top of page

అమ్మ లేని పుట్టిల్లు.. 

#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #AmmaLeniPuttillu, #అమ్మలేనిపుట్టిల్లు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Amma Leni Puttillu - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 27/09/2025

అమ్మ లేని పుట్టిల్లు  - తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత


 అనూహ్యకి ఉదయం లేచిన మొదలు అమ్మ తలపులు, ఆవిడ జ్ఞాపకాలు పదేపదే గుర్తొస్తూ గతించిన తన అమ్మని తలచుకుంటూ మనసు మూగబోతోంది. ఈరోజు అమ్మ తనకు భౌతికంగా దూరమై సం.. గడిచింది. అమ్మ ఉన్నన్నాళ్లూ తనకి ఏ కొరత లేకుండా సుఖంగా ఉంది. ఇప్పుడు అమ్మ దూరమైన బాధ వర్ణనాతీతం. ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని తన భర్తతో కలిసి పుట్టింటికి బయలుదేరింది అనూహ్య. 


కాసేపటికి అనుహ్య తన భర్తతో కలిసి కారు నుంచి దిగింది. ఆమెకు పుట్టింటి తలుపు కనిపించగానే గుండె గట్టిగా కొట్టుకుంటోంది. గాయత్రి పరుగెత్తుకుంటూ వచ్చి అక్కని ఆలింగనం చేసుకుంది. 


పుట్టింటి ఆవరణలో ఎప్పుడూ కళకళలాడుతూ హడావిడిగా ఉండే ఆ సందడి ఇప్పుడు లేక ఆ ఇల్లు మూగబోయినట్లు అనిపిస్తోంది. బయట దండెం మీద వదిలి ఉన్న అమ్మ మడిచీర, గాలిలో ఎగిరే తలుపు కర్రలు, వాకిట్లో గరుడ, నందివర్ధనం, పారిజాతం, మందార మొ.. పూల చెట్లు, తులసి కోటలో పెరిగిన తులసి చెట్టు ఇవి అంతా అమ్మ జ్ఞాపకాలను తలపిస్తున్నాయి. 


పెళ్లయిననాటి నుంచి ప్రతిసారీ ఈ గుమ్మం దాటుకుని లోపలికి అడుగుపెట్టినప్పుడు, అమ్మ కంఠధ్వని వినిపిస్తుందేమోనని తన గుండె కొట్టుకునేది. అమ్మ ప్రేమగా ఎదురొచ్చి తనని నవ్వుతూ తీసుకెళ్లే దృశ్యం కళ్లముందు మెదిలి కళ్లు చెమర్చాయి. కాని ఇప్పుడు మాత్రం అంతా శూన్యమే. 


ఈనాడు అమ్మ లేని ఇంటిలో అన్నీ ఉన్నా ఆ కళ లేదు. ఆ ఉత్సాహం లేదు. అమ్మ ప్రేమగా, ఆప్యాయంగా వడ్డించే వంట వాసనలు లేవు. అసలు ఆప్యాయతతో కూడిన మాటలే లేవు. అక్కలతో, వాళ్ల కూతుళ్లతో ఆడిన జ్ఞాపకాలు ఆ గోడలలోనే మిగిలిపోయాయి. క్రితంసారి తను వచ్చినప్పుడు తండ్రి కళ్లలోని శూన్యంగా ఖాళీ గుర్తొస్తోంది. తన చిన్ననాటి తలపులు, ఆరిపోయిన దీపంలా ఆ ఇంటిని ఇప్పుడు నిర్జీవంగా చూపిస్తున్నాయి. 


అనూహ్య హృదయం ఒక్కటే పదేపదే చెబుతోంది: “అమ్మ లేని పుట్టిల్లు..ఒకప్పుడు తన ఇల్లే కాని ఇప్పుడు వేరే ఇల్లు. కాని తనకి మాత్రం ఇప్పుడు పుట్టిల్లు కాదు. ”


“చెల్లీ.. అమ్మ లేనంత మాత్రాన ఈ ఇల్లు ఇలా నిశ్శబ్దంగా ఉంటుందని నేను కలలోనైనా ఊహించలేదు”. అంది గాయత్రితో. 


