పాండవుల స్వర్గారోహణ
- Pratap Ch
- 6 days ago
- 3 min read
#PandavulaSwargarohana, #పాండవులస్వర్గారోహణ, #ChPratap, #TeluguDevotionalStories, #మహాభారతం

Pandavula Swargarohana - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 28/09/2025
పాండవుల స్వర్గారోహణ - తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించి, ముప్పై ఆరు సంవత్సరాల పాటు హస్తినాపుర రాజ్యాన్ని నిర్విఘ్నంగా పాలించిన ధర్మరాజు, ఒక సందర్భంలో తాను నిర్వర్తించాల్సిన బాధ్యతలు పూర్తయ్యాయని గ్రహించాడు. యాదవ వంశంలో ముసలం కారణంగా కలహాలు సంభవించి యదువంశం అంతం కావడం, శ్రీకృష్ణుడు పరమపదించడం వంటి సంఘటనల తర్వాత కలత చెందిన పాండవులు తమ ఐహిక జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నారు.
ఒక సుమూర్తంలో ధర్మరాజు, అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి, సన్యాసం స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. ద్రౌపదితో సహా అతని సోదరులందరూ ఈ నిర్ణయాన్ని ఆమోదించి, రాజ్యాన్ని త్యజించి, మోక్షమార్గం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.
అందరూ హిమాలయాల వైపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. దారి మధ్యలో వారి వెంట ఒక కుక్క కూడా అనుసరించింది. తమ అంతిమ గమ్యమైన స్వర్గానికి చేరుకోవాలనే లక్ష్యంతో వారు నడుస్తూ ఉండగా, కొన్ని విచిత్ర పరిస్థితులలో ఒక్కొక్కరుగా అలసట, ఆకలి, మరియు కష్టాల వల్ల మార్గమధ్యంలో నేలకొరిగారు.
మొదటగా, ద్రౌపది కిందపడిపోయింది. ఈ హఠాత్పరిణామానికి భీముడు ఆశ్చర్యపోయి, "ధర్మరాజా, ద్రౌపది ఏ పాపం చేయలేదు. ఆమె అందరినీ సమానంగా ప్రేమించింది, కష్టాలలో మాకు అండగా నిలిచింది. అంతేకాక సుఖాలకంటే కష్తాలనే ఎక్కువగా అనుభవించింది. వివస్త్రయై కౌరవ సభలో తీవ్రమైన అవమానం పొందింది.
అయినా ఎవరిపై ద్వేషం పెంచుకోకుండా అన్నింటినీ మౌనంగా భరించిన వీరవనిత ఆమె. మరి ఆమె ఎందుకు ముందుగా నేలకొరిగింది?" అని ప్రశ్నించాడు.
అప్పుడు ధర్మరాజు, "భీమా, ద్రౌపది మనందరిలో అర్జునుడిని ఎక్కువగా ప్రేమించింది. అందుకే ఆమెకు ఈ గతి పట్టింది. ఈ లోకంలో ఎవరైనా ఒకరిని ప్రత్యేకంగా ప్రేమించినా, దానికి శిక్ష తప్పదు" అని బదులిచ్చాడు.
ఆ తరువాత సహదేవుడు మరియు నకులుడు కూడా నేలకొరిగారు. భీముడు మరోసారి ఆశ్చర్యపడి, "సహదేవుడు గొప్ప జ్ఞాని, నకులుడు అత్యంత అందగాడు. అయినా వీరు ఎందుకు నేలకొరిగారు?" అని అడిగాడు.
ధర్మరాజు “వారిద్దరూ ధీరులే అయినా వారిలో గర్వాహంకారాలు హెచ్చుగా వున్నాయి. సహదేవుడు తనంతటి జ్ఞాని లేడని అహంకారాన్ని పెంచుకున్నాడు. నకులుడు తన అందం గురించి గర్వపడ్డాడు. ఈ అహంకారమే వారి పతనానికి కారణం. అంతేకాక తమంతటి వీరులు, శూరులు ఈ లోకంలో ఇంకెవ్వరూ లేరని గర్వపడేవారందరికీ ఈ గతి తప్పదు. " అని వివరించాడు.
అనంతరం ఆశ్చర్యంగా అర్జునుడు కూడా నేలకొరిగి ప్రాణాలు విడిచాడు. భీముడు తీవ్ర ఆవేదనతో, "ధర్మరాజా, అర్జునుడు గొప్ప యోధుడు, ఏ యుద్ధంలోనూ ఓటమి ఎరుగనివాడు. అలాంటివాడు ఎందుకు నేలకొరిగాడు?" అని అడిగాడు.
ధర్మరాజు "అర్జునుడు గొప్ప యోధుడే కానీ, తన గొప్పతనం గురించి తరచుగా గొప్పలు చెప్పుకున్నాడు. తనంతటి వీరుడు మరొకరు లేరని అతిగా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాడు. కొన్నిసందర్భాలలో శ్రీకృష్ణుడిని కూడా విస్మరించి తన ప్రతిభ, వీరత్వం కారణంగానే కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు విజయం లభించిందని అహంకారపడ్డాడు. ఈ అహంకారమే అతడిని ఓడించింది" అని బదులిచ్చాడు.
చివరగా భీముడు కూడా కిందపడిపోయాడు. "ధర్మరాజా, నా శక్తి, నా బలంతోనే మనం ఎన్నో యుద్ధాలు గెలిచాం. నేను ఎటువంటి పాపాలు చేయలేదు. మరి నేను ఎందుకు కిందపడిపోయాను?" అని తీవ్ర ఆవేదనతో అడిగాడు.
