి ఆనందాలకు అవధులు లేవు. అపురూపంగా చూసుకుంటూ ఉండగా మూడు సంవత్సరాల అనంతరం ముద్దమందారంలాంటి ముత్యపు చినుకు స్వరం పలికింది. 


"ఇంటికి కొడుకంటే తాటి చెట్టులాంటోడు, తలకొరివి పెట్టేటోడు, అందునా బుజ్జిగాడు రాజులా ఉన్నాడాయే, ఎంత అదృష్టమో వీరిది", పెద్దల భాజా భజంత్రీలు. 


ఇలా నడుస్తూండగా కాలప్రవాహంలో కళ్ళముందే కొట్టుకుపోయాడు కనకంలాంటి కొడుకు. కుమారుడిపై ప్రేమ బంధం అల్లుకు పోతుంటే ఆరిపోయిందనే బాధలో కూతురు ఉందన్న సంగతి మరిచారు తల్లిదండ్రులు. 


"సరయు! పోయిన బిడ్డ తిరిగి వస్తాడా? మీ పిచ్చి ధ్యాసలో ఉన్న కూతుర్ని పోగొట్టుకుంటారా? ఇంత తాత్సారం మంచిది కాదు. " డాక్టరమ్మ గట్టిగా మందలించింది. 


"ఏంటి, శ్రీకర్ గారు! ఆమె తల్లి ప్రేమను నేను అర్థం చేసుకోగలను. అలా అని మీకు బాధ లేదనడం లేదు. చదువుకున్నవారు మీరు కూడా ఇంకా ఈ కాలంలో అమ్మాయి అంటే తక్కువ, అబ్బాయి అంటే ఎక్కువ అనే ధోరణిలో బ్రతకటకం, అస్సలు అలా ఆలోచించడం సరికాదు. మన కళ్ళ ముందు ఉన్నదాన్ని కాపాడుకోక పోతే లేని తర్వాత ఏడ్చి ఏం లాభం చెప్పండి! ఇప్పటికైనా పాపకు ప్రేమ ఆప్యాయతను అందించండి. రెప్పపాటు కాలంలో పాపను కాపాడి చేతికందించి "జాగ్రత్తగా చూసుకోండి"

అని హితవు పలికింది. 


భయభక్తులతో, మర్యాద మన్ననలతో, పంజరంలోని చిలకలా పెంచారు త్రక్షను. దీనికి తోడు సాత్విక గుణాలు, పెద్దల పట్ల గౌరవం, వినయ విధేయతలతో పెరగ సాగింది. కొన్నేళ్ళ అనంతరం ఇంట్లో నవజాత శిశువు కేక మ్రోగింది. పుట్టిన మూడు మాసాలకే శ్రీకర్ కు ఇంక్రిమెంట్ వచ్చింది. ఇంకేముంది పాప లక్ష్మీదేవి అయింది. గారాబము గీతంలా పాడింది. 


త్రక్ష పట్ల వివక్షత, కాంక్ష పట్ల సుముఖతను ప్రదర్శించే వారు పెద్దలు. తన పట్ల వివక్షతను వివేకంగా సద్విమర్శగా భావించి, ధనావేశాన్ని సునాయాసంగా మలుచుకుంది త్రక్ష తన ప్రతి కదలికలో. 


గారాల పట్టి కాంక్ష స్వేచ్ఛాయుత జీవనానికి నాంది పలికింది. రజో, తమో గుణాలు నాట్యమాడ సాగాయి. అరిషడ్వర్గాలు ఆలంబనగా మారాయి. ప్రాథమిక తరగతుల్లో ఉన్నంతవరకు చదువులో అక్కను అనుసరిస్తున్నా తక్కిన వాటిలో బాట తప్పి అసూయ పండుని అందుకుని ఋణావేశానికి దగ్గరయ్యేది కాంక్ష. 


పేరుకు తగ్గట్టుగానే కాంక్షలు మరీ ఎక్కువాయే. త్రక్షకు త్యాగం పేరుతో దేన్నైనా ఇవ్వడం, కాంక్షకు దురుసుతనంతో ఏదైనా లాక్కోవడం పరిపాటయిపోయింది. 


"అమ్మా! నాకు రవ్వలడ్డూలు ఇవ్వు"అడిగింది కాంక్ష.

 

"ఉండు! తీసుకొస్తాను" అంటూ లోపలకు వెళ్లి చూస్తే డబ్బాలో చాలా తక్కువగా ఉన్నాయి రవ్వలడ్డూలు. అదేంటి రెండు రోజుల క్రితం చేసినా ఇంత కొంచెం ఎలా ఉన్నాయి చేప్మా!


"అత్తయ్య! మీరేమైనా రవ్వలడ్డూలు తీసారా?"


"అయ్యో! లేదమ్మా"


"అమ్మా! నిన్న సాయంత్రం అక్క మెల్లగా తింటున్నది"


"త్రక్ష! ఎందుకే అలా దొంగతనంగా తినడం? అడిగితే ఇస్తాను కదా!" మందలించింది సరయు. 


"అమ్మా! నువ్విస్తే తినడం తప్ప నేను ఎప్పుడైనా అడిగానా అమ్మ, అస్సలు అవి ఎక్కడుంటాయో కూడా నాకు తెలీదు"


త్రక్ష ఎంత చెప్పినా వినకుండా గొడ్డుని బాదినట్టు బాధేసింది సరయు. కన్నీళ్ల పర్యంతం అయింది త్రక్ష. ఇలా ఏవో ఒక ఫిట్టింగులు పెడుతూ అడపా దడపా తల్లితో తండ్రితో కొట్టిస్తూ ఉండేది అక్కను కాంక్ష. సరయు చిన్నదానిపై విపరీత ప్రేమతో, తప్పులు చేస్తున్నా వెనకేసుకొచ్చేది. శ్రీకర్ మందలించినా ఆ సమయం వరకే, తర్వాత షరా మామూలే. 