“అక్కా! నీవు ఎప్పుడు వచ్చినా అమ్మ “అమ్మయ్య! నా బంగారం వచ్చింది. అని చెబుతూండేది. కానీ ఇప్పుడు ఆ స్వరం ఎప్పటికీ వినిపించదు కదా!.” అంది గాయత్రి (కంటతడితో). 


కొంత దూరం లోపలికి నడిచాక సతీష్ అన్నయ్య తులసిచెట్టుకి నీళ్లు పోస్తూ ఉన్నాడు. అతనిని చూసి అనుహ్య దగ్గరికి వెళ్లింది. 


“అన్నయ్యా.. తులసి ఇంకా ఇలా పచ్చగా ఉంది.” అంది అనూహ్య. 


“అమ్మ ప్రతిరోజూ దీని ముందు దీపం వెలిగించేది. ఇప్పుడు నేను ఆ వెలుగుకోసం ప్రయత్నిస్తున్నా.. కానీ ఆ వెలుగు మాత్రం అమ్మ చేతిలో వెలిగినప్పుడే మధురంగా కనిపించేది. ” అన్నాడు సతీష్: (చిరునవ్వు నవ్వుతూ)


అలా మాట్లాడుతూ అందరూ వంటగదిలోకి వెళ్లారు. స్టవ్ ప్రక్కన పాత ఇనుపకళాయీ, కొబ్బరి తురుమే పీట అలాగే ఉన్నాయి. 


 “అక్కా! నీకు గుర్తుందా? నీకు ఇష్టమైన పులిహోర రుచి తయారీకోసం అమ్మ ఎంత జాగ్రత్తగా చేసేది. నీవు వచ్చినప్పుడు తప్పక ఆ ఐటమ్ వండేది. ” అంది గాయత్రి. 


వంట రుచికన్నా అమ్మ చేతి ప్రేమ, మమకారం ఎక్కువ రుచిగా ఉండేది.” అంది అనూహ్య (తన కన్నీటి చుక్కలని చీర కొంగుతో తుడుచుకుంటూ). 


తర్వాత కాసేపటికి మేడ పైకి వెళ్లారు గాయత్రి, అనూహ్యలు. తండ్రి కృష్ణయ్య పాత ఫ్రేమ్ కుర్చీలో కూర్చున్నాడు. ఆయన చేతిలో అమ్మ ఫోటో ఉంది. అన్నయ్య పిల్లలు ఆయన దగ్గరగా కూర్చున్నారు. అనూహ్య తండ్రిని పలకరించి అక్కడే కూర్చుంది. గాయత్రి తండ్రి ప్రక్కన చతికిల పడింది. 


“పిల్లలూ! మీరు వచ్చినప్పుడే నా మనసుకి కొంత ఉపశమనం లభిస్తుంది. మీఅమ్మ లేకుండా ఈ ఇల్లు ఖాళీగా మారింది. కానీ ఇంక మీ మాటలు, మీ నవ్వులు ఆ ఖాళీని కొద్దిగా అయినా నింపుతాయి” అన్నాడు కృష్ణయ్య. 


“నాన్నా! మీరు ఒంటరిగా ఇలా ఉండకండి. మేం తరచూ వస్తాం. ఈ ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేలా చూస్తాం” అన్నాడు సతీష్. 


“నిజమే! కానీ ఒక సత్యం మాత్రం చెపుతాను. మీ అమ్మ లేని ఈ ఇల్లు ప్రాణం లేని గుండెలా ఉంది. ” అన్నాడు ఆయన ముద్దుగా, ప్రేమగా తన పిల్లలని చూస్తూ. 


నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని మార్చడానికి అందరూ లేచి గోడల మీద పాత ఫోటోలు చూడటానికి హాలులోకి చేరారు. అందులో ఒక ఫోటోలో చిన్న అనుహ్య, సతీష్, గాయత్రి — ముగ్గురినీ అమ్మ కౌగిలించుకున్న దృశ్యం ఉంది. 


“అక్కా! నీకు గుర్తుందా? ఆ రోజున అమ్మ నీకు మొదటి బైక్ ని కొనిచ్చి రైడ్‌కి పంపింది. అప్పుడు ఆవిడ నీ గురించి ఎంత భయపడి వెంబడించిందో తెలుసా!” అంది గాయత్రి. 