ధర్మరాజు "భీమా, నీవు గొప్పవాడివే. కానీ నీవు అతిగా తినడానికి ఆశపడ్డావు. అంతేకాకుండా, నీ శక్తి గురించి అహంకారంతో మాట్లాడావు. ఇతరులను ఎగతాళి చేశావు. కొన్ని సందర్భాలలో నీ శారీరక బలం అండ చూసుకొని భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలను కూడా అగౌరవపరిచావు. అందుకే నీవు కూడా నేలకొరిగావు" అని వివరించాడు.
అప్పుడు ధర్మరాజు, అతని వెంట ఉన్న కుక్క మాత్రమే మిగిలారు. అప్పుడు స్వర్గాధిపతి అయిన మహేంద్రుడు తన విజయ రథం మీద వచ్చి, ధర్మరాజును స్వర్గానికి ఆహ్వానించాడు. "ధర్మరాజా, నీవు నీ ధర్మం కోసం నిలబడ్డావు. కష్టాలను సహించావు. ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన నీకు స్వర్గంలోకి ప్రవేశం ఉంది" అని అన్నాడు.
అప్పుడు ధర్మరాజు, "దేవేంద్రా, నా వెంట వచ్చిన ఈ కుక్క కూడా నాతోపాటే ప్రయాణించింది. దీన్ని వదిలి నేను స్వర్గానికి రాలేను" అని అన్నాడు.
ఇంద్రుడు కుక్కకు స్వర్గంలో ప్రవేశం లేదని చెప్పినా, ధర్మరాజు అంగీకరించలేదు. తన వెంట వచ్చిన ప్రాణిని విడిచిపెట్టడం ధర్మం కాదని వాదించాడు.
అప్పుడు ఆ కుక్క తన నిజ స్వరూపమైన యమధర్మరాజుగా మారి, "ధర్మరాజా, నీ ధర్మనిష్ఠ అసామాన్యమైనది. నీకు ఎలాంటి ఆశలూ, అహంకారాలు లేవు. నీ ధర్మం నిరూపించబడింది" అని ప్రశంసించాడు. ఆ తర్వాత ధర్మరాజు స్వర్గంలోకి ప్రవేశించాడు.
ఈ ఘటనకు సంబంధించి మహాభారతంలో ఎన్నో శ్లోకాలు వున్నాయి. ఉదాహరణకు
శ్లోకం1 :"యథా ధర్మః తథా జయః"
"ఎక్కడ ధర్మం ఉంటుందో, అక్కడ జయం ఉంటుంది. "
ఈ శ్లోకం మహాభారతంలో ఒక ముఖ్యమైన సత్యం. ధర్మరాజు తన జీవితమంతా ధర్మాన్ని అనుసరించాడు. పాండవుల విజయం మరియు ధర్మరాజు స్వర్గారోహణ ధర్మానికి ఉన్న గొప్ప శక్తిని తెలియజేస్తాయి అని పై శ్లోకం అర్ధం.
శ్లోకం 2 :"న ధర్మో వర్తతే జీవే, న చ ధర్మం వినా క్వచిత్"
"ధర్మం లేకుండా జీవి మనుగడ సాగించదు, ధర్మం లేకుండా ఏదీ ఉండదు."
ఈ శ్లోకం జీవనానికి ధర్మం ఎంత అవసరమో తెలియజేస్తుంది. ధర్మరాజు తన చివరి ప్రయాణంలో ప్రతి క్షణం ధర్మాన్ని అనుసరించి, అది ఎంత గొప్పదో నిరూపించాడు అని పై శ్లోకం అర్ధం.
అందుకే మన ఆలోచనా విధానంలో, ప్రవర్తనలో గర్వాహంకారాలు లవలేశమైనా లేకుండా ప్రవర్తించడం ముక్తికి మార్గం, అటువంటి విధానం భగవంతునికి ఇష్టం అని మనందరం గ్రహించాలి.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/pratap

నేను Ch. ప్రతాప్. వృత్తిరీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా ముంబయిలో పని చేస్తున్నాను. అయితే నా నిజమైన ఆసక్తి, ప్రాణం సాహిత్యానికే అంకితం..
తెలుగు పుస్తకాల సుగంధం నా జీవనంలో 1984 నుంచే పరిమళించింది. అప్పటి నుంచి పఠనం నా దినచర్యలో భాగమై, రచన నా అంతరంగపు స్వరం అయ్యింది. ఆధ్యాత్మికత, మానవ సంబంధాల లోతులు, సామాజిక ధృక్పథం, ప్రజాసేవ పట్ల నాలో కలిగిన మమకారం నా ప్రతి రచనలో ప్రతిఫలిస్తుంది.
ఇప్పటివరకు నేను రాసిన రెండు వందలకుపైగా కథలు, ఐదు నవలలు, రెండు వేల వ్యాసాలు పలు దిన, వార, మాస పత్రికలలో, డిజిటల్ వేదికలలో వెలువడి పాఠకులను చేరాయి. ప్రతి రచన నా అనుభవాలకు, ఆలోచనలకు ప్రతిబింబమే కాక, పాఠకునితో ఒక సంభాషణ.
నాకు సాహిత్యం హాబీ కాదు, అది నా జీవితయానం. కొత్త ఆలోచనలను అన్వేషిస్తూ, తెలుగు సాహిత్య సముద్రంలో నిరంతరం మునిగిపోతూ ఉండటం నా ఆనందం. రచన ద్వారా సమాజానికి ఉపయోగపడే మార్గాలను వెతికే ప్రయత్నం నాకెప్పుడూ ఆగదు.
Comments