"అమ్మా! అమ్మా! చూడు నా ముగ్గుల పుస్తకంలో పేజీలన్నీ చింపేశారు." అంటూ లబోదిబోమని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది త్రక్ష. 


"కాంక్ష! అక్క ముగ్గుల పుస్తకంలో పేజీలు చించింది నువ్వేనా" అడిగినా “కాదు, నాకు తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నాను” అంటూ డాబుగా చెప్పింది కాంక్ష. 


"అమ్మా! తనే అలా చేసింది, ఈ పుస్తకం ఇంట్లోనే ఉంటుంది కదమ్మా! రోజు క్రొత్త ముగ్గు వేస్తుంటే చూస్తూ ఉంటుంది, మరి ఎందుకు అలా వేస్తున్నావు అని కూడా అడుగుతుంది” అని ఏదో చెప్పబోతున్న వినిపించుకోకుండా


"సర్లేవే! ముగ్గులే కదా! మరి ఒకసారి వేసుకో, క్రొత్త పుస్తకం కొనిస్తాను" అంటూ దర్పంగా చెప్పింది సరయు. 


అంతలో శ్రీకర్ వచ్చాడు. విషయం తెలుసుకుని కాంక్షను నాలుగు దెబ్బలు వేశాడు. వెంటనే సరయు


"ఏమిటండీ! చిన్న పిల్ల, ఏదో తెలియక చేసింది, వదిలేయండి, ఏమే నీకు ఇంకోసారి ముగ్గులు వేసుకుంటే సొమ్ము తరిగిపొద్దా"


"నాన్న! మొత్తం రెండు వందల ముగ్గులు, వెరైటీవి, క్రొత్తవి, ప్రతి రోజూ అన్ని ముగ్గులను గమనించి చూసి ఏరోజు కారోజు వేసినవి, అమ్మా! అవన్నీ గుర్తు తెచ్చుకుని ఎలా వేయగలను చెప్పు! అర్థం చేసుకోలేక పోతున్నారు మీరందరూ" అంటూ తీవ్ర వ్యధకు గురి అయి వారం రోజులు జ్వరంతో బాధపడింది త్రక్ష. 


తల్లిదండ్రులు కాంక్ష ఓర్వలేనితనం ఎక్కడికి దారి తీస్తుందని ఆలోచించలేక పోయారు. తన పెద్ద మనసుతో చెల్లిని క్షమించి యధావిధిగా ఉండేది త్రక్ష. ఇలా లెక్కలేనన్ని సార్లు ఎన్నో సంఘటనలకు బలి అయింది త్రక్ష. 


విధి ఆడిన వింత నాటకం కంటే కాంక్ష కుట్ర కుతంత్రాల చక్రంలో నుండి బయటపడలేక ఇలలో నరకాన్ని అనుభవించింది త్రక్ష. 


త్రక్ష, కాంక్ష పై ప్రేమతో ఎన్ని మంచి మాటలు చెప్పినా అవి చెవికెక్కేవి కావు. వయసుతో పాటుగా కాంక్షకు ఋణావేశ భావాలకు తోడుగా స్నేహితుల, సన్నిహితుల సావాసం, విందు వినోదాలు, సినిమా షికారులు, పార్కు పార్లర్లు, ఒకటేమిటి అన్ని భోగలాలసాలే. వార్ధక్యంలో పెద్దవారు కొట్టుమిట్టాడుతున్న తరుణంలో కూడా కాంక్షను వారించినా, దురుసుగా ప్రవర్తిస్తూ ఎదురు తిరిగేది. 


జీవితంలో చిన్నతనం నుండి ఆటుపోట్లకు తట్టుకొని, కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించి ఒక కొలువులో స్థిరపడింది త్రక్ష. 


గొప్ప చదువు చదివినా కూడా విలాసవంతమైన ఆహార, ఆహార్యాలకు అలవాటు పడి, అంది వచ్చినదంతా అక్కున చేర్చుకుని, అందిన ద్రాక్ష పండులా మారి అందరికీ ఋణావేశ రసగుల్లాను కోరి కోరి అందిస్తూ, ఆనందమైకంలో, సుఖాల డోలయానంలో జీవిస్తోంది కాంక్ష. 


కారణాలు కోకొల్లలు. తల్లిదండ్రుల పెంపక ధోరణిలో మార్పు, పైసాలో ఉన్న పవర్, దుష్ట సాంగత్యం, నైతిక మరియు మానవత్వ విలువలపై దృష్టిలోపం. 


నీతి : మొక్కై వంగనిది మానై వంగదు. లింగ వర్ణ విభేదాలు లేకుండా, ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ లేదా వ్యత్యాసాలను నిరంతరం దెప్పిపోడవడం చేయకుండా చిన్నతనం నుండే సమానత్వ ధోరణితో పెంపకం కొనసాగితే, సమాజంలోని అరాచకాలను సమూలంగా నిర్మూలించవచ్చు. 


 "జై తెలుగుతల్లి! జై భరతమాత"


 సమాప్తం


డాక్టర్ బృంద ఎం. ఎన్.  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.

 

కవయిత్రి, రచయిత్రి, గాయని,

స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి

15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట

భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.


 


Comments


bottom of page