ప్రయాణం - పార్ట్ 2
- Sudha Vishwam Akondi

- Sep 27, 2025
- 3 min read
Updated: Sep 30, 2025
#SudhavishwamAkondi, #సుధావిశ్వంఆకొండి, #ప్రయాణం, #Prayanam, #TeluguAdventureStories, #TeluguSuspenseStories, #సస్పెన్స్, #హర్రర్

Prayanam - Part 2/4 - New Telugu Story Written By - Sudhavishwam Akondi
Published In manatelugukathalu.com On 27/09/2025
ప్రయాణం - పార్ట్ 2/4 - పెద్ద కథ
రచన: సుధావిశ్వం ఆకొండి
జరిగిన కథ :
శ్రీశైలం టూర్ బయలుదేరుతారు మరీచి, శీతకర్.
దారిలో వీళ్ళ కార్ ను ఓవర్ టేక్ చేసిన కార్ ఆగి ఉండటంతో ఆ కారు దగ్గరకు ఆవేశంగా వెళ్తాడు శీతకర్.
ఇక ప్రయాణం పార్ట్ 2 చదవండి..
ఆ కారులోనుంచి ఎవరూ బయటకు రావడం లేదు. తన కారు దిగి దగ్గరగా వెళ్లి చూసాడు. ఓవర్ టేక్ చేయబోయి, చెట్టు పక్కన ఉన్న పెద్దరాయికి కొట్టుకుని ఆగిపోయింది. డ్రైవర్ కి బాగా దెబ్బలు తగిలాయి. వెనక కూర్చున్న వాళ్లకు కూడా తగిలినట్లున్నాయి. పాపం అనుకున్నాడు. ఆ వెంటనే అంబులెన్స్ సర్వీసు వాళ్ళకి కాల్ చేసి చెప్పాడు. వాళ్ళు త్వరగానే వచ్చారు. అందరినీ అంబులెన్స్ లోనికి ఎక్కించి, హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు.
పోలీసులకు కూడా ఈ విషయం చెప్పేసి, మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు. హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు మంచివాళ్లే దొరికారు అనుకుని, సంతోషించి, తమ కారు ఎక్కారు.
మరీచి డ్రైవింగ్ చేస్తానని అంది. సరేనని తను చేస్తుంటే, శీతకర్ పక్కసీట్లో కూర్చున్నాడు. మరో గంటలో చేరుకునేవారే కానీ అనుకోని సంఘటన జరిగింది.
ఓ లగ్జరీ కారులో ఎవరో వెనకే వస్తూ ఉండడం కనిపించింది శీతకర్ కి. సైడ్ మిర్రర్ లోనుంచి చూశాడు. ఆరుగురు మగాళ్లు వున్నారు అందులో. ఎవరో ఓవర్ టేక్ చేయాలని అలా వస్తున్నారేమో అనుకున్నాడు మొదట. కానీ వాళ్ల వాలకం గమనిస్తే కావాలనే తమనే టార్గెట్ చేసుకుని, వెంబడిస్తున్నారని అర్థం అయ్యింది.
"మరీచీ! ఎవరో కారులో మన వెనకే వస్తున్నారు! డ్రైవింగ్ మార్చుకుందాం! నువ్వు ఇటు వచ్చేసి కూర్చో! నేను స్పీడుగా డ్రైవ్ చేస్తాను!" అన్నాడు లోపల కాస్త టెన్షన్ రాగా.
అప్పుడు మరీచి సైడ్ మిర్రర్ లోనుంచి చూసింది. అందులో ఉన్న ఒకడిని చూడగానే గుండె గుభేలుమంది ఆమెకు. వెంటనే కారు ఆపి, తను సైడ్ సీట్ లో కూర్చోడానికి వచ్చింది. శీతకర్ డ్రైవింగ్ సీట్ లోకి వచ్చాడు.
"చాలా ఫాస్ట్ గా పోనీయ్! వాళ్లకు అస్సలు దొరకకూడదు" అంది భయంగా.
ఎప్పుడూ మరీచిలో అంత భయాన్ని చూడలేదు శీతకర్. ఎంతో ధైర్యం గల అమ్మాయి అని అనుకున్నాడు. రెండు, మూడు చిన్న సంఘటనలు చూసిన తర్వాత అంతా ధైర్యంగల అమ్మాయి తన భార్య అయినందుకు ఎంతో గర్వంగా ఉంటుంది తనకు. అటువంటిది ఇప్పుడు ఇలా ఎందుకు భయపడుతుందో అని అనుకున్నాడు. ఆ మాటే అడిగాడు.
"ఏమైంది మరీచీ! ఎందుకు అంత భయపడుతున్నావు? నువ్వు డేరింగ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను ఎప్పుడూ! అలాంటిది నువ్వు ఇలా భయపడటం బాగాలేదు! దగ్గర్లోనే ఉన్నాం! ఇంకా కొద్దిసేపటిలో చేరుకుంటాం!" అన్నాడు ధైర్యం నింపడానికి
"అందులో వున్నవాడు పరమ నీచుడు! వాడితో ఉన్నవాళ్లు వాడి ఫ్రెండ్స్ ఏమో! వాళ్ళూ అలాగే వున్నారు. దున్నపోతుల్లా వున్నారు ఒక్కొక్కడు! పైగా తాగి ఉన్నట్టున్నారు!" అంది భయం వదలకుండానే.
"వాళ్ళు నీకు తెలుసా? ఎవరు వాళ్ళు? అయితే మీ అంకుల్ ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ లో వున్నారు కదా! ఆయనకు మెసేజ్ పెట్టు!"
"అందులో రెడ్ షర్ట్ తో వున్నవాడు దుర్మధ్! వాడు నేను జాబ్ లో జాయిన్ అయిన కొత్తల్లో మా ఆఫీస్ లోనే చేసేవాడు. పేరుకు తగ్గట్టే వాడికి కొవ్వు బాగా ఎక్కువ! వాళ్ళ మామయ్య రాజకీయాల్లో ఉన్నాడట! ఉమనైజర్ కూడా! తలుచుకుంటే జాబ్ ఊడగొడతాడని అందరూ భయపడేవాళ్ళు ఆఫీస్ లో. లేడీస్ తో మిస్ బిహేవ్ చేసేవాడు.
ఓసారి నన్ను, మరో అమ్మాయిని కావాలని ఎక్కువ సేపు ఉండేలా చేసి, ఆమెపై అఘాయిత్యం చేయాలని చూశాడు. వాడిని నాలుగు తన్ని వచ్చేశాము. తర్వాత మేనేజ్మెంట్ వాళ్లకు వాడిపై కంప్లైంట్ ఇచ్చాను.
మేనేజ్మెంట్ వాళ్ళు వాడిని జాబ్ లోనుంచి తీసేశారు. ఆ కక్షతో నాపై దాడి చేయబోయాడు ఆఫీస్ ముందు. మా కొలీగ్స్ కాపాడి, వాడిని అరెస్ట్ చేయించారు.
మా మామయ్య చొరవ వల్ల వాడికి జైలు శిక్ష పడింది. వాడు ఎప్పుడో విడుదల అయినట్టున్నాడు. ఇప్పుడు ఇలా మనల్ని వెంటాడుతున్నాడు. వాడికి అనుకోకుండా మనం కనిపించామా? లేదంటే మన ప్రయాణం గురించి తెలుసుకుని ప్లాన్ ప్రకారం వచ్చాడో తెలియదు! ఇక్కడ పెద్దగా జనసంచారం లేదు. అందుకే భయంగా ఉంది శీతకర్!" అని తన భయానికి కారణం వివరించింది.
"ఏం భయపడకు! వెళ్లిపోతాం లే! ఎందుకైనా మంచిది. ముందు మీ మామయ్యకు కాల్ చేసి చెప్పు!" అన్నాడు శీతకర్.
వెంటనే వాళ్ల మామయ్యకు కాల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా, అవతల మామయ్య నుంచి నో రెస్పాన్స్! ఇక మెసేజ్ టైప్ చేసి పంపించింది.
ఈలోపు ఆ లగ్జరీ కారును వీళ్ల కారుకి అడ్డుగా పెట్టి, ఆపారు వాళ్ళు. సడెన్ బ్రేక్ వేసి ఆపాడు శీతకర్. రెండు పక్కలా దట్టంగా ఉన్న చెట్లు. వాహనాలు కూడా పెద్దగా రావడం లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కారులో నుంచి దిగిన వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. ఏం చేయాలో అర్థంకాక తమ కారులో నుంచి దిగకుండా అలాగే కూర్చున్నారు శీతకర్ దంపతులు.
"దిగవే! దిగు!" అన్నాడు వాడు కత్తి చూపిస్తూ.
మాట్లాడకుండా అలాగే కూర్చుంది. కోపంగా కత్తితో అద్దం పగలగొట్టాడు. బలవంతంగా డోర్ ఓపెన్ చేసి, ఆమెను కారులోనుండి బయటకు లాగాడు. శీతకర్ కోపంగా కారు దిగి వాళ్ళ పైకి వెళ్ళాడు. కానీ వాళ్ల చేతుల్లో ఆయుధాలు ఉండడంతో వాళ్లు వాటితో అతన్ని బాగా కొట్టారు. దాంతో క్రింద పడిపోయాడు శీతకర్. విపరీతంగా దెబ్బలు తగలడంతో స్పృహ తప్పింది అతనికి.
ఆకాశంలో మబ్బులు దట్టంగా అలుముకున్నాయి. చిమ్మచీకటి! ఇక వర్షం పడుతుందేమో అన్నట్లుగా ఉంది. రాక్షసులకు చీకట్లో కూడా బాగా కనిపిస్తుందేమో! వాళ్లలో ఆ చెట్లల్లో ఏ పాములో వుంటాయేమో, ఏవైనా జంతువులు దాడి చేస్తాయేమో లాంటి ఆలోచనలు వారిలో లేనేలేవు! ముఖాల్లో ఏమాత్రం భయం లేదు! ఆ చీకట్లో మరీచి చేతులు పట్టి లాగుతూ అక్కడ ఉన్న చెట్ల మధ్యలోకి తీసుకెళుతూ వున్నారు ఆ రాక్షసులు.
అప్పుడు జరిగింది ఒక సంఘటన.
=======================================================================
ఇంకా వుంది..
=======================================================================
సుధావిశ్వం ఆకొండి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
కలం పేరు సుధావిశ్వం. పూర్తి పేరు అనురాగసుధ. వృత్తి లాయర్. ప్రవృత్తి రచనలు చేయడం. ట్రావెలింగ్ కూడా!
కొన్ని నవలలు, కథలు వ్రాయడం జరిగింది. ప్రస్తుత నివాసం ఢిల్లీ.




Comments