“కన్న ప్రేమ అమ్మది గదా! ఆవిడ ఒక్క క్షణం కూడా మనల్ని వదిలేది కాదు. మనం ఎక్కడున్నా అమ్మ కళ్ళు మనమీదే ఉండేవి. ” అంది అనూహ్య. (నవ్వుతూ, జ్ఞాపకాల కన్నీళ్లు తుడుచుకుంటూ) 


కొంచెం ముందుకెళ్లాక అక్కడ ఒక గదిలో మూలగా ఉన్న పాత పెట్టెలో చెక్కబొమ్మలు, మట్టి దీపాలు ఉన్నాయి. అనుహ్య వాటిని తీసి చూస్తోంది.. 


“దసరా, దీపావళి, సంక్రాంతి ఏ పండుగలైనా అమ్మ లేని తర్వాత ఒక్క పండుగకూ వెలుగు లేదు. ఈ బొమ్మలన్నీ చూస్తుంటే నా గుండె ముక్కలవుతోంది. ” అంది అనూహ్య బాధతో. 


“పండుగల ఆనందం అట్టహాసం, ఆర్భాటాలకోసం కాదు చెల్లి. అమ్మ చుట్టూ మనం తిరుగుతూ గడిపిన చిన్న చిన్న తీపి గురుతులే దానికి అసలైన శోభ. ” అన్నాడు సతీష్. 


కృష్ణయ్య తన పాత పెట్టెలో నుండి ఒక డైరీ తీశాడు. 

“ఇది మీ అమ్మ రాసిన డైరీ. ప్రతి పేజీలో మీ కోసం చిన్న చిన్న సూచనలు, మీమీద తను పెంచుకున్న ఆశలు ఉన్నాయి. ” అన్నాడు ఆయన. 


“నాన్నా! అమ్మ మమ్మల్ని ఎంత దూరంగా ఆలోచన చేసి మా భవిష్యత్తు గూర్చి ఆలోచించిందో కదా!” అంది అనుహ్య (ఆశ్చర్యంతో)


తండ్రి చేతినుంచి ఆ డైరీని తీసుకుని “‘నా పిల్లలు ఎప్పుడూ కలసిమెలసి ఉండాలి. ఒకరికొకరు అండగా నిలవాలి” అని తల్లి వ్రాసినదానిని పెద్దగా చదివింది గాయత్రి. 


అది విన్న అందరి మనసులూ ఆర్ద్రమైనాయి. అందరూ వాళ్ల అమ్మ వరమ్మ ఫోటో ముందు దీపం వెలిగించారు. కనులు మూసుకుని తల్లికి నమస్కారం చేసి కొద్దిసేపు మౌనం వహించారు. 


కాసేపు తర్వాత 

“అమ్మ లేని పుట్టిల్లు.. అనిపించే బాధ ఎప్పటికీ పోదు. కానీ అమ్మ మనకు నేర్పించిన విలువలు, ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పటికీ మనకు వెలుగునిస్తూనే ఉంటాయి. ఈ ఇల్లు ఖాళీగా ఉన్నా.. అమ్మ మన హృదయాల్లో నిండుగా ఉంది. ” అంది అనూహ్య. 


“అవును చెల్లి. మన బంధమే ఈ పుట్టింటికి ప్రాణం. అమ్మ మనల్ని విడిచిపెట్టలేదు, కేవలం మనల్ని ఎనలేని ప్రేమ, ఆత్మబలంతో నిలబెట్టింది. ” అన్నాడు సతీష్. 


అందరూ చేతులు చేతులు కలుపుకొని, అమ్మ ఫోటో ముందు తల వంచి ఆవిడకి వినయంగా నమస్కారం చేశారు. గంభీరమైన ఆ నిశ్శబ్దంలో దీపం తేజోవంతంగా వెలుగుతోంది. దివికేగిన వరమ్మ తన బిడ్డలని చల్లగా ఆశీర్వదిస్తోంది. 


.. సమాప్తం .. 


ree

-నీరజ హరి ప్రభల

Profile Link


Youtube Playlist Link









Comments


bottom